మాటంటే వుత్త గాలి కాదు

నేనొక హంతకుడిని
పుట్టిన పసిపిల్లను
చంపి పాతరేసిన హంతకుడిని

నేనొక హంతకుడిని
పొట్ట పూదోటలో పుట్టిన శబ్దాన్ని,
నాభిలో
నరం లేకుండానే పుట్టిన శబ్దాన్ని,
గొంతు దాకా సాకీ..
గొంతులో పెట్రోలు పోసి కాల్చేసిన హంతకుడిని

మాటను చంపుకునేలా
నేను శూన్యంలోకి జారిపోయానా..
***

నేనొక నమ్మకద్రోహిని

అవును
మాటంటే
పుట్టిన పసిపాపలాంటి శబ్దపు ఉండ
కొత్త వ్యక్తీకరణ కోసం
ఊహకూ ఆశకూ పుట్టిన
లేలేత శ్వాస
నునులేత వసంతాల పూత

మాటంటే వుత్త గాలి కాదు
మనిషిలోని సంఘర్షణ

అవును
మాటంటే కొత్త లోకానికి నాంది
సంభాషణా ప్రపంచంలో కొత్త ఊపిరి
మనిషిగా బతకడం కోసం
మనిషి చేసే సాధనం
మనసు మోసే నీటిమూట
అలోచనలు మోసే వాయుగుండం

మాటను పుట్టిస్తే
మనలోని పక్షులకు రెక్కలు మొలుస్తాయి
మాటను చంపుకుంటే
మనలోని మనుషులకు రెక్కలు తెగిపోతాయి

సంభాషణ అంటే
ఆకలి తీర్చే తల్లిపాల వంటిది
సంభాషణ అంటే
అన్నదాత హృదయమంత గొప్పది

గాలితో సంభాషించడానికి
గాలిలాంటి గాలి కావాలి నాకు
మేఘాలతో సంభాషించడానికి
ఆవిరి లాంటి ఆవిరి కావాలి నాకు
నాతో నేను.. ఇతరులతో నేను..
అందంగా సంభాషించడానికి కళాత్మకమైన ప్రక్రియ కావాలి నాకు

నా ప్రేమకు నేను కవిత్వం చెప్పుకోవాలి
నా హృదయానికి నేను కవిత్వం చెప్పుకోవాలి
నన్ను వెలివేసిన వారితో నా కవిత్వమే మాట్లాడాలి
నన్ను ప్రేమించిన వారితోనూ నా కవిత్వమే మాట్లాడాలి
కవిత్వం చెప్పడానికైనా
కవిత్వంలా బతకడానికైనా
నాకొక కళాత్మకమైన గాలికావాలిప్పుడు

అవును కదా
మాటంటే కళాత్మకమైన గాలి కదా
మాటంటే కళాత్మకమైన రంగు కదా
మాటంటే కళాత్మకమైన వర్షం కదా
మాటంటే కళాత్మకమైన నిప్పు కదా
మాటంటే…
మనిషి కనుగొన్ను రెండవ నిప్పు కదా!

మాటంటే
మనలో మనసు కనుగొన్న పచ్చితనం
మాట్లాడటమంటే
ఇతరులకు మట్టివాసన పంచడానికి
మనలో మనం మట్టిని ఏర్పరుచుకోవడానికి
మనలను మనమే తొవ్వుకునే ప్రక్రియ

మాటలేం చేస్తాయి
మనలోని మనిషిని ప్రతిబింబించడానికి
అద్దంలాంటి ఎండుసముద్రం కరిగి
జీవనదుల్లా ప్రవహిస్తాయి
మనల్ని గెలిపిస్తాయి

అయినా..ప్రేమించుకోవడం కోసం
అలలు అలలుగా మాటలే కావాలా..??
మాటలూ కావాలి.

నేనొప్పుకోను
మాటలెంత నిజమో
మౌనమూ అంతే నిజం
అందుకని
చూపులవాసన గుప్పకుండా
శబ్దపురవ్వల సవ్వడి లేకుండా
ఏ కదలికలూ ఏ ఉత్తరాలూ లేకుండా
నిశబ్దం కూడా సంభాషణకు పరికరమేనంటే
నేనొప్పుకోను

ఇద్దరి మనుషుల మధ్య నిశబ్దం
హృదయాలను పీక్కుతినే మహమ్మారి;
ఇద్దరి మనుషుల మధ్య నిశబ్దం
భయంకరమైన శూన్యాన్ని గెలిపించే మోసకారి!

ఇంతకూ శూన్యమంటే..??
మానవసారాన్ని మసిచేసే బడబాగ్ని
సముద్రభాషనుసైతం బూడిద చేయగలిగే రోగం
నిశబ్దం కారణంగా మనిషికి ఏర్పడే మరణం
జీవంతోనే వున్న మనిషి
తానొక శవమని భావించే మానసిక స్థితి!
ఇద్దరి మధ్య సంభాషణ చచ్చిపోతే
పండుగ చేసుకునే అజ్ఞాత శత్రువు

అసలు శూన్యమంటే ఏమిటో
ఒకేఒక్క వాక్యంలో చెప్పనా..

మనిషి కుమిలికుమిలి చావడానికి మాత్రమే పనికొచ్చే
ఒక విష పదార్థం!

*

దొంతం చరణ్

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత చాలా బాగుంది. మీ వ్యక్తికరణ నునులేత తామరాకు పైన పడిన నీటి బిందువు లాగా అందంగా ఉంది.

  • వ్యక్తీకరణ బాగుంది మిత్రమా

  • మాట
    ఒక విషపదార్థం !
    చాలా గొప్పగా చెప్పారు.

  • ఏమిటి ఈ కవి / రచయిత బాధ.. దేనికోసం తన గోల అనిపించి అర్ధం కావు చాలా రాతలు. పాఠకుడు కూడా తనలోకి చూసుకొనేలా, తనను తాను బేరీజు వేసుకొనేలా చేసే రచనలు అరుదు. ఆ రెండో కోవలో కళాత్మకమైన కవిత రాశావు.. థ్యాంక్యూ చఱణ్.

  • మాటలు కరువౌతున్న ఈ కాలానికి …వాటి విలువ తెలియజేసే మాటలు అవసరం. నీ సున్నిత హృదయానికి నీ కవిత్వం అద్దంపట్టేదిగా ఉంది. అభినందనలు చరణ్. 🌺💐

  • అద్భుతమైన కవిత మిత్రమా💐💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు