అది 2009. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉప్పెనలా ఎగసిపడుతున్నది. ఊరూరా ధూమ్-ధామ్‌లు, సబ్బండ వర్ణాల గర్జనలతో తెలంగాణ ప్రాంతం అంతా ఉడికిపోతోంది. ఆ వాతావరణంలో మహబూబ్‌నగర్ నడిబొడ్డున భారీ బహిరంగ సభ జరుగుతోంది. వేదికపై పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మేధావులు కూర్చుని ఉన్నరు. ఆ సభకు జిల్లా కేంద్రంలోని డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీల పిల్లలు కూడా వచ్చిండ్రు. సరిగ్గా అప్పుడే మైకు ముందుకొచ్చిండు సంతోష్.
అతనికి 18 ఏండ్ల వయసు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న పోరగాడు. బక్క మనిషి. కండ్లల్లో ఏదో తెలియని తెగింపు. సంతోష్ మైక్ పట్టుకోంగనే సభలో చిన్నపాటి గుసగుసలు మొదలైనయి. ‘ఈ పిల్లగాడు ఏం మాట్లాడ్తడు?’ అన్నట్లు చూసిండ్రు అక్కడున్న పెద్దలు. కానీ సంతోష్ గొంతు, పిడికిలి ఒకేసారి ఎత్తి “జై తెలంగాణా” అన్నడు. ఒక్కసారిగా అక్కడున్నోళ్లంతా “జై తెలంగాణా” అన్నరు. గుసగుసలాడిన నోర్లు సల్లవడినయ్.
మెల్లగా మాట మాట ఎత్తుకుంటూ ఆవేశంగా ప్రసంగం కొనసాగించిండు. “కృష్ణా, గోదావరి నదులు మన పక్కల్నే పారుతున్నా మన పొలాలు ఎందుకు ఎండిపోతున్నయ్? మన గొంతులు ఎందుకు నీళ్ళ కోసం అల్లాడుతున్నయ్? మన నీళ్లు మనకు దక్కనప్పుడు ఇక్కడున్న పాలకులు, నాయకులు ఎందుకున్నట్లు?” అని సంతోష్ ప్రశ్నిస్తుంటే సభలో చప్పట్లు మారుమోగినయి.
“తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయం ఎక్కడికి పోతోంది? బడ్జెట్ కేటాయింపుల్లో మన వాటా యాడుంది?” అంటూ తలసరి ఆదాయం, ఖర్చుల లెక్కలను వేళ్ల మీద లెక్కగట్టి చెబుతుంటే వేదికపై ఉన్న సీనియర్ నాయకులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నరు.
“అరె డిగ్రీలు సద్వి నౌకర్లు లేక మాయన్నలు పట్నం పోయి కూలీలైతున్నరు. మా కొలువులు మాకు దక్కితే ఈ గడ్డ మీన ఏ ఒక్క పోరడు ఆత్మహత్య చేసుకోడు” అని గర్జిస్తుంటే నాయకులు ఆశ్చర్యపోతున్నరు. సంతోష్ ప్రసంగం అయిపోంగనే సభ అంతా “జై తెలంగాణా..” నినాదాలతో దద్దరిల్లిపోయింది. వేదికపై ఉన్న ఒక సీనియర్ నాయకుడు లేచి వచ్చి సంతోష్ భుజం తట్టి “మంచిగ మాట్లాడినవ్ తమ్మీ” అని మైక్ తీస్కున్నడు.
“మేమెన్నో ఏండ్లుగ రాజకీయాలల్ల ఉండి చెప్పలేని విషయాలను ఈ తమ్ముడు గణాంకాలతో సహా అనర్గళంగా చెప్పిండు. తెలంగాణ భవిష్యత్తు మీలాంటి చదువుకున్న యువకుల చేతుల్లో భద్రంగా ఉంటుందని ఈరోజు అర్థమైంది” అని మెచ్చుకున్నడు.
ఆ రోజు నుంచి సంతోష్ కేవలం ఒక విద్యార్థిగా మిగిలిపోలేదు. తన మాటలతో, జ్ఞానంతో తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పే ఒక యువగొంతుకగా మారిండు. చదువుతోపాటు సామాజిక స్పృహ ఉంటే ఒక యువకుడు కూడా వ్యవస్థను కదిలించగలడని నిరూపించిండు. సంతోష్ ప్రసంగం ఆ ఒక్క సభతోనే ఆగిపోలేదు. ఆ రోజు పెద్ద నాయకుల ప్రశంసలు సంతోష్‌కు ఒక కొత్త బాధ్యతను భుజాన ఎత్తినట్లైంది. సెలవులొచ్చినయంటే సాలు, సంతోష్ తన సుట్టుపక్కల ఊర్లల్ల తిరగడం మొదలుపెట్టిండు. డిగ్రీ చదువుతున్న తన ఫ్రెండ్సందరినీ ఒక దగ్గరికి పిల్సి చిన్న గ్రూప్ లెక్క ఏర్పాటు చేసిండు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు చార్టుల రూపంలో గీసి చూపించేటోడు. రచ్చబండల దగ్గర కూసోని “తాతా! మన ఊరి చెరువుకు నీళ్లు ఎందుకొస్తలేవో తెల్సా?” అంటూ రాజకీయాల వెనుక ఉన్న అసలు కారణాలను పొట్లం ఇప్పినట్లు చెప్పేటోడు.
సంతోష్ డిగ్రీ ఫైనల్ ఇయర్‌కు వచ్చేసరికి రాష్ట్రస్థాయి విద్యార్థి నాయకుడయ్యిండు. ఒకసారి రాష్ట్రస్థాయి కీలక నాయకులు ఒక రహస్య సమావేశానికి అతన్ని కూడా ఆహ్వానించిండ్రు. అది ఒక మేధావుల మీటింగ్. అక్కడ సంతోష్ తన వయసును మర్చిపోయి ఒక సీనియర్ అనలిస్టులా మాట్లాడిండు. “సార్! మనకు కావాల్సింది కేవలం ఒక జెండా కాదు, మన ఆత్మగౌరవం. రేపు తెలంగాణ వస్తే మన పిల్లలకిచ్చే నియామకాలు ఎట్లుండాల్నో ఇప్పుడే మనం ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసుకోవాలె” అని సంతోష్ అనంగనే అక్కడున్న ఒక మాజీ ఐఏఎస్ అధికారి కూడా అశ్చర్యపోయిండు. సంతోష్ సద్వుతున్న కాలేజీలో కూడా పరిస్థితి మారిపోయింది. లెక్చరర్లు అతణ్ని విద్యార్థిగా కంటే ఒక ఉద్యమ నాయకుడిగా గౌరవించడం మొదలుపెట్టిండ్రు.
సంతోష్ ఫైనల్ ఇయర్లో ఉండగా కాలేజీ వార్షికోత్సవానికి వచ్చిన ఒక మంత్రి తెలంగాణ ఉద్యమాన్ని విమర్శిస్తూ మాట్లాడిండు. సంతోష్ భయం లేకుండా వేదికపైకి పోయి “తెలంగాణ వస్తే చీకటైతుందని అంటున్నరు. కానీ మాకు మా వెలుగులు ఎట్ల రప్పించుకోవాల్నో తెలుసు” అని దీటుగా సమాధానమిచ్చిండు. వెంటనే అక్కడున్న విద్యార్థులు ఒకేసారి “జై తెలంగాణా” అన్నరు. ఆ ధైర్యానికి ఆశ్చర్యపోయిన ఆ మంత్రి మెల్లగా అక్కడ్నుంచి వెళ్ళిపోయిండు.
మరుసటిరోజు కాలేజీ ముందున్న రోడ్డుపై రాస్తారోకో చేస్తుంటే సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పట్కపోయిండ్రు. జైలు గోడల మధ్య అతను ఖాళీగా కూసోలేదు, కుంగిపోలేదు. అక్కడున్న ఇతర ఉద్యమకారులకు, యువకులకు తెలంగాణ చరిత్రను, తెలంగాణకు రావాల్సిన నిధుల లెక్కలను విడమర్చి చెప్పిండు. మళ్ళా బయటకొచ్చిండు.
కాలం గిర్రున తిర్గింది. అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అంతకుముందుదాంక “తెలంగాణ వస్తే మన బతుకులు మారుతయ్. మన నీళ్లు మనకొస్తయ్. మన కొలువులు మనకే దక్కుతయ్” అని ఊరూరా తిరిగి డప్పు కొట్టినట్లు చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కానీ, సంతోష్ లాంటి బీసీ, కింది కులాల పొరగాళ్లకు తెలంగాణ రాకముందు ఎట్లున్నదో వచ్చిన తర్వాత గూడ అదే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే అంతకుమించిపోయింది పరిస్థితి.
ఉద్యమం చేసిన సంతోష్, ఎటువంటి ఉద్యమ నేపథ్యంలేని రవీందర్‌రెడ్డి ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి పోయిండ్రు. అక్కడ సీన్ చూస్తే సంతోష్ మైండ్ బ్లాంక్ అయ్యింది. సంతోష్ కంటే తక్కువ మార్కులున్న రవీందర్రెడ్డికేమో టక్కున జాబిచ్చిండ్రు. సంతోష్‌ను మాత్రం “నీకు టాలెంట్ తక్కువుంది. అనుభవం లేదు” అని సాకులు జెప్పి పంపించేసిండ్రు. అట్ల చాలా కంపెనీల సుట్టూ తిర్గిండు కానీ ఫలితం లేదు. ఆఖరికి అల్సిపోయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కొత్త అన్వేషణ మొదలుపెట్టిండు సంతోష్.
తెలంగాణ రాకముందు తెలంగాణల ఆంధ్రోళ్ల కంపెనీలుంటే, వాళ్లు వాళ్ల ప్రాంతం వాళ్లకే ఉద్యోగాలు ఇచ్చుకున్నరు. ఇప్పుడు తెలంగాణ వచ్చినంక కంపెనీలన్నీ ఆధిపత్య వర్గాల చేతుల్లోకి పోయినయ్. రెడ్డి, వెలమ దొరలే పైస్థాయిలో కూసున్నరు. వాళ్లేమో వాళ్ల సామాజిక వర్గాలకే రెడ్ కార్పెట్ పరుస్తున్నరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పోరగాళ్ల పరిస్థితి అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు అట్లే ఉన్నదని అర్థమైంది. మళ్లో ఉద్యమం షురూ చెయ్యాలనుకున్నడు సంతోష్.
మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా కాడ తన దోస్తులతో కూర్చున్న సంతోష్ ఆవేశంతో ఊగిపోతున్నడు. “జై తెలంగాణా! మనమప్పుడు ఆంధ్రోళ్లతో కొట్లాడినం. మా నీళ్లు, మా నిధులు మాకు అని అరిచినం. సరే.. రాష్ట్రం అయితే తెచ్చుకున్నం. కానీ ఏమైంది? మన కడుపులు ఇంకా మాడుతూనే ఉన్నయ్. అప్పుడు ఆంధ్రా పెత్తనముంటే.. ఇప్పుడు మన ఊర్లోనే ఉన్న పెద్ద మనుషుల పెత్తనం మొదలైంది. కంపెనీలన్నీ మన భూముల్లోనే కట్టిండ్రు. కరెంటు మనది వాడుతున్నరు. కానీ కొలువులు ఇచ్చేటప్పుడు మాత్రం కులం జూస్తున్నరు. ఈ రెడ్డి, వెలమ దొరలకే అన్ని పదవులా? అన్ని జాబులా? మన బీసీ, ఎస్సీ, ఎస్టీ పోరగాళ్లు గొర్రెలు కాయాల్నా? సంచులు మోసి హమాలీ పనులు చెయ్యాల్నా? ఇదా మనం కోరుకున్న తెలంగాణ? మనకు రిజర్వేషన్లు ఉన్నయని మనమీన ఏడుస్తరు. కాని వోళ్ళ పేర్ల ఎనకల ఉన్న తోకలే వోళ్ళ అసలైన రిజర్వేషన్స్ మిత్రులారా!” అన్నడు సంతోష్ .
అతని కళ్ళలో మళ్ళా ఆ పాత ఉద్యమ చైతన్యం వచ్చింది. పాలమూరు నడిగడ్డ మీద నిలబడి గట్టిగా నినదించిండు. “అన్నల్లారా.. తమ్ముళ్లారా.. పోరాటం ఇంకా అయిపోలేదు. అప్పుడు భౌగోళిక తెలంగాణ కోసం కొట్లాడినం. ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం కొట్లాడాలె. ఏ కంపెనీలోనైనా, ఏ ఆఫీసులోనైనా మన వర్గాల వాళ్లకు వాటా ఉండాల్సిందే. ఎవడో ఒక్కడి చేతిలో అధికారం ఉంటే అది మన తెలంగాణ కానే కాదు. మళ్ళా మనం జెండా పట్టాల్సిందే! ఈ ఆధిపత్య వర్గాల పెత్తనాన్ని ఖండించాల్సిందే. జై తెలంగాణ” అని సంతోష్ మళ్ళా ఉద్యమానికి ముగ్గు వోసిండు.
***
పోరాటాల నీడలో రాయాలి
- హాయ్ లక్ష్మీనరసింహ! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట్ మండలం తిమ్మాపూర్. అక్కడే పుట్టి పెరిగాను. ఇంటర్, డిగ్రీ, పీజీ దాకా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చదివాను. ఈ మధ్యే ఎల్ఎల్బీ పూర్తి చేశాను. ప్రస్తుతం ఊళ్లోనే ఉంటున్నాను.
- చిన్నప్పటినుంచి సాహిత్యంపై ఇష్టం ఉండేదా?
నిజం చెప్పాలంటే, నా జీవితం పశువుల కాపరిగా మొదలైంది. పలక, బలపం అంటే తెలియకుండా పెరిగాను. ఆ టైంలో బాలకృష్ణారెడ్డి అనే టీచర్ నన్ను తీసుకెళ్లి మూడో తరగతిలో చేర్పించారు. అప్పటికే నాకు నూనూగు మీసాలు వచ్చేశాయి. అప్పుడు బళ్లో చేరాను. తర్వాత వెంటవెంటనే ఐదో తరగతి, ఏడో తరగతి..ఆ తర్వాత ప్రైవేటుగా పదో తరగతి చదివాను. మా ఇంట్లో పదో తరగతి దాకా చదివిన మొదటి వ్యక్తిని నేనే. డిగ్రీకి వచ్చాకే సాహిత్యం గురించి తెలిసింది. చదువంటే నాకు చాలా గౌరవం. ఇప్పటికి నాలుగు పీజీలు చేశాను.
- కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
2008-09లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా సాగుతున్న టైంలో చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టాను. 2014లో మా లెక్చరర్ ఎన్.సుభాషిణి రచయిత ఉదయమిత్ర గారిని నాకు పరిచయం చేశారు. వారిని కలిసినప్పుడు కథల పుస్తకాలు ఇచ్చారు. అవి చదవగానే చాలా నచ్చాయి. ఆ తర్వాత పసునూరి రవీందర్ ‘అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ కథల పుస్తకం చదివాను. నా జీవితానికి అవి చాలా దగ్గరగా అనిపించాయి. అంతకుముందు నేను కవిత్వం రాశాను. కథలు రాస్తే బాగుంటుందని అనిపించింది. అలా ‘సెప్పుల సాయమ్మ’ అనే కథ రాశాను. 2019 మార్చిలో ‘మోదుగుపూలు’ మాసపత్రికలో ఆ కథ అచ్చయ్యింది. ఇప్పటికి 40 కథల దాకా రాశాను. అందులో 30 కథలు అచ్చయ్యాయి.
- కథల ప్రయాణం పుస్తకాల దాకా ఎలా చేరింది?
నా రచనలు పుస్తకంగా రావడం 2014 నుంచే మొదలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘కుట్రజేస్తున్న కాలం’ అనే కవిత్వ సంపుటి ప్రచురించాను. 2016లో ‘ఆరుతున్న మెతుకుదీపం’, 2017లో ‘వెన్నెలవాడ’ కవిత్వ సంపుటాలు, ఆ తర్వాత ‘చెరగని ఆటోగ్రాఫ్’ అనే ప్రేమకవిత్వ సంపుటి, ‘దాచుకున్న లోకం’, ‘ధర్మాగ్రహం’ ‘గద్దెనెక్కినంక’ కవిత్వ సంపుటాలు ప్రచురించాను. 2019లో మొదటి కథాసంపుటి ‘అంబలిగంప’ వచ్చింది. ఈ మధ్యే ‘గాజులు కొనని రోజున’ పేరుతో రెండో కథాసంపుటి వచ్చింది.
- మీ కథల్లో రాజకీయ దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు కారణమేంటి?
కొన్నేళ్లుగా నేను యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నాను. రెండుసార్లు వార్డ్ మెంబర్‌గా కూడా ఎన్నికయ్యాను.
- రాజకీయాల్లో ఉంటే రాజకీయ దృక్పథం ఉన్న రచనలు చేయొచ్చంటారా?
అలా అని కాదు. రాజకీయాల్లో ఉన్నందువల్లే రాజకీయ దృక్పథం ఉన్న రచనలు చేశానని చెప్పలేను. నా చుట్టూ ఉన్న సమాజం, నేను జీవిస్తున్న జీవితం, నా ఆలోచనలు..ఇవన్నీ కలిస్తేనే ఒక దృక్పథం ఏర్పడుతుంది. మనం చాలాసార్లు ఫిజికల్‌గా వెళ్లి పోరాటాలు చేయలేం. మన రచనలైనా ఆ పోరాటాలకు సపోర్ట్ అందిస్తే బాగుంటుంది. రచనలకు సామాజిక ప్రయోజనం ఉండాలని నమ్ముతాను. నేను ఇప్పటిదాకా రాసినవన్నీ అలాంటి రచనలే.
- మీకు నచ్చిన రచయితలు?
ఉదయమిత్ర గారు నా మీద చాలా ప్రభావం చూపించారు. సామాజిక అంశాలను కథలుగా రాయడం, వాటిని అర్థవంతంగా చెప్పడం ఆయన రచనల్లో చూడొచ్చు. ఆయన రచనలంటే నాకు చాలా ఇష్టం. ఎం.నారాయణ, పసునూరి రవీందర్, డి.జి.హైమావతి, ఇక్బాల్ చంద్, వహీద్ ఖాన్, కొలకలూరి ఇనాక్, మానస ఎండ్లూరి..ఇలా చాలామంది ఇష్టమైన రచయితలు ఉన్నారు.
- ముందుముందు ఏమేం రాయాలని ఉంది?
నాలుగేళ్ల క్రితం రెండు నవలలు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశాను. వాటిని పూర్తి చేయాలి.
*








Add comment