మీకు తెలియందేం కాదు

మంత్ర నగరి ఒకటి

పిలిచి పిలిచి లాక్కెళుతుంది

 

ఆ ఊరి పొలిమేరల దగ్గరే ఆకాశం

పాత డైరీల్లోని కాగితాలతో ఆహ్వానమందిస్తుంది

 

కాళ్ళను పట్టి లాగి అక్కడి నది

వయసు వెనక్కు మళ్ళే మందేదో నోట్లో వేస్తుంది.   

 

మలుపు మలుపుకీ జ్ఞాపకాలక్కడ 

గుర్తులుగా ముద్రించబడి ఉంటాయి

 

ఏనాడో సగంలో వదిలేసిన రాగాలను

వీధులు వేయి నోళ్ళతో వినిపిస్తుంటాయి

 

రాతి కొండల హృదయాల్లో పేర్లు, 

చెట్ల తొర్రల్లో రహస్యాలు, అక్కడ

భద్రంగా దాచబడి ఉంటాయి

 

ముక్కలుగా లోలో మిగిలిన అనుభవాలన్నీ

ఒక్కరిగా రూపు కట్టి అడుగడుక్కీ హత్తుకుంటాయి

 

ఊపిరాడటానికీ, ఊపిరాగడానికీ మధ్య

పోగేసుకునేదల్లా ఆ కౌగిట్లో దక్కిన పరిమళం

 

మీకు తెలియందేం కాదు,

 

తొలిప్రేమ ఒడిలో ఆడించిన మంత్రనగరికి వెళితే

 

ప్రతి ఉదయమూ కొత్తకలల సంతకమవుతుంది

ప్రతి రాత్రీ మోహపు వెన్నెలలో మేల్కొనే ఉంటుంది.

*

చిత్రం: సత్యా బిరుదరాజు 

మానస చామర్తి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంత్ర నగరి, కొత్త కలల సంతకమూ, మోహపు వెన్నెలా….
    ..

    ..
    తొలిప్రేమ ఒడిలోకి జారేందుకు నిచ్చెన మెట్లు వేశాయి

    🙂 థ్యాంక్యూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు