మా అమ్మ ముత్యాలు

మా అమ్మ కథ పెద్దది. అది చెప్పాల్నంటే ముందొక చిన్న కథ చెప్పాలి.

నేనప్పటికి ఇంకా పుట్టలేదు. పెద్దక్క, అన్న, చిన్నక్క మటుకు అప్పటికి ఉన్నరు. చిన్నక్క నెలల బిడ్డంట. రోశమ్మవ్వ ఇంట్ల మేం కిరాయికి ఉంటుండె. నేనుగూడ అదే ఇంట్ల పుట్టిన. అప్పట్ల ఇండ్లకు కాంపౌండ్ వాల్లు ఎక్కడియి? ఇంటిసుట్టూ చిన్న చిన్న చెట్లు పెంచుతుంటిరి.

అది మంచి ఎండాకాలం. ఇంట్ల ఫ్యాన్లు గిట్ల ఏం లేవు. చిన్నక్కకేమో జరమొచ్చింది. నాన్న, ఇంకిద్దరు లోపట పండుకున్నరుగానీ, చిన్నక్కని పక్కకేసుకొని, తలుపు తీసి గనుమ కాడ మెత్తేసుకొని పండుకున్నదంట మా అమ్మ.

ఏ రాత్రికాడనో సప్పుడులేకుండ ఒక దొంగ జొరబడ్డడు. మా అమ్మ చెవులకి ఇంతింత లావు గంటీలు ఉండేటియంట. మంచి బంగారమాయె. ఆ దొంగోడు మా అమ్మ చెవు కత్తిరిచ్చి ఆ గంటీలు ఏస్కపోయిండు.

అప్పట్నించి మా అమ్మ మళ్లా చెవులు కుట్టిచ్చలేదు. ఎడమపక్క చెవి గింతంత తెగి పక్కకి జరిగి ఉంటది. నాకు ఆ గింతంత చెవి ముక్క పట్టుకొని మా అమ్మ పక్కన కూసొని ముచ్చట చెప్పుడంటే పిచ్చి ఇష్టం.

“అమ్మా! ఈ చెవు కుట్టిచ్చుకోరాదే!” అని నేనడిగితే, “ఎందుకురా!” అంటదిగానీ, అటుదిక్కు ఆలోచించదు.

మా పెద్దమ్మలు, మా పాలోండ్ల ఇండ్లల్ల ముసలోళ్లు.. ఎవళ్లకయినా పెద్ద పెద్ద గంటీలు ఉంటయి. అయి చూసినప్పుడల్లా మా అమ్మకుగూడ అవి ఉంటే ఎట్ల ఉంటయో అనుకుంటుంట.

నేను మా అమ్మ చెవి పట్టుకొని అట్ల ఏదన్న కథ చెప్పమని అడుగుతనా, ఎక్కడెక్కడియో చెప్తది. నేనియ్యాల ఏ కథ చెప్పినా, అది మా అమ్మకాడ నేర్చుకున్నదే అన్నట్టు ఉంటది.

కుటుంబం మొత్తంల అందరికంటే చిన్నది మా అమ్మ. మా పెద్ద పెద్దమ్మ బిడ్డ, మా అమ్మ ఒక్కతోటోళ్లంటేనే ఆ తరంల మా అమ్మ ఎంత చిన్నదో అర్థం చేస్కోవచ్చు.

ఇంతమంది ఉన్నకాడ ఎట్లుంటది? అన్నలతోటి పొలంకాడికి పోవుడు, ఏమన్న పనుంటే చేసుడు, లేకుంటే దోస్తులతోటి ఆట. ఈత మస్తు కొట్టేదంట మా అమ్మ. అట్ల ఆడుకుంట, పనిచేసుకుంటనే ఉన్నది, ఒకరోజు మా అమ్మమ్మ వచ్చి, “నీకు పెండ్లి చేస్తున్నమే!” అన్నదంట.

మా నాన్న నేరళ్లపల్లి నుంచి వింజమూరికి మా అమ్మని చూస్తానికి నడిచొచ్చిండని చెప్పిన కదా, అయ్యాల మా అమ్మ ఎవరో దోస్తుల ఇంట్ల దాసుకున్నదంట. రానంటే రాను అన్నదంట. “ఈన బక్కగ, ఇంత ఉన్నడు” అనిగూడ అన్నదంట.

మా అమ్మమ్మ గట్టిదని చెప్తడు మా నాన్న.

“గానికేం ఇచ్చి చేస్తరే! ఎక్కడ్నో నల్లగొండల ఉంటడంట. ఏముంటడో, ఏం తింటడో..” అని ఇంటి పక్కనోళ్లు, ఆళ్లు ఈళ్లు అంటుంటే..

“ఎహెయ్.. ఆనికేం తక్కువనే? మన గొల్లోండ్లల్ల ఎవ్వనికన్న అంత పెద్ద ఇల్లు ఉన్నదా? భూమిగూడ ఉన్నది ఆళ్లకు” అని గట్టిగ అందర్నీ సముదాయించిందంట.

అట్ల, మా తాత తొమ్మిదర్రల ఇంట్లనే మా అమ్మకి మా నాన్నతోటి పెండ్లయింది. పెండ్లికి ముందటినుంచే మా నాన్న నల్లగొండల ఉన్నడు కదా, పెండ్లయినంక ఇద్దరు కలిసొచ్చిన్రు.

అదే ఆబ్కారోళ్ల ఇంట్ల సంసారం. మా నాన్న వాళ్లు చెప్పింది చేసే రకమైతే, మా అమ్మ అట్లగాదు. గట్టిగ మాట్లాడుతది. నాన్నతోపాటే ఆ పని, ఈ పని చేసేటిది అమ్మ. ముసలామ కొడితే నాన్న ఊకున్నడేమోగానీ, అమ్మయితే ఒక్క మాటన్నా, “ఏందమ్మా నీ కద?” అని గొడవకి దిగేదంట.

ఆ తర్వాత మా నాన్న ఆ పని ఈ పని అని పనులు మారినట్టే ఇండ్లు కూడా మారిన్రు. రోశమ్మవ్వ ఇంటికి, ఆనించి శకుంతలాంటి ఇంటికి మారినం.

మా అమ్మ చదువుకోలేదుగానీ తెలివైనది. మా నాన్న ఏమన్న పనిచేసి పైసలు చేతుల పెడుతడు అంతే. ఆ గిన్ని పైసలతోటి మా చదువులేంది, ఇంటి ఖర్సులేంది? ఎట్ల ఎల్లదీయసేదో అమెకే తెల్వాలి.

“కరంటుబిల్లు కట్టిన్రా? నల్లబిల్లు కట్టిన్రా?” అనిమటుకు అడుగుతడు మా నాన్న ఇప్పటికీ. “అయి కడితే సంసారం అయితాదిరా” అని అమ్మ తిడుతుంటది.

ఇట్లనే మా నాన్న కథలు మా నాన్న పడుతనే ఉన్నడు, మా అమ్మ అమ్మ తీరుగనే ఇల్లు చక్కబెడుతున్నది. గొల్లవాడకట్టనే కాదు, ఎక్కడికిపోయినా “ముత్యాలమ్మ బిడ్డలు” అనే చూసేటిది మమ్ముల్ని.

మేం మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఖర్సులు ఏమున్నయని? అపుడు పైసలు బానే ఉండేటియంట. అయి అట్లనే దాచిపెట్టి ఇల్లో, భూమో కొంటే ఎట్ల ఉండెనోగానీ,

“నెల తిరగంగనే ఇస్తనే చెల్లమ్మా”, “ముత్యాలమ్మా, సంసారం ఎల్తలేదు. ఎయ్యి రూపాలుంటే ఇయ్యమ్మా” అని ఆళ్లు ఈళ్లు అప్పుగ పట్టుకపోయేటోళ్లు. నోటు గీటు ఏం లేదాయె. అంతా నోటి మాటనే.

మేం జెర పెద్దగయినంక ఇయన్నీ చెప్పేటిది అమ్మ. ఒకడున్నడూ.. వాళ్లు ఇంట్ల కొత్తది ఏం కొన్నా నేను గమనిస్తుండె.

“అమ్మా, ఆళ్లు బీర్వా కొన్నరే”, “అమ్మా, ఆళ్లు ఇస్త్రీ పెట్ట కొన్నరే” అంటుండె. ఆళ్లు మనకు అప్పు తీర్చకపోతిరి, మనదగ్గర లేనియి కూడా ఆళ్ళ దగ్గర ఉన్నయి కదా అన్నది నా లెక్క. అమ్మ నవ్వేటిది. ఎన్ని ఉన్నా, ఏమయినా ఇంటికి ఎవళ్లొచ్చినా రానిచ్చేది.

నా చిన్నప్పుడు మా వాడకట్ట మొత్తంల మా ఇంట్లనే టీవీ ఉండేటిది. రోజూ మా ఇంట్ల జాతరే. ఆ దూరదర్శన్‌ల వచ్చే సీరియళ్లు, సినిమాల కోసం అందరు మా ఇంట్ల పోగయ్యేది.

ఒకసారి మా ఎదురింట్ల ఉండే తాత సచ్చిపోయిండు. ఆయన మనవడు నాతోటోడు. దినాలు అయ్యేదాంక మైల ఉంటదని ఇంట్లకి రానియ్యరు కదా! వాడు ఇంట్లకి రాకుండా బైటనే అరుగు మీదనే కూసొని టీవీల వచ్చే సినిమా మాటలు వింటున్నడు.

మా అమ్మ వాడ్ని చూసి, “ఈడ కూసున్నవేంరా, ఇంట్ల కూసుందువుపా” అన్నది.

వాడేమో మైల ఉండేగదనే అన్నట్టు చూస్తుండె. మా అమ్మ అట్లాంటిదేం లేదన్నట్టే లోపల కూసోమన్నది. అట్ల ఉంటది మా అమ్మ కథ. లిబరల్ అంటం కదా, అచ్చం దానికి ఆ తరం రూపంలెక్క.

బళ్లనైతే నా దోస్తులు చానామందికి వాళ్ల ఇండ్లు కాక ఇంకేదన్న ఇల్లున్నదంటే అది మా ఇల్లే. అట్ల చూసుకునేది. పెండ్లి అనంగనే ఎక్కడ్నో పోయి దాసుకున్న మా అమ్మే ఇంత సంసారం ఎట్ల నెట్టుకొచ్చిందా అనిపిస్తుంటది నాకు.

మా అమ్మ నన్ను ఎప్పుడూ పెద్దగ కొట్టలేగానీ, ఒకసారి కొట్టింది నాయనా!

నేనప్పుడు మూడో తరగతో ఏదో చదువుతున్న. ఎందుకోగానీ బడి ఎగ్గొడుతూ ఉన్న కొన్నిరోజులు. గుట్టలెక్కుడు, కుంట దగ్గరే తిరుగుడు, ఏదోదే చేస్తుండె. పది, పదిహేను రోజులు ఇదే కథ. ఒకరోజైతే అటో ఇటో చేసి బళ్ల బడేసినంకగూడ, ప్రేయర్ అయితుంటే, అందరు వందేమాతరం పాడుతుంటే, బడిగేటు తీస్కొని మరీ పారిపోయి ఇంటికొచ్చిన.   మా మేడమ్, బడికి హెడ్మాస్టరు, “వాడ్ని పట్టుకరాపోవే” అని మా చిన్నక్కను పంపింది. చిన్నక్కంటే నాకంటే రెండేండ్లే పెద్దది.

చిన్నక్క ఉరుక్కుంట ఇంటికొచ్చేసరికి నేను ఇంట్ల మల్లెచెట్టు చాటుకు కూసున్న. చిన్నక్క అమ్మకి ఇదంతా చెప్తదని తెలుసు. “నేను రానుపో” అని ఇంట్లంచి పారిపోయిన.

మా అమ్మకు ఇదంతా తెల్సింది. ఇగ చూస్కో, “మావోడు ఇటేమన్న వచ్చిండా?” అని దెవలాడుకుంట అంతటా తిరిగి నన్ను వెతికి పట్టుకున్నది.

ఇంట్లకి ఈడ్సుకపోయి ఎట్ల కొట్టిందంటే..! మంచానికి కట్టేసి కండ్లల్ల కారంపొడి కూడ పెట్టింది. అయినాగూడ నా తీరు మారలేదు.

ఏం చెయ్యాల్రా దేవుడా అని పూల్‌మీద మంత్రమేసే ముస్లిమాయన దగ్గరికి తీస్కపోయి ఒక తాయెత్తు కట్టిచ్చింది.

అదేం లెక్కనో ఏందోగానీ, ఆ తర్వాత నేను బడి ఎగ్గొట్టిన పాపాన పోలేదు. ఎప్పుడు పరీక్షలొచ్చినా నేనే ఫస్ట్ అన్నట్టు. మా అమ్మగూడ ఆ తర్వాత నన్నెప్పుడూ కొట్టినట్టు గుర్తులేదు.

నేను పెద్దోడ్నయి ఈ కథలు రాసుడు కూడ మొదలై, హైదరాబాద్‌లకి వచ్చి పడ్డంక, ఆ మధ్య జబ్బుబడి ఆరేడు నెలలకు పైననే ఇంట్ల ఉన్న.

ఆ కొన్ని నెలలు నేను మా అమ్మ పక్కన్నే, మా అమ్మతోటే ఉన్న సంతోషమేమోగానీ, ఆమెకైతే నరకం. “ఏందీ, కొడుక్కి ఇట్లయిపాయె” అని ఎవ్వలికైనా ఉంటదిగా.

నాకంతా నిమ్మలం కావాలనీ, అట్లనే ఏ దిష్టి కూడ తగలొద్దని ఒక తాయెత్తు తెచ్చి నా జబ్బకి కట్టింది. ఆ తర్వాత బాగైనంక దాన్ని తీసి మెడకి కట్టింది.

ఎక్కడ్నో వింజమూరు నుంచి వచ్చి నల్లగొండల, ఇంతపెద్ద సంసారాన్ని నడిపిచ్చి, ’ముత్యాలమ్మ అంటే.. ఆ.. ఈ పేరుంది’ అని ఒక పేరు తెచ్చుకున్న మా అమ్మే..

ఎప్పుడన్నా నేను చిన్నప్పుడు బడి ఎగ్గొట్టిన రోజులు గుర్తుచేస్తే, “అయ్యాల తాయెత్తు కట్టినంకనే మంచిగైండు” అంటది.

ఇయ్యాల్టికీ ఇంటికి పోయినప్పుడల్లా నేను అమ్మ చెవు పట్టుకొని ఆడుకుంటుంటే, ఆమెనేమో, నా కాలర్‌ని చిన్నగ ఎనుకకి జరిపి, నా మెడకి తాయెత్తు ఉన్నదా లేదా అని వెతుక్కుంటది.

*

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • Super malli nenu chaduvtunatlu ledu Antha kallara marokkasari chustunatlu undi mana Balyam nati vishyalu…..

  • నిజంగా అమ్మ చాలా గ్రేట్ బ్రదర్ … చదువుతుంటే అంతా కళ్లముందే జరుగుతున్న అనుభూతి కలుగుతుంది… మీ నారేషన్ సూపర్…. అప్పుడే అయిపోయిందా అనిపించింది…. ❤️❤️❤️

  • Bagundi anna. అప్పుడే కథ అయిపోయిందా అనిపించింది.. అమ్మ గురించి రాయడానికి పెద్ద పెద్ద పదాలు,ప్రయోగాలు చేయక్కర్లేదు.. ఇలా గుండెలో కాస్త తడి ఉంటే చాలనిపించింది.. మనసులు పిండేయచ్చు..

  • మా అమ్మ సంగతి నాకు తెలియదు కాని నన్ను పెంచిన నాయనమ్మ కథ కూడా ఇదే తీరు.. ముక్యంగా ఎవరొచ్చి కష్టం చెప్పినా కరిగిపోయి చేతిలో డబ్బులు ఇచ్చేసేది..నేను కూడా మీ లెక్కనే మా దగ్గర డబ్బు తీసుకుపోయి మాకు తిరిగి ఇచ్చేవారు కాదు..వాళ్ళు మాత్రం అన్ని కొనుకునేవాళ్ళు అదే అడిగేదాన్ని..కథ అంత కూడా కథ లా లేదు..జీవితం లా ఉంది..

  • చదూతుంటే కండ్లెమ్మట నీళ్ళు తిరిగినయ్…నువ్వేమో అమ్మ చేవుల్తో ఆడుకుంటుంటే ,అమ్మేమో నీ తాయెత్తు ఎతుకుడు… అయాల పెండ్లి జేస్త అంటే దాసుకున్న అమ్మేన ఈయల ఇంతటి సంసారం లాక్కోస్తంది

  • మీ అమ్మగారి గురుంచి నా నమస్సులు అన్నా

  • ఆ రోజుల్లో ఆణిముత్యం మా “ముత్యాలమ్మ”.. చాలా బాగుంది అన్న.. అమ్మ గుర్తొచ్చింది ఒక్కసారి..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు