మిత్రవింద విజిట్స్ అవర్ హోమ్

“ఎల్లుండి మ‌నింటికి మిత్ర‌వింద‌గారు వ‌స్తున్నారు” చెప్పాడు శ్రీశైలం.

ఆ మాట వింటూనే ప‌ద్మ దిగాలు ప‌డిపోయింది. ఆర్రోజులు ఆశ‌గా ఎదురుచూస్తే వ‌చ్చే ఒక్క‌గానొక్క ఆదివారం. అది కూడా ప్రాప్తం లేద‌న్న‌మాట అనుకుంది మ‌న‌సులో. మిత్ర‌వింద‌గారంటే ఎవ‌రు,  ఎందుకొస్తున్నారు అని భార్య అడ‌గ‌క‌పోవ‌డం శ్రీశైలానికి చాలా నిరాశ క‌లిగించింది.

“మిత్ర‌వింద‌. భ‌లే పేరు క‌దా. ఆవిడ రాసే క‌థ‌లు కూడా అంతే వెరైటీగా వుంటాయి. నీకు తెలీదులే కానీ, ఆవిడ ఏం రాసినా సంచ‌ల‌న‌మే” అన్నాడు శ్రీశైలం. ప‌ద్మ ఏమీ మాట్లాడ‌లేదు. ఈసారి శ్రీశైలానికి కాస్త కోపం వ‌చ్చింది. మిత్ర‌విందగారికి బోలెడంత ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్క‌డైనా బ‌య‌ట సాహితీ స‌మావేశాల్లో క‌న‌బ‌డితే త‌ప్ప‌, ఆవిడ ఎవ‌రినీ ప‌ర్స‌న‌ల్ గా క‌లిసింది లేదు. అలాంటిది ఏకంగా  ఇంటికే రావ‌డానికి సిద్ధ‌ప‌డిందంటే మామూలు విష‌యం కాదు. ఈ వార్త బ‌య‌ట‌కి పొక్కిందంటే తాను కూడా సెలెబ్రిటీ అయిపోవ‌డం ఖాయం.

“ఆవిడ ముందు కూడా ఇలాగే మొహం గంటు పెట్టుకోని కూర్చోమాక‌. నా ప‌రువు పోద్ది” అన్నాడు శ్రీశైలం.

“స్కూల్లో కాస్త ప‌నెక్కువ‌య్యి త‌ల‌నొప్పిగా ఉందంతే. అంత గొప్పావిడ మ‌నింటికొస్తుందంటే నాకు మాత్రం సంతోషంగా ఉండ‌దా?” అంది ప‌ద్మ‌.

“నాకు తెలియ‌దా నీ సంగ‌తి. మ‌నింటికి వ‌చ్చిన‌వాళ్లంతా నీ గురించి ఎంత మంచిగా చెపుతార‌నుకున్నావ్‌. మిత్ర‌వింద గారి రేంజి నీకు అర్థం కానంద‌కు ఫీల‌య్యి కాస్త విసురుగా మాట్లాడాను. ఏమ‌నుకోకు” స‌డెన్ గా ట్రాకు మార్చి మృదువుగా చెప్పాడు శ్రీశైలం.

అత‌ని కోపం, మృదుత్వం రెండూ ప‌ద్మ‌కి ఒకేలా అనిపించాయి. అయిందానికీ కానిదానికీ అంతెత్తున ఎగిరిపడడం, అంతలోనే చప్పున చల్లారిపోవడం అతనికి అలవాటే.

***

“ఏమైందే నీకు, పొద్దుట్నించీ డల్ గా ఉన్నావ్” అడిగింది సునీత.

చెప్పాలా వొద్దా అని కాస్త తటపటాయించింది పద్మ. ఇద్దరూ వొకే స్కూల్లో చేస్తారు. పరిచయం అయ్యి ఏడాది కూడా కాకపోయినా, చిన్నప్పట్నించీ పరిచయం ఉన్నదానిలా చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంది సునీత. ఎమేయ్, వొసేయ్ అనుకునేంత చనువు వుంది యిద్దరి మధ్యా. ఒకళ్ల మాటలు యింకొకళ్ల దగ్గర చెప్పే రకం కాదు అది. దాని దగ్గర దాపరికమెందుకు?

“రేపు ఆదివారం ఎవరో మిత్రవిందట. ఆవిడ యింటికొస్తుందని చెప్పాడు మా ఆయన. నిజం చెప్పాలంటే నాకేమంత యిష్టం లేదు” గిల్టీగా చెప్పింది పద్మ.

“నీ అసలు ప్రాబ్లమ్ ఏంటి? మీ ఆయన అమ్మాయిలని యింటికి తీసుకురావడమా? వాళ్లకి నువ్వు సేవలు చేయాల్సిరావడమా?” అడిగింది సునీత. దానితో అదే సమస్య. ఠకీమని మొహం మీదే అడిగేస్తుంది.

“సేవలు చేయాల్సిరావడమే అసలు సమస్య. ఎవరైనా గెస్టులు వస్తున్నారంటే చాలు, చాంతాడంత మెనూ రెడీ చేస్తాడు. అవతలివాళ్లు అంత తినగలరా లేదా అన్నది చూడడు. అరగంటకొకసారి ఆరంగారంగ ఏదో వొకటి వాళ్ల నోట్లో కుక్కుతూనే ఉండాలి. ఆ వచ్చేవాళ్లు కూడా సగం తిండి కోసమే వస్తారల్లే వుంది. ఒద్దు వొద్దంటానే మేస్తా వుంటారు” చెప్పింది పద్మ.

“ఒకసారి కూర్చోబెట్టి సీరియస్ గా మాట్లాడి చూడకపోయావా?” అంది సునీత.

“అదీ అయ్యింది. రెండేళ్ల క్రితం అనుకుంటా వొకావిడొచ్చింది. ఆవిడ పొందిన అనుభవాలు, పొందాలనుకుంటున్న అనుభూతులు, ఆరోగ్య సమస్యలు, అపోహలు లొడాలొడా చెపుతానే వుంది. నా పాటికి నేను పని చేసుకుంటున్నా చెవిన పడక మానవుగా. సుఖసంసారం పేజీ సినిమా చూపించారు నాకు. ఆరోజు సాయంత్రం గట్టిగానే అడిగాను ఏంటీ దరిద్రం అని..”

“ఏమన్నాడు?”

“అలాంటి చర్చలు చేయడం…” భర్త ఏమన్నాడో అతని మాటల్లోనే చెప్పబోయింది పద్మ.

“ఆగాగు నేను చెపుతాను” అంటూ మధ్యలో అందుకుంది సునీత. “అలాంటి చర్చలు చేయడం వల్ల మానవ ప్ర‌వృత్తిని అర్థం చేసుకోవడం వీలవుతుంది. ఒక పురుషుడిగా నాకుండే పరిమితులని అధిగమించడం అలాంటి విశాలభావాలున్న స్త్రీల స్నేహంలో మాత్రమే సాధ్యమవుతుంది. సమాజం గురించీ, మనసు లోతుల్లో వుండే భావాల గురించీ, దేహవ్యాకరణం గురించీ చర్చించేటప్పుడు అసలు మా యిద్దరిలో వొకరు మగ, యింకొకరు ఆడ అనే విషయం కూడా మర్చిపోతాం అన్నాడు కదూ?”

“ఇంచుమించుగా అలాగే అన్నాడు” నవ్వాపుకుంటూ అంది పద్మ.

“నువ్వు కాబట్టీ చూస్తా వూరుకున్నావ్. నేనైతేనా చీపురుకట్ట తిరగేద్దును” కోపం నటిస్తూ అంది సునీత.

“పెళ్లయిన మొదట్లో నాకూ మా ఆయన మీద కోపం వచ్చేది. కానీ, బయట కనిపించే మగ వెధవల్ని చూశాక శ్రీశైలమే మెరుగేమో అనిపించింది. మూడ్ బాగోలేనప్పుడు పిచ్చిపట్టినట్టు అరుస్తాడు. ఆ కాసేపూ నోర్మూసుకోని వూరుకుంటే మళ్లీ కాళ్ల బేరానికొస్తాడు. అతనితో గొడవపడి, అతన్ని సంస్కరించి యిప్పుడు నేను కొత్తగా పొందేదేముంది” విరక్తిగా చెప్పింది పద్మ.

“ఏమో, నాకైతే నీ స్ట్రాటజీ కరెక్ట్ కాదనిపిస్తోంది. నీ యిష్టాయిష్టాలు, మనోభావాలు పక్కన పెట్టు. చాకిరీ చేయలేక వొళ్లు హూనం అవుతున్నందుకైనా అతన్ని మార్చే ప్రయత్నం చేయాలిగా” అంది సునీత. పద్మ బదులివ్వలేదు.

***

శనివారం అర్థరాత్రి వరకూ ఇల్లు సర్దుతూనే వున్నాడు శ్రీశైలం. అటు సామాను యిటు, ఇటు సామాను అటు జరిపాడు. పుస్తకాల షెల్ఫు దుమ్ము దులిపి, కొన్ని పుస్తకాలు తీసి టీపాయ్ మీద పెట్టాడు. ఆ పుస్తకాలు తాను చదువుతున్నట్టు చూసేవాళ్లకి తెలియడం కోసం.. పేజీల మధ్యలో బుక్ మార్కర్స్ పెట్టాడు. బాత్రూమ్ తలుపు తీయగానే గుప్పుమనేటట్టు పెర్ఫ్యూమ్ కొట్టాడు. ఒక సాయంకాలం దినపత్రికలో మూడేళ్ల క్రితం ప్రచురితమైన తన కథ తాలూకూ జిరాక్స్ కాపీ బయటకి తీసి, డబుల్ గమ్ టేపుతో గోడకి అతికించాడు. కాసేపాగి దాన్ని పీకి, బెడ్రూము బీరువా తలుపుకి అమర్చాడు. అతని ధోరణి అలవాటైందే అయినా, ఈసారి మాత్రం ఎప్పటికన్నా ఎక్కువ హడావుడి చేస్తున్నాడని తెలిసిపోతోంది. పద్మకి నిద్ర పట్టేసరికి శ్రీశైలం యింకా లోపలికీ బయటకీ తిరుగుతూనే వున్నాడు.

గాఢనిద్రలో వున్న పద్మ ఏవో మాటలు వినబడి వులిక్కిపడి లేచింది. పక్కనే వున్న మొబైల్ తీసి టైమ్ ఎంతయిందా అని చూసింది. నాలుగున్నర. శ్రీశైలం పక్కన లేడు. హాల్లోకెళ్లి లైటేసి అటూయిటూ చూసింది. రెండో బెడ్రూమ్ లో నుండీ శ్రీశైలం గొంతు వినబడుతోంది. అతను ఎవరితోనూ మాట్లాడడం లేదనీ, ఏదో చదువుతున్నాడనీ పద్మకి అర్థమైంది.

“లిటరేచర్ యీజ్ రైటింగ్ దట్ యూజెస్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫామ్ అండ్ యీజ్ కన్సిడర్డ్ టు హ్యావ్ మెరిట్ ఆర్ టు బి యింపార్టెంట్.. లిటరేచర్ యీజ్ రైటింగ్ దట్ యూజెస్ ఆర్టిస్టిక్.. లిటరేచర్ యీజ్ రైటింగ్ దట్ యూజెస్ ఆర్టిస్టిక్…” బట్టీ పడుతున్నాడు శ్రీశైలం.

భార్యని చూడగానే కాగితం చప్పున దాచేసి, “ఏం లేదులే నువ్వెళ్లి పడుకో” అన్నాడు.

అసలీ మానవుడు చిన్న కునుకైనా తీశాడా, రాత్రంతా మెలకువతోనే వున్నాడా అనుకుంటూ వెళ్లి మళ్ళీ పక్కెక్కింది పద్మ. పడుకుందనే గానీ ఎంతకీ నిద్ర పట్టలేదు. ఇక లాభం లేదని వంటింట్లోకెళ్లి స్టవ్ మీద పాలు పెట్టి, బ్రష్ చేసుకోవడం మొదలెట్టింది.

“పల్లీచట్నీతో పాటు అల్లంచట్నీ కూడా చెయ్యి. కారప్పొడి లోకి నెయ్యి వుందిగా? ఆ డైనింగ్ టేబుల్ మీదున్న క్లాత్ ని కాస్త సర్ఫునీళ్లతో తుడువు. ఈ కాళ్లపట్టా సందులో వేసి, అక్కడున్నది యిక్కడెయ్యి. ఈ బూజుకర్ర ఎదురుగా పెట్టకపోతే ఏం పోయిందట. ఇదో గొప్ప కళాఖండం మరి..” మంత్రాలు చదివినట్టు గుక్క తిప్పుకోకుండా ఏదోవొకటి అంటూనే వున్నాడు శ్రీశైలం.

“ఎంత మంచి ఉదయంరా నాయనా. డైరీలో రాసి పెట్టుకొని, వార్షికోత్సవాలు కూడా చేసుకోవొచ్చు” అనుకోగానే నవ్వొచ్చింది పద్మకి. మొగుడు అంటున్న మాటలు సునీతకి చెపితే ఏమంటుంది? సాంతం చెప్పనియ్యకుండా అడ్డం పడి.. “ఆగాగు నేను చెపుతా. ఈ చిల్లులు పడిన డ్రాయర్ ఇంటిముందు ఆరేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇదో పెద్ద జాతీయజెండా మరి. గ్రీన్ కలర్ బెడ్ షీట్స్ మీదకి పింక్ కలర్ పిల్లో కవర్స్ ఎవడైనా వేసుకుంటాడా. ఇంకా నయం, చిలకపచ్చ రంగు దుప్పటిమీదకి మిఠాయిరంగు దిండు కవరు తయారు చేశావు కాదు. అవునూ, అందరిలాగా నువ్వూ కాళ్లతో నడిస్తే వచ్చేవాళ్లముందు నా పరువేం కానూ. ఖాళీ దొరికినప్పుడు టీవీలో ఆ పిచ్చి సంగీతం ప్రోగ్రాములు చూసే బదులు, చేతులతో నడవడం ప్రాక్టీసు చేయొచ్చుగా” అంటుందా?

పదింటికి వస్తానని చెప్పారట మిత్రవింద గారు. ఆవిడ టైమంటే టైమేనట. ఆవిడ రాకని చూసి గడియారంలో ముళ్లు సరిచేసుకోవచ్చట. మిత్రవింద గారికి అది యిష్టమట. మిత్రవిందగారికి యిది గిట్టదట. “మిత్రవింద గురించి యిప్పుడు నాకు తెలిసినంత సమాచారం నా గురించి నాకు కూడా తెలియదేమో” అనుకుంది పద్మ.

ఎలాగైతేనేం నాలుగు యుగాల తర్వాత గడియారం పది గంటలు కొట్టింది. అలా సెకన్ల ముల్లు పన్నెండు మీద నుండీ కదిలిందో లేదో ఒక ఆటో వచ్చి ఇంటిముందు ఆగింది. “మిత్రవింద గారు వచ్చేశారు” అంటూ తగిలేదీ తప్పేదీ చూసుకోకుండా బయటకి పరిగెత్తాడు శ్రీశైలం. మిగతా విషయాల సంగతేమో గానీ పంక్చువాలిటీలో మాత్రం మిత్రవింద గురించి శ్రీశైలం చెప్పింది నిజమే అన్నమాట అనుకుంది పద్మ. హాల్లో వస్తువులన్నీ వుండాల్సినచోట వున్నాయా లేదా అని చూసి ఆమె బయటకి రాబోతుండగా,

“హాయ్ అండీ. మీ సండేని కిల్ చేయబోతున్న రాక్షసిని నేనే” నవ్వుతూ లోపలికొచ్చింది మిత్రవింద.

“అయ్యో అదేం లేదండీ. పిల్లలు కూడా హాస్టల్లోనే వున్నారాయె. పెద్దగా చేసేదేం ఉండదు. ఎవరైనా వస్తే మాకూ హ్యాపీనే” మొహమాటంగా చెప్పింది పద్మ.

“మీరు దేవతండీ బాబూ. నాకైతే ఎవరైనా చెప్పాపెట్టకుండా ఆదివారం మా యింటికొస్తే వొళ్లు మండిపోద్ది” పెద్దగా నవ్వుతూ అంది మిత్రవింద.

“మీకంటే రాసుకోవడం, చదువుకోవడం బోలెడు వర్క్ వుంటుంది. దీనికేముంటాయ్. మొబైల్లో వీడియోలు, టీవీలో వచ్చే పిచ్చి సినిమాలు చూడ్డమే పని” అన్నాడు శ్రీశైలం భార్యని చూపిస్తూ.

“సినిమాలు బాగా చూస్తారా?” పద్మని అడిగింది మిత్రవింద.

పద్మ మాట్లాడబోయేలోగా శ్రీశైలం అందుకొని, “సినిమా అంతా అయిపోయాక, ఏం సినిమా చూశావంటే చెప్పలేదు. ఒక్కోసారి ఇంటర్వెల్ వరకూ వొక సినిమా చూసి, సెకండ్ హాఫ్ యింకో సినిమా చూస్తది. కామెడీ సినిమాలు కూడా మా ఆవిడకి సస్పెన్స్ థ్రిల్లర్ల కిందే లెక్క. నేను యిప్పుడొచ్చే పిచ్చి సినిమాలు అస్సలు చూడను. సెవెంటీస్ లో తీసిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలే సినిమాలు. తర్వాత వచ్చిందంతా జంక్” అంటూ అదేదో పెద్ద జోకయినట్లు పగలబడి నవ్వాడు.

“ఇంట్లో పనులు చేసుకుంటూ, కదలకుండా కూచోని చూడ్డానికి ఎలా వీలవుతుందండీ పాపం. ఏదో వొకటి టీవీలో మోగుతూ వుంటే అదో కాలక్షేపం. ఈ విషయంలో పద్మగారూ, నేనూ వొకటే పార్టీ” అంది మిత్రవింద.

“మీరు మాట్లాడుతూ వుండండి. నేను కాఫీ తీసుకొస్తా” అంటూ వంటింటి వైపు తిరగబోతూ ఆగి, “ముందు కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా? ఇడ్లీ, దోసె మీరేదంటే అది” అంది పద్మ.

“పదింటికి వచ్చినదాన్ని టిఫిన్ చేయకుండా వస్తానా? నేనక్కడికీ శ్రీశైలం గారికి చెప్పాను. నాకోసం ప్రత్యేకంగా ఏమీ చేయొద్దండీ అని. ఏవండీ, ఆ విషయం పద్మగారికి చెప్పలేదా మీరు?” అడిగింది శ్రీశైలాన్ని.

“ఏదో మా తృప్తి కోసం. పల్లీచట్నీతో పాటు అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యి కూడా వున్నాయి. మీరు కాదంటే కుదరదు” అన్నాడు శ్రీశైలం.

“ఇంకే మరి. విడిగా వంటేమీ చెయ్యకండి. కాఫీ తాగేసి, కబుర్లు చెప్పుకుందాం. మధ్యాహ్నం ఆకలైనప్పుడు ఇడ్లీలో దోసెలో అప్పుడే ఆలోచించుకోవచ్చు” అంది మిత్రవింద.

“ఆవిడ అలాగే అంటారు. నువ్వు ముందు కాఫీ తెచ్చిచ్చి, త్వరగా వంట పని చూడు” అన్నాడు శ్రీశైలం.

“మనిద్దరం ముచ్చట్లు పెట్టుకుంటే ఆవిడొక్కరే వంట చేయాలా. దారుణం అండీ. అయినా ఫుడ్ కోసమే అయితే ఏ రెస్టారెంట్ కో పోదును కదా. వంటలో నన్ను కూడా హెల్ప్ చేయనిస్తే సరే. లేదంటే నాతోపాటు మీక్కూడా లంచ్ లోకి ఇడ్లీలే” నవ్వుతూ చెప్పింది మిత్రవింద.

ఆమె జోక్ చేయడం లేదని అర్థమయ్యి శ్రీశైలం నిరాశకి లోనయ్యాడు. అయినా దింపుడుకళ్లెం ఆశ చావలేదు.

“మనం మాట్లాడుకునే విషయాలు తనకి పెద్దగా ఇంట్రస్టు వుండవండీ. హ్యాపీగా వంట చేసుకోనివ్వండి” అన్నాడు. శ్రీశైలం మాటలు పట్టించుకోకుండా పద్మతో కలిసి వంటింట్లోకి వెళ్లింది మిత్రవింద. కాసేపటికి కాఫీ కప్పులతో వచ్చారిద్దరూ.

“వర్కింగ్ వుమన్ అయ్యుండి కూడా ఇల్లు భలే నీట్ గా వుంచారు మీరు. నాకే పనీపాటా లేదు. అయినా మా ఇంట్లో ఏ వస్తువు కనబడాలన్నా కనీసం గంటసేపు వెతకాల్సిందే” దివాన్ కాట్ మీద కూర్చుంటూ చెప్పింది మిత్రవింద.

“ఎప్పుడూ యిలా వుండదులేండీ. మీరొస్తున్నారని కాస్త వొళ్లొంచాం యీ వొక్కరోజు” అంది పద్మ.

“మీ స్కూల్ విశేషాలు చెప్పండి. నాకూ టీచింగంటే చాలా యిష్టం. కానీ వాల్డ్ ఫేమస్ బద్ధకిస్టుని నేను. నా పాషన్ కోసం పిల్లల ఫ్యూచర్ పణంగా పెడితే పాపం తగులుతుందని ఆగిపోయాను” నవ్వుతూ చెప్పింది మిత్రవింద.

మిత్రవింద ఏ వాక్యం మొదలెట్టినా చివరికి నవ్వుతూనే ఎండ్ చేస్తుండడం గమనించింది పద్మ. మిత్రవింద అందంగా వుంది. తన నవ్వు కూడా. ఏదో ఫార్మాలిటీ కోసం అడిగి వూరుకోవడం కాకుండా, పద్మ ఏ సబ్జెక్ట్ చెపుతుంది, స్కూల్లో ఎలాంటి కోకరికులర్ యాక్టివిటీస్ జరుగుతాయి యిలా రకరకాల ప్రశ్నలు వేసింది మిత్రవింద. పద్మ సమాధానాలు చెపుతున్నంత సేపూ మధ్యలో అడ్డుపడకుండా శ్రద్ధగా వింది.

ఈలోగా మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి పాత గజల్స్ ఏవో పెట్టాడు శ్రీశైలం. “నాకు పాత పాటలంటే ప్రాణం. లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన ఒక్క పాట కూడా పూర్తిగా విన్లేదు నేను” గర్వంగా అన్నాడు.

“పెద్ద చిక్కే వచ్చిపడిందైతే. మా పిల్లలు యింట్లో వున్నారంటే టాప్ లేచిపోయే సౌండుతో కేపాప్, ఐమీన్ కొరియన్ పాప్ సాంగ్స్ పెడతారు. మొదట్లో చచ్చినట్టు వినాల్సొచ్చేది. రానురానూ అలవాటైపోయి, ఒక్కదాన్నే వున్నప్పుడు కూడా అవే వింటున్నా” పెద్దగా నవ్వింది మిత్రవింద.

శ్రీశైలం మళ్లీ డిజపాయింట్ అయ్యాడు. దాన్ని కప్పిపుచ్చుకుంటూ, “అలవాటైతే ఏదైనా బాగానే వుంటుంది లేండీ. కానీ, గొప్పవీ అల్పమైనవీ అనే తేడాలు వుండకుండా పోవుగా” అన్నాడు.

“ఏమోనండీ. చిన్నప్పుడు మనకి నచ్చిన పాటలు, పుస్తకాలు, సినిమాలు వాటినే అంటిపెట్టుకోని వుండిపోతే అవుట్ డేటెడ్ అయిపోతామేమో అనిపిస్తుంది నాకు. వేటి గొప్ప వాటిదే” అంది మిత్రవింద.

శ్రీశైలం డిజపాయింట్మెంట్ కాస్తా ఇరిటేషన్ గా మారడం మొదలైంది. అది చాలదన్నట్టు, మిత్రవింద కళ్లలో పడకముందే అతని కథ వున్న కాగితం బీరువాకి అతుక్కోనని మొరాయించి, ఫ్యాన్ గాలికి ఎగిరిపోయి మంచం కిందకి చేరింది. ఏదీ తాను ప్లాన్ చేసుకున్నట్టు జరక్కపోవడంతో శ్రీశైలం ఇరిటేషన్ కాసేపట్లో ఫ్రస్ట్రేషన్ రూపం తీసుకుంది. పైగా.. “లిటరేచర్ యీజ్ రైటింగ్ దట్ యూజెస్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫామ్ అండ్ యీజ్ కన్సిడర్డ్ టు హ్యావ్ మెరిట్ ఆర్ టు బి యింపార్టెంట్” అనే మాటలు కోట్ చేసే సందర్భం రానే లేదు.

ఆరోజు రాత్రి పడుకునేముందు, “మిత్రవింద గారు భలే ఫ్రెండ్లీ మనిషి. అసలు ఒక కొత్త మనిషి ఇంట్లో వున్నట్టే అనిపించలేదు” అంది పద్మ.

“అవును” అని ముక్తసరిగా జవాబిచ్చి వూరుకున్నాడు శ్రీశైలం.

***

మళ్లీ ఆదివారం వచ్చింది. లక్కీగా ఈసారి గెస్టులెవర్నీ పిలవలేదు శ్రీశైలం. తాపీగా ఎండెక్కాక నిద్ర లేచి, కాఫీ తీసుకొని హాల్లోకొచ్చింది పద్మ. సోఫాలో వున్న శ్రీశైలంలో ఏదో తేడా కనబడుతోంది. అతని మొహం ఎర్రగా కందిపోయి వుంది. వేళ్లు వణుకుతున్నాయి. చేతిలో వున్న సండే మాగజీన్ పట్టు తప్పి కిందకి జారిపోతోంది.

“ఏమైందండీ” ఆత్రతుగా అడిగింది పద్మ.

“మిత్రవింద రాసిన కథ పడింది సండే మాగజీన్ లో. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు పోజు కొట్టే ఒక చవటాయి గురించి రాసింది. అందులో వాడు మాట్లాడే మాటలన్నీ నేను మిత్రవిందతో మాట్లాడిన మాటలే. నాకిప్పుడు అర్థమైంది. అసలు ఈ కథ రాయడానికి రీసెర్చి కోసమే మనింటికి వచ్చింది. ఏమనుకుంటుంది నా గురించి. ఇలాంటోళ్లని ఎంతమందిని చూసుంటాను. ఏదో నాలుగు కథలు రాసింది కదా అని మర్యాద యిస్తే, ఇలాగేనా చేసేది? ఎర్రగా బుర్రగా వుంది కదా అని ఏం చేసినా చెల్లిపోద్దా. నిజం చెప్పొద్దూ, నాకసలు తను రాసిన కథలు నచ్చనే నచ్చవు..” దండకం చదువుతున్నాడు శ్రీశైలం.

“అవును. పైగా తనకి దేహవ్యాకరణం కూడా పెద్దగా తెలిసినట్టు లేదు” అంది పద్మ. భార్య ఏమంటుందో శ్రీశైలానికి సరిగ్గా వినబడలేదు. వినబడినా పట్టించుకునే పరిస్థితిలో లేదు. మిత్రవిందలో తనకి ఏమేం నచ్చలేదో ఘాటైన భాషలో ఏకరువు పెడుతున్నాడు.

ఇంతలో ఫోన్ మోగింది. మిత్రవింద నుండీ కాల్. స్క్రీన్ మీద తన పేరు చూస్తూనే శ్రీశైలం అలర్ట్ అయిపోయాడు.

“నా కథ చదివారా?” అంటోంది మిత్రవింద.

“భలేవారే. స్టేటులో ఫస్ట్ రీడర్ నేనే అంటే నమ్మాలి మీరు”, సిగ్గుపడిపోతున్నాడు.

“ఎలా వుంది కథ. నచ్చిందా?” అడిగింది

“నచ్చిందా అని చిన్నగా అడుగుతారేంటండీ. అసలు నేనొక మాట చెప్పనా. మీ కథ చదివాక నాకు సాహిత్యం మీద ఒక కొత్త గౌరవం ఏర్పడింది. నాకేమనిపిస్తుందంటే.. లిటరేచర్ యీజ్ రైటింగ్ దట్ యూజెస్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫామ్ అండ్ యీజ్ కన్సిడర్డ్ టు హ్యావ్ మెరిట్ ఆర్ టు బి యింపార్టెంట్..”

వచ్చేవారం మిత్రవింద గారిని మళ్లీ యింటికి పిలవాలి అనుకుంటూ ఖాళీ కప్పులు తీసుకోని వంటింటి వైపు నడిచింది పద్మ.

*

శ్రీధర్ బొల్లేపల్లి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా బాగుంది శ్రీధర్. యధావిధి గా ఏ అల్ట్రామోడరనో రాసుంటావని మొదలుబెట్టాను. కానీ చాలా ఇళ్లలో ( ఏదో ఓ కోణంలో) ఉండే చవలాయిలను బాగా చూపించావ్.

    ఒకచోట నాకు నేను పద్మనై, నువ్వు సునీతవైన సందర్భాలు గుర్తొచ్చాయ్. 😃

    మొత్తానికి మళ్లీ మిత్రవింద వచ్చిందా?
    వస్తే ఈ సారి శ్రీశైలం కథరాస్తాడేమో చూడు.
    😃😃😃.

  • శ్రీధర్ గారు చాలా బావుందండి కథ!
    మీ నుంచి మరిన్ని మంచి కథలు రావాలని ఆశిస్తున్నాను!

  • ‘అయినా దింపుడుకళ్లెం ఆశ చావలేదు.’ ఎక్కడ/ ఎలా పట్టుకున్నారండీ ఈ వాక్యం! ఎంత బాగా కుదిరింది ఆ సందర్భం. కంగ్రాట్స్!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు