ముందడుగు కోసం ఎదురుచూపు : పిన్నమనేని

 మృత్యుంజయరావు పిన్నమనేని– సాహిత్య ప్రపంచంలో చాలా అరుదుగా తారసపడతారు ఇలాంటి వాళ్ళు. వారి ప్రతిభని, సృజనని, జ్ఞానాన్ని పట్టించుకోకుండా నిరాడంబరంగా పసివాళ్లలా ఉంటారు. ఎపుడో ఒకసారి ఇదో వీరేనండి వారు అని చెప్పాల్సి వస్తుంది. చిన్నచిత్తుకాగితాన్నైనా చదవకుండా వదలనంటారు. “నేనో మంచి పాఠకుడ్ని, ప్రేక్షకుడ్ని అంతే” అని వినమ్రంగా చెప్పుకుంటారు.

 మృత్యుంజయరావు రచించిన “అనగనగా” నాటకం  ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డు పొందింది.  రాష్ట్రం నలుమూలలా 90 కి పైగా ప్రదర్శనలు పూర్తిచేసింది. రాతిలో తేమ నాటకం అప్పాజోశ్యుల వారి నాటకపోటీలలో అనేక బహుమతులు పొందడమే కాకుండా, రెండునెల్లలోనే 25కి  పైగా ప్రదర్శనలు పూర్తిచేసింది. వారు రాసిన సంక్షిప్త కథారూపం లోకి మార్చిన కన్యాశుల్కం నాటకానికి వి ఏ కె రంగారావు గారి  లాంటి వారి ప్రశంసలు అందుకున్నారు. కంబశ్రీరామం, కంచికచర్ల వంటి చారిత్రిక నేపథ్య కథలు రాసారు.

ఖలీల్ జిబ్రాన్ “సాండ్ అండ్ ఫోం” ని “ఇసుక – నురుగు” పేరుతో, “ఓత్” అనే ఆంగ్ల నవలను “ఆన” పేరుతో, “మైమ్స్ ఆఫ్ ది కోర్ట్ జాన్స్” ను “సానివాడల సంభాషణల” పేరుతో తెలుగులోకి అనువదించారు. ఇప్పుడు వారి నాటకం కర్ణపతనం సంస్కృతి, గుంటూరు వారి రాష్ట్రస్థాయి నాటక రచనలో పోటీలో ఉత్తమరచనగా ఎంపికైంది.

గుంటూరు సంస్కృతి సంస్థవారు నిర్వహించిన నాటకపోటీలో మీ నాటకం కర్ణ పతనం ఉత్తమ రచనగా ఎన్నికైనందుకు అభినందనలు సర్.

ధన్యవాదాలండి

ముందుగా మీ గురించి చెప్పండి.

నా గురించి చెప్పుకోడానికేముందండి. మంచి పుస్తకం చదివి ఆనందించడం, మంచి మిత్రులతో కాలం గడపడం ఇంతే.

  మీ ఎడ్యుకేషన్,  సాహిత్య పరిచయం గురించి చెప్పండి.

సొంతఊరు గుంటూరుజిల్లా తక్కెళ్లపాడు. హైస్కూల్ కొలకలూరులో చేరడం లైబ్రరీని పరిచయం చేసింది. ఇంటర్ ఫెయిలై రవి కాలేజీలో చేరడం సాహిత్యపరంగా మంచిమలుపు. అక్కడ సి. వి. ఎన్. ధన్ గారు సాహిత్యంపట్ల నాలో ఉన్న ఆసక్తిని మొట్టమొదట గమనించి, ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతంగా పరిచయం చేశారు. హిందూ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్లో గ్రాడ్యుయేషన్, తరువాత గ్రూప్ 4 సెలక్షన్, గవర్నమెంట్ ఉద్యోగం

నాటకరచన పట్ల మీకు ఆసక్తి ఎలా కలిగింది? ఈ నాటకపోటీలు గురించి చెప్పండి.

నా చిన్నతనం నుంచి నాటకాలు ఆసక్తిగా చూసేవాణ్ణి. అప్పట్లో ప్రతి ఊళ్ళో ఒక నాటక సమాజం ఉన్నట్టు ఉండేది. అటు పౌరాణిక నాటకాలు ఇటు సాంఘిక నాటకాలు గ్రామాల్లో విస్తృతంగా ప్రదర్శించబడేవి. నాన్నకు కూడా ఆ రంగం పట్ల ఆసక్తి ఉండటంతో ఇంట్లో కూడా అలాంటి చర్చలు జరిగేవి. నాటకాలు రిహార్సల్స్ నుంచి ప్రదర్శన వరకు వాటి పూర్తి స్వరూపం చూసే అవకాశం ఉండేది. ఐతే అప్పుడు నాటకాలు రాయాలని కానీ ఆడాలని కానీ అనుకోలేదు.

తెలుగు రాష్ట్రాలలో నాటక ప్రదర్శన పోటీలు నిర్వహించేందుకు అనేక పరిషత్తులున్నాయి. కానీ ప్రత్యేకంగా మంచి నాటకాలు రాయించేందుకు పోటీలు నిర్వహించే సంస్థలు చాలా అరుదు. గుంటూరులోని సంస్కృతి సంస్థ ఇలాంటి ప్రయత్నం చేస్తోంది. ఆ సంస్థ వ్యవస్థాపకులు బాలచందర్ గారు గతంలో గ్లోబలైజేషన్ మీదా ఇతర అంశాల మీదా ఇలాంటి పోటీలు నిర్వహించి ఉన్నారు.

చరిత్ర ఇతిహాసాలు ఆధారంగా తీసుకొని కొత్త దృక్పథాన్ని ప్రదర్శించే రీతిలో నాటకం కావాలని ఈసారి అడిగారు. నేను కొంతకాలంగా వ్యాసభారతం తెలుగు అనువాదం చదువుతున్నాను. ఆ క్రమంలో నాకు కలిగిన కొన్ని ఆలోచనలు నాటకంగా రాస్తే బాగుంటుందని అనిపించింది. పర్యవసానమే ఈ నాటక రచన.

 కర్ణపతనం నాటకం ఇతివృత్తం, ప్రత్యేకత ఏమిటి?

మహాభారతం చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ముఖ్యంగా పాండవులు అజ్ఞాతవాసం పూర్తిచేసుకొని తమ రాజ్యభాగం కోసం ప్రయత్నించే సందర్భంలో సంధి రాయబారాలు విఫలమైతే యుద్ధం తప్పదనే అభిప్రాయం ఏర్పడుతుంది. నిజానికి ఒక వైపు సంధి ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు యుద్ధ ప్రయత్నాలు, సైన్య సమీకరణ కూడా జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భంలో ధర్మరాజు దృష్టి మొత్తం దుర్యోధనుడి మీద లేదా అతని పక్షంలోని అతిరథ మహారథుల మీద ఉండాలి. కానీ చిత్రంగా అతని భయమంతా అర్ధరథుడైన కర్ణుని గురించి ఉంటుంది. నిరంతరం కర్ణ వధ కోసమే అతను తపిస్తూ ఉంటాడు. అందుకోసం శల్యుడితో అనైతిక ఒప్పందం చేసుకోవడానికి కూడా వెనుకాడడు. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకిలా అని ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మన మనసుకు తడతాయి.

కర్ణుడు కుంతీ పుత్రుడు. పాండవులకు ఒకరితో ఒకరికి ఉన్న బంధుత్వం తల్లివల్లనే కానీ తండ్రి వల్ల కాదు. కనుక అతను జీవించి ఉంటే తక్కిన సోదరులలో అగ్రస్థానం అతనిదే. యుద్ధం జయించినా ధర్మరాజుకు కర్ణుడి వైపు నుంచి ఈ ప్రమాదం పొంచి ఉంది. ధర్మరాజుకు కర్ణుడు తన సోదరుడనే విషయం అప్పటికి తెలియదు కదా అని మీరు అనొచ్చు. కానీ ధర్మరాజు చారచక్షువు. సమర్ధుడు. తనతల్లిని, విదురుడు వంటి వారిని కౌరవ అంతఃపురంలో ఉంచగలిగాడు. తన అజ్ఞాత జీవితాన్ని కాపాడు కోగలిగాడు. అతనికి కర్ణుడి జన్మ రహస్యం తెలియదనుకోలేము. కనుక కర్ణుడు భారత యుద్ధంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. అతన్ని వధించడానికి అనేక కుట్రలు నీచమైన పద్ధతులు ధర్మరాజుకు అవసరమయ్యాయి. అంతిమంగా కర్ణుడి పతనం దేశంలో రాజకీయ నైతిక విలువలకు శాశ్వత సమాధిగా మారిపోయింది అనే అభిప్రాయం కలుగుతుంది.

కర్ణుడి మరణం తర్వాత రేగిన ప్రశ్నలు క్రూరంగా తొక్కివేయబడి ఉండచ్చు. ఆది నుంచీ ఈ దేశంలో అధర్మం నోరుగల వాళ్ళ నేర్పరితనంతో ధర్మంగా చలామణి అవుతుందేమోననే సందేహం కూడా కలిగింది. వర్తమాన రాజకీయాలు కూడా అ సందేహం బలపరిచే దిశగానే ఉన్నాయి. అందువల్ల ఈ నాటక రచనకు ఆవశ్యకత ఏర్పడిందని భావించాను.

 ఇంతకు ముందు ఏమైనా నాటికలు రాశారా? వాటి ప్రదర్శన విశేషాల గురించి చెప్పండి.

జార్జి ఆర్వెల్ రాసిన యానిమల్ ఫార్మ్ అనే నవల స్ఫూర్తి, ఇంకా మిత్రులు వైయస్ కృష్ణేశ్వరరావు గారు చెప్పిన ఒక చిన్న పాయింట్ ఆధారంగా చేసుకొని “అనగనగా” అనే నాటిక రాశాను. పాలకులు పాలితులు రెండు వర్గాలుగా కాకుండా ఒకే వర్గంగా పనిచేసే ఒక ఉజ్జ్వలమైన వ్యవస్థ ఏర్పడే మంచిరోజు ఎప్పటికొస్తుందోననే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఆ నాటిక ముగుస్తుంది. ఈ నాటిక 2013 ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవాలలో వెండి నందిని గెలుచుకుంది. ఈజీ మనీ కోసం సమాజం ఎలా వెంపర్లాడుతుందో చూపించే నాటిక “అంతర్నేత్రం” 2014 నంది నాటకోత్సవాలకు ఎంపికై ప్రదర్శించ బడింది.

గత సంవత్సరం అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా నాటికల పోటీల్లో నేను రాసిన “రాతిలో తేమ” నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది

 కథా నాటికల ప్రత్యేకత ఏంటి? మీరు రాసిన కథానాటికల ఏమైనా ఉన్నాయా?

తెలుగులో ఎందరో గొప్ప కథకులున్నారు. ఎన్నో గొప్ప కథలున్నాయి సార్వకాలిక విలువలున్న కథలు జన బాహుళ్యంలోకి చొచ్చుకు పోవాలనే సత్సంకల్పంతో పెద్దలు అప్పాజోస్యుల సత్యనారాయణ గారు తాము ఏటా నిర్వహించే నాటికల పోటీలలో కథా నాటికల ప్రక్రియను తీసుకొచ్చారు. ఇది గత పాతికేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది. దీనివల్ల మన భాష లోని గొప్ప కథలు నేటి సమాజానికి కొంతవరకైనా చేరుతున్నాయి.

అప్పాజోస్యుల వారి నాటికల పోటీలు జనవరిలో జరుగుతాయి. ప్రతి ఏటా కొత్త నాటికలు పరిచయమౌతాయి. అందువల్ల ఆ పరిషత్తుకు ఎంపికైన నాటికలే దాదాపుగా ఇతర పరిషత్తులలో ప్రదర్శనకు ఎంపికవుతాయి. కనుక నాటక సమాజాల వారు ఎక్కువగా కథా నాటికలే ఎంచుకోవడానికి ఇష్ట పడతారు. స్వతంత్ర నాటికలు కొంత తగ్గడానికి అదొక కారణం.

మధురాంతకం రాజారాం గారు రచించిన “రాతిలోతేమ” అనే కథను నేను నాటకీకరించాను. మధురాంతకం నరేంద్ర గారు ఈ నాటికను చూసి కథా హృదయాన్నే కాదు మా నాన్నగారి హృదయాన్ని కూడా మీరు పట్టుకున్నారు అంటూ చేసిన ప్రశంస నేను మరిచిపోగలిగేది కాదు. తర్వాతి కాలంలో ఈ నాటిక ఇంకా అనేక పరిషత్తుల్లో ఉత్తమ ప్రదర్శనగా నిలబడింది.

 మీ నాటకాలకు దర్శకత్వం వహించిన దర్శకుల గురించి చెప్పండి, నాటకం విజయవంతం కావడంలో వారి పాత్ర ఏమిటి?

ఇప్పటివరకు నా నాటికలు ఇద్దరే దర్శకులు ప్రదర్శించారు. ఒకరు నా ప్రియమిత్రుడు కరణం సురేష్. వీరు నా “అంతర్నేత్రం” నాటికకు దర్శకత్వం వహించారు. నిజానికి నేను నాటక రచన ప్రారంభించిందే అతని కోసం. ఐతే అనారోగ్యంతో అతను హఠాత్తుగా మరణించడంతో ఒక దశలో నాటక రచన విరమించాలనుకున్నాను. ఐతే అతను మరణించకముందే రౌతు వాసుదేవరావు అనే యువ దర్శకుడుని పరిచయం చేయడం, ఇతను నా “అనగనగా” నాటికను అద్భుతంగా ప్రదర్శించి 2013 నంది అవార్డు సాధించడంతో తర్వాత నా ప్రయాణం వాసుతో సాగింది. నాటకానికి సంబంధించినంత వరకు దర్శకుడిదే ప్రధానమైన పాత్ర. నాటకంలో చెప్పబడిన అంశాన్ని ఆకళించుకోవడం, తగిన పాత్రధారుల్ని ఎంపిక చేసుకోవడం, కథాఅంశం ప్రేక్షకులకు హత్తుకునేలా నాటికను నడపడం, కొత్త కొత్త ప్రదర్శనా రీతుల్ని ప్రయోగించడం ఇవన్నీ దర్శకుడి బాధ్యతలు. కనుక నాటకానికి సంబంధించినంతవరకూ దర్శకుడే హీరో.

 జాతీయస్థాయితో పోలిస్తే తెలుగునాటకరంగం పరిస్థితి ఎలా ఉంది, జాతీయస్థాయి నాటికలు ఏమైనా తెలుగులో వస్తున్నాయా? తెలుగు నాటకరంగ అభివృద్దికి మీరిచ్చే సూచనలు ఏమిటి?

ఇది కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న. జాతీయస్థాయితో పోలిస్తే మన నాటకరంగం చాలా వెనుకబడి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం చాలా తక్కువ. కేవలం ఔత్సాహికులైన కళాకారులు, పరిషత్తుల నిర్వాహకుల వల్లనే నాటకరంగం అంతో ఇంతో ఉనికిలో ఉంది. నాటకరంగ అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న కృషిని గ్రామీణ నాటకరంగంతో అనుసంధానం చేయాల్సి ఉంది. నాటకకళకు సాంఘిక గౌరవాన్ని కలిగించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

 కొత్తగా ఏమైనా నాటకాలు రాశారా?

డాక్టర్ కేశవరెడ్డి గారి నవల “అతడు అడవిని జయించాడు” మరియు ధనికొండ హనుమంతరావు గారి కథ “పరువు ప్రతిష్ట”లను నాటకీకరించాను. వీటికి మూల రచయితల వారసులనుండి అనుమతి లభిస్తే ప్రదర్శనలకు వెళ్లడం జరుగుతుంది.

 పౌరాణిక నాటకం ద్వారా ఇప్పుడు బహుమతి పొందారు, పురాణాలు,ఇతిహాసాల ఆధారంగా మీ దగ్గరనుంచి ఏదైనా విశిష్ట రచన ఆశించవచ్చా?

నిజానికి భగవద్గీత ఆధారంగా ఒక నవల రాయాలనేది దాదాపు దశాబ్దంగా ఒక కల. అది చేయగలిగితే ఒక ప్రధానమైన లక్ష్యం పూర్తయినట్టు. ఆ ప్రయత్నంలో భాగంగా చదివిన చదువు ఈ కర్ణపతనం రాసేందుకు కొంతవరకు ఉపకరించింది.

 సారంగతో మీ అనుబంధం గురించి చెప్పండి.

ఒక పదేళ్ల కిందట “మైమ్స్ ఆఫ్ ది కోర్ట్ జాన్స్” అనే పుస్తకం తారస పడింది. క్రీస్తు శకం ఒకటో శతాబ్దికి చెందిన లూషియన్ అనే గ్రీకు రచయిత పుస్తకానికి ఆంగ్లానువాదం అది. ఒకటి రెండు పేజీల సంభాషణలతో ఆ కాలపు వేశ్యల జీవితాన్ని నాటి సాంఘిక పరిస్థితుల్ని అద్భుతంగా వర్ణించిన సంభాషణలవి. ఆ కాలంలో అంత చక్కని రచన ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాంటి రచన మరొకటి నాకు మరెక్కడా తారసపడలేదు. తెలుగులో ప్రసిద్ధమైన కొన్ని నాటకాలలోని సంభాషణలు విడిగా తీస్తే వాటికి దగ్గరగా ఉంటాయని అనిపించింది. ఆ విధంగా మైమ్స్ ని తెలుగులోకి అనువదించి తెలుగు నాటకాల్లోనుంచి తీసిన సంభాషణలు కూడా కలిపితే మొత్తం ఒక పాతిక సంభాషణలు తయారయ్యాయి. వాటిని మిత్రులు పెద్ది రామారావు గారు చూసి సారంగకు పంపమని సలహా ఇచ్చారు. అఫ్సర్ గారు “సానివాడల సంభాషణల” పేరుతో ఆరునెలలపాటు వాటిని సారంగలో ప్రచురించారు. ఆ విధంగా అఫ్సర్ గారు  నన్ను ఈ మాగజైన్ లోకానికి తొలిగా పరిచయం చేసారు. తర్వాత నామిని రచన మూలింటామెకు నేను రాసిన పరిచయ వ్యాసాన్ని కూడా సారంగలో ప్రచురించారు. ఈ సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

*

 

Avatar

శ్రీ సుధా మోదుగు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మా బాబాయి గారి గురించి మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. మీకు ధన్యవాదాలు- అశోక్ పిన్నమనేని

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు