మనిషి పరిచయం – 7

ఈ సమాజం ఇక బాగుపడ్తుందనీ, మళ్ళీ మా తరం నాటి విలువలతో భారత సమాజం ఆవిర్భవిస్తుందనీ.. అస్సలే నమ్మకం లేదు.

వెనుక ప్రజలింకా పెద్ద సంఖ్యలో గుమికూడుతున్న పరిస్థితీ, నినాదాల హోరూ వినబడ్తోంది. కొద్దిగా ముందుకు కదలగానే ఎన్ జి ఒ హోం ముందు అప్పటికే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను అటు శరత్ లేజర్ కంటి ఆస్పత్రి దిక్కు మళ్ళిస్తున్నారు. ఆ వేపునుండి.. ములుగు రోడ్, ఆటో నగర్ పైనుండి ఇంటికొచ్చారు ముగ్గురూ ఒక పది నిముషాల్లో.

అప్పుడు సాయంత్రం మూడు గంటలు దాటిందేమో.. ముగ్గురూ ఇంటికి వచ్చిన తర్వాత, ఏమీ మాట్లాడుకోకుండానే సుభద్రా, చెన్నకేశవులూ, రాజ్యలక్ష్మీ.. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత.. బయట వీధిలో పెద్దగా ఏడ్పులూ, పెడబొబ్బలూ వినొచ్చి మనుషులు పరుగెత్తుతున్నట్టనిపిస్తే .,

బయటికొచ్చారందరూ.

ఎదుటి ఇంట్లో.,

చాలా ఖరీదైన .. సకల సౌకర్యాలతో అలరారే భవంతి అది. దాంట్లో ఉండే మనుషులు ముగ్గురే.. యజమాని డాక్టర్ నరసింహా రెడ్డి, ప్రసిద్ధ న్యూరో సర్జన్. భార్య ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుధ. ఇద్దరూ చాలా బిజీ వైద్యులే. అతని నర్సింగ్ కం కన్సెల్టెన్సీ హోం హనుమకొండ లో.. విజయ టాకీస్ దగ్గర ఉంటది. డాక్టర్స్ స్ట్రీట్ అది. ‘ అచట సకల మానవ రోగములకూ చికిత్సలు చేయబడును.. రోగుల జేబులు సాధ్యమైనంత గరిష్టముగా దోచుకోబడును .. అన్ని రకముల రోగనిర్ధారణ పరీక్షలు అత్యాధునిక పద్ధతులతో నిర్వహించబడి మొత్తం చిలుము వదిలించబడును ‘ . ఆ అన్నీ వదిలింపజేయు బృందంలో వీళ్ళూ సభ్యులే. ఇక డాక్టర్ వసుధ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్. ఆరు ప్రఖ్యాత నర్సింగ్ హోం లలో కన్సల్టెంట్. కాకుండా.. కరీం నగర్ లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో వారానికి రెండు రోజులు అనధికారికంగా వెళ్ళి అక్కడి మెడికల్ విద్యార్థులకు పాఠాలు చెప్పబడును. వారానికి ఒక రోజు.. ఇంటికి ఉదయం ఆరు గంటలకే మెడికల్ రెప్రజెంటేటివ్స్ కు టైం ఇవ్వడం వల్ల ఒక రోజు ఆతనికోసం.. మరొక రోజు ఆమెకోసం తండోపతండాలుగా టైలు కట్టుకుని.. చేతుల్లో ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ లు పట్టుకుని.. మందుల కంపనీ వాళ్ళు షాంపుల్స్.. కానుకలు.. రిక్రియేటివ్ ఓచర్స్.. ఏవేవో ప్రలోభాలతో అతివినయంగా వస్తారు నవ్వు ముఖాలతో.

అతను ప్రతిరోజూ ఉదయo ఇంట్లో నుండి ఆరు గంటలకే కార్లో బయలుదేరి.. రెండు నర్సింగ్ హోం లలో కనీసం మూడు నాలుగు ఆపరేషన్స్ చేస్తాడు.. ఆదాయం ఒక యాభై వేలు పూటకు. పది నుండి ఒంటి గంట వరకు ఒక ప్రసిద్ధ కార్పోరేట్ దవాఖానలో సేవ. నెలకు నాలుగు లక్షలు. మధ్యాహ్నం మరోక కార్పొరేట్ దవాఖానలో సర్వీస్. నెలకు మూడు లక్షలు. సాయంత్రం విజయా టాకీస్ కాకాజి కాలనీలో ప్రైవేట్ కన్సల్టెన్సీ .. కనీసం ఇరవై వేలు. ప్రతి పేషంట్ ఫీ ఐదు వందలు. అన్ని ల్యాబ్ ల నుండి పరీక్షల్లో కమీషన్. వెరసి.. అంతా డబ్బు. ఆ ఇంట్లో గాలి నిండా డబ్బు వాసన. గదుల గోడలూ, నేలా, బొమ్మలూ, బోళ్లూ అన్నీ డబ్బు వాసనే.

ఆ వాతావరణంలో వాళ్ళకు అనగనగా ఒకే ఒక్క అమ్మాయి పుట్టింది పదిహేడు సంవత్సరాల క్రితం. పేరు హిమ.

” హిమ..అంటే కరిపోయేది కదా సార్.. మీ కూతురు నిజంగానే ముట్టుకుంటే కరిగిపోయేంత సున్నితంగా, సుందరంగా ఉంటుంది ” అని అన్నాడు చెన్నకేశవులు ఒకసారి నరసింహారెడ్డి ఎందుకో చిన్నప్పుడు హిమతోపాటు తారసపడ్తే. ఇంటి ముందు మనిషి కాబట్టి ఆ మాత్రం మాట్లాడినాడు నరసింహారెడ్డి ఆ రోజు మొహమాటానికి.

వాళ్ళను చూస్తే ‘ వీళ్ళు కేవలం డబ్బు సంపాదించడానికే పుట్టిన యంత్రాలా ‘ అనిపిస్తుంది.

పరుగు పరుగున సుభద్రా తదితర ఇద్దరూ వెళ్లేసరికి ఒక తెల్లబాతులా అతి నాజూగ్గా ఉన్న అంబులెన్స్ వ్యాన్ మెల్లగా మెత్తగా డాక్టర్ గారి ప్రాంగణంలోకి వచ్చి పోర్టికో కింద ఆగింది. దాని వెనుకే ఇంక రెండు బెంజ్, బి ఎం డబ్యూ కార్లు నేలపై నడుస్తున్న హంసల్లా వచ్చి ఆగాయి. డ్రైవర్ దిగి అంబులెన్స్ వెనుక డోర్ తెరుస్తూండగా.. ఆ పెద్ద ఇంట్లో పని చేసే పనిమనుషులూ, వాచ్ మెన్సూ, కుక్కల కాపలా దార్లూ, తోటపని చేసేవాళ్లూ.. అందరూ ఎవరో చెప్పినట్టుగానే ఒక్కసారిగా మూకుమ్మడిగా ఏడుపు లంఘించుకుని..” అమ్మగారూ.. చిన్నమ్మగారూ.. అయ్యో ” అని పెద్దగా శోకించారు.

అప్పటికే విషయం బయటకు పొక్కి వచ్చిన చుట్టుప్రక్కల వాళ్ళ ద్వారా అర్థమైందేమిటంటే .,

‘ హిమ అనే తెల్ల కుందేలు పిల్లలా ఉండే వాళ్ల బిడ్ద హైదరాబాద్ లో.. నారాయణ కార్పొరేట్ స్పెషన్ ఆల్ ఎ.సి కోచింగ్ కాంప్లెక్స్ లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటోంది గత ఏడాదిగా. తల్లిదండ్రుల లక్ష్యమేమిటంటే.. తమ తర్వాత తమ వైద్యాదాయ సామ్రాజ్యానికి హిమ అనే వ్యక్తి వారసురాలై తమ కోట్ల సంపదను మూడంకెల కోట్లకు చేర్చాలని.’

కాని.. ‘ అమ్మా.. నాకీ కోచింగ్ లూ, రాత్రింబవళ్ళు పుస్తకాలతో కుస్తీలూ, రాక్షసుల్లా వెంటబడి పరీక్షలో పరీక్షలో అని తరమడాలు.. ఇవన్నీ నచ్చుతలేవమ్మా.. ప్లీజ్ .. ఒక్కసారి రాండమ్మా నువ్వూ డాడీ.. నన్నీ జైల్ నుండి తప్పించండి ..’ అని హిమ అనేకసార్లు దీనంగా బతిలాడిన సంగతీ.. ప్రాధేయపడ్డ సంగతీ నోట్లో చేతిని కుక్కుకుని లోలోపలే రోధిస్తున్న డాక్టర్ వసుధ మనసులో నిప్పుల చినుకులై కురుస్తున్నాయి.

కాని ఏ ఒక్కనాడూ హిమ సున్నితమైన మనసులోకి ఒక్క క్షణం తొంగి చూచే ప్రయత్నం చేయ లేదు తాము. ఎప్పుడూ సంపాదన.. దవాఖాన్లు.. ఆపరేషన్లు.. పరుగెత్తడాలు.. ఇవ్వాళ రేపటి షెడ్యూల్స్.. రేపటికి మరునాటి షెడ్యూల్స్.,

ఇప్పుడు.,

” ఏమైంది రాఘవులూ ” అని వస్తూ వస్తూనే అవతలి ప్రక్క ఉండే మెడికల్ షాప్ నడిపే వ్యక్తిని చెన్నకేశవులు లో గొంతులో అడిగితే ” సార్.. హైదరాబాద్ లోని నారాయణ కోచింగ్ సెంటర్ లో.. పదంతస్తుల ఎ.సి బ్లాక్ లోని తొమ్మిదో అంతస్తు పైనుండి ఉదయమే ఆరు గంటలకు కిందికి దూకి ఆత్మహత్య చేసుకుందట సార్ పాపం .. పిల్ల చిన్నప్పటినుండీ చూస్తున్న.. ఎన్నడూ ఇంట్లోనుండి బయటికొచ్చి ఎవరితోనూ మాట్లాడింది లేదు. ఈ పది ఫీట్ల ఎత్తున్న కాంపౌండ్ గోడల వెనుక.. బంగారు పంజరంలో ఉండీ ఉండీ.. ఏమైందో బిడ్దకు.. ” అని కళ్ళలో నీళ్లు కుక్కుకున్నాడు.

అంతా అర్థమైంది సుభద్రకు.

తెల్లని గుడ్డలో చుట్టి వ్యాన్లోనుండి దింపుతున్న శవాన్ని పోర్టికోలోనే ఏర్పాటు చేసిన ఎత్తైన పూల వేదికపై సర్దుతూంటే..

” దగ్గరికిపోయి చూద్దామమ్మా ” అని అంది రాజ్యలక్ష్మిని సుభద్ర. రాజ్యలక్ష్మిలో కూడా స్త్రీ సహజమైన మాతృ తత్వం గంగలా పొంగి క్రమంగా దుఃఖంగా మారుతున్న సంగతి తెలుస్తోందామెకు. తలెత్తి మౌనంగా సుభద్ర వంక చూచి ముందుకు కదిలింది. వాళ్ల వెనుక ఉన్న వీధి జనమంతా ఒట్టి ‘ అలగా ‘ జనంలాగనే అనిపిస్తున్నారప్పుడు ఆ పరిసరాల తేడావల్ల. ఈ మనుషులూ, ఆ మనుషులూ ఒకే జాతికి చెందనివాళ్ళ లాగా, వేర్వేరు లోకాలకు చెందిన వాళ్లలాగా అనిపిస్తున్నారు.

ఈ లోగా నగరంలోని డాక్టర్ల లోకానికి ఆ విషయం తెలిసిపోయినట్లుంది.. వరుసగా పెద్ద పెద్ద విలువైన కార్లలో విలువైన మనుషులు రావడం మొదలై ఆవరణంతా ఒక్కొక్కటిగా కార్లు నిండిపోతున్నాయి.

ఇంట్లో పనిచేసే పనిమనుషులు తప్ప ఎవరూ బిగ్గరగా ఏడ్వడం లేదు. శవం వెంట వచ్చిన రెండు కార్లలోని ఇద్దరు ముగ్గురు స్త్రీలు, ఐదారుగురు పురుషులు.. అందరూ మౌనంగా విషణ్ణ వదనాలటో శవ పేటిక దగ్గర నిలబడ్డారంతే.

దుఃఖమొచ్చినప్పుడు కడుపుతీరా ఏడ్వలేక పోవడం.. సంతోషమొచ్చినప్పుడు తనివిదీరా అనందాన్ని పంచుకోలేక పోవడం నిజంగా మనిషి జీవితంలో అత్యంత విషాదకర సందర్భమే. ధనిక సంస్కృతి మనుషులపై ఈ మొహమాటపు పరదాలను కప్పడం .. ఒక ముసుగేసుకోవడమే.

ఏ మొహమాటమూ లేకుండా సుభద్ర దగ్గరగా వెళ్ళి చనిపోయిన ఆ పాప హిమ ముఖంలోకి చూచింది. ఆమె ముఖం చాలా ప్రశాంతంగా.. ఈ భౌతిక అసంతృప్త జీవితంనుండి విముక్తమైనట్టు ఏదో భాషకందని నిర్మలత ఉందా వదనంలో. చాలా జాలి కలిగి ఇక ఆపుకోలేని దుఃఖం పొంగుకొచ్చింది సుభద్రకు ఎందుకో. గొడగొడా వెక్కెక్కిపడి ఏడుస్తూనే.. గమనించింది.. ప్రక్కకు జరిగిన హిమ చేతిలో ఒక మడిచిఉన్న కాగితాన్ని. పరిసరాల స్పృహ లేకుండానే చటుక్కున ఆ కాగితాన్ని తీసి.. లిప్త కాలంలో విప్పి.. చదివింది.

అమ్మా,

నాకీ జీవితం నచ్చడం లేదమ్మా.

– హిమ

ఒకటే వాక్యం.

శతఘ్ని వంటి ఆ ఒకేఒక వాక్యం.. సుభద్ర హృదయంలో ప్రేలింది. పిల్లలను ఈ దుర్మార్గపు తల్లిదండ్రులు చదువుల పేరుతో, భవిష్యత్తు పేరుతో వాళ్లకు స్వేచ్ఛగా బతికే అవకాశమే ఇవ్వకుండా ఎంత హింసిస్తున్నారో.. అనుకుంది కన్నీళ్ళతో.

చుట్టూ చూచి.. అక్కడ నిలబడ్ద ఆడవాళ్ళలో ఆ పిల్ల కన్నతల్లిని ఒక తల్లి హృదయంతోనే గుర్తించి చకచకా నడుచుకుంటూ వెళ్ళి ఆమె చేతుల్లో ఆ కాగితాన్ని పెట్టి చరచరా అక్కడనుండి ఇంటికొచ్చేసింది సుభద్ర.

అంత విషాద సన్నివేశంలోనూ ఆమె కదలికలను గమనించి చాలా మంది ఆశ్చర్యపడ్డారు.

చెన్నకేశవులుకూ, రాజ్యలక్ష్మికీ అర్థం కాలేదు.. ఏం జరుగుతోందో. వాళ్లు కూడా హిమ శవ పేటిక దగ్గరికి వెళ్ళి నివాళులర్పించి వెనుదిరిగారు.

ఇంటికొచ్చే సరికి సుభద్ర హాల్లో కూర్చుని మూర్తీభవించిన శోక దేవతవలె.. టి.వి ని చూస్తోంది.

వచ్చి భారంగా ప్రక్కనున్న మరో సోఫాలో కూలబడ్డారు ఇద్దరూ చెన్నకేశవులూ, రాజ్యలక్ష్మీ.

టి వి లో ఐదున్నర వార్తలు చెబుతున్నారు.. హెడ్ లైన్స్.. పెద్ద మ్యూజిక్.

” ఏముందిరా ఆ కాగితంలో ” అంది రాజ్యలక్ష్మి ఉత్సుకతనాగబట్టుకోలేక.

చెప్పింది సుభద్ర.

” అయ్యో పాపం బిడ్ద హృదయం ఎంతతల్లడిల్లిందో ..” అని ముఖాన్ని దోసిట్లో దాచుకుంది రాజ్యలక్ష్మి.

అప్పటిదాకా నిరాసక్తంగా టి వి ని గమనిస్తున్న సుభద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి చూడ్డం మొదలుపెట్టింది. ఎదుట తెరపై నడి రోడ్దుమీద ఒక వ్యక్తిని మరొకడు వేట కత్తితో చప్పు చప్పున నరుకుతున్నాడు కసిగా అరటి బోదెను నరుకుతున్నట్టు. ఒక్కసారిగా రోడ్ పై నడచి వెళ్తున్న జనం షాక్ కు గురై.. ఎక్కడివాళ్ళక్కడ భయభ్రాంతులై ఆ తతంగాన్ని చూస్తున్నారు గాని ఏ ఒక్కడూ ఆపే ప్రయత్నం చేయడం లేదు.. ప్రక్కనే ఉన్న పోలీస్ కూడా కళ్ళప్పగించి ఊర్కే గమనిస్తున్నాడంతే. ఇటు ప్రక్కన ఒకడెవడో.. బహుశా ఒక విలేఖరేమో.. చక్కగా చేతిలోని కెమెరాతో షూట్ చేస్తున్నాడు ఆ నరుకుడు సన్నివేశాన్ని. పైగా ఎక్స్ క్లూసివ్ టి వి – 5 అని ఒక డిస్సాల్వ్డ్ అక్షరాలు స్క్రోల్ లో.

దాని వెనుక యాంకర్ అత్యుత్సాహంగా , ఉచ్ఛై స్వరంతో చెప్తూండడం.. ఎంతసేపూ టి.వి చానళ్ళకు కావలసింది ‘ రేటింగ్ ‘. ప్రజల్లో సెన్సేషన్ .

బొమ్మలు: మిత్ర

ఆమె ” ఇది కొన్నాళ్ళుగా సాగుతున్న వివాహేతర సంబంధానికి సంబంధించిన వ్యక్తి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జరిగిన అమానుషమైన హత్య. గుంటూరు నగరానికి చెందిన రాములు నాయుడు భార్య అనసూయకు కొన్నేండ్లుగా వాళ్ల ఇంటి ప్రక్కనే ఉన్న వేణుగోపాల్ రెడ్డితో వివాహేతర సంబంధముంది. దీనికి సంబంధించి శాశ్వతంగా రాములు నాయుడును అడ్డుతొలగించుకునేందుకు వేణుగోపాల్ రెడ్డి నడిరోడ్దుపై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హతుడూ, హత్య చేసిన వేణుగోపాల్ రెడ్డీ ఇద్దరూ కలిసి అప్పటిదాకా ప్రక్కనే ఉన్న సాయి బార్ లో మధ్యాన్ని సేవించి బయటికి రాగానే ఈ అకృత్యానికి పాల్పడ్డారు . ఆ బార్ యొక్క సి సి కెమెరాలోనివే ఈ దృశ్యాలు. ఇప్పుడు మా బ్రాడీపేట ప్రతినిధి రజాక్ ఇంకా వివరాలు అందిస్తారు..రజాక్.. ” అని యాంకర్ కేక.,

” ఆ.. నిర్మలా .. ” అని సోది ముచ్చట్లను జనం మీదికి విసుర్తూ రజాక్ ., దీన్ని పదే పదే చూపించిందే చూపించి.. చెప్పిందే చెప్పుతూ.,

అవసరమా ఈ వార్తకు ఇంత ప్రాచుర్యం.

అది కట్ కాగానే ‘ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించి .. కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోయి ఈ రోజుతో రెండు సంవత్సరాలైన సందర్భం యాదృచ్ఛికమే ఐనా కాంగ్రెస్ హై కమాండ్ హుటాహుటిన రమ్మని పంపిన పిలుపును అందుకుని ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి వెళ్లి అగ్రనాయకులు గులాం నబీ ఆజాద్, అంటోనీ తో చర్చించారు. కాని ముఖ్యమంత్రి ఏ విధంగా నైనా ఉద్యమ శక్తులను నిర్దయగా అణచివేస్తానని అధిష్టానానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇదే సందర్భంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటి టి జె ఎ సి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని పట్టణాల్లో , నగరాల్లో భారీ ఎత్తున ఊరేగింపులూ, నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణా ఏర్పడదేమో నన్న అపనమ్మకంతో వరంగల్లు, కరీం నగర్, అదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలలో మొత్తం ఏడుగురు యువతీయువకులు అమరులయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గిరిజన కో అపరేటివ్ సంస్థలో గిరిజన ప్రాంతల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పనులు చేసిన ఒక కాంట్రాక్టర్ నుండి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారిణి పి.మాలతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అని వార్త చెబుతున్నప్పుడు ఆ పి. మాలతి ఫోటోతో కూడిన క్లిప్పింగ్ చూపించారు. ఆమె దేవుని బిడ్డలా అమాయకంగా ఉంది. అందంగా కూడా ఉంది. కాని ఈ పాడు లంచాలు తీసుకునే బుద్ది ఉంటుందని ఎవరూ అనుకునేట్టు లేదామె.

‘ మొన్ననే విడుదలైన ‘ టెంత్ క్లాస్ ‘ అనే సినిమాను చూచి ఉత్తేజితులైన ఇద్దరు పదవ తగతి విద్యార్థులు మధిర పట్టణంలో తాము ఎనిమిదవ తరగతి నుండే ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులకు విన్నవించినప్పుడు.. వాళ్ళు తీవ్రంగా మందలించడంతో ఇద్దరూ ఈ సాయంకాలం నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మాయి పేరు కె.స్వర్ణ.. పదవతరగతి ప్రేమికుని పేరు మహేష్. చిన్న పిల్లల్లో ఈ రకమైన ఆలోచనలు రేకెత్తించే అసాంఘిక సినిమాలను నిషేదించాలనీ , ఇతర ఇంటర్ నెట్, స్మార్ట్ ఫోన్, ఫేస్ బుక్ వంటి మీడియా మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని విజ్ఞులు విజ్ఞప్తి చేస్తున్నారు.

” స్టాప్ ” అని అరిచాడు చెన్నకేశవులు.

రాజ్యలక్ష్మి రిమోట్ తో చటుక్కున టి.వి ని ఆపేసింది. నిజానికి అట్లా అరవాలని సుభద్ర అనుకుంది.

మరుక్షణం నిశ్శబ్దం అక్కడ.

ఎక్కడికి పోతున్నాం మనం. ఏం జరుగుతోంది మన చుట్టూ ఈ సమాజంలో. అవినీతి అనేది రాజకీయాల్లో విపరీతంగా ప్రబలిపోవడం వల్లనే ఈ ఉద్యమం పుట్టి ప్రతిరోజూ పిల్లలు ఆత్మాహుతులు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేతినిండా జీతాలు తీసుకుంటూ కూడా లంచాలకు మరిగి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సినిమాలను నిర్మించే వాళ్ళు తమ సామాజిక బాధ్యతలను మరిచి నిస్సిగ్గుగా ఇష్టమున్నట్టు సినిమాలు తీస్తూంటే సెన్సార్ వాళ్ళు లంచాలు తిని కళ్ళు మూసుకుని ఈ ద్రోహం చేస్తున్నారు.. ఈ ఎనిమిదవ తరగతి పిల్లలకు ప్రేమలా.. అక్రమ సంబంధాలతో భార్యే భర్తను చంపించడం.. రోడ్ మీద .. హింస. దాన్ని క్యాష్ చేసుకోవాలని టి వి చానళ్ళ నిరంతర విపరీత ప్రచారం.. ఏమైపోతున్నాం మనం.

రాజ్యలక్ష్మి ఏదో తోచినట్టుగా లేచి మెల్లగా ప్రక్కనున్న బెడ్ రూం లోకి వెళ్ళి ఒక అట్ట పెట్టెను తెచ్చింది.

దాని నిండా కాగితాలే. చెన్నకేశవులు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆమూలాగ్రం చదివే మూడు పేపర్లలోని అవినీతి, అనైతిక , సామాజిక ద్రోహ, దేశ ద్రోహ విషయాలు.. పెద్ద స్థాయిల్లో ఏ ఏ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉండి ఈ దేశానికి హానీ, ద్రోహం, లూటీ, దోపిడీ చేసిన బాపతు.. అన్నీ ప్రెస్ లో వచ్చిన ఉదంతాల కట్టింగ్స్, క్లిప్పింగ్స్ మార్కర్ పెన్నుతో గుర్తించి పదిలపరిచిన వివరాలు అవన్నీ..’ ఇండియా టు డే ‘, ‘ ఫ్రంట్ లైన్ ‘, ‘ హిందు ‘ , ‘ బిసినెస్ టు డే ‘ , ‘ ఎకనామిక్ టైంస్ ఆఫ్ ఇండియా ‘ వంటి ఎన్నో పత్రికల్లోని కాగితాలు. ఒకటి తీసి సుభద్ర చేతికిచ్చింది. అది ‘ ఇండియా టు డే – 2010 సంవత్సరాంతపు సంచిక. అవినీతి ప్రంపంచం -2010 ‘

లోపల 1) 2జి కుంభకోణం ఎ.రాజా, రూ 1,76,000 కోట్లు, 2) అవినీతి నిఘా సంస్థ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేటెడ్ అంచనాల ప్రకారం 1948-2008 మధ్యకాలంలో రూ.20,79,000 కోట్లు మన దేశం నుండి అక్రమంగా వెళ్ళింది. 3) 2008 లో భారతదేశం లోని మొత్తం నల్లధనం విలువ రూ 28 లక్షల కోట్లు.4) భారతీయుల డిపాజిట్లు 2008 నాటికి స్విస్ బ్యాంకుల్లో 1891మిలియన్ డాలర్లు మూలుగుతున్నాయి. ఇట్లా ఒక పెద్ద లిస్ట్.

మన తెలుగు పత్రిక ‘ ఆంధ్రజ్యోతి ‘ తన 20 జనవరి,2011 సంచిక ప్రకారం ‘ స్వాతంత్ర్యం తర్వాత రు 1,00,00,000,00,00,000 కోట్ల రూపాయల అవినీతి ‘ శీర్షిక .

1) జీపుల కొనుగోళ్లలో -1948 , భారత హై కమీషనర్ వి.కె. కృష్ణమీనన్ .. నుండి మొదలై 36) ఆహారం కోసం చమురు-2005 కేంద్ర మంత్రి కె. నట్వర్ సింగ్ కుంభకోణం దాకా అన్నీ సవివరమైన వివరాల ఒక పట్టిక 36 మందిది.

1991 లో భారత పార్లమెంట్ ‘ ప్రపంచీకరణ ‘ తర్వాత ‘ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా ‘ ( NIP ) తో S E Z .. స్పెషల్ ఎకనామిక్ జోన్స్.. ఏర్పాటు చేసినప్పటీ నుండి ఎన్ని వేల ఎకరాల భూములను ఎవరెవరు పంచుకుని తిన్నారు..ఆ వివరాలన్నీ.,

వై.ఎస్. రాజశేఖరరెడ్ది హయాంలో ‘ మొబిలైజేషన్ అడ్వాన్స్ ‘ ల రూపంలో జరిగిన వందల , వేల కోట్ల ప్రజాధనం ఎట్లా నేతలు దోపిడి చేశారో ఆ వివరాలు.. ఎన్నో. . సాధికారికంగా.,

” ముఖ్యంగా స్వాతంత్ర్యానంతర భారతదేశాన్ని ప్రధానంగా దోచుకున్న వాళ్ళు ప్రముఖంగా రాజకీయ నాయకులు, వ్యాపారస్థులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ వ్యక్తులు, ఉన్నత స్థాయి ఉద్యోగులు , చివరికి ప్రజల్లో ‘ ఎవరిది ఈ దేశం అంటే.. ఎవనిదో నాకేమెరుక ‘ అన్న ఆలోచనగల గల ఇంటి దొంగలు.

ఈ రకంగా 1948 న స్వతంత్రమైన ఈ దేశాన్ని చిన్నప్పటినుండే కత్తులతో పొడిచి పొడిచి ఎదుగనీయకుండా.. హింసించీ హింసించీ ధ్వంసం చేశారు.

దాదాపు 2006 నాటికి ఒక్క రాజకీయ నాయకులు, పైన చెప్పిన ఇతర ద్రోహ వర్గాల్లో మాత్రమే అవినీతి పేరుకుపోయి ఉండేది. కాని చిత్రంగా 2006 నుండి ఈ దేశ ప్రజల్లో కూడా ద్రోహ చింతన, అవినీతి, అనైతికత , నీతి హీనత, కేవలం డబ్బు స్పృహ, ‘ నువ్వొస్తే ఏం తెస్తావు.. నేనొస్తే నాకేమిస్తావు ‘ అన్న ఆలోచన గల తరం నూటికి 85 శాతం తయారయ్యింది. విచ్చలవిడితనం, అరాచకత్వం, అతి స్వేచ్ఛ, అవిశ్వసనీయత.. ఈ రుగ్మతలన్నీ పెచ్చరిల్లిపోయి.. ఇప్పుడు మనం అంధకారంలో జీవిస్తున్నాం సుభద్రా.

నాకైతే ఈ సమాజం ఇక బాగుపడ్తుందనీ, భవిష్యత్తులో మళ్ళీ మా తరం నాటి విలువలతో కూడిన భారత సమాజం ఆవిర్భవిస్తుందనీ.. అస్సలే నమ్మకం లేదు.

ప్రస్తుత నీచ రాజకీయాలు ప్రజలను మంచి పౌరులుగా, ఈ దేశ సంపదగా , మానవ వనరుగా తయారు చేయడం లేదు. ఓట్ల కోసం అడగకముందే అన్నీ సమకూర్చి వాళ్లను సోమరిపోతులుగా, దేనికీ పనికిరాని వ్యర్థ జీవులుగా తయారు చేస్తున్నాయి . అంతా తాయిలాల బ్రతుకయ్యింది.

ఇదీ అసలైన విషాదం ఈ దేశంలో. ”

ఇక ఆగిపోయాడు చెన్నకేశవులు అలసిపోయినట్టూగా.

రాజ్యలక్ష్మి ఈ అతని ధోరణిని పెళ్ళైన నాటినుండీ వింటూనే ఉంది.

సుభద్ర ఆ క్షణం నిజమైన చెన్నకేశవులును సమగ్రంగా దర్శించి.. మౌనంగా లేచి నిలబడి.. ఎందుకో వంగి అతని పాదాలకు మొక్కి మౌనంగా బయటికి .. తన గది దిక్కు నడుచుకుంటూ వెళ్ళింది నిశ్శబ్దంగా.

8

చాలా తొందరగా.. ఉద్విగ్నంగా .. ఉత్కంఠగా.. ఉక్కిరిబిక్కిరిగా ఉంది శ్వేతకు.

అప్పుడామెకు ఈ ప్రపంచం అతి సుందరంగా.. అతి అందంగా.. అత్యంత సుఖవంతంగా అనిపిస్తోంది కూడా. మనుషులకెప్పుడూ చుట్టూ ఉన్నపరిసరాలు, ప్రపంచం తామున్న మానసిక స్థితిగతుల్ని బట్టి కనిపిస్తూంటాయి.

ఆ క్షణం ఆమె వరంగల్ బస్టాండ్ లో రోహిత్ కోసం ఎదురు చూస్తోంది చాలా టెన్షన్ తో.

మాటిమాటికి సెల్ ఫోన్ లో టైం చూచుకుంటోంది అసహనంగా. అప్పటీకే అరగంట లేట్ తాము అనుకున్నదానికంటే. నిన్న రాత్రే ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు తామిద్దరూ ఎప్పటినుండో అనుకుంటున్న ఈ ‘పని ‘ కోసం.

కాని.. ఆలస్యమెందుకు.

చెమటలు పోస్తున్నాయి.. గుండెలదుర్తుతున్నాయి. లోపలేదో కెమిస్ట్రీ అంతా తారుమారౌతూ ఏవేవో ఆలోచనలు కీడును శంకిస్తున్నాయి. కన్న కలలన్నీ కల్లలౌతాయా. కష్టపడి రూపొందించుకున్న ప్రోగ్రామంతా తారుమారౌతుందా. అనుకున్న ‘ పని ‘ జరుగదా. అసలు రోహిత్ రాడా.

సరిగ్గా పది గంటలకు కలుసుకోవాలి తాము. కలుసుకుని బస్సులో నర్సంపేటకు వెళ్ళాలి. అక్కడ.,

ఏదీ.. పదీ నలభై . రోహిత్ పత్తా లేడు.

అప్పటిదాకా ఒళ్ళంతా చిటపటలాడించిన ఎండ మాయమై.. మబ్బు పట్టింది ఆకాశమంతా. చల్లగా ఉల్లాసంగానే ఉంది. కాని అప్పుడున్న టెన్షన్ కు ఆమెకు భలే చికాగ్గా ఉంది.

సరిగ్గా అప్పుడే .. రcయ్ మని వచ్చాడు రోహిత్ ఒక మోటార్ బైక్ పై తామనుకున్నట్టు రైల్వే స్టేషన్ బయట పోస్ట్ ఆఫీస్ దగ్గరికి. శ్వేత ప్రక్కనున్న చెట్టుకింద నిలబడ్డది.

‘ ఈ మోటార్ సైకిలేంది మధ్య ‘ , అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఇద్దరూ కలిసి బస్ లో ప్రక్క ప్రక్కన కూర్చుని స్పర్శానందాన్ని అనుభవిస్తూ నర్సంపేట కు వెళ్లి.. కదా.

వ్చ్.. ఏమో.. చూద్దాం.. అనుకుంది.

రోహిత్ బైక్ ను దూకుడుగా శ్వేత ఉన్న చోటికి వేగంగా తీసుకుపోయి.. ” కం ” అన్నాడు ధీమాగా. అతని కళ్లలో వేయి వాట్స్ బల్బులోలా పూర్తి కాంతి ఉంది. ఉత్సాహముంది. శరీరం నిండా హై ఓల్ట్ విద్యుత్తు ఉంది. ఆమెకు కూడా బహు తొందరగా , ఉత్సుకతగా ఉంది.

అదురుతున్న గుండెలతో అతనికి దగ్గరగా వచ్చి ” ఎందుకింత లేట్ రోహిత్.. నేనెంత టెన్షన్ పడ్తున్నానో తెలుసా ” అంది గోముగా.

” చెప్తానుగని .. వెనుకెక్కి కూర్చో” అని బండిని ముందు ఆపాడు గర్వంగా.. ధీమాగా.

లోపలున్న ఉద్వేగంతో మారు మాట్లాడలేని శ్వేత చేతిలోని బ్యాగ్ ను వెనక్కి భుజాలకు తగిలించుకుని అతని భుజాన్ని పట్టుకుని ఒక్క అంగతో మోటార్ బైక్ పైకి లంఘించి కూర్చుంది. శ్వేతది అశ్వజాతి. ఆమె ఆరబ్ గుర్రంలా సన్నగా , నాజూగ్గా, దృఢంగా చురుగ్గా ఉంటుంది. చాలా ధైర్యవంతురాలామె. తెలివైందీ, చొచ్చుకుపోయేదీ, ఎదుటి మనుషులను చాతుర్యంతో ఉక్కిరిబిక్కిరి చేసేదీ.

శ్వేతను రోహిత్ పడేసాడా.. రోహిత్ ను శ్వేతే పడేసిందా.. అంటే చెప్పడం కష్టమే. మొత్తం మీద వాళ్ళు ఒకరికొకరు పడిపోయారు. యుక్తవయసు మనుషులను మంత్రించి మత్తులో ముంచెత్తి పిచ్చోళ్ళనూ, విచక్షణా రహితుల్నీ చేస్తుంది.

నిజం చెప్పాలంటే.. వయసు ఒక స్థితిలో విరహంతో ఆవులిస్తూ మనుషుల్ని దహించివేస్తూ ఏ అకృత్యానికైనా పురికొల్పుతుంది. దుస్సాహసాలకు పూనుకునేట్టు మెడపట్టి ముందుకు తోస్తుంది. ఒకరకంగా లోపల గర్జించే సముద్రమై పోరుతుంది.

ఈ వయసు పెడ్తున్న పోరులో భాగమేనా.. ఇపుడు తను చేస్తున్న దుస్సాహసం. సీత గీత దాటడమంటే ఇదే కదా. ఒక రకంగా తప్పే ఈ నిర్ణయం. కూడనిది. ఎవరూ హర్షించనిది. నలుగురికి తెలిస్తే తలవంపులు తెచ్చేది.

ఒక క్షణం సేపు.. తిరిగి వెనక్కి వెళ్ళిపోతే బాగుండునా.. అని కూడా అనిపించింది శ్వేతకు. గుండె దడ దడా కొట్టుకొంది.

అమ్మ జ్ఞాపకమొచ్చింది. అమ్మ ఇంటి దగ్గర బీడీలు చేస్తుంది. ఎప్పటిదో పాత కుట్టు మెషీన్ తో బట్టలు కుడ్తుంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కస్టమర్లకు ఇచ్చే చేతి సంచులను కుడ్తుంది రాత్రింబవళ్ళు. పండుగల సీజనప్పుడు అసలు తీరనే తీరదు. వాస్తవానికి ఒక ఎదిగిన కూతురుగా తను అమ్మకు సహాయం చేయాలె పనుల్లో.. కాని వ్యక్తిగతమైన బలహీనతలవల్ల సామాన్లను మోసే.. కార్గో ఆటో నడిపే నాన్న, బీడీలు చేసి సంపాదిస్తూ ముగ్గురు పిల్లలను సాదే అమ్మ ఉన్న కుటుంబంలో.. పోరు పెట్టి తను ఒక స్మార్ట్ ఫోన్ ను కొనుక్కుంది. ‘ లావా ‘. ఫైనల్ ఇయర్ కు వస్తున్నాను కదా.. అవసరమౌతుంది ప్రాజెక్ట్ వర్క్ లో .. అని ఒక ల్యాప్ టాప్ ను కొనిపిచ్చింది నాన్నతో చెప్పి. డెల్.. ఇన్ స్టాల్ మెంట్స్ మీద. ఏడువందల అరవై రూపాయలు నెలకు. నలభై నెలలు. కడ్తూనే ఉన్నాడు నాన్న. తన కోర్స్ ఐపోతుంది.. అతను కడుతూనే ఉండాలె కిస్తీలను మూడేండ్లదాకా. ఇద్దరు తమ్ములు. ఒకడు ఇంటర్.. ఇంకొకడు పదవక్లాసు.

ఇక ఈ సంవత్సరంతో తన బి.టెక్ ఐపోయి ఎక్కడైనా ఉద్యోగంలో చేరితే తమ కష్టాలు కడతేరుతాయని ఆశ అమ్మా నాన్నకు.

కాని అమ్మకు తెలియదు, ఈ హంటర్ రోడ్ లో ఉండే దిక్కుమాలిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజిల్లో చదివి పాసయ్యే విద్యార్థులకు అసలు ‘ క్యాంపస్ ప్లేస్ మెంట్సే ‘ రావని. ఫీ రీఎంబర్స్ మెంట్ కింద ఉచితంగా చదువుతున్న తనవంటి విద్యార్థులు తనవలెనే దారి తప్పుతూ తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసేదిదే పాయింట్. ‘ ప్రభుత్వమే ఫీజు కట్టి చదివిస్తోంది.. పెద్దగా మీరు మాకు చేస్తున్నదేమిటి.. ‘ అని ఓ దబ్బుడ్కపు గుచ్చుడు. పాపం.

బి.టెక్ పాసైతే.. ఏ రిలయెన్స్ ఫ్రెష్ లోనో, స్పెన్సర్స్ లోనో బిల్లింగ్ పర్సన్.. నెలకు ఆరు వేలు. దానిక్కూడా ఎం.టెక్ క్యాండిడేట్స్ పోటీ. పెట్రోల్ పంప్ లో కూడా అంతే.. మహిళా వర్కర్స్. కమీషన్ నెలకు ఐదారు వేలు దాటదు. తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

కాని.. సెల్ ఫోన్లో బూతు ఐటంస్ చూడాలనే కోరిక చావదు యు ట్యూబ్ లో. ‘ తెలుగు బూతులు ‘ వింటూ.. నరాలు జివ్వు జివ్వు. రాత్రుళ్ళు ఒంటి గంటదాకా ల్యాప్ టాప్ లో న్యూడ్ సైట్స్ ను చూడకుండా ఉండలేదు.

‘ ఇక పడుకోరాదే.. బాగా రాత్రయ్యింది ‘ అని అమ్మ సంచులు కుడ్తూ మందలిస్తే, ‘ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటాన్నమ్మా ‘ అని బుకాయింపు. బూతు సైట్సూ, పోర్నో చానల్సూ చూడకుండా ఉండలేని అంతర్ దాహం ఏదో నిరంతరం. శారీరక దాహం. ప్రతిరోజూ కాలేజ్ కు పోగానే కొత్తగా ఐడెంటిఫై చేసిన కొత్త నెట్ లింక్స్ , టైటిల్స్.. ను ఇస్తారు శశికళ .. రోహిత్.. ఇద్దరూ. మళ్ళీ రాత్రికి రెడీ.. నిరంతర ఉత్సుకత.

తప్పని తెలుసు.. కాని ఆపుకోలేని అంతర్ తపన.. తెలియని దాహం.. ల్యాప్ టాప్ లో బోలెడన్ని సినిమాలు, వీడియోలు.. ఎంతసేపు చూచినా బుద్ది తీరదు.

చదువు చట్టుబండలే. ఇక ఎల్లుండి పరీక్షలనగా.. గబగబా చిట్టీలు.. సార్లకు మస్కాలు .. వాళ్ళుకూడా ఫేక్ టీచర్స్. ఎవనికీ పాఠం చెప్పరాదు. లోపల మెటీరియల్ లేదు. ఒట్టి డొల్ల మనుషులు. దొంగ డిగ్రీలు. నకిలీ కూలికొచ్చిన విద్యావంతులు ఇన్స్ పెక్షన్ల కోసం. ‘ దోసిళ్లకు దోసిల్లు మార్కులు ‘ వెరసి డిస్టింక్షన్ మార్కులే అందరికీ. ‘

చివరికి ‘ విధి ఒక విషవలయం ‘ అని పాడ్తూ విద్యార్థులు.,

‘ చుట్టూ ఒక భయంకరమైన కాలుష్య , విష వాతావరణంలో జీవిస్తున్నారు ఈ నాటి యువతరం.. అందులోనుండి బయటపడ్డం చాలా కష్టం.. ఇంట్లో మహమ్మారి టి వి. చేతిలో విషగుళిక స్మార్ట్ ఫోన్ , పడకగదిలో రాక్షసి ల్యాప్ టాప్ , బయటికొస్తే బట్టలూడదీసుకుని ఎదుట ఆకాశమెత్తు నిట్టనిలబడే సినిమా హీరోయిన్ల నగ్న హోర్డింగ్స్. పిచ్చోళ్లను చేసే వందలకొద్దీ వాట్స్ అప్ లు.. అన్ లిమిటెడ్ టాకింగ్.. ఏహ్.. మ్యాడ్ మ్యాడ్. యంగ్ పీపుల్ ఆర్ శ్లేష్మం లో చిక్కుకున్న ఈగలు దోమలు. ‘ అని పర్సనాలిటీ డెవలప్ మెంట్ పై గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికొచ్చిన ఒక ముసలాయన గోల.

‘అంతిమంగా.. పోతే పోనీ పోరా.. ‘ అని పాడుకుంటూ.. బురదలోకి జై హనుమాన్ అని దూకుడు. ‘ తర్వాత ఏం జరిగినా చూచుకుందాం ..ఇప్పుడైతే ఈ చేతికందిన సుఖాన్ని అనుభవిద్దాం పద ‘ అన్న తెగింపు.

ఆ.. ఏముంది.. కడుక్కుంటే పోలా.. అని దుస్సాహసం.

ప్రతిరోజూ రోహిత్ పొద్దంతా పెట్టే మెస్సేజ్ లు జ్ఞాపకమొచ్చినై.

మొదట్లో చాలా కోపంగా.. ఇబ్బందిగా, అసహ్యంగా, జుగుప్సాకరంగా అనిపించి ప్రిన్స్ పాల్ కు పిర్యాదు చేద్దామా అనిపించేది. కాని రోహిత్ అంటే ఏదో ఒక మూలన తనకే తెలియని సానుకూల భావన ఉందని అంతరంగాన్ని తరచి తరచి చూచుకుంటే అర్థమైంది. అదీగాక రోహిత్ యొక్క పర్సనాలిటీ ఏ స్త్రీ నైనా కవ్వించి ఉత్తేజపరిచేదే. మెలమెల్లగా లొంగిపోవడం మొదలైంది. తన మౌనమే అర్థాంగీకారమని గ్రహించిన రోహిత్ ఇక విజృంభించాడు. ఆడదానికి యవ్వనంలో తను ఇష్టపడే పురుషుని దూకుడు చాలా చాలా నచ్చి లొంగిపోయేట్టు చేస్తుంది. అదే జరిగింది తమ విషయంగా.

ఒక రోజు.. సాయంత్రం అమృత టాకీస్ దగ్గరికి రమ్మని మెస్సేజ్ పెడ్తే వెళ్ళింది. కాఫీ తాగుదామంటే.. సరే అని అశోకా కు వెళ్ళింది. రోహిత్ పెద్దగా ఉన్న కుటుంబం నుండి వచ్చినవాడు కాడు. మధ్యతరగతి. వాళ్ళ నాన్న ఒక అసిస్టంట్ ఇంజనీర్. వెనుకట డిప్లొమా చేసి వర్క్ ఇన్స్ పెక్టర్ గా చేరి అంచెలంచెలుగా పైకొస్తున్నవాడు. చదువులోకూడా తనకంటే షార్ప్ ఏమీ కాదు. ఫస్ట్ ఇయర్ నుండి బుద్దిగల్ల పిల్లగానిగనే ఉండేవాడు. ఫైనల్ ఇయర్ కు వచ్చినంకనే చాలా అగ్రెసివ్ గా మారిండు. ఇంజనీరింగ్ పోరగాండ్లకు లాబొరెటరీ క్లాసులే పెద్ద అట్రాక్షన్. మూడు గంటలు పోరీలు, పోరగాండ్లు ప్రక్కప్రక్కన కూర్చుని ఒళ్ళు తాకించుకుంటూ మాట్లాడుకోవచ్చు. అందుకే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఈ ల్యాబ్ క్లాసులకుమాత్రం తప్పకుండా వస్తరు.

కాఫీలతో మొదలై, మెలమెల్లగా సినిమాలు, అప్పుడప్పుడు పార్కుల్లో ఒంటరిగా కూర్చుని, కాలేజ్ ఎగ్గొట్టి రోజంతా ముచ్చట్లు. ఒకసారి నాన్న చూసిండు వనవిజ్ఞాన్ నుండి తామిద్దరూ బయటికొస్తూండగా ఆటోలో వెళ్తూ.

‘ నిజము నిప్పులాంటిదెప్పుడూ.. నిన్ను దహించకా తప్పదూ ‘ అని ఒక పాట ఎప్పుడో విన్నది.

సినిమాలకు పోయినప్పుడల్లా .. రెండున్నర గంటలు.. ఒక స్పర్శ యాతన. పెనుగులాట. ఒళ్ళంతా వేడి. అగ్ని లోపల. నిప్పుల నిట్టూర్పులు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రాత్రంతా ల్యాప్ టాప్ లో చాటింగ్.. స్కైప్.. వీడియో చాట్. చేయకూడని పనులన్నీ చేస్తూ.. రోత.

దారి తప్పుతోంది తను.. హద్దులు మీరుతోంది తను. తెలిసి తెలిసి తప్పులు చేస్తోంది తను.

కాని.,

” ఏమిటాలోచిస్తున్నౌ.. ఇంత సేపైంది బయల్దేరి ఒక్క మాట మాట్లాడౌ. భయమైతాందా యేంది .? ” అని అన్నడు రోహిత్ బైక్ ను అతి వేగంగా పోనిస్తూ. అప్పటికే నర్సంపేట రోడ్ మీద జాన్ పీరీలు దాటింది బండి.

” ఔను రోహిత్.. నిజం చెప్పాలంటే నిప్పుల్లోకి దూకబోతున్నట్టుగా ఉంది ”

” నాకూ అంతే.. కాని ఇన్ని రోజులుగా కన్న కలలు ఈ రోజు నిజంకాబోతున్నాయన్న ఆతురత కూడా ఒక ప్రక్క సంతోషాన్ని కలుగజేస్తున్నది. ఐనా ఏదో బెరుకు..”

” మనం తప్పు చేస్తున్నామా ”

” ఏమో తెలియది. అసలు ఆ విషయమే ఆలోచనల్లోకి రావట్లేదు నాకైతే. మనం ఎప్పుడెప్పుడు ఒకటౌదామా అన్న తొందరే ఉంది మనసూ, శరీరమూ నిండ. ఒళ్ళంతా నూటా ఐదు డిగ్రీల జ్వరమొచ్చినట్టు సలసలా కాగిపోతాంది.. చూడు పైన చెయ్యేసి ”

సరిగ్గా ఆ క్షణం శ్వేతే అతని ఒంటిపై చేయేసి ఆ స్పర్శానందాన్ని పొందుతూ .. తనను తాను పరవశింపజేసుకోవాలనుకుంది. కాని రోహితే.,

వెంటనే అతని మెడమీద .. భుజం పై చేయేసి.. టి షర్ట్ ను ప్రక్కకని.. వ్రేళ్ళను లోపలికి చొప్పించి.,

మరుక్షణమే బైక్ వేగం పెరిగి.. స్పీడ్ వంద దగ్గరికి చేరుకుంటున్నట్టు తెలుస్తోందామెకు.

” తొందరగా ఉందా పిల్లగా ” అంది చెవి దగ్గర మెల్లగా.. గోముగా.

లోపల ఉన్న వేల నరాలను ఎవరో బిగించి శృతి చేసి మీటినట్టు.. గుల్లేర్ దెబ్బ ఏదో తగిలి.. మధురమైన బాధ దేహమంతా విస్తరిస్తున్నట్టు.,

‘ అబ్బా.. ‘ అని లోలోపలే మూల్గి.,

ఇక లాభం లేదనుకుని ఆమె అతని నడుం చుట్టూ చేయిని చుట్టి.. బిగించింది.

ఇద్దరి శరీరాల్లోనూ.. అగ్ని కీలలు.. దాహం.

‘ కామాతురాణాం న బిడియం న లజ్జ ‘ అని మొన్న ఏదో ఒక టి.వి చానళ్ళో గరికపాటి నరసింహారావు అనే పౌరాణికులు చెబుతూండగా వింది తను. ఇప్పుడు తామిద్దరిది అదే స్థితా.

ఛీ ఛీ.. పానకంలో పుడకలాగ ఈ దిక్కుమాలిన ఆలోచనలు.

అసలిప్పుడు తను భయపడ్తున్నట్టా. ఆందోళన చెందుతున్నట్టా. మరి లోపల ఒక మూల ఈ బెరుకుతనమేమిటి.

ఉహూ.. మంచో చెడో దిగింది తను రంగంలోకి.. అంతే.. జరుగవలసింది జరుగుతుందిక. పులి నోట్లో తల పెట్టి.. ఇక ఇప్పుడీ ఆలోచనలేమిటి.,

కొద్దిగా.. మెత్తగా .. మెల్లగా రోహిత్ నడుము దగ్గర గిచ్చింది.

రోహిత్ అతితీయని బాధతో గిరికిలు కొట్టి.. ” ఏయ్.. నీ సంగతి చూస్తానాగు.. ” అని బైక్ ను ఇంకా వేగంగా పోనిస్తూ.. కలల్లో తేలిపోతూండగా.,

ఊళ్ళు వెనక్కి పారిపోతున్నాయి. ధర్మారం.. గీసుకొండ.. ఊకల్లు.. మచ్చాపూర్.,

” అబ్బా ఇంకెంతసేపు.. ” అని శ్వేత ధ్వని.

” నాకూ తొందరగా ఉందే పిల్లా.. వచ్చె ”

ఖానాపూర్.. తొగర్రాయి, లక్నేపల్లి, మహేశ్వరం .. బాలాజీ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్.. ఎదురుగా గురుకుల పాఠశాల.

మోటార్ సైకిల్ బాణంలా దూసుకుపోతోంది.

రోహిత్ నర్సంపేటలో స్థానికంగా ఉండే ఒక స్నేహితునితో లాడ్జ్ బుకింగ్.. తదితర ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు వారం రోజులనుండి . ఎవ్రీ థింగ్ ఈజ్ ఒ.కె.. అని ఫ్రెండ్ నుండి సిగ్నల్ వచ్చిన తర్వాతనే బయలుదేరాడు. అందుకే కొంచెం ఆలస్యమయ్యింది బయల్దేరడం. బైక్ ను కూడా ఒక స్నేహితుణ్ణి అడిగి తెచ్చుకుంటున్నాడు. ఐనా .. ఏదో భయం.

సరిగ్గా పదకొండున్నరకు ఇద్దరూ నర్సంపేట బస్ స్టాండ్ అవతల ఉన్న తన ఫ్రెండ్ ఏర్పాటు చేసిన లాడ్జ్ కు వెళ్ళి.. కౌంటర్ లో.,

భయం గజ గజా.. లోపల వణుకు.

శ్వేత భయం భయంగా.. ముఖాన్ని ఎవరైనా చూస్తారేమో నని స్కార్ఫ్ ను పదిలంగా తల చుట్టూ చుట్టుకున్న దాన్ని.. ‘ అట్లయితే హోటల్ వాళ్ళు అనుమాన పడ్తారనీ, దాన్ని తీసేయమనీ ‘ చెప్పాడు రోహిత్. సరే అని తీసేయక తప్పలేదు.

ఇంతకూ.. తామిద్దరు ఎవరని లాడ్జ్ రిజిస్టర్ లో రాయించి.. అకామడేషన్ తీసుకుంటడిప్పుడు.,

గత వారం ఈ ప్లాన్ ను వేస్తున్నప్పుడే రోహిత్ చెప్పిన ఒక విషయం జ్ఞాపకమొచ్చింది శ్వేతకు చప్పున.

” నా ఫ్రెండ్ వాళ్ళ బాబాయిదే ఈ హోటల్.. కం లాడ్జ్. మనం పెళ్ళాం మొగలం. హైదరాబాద్ నుండి వస్తున్నాం. ఇంకా అవతల ఉన్న భద్రాచలం పోవాలె. ఈ రోజు ఇక్కడుండి విశ్రాంతి తీసుకుని సాయంత్రమో, రేపుదయమో వెళ్తాం. ఇదీ కథ .” అన్నాడప్పుడు రోహిత్. అది విన్నప్పుడు చాలా భయమేసింది శ్వేతకు. తప్పు చేస్తున్నానా అని గజగజలాడిపోయింది.

భారతదేశ సాంఘిక ఆచార సాంప్రదాయాలు ఎంత బలమైనవో.. అనిపించిందా క్షణం. దీన్నిప్పుడు అక్రమ సంబంధమంటరా.. వివాహేతర సంబంధమైతే కాదు.. అసలు వివాహమే కాలేదు కాబట్టి.

రోహిత్ లాడ్జ్ కౌంటర్ లో మాట్లాడుతూండగా.. శ్వేత అటు బయటికి కిటికీ గుండా చూస్తూ ఉండిపోయింది జరుగుతున్న తతంగాన్ని సునిశితంగా గమనిస్తూ.

రోహిత్ తన జేబులోని ‘ ఆధార్ కార్డ్ ‘ ను చూపిస్తున్నాడు.

మేనేజర్ ఏదో కొర్రీ వేసినట్టున్నాడు బహుశా అడ్రెస్ గురించి ఐ ఉంటుంది. మీది హైదరాబాదైతే మరి వరంగల్ అడ్రెస్ ఉందేమిటి దీని మీద .. అని కావచ్చు.

‘ మాది నేటివ్ వరంగల్లే.. కాని ఇప్పుడు హైదరాబాద్ లో.. ‘ అనిచెబుతున్నాడు ఏదో.

మొత్తంమీద మరో పది నిముషాల లోపల రోహిత్ అతని ముందు పెట్టిన రిజిష్టర్ లో అంతా రాసి.. వచ్చాడు తన దగ్గరికి.. ఒక బాయ్ వెంట వచ్చి ఇద్దరినీ పై అంతస్తుకు తీసుకెళ్ళాడు.

” హమ్మయ్య ” అనుకున్నారిద్దరూ. బాయ్ తాళం తీసి గది తలుపులు తీస్తూండగా సంతోషంతో.. ఇద్దరి దేహాల్లో నిప్పు రాజుకోవడం మొదలైంది మళ్ళీ. లోపలికి వెళ్ళగానే బెడ్స్ సర్ది.. నీళ్ళు పెడ్తూ టైం వేస్ట్ చేస్తున్న బాయ్ మీద చాలా కోపమొచ్చింది ఇద్దరికీ.

ఓ పది నిముషాలు కాగానే.. బాయ్ కు ఓ పది రూపాయల టిప్ ఇచ్చి తొందరగా వెళ్ళగొట్టి .. లోపలి నుండి తలుపులకు టవర్ బోల్ట్ వేసుకుని.,

జీవితంలో మొట్టమొదటి స్త్రీ స్పర్శ.. స్త్రీ పొందు.. స్త్రీ సౌఖ్యం.,

జీవితంలో మొట్టమొదటి పురుష స్పర్శ.. మొట్టమొదటి.,

తొందర.. తొందర.. తొలి రతికోసం తొందర.

రోహిత్ చుట్టుకుపోయాడు శ్వేత చుట్టూ.. అల్లుకుపోయి.. కరుచుకుపోయి.. హత్తుకుపోయి.,

నాలుగేండ్ల దాహం.. ఎన్నాళ్ళుగానో సీతాకోక చిలుకలై విహరించిన స్వప్నాలు.

ఈ భౌతిక ప్రపంచంలో లేరు వాళ్ళు. రసోద్విగ్న పారవశ్య లోకంలో విహరిస్తూ విహరిస్తూ.. తమ ఉనికినీ, అస్తిత్వాన్నీ, స్థితినీ మరిచి ఒకరిలో ఒకరు లీనమై.. ఒక మహా సంతృప్తానుభూతిని పరస్పరం పొందుతూ ఆ తన్మయత్వంతో తడిచిపోతున్న క్షణం.,

అరటి ఆకుపై వర్షపు చినుకు కురిసి మెలమెల్లగా కదుల్తూ కదుల్తూ జారి భూమిపై పడుతున్నట్టు.,

రసానుభూతి తెగిపోయింది ఒక విద్యుత్ మెరుపులా

ఇద్దరూ వెల్లగిలా ప్రక్క ప్రక్కనే పడుకుని.. పైన కిర్ కిర్ మని సన్నగా చప్పుడు చేస్తూ తిరుగుతున్న పంఖావైపు చూస్తూ,

లోపల ఒక నిశ్శబ్ద సముద్రం శ్వాసిస్తూ గర్జిస్తోంది ఇద్దరిలో.

జరిగింది మహాద్భుతం.. పొందింది పరమ రసానుభూతి.. ఎన్నటికీ మరుపురాని తొలి సంభోగానుభవం.. మధురం, అమరం.

( మిగతాది వచ్చే పక్షం )

రామాచంద్ర మౌళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు