మహమ్మద్ ఖదీర్‌బాబు కథ – ‘ఆస్తి ‘

దేవుడు-దెయ్యమూ
వెలుతురులో నీడలూ
కలిమిలో లేమీ
ఎదిగినట్లే ఎదగడంతోబాటు ఎన్నెన్నో మెట్లు దిగిపోవడాలూ
ఎవరు నమ్మినా ఎవర్ని నమ్మినా ఎప్పుడు కాటు వేస్తాయో తెలియని కాంక్షా సర్పాలు
వొడ్డుకి చేరుకోలేని పడవలు
చేరవేయలేని తెడ్లు
అల్లుకున్నా విడివిడిగానే ఉన్న కొన్ని జీవితాల గాథ ఇది
దీనికి బాధే – ఆస్తి!

ఆస్తి

మహమ్మద్ ఖదీర్‌బాబు

 

ఆ యిల్లు చూడగానే గతుక్కుమన్నాడు.

గురువుకు ఎప్పుడో తప్ప గంట కొట్టదు. ఆ సంగతి శిష్యుడికి తెలుసు.

‘ఏం హుజూర్?’ అన్నాడు.

‘చూడాలి యజమాన్’ అన్నాడు హుజూర్.

కొందరికి దేవుడు వేరే ఏమీ ఇవ్వకపోయినా మంచి ఒడ్డూ పొడుగూ ఛాయా ఇస్తాడు. మరి అవే వాళ్లకి రక్ష. హుజూర్ ఆరడుగులకు తక్కువ కాకుండా ఉంటాడు. పెద్ద ఛాతీ. తడిగా ఉండే కళ్లు. మెరిసే ముక్కు. చుబుకాన్ని కప్పేసి కంఠం దాకా దిగిన నల్లటి గడ్డం. గట్టిగా ముప్పై ఉండవు. కాని పెద్దరికంలో తేడా ఏమీ రానివ్వడు. బిగువు సడలనివ్వడు. ఒకటి మాట్లాడే చోట ఒకటే. ఆరు మాట్లాడాల్సిన చోట పన్నెండు. చేతులు ముందుకు సాచి కదిలిస్తూ మాట్లాడతాడు. వేళ్లకు రకరకాల ఉంగరాలు. రాళ్లవి. వెండివి. రాగివి. బొటనవేళ్లకు కూడా తప్పవు. మంత్రగాడంటే ఆ మాత్రం హడావుడి ఉండాలి.

‘అడగనా హుజూర్’ అన్నాడు శిష్యుడు.

‘ఒక్క నిముషం యజమాన్’ అన్నాడు హుజూర్.

సరిగ్గా నిలబడి తనను తాను చూసుకున్నాడు. పాలనురగలాంటి తెల్లని జుబ్బా. కింద అంతకు తక్కువకాని పైజామా. వినిపించేలా చప్పుడు చేసే షోలాపూర్ చెప్పులు. చేతిలో పాతకాలం నాటి లెదర్ బ్యాగ్. అందులో తావీజులు, నల్లదారాలు, ఎర్రదారాలు, ఆకుపచ్చటి వస్త్రం కట్టిన టెంకాయలు, నిమ్మకాయలు, తెల్లకాగితాలు, రాగిరేకులు, బల్‌పాయింట్ పెన్ను… ఒక ఆల్బమ్… సినిమా యాక్టర్లతో దిగినది.

‘అడుగుతాను హుజూర్’

‘నువ్వాగరారే’

బ్యాగ్ జిప్పు తీసి కొత్తగా పెరపెరలాడుతున్న ఆకుపచ్చ వస్త్రాన్ని తీసి వీపుకు తోక దిగేలా తలకు చుట్టుకున్నాడు. రెండు చేతులతో రెండువైపులా చెవులమీదకు సర్దుకున్నాడు. స్థిరపడ్డాడు. ఇప్పుడు హుజూర్ అచ్చు దేవుడి బంటు. హుజూర్ ఏది చెప్తే అది దేవుడు వినక తప్పదు. హుజూర్ ఏది ప్రార్థిస్తే దేవుడు అది ఆలకించకా తప్పదు. ఇక హుజూర్ పాదం పెట్టిన చోట శాకినీలు డాకినీలు ఏం ఉంటాయి?

‘ఇప్పుడు పో’ అన్నాడు.

శిష్యుడు గార్డ్ రూమ్ దగ్గరకు వెళ్లి చేయి ఆడించి హుజూర్ వైపు చూపించాడు.

‘ఏంటి’

‘మా గురువుగారిని మీ అమ్మగారు రమ్మనమని చెప్పారు. వచ్చాం. అమ్మగారికి చెప్పు.’

గార్డ్‌కి సదభిప్రాయం కలగలేదు. ఆ ఇంటికి దాదాపుగా ఎవరూ ఆటోలో రారు. ఇలాంటి వాళ్ళు తప్ప.

గార్డ్ ఇంటర్‌కమ్ నొక్కి ఏదో మాట్లాడాడు. తర్వాత ఫోన్ పెట్టేసి గేట్ తెరిచాడు.

పూర్తిగా టేకుతో చేసిన మందమైన గేటు అది. పలక మీద సూక్ష్మమైన నగిషీ ఉంది. అంచులకు తెల్లగా పట్టీ ఉంది కానీ అది వెండిది అని చెప్తే తప్ప ఎవరికీ తెలియదు.

శిష్యుణ్ని గార్డురూమ్‌లోనే కూర్చోబెట్టి లోపలకి అడుగుపెడితే గేట్‌నుంచి మెయిన్ డోర్ వరకూ చిన్న వంకరతో వేసిన దారి. అంచుల్లో తెల్లగా మిలమిల్లాడుతున్న అన్‌పాలిష్‌డ్ పెబల్స్. ఇరువైపులా తడిసి సేద తీరుతూ పచ్చగా మెరిసిపోతున్న లాన్. ఎడమవైపు చిన్న వాటర్‌బాడీ. దాని అంచుల్లో తుప్పల్లా సోకు చేసిన మొక్కలు. జారుతున్న నీళ్లు. నీళ్లల్లో మెరుస్తున్న ఎర్రటి నల్లటి చేపలు. నీళ్ల మడుగులో స్తబ్దుగా తామర ఆకులు.

హుజూర్ ఆగిపోయాడు.

ముందుకు వెళ్లడానికీ లేదు. వెనక్కి వెళ్లడానికీ లేదు.

కుడివైపు లాన్‌లో నల్లటి కేన్‌బెడ్‌ మీద ఒక కుక్క తీరిగ్గా కూచుని హుజూర్ వైపే తీరిగ్గా చూస్తూ ఉంది. అది ఏమీ అనట్లేడు. కాని హుజూర్ గుండెలు దడదడలాడిపోయాయి. ఆ కుక్క ఏనుగంత ఉంది. వేగంగా కదలడానికి వీల్లేనంత పెద్దదిగా ఉంది. అది కరవక్కర్లేదు. దగ్గరగా వచ్చి గట్టిగా మొరిగితే చచ్చిపోతారు.

గార్డ్‌కి ఇది అలవాటులా ఉంది. వెనుకనే వచ్చి – ఏయ్… ఫెబీ… చుప్.. చుప్- అని తోడుగా మెయిన్ డోర్ వరకూ వచ్చి డోర్ తెరిచి లివింగ్ రూమ్‌లో కూచోపెట్టాడు.

అంతవరకూ ధైర్యంగా వచ్చాడుగాని హుజూర్ కాళ్లూచేతులు ఎందుకనో చల్లగా అయిపోయాయి. వీళ్లకు ఎం కావాలో. తాను ఏం చేయాలో.

తాను పనిచేసే పెద్ద దర్గాకి ఇలాంటి శ్రీమంతులు చాలామంది వస్తుంటారు. ఫాతెహాలు… నిద్రలు… మొక్కులు… పొట్టేళ్లని జుబాహ్ చేసి అన్నదానాలు… వాళ్లకు తృప్తి ఉండదు. ఇళ్లకు వచ్చి అంత్రాలూ మంత్రాలూ చేసి వెళతారా అని అడుగుతారు. దర్గాలో మెరికల్లాంటి ముజావర్లు, మంత్రగాళ్లు ఉన్నారు. కాని చూపు హుజూర్ మీదే పడుతుంది. తెల్లగా వర్చస్సుతో వెలిగిపోతున్న హుజూర్‌లాంటి వాడే ఇలాంటి వాటికి యోగ్యుడని అందరూ భావిస్తారు. సాధారణంగా అన్నిచోట్లా ఇలాగే జరుగుతుంటుంది. హుజూర్‌నే అడుగుతారు చార్జీలు ఇస్తాం రండి… వచ్చాక మీరడిగింది ఇస్తాం రండి.

చెన్నై. బెంగుళూరు. హైద్రాబాద్.

ప్రతిచోటుకూ శిష్యుణ్ని తీసుకొనే బయలుదేరుతాడు.

శిష్యుడికి ఏదో తెలుసని కాదు. మాటసాయానికి అంతే.

హుజూర్ సౌకర్యంగా కూచోడానికి మొహమాటపడుతున్నాడు. సోఫా చాలా మెత్తగా ఉంది. కింద ఫ్లోరింగ్ నున్నగా ఉంది. చాలా తెల్లగా ఉంది. పాదానికి మురికి ఉంటే అందులో కనిపిస్తుంది.

పైన షాండ్లియర్ లోని క్రిస్టల్స్ చాలా నాణ్యమైనవి.

వాటి మీద ఈగ వాలలేదు. వాలి నిలవలేదు. ఇక లివింగ్ రూమ్ కోసమే అన్నట్లు ఒక పాలరాయి విగ్రహం – స్త్రీది – బట్టలు ఉండీ లేనట్టుగా ఉంది.

లివింగ్ రూమ్ అంతా చక్కటి సువాసన.

హుజూర్ భుజాల కింద రాసుకున్న జన్నతుల్ ఫిర్‌దౌస్‌ను వాసన చూసుకుని సిగ్గుపడ్డాడు. అన్ని లోపాలకూ విగ్రహమే జవాబు. నిటారుగా కూర్చున్నాడు.

పనిమనిషి వచ్చి కాఫీ ఇచ్చింది.

ఇలాంటి చోటికి వస్తే ఎంతలేదన్నా రెండు గుప్పిళ్లు కొడతాడు ఖాయంగా. గుప్పిట అంటే అతడి భాషలో అయిదువేలు. ఎప్పుడో తప్ప మూడు నాలుగు గుప్పిళ్లు తగలవు. ఒకసారి చెన్నైలో ఐదు గుప్పిళ్లు దక్కాయి. ఆ ఇంటి యజమాని పనిమనిషిని మరిగి ఆస్తంతా ఆమెకు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నాడు. ఇల్లాలు దర్గాకు వచ్చి పనిలో పనిగా హుజూర్‌ని పిలిపించింది చెన్నైకి. సంగతి చెప్పి ముక్కు చీదింది.

ఆమె ఏడుపులో అర్థం ఉంది.

ఇలాంటి వాటికి విరుగుడు హుజూర్‌కు చిటికెలో పని. ఒక బతికి ఉన్న పిల్లి మీసాలు కావాలి. ఒక బతికి ఉన్న ఎలుక మీసాలు కూడా.   పిల్లి మీసాల మీద మగవాడి పేరు ఉఛ్ఛరించి – ఎలుక మీసాలమీద ఆడదాని పేరు ఉఛ్ఛరించి – అంతకు మించి చెప్పకూడదు. సరే. మొత్తం మీద ఇరవై ఒక్క రోజుల్లో వాళ్లిద్దరి మనసులు విరిచేస్తాను అని సవాలు చేశాడు హుజూర్. అలాగే జరిగింది.  అప్పుడు ఆమె హుజూర్‌కు ఐదు పిడికిళ్లు సమర్పించుకుంది.

అలాగని హుజూర్ అన్నీ ఒప్పుకోడు.

ఒకసారి చెనైలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలిపించి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ మీద చేతబడి చేయించాలని చెప్పాడు. చేతబడి చేయించడమంటే కశ్మలానికి వికృతరూపం ఇచ్చి ప్రాణం పోయడం. అది ఎడుటివాణ్ణే కాదు మంత్రగాణ్ణి కూడా తినేస్తుంది.

నేను చేయను అని చెప్పి వచ్చేశాడు హుజూర్.

ఇది కొంచెం నయం. ఇంకోసారి ఇంకా దాఋణం.

ఆ రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అర్థరాత్రి తలుపు తట్టారు. తెరిచి చూస్తే ఇంటి బయట కొత్త ఖరీదైన బండి. చెన్నై  నుంచి వచ్చిందట. ఇప్పటికిప్పుడు చెన్నైకి తీసుకెళ్లి తెల్లారే హైద్రాబాద్ ఫ్లయిట్ ఎక్కిస్తారట. హైద్రాబాద్ చేరేసరికి అక్కడ ఒక హీరో పరిస్థితి బాగలేదు. తాగి తాగి ఉబ్బిపోయి ఉన్నాడు.

హుజూర్‌ని చూసి – ఫలానా హీరోయిన్ ఫలానా హీరోని మరిగింది – అది నాక్కావాలి – వశీకరణం చెయ్యి – అని ఐదు లక్షల సూట్‌కేస్ టీపాయ్ మీద పెట్టాడు.

హుజూర్‌కు ఇలాంటిది కొంచెం సాధ్యం కాదు.

‘అలా జరగడం కష్టం’ అని మర్యాదగా చెప్పి చూశాడు.

హీరో విన్లేదు. హుజూర్‌ని గదిలో పెట్టి తాళం వేశాడు. అప్పుడు దేవుడా – హుజూర్ ఎవరితో మొరపెట్టుకున్నాడో చెప్పడం కష్టం. పై ప్రాణాలు పైనే పోయాయి. హీరోకి మూడోరోజు మత్తు దిగితే నాలుగోరోజుకు బయటపడి ఊరు చేరుకున్నాడు.

హుజూర్‌కు గట్టిగా ఐదారు పనులు వచ్చు.

పిల్లలు కీడు చేసి ఏడుస్తారు – తాయత్తు కడతాడు. పని చేస్తుంది. ఇంట్లో శాంతి లేదు. చాలా సులభం. పెరట్లోనో వాకిలిలోనో పచ్చటి చెట్టు చూసి ఆయతు రాసిన కాగితం కడతాడు. నలభై రోజులు. సర్దుకుంటుంది. వ్యాపారం మట్టిగొట్టుకుని పోయింది. మంత్రం వేసిన టెంకాయని ద్వారబంధనానికి చుట్టబెడతాడు. కోలుకుంటుంది. అనారోగ్యం. నట్టింట్లో నిలబడి గట్టిగట్టిగా ప్రార్థనలు చేసి దువా చదివి ఇంట్లో నాలుగు మూలలకూ నాలుగు నిమ్మకాయలు దొర్లించాడంటే ఆ ఇంటి వాళ్లకి ఎంత ధైర్యం. ఇక అయినవాళ్లు ఎవర్నో తగులుకొని కాకుండా పోతున్నారు. సరే. ఏవో తిప్పలు.

అంతకు మించి రావు. ఆ సంగతి చెప్పడానికి లేదు. వీళ్లకు ఏం కావాలో.

పనిమనిషి వచ్చి’అమ్మగారొస్తున్నారు’ అంది.

హుజూర్ మళ్లీ నిటారుగా అయ్యాడు. కళ్లల్లో దైవత్వం తెచ్చుకోవడానికి చూశాడు. ముక్కు తుడుచుకున్నాడు.

అమ్మగారు వచ్చింది. హుజూర్ అదిరిపోయాడు. ఈమె ఎవరో. ఖరీదైన చీర, ఖరీదైన జాకెట్. చేతులకు వజ్రాల గాజులు. మెడలో బంగారు హారం. జబ్బల మీద జాకెట్ కొస నుంచి నడిమివేలి కొస దాకా బంగరువర్ణం. హూర్ పరీలు ఇలాగే ఉంటారని చిన్నప్పుడు విన్నాడు.

‘ఎవరు?’ అంది.

హుజూర్ లేచి నిలబడి నీళ్లు నమిలాడు.

‘ఎవడ్రా నువ్వు?’ గుడ్లు ఉరిమింది.

హుజూర్ నీళ్లు నీళ్లు అయిపోయాడు.

పనిమనిషి బతికించింది.

‘పెద్దమ్మగారు రమ్మన్నారంట’

‘ఎందుకు?’

హుజూర్ ధైర్యం తెచ్చుకుని అందుకున్నాడు. ఇలాంటప్పుడు వెంటనే ఎలాంటి సమాధానం చెప్పాలో తెలుసు. గుట్టు విప్పకూడదు.

‘చందా కోసం అమ్మా. దర్గాకి ఉర్సు. మీలాంటి యజమానులు చేయి అందిస్తారనీ’… అంతెత్తు మనిషి ఆ మాట అంటూ వినయంతో ఒంగిపోయాడు.

‘అందుకేనా?’ గద్దించింది.

‘అందుకే అమ్మా. మీలాంటివాళ్లు చల్లగా ఉండాలి. పదికాలాలపాటు మాలాంటి వాళ్లని దయ తలవాలి. అందుకే మా దువా. ఉర్సు చందనం తీసుకొచ్చి గడపకు పూస్తాను తల్లీ’… ఇంకా ఒంగాడు.

‘ఊ… ఇలాంటివేవైనా ఉంటే దర్గాల దగ్గరే చూసుకోవాలి. ఇంటికొచ్చేస్తే ఎలా? ఏం… అమ్మగారికి తెలియదా? నేను చెప్పానని చెప్పు’

పనిమనిషి తల ఊపింది.

‘శేకర్ ఎక్కడ?’

‘బండి తీసుకొని బయటికెళ్లరమ్మా’

‘ఏ బండి?’

‘చిన్నబండేనమ్మా’

‘పనుంటే పెద్దబండి తీసుకెళ్లమని చెప్పాను కదా’

పనిమనిషి ఏం మాట్లాడలేదు.

‘సరే. బాబు నిద్రపోతున్నాడు చూడు’

తలూపింది.

ఆమె వెళుతూ వెళుతూ హుజూర్‌ని చూసింది. హుజూర్ ఆమెను చూశాడు. ‘పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చంపేస్తాను’ అని ఆమె హెచ్చరించినట్టుగా హుజూర్‌కు అనిపించింది.

‘ఎవరు యజమాన్ ఈ తల్లి’ వెళ్లాక అడిగాడు.

‘ఇంటి కోడలు’ పనిమనిషి చెప్పింది.

హుజూర్‌కు మళ్లీ గంట కొట్టింది. అసలు ఇక్కడకు వచ్చినప్పటినుంచీ గంట కొడుతూనే ఉంది. ఇంటి మీద ఛాయ సరిగ్గా లేదు. తొందరగా ముగించుకొని బయట పడాలి.

కాసేపటికి పెద్దావిడ వచ్చింది. పలకరింపుగా నవ్వింది. నమస్కారాలంటే నమస్కారాలయ్యాయి.

‘ఏమనుకోవద్దండీ… మా కోడలు వెళ్లేదాకా ఆగాను’ అంది.

ఎదురుగా కూచుంది. ఆమె దర్గాకు వచ్చినప్పటికంటే ఇప్పుడు ఇంకాస్త నలిగిపోయినట్టుగా ఉంది. కళ్లకింద నలుపు పెరిగింది.. ముఖంలో ఆందోళన కనిపిస్తూ ఉంది. కానీ ఒంటి మీద మెరుపు మాత్రం తగ్గలేదు. బంగారం రంగు బార్డర్ ఉన్న మెత్తటి చీర. మెడలో హారం. రెండు చేతులకూ ఉన్న రెండు ఉంగరాలు ఆమె చేతులు కదిలించినప్పుడల్లా చక్‌చక్‌మని మెరుస్తున్నాయి.

హుజూర్ చూస్తూ ఉన్నాడు.

పనిమనిషి అలాగే నిలుచుని ఉంది.

‘శేకర్ లేడు కదా’ సందేహంగా అడిగింది.

‘లేడమ్మా’

‘ఇప్పుడల్లా రాడు కదా’

‘రాకపోవచ్చమ్మా’

పెద్దావిడ కాసేపు ఆలోచించి ’స్వామీ… ఇక్కడ వద్దు. గార్డెన్‌లో కూచుందాం’ అంది.

ఇంటిని కట్టి చుట్టూ స్థలం వదిలారు. వెనుక బాదం చెట్టు కింద గార్డెన్ సెట్ సిద్ధంగా ఉంది. తీసుకెళ్లి కూచోబెట్టింది. పనిమనిషి తోడు వచ్చింది.

‘కాఫీ తీసుకురా. బాబును రమ్మను’ అంది.

హుజూర్‌కు కేసు అర్థమైంది. పసివాడికి కీడు. బహుశా మొండికీడు అయి ఉంటుంది.  దానికి విరుగుడు కోసం పిలిపించారు. కొన్నిసార్లు పిల్లలు ఏం చేసినా నిమ్మళించరు. ప్రాణాలు తీసే జబ్బు లేకపోతే చాలు. లేపి కూచోబెడతాడు.

హుజూర్ ధైర్యంగా కూచున్నాడు.

‘హైద్రాబాద్ చెన్నై బెంగుళూరు నోయిడాల్లో మాకు చాలా ఆస్తులున్నాయి. చాలా. మావారు నిమిషానికి కొన్ని లక్షలు సంపాదిస్తారు. ఇంట్లో ఉండేది తక్కువ. సంపాదించడమంటే ఆయనకు పిచ్చి. ఎప్పుడో తప్ప ఇంట్లో ఉండరు. ప్రస్తుతం నార్వేలో ఉన్నారు’ అంది.

హుజూర్ వేగంగా ఆలోచించాడు. మనసు మారింది. ఇది చిల్లరమల్లర రెండు పిడికిళ్ల పార్టీ కాదు. ఛూమంత్రం వేసి ఐదారు పిడికిళ్లు లాగాలి. ఇంటిపనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ దెబ్బతో ముగించాలి.

కాఫీ వచ్చింది. ఈసారి కప్పు ఇందాకటిలా లేదు. పెద్దావిడతో సమానంగా అదే కప్పులో ఇచ్చారు. అంతటి పలుచని నాజూకైన కప్పు హుజూర్ జన్మలో చూడలేదు.

‘బాబుకు చెప్పావా?’

‘స్నానం చేస్తున్నారమ్మా’

పనిమనిషి వెళ్లిపోయింది. ఆమె కాఫీ తాగడం మాని హటాత్తుగా ఏడ్వడం మొదలుపెట్టింది. హుజూర్ కంగారు పడ్డాడు.

‘స్వామీ… మీరే ఎలాగైనా కాపాడాలి. ఇప్పటికి తిరగని గుడిలేదు. మొక్కని దర్గాలేదు. ఏం ఫలితం లేకపోయింది. మీ దర్గా చాలా పవర్‌ఫుల్ అని చాలామంది చెప్పారు. కనుక వచ్చాను. మీరు కలిశారు. మీలాంటి వాళ్లే మాలాంటి వాళ్లను ఆదుకోవాలి.’ అంది.

హుజూర్ నిటారుగా కూచున్నాడు. ముక్కు మెరిసింది.

‘అమ్మా… ఏం బాధపడకండి. నేను వచ్చాను కదా’ అన్నాడు.

‘అదే నా ధైర్యం కూడా’ అందామె.

‘బాబుని పిలిపించండి. నేను చూస్తాను’ అన్నాడు హుజూర్.

మరికాసేపటికి బాబు వచ్చాడు. హుజూర్ నోరెళ్లబెట్టాడు. బాబంటే చిన్నబాబు కాదు. పెద్దబాబు. ఆమె కుమారుడు. గుర్రం నడిపే జాకీలాగా ఉన్నాడు. షార్ట్స్. టీ షర్ట్. అతి పలుచగా ఉన్నాడు. గడ్డం గీసుకోలేదు. తలస్నానం చేసి తడి జుట్టు మీదే తల దువ్వుకున్నాడు. పెదాలు నల్లగా ఉన్నాయి. కళ్లకింద చాలా నల్లగా ఉంది. మారిన మనుషుల్లో ఉండే వినయంలాంటిది అతడిలో వుంది. రావడం రావడమే హుజూర్ కాళ్లకు నమస్కరించాడు. హుజూర్ కంగారుపడి లేవనెత్తడానికి భుజాలు పట్టుకున్నాడు. అవి భుజాలు కావు. విరగడానికి సిద్ధంగా ఉన్న పూచిక పుల్లలు. వదిలేశాడు. నలభై అయిదు కేజీలైనా ఉంటాడా?

‘కూచో’ అందామె.

కూచున్నాడు.

తల్లినీ, హుజూర్‌ని మార్చి మార్చి చూసి – జంకుగా – ‘శేకర్ లేడు కదా’ అన్నాడు.

‘ఆ… లేడులే’ ఆమె నిరసనగా అంది.

ఆ వెంటనే మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టింది. బాబు అది చూడలేనన్నట్టుగా తల ఒంచుకున్నాడు. ఆమె నిజంగానే గిలగిల్లాడుతూ ఉంది.

‘చూశారా స్వామీ మా ప్రారబ్దం. ఒక్కగానొక్క కొడుకు. అల్లారుముద్దుగా పెంచాం. లేనిదేమిటి? కావాలంటే దొరకంది ఏమిటి? కోరింది ఇచ్చాం. ఆడించినట్టు ఆడాం. వాడే లోకంగా బతికాం. పిల్లలన్నాక ఏవో అలవాట్లు ఉంటాయి. మావాడు బంగారం అనుకున్నా వాళ్లూ వీళ్లూ కలిసి ముంచుతారు. పాడలవాట్లు. వాటికి ఇలా అయిపోయాడు. మా బంగారు తండ్రి నాశనమై పోయాడు…’

హుజూర్‌కి గంట గణగణా మోగింది.

ఏదో ప్రాణాంతకమైన వ్యాధి. వీణ్ణి దేవుడు కూడా కాపాడలేదు.

ఆమె హుజూర్ వైపు చూసింది. బాబుని నఖశిఖపర్యంతం గమనిస్తున్న హుజూర్ కళ్లను చూసి కంగారుపడింది.

‘అయ్యో… అలాంటిదేమీ లేదు స్వామీ. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కాకపోతే కోలుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అంతే’

కుమారుడు జోక్యం చేసుకున్నాడు.

‘మమ్మీ. స్వామిని కన్‌ఫ్యూజ్ చెయ్యకు. ఉన్నది ఉన్నట్లు చెప్పు’ అన్నాడు.

ఆమె ఊరికే ఉంది.

అతడే అందుకున్నాడు.

‘స్వామీ… మీతో దాపరికం ఏముంది. డ్రగ్స్. చాలా కాలంనుంచి అలవాటు ఉంది. ఫన్… ఫన్… అనుకుంటూ దాన్లో కూరుకుపోయాను. పెళ్లయితే మారతానని వీళ్లు బలవంతంగా పెళ్లి చేశారు. కాపురం సాగింది కానీ అలవాటు మానలేదు. ఒక కొడుకు పుట్టేంత వరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడే’ … గొంతు పూడుకుపోయింది.

కుర్చీ చేతుల మీద బలహీనంగా చేతులు బిగించాడు.

ఒక మగవాడు ఇలా రిక్తహస్తాలతో నిలబడే క్షణాలు పగవాడికి కూడా వద్దు.

ఆమె ఏడుస్తూనే ఉంది.

బాబు కళ్లల్లోనుంచి నీళ్లు రాలి ఒడిలో పడ్డాయి. తల ఎత్తి, హుజూర్ వైపు దుఃఖంతో చూసి, కళ్లు తుడుచుకున్నాడు.

‘వీడింక పనికిరాడు స్వామీ. దానికి పనికిరాడు. శాశ్వతంగా పనికి రాడు’ చెప్పి, ఆమె మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది.

‘పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాం. ముంబై తీసుకెళ్లాం. అమెరికాకు కూడా పంపాలనుకున్నాం. లాభం లేదు. ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది? అంతా అయిపోయింది. ఏం చేసినా లాభం లేదట. మందులతో సర్జరీలతో కుదరదట. సహజమైన శక్తంతా పోయింది. వీడు అలవాటు మొత్తంగా మానలేడు. ఒకవేళ మానినా ఎన్ని జన్మలకో… అదేమైనా జరగొచ్చేమోనని… అది కూడా చిన్న ఆశ… అంతే’ …

హుజూర్ చాలా నిశ్శబ్దం అయిపోయాడు.

కొడుకును చూడటం లేదు.

తల్లినే చూస్తూ ఉన్నాడు.

పనిమనిషి ఒక పాలిథిన్ కవర్ తెచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టి వెళ్లిపోయింది. దాని నిండా నోట్లు కనపడుతున్నాయి.

‘తీసుకోండి స్వామీ. మీకెంత కావాలో తీసుకోండి. ఏ మంత్రం వేస్తారో వేయండి. ఏ తంత్రం కడతారో కట్టండి. నా తండ్రి మళ్లీ మామూలు వాడవ్వాలి. నా బాబు మళ్లీ మామూలు మగాడై రాజాలాగా బతకాలి. నా బంగారం జీవితాంతం ఏ ఆడదాని ముందూ తల దించుకోకుండా బతికే వరం నాకు ప్రసాదించాలి. అందుకు మీరు ఏం చేయమన్నా సరే. ఎంత ఖర్చయినా సరే’ …

హుజూర్ లేచి నిలబడ్డాడు.

వాళ్లు కూడా లేవబోయారు. వద్దని వారించి అటూ ఇటూ పచార్లు చేశాడు.

ఈ మధ్య హీరోతో అయిన అనుభవం గుర్తుకొచ్చింది. ఇలాంటివి వెంటనే నో అని చెప్పకూడదు. హీరో గదిలో పెట్టి తాళం వేశాడు. వీళ్లు కుక్కను వదిలినా ఆశ్చర్యం లేదు. ఆ కుక్క గుర్తొచ్చింది. అది కుక్క కాదు. చిన్న సైజు ఎలుగుబంటి. అలాగే నిలబడి, తల ఎత్తి, ఇంటివైపు చూశాడు. గతుక్కుమన్నాడు. ఛాయ సరిగ్గా లేదు. నీడ ఆడుతోంది పైన. తొందరగా ముగించుకొని తొందరగా బయటపడాలి.

‘అమ్మా. ఇది కొంచెం జటిలం. మంత్రశాస్త్రం తిరగేసి చెప్తాను’

వాళ్లిద్దరూ పూర్తిగా నిరాశపడి చూశారు.

‘అంత నిరాశపడాల్సిన పని లేదు. ఏడు పొరలకింద దాగిన దెయ్యాన్ని కూడా వదలగొట్టినవాణ్ణి. నా మాట నమ్మండి. మాట చెప్తే పని అయిపోయేలా ఉండటం నా పద్ధతి. మిమ్మల్ని ఆశపెట్టడం మంచిది కాదు. శాస్త్రం తిరగేశానంటే దారి కనపడుతుంది. ఒక రోజు ముందూ వెనుకా అయినా ఎన్నిరోజుల్లో పని జరుగుతుందో చెప్పానంటే పొల్లుపోకుండా అన్ని రోజుల్లో మీకు ఫలితం చూపెడతాను. నాదీ సవాల్ ‘

దగ్గరగా వచ్చి మళ్లీ కూర్చుని బాబు భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు.

‘బాబూ. దవా దువా అంటాం మేము. అంటే మందూ పడాలి… దేవుడూ కరుణించాలి. కొండని ఇసుకలా చేసేవాడూ పుల్లను పర్వతంగా మార్చేవాడూ అంతా ఆ పైవాడే. వాడు తలుచుకుంటే ఎంత. మీలాంటి బాబుగార్లు గంటకొకదాన్ని తెచ్చుకొని నిమిషానికి ఒకదాని పొగరు అణచగలరు. నాకు తెలుసు. మనకు మంచిరోజులు వస్తాయి. మీరు ధైర్యంగా ఉండండి’

ఆ మాట అన్నాక హుజూర్ గుండెల్లో ఎందుకనో దుఃఖం పొంగుకు వచ్చింది.

ఆ కొద్దిపాటి మాటకే బాబు ప్రాణం వచ్చినవాడిలా వెలుగుతున్నాడు.

తల్లి సంశయంగా చూస్తూ ఉంది ఏదో చెప్పాలి అన్నట్టుగా.

‘చెప్పండమ్మా… ఏం పర్లేదు చెప్పండి’

‘మీరు ఇంకో పని కూడా చేయాలి స్వామీ’

‘ఏం పని?’

తటపటాయించింది. బాబు లేచి, ఇది వినలేను అన్నట్టుగా కదిలి, ‘నేను వెళుతున్నాను’ అని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. అది చూసి ఆమె మళ్లీ ఏడ్చింది.

‘మీరు ఆ ముండ పొగరు అణచాలి’ అంది.

హుజూర్‌కు అర్థమైంది.

‘ఎవర్ది?’ అన్నాడు.

‘ఇంకెవర్ది. నా కోడలిది. ఇలాంటివి మీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాం. మీకు చెప్పుకుంటే దేవుడితో చెప్పుకున్నట్టే. చూశారుగా ఆ టెక్కు ఆ నిక్కు. నా కొడుకు చేతగానివాడయ్యాడని ఒకణ్ని తగులుకుంది. వాడితోనే కులుకుతోంది. అయ్యో… దేవుడా నా కళ్లముందే… ఎవరొచ్చి ఏం చేస్తారో చూస్తాను అన్నట్టు తిరుగుతుంది… ఎవరొచ్చి ఏం చేయగలరు? ఏదైనా అంటే నా కొడుకు సంగతి ఊరంతా పోస్టర్లు వేయిస్తానంటోంది. ఏదో ఒక ఛానల్‌లో లైవ్‌లో కూర్చుంటానంటోంది. ఇది కాకుండా నా మనవడున్నాడు. మా వారసుడు. వాణ్ని తీసుకొని వెళ్లిపోతానంటోంది. తను ఏమైనా చేయగలదు. మా చేతులే కట్టేసి ఉన్నాయి. ఖర్మ. దేవుడా.. ఇదంతా ఏమిటయ్యా’… నెత్తి బాదుకుంది.

హుజూర్ చలించలేదు. చూస్తూ ఉన్నాడు.

ఆమె పంతంగా అంది.

‘మీరు నా కొడిక్కి మగతనం తేకపోయినా పర్వాలేదు. వాళ్లను మాత్రం విడగొట్టాలి. నా కోడలితో సంబంధం పెట్టుకున్నవాడు నెత్తురు కక్కుకొని చావాలి’

హుజూర్ లేచి ఆమె శాంతించేంతవరకూ మళ్లీ పచార్లు చేశాడు.

ఆమె శాంతించినా మధ్య మధ్య బెక్కుతూనే ఉంది.

హుజూర్ వచ్చి కూచుని –’అమ్మా. ఈ పని నేను చేయలేను’ అన్నాడు.

‘ఏం?’

‘ఏం అంటే మీ కోడలి నెత్తిమీద సర్పం ఆడుతోంది. మీ బాబు మంచివాడయ్యి మళ్లీ మూలిక తగిలిస్తేనే ఆ సర్పం పడగ దించుతుంది. అందాక నడుమ ఎవరు వెళ్లినా కాటేస్తుంది. ఇది తథ్యం’ అన్నాడు.

ఆమె దడుచుకుంది.

హుజూర్ లేచి, తెరిచే అవసరమే రాని తన బ్యాగ్ తీసుకొని నిలబడ్డాడు.

‘అమ్మా. ఫోన్ చేస్తాను. ఏ సంగతీ చెబుతాను. మీరు చెప్పిన వెంటనే రెక్కలు కట్టుకొని వాలిపోతాను. నేను అడుగుపెట్టిన ఇల్లు ఇది. నా పాదం వృథా పోదు. ఇక అంతా శుభమే. నా మాట నమ్మండి’ అన్నాడు.

పెద్దావిడ చీకూ చింతా అంతా పోయినట్టుగా తెరిపినపడి నవ్వింది.

‘మీరు నవ్వారు. అంతే చాలు. సలాం’ వెనుదిరిగాడు.

‘స్వామీ’

తిరిగాడు.

‘ఖర్చులకు… మీకు కావలసింది తీసుకెళ్లండి’ … పాలిథిన్ కవర్ చూపించింది.

హుజూర్ తల అడ్డం ఆడించాడు.

‘పని జరగకుండా పైకం ముట్టుకోకూడదని ఆన. మంత్రం పని చెయ్యదు. మీ పని చేశాక ఎంత కావాలంటే అంత తీసుకుంటాను’ అన్నాడు.

ఇంటి ముందుకు  వచ్చి లాన్ నుంచి మెయిన్ గేట్ వైపు నడుస్తున్నాడు. లాన్‌లో కేన్‌బెడ్ మీద కుక్క అలాగే కూచుని అలాగే చూస్తూ ఉంది. హుజూర్‌కు తెలుసు. మళ్లీ ఈ జన్మలో ఈ ఇంటికి రాడు. వీళ్లకి కనపడడు. వీళ్ల ఫోన్ ఎత్తడు.

గార్డ్‌రూమ్‌లో ఉన్న శిష్యుణ్ణి తీసుకొని బయటకు వస్తూ ఆగి, గార్డ్‌ని అడిగాడు.

‘శేకర్ అంటే యెవరు యజమాన్?’

‘ఏయ్. శేకర్‌గారు అను. ఆయన ఈ ఇంటి డ్రైవరు’

హుజూర్ తల పంకించి, ముందుకు నడుస్తూ, బ్యాగ్ శిష్యుడికి అందించాడు.

‘ఏం హుజూర్?’ అన్నాడు శిష్యుడు.

‘బేకార్‌రా’ అన్నడు హుజూర్.

రోడ్డు మీద ఆగి, ఆ ఇంటి వైపు చూసి గతుక్కుమన్నాడు. నీడ ఆడుతోంది. శిష్యుడు గమనించాడు.

‘ఏం హుజూర్?’

‘ఒక చావు తప్పదురా’

మళ్లీ ఆ ఇంటివైపే చూస్తూ అన్నాడు.

‘ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు నడిస్తే సరే. ఏ ఇటుక ఎటు కదిలినా ఒక చావు తప్పదు. ఏమో ఎటు కదలకపోయినా చావు తప్పదేమో. నయం నడుమ మనం పోలేదు. ఆ సర్పం ఎలాంటిదంటే అది నిన్నూ నన్నూ కూడా వదలదు. నాలాంటి వాడు అడ్డం వచ్చి మంత్రం గింత్రం చేస్తున్నాడని తెలిసిందనుకో. చంపేస్తారు. లక్షలెందుకు… పదివేలు చాలదా…  నన్నేసేయడానికి… పెద్దోళ్లురా’ అన్నాడు.

శిష్యుడు గురువుతోబాటు నడుస్తున్నాడు.

ఎందుకో వెనక్కు తిరిగి చూశాడు.

కొంచెం నిరాశపడ్డాడు.

‘ఇంత ఆస్తున్నోళ్లు. ఒక మూడు నాలుగు పిడికిళ్లయినా లాగతావనుకున్నాను’…

హుజూర్ నవ్వాడు.

‘నీ మొహం ఆస్తి. ఈ ఇంటిగలోళ్లు ఈ ఇంటి అబ్బాయికి ఇవ్వాల్సిన ఆస్తిని ఇవ్వలేదు. ఇచ్చిన ఆస్తిని వాడు నిలబెట్టుకోలేదు. పైగా బికారిలా మారి మన ముందు జోలె చాస్తున్నాడు. ఇలాంటి వాళ్ల సొమ్ము తిన్నామంటే ఇంకేం లేదు. పెళ్లానికి పనికి రాకుండా పోతాం. పదా’ అన్నాడు.

ఆ తర్వాత –’అరటిపండు తింటావా?’ అన్నాడు బ్యాగ్ అందుకొని జిప్ తెరుస్తూ.

గురుశిష్యులు ఆ ఫలాలు తింటూ రోడ్డుకు ఒకవైపుగా జరిగి ఆటో కోసం నిలబడ్డారు.

మే 8, 2013

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • ఖదీర్ ‘మెట్రో కథలు’ కు దొరికిన ప్రశంస, ‘బియాండ్ కాఫీ’ కథలకు దొరకలేదు. నా దృష్టిలో అవి మెట్రో కథలు – పార్ట్ 1. మెట్రో నగరాల లంపెన్ కుటుంబాల లోని శూన్యాలను బాగా పట్టుకున్న కథలు. మీరు బియాండ్ కాఫీ కథల లోని కథను ఇట్లా ప్రస్తావించడం బాగుంది. వీలయితే, మొత్తం బియాండ్ కాఫీ కథల మీద ఒక విశ్లేషణ రాయగల శక్తి మీకు ఉందని ఈ ఆస్తి కథకు మీరు రాసిన ఇంట్రో చూస్తే అర్థమయింది

  • శ్రీనివాస్ జీ, ఎంత తీయగా,గంభీరంగా ఉంది మీ స్వరం… నాకు బాగా ఇష్టుడైన ఖదీర్ గారి కథకు మీ స్వరంతో చక్కని “దృశ్యత”ను తెప్పించారు… ఇంకొన్ని కథలు చదవరూ ప్లీజ్….

  • జన్నతుల్ ఫిర్దౌస్ ఘుమఘుమ మొహానికి కొట్టింది. యజమాన్ చంకలో జుంజుం పట్టుకొచ్చి హుజూర్ చేతికిచ్చాడు. హుజూర్ దాన్ని నా నెత్తిమీద తిప్పాడు. ఖదీర్ వదిలిన సర్పం నావెంట పడింది! వదిలించుకోడానికి అర్జెంటుగా దర్గాకు వెళ్ళాలి. పన్లోపని – శ్రీనివాసుక్కూడా ఓ తాయెత్తు పట్టుకొస్తాను. వద్దనొద్దు శ్రీనివాస్! శేఖర్ కారింకా రాలేదు లెండి.

    • సార్, నేను మీ మురళి ఊదే పాపడు కథను మా పిల్లలకు, మా కాలేజ్ లో పిల్లలకు చదివి వినిపించాను… మీతో ఒకసారి మాట్లాడాలి… వేణు, ఖమ్మం8555053547

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు