మూడో అడుగు: ధిక్కరింపు

(గత సంచిక తరువాయి)

అవును. నిజం తెలియడం అనివార్యమైనప్పుడు అరిచి చెప్పడంలో తప్పేముంది? అతనికి తెలుసు. తెలుసని నీకు తెలుసు. ఇక గుప్పిట బిగించి నీళ్ళను బంధించే వృధా ప్రయాస ఎందుకు. చెప్పెయ్!

అవును, నాకు మరొకరితో సంబంధం వుంది అంటావు.

అతని పేరు?

ఇదిగో ఇక్కడే మళ్ళీ ఇరుక్కుపోతావు. అసలు అలా అడుగుతాడా?

ఎందుకు ఇలా చేశావు? అని కూడా అడగచ్చు.

నందు గురించి తెలుసు కాబట్టి కాస్త ఆలోచించు.

ఏమని అడుగుతాడు?

నీకు ఎవరితో అఫైర్ వుందో అతనికి అనవసరం. ఎందుకు చేశావీపని? అనేది మాత్రమే అతనికి కావాలి.

అవును ఎందుకు చేశావు? కారణం వుండాలి కదా? ఇదే ప్రశ్న నందు అడుగుతాడు. అడగటంలో తప్పేంలేదుగా? అడగాల్సిన ప్రశ్నే కదా? అడుగుతాడు.

ఏం చెప్తావు?

ఎందుకు చెప్పాలి అని వితండంగా వాదించాలని అనుకోకు. అలాంటి సమాధానం అతనికి నచ్చదని నీకు తెలుసు. అలా అతనికి నచ్చని విషయాలు చాలానే వున్నాయి. అవన్నీ కూడా నీకు తెలుసు. అతనికి అలా ఎన్నో విషయాలు నచ్చకపోవటమే నీకు నచ్చదు.

అతనికి నచ్చని విషయాలు వదిలెయ్.

అతనిలో నీకు నచ్చని విషయాలు! ఏంటవి? నందుని వద్దనుకోని శశాంక్ కావాలని కోరుకునేలా చేసిన విషయాలు. అవే నీ వైపు వాదనలు. నువ్వు ధిక్కరించి నిలబడటానికి పనికొచ్చే ఊతకర్రలు.

నీలో నాకు నచ్చని లక్షణాలు ఇవి. అందువల్ల మన మధ్య దూరం పెరిగింది అని చెప్పగలిగిన ఆ లక్షణాలు. ఏంటవి? అలా చెప్పగలవా నువ్వు? అతనిలో నీకు నచ్చని విషయాల వల్ల మరొకరితో… ఊహూ. ఇది నిలబడే వాదన కాదు. ధిక్కరించి చెప్పడానికి సరిపోయే వాదన కాదు.

అయినా సరే నందుతో మాట్లాడటానికి, ప్రశ్నించడానికైనా కావాలి కదా. చెప్పు అతనిలో నీకు నచ్చని విషయాలు ఏమేమున్నాయి.

నచ్చని విషయాలు అనగానే వెంటనే చెప్పగలగాలి కదా నువ్వు? ఇంత ఆలోచించాల్సిన అవసరమేముంది? ఊ చెప్పు.

సరే నచ్చినవో నచ్చనివో, అతని గురించి మాట్లాడు. నచ్చని విషయాలు అవే తెలుస్తాయి.

బలంగా వుంటాడు. చిన్న ముఖం. మెడ కండరాలు పైకి తేలి వుంటాయి. భుజాలు, ఛాతి, వీపు అన్నీ విశాలంగా వుంటాయి. తీరుగా అమర్చిన శరీరాకృతి. ఎత్తు కొంచెం తక్కువే. చిన్నచెవులు, చెంపలకి దగ్గరగా! అలల్లా వంపులు తిరిగిన జుట్టు, అందులో ఒక పాయ వద్దన్నా నుదిటి మీద పడుతూ…  ఊహు ఇవేవసలు సమస్యలే కావు. నెమ్మదిగా తింటాడు. ఏదైనా తింటాడు. బ్లూ అంటే ఇష్టం. పూలు ఇష్టం, మ్యూజిక్ వింటాడు. ఏమైనా గ్రాండ్ గా వుండాలి. పెద్ద బిల్డింగ్, పెద్ద హోటల్, పెద్ద పార్టీ… వీటిలోనూ ఏ సమస్య లేదే. నందుని కాదని శశాంక్ వైపు నడిపించిందేమిటి?

నీకు నందు విషయంలో నచ్చనిదేమిటి నియతీ?

అతని రూపురేఖలు కాదు. అతని లక్షణం. అతని ప్రవర్తన. వాటిల్లో ఏదో వుంది. అదేంటో నీకే తెలియకపోవటం విచిత్రమే కాదు, ఆశ్చర్యం కలిగించే విషయం కూడా!

సాలిడ్ అండ్ స్టడీ. ఎవ్వరూ కదిలించలేని ప్రశాంతత. చాలా తక్కువగా మాట్లాడటం. మొండితనం.

మొం… డి… త… నం…

అవును మెండితనం కదూ? వర్షం, చీకటి, కష్టం ఏదీ అతను అనుకున్నది సాధించకుండా ఆపలేదు. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి తీరాలి. వెళ్ళను అనుకున్నాడా భూమి బద్దలైనా ఆఖరికి నువ్వు బ్రతిమిలాడినా, అలిగినా కదలడు.  అదేనా?

కుటుంబం విషయంలో అతని ప్రవర్తన నీకు నచ్చదని చెప్పగలవా? లేదు కదూ. ఫ్యామిలీ మాన్. కాదని ఎలా అనగలవు? తల్లి దండ్రిని ఇష్టపడ్డవాడు. వాళ్ళు ఇండోనేషియా వెళ్ళి అక్కడ సునామీకి బలైపోయినప్పుడు, ఆ తరువాత కూడా వాళ్ళని ఇష్టపడుతూనే వున్నాడు. మానసికంగా వచ్చిపడే బాధ అతన్ని ఇంకా బలోపేతం చెయ్యడం నువ్వు చూడలేదా? శరీరానికి వచ్చే కష్టం కూడా అతనికి బలాన్నే ఇవ్వడం చూశావు. మొండి. అవునుమొండి. అదేనేమో నీకు నచ్చనిది.

నిన్ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అతని బంధువులు, మిత్రులు ఎవరు ఎన్ని రకాలుగా వద్దని చెప్పినా విన్నాడా? జగమొండి. అప్పుడు నీకు నచ్చిందీ అదే, ఇప్పుడు నచ్చనిదీ అదే.

కళ్ళు మూసుకో.. ఊ మూసుకో… నువ్వు వెళ్ళి అతనితో చెప్తావు. నీకు శశాంక్ తో వున్న పరిచయం గురించి. సంబంధం గురించి. సరే అనుబంధం గురించి. అతనేమంటాడు. ఏలా కనిపిస్తున్నాడు నందు నీకు?

ముక్కుపుటాలు అదురుతూ. కళ్ళు చిన్నవి చేసి. చేతులు గుండెల మీద ముడుచుకుంటూ. కాళ్ళు భూమిలో దిగబడినంత స్థిరంగా కదలకుండాచూస్తూ.. ఒక్కమాట కూడా మాట్లాడకుండా…!

ఎందుకు కళ్ళు తెరిచావు? భయపడ్డావా? అతనంతే కదా? అలాగే చేస్తాడు. మాట్లాడడు. బహుశా చేసింది చాలు. ఇక ఆపెయ్ అని మాత్రం అంటాడు. ఆర్డర్ వేసినట్లు.

ఆపగలవా? నిన్ను నువ్వు ఆపుకోగలవా? పోనీ ఆపెయ్యలేనని చెప్పగలవా? ఎలా ఆపాలి?

అది నీ సమస్య. నువ్వే నిర్ణయించుకో. నందు చాలాసార్లు నీతో అన్న మాట. మళ్ళీ అంటాడా? లేకపోతే అలాగే నీ వైపు చూసి మాటలులేని అగాధంలో నిన్ను పూడ్చేస్తాడా?

అవును మాట్లాడడు. నెల? రెండు నెలలు? సంవత్సరం? సంవత్సరాలు? ఏమో! చేసినా చేస్తాడు. మొండిగా! అదే కదూ నీ భయం. అదే కదూ నీ అభద్రత. ఆ మొండితనమే సమస్య. కదూ?

మరి అలాంటి నందుకి, నిన్ను నిలువునా చీల్చేసే చూపులు మాత్రమే వదిలి మాటలను పలకకుండానే గాయాలు చేసే నందుకి, నిజం చెప్పగలవా? అది కూడా ధిక్కరించి? నియతీ, నువ్వు పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు. నీ వల్లకాని పని చేద్దామని అనుకుంటున్నావు. పైగా అదే సరైన నిర్ణయమని అనుకుంటున్నావు. ఇది అసాధ్యం మాత్రమే కాదు అవివేకం కూడా.

ఒప్పుకోవట్లేదు నువ్వు. మార్గం కనిపించని చీకటిలో మిణుగురు పురుగు వెలుగుని పట్టుకోని నడవాలని చూస్తున్నావు. సరే కానీ!

తెగిస్తావు. ధిక్కరిస్తావు. తరువాత?

నందు ముందుకు వెళ్ళి ఎలా చెప్తావు నీ ఎఫైర్ గురించి….

ఎందుకు మాటిమాటికి ఎఫైర్ కాదని అంటావు? అది ఎఫైరే. వేరే మాట ఏదైనా నిన్ను నువ్వు సమర్థించుకోడానికి వాడే కంటితుడుపు పదం. కాదనకు. నీ ఎఫైర్ గురించి అతనికి చెప్పాలంటే, అది కూడా ధిక్కరించి చెప్పాలంటే – ఇదిగో నాకు నీలో ఇది నచ్చలేదు. నువ్వు ఇవ్వలేనిది అతను ఇచ్చాడు. అందుకే నేను అతనితో దగ్గరికి వెళ్లాను… అవును అంతే కదా? అలాగే చెప్పాలి. చెప్పగలవా?

నాకు నచ్చింది నేను చేశాను అనడం అతని దృష్టిలో నువ్వు అధఃపాతాళానికి పడిపోవడం. అసహ్యంగా చూస్తాడు. చూపుతో ముఖాన ఉమ్మేసినట్లు చూస్తాడు. చూడగలడు కూడా అతను. ఇది నీ ఇష్టానికి సంబంధించినదే కావచ్చు. కాని అలా చెప్పాలంటే నువ్వు నీ గురించి చెప్పుకోవాలి. నేను ఇది కోరుకున్నాను. అది నువ్వు ఇవ్వలేకపోయావు. శశాంక్ ఇవ్వగలిగాడు. అందుకే… పోనీ ఇలాగైనా చెప్పడానికి నీ దగ్గర ఏముంది?

నీకుకావాల్సింది, నందు ఇవ్వలేకపోయింది, శశాంక్ ఇచ్చింది ఏంటది? శారీరకసుఖమా?

ఛీ ఏమిటి ఛీ? ఇద్దరితో శారీరికంగా కలవలేదా నువ్వు? ఆ ఇద్దరిలో వున్న తేడా నీకు తెలియదా? ఆ తేడానే ఒక కారణం ఎందుకు కాకూడదు?

నందు విషయం తీసుకో! పుస్తకం మొదటిపేజి ఎంత నింపాదిగా చదువుతాడో, చివరిపేజీ కూడా అంతే నింపాదిగా చదువుతాడు. మ్యూజిక్ వుండాలి. చిన్నగా వినిపించే సంగీతం, వీలైతే ఇన్స్‍ట్రుమెంటల్. దేనికైనా ఒక పద్దతి వుందని నమ్ముతాడు. అతను చెయ్యబోయేదేమిటో అతనికి ముందే తెలుసు. అప్పటికప్పుడు ప్రయోగం చెయ్యడం అసలు ఇష్టం వుండదు. ముఖ్యంగా నువ్వు చెప్తే!

మరి శశాంక్? ఈ రోజు ఏ పుస్తకం చదవాలి అని నిన్ను అడుగుతాడు. ఇవ్వడంలో వున్న హాయి తీసుకోవడంలో లేదని నమ్ముతాడు. ప్రయోగం చెయ్యడం ఇష్టమే కానీ నువ్వు చెప్తేనే చేస్తానంటాడు.

ఎందుకు అంత చిరాకు పడతావు? ఇందులో ఎలాంటి అబద్ధమూలేదు. ఆ విషయం నీక్కూడా తెలుసు. మరింకేం?

నీ తెలివితేటల గురించి కూడా నీకు తెలుసు కదా? ఆ ఇద్దరి విషయంలో నీ ఆలోచన కరెక్టే. కానీ నీకు ఏది నచ్చింది? నీకు ఏది కావాలి?

ఏ పుస్తకం పట్టుకున్నా ఎక్కడపడితే అక్కడ మొదలుపెట్టి ముందుకు సగం చదివి, మళ్ళి చివరి పేజీలు చదివి మొత్తం పూర్తి చెయ్యకుండానే అది వదిలేసి మరో పుస్తకం తీసుకోవడం నీకు అలవాటు కదూ. బహుశా సమస్య అంతా అక్కడుందేమో! నీలోనే వుందేమో సమస్య. నీకు అది ఒక పని కాదు. అలాగని ప్రయోగమూ కాదు. నీ ఊహాలోకంలోకి ఓ విచిత్ర ప్రపంచంలోకి వెళ్ళటానికి మార్గమది. అది ఒక కారణమేమో ఆలోచించుకో. అది నిజంగానే కారణమైతే ఆ విషయాన్ని నందుకి చెప్పగలనని అనుకోవడం అమాయకత్వం.

ఇది కానే కాదు. కారణం చెప్పలేవు నువ్వు. అదీ నందు లాంటి వ్యక్తికి.

కారణం చెప్పలేవు కాబట్టి ధిక్కరించడం సాధ్యపడదని నిర్ణయించుకోవాలి నువ్వు. కానీ కారణం నీకు తెలియకపోవటానికి ఏం సంజాయిషి ఇవ్వగలవు? నందు వుండగా నీకు శశాంక్ ఎందుకు కావాల్సి వచ్చాడు? దీనికి కారణం నువ్వు నీ భర్తకో సమాజానికో చెప్పక్కరలేదు. కానీ నీకు నువ్వు చెప్పుకోవాలి కదా?

తెలియదు అంటావు నువ్వు. అసంబద్ధమైన సమాధానం. అలాగైతే చెప్పకపోవటమే ఉత్తమం.

ఇలాంటి సందర్భంలో తెగించి నిలబడాలంటే ఎంత ధైర్యం కావాలో తెలుసా నియతీ? ధిక్కరించే ధైర్యం ఎక్కడ్నుంచి వస్తుంది నీకు? ఏమిటి నీ ధైర్యం? శశాంక్? శశాంక్ నీ ధైర్యమా? ఎలా?

శశాంక్! నీ ప్రేమని అర్థం చేసుకున్నవాడు. నీకు కావాల్సిన ప్రేమని అర్థం చేసుకున్నవాడు. నిన్ను సంతోషంగా వుంచడానికి ప్రయత్నించేవాడు. నీకు కావాల్సింది ఇవ్వగలిగినవాడు. నీతో, నీ శరీరంతో పాటు నీ ఆత్మతో ప్రేమలోపడ్డవాడు. అవును నిజమే. కానీ అతను నీ వాడేనా?

కామ్ గా వుంటాడు. పర్ఫెక్ట్ గా, తొణకకుండా వుండగలడు. అది మంచి టైమ్‍లో. చిరాకుపెడుతూ, ఏం చెయ్యాలో తెలియక తికమకపడుతూ కూడా వుండగలడు.

వైజాగ్ వెళ్దామన్న ఆలోచన నీది.

ఎందుకు? వెళ్ళి ఏం చెయ్యాలి? అన్నాడు.

ఎక్కడుండాలి? ఏ హోటల్? ఎన్నిరోజులు? మొదటిరోజు వైజాగ్ బీచ్ లో. తరువాత? అరకు వెళ్దామా వద్దా? ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. అవి లేకుండా వుండలేడు.

ఎందుకు అన్ని ప్రశ్నలు వేస్తావు? అడిగావు నువ్వు

ఒక నిర్ణయం తీసుకోవాలంటే అన్ని విషయాలు తెలుసుకోని వాటన్నింటి మంచి చెడులు బేరీజు వేసి… ఇంకా ఏదో అన్నాడు. ఆ – ప్రణాలికప్రకారం

నీ అంతట నువ్వు టికెట్లు బుక్ చేసి, ఫోన్ చేసి ఎల్లుండి వెళ్తున్నాం అన్నావు కాబట్టి వెళ్ళగలిగారు కానీ అది అతనికే వదిలేస్తే ఎప్పటికీ వెళ్ళేవాళ్ళు కాదేమో. నో అని చెప్పడం కన్నా చూద్దాంలే అని చెప్పడం ఎక్కువ బాధాకరం అని అతనికి అర్థం కాదు.

కాదనడం లేదు. అలా నువ్వు నిర్ణయం తీసుకోవడం వల్లే కదా మీ ఇద్దరికీ ఆ అనుభవాలు కలిగాయి. కానీ అలా నిర్ణయం తీసుకోలేని వాడు నీకు బలం ఎలా అవుతాడు. నీ ధైర్యం ఎలా అవుతాడు?

నేను నిర్ణయం తీసుకోలేనా? తొందరపడి నిర్ణయం తీసుకోను. నేను వస్తాను అని చెప్తే ఆఫీసులో ఏం చెప్పాలి. రేఖకి ఏం చెప్పాలి? వచ్చిన తరువాత అప్పటికప్పుడు ఏం చెయ్యాలో తెలియని అయోమయం కన్నా ముందే ప్లాన్ చేసుకోని వెళ్ళాలి అని నా ఉద్దేశ్యం. నీకేమో తొందర. ఊరికే హడావిడి. ఇదే కదూ అతనన్నది?

అతను తిట్టినా తియ్యగానే వుంటుంది నీకు. అతని మాట తీరే అంత. ఎవరినైనా చంపేయాలన్నంత కోపం అతనికి వుండి, ఆ విషయం అవతలి వ్యక్తికి చెప్పినా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నంత తియ్యగా చెప్పగలడు కదూ? అదేనా నిన్ను అతని వలలో పడేసింది. వల అనడం కరెక్ట్ కాదులే కానీ, అదే కారణమా?

ఒకవేళ పరిస్థితుల వల్ల నువ్వు నందు నుంచి విడిపోయి శశాంక్ దగ్గరకి వెళ్ళి నందుని వదిలేశాను అంటే, నిదానంగా కూర్చోపెట్టి విషయాలన్ని వివరంగా తెలుసుకోని, సిద్ధాంతంలా ధ్వనించే లాజిక్ తో నిన్ను వెనక్కి పంపించే మాటకారి అతను. అతను అలా చెప్తే వివశురాలివై అతన్నే చూస్తూ, అతని బుగ్గ మీద సొట్టలో మునిగిపోతూ, అతని మనోహరమైన నవ్వులో కరిగిపోతూ – అలాగే. నువ్వు చెప్పినట్లే చేస్తాను. అంటావు నువ్వు. అంతే! వివశురాలివి నువ్వు, అతని ముందు.

అదే అదే సమస్య. నిన్ను ఒప్పించి వెనక్కి పంపించగలిగినవాడు నీ బలం ఎలా అవుతాడు?

శశాంక్ ఎందుకు నిన్ను ఎందుకు ఒప్పిస్తాడు? ఇదేగా నీ ప్రశ్న? ఎందుకంటే అతను కూడా ఒక భర్త. భార్య కాదని వెళ్ళిపోతే భర్త సమాజంలో చులకనైపోతాడని నమ్మే సగటు భర్త. అది నీ గురించో నందు గురించో కాకపోవచ్చు. అతని గురించే కావచ్చు.

ఇంకా అర్థం కాలేదా?

నందుని కాదని నువ్వేం చేస్తావు? శశాంక్ దగ్గరకు వెళ్తావు. శశాంక్ నిన్ను రానిస్తాడా? కోపం పక్కన పెట్టి ఆలోచించు. అతనికి ఒక భార్య వుంది. రేఖ. ఆమెను వదిలేస్తాడా? ఎందుకు వదిలేస్తాడు?

నీకు అతనంటే ఎంత ప్రేమ వుందో, అతనికి నువ్వుంటే అంత ప్రేమ వుంది కాబట్టి. నిజమేనా? అతనికి నీ మీద నిజమైన ప్రేమ వుందంటావా? భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళిన తరువాత మీ పరిచయం. ఆమె ఇంకొన్ని రోజులకి తిరిగొస్తుంది. ఈలోగా అతనికి అవసరమైన ఆడ తోడు మాత్రమే అయ్యుంటే నువ్వు? నీకు ఎంత కోపం వచ్చినా, ఎంత నమ్మడానికి ఒప్పుకోలేని సంగతైనా, ఇది కూడా నిజం అయ్యుండచ్చు. ఇదే నిజమైతే అతను నీకు ఎప్పటికీ బలం కాలేడు.

ఒకవేళ ఆ ఆలోచన అబద్ధం అయినా, భార్య వచ్చిన తరువాత, అది కూడా పిల్లనో పిల్లాణ్ణో తీసుకోని వచ్చిన తరువాత అతని సంసారం ముఖ్యమౌతుందా లేక నీతో గడిపే క్షణాలు ముఖ్యమౌతాయా? ఇదీ ప్రశ్న. అతను అడిగే వందల ప్రశ్నలన్నింటినీ మించిన ప్రశ్న. నువ్వు అడగాల్సిన ప్రశ్న. నువ్వు అడగవు. అడగలేవు. అడిగినా అతను చెప్పడు. చెప్పకపోయినా నీకు తెలుసు. అతనికి రేఖ ముఖ్యం. నువ్వు కాదు.

కాదు. కాదు. కాదు.

ఇదంతా పిచ్చి ఆలోచన. ఇది నిజం కాదు.

రేఖ గురించి అతను చెప్పిన మాటలు గుర్తున్నాయా?

రేఖలో నీకు నచ్చనిదేమిటి? నువ్వు అడిగావు చనువు పెరిగిన తరువాత. అతను చెప్పే సమాధానంలో అతను నీవాడే అన్న ఆత్మసంతృప్తి కావాలి కదా నీకు? అతను చెప్పిందేమిటి?

టీవీ సౌండ్ పెట్టనివ్వదు. వంటింట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకోమంటే వినదు. గదులన్నింటికి వంటకాల వాసన వుంటే నచ్చదు నాకు. షవర్ రాడ్ మీద అండర్ గార్మెంట్స్ చిరాకు నాకు. పేపర్ మడత పెట్టి ఒక చోట పెట్టడం, సాక్స్ తీసి ర్యాక్ లో పెట్టడం. సర్దచ్చు కదా.. ఊహు

నవ్వావు నువ్వు. విరగబడి.

పేపర్ అలా పడేసేది, సాక్స్ గదిలో వదిలేసేది నువ్వే కదా. నవ్వుతూనే అన్నావు. మీరిద్దరూ ఒకరినొకరు హత్తుకోని పడుకున్న బెడ్ పక్కనే అతను అంతకు క్రితమే వదిలేసిన సాక్స్ చూపించావు.

నిజమే అనుకో కానీ సర్దచ్చు కదా..?

అప్పటి నుంచి నువ్వు వెళ్ళిన ప్రతిసారీ అతని ఇల్లు సర్దావు.

విషయం పక్కకి మళ్ళిస్తున్నావు. నిజంగా ఇవేనా రేఖలో అతనికి నచ్చని విషయాలు? అసలు అతనికి అతని భార్యలో నచ్చని విషయాలు నిజంగా వున్నాయా? లేవు అని అంటే నువ్వు ఒప్పుకోవు. సరే వుండే వుంటాయి. కానీ అవేవీ నీకు చెప్పలేదే. ఎందుకు? రేఖని నీ ముందు తక్కువ చెయ్యడం ఇష్టంలేకనా? రేఖ నీ కన్నా పైమెట్టు మీదే వుండాలనా? నీ కన్నా ఆమే అతనికి ఎక్కువ కాబట్టా?

స్టాప్ దట్ నాన్సెన్స్. అసూయతో వచ్చే ఆలోచనలివి. భార్యలో నచ్చనిదేదో వుంటేనే కదా నిన్ను తన జీవితంలోకి ఆహ్వానించగలిగాడు.

అవునా? నిజమేనా? ఆలోచించు.

కానీ ఒకటుంది. రేఖకి పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడినప్పుడు అతని కళ్ళలో కనపడ్డ మెరుపు.

నేను తండ్రిని అవుతున్నానంటే నమ్మశక్యం కాకుండా వుంది. అమ్మాయి అయితే బాగుంటుంది కదూ

నువ్వు సమాధానం చెప్పలేదు. అతని కళ్ళలో మెరుపు నీలో అభద్రతగా రూపాంతరం చెందడం తెలిసినా ఆ ఆలోచనని ఆపేశావు. ఇప్పుడు ఆలోచిస్తే తెలియటం లేదా? అతనికి భార్య, పిల్లలు, సంసారం కావాలి. వివాహం అనే బంధాన్ని నమ్మకపోవచ్చు కానీ కుటుంబం అనే అనుభూతిని మాత్రం అతను వదులుకోలేడు. నిన్ను కూడా వదులుకోనివ్వడు.

తేలిపోయింది. నందుని ధిక్కరించి నువ్వు వచ్చేస్తానంటే అతను ఒప్పుకోడు. ఇప్పుడు గుర్తుకొస్తోంది. నీకు అతనికి జరిగిన గొడవ ఒకటి.

నందు నన్ను బాధ పెట్టాడు. అన్నావు నువ్వు.

నువ్వు అతన్ని ఏమన్నా అన్నావా? అన్నాడతను. ఆ తరువాత జరిగిన గొడవ వదిలెయ్. అసలు అలాగే మాట్లాడతాడు అతను. ఎవరిది తప్పు అన్నది ముఖ్యం అతనికి. జడ్జి స్థానంలో కూర్చుంటాడు కానీ నీ వైపు లాయర్లా మాట్లాడటం రాదు.

నీ వైపు నిలబడి మాట్లాడని శశాంక్ కోసం ఎలా ధిక్కరించగలవు నందూని? శశాంక్ సపోర్ట్ గా వుండని పక్షంలో నందుని ధిక్కరించడం సాహసం. అవును సాహసం.

కారణం చెప్పలేని ధిక్కారం నిలబడదు. అది తిరిగి నిన్నే నిలదీసేలా చేస్తుంది. ధిక్కరించాలంటే నీ గొంతులో బలం వుండాలి. ఆ బలం నిజాయితీ నుంచి వస్తుంది. అలా నిలబడలేనప్పుడు ఈ అడుగు వెయ్యకపోవటమే మంచిది.

మరి ఇంకెలా చెప్పగలవ్? అతని ఇగోని తృప్తిపరిచేలా అతని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతావా?

(ఇంకా వుంది)

 

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు