మంటో కథ: అవమానం

సాదత్ హసన్ మంటో (1912–1955)  ప్రముఖ ఉర్దూ రచయిత, కథకుడు, నాటక రచయిత. భారత ఉపఖండంలోని సామాజిక వాస్తవాలను, మానవ స్వభావాన్ని, ద్వంద్వ ప్రవృత్తులను తన కథల్లో నిర్భయంగా చిత్రించినందుకు ఆయన ప్రసిద్ధి చెందాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన మంటో, భారత దేశ విభజన సమయంలోని అనుభవాలను, సమాజంలోని వివక్షలను, మతపరమైన ఘర్షణలను తన రచనల్లో విశ్లేషించాడు. 

ఆయన రచనలు, ముఖ్యంగా “టోబా టెక్ సింగ్”, “ఖోల్ దో”, “ఠండా గోష్ట్” వంటి కథలు, విభజన సమయంలో భయానక పరిణామాలను, మానవత్వం యొక్క లోతైన అంశాలను వెల్లడి చేస్తాయి. మంటో రచనలు తరచూ వివాదాస్పదమైనప్పటికీ, అవి సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. సమాజంలోని నీచమైన వాస్తవాలను బహిర్గతం చేసే ఆయన శైలి, ఆయనను ఒక గొప్ప వాస్తవిక రచయితగా నిలిపింది. 

మంటో బొంబాయిలో సినిమా రంగంలో కూడా కొంతకాలం పనిచేశాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. 1955లో, 42 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశాడు. కానీ ఇప్పటికీ ఆయన సాహిత్యం ఉర్దూ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

*

రోజు ఓపికంతా ఉడిగిపోయిన తర్వాత, ఆమె తన మంచం మీద అలాగే జారగిలబడి వెంటనే నిద్రపోయింది. ఆమె ‘బాస్’ అని పిలిచే నగర పారిశుధ్య విభాగానికి చెందిన అధికారి, ఆమెను తాగిన మైకంలో అనుభవించి, ఇంటికి వెళ్లిపోయాడు. అతను ఆ రాత్రి అక్కడే ఉండేవాడు, కానీ తనను అమితంగా ప్రేమించే తన భార్య పట్ల తనకి చాలా ఆపేక్ష ఉందని చెప్పాడు.

ఆమె శారీరక శ్రమకు ప్రతిఫలంగా ఆ అధికారి నుండి సంపాదించిన డబ్బు బిగుతుగా, లాలాజలంతో తడిసిన ఆమె బ్రా పైనుండి నెమ్మదిగా జారిపోతోంది. ఆ నాణేల శబ్దం ఆమె శ్వాసతో లయబద్ధంగా, ఆమె గుండె కొట్టుకునే గజిబిజి శబ్దంలో కలిసిపోయింది. నిజానికి, నాణేలు ఆమె రక్తంలోనే కరిగిపోతున్నట్లు అనిపించింది! బేరసారాల్లో భాగంగా అధికారి తెచ్చిన బ్రాందీ, సోడా అయిపోయిన తర్వాత వారు నీటితో కలిపి తాగడం వల్ల ఆమె ఛాతీలో మంట రాజుకుంది.

ఆమె తన పొడవైన, విశాలమైన టేకు మంచం మీద పడుకుని ఉంది. ఆమె చేతులు భుజాల వరకు నగ్నంగా ఉండి గాలిపటం విల్లులా విస్తరించి ఉన్నాయి. ఆమె కుడి చంకలో ముడుచుకున్న మందపు చర్మం పదే పదే గొరగడం వల్ల దాదాపు నీలం రంగులోకి మారి, ఏదో కోడిచర్మం ముక్కను అక్కడ అతికించినట్లు కనిపిస్తుంది.

ఆమె గది చిన్నగా, గజిబిజిగా ఉంది. వస్తువులు ప్రతిచోటా చిందరవందరగా ఉన్నాయి. ఆమె మంచం కింద, ఆమె గజ్జి కుక్క మూడో, నాలుగో పాడయిపోయిన చెప్పుల మీద తల ఆనించి, ఒకవైపు పళ్ళు చూపిస్తూ పడుకొని వుంది. ఆ కుక్క బొచ్చు మచ్చలు మచ్చలుగా ఉంది. ఎవరైనా దానిని దూరం నుండి చూస్తే, దానిని నేల తుడవడానికి ఉపయోగించే మడతపెట్టిన గోనె సంచిగా పొరబడతారు.

ఆమె సౌందర్య సాధనాలు లిప్‌స్టిక్, పౌడర్, దువ్వెన, ఆమె జుట్టుముడిలో పెట్టుకోవడానికి ఉపయోగించే ఇనుప పిన్నులు గోడలోని ఒక చిన్న గూడులో దాచి వున్నాయి. దగ్గరలో వేలాడదీసిన పంజరంలో ఒక ఆకుపచ్చ చిలుక పడుకుంది. దాని ముఖం దాని వీపు ఈకలలో దాగి ఉంది. ఆ పంజరం పచ్చి జామకాయ ముక్కలు, కుళ్ళిన నారింజ తొక్కలతో నిండి ఉంది.  దుర్వాసన వెదజల్లే పండు చుట్టూ నల్లటి చిన్న సన్నఈగలు, చిన్న చిన్న చిమ్మటలు ఉన్నాయి. మంచం పక్కన గ్రీజు మరకలు ఉన్న వెనుకభాగంతో ఒక పేముకర్రల కుర్చీ ఉంది. ఈ కుర్చీకి కుడి వైపున హిజ్ మాస్టర్స్ వాయిస్ తయారు చేసిన చిన్నపాటి గ్రామ్‌ఫోన్ ఉన్న అందమైన ఎత్తుపీట ఉంది.

గ్రామ్‌ఫోన్ పై చిరిగిన నల్లటి వస్త్రం కప్పి ఉంది. ఎత్తుపీటపై, గదిలోని ప్రతిచోటా, తుప్పుపట్టిన సూదులు చెల్లాచెదురుగా ఉన్నాయి. ఈ పీట పైన గోడపై ఫ్రేములున్న నాలుగు చిత్రపటాలు వేలాడదీసి వున్నాయి. ప్రతిదానిలో ఒక వ్యక్తి ఫోటో ఉంది.

ఫోటోలకు కొద్ది దూరంలో – అంటే, మీరు గదిలోకి ప్రవేశించే సమయానికి ఎడమ వైపున మూలలో – బహుశా ఒక చించిన గుడ్డను ఫ్రేమ్ చేసిన గణేశుడి ప్రకాశవంతమైన రంగుల చిత్రం ఉంది. దాని ఫ్రేమ్‌పై తాజాగా, ఇంకా వాడిపోయిన పువ్వులు రెండూ వేలాడదీసి వున్నాయి. నూనెగూడు అంటే నమ్మశక్యం కాని ఆ గూడులో, ఆమె ఒక గిన్నె దీపంలో నూనె ఉంచింది. దాని పక్కన ఒక చిన్న దీపం ఉంది. దాని జ్వాల గది యొక్క మసక గాలిలో భక్తుడి నుదిటిపై నామపు రంగులాగా నిటారుగా నిలబడి ఉంది. కాలిపోయిన ధూపపు నుసి ఆ గూడును పాడు చేశాయి.

ఆ రోజు ఆమె మొదటి బోణీ కొట్టినప్పుడు, ఆమె దానిని ముందుకు చాపి, గణేశుడి విగ్రహానికి తాకించి, ఆపై నుదిటికి తాకించి, దానిని తన బ్రాలో పెట్టుకుని ఉండేది. ఆమె స్తనాలు పెద్దవిగా ఉండటం వల్ల డబ్బులు బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ మాధో పూణే నుండి సెలవులకు వచ్చినప్పుడు, ఆమె తన మంచం అడుగు కింద ఉన్న చిన్న బెజ్జంలో కొంత భాగాన్ని దాచాల్సి వచ్చింది. ఆ బెజ్జాన్ని ఆమె దానిని ఈ డబ్బు దాచుకోవడం కోసం మాత్రమే ఉంచింది. ఆమెని తార్చే రామ్ లాల్, మాధో నుండి తన డబ్బును ఎలా దాచుకోవాలో ఆమెకు చెప్పాడు. మాధో పూణే నుండి ఆమెతో పడుకోవడానికి వచ్చాడని విన్నప్పుడు, అతను, ‘ఈ ముండా కొడుకుతో నువ్వు ఎంతకాలం నుండి వుంటున్నావు? బలే వింత ప్రేమ వ్యవహారం! ఆ గాడిదగాడు ఏమీ ఖర్చు చేయడు కానీ నీతో పడుకుంటాడు..నీ డబ్బు తీసుకొని చక్కా పోతాడు !? ఇందులో ఏదో తేడా ఉంది. నువ్వు వాడిని నిజంగా ఇష్టపడుతుండాలి. నేను ఏడు సంవత్సరాలుగా విటులను తెస్తున్నాను. మీ అమ్మాయిలందరి బలహీనతలు నాకు తెలుసు.’

రామ్ లాల్ వందల కొద్దీ వేశ్యలను – పది నుండి వంద రూపాయల వరకు రేటు పలికే వాళ్ళను బొంబాయి అంతటా తార్చాడు. అతను సౌగంధితో, “పిచ్చి ముండా, నీ డబ్బును అలా వృధా చేసుకోకు. నీ మంచం అడుగున ఒక చిన్న గుంట తవ్వి, నీ డబ్బంతా అక్కడే దాచిపెడతాడు. అతను వచ్చినప్పుడు, “నీ మీద ఒట్టు మాధో, నేను రోజంతా ఒక్క విటున్ని కూడా చూడలేదు! కింద ఉన్న టీ బాయ్ నుండి నాకు ఒక కప్పు టీ, ఆ ఫ్లాటూన్ బిస్కెట్ల ప్యాకెట్ ఆర్డర్ చేయి. నా కడుపు చుర్రుమంటోంది” అని చెప్పు. సరేనా? ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. కాంగ్రెస్ పార్టీ, ఆ దొంగనాయాళ్ళు..మద్యాన్ని నిషేధించారు. వ్యాపారం చాలా నెమ్మదిగా ఉంది. కానీ కనీసం నువ్వు మందు తాగడానికి ఒక దారైనా వుంది. నేను దేవుడితో ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ ఖాళీ సీసాలను చూసినప్పుడు, వైన్ వాసన చూసినప్పుడు, నిజంగా నేను కూడా వేశ్యగా పుట్టుంటే బాగుండేదనుకుంటున్నాను.”

సౌగంధికి ఆమెలో ఇతర శారీరక లక్షణాల కంటే ఆమె రొమ్ములే ఎక్కువగా నచ్చాయి. ఆమె స్నేహితురాలు జమున ఆమెను ప్రోత్సహించింది. ‘ఆ ఫిరంగి లాంటి బంతులను బ్రాతో గట్టిగా కట్టేస్తే అవి ఎప్పటికీ దృఢంగా బిగుతుగా ఉంటాయి’. సౌగంధి నవ్వి అంది, “జమునా, అందరూ నీలాగే ఉంటారని నువ్వు అనుకుంటున్నావు. పది రూపాయలకు, మగవాళ్ళు నీతో ఏమైనా చేసుకుంటారు. కాబట్టి అందరి విషయంలో ఇది నిజమే అని నువ్వు అనుకుంటున్నావు. అక్కడ ఎవరైనా నన్ను తాకితే, ఏమి జరుగుతుందో చూడు!” అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. “ఓహ్, నిన్న ఏమి జరిగిందో నీకు చెప్తాను. రామ్ లాల్ తెల్లవారుజామున రెండు గంటలకు ఒక పంజాబీని తీసుకువచ్చాడు. రాత్రికి ముప్పై రూపాయలు ఇవ్వాలని బేరం కుదిరింది. రామ్ లాల్ వెళ్ళిన తర్వాత, నేను లైట్ ఆపేసాను. ఆ వ్యక్తి చాలా భయపడ్డాడు! జమునా, నువ్వు వింటున్నావా? లైట్లు ఆర్పిన వెంటనే, అతను నిలువెల్లా వణకడం ప్రారంభించాడు! అతను చీకటికి భయపడ్డాడు! నేను అన్నాను, ‘ఏమిటి, నువ్వు దేని కోసం ఎదురు చూస్తున్నావు? మూడు కావస్తోంది. నీ సమయం అయిపోవస్తోంది.’ అతను, ‘దాన్ని ఆన్ చేయి, దాన్ని ఆన్ చేయి’ అన్నాడు. నేను అడిగాను, ‘ఏమిటి?’ అతను ‘లైటు! లైటు!’ అని అన్నాడు. ‘ఏం లైటు?’ అతను, ‘లైటు వెయ్యి! లైటు!’ అని అన్నాడు. అతని గాబరా గాబరా గొంతు నాకు నవ్వు పుట్టించింది. నేను అతని బొద్దుగా ఉన్న తొడను గిల్లి ‘వీలు కాదు!’ అని అన్నాను.అతను లేచి నిలబడి లైట్ వేసాడు. నేను నా ఒంటిని అదరా బదరాగా దుప్పట్లతో కప్పుకుని, ‘నీకు సిగ్గు లేదా, వెధవా?’ అని తిట్టాను. అతను మంచం మీదకు తిరిగి వచ్చినప్పుడు, నేను లైట్ ఆర్పివేయడానికి పరుగెత్తాను. ఇది అతనికి మళ్ళీ ఆందోళన కలిగించింది. – కొన్నిసార్లు చీకటిగా, కొన్నిసార్లు వెలుతురుగా, కొన్నిసార్లు వెలుతురుగా, కొన్నిసార్లు చీకటిగా..ఇది ఖచ్చితంగా సరదాగా ఉండే రాత్రి అని గట్టిగా అనుకున్నాను. పొద్దున్నే మొదటి ట్రామ్ రైలు శబ్దం విన్న వెంటనే, అతను బట్టలు వేసుకుని వెళ్లిపోయాడు. ఆ పనికిమాలినవాడు ఏదో పందెం లేదా అలాంటిదేదో గెలిచి ఉండాలి. లేదంటే, అతను డబ్బును ఎందుకు అలా వృధా చేస్తాడు? జమునా, నీకు బుర్ర తక్కువ. అలాంటి వాటికి నాకు చాలా ఉపాయాలు తెలుసు!”

సౌగంధికి నిజంగా చాలా ఉపయోగకరమైన ఉపాయాలు తెలుసు. వాటిని ఆమె ఒకళ్ళిద్దరు స్నేహితురాళ్లతో పంచుకుంది. ఆమె సాధారణ సలహా ఇలా ఉంటుంది, ‘అతను మంచివాడయినా కానీ ఎక్కువగా మాట్లాడకండి.. అతన్ని బాగా ఆటపట్టించండి, చికాకు పెట్టడానికి ప్రయత్నించండి, చక్కిలిగింతలు పెట్టండి, అతనితో ఆడుకోండి. అతనికి గడ్డం ఉంటే, దువ్వెనలా మీ వేళ్లను పోనిచ్చి, తిప్పండి. అతనికి పెద్ద పొట్ట ఉంటే, దాని మీద తబలా కొట్టండి. అతను కోరుకున్నది చేయడానికి అవకాశం ఇవ్వకండి. అతను సంతోషంగా వెళ్లిపోతాడు. మీకు తిప్పలు తప్పుతాయి. ఏమీ మాట్లాడని అబ్బాయిలు ప్రమాదకరం. మీరు వాళ్ళని వాళ్ళ ఇష్టానికి చేయనిస్తే వాళ్ళు నిజంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు!’

కానీ సౌగంధి, తను అనుకున్నంత తెలివైనది కాదు. ఆమె దగ్గరకు క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆమె చాలా భావోద్వేగానికి లోనయ్యేది. కాబట్టి కీలకమైన సమయంలో, ఆమెకు తెలిసిన ప్రతి ఉపాయం ఆమె మనస్సు నుండి పట్టు జారిపోతుంది.

సౌగంధి ఎక్కువగా తన ఊహాలోకంలో నివసించేది. కానీ ఒక దయగల మాట ఆమె శరీరాన్ని ఆనందంతో కుంగదీసేది. శృంగారం విలువలేనిదని ఆమె తనకు తాను చెప్పుకున్నప్పటికీ, ఆమె శరీరం దానిని చాలా ఇష్టపడింది! ఆమె అలసటతో మునిగిపోవాలని కలలు కన్నది. ఆమెను నిద్రపుచ్చేలా చేసే అలసట, రోజంతా నలిగిపోయిన తర్వాత మీద పడే లాంటి నిద్ర – అది ఎంత ఆనందంగా ఉంటుంది! మీ శక్తిలో చివరి బొట్టు కూడా లేకుండా పోయిన తర్వాత మిమ్మల్ని చుట్టుముట్టే ఆ ఒక రకమైన అపస్మారక స్థితి – ఎంత ఆనందం! కొన్నిసార్లు ఆమె ఉనికిలో ఉందో లేదో ఆమెకు ఖచ్చితంగా తెలియదు. కొన్నిసార్లు, ఆకాశంలో ఎత్తుగా తేలుతూ గాలి ఆమెను ఆవరించి ఉండేది. ఆమె మధ్యలో చిక్కుకున్నట్లు అనిపించేది. ఆమె పైన, కింద, కుడి వైపున, ఎడమ వైపున గాలి తప్ప మరేమీ లేదు. అది ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అది ఇంకా అద్భుతమైనది! చిన్నప్పుడు, ఆమె దాగుడుమూతలు ఆడినప్పుడు, ఆమె తన తల్లిని చుట్టుకొని దాక్కునేది. పట్టుపడతామనుకున్నప్పుడు, ఆమె భయపడేది. ఊపిరాడక ఆమె గుండె వేగంగా కొట్టుకునేది. ఆ ఆందోళన, అనుభూతి ఆమెకు ఎంతగా నచ్చేదో..!

సౌగంధి తన జీవితమంతా అలాంటి ఒక తొర్ర లోపల గడపాలని కోరుకుంది, అయితే జనాలు  వృధాప్రయాసగా ఆమెను వెతుకుతున్నప్పుడు, అప్పుడప్పుడు ఆమె వాళ్ళకి తను దొరికేలా చేసేది; అలాగే తను కూడా ఎవరినైనా వెతుక్కునేది. గత ఐదు సంవత్సరాలుగా ఆమె జీవితం దాగుడుమూతలా ఉంది. కొన్నిసార్లు ఆమె ఎవరికోసమో వెతుక్కుంటూ వెళ్ళింది. కొన్నిసార్లు ఒక మగాడు ఆమె కోసం వచ్చాడు. ఆమె జీవితం అలా గడిచిపోయింది. ఆమె సంతోషంగా ఉండాలి కాబట్టి ఆమె సంతోషంగా ఉండేది. ప్రతి రాత్రి ఆమె తన విశాలమైన టేకు మంచం మీద ఒక్కొక్క విటుడితో పడుకునేది. తన విటులను ఎక్కడ వుంచాలో ఆమెకు లెక్కలేనన్ని మార్గాలు తెలుసు. వారి అసభ్యకరమైన డిమాండ్లను అంగీకరించకూడదని, వారితో ఉదాసీనంగా వ్యవహరించాలని ఆమె చాలాసార్లు నిశ్చయించుకున్నప్పటికీ, ఆమె ఎల్లప్పుడూ ఆ బలహీన క్షణంలో చిక్కుకుని లొంగిపోయేది. ఎవరో ఒకరు తనని ప్రేమించాలనే తన కోరికను ఆమె నియంత్రించుకోలేకపోయేది.

ప్రతి రాత్రి ఎవరో ఒక విటుడు తన ప్రేమను ప్రకటిస్తున్నట్లు ఆమెకు అనిపించేది. సౌగంధికి వాళ్ళు అబద్ధం చెబుతున్నారని తెలుసు. అయినప్పటికీ ఏవో భావోద్వేగాలు ఆమెను ముంచెత్తుతాయి. వాళ్లు నిజంగా అలా చేశారని ఆమె ఊహించుకుంటుంది. ‘ప్రేమ’- ఎంత అందమైన పదం! ఆమె దానిని తన శరీరమంతా పూసుకొసి, తనలోకి ఇంకిపోయేలా రుద్దుకోవాలని అనుకుంటుంది.

ఆమె తనను తాను ప్రేమించుకోవడానికే పరిమితం చేయాలనుకుంది. ప్రేమ ఒక జాడీ అయితే, ఆమె అందులో దూరి, పైన ఉన్న మూతను మూసివేస్తుంది. ఆమె నిజంగా ప్రేమించాలనుకున్నప్పుడు, అది ఎవడైనా పర్వాలేదు. ఆమె ఏ మగాడిని అయినా, తన ఒడిలో కూర్చోబెట్టుకొని, అతని తలపై మెల్లగా తాటిస్తూ, అతన్ని నిద్రపుచ్చడానికి లాలి పాట పాడేది.

ఆమె ఎంతగా ప్రేమతో నిండిపోయిందంటే, ఆమె తన విటులలో ఎవరినైనా ప్రేమించగలిగి ఉండేది. అంతేకాకుండా, ఈ ప్రేమను శాశ్వతంగా ఉంచుకోగలిగి ఉండేది. గోడపై ఫోటోలు వేలాడుతున్న నలుగురు పురుషులకు ఆమె అప్పటికే తన ప్రేమను ప్రమాణం చేసింది. ఆమె తనను ఒక మంచి వ్యక్తిలా భావించింది. కానీ మగాళ్ళు ఎందుకు మంచోళ్ళు కాదు? ఆమె ఎప్పటికీ దీన్ని నేను అర్థం చేసుకోలేను అనుకుంది. కాబట్టి ఒకసారి అద్దంలోకి చూసుకుంటూ, ఆమె అకస్మాత్తుగా తనలో తాను ఇలా అనుకుంది, ‘సౌగంధీ, కాలం నీ పట్ల దయ చూపలేదు!’

ఆమె వేశ్యగా గడిపిన సమయం – గత ఐదు సంవత్సరాలలో –  పగలు రాత్రులు మాత్రమే ఆమెకు ముఖ్యమైనవి. ఆమె తన కలల్లో ఉన్నంత సంతోషంగా లేదు, అయినప్పటికీ ఆమె సంతుష్టి చెందింది. ఏమైనా అది ఆమె ఒక రాజభవనం నిర్మించాలని ఆలోచన చేస్తున్నట్లు కాదు. డబ్బు సమస్య కాదు. ఆమె సాధారణంగా పది రూపాయలు వసూలు చేసేది. దాని నుండి రామ్ లాల్ రెండున్నర రూపాయలు కత్తిరించి తీసుకునేవాడు. కాబట్టి ఆమెకు రోజుకు ఏడున్నర రూపాయలు వచ్చేవి. అవి సరిపోయేవి. రామ్ లాల్ చెప్పినట్లుగా, ఆమె ‘డబ్బు గుంజడానికి’ పూణే నుండి మాధో వచ్చినప్పుడు, ఆమె పది లేదా పదిహేను రూపాయలు ఇచ్చేది. ఆమె అతనిపై ప్రేమ కారణంగానే అలా చేసేది. రామ్ లాల్ చెప్పింది నిజమే – సౌగంధికి నచ్చింది ఏదో మాధో దగ్గర ఉంది.

సౌగంధి మాధోని కలిసినప్పుడు, అతను ఇలా అన్నాడు, “నీకు సిగ్గు అనిపించడం లేదా? నాకు ఏం తారుస్తున్నావో తెలుసా? నేను ఎందుకొచ్చానని అనుకుంటున్నావు? ఛీ, ఛీ, ఛీ.. పది రూపాయలు.. నువ్వు చెప్పినట్లుగా..రెండున్నర నీ తార్పుడుగాడికి.. మిగిలింది..ఏడున్నర..అవునా? ఏడున్నర రూపాయలకు నువ్వు నాకు ఇవ్వలేనిది ఇస్తానని మాట ఇస్తున్నావు, నేను తీసుకోలేనిదానిని తీసుకోవడానికి వచ్చాను. నాకు స్త్రీ కావాలి, కానీ నీకు మగాడు కావాలా? ఏ స్త్రీ అయినా ఇది నా కోసం చేస్తుంది, కానీ నువ్వు నన్ను నిజంగా ఇష్టపడుతున్నావా? మన బంధం ఏంటి? అది ఏమీ కాదు, ఏమీ కాదు. ఈ పది రూపాయలు మాత్రమే – రెండున్నర నీ తార్పుడుగాడికి..ఇంక  మిగిలినవి నువ్వు వృధా చేస్తావు – అవే మనల్ని కలుపుతున్నాయి. నువ్వు దాని కోసం కన్నేసావు. నేను దీని కోసం కన్నేసాను. నీ మనసు ఏదో చెబుతుంది, నా మనసు ఇంకేదో చెబుతుంది. మనం కలిసి ఏదైనా ఎందుకు చేయకూడదు? నేను పూణేలో హెడ్ కానిస్టేబుల్‌ని. నేను నెలలో మూడు లేదా నాలుగు రోజులు వస్తాను. నువ్వు ఈ పని చేయడం మానేయి. నేను మీ కోసం అన్నీ కొంటాను. ఈ గది అద్దె ఎంత?”

మాధో ఇంకా చాలా విషయాలు చెప్పాడు. వాటి మొత్తం సౌగంధిపై ఎంత బలమైన ప్రభావాన్ని చూపిందంటే, ఆమె కొన్ని క్షణాలు తనని నిజంగా హెడ్ కానిస్టేబుల్ భార్యలా ఊహించుకుంది. మాధో గదిని శుభ్రం చేసి, ఆమె మంచం పైభాగంలో ఉన్న అశ్లీల ఫోటోలను చింపివేసాడు. తర్వాత అతను, “సౌగంధి..నేను నిన్ను అలాంటి చిత్రాలు వేయనివ్వను. ఈ నీళ్ళ కుండ – ఇది ఎంత మురికిగా ఉందో చూడు! ఇది ఈ గుడ్డ, ఈ గుడ్డలు-అగ్! – ఎంత భయంకరమైన వాసన! వాటిని బయట పారేయి..నీ జుట్టుని ఏం చేసావు..?” సౌగంధి, మాధో మూడు గంటలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సౌగంధికి సంవత్సరాలుగా అతను బగా తెలిసినవాడులా అనిపించింది. గదిలోని దుర్వాసన గల గుడ్డలు, మురికి కుండ, అశ్లీల చిత్రాలను ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ ఆమె గదిని ఇల్లులా చూసుకోలేదు. మగాళ్ళు వచ్చి ఆమె మంచం ఎంత మురికిగా ఉందో కూడా గమనించకుండా పని ముగించుకొని వెళ్లిపోతారు. ‘ఈ రోజు నీ ముక్కు ఎంత ఎర్రగా ఉందో చూడు..! నీకు జలుబు రాదని నేను ఆశిస్తున్నాను. ఇక్కడే ఉండు. నేను వెళ్లి మందులు తెచ్చిస్తాను.’ అని ఆమెకు ఎవరూ చెప్పలేదు. మాధో చాలా మంచివాడు. అతను చెప్పినవన్నీ తప్పుపట్టడానికి వీలులేనివి. అతను ఆమెను ఎంత తీవ్రంగా తిట్టాడో! ఆమెకి అతని అవసరం నిజంగా ఉందని భావించింది. అలా వారి సంబంధం మొదలయింది.

మాధో నెలకోసారి పూణే నుండి వచ్చి తిరిగి వెళ్ళే ముందు ఎప్పుడూ, “చూడు సౌగంధీ, నువ్వు నీ పాత పనిని చేపడితే, ఇక మన సంబంధం ముగిసినట్లే. నువ్వు ఇక్కడ ఒక్కడ్నయినా గానీ పడుకోనిస్తే, నేను నీ జుట్టు పట్టుకుని బయట పడేస్తాను. చూడు, నేను పూణే చేరుకున్న వెంటనే ఈ నెల ఖర్చులకు మనీ ఆర్డర్ పంపుతాను. నాకు గుర్తు చేయి, ఇక్కడ అద్దె ఎంత?” అంటాడు.

కానీ మాధో డబ్బూ పంపలేదు, సౌగంధి వేశ్యవృత్తి మానేయనూ లేదు. కానీ ఇద్దరికీ బాగా తెలుసు అక్కడ ఏం జరుగుతోందని. సౌగంధి మాధోని ఎప్పుడూ అడగలేదు, ‘నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడైనా నాకు ఏదైనా ఇచ్చావా?’ అని. మాధో కూడా సౌగంధిని ఎప్పుడూ అడగలేదు, ‘నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నేను నీకు ఇవ్వలేదు కదా’ అని. ఇద్దరూ అబద్ధాలు ఆడుతున్నారు, ఇద్దరూ నటిస్తున్నారు. కానీ నిజమైన బంగారం ధరించలేని వారు నకిలీ నగలతో సంతృప్తి చెందుతున్నట్లే, సౌగంధి కూడా సంతోషంగానే ఉంది.

పూర్తిగా అలసిపోయిన సౌగంధి, లైటు వెలుగుతుండగానే గాఢ నిద్రలోకి జారుకుంది. అది ఆమె  తలపైన వేలాడుతోంది. దాని పదునైన కాంతి ఆమె కళ్ళపై నేరుగా పడుతోంది కానీ ఆమె లేవలేదు.

తలుపు తట్టిన శబ్దం. ‘తెల్లవారుజామున రెండు గంటలకు ఎవడ్రా వస్తారు?’ ఆ చప్పుడు సౌగంధి నిద్రలో ఒక ఈగ ఝుమ్మనే శబ్దంలా లీలగా తోచింది. తలుపు గట్టిగా కొడుతున్నారు. ఆమె మేల్కొంది. ఆమె నోటి నిండా చేదైన, జిగటైన ఉమ్మి నిండి ఉంది. దాని రుచి మునుపటి రాత్రి తాగిన మందు, దంతాల మధ్య చిక్కుకున్న చిన్న చేపల ముక్కల మిశ్రమం. ఆమె తన లుంగీ అంచుతో దుర్వాసన వచ్చే ఉమ్మిని తుడిచిపెట్టి, కళ్ళు రుద్దుకుంది. ఆమె తను ఒంటరిగా ఉందని గ్రహించింది. ఆమె వంగి మంచం కింద చూసింది – ఆమె కుక్క నిద్రలో ముఖం చిట్లిస్తోంది, దాని నోరు ఎండిపోయిన చెప్పులపై ఆనుకొని ఉంది. తర్వాత ఆమె చిలుక పంజరం వైపు చూసింది. చిలుక నిద్రపోతోంది. దాని తల దాని వీపున ఈకలలో ఉంది.

ఎవరో తలుపు తట్టిన శబ్దం. సౌగంధి తల కొట్టుకుంటూ లేచింది. ఆమె కుండలోంచి ఒక గరిటె నిండా నీళ్లు తీసుకుని పుక్కిలించింది. మరో గరిటె నిండా నీళ్లు తాగి తలుపు తెరిచేందుకు వెళ్ళింది.

‘రామ్ లాల్?’

రామ్ లాల్ తలుపు తట్టి తట్టి అలసిపోయాడు. “నువ్వు చచ్చావా ఏంటి?” అతను కోపంగా అడిగాడు. “నేను ఇక్కడే నిలబడి పిచ్చోడిలా తలుపు కొడుతూ ఉన్నాను. నువ్వెక్కడ ఉన్నావు?” అని తర్వాత అతను గొంతు తగ్గించి, “లోపల ఎవరైనా ఉన్నారా?” అని అడిగాడు.

సౌగంధి తల అడ్డంగా ఊపింది. దాంతో రామ్ లాల్ వెర్రిగా అరిచాడు, “అప్పుడు నువ్వు

తలుపెందుకు తెరవలేదు? ఆహ్! చాలిక! ఒక అమ్మాయిని మంచం మీద నుండి లేపడానికి రెండు గంటలు గోడకు తల కొట్టుకోవాల్సి వస్తే, ఇక నేను ఈ పని చేసినట్టే.. మరి నువ్వెందుకు నా వైపు అలా చూస్తున్నావు? త్వరగా, ఆ లుంగీ తీసేసి, నీ పువ్వుల చీర కట్టుకో. నీ ముఖానికి పౌడర్ వేసుకుని నాతో రా. ఒక ధనవంతుడు కారులో నీకోసం ఎదురు చూస్తున్నాడు. త్వరగా రా..!”

సౌగంధి పడకకుర్చీలో కూర్చుంది. రామ్ లాల్ లోపలికి వచ్చి అద్దం ముందు తన జుట్టు దువ్వుకోవడం మొదలుపెట్టాడు. సౌగంధి స్టూల్ వైపు చేయి చాపి, తలనొప్పి బామ్ తీసుకుని, దాని మూత తెరిచి. “రామ్ లాల్, నాకు ఈ రోజు మూడ్ బాగా లేదు.” అంది.

రామ్ లాల్ దువ్వెనను తిరిగి ఆ గూడులో పెట్టి వెనక్కి తిరిగి చూసాడు.

“నువ్వు ఇది ముందే చెప్పాల్సింది.”

సౌగంధి తన నుదుటిపై, కణతలపై ఔషధతైలం రాసుకుంది. “అది కాదు రామ్ లాల్, నాకు ఒంట్లో బాగా అనిపించడం లేదు. నేను బగా తాగేసాను.” అంది.

రామ్ లాల్ నోటిలో నీళ్ళు ఊరాయి. “ఇంకేమైనా మిగిలి ఉంటే ఇచ్చేయ్! నేనూ కొంచెం తాగుతా..”

సౌగంధి బామ్ ని స్టూల్ మీద పెట్టింది. “నేను అదంతా తాగకపోతే నాకు ఇంత తలనొప్పి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? చూడు, రామ్ లాల్, నీ వాడిని ఇక్కడికే తీసుకురండి.”

“లేదు, లేదు, అతను రాడు. అతను పెద్దమనిషి. అసలికే తన కారు ఈ సందులో ఉందని అతను కంగారు పడుతున్నాడు. ఏదైనా తొడుక్కొని నాతో రా. అప్పుడు నీకే బాగనిపిస్తుంది.”

ఈ కష్టమంతా ఏడున్నర రూపాయల కోసమే.. సౌగంధికి తలనొప్పి వచ్చినప్పుడు, ఆమె సాధారణంగా పడుపు పని చేయదు. కానీ ఇప్పుడు ఆమెకు నిజంగా డబ్బు అవసరం. పక్కనే నివసించే మద్రాసీ మహిళ భర్త కారు ఢీకొని మరణించాడు. ఇప్పుడు ఆ మహిళ తన చిన్న కూతురితో కలిసి మద్రాసుకు తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ఆమె దగ్గర ప్రయాణం చేయడానికి తగినంత డబ్బు లేదు. అందుకు ఆమె కలవరపడుతోంది. సౌగంధి ఆమెకు ఆ ముందు రోజు, “బాధపడకండి. నా ప్రియుడు పూణే నుండి వస్తున్నాడు. నేను అతని నుండి కొంత డబ్బు తీసుకుని మీకు టిక్కెట్లు కొంటాను’ అని భరోసా ఇచ్చింది. మాధో నిజంగానే రాబోతున్నాడు, కానీ సౌగంధి స్వయంగా డబ్బు సంపాదించుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఆమె లేచి, త్వరగా తన పూల చీరను కట్టుకుని, కొంత రోజ్ పౌడర్ అద్దుకుంది. ఆమె మరో గరిటె నిండుగా నీళ్ళు తాగి, రామ్ లాల్ తో బయటకు వెళ్ళింది.

చిన్న చిన్న పట్టణాల మార్కెట్ల కంటే పెద్దదిగా ఉన్న ఆ సందు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. యుద్ధం కారణంగా వీధి దీపాల లైట్లు పెయింట్ చేయబడి ఉండటంతో వాటి వెలుతురు బలహీనంగా ఉంది. సందు చివరన ఆగి ఉన్న కారును ఆమె చూడగలిగింది. ఆ కారు ఆ రాత్రి ఆఖరి ఘడియల్లోని రహస్యమైన నిశ్శబ్ద నీడలా కనిపించింది. సౌగంధికి తన తలనొప్పి మొత్తం ఆ పరిసరాలంతటా పాకినట్లు అనిపించింది. గాలి కూడా వగరుగా అనిపించింది. ఇది బ్రాందీ, వెన్నెలప్రకాశం తర్వాత పడిన ప్రభావం అని కూడా అనిపించింది.

రామ్ లాల్ ముందుకు నడిచి కారులో ఉన్న వ్యక్తులతో ఏదో చెప్పాడు. సౌగంధి కారు వద్దకు చేరుకుంది. రామ్ లాల్ పక్కకు జరిగి, “చూడు, ఇదిగో..ఈమె చాలా మంచి అమ్మాయి. ఈమె ఇప్పుడే ఈ పనిలో దిగింది.” తర్వాత సౌగంధి వైపు తిరిగాడు. “సౌగంధి, ఇక్కడికి రా. బాస్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు.” అన్నాడు

సౌగంధి తన చేతిలోని చీర అంచుని పైకెత్తి, కారు తలుపు దగ్గరకు అడుగు పెట్టింది. ఆ వ్యక్తి ఆమెపై టార్చిలైట్ వెలిగించగా, ఆ కాంతి సౌగంధి నిద్రమత్తు కళ్ళను మిరుమిట్లు గొలిపింది. కానీ అప్పుడు ఆమె ఒక బటన్ శబ్దం విన్నది. వెంటనే లైట్ ఆరిపోయింది. ఆ వ్యక్తి ‘ఛీ.యాక్!’ అన్నాడు. తక్షణమే, ఇంజిన్ ప్రాణం పోసుకొని, కారు సందులోంచి దూసుకుపోయింది.

సౌగంధికి స్పందించడానికి కూడా సమయం లేదు. ఆమె కళ్ళలో ఇంకా ఫ్లాష్ లైట్ వెలుగు కనిపిస్తోంది. ఆ వ్యక్తి ముఖాన్ని కూడా సరిగా చూడలేకపోయింది. ఏం జరిగింది ఇప్పుడు? ఆమె చెవుల్లో ఈ ‘ఛీ.యాక్!’ అనే పదమే ప్రతిధ్వనిస్తుంది.

“అతనికి నువ్వు నచ్చలేదు అనుకుంటా” అన్నాడు రామ్ లాల్. “సరే, నేను వెళ్తున్నాను. రెండు గంటలు ఊరకే వృధా అయ్యాయి” నిట్టూర్చాడు.

సౌగంధి వెర్రెత్తినట్టు ఏదైనా పగలగొట్టాలన్న కోరికను బలవంతాన అణుచుకోవాల్సి వచ్చింది. ఆ కారు ఎక్కడ ఉంది? ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు?  ‘ఛీ.యాక్!’ అంటే అతను నన్ను ఇష్టపడలేదని అర్థమా? ఆ వెధవ నాకొడుకు..

ఆమె తనను తాను చిక్కబట్టుకుంది. కారు అప్పటికే వెళ్ళియింది. ఎర్రటి తోకలా కనిపించిన దాని లైట్లు, రాత్రి ఖాళీగా ఉన్న ఆ మార్కెట్ చీకటిలోకి తెలతెలపోయాయి. కానీ ఈ ఎర్రగా కాల్చినట్టున్న  ‘ఛీ.యాక్’ ఆమె ఛాతీని చీల్చుతోంది! ఆమె అరవాలనుకుంది, ‘ఏయ్, నీ డబ్బున్నోళ్ళని దొబ్బా..కారు ఆపురా! ఒక్క నిమిషం ఇక్కడికి తిరిగి రారా..కానీ ఆ కొడుకుని దొబ్బించాలి.. వాడు ఇప్పటికే చాలా దూరంగా పోయాడు!’

ఆమె జనాలు లేని బజారులో నిలబడింది. ప్రత్యేక సందర్భాలలో ఆమె ధరించే ఆమె పూల చీర గాలికి అలలు తిరుగుతూ, ‘ఛీ.యాక్!’, ‘ఛీ.యాక్!’ అని అంటున్నట్లు అనిపించింది. ఆ మాటని ఆమె ఎంతగా ద్వేషించిందో..! ఆమె తన చీరను చింపి, దాని ముక్కలను గాలిలోకి ఎగరవేయాలనుకుంది!

ఆమె తనని మరింత ఆకర్షణీయంగా చేసుకోవడానికి లిప్‌స్టిక్‌ వేసుకుని, బుగ్గలకు పౌడర్‌ వేసుకున్న తీరును గుర్తుచేసుకుంది. ఇప్పుడు దీనితో ఆమె చాలా సిగ్గుపడి చెమటలు కక్కడం ప్రారంభించింది. ఆమె తన భావాలను సర్ది చెప్పుకుంది, ‘నేను ఆ పంది కోసం బట్టలు ధరించలేదు! అది నా అలవాటు – నాది మాత్రమే కాదు, అందరి అలవాటు. కానీ తెల్లవారుజామున రెండు గంటలకు, రామ్ లాల్, ఈ మార్కెట్, ఆ కారు, ఆ టార్చ్ లైట్!’..ఆమె ఇవన్నీ ఆలోచిస్తుండగా, వీధి దీపాలు ఆమె చుట్టూ మెరుస్తున్నాయి. ఆమెకు చెమటలు పడుతున్నాయి. నుదుటిపై ఉన్న ఔషధతైలం ఆమె చెమట రంధ్రాలలోకి కారుతోంది. చెమటతో నిండిన ఆమె నుదిటిపై గాలి వీచింది. ఎవరో మెత్తటి గుడ్డముక్కను కోసి తన నుదుటికి అంటించినట్లు ఆమెకు అనిపించింది. ఆమె తల ఇంకా సలుపుతోంది, కానీ ఆమె లోపలి ఆలోచనల రొద ఆమె నొప్పిని ముంచేసింది. సౌగంధి తన శరీరాన్ని ఆ నొప్పితో ముంచెత్తాలని కోరుకుంది – ఆమె తలలో, కాళ్ళలో, కడుపులో, చేతుల్లో కూడా నొప్పి-  ఆలోచించడానికి కూడా వీలుకాని బాధని కోరుకుంది. ఇలా ఆలోచిస్తూ, ఆమె తన హృదయంలో ఒక అనుభూతిని గమనించింది. అది బాధా? ఆమె గుండె కుంచించుకుపోయి సాధారణ స్థితికి చేరుకుంది. అదేంటి? అంతే! ఆ ‘ఛీ.యాక్’ ఆమె హృదయాన్ని పాడు చేస్తోంది!

సౌగంధి ఇంటి వైపు తిరిగి, ఆలోచించిస్తూ ఆగిపోయింది. ఆ వ్యక్తి నన్ను వికారిగా భావిస్తున్నాడని రామ్ లాల్ అన్నాడు..లేదు లేదు, రామ్ లాల్ అలా అనలేదు. అతను నిజంగా అన్న మాటలు.. ‘అతను నిన్ను ఇష్టపడలేదు అనుకుంటాను.’  బహుశా అతను..అతను..నేను కనిపించే తీరును ఇష్టపడకపోవచ్చు. కానీ నేను వికారంగా ఉన్నానని అతను అనుకుంటే, నాకేంటి? చాలా మంది మగాళ్ళు వికారంగా ఉంటారు. గత అమావాస్య నాడు నచ్చిన విటుడు నిజంగా చెడ్డవాడు. కానీ నేను వాడిని భరిస్తూ అసహ్యంగా ముక్కు మూసుకున్నాను. అతను నా మీద పడినప్పుడు, నేను తిరుగుబాటు చేసానా? నేను వాంతులు చేసుకోవడం ఆపలేదా? కానీ, సౌగంధి.. నువ్వు తన్నలేదు, అరవలేదు. నువ్వు అతన్ని పొమ్మనలేదు. కారులో ఉన్న ఆ ధనవంతుడు నీ ముఖం మీద ఉమ్మేసాడు..’ఛీ.యాక్’.. ఈ ‘ఛీ.యాక్’ అంటే ఏమిటి?’

సౌగంధి నిలువెల్లా కుతకుతలాడుతోంది. ఆమె తనపై, తరువాత రామ్ లాల్ పై కోపం తెచ్చుకుంది. కానీ ఆమె అంతలోనే రామ్ లాల్ తప్పు లేదని భావించి, ఆ కారులో వ్యక్తి గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఆమె శరీరంలోని ప్రతి అణువు తో, ఆ వ్యక్తిని మరోసారి చూడాలని కోరుకుంది. ఆమె ఆ దృశ్యాన్ని మళ్ళీ ఒక్కసారి పునరావృతం చేయాలనుకుంది. చేస్తే అది ఇలాగే జరుగుతుంది. ‘ఆమె కారు వైపు నడిచింది, ఫ్లాష్‌లైట్‌తో ఒక చేయి బయటకు వచ్చింది, అది ఆమె ముఖంలో మెరిసింది, ఆమె ‘ఛీ.యాక్’ అనే మాట విన్నది. కానీ ఈసారి ఆమె అడవి పిల్లిలా అతనిపైకి దూకి అతని ముఖం మీద కోపంగా గీసింది. ఆమె తన పొడవాటి గోళ్లతో, అతని బుగ్గలను చీల్చింది. ఆమె అతని జుట్టు పట్టుకుని, బయటకు లాగి, కనికరం లేకుండా కొడుతుంది.  ఆమె అలసిపోయి ఏడుస్తుంది.

ఆమె కళ్ళలో మూడ్నాలుగు కన్నీటి చుక్కలు ఇప్పటికే ఉబికి వస్తున్నందున ఆమె ఈ కన్నీళ్ళ భాగాన్ని కూడా జోడించాలని అనుకుంది. తనని ఆమె కోపంగా, నిస్సహాయంగా తలంచుకుంది. ఆమె తనని ఇలా ప్రశ్నించుకుంది, ‘ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది?’ ఆమె కళ్ళలో కన్నీళ్ళు గింగరాలు తిరుగుతూనే ఉన్నాయి. ఆమె రెప్పలు మూసుకుంది. ఆమె కనురెప్పలు తడిసిపోయాయి. సౌగంధి ఆ వ్యక్తి కారు వెళ్లిన దిశలో తన కన్నీళ్లలోంచి చూస్తూ ఉండిపోయింది.

అకస్మాత్తుగా ఆమెకు “ఫర్, ఫర్, ఫర్” అనే శబ్దం వినిపించింది. అది ఎక్కడ్నుండి వస్తోంది? సౌగంధి చుట్టూ చూసింది కానీ ఎవరూ కనిపించలేదు. అప్పుడు ఆమె గ్రహించింది అదేమిటో- ఆమె గుండె వేగంగా కొట్టుకుంటున్న శబ్దం అది.. కారు శబ్దం కాదు! ఏం జరుగుతోంది? గుండె సజావుగా నడుస్తూనే అకస్మాత్తుగా ఎందుకు దడదడ అంటోంది? అది అరిగిపోయిన రికార్డుపై సూదిని పెట్టినట్లుగా ఉంది., ‘నేను తారకలను లెక్కించే లోపు రాత్రి గడిచిపోయింది..’ సంగీతం సహజ ప్రవాహం..‘తారలు, తారలు, తారలు..’ అనే ఒక్క పదమే ప్రతిధ్వనిగా మారింది.

ఆకాశం తారకలతో నిండి ఉంది. సౌగంధి పైకి చూసి, ‘ఎంత అందంగా ఉంది!’ అని ఆశ్చర్యపోయింది. ఆమె ఇంకేదో ఆలోచించాలనుకుంది, కానీ వాటి అందం ఒక దుష్ట జ్ఞాపకంగా మాత్రమే పనిచేసింది. ఆమె తనలో తాను ఇలా అనుకుంది, ‘తారలు అందంగా ఉన్నాయి, కానీ నువ్వు వికారంగా ఉన్నావు. ఆ మనిషి నిన్ను ఎలా అవమానించాడో నువ్వు ఇంతలోకే మర్చిపోయావా?”

కానీ సౌగంధి వికారంగా లేదు. ఇటీవల ఆమె అద్దంలో చూసుకున్న సందర్భాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఐదు సంవత్సరాల క్రితం ఆమె తల్లిదండ్రులతో కలిసి ఏ చీకు చింత లేకుండా నివసిస్తున్నప్పుడు ఆమె ఇప్పటిలా లేదు. ఏ సందర్భంలోనైనా ఆమె వికారంగా లేదు. నిజానికి ఆమె పురుషులు కన్నేసే రకమైన స్త్రీ. పురుషులు స్త్రీలో కోరుకునే అన్ని శారీరక లక్షణాలు ఆమెకు ఉన్నాయి. ఆమె యవ్వనంగా, మంచి శరీరాకృతి కలిగి ఉంది. కొన్నిసార్లు స్నానం చేసేటప్పుడు, ఆమె తొడలు ఎంత గుండ్రంగా, దృఢంగా ఉన్నాయోనని ఆమె ఆనంద పడేది. ఆమె మర్యాదగా, స్నేహపూర్వకంగా, దయతో కూడుకున్నది కాబట్టి ఆమె తన విటులలో ఎవరినైనా నిరాశపరిచిందని ఊహించడం కష్టం.

ఆమె గత సంవత్సరం క్రిస్మస్ సీజన్ లో గోల్ పెఠాలో నివసిస్తున్న విషయాన్ని గుర్తుచేసుకుంది. ఒక యువకుడు ఒక రాత్రి తనతో గడిపాడు. మరుసటి రోజు ఉదయం లేచి తన కోటును హుక్ నుండి తీయడానికి పక్క గదిలోకి వెళ్ళినప్పుడు, అతని పర్సు కనిపించలేదు. సౌగంధి సేవకుడు దానిని దొంగిలించాడు. ఆ పేదవాడు చాలా బాధపడ్డాడు. అతను హైదరాబాద్ నుండి సెలవుపై వచ్చాడు. తిరిగి వెళ్ళడానికి తగినంత డబ్బు లేదు. సౌగంధి అతనిపై చాలా జాలిపడి తన పది రూపాయలు అతనికి తిరిగి ఇచ్చింది.

‘నేనేం తప్పు చేశాను? సౌగంధి తన చుట్టూ చీకటిగా ఉన్న వీధి దీపాలు, ఇనుప కరెంటు స్థంభాలు, కాలిబాటపై ఉన్న దీర్ఘ చతురస్రాకారపు రాళ్ళు, వీధిలోని కంకర..అన్నింటిని ఉద్దేశించి అడిగింది.  ఆమె తన చుట్టుపక్కల చూసి, ఆపై ఆకాశం వైపు దృష్టి సారించింది. కానీ జవాబు లేదు.

సమాధానం ఆమెకే తెలుసు. ఆమె అస్సలు చెడ్డది కాదు. మంచిది. అయినప్పటికీ ఎవరైనా ఆమెను ప్రశంసించాలని, ఎవరైనా ఆమె భుజంపై చేయి వేసి, ‘సౌగంధి, నువ్వు చెడ్డదానివని ఎవరు అంటారు? ఆ వ్యక్తే చెడ్డవాడు!’ అని చెప్పాలని ఆమె కోరుకుంది. లేదు, దానికి అంత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరైనా ‘సౌగంధి, నువ్వు నిజంగా మంచిదానివి!’ అని చెబితే సరిపోతుంది.

ఇంతకు ముందు తనను ఎవరైనా ప్రశంసించాలని ఆమె ఎందుకు కోరుకుంటుందో, ఎప్పుడూ తనకు ఆ అవసరం కలగలేదు కదా ఆమె ఆలోచించింది. తన విలువను చెప్పమని అడుగుతూ, కదలిక లేని వస్తువులను కూడా ఆమె ఎందుకు ప్రాధేయపడింది ? ఆమె శరీరంలో సుఖమివ్వాలనేంతటి తీవ్రమైన కోరిక ఎందుకు కలుగుతుంది? ప్రపంచాన్ని తన ఒడిలోకి ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? తన వేడి బుగ్గలను వీధి దీపాల చల్లటి ఇనుముకు ఎందుకు ఆనించాలనుకుంటుంది?

అప్పుడు ఒక క్షణం ఆమెకు అంతా తన వైపు సానుభూతితో చూస్తున్నట్లు అనిపించింది – వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, చదును రాళ్ళు, ప్రతిదీ..! పెరుగుతున్న కాంతిలో పాల రేకులా ఆమె పైన వేలాడుతున్న తారలతో నిండిన ఆకాశం కూడా ఆమెను అర్థం చేసుకున్నట్లు అనిపించింది. బదులుగా సౌగంధి నక్షత్రాల మినుకుమినుకుమనే మెరుపును తాను అర్థం చేసుకోగలనని భావించింది. కానీ ఆమెలో ఈ గందరగోళం ఏమిటి? ఆమెలో ఎందుకు ఈ అశాంతి ? ఆమెలో ఉడికిపోతున్న చెడు భావాలను వదిలించుకోవాలని కోరుకుంది, కానీ ఆమె దీన్ని ఎలా చేయగలదు?

సౌగంధి సందు మూలలో ఎర్రటి మెయిల్ బాక్స్ పక్కన నిలబడి ఉంది. గాలి వేగంగా వీచింది. దాని నోటిలో వేలాడుతున్న ఇనుప నాలుక గిలగిలలాడింది. మళ్ళీ సౌగంధి కారు వెళ్ళిన దిశ వైపు చూసింది. కానీ ఆమెకు ఏమీ కనిపించలేదు. కారు ఒక్కసారి..ఒక్కసారి తిరిగి రావాలని ఆమె ఎంతగానో కోరుకుంది. కానీ తర్వాత ఆమె తనలో తాను ఇలా అనుకుంది, ‘అది తిరిగి రాకపోయినా నాకు పర్వాలేదు. నిజానికి, అదే మంచిది! దాని గురించి నేనెందుకు చింతించాలి? నేను ఇంటికి వెళ్ళి, పసిపిల్లలా నిద్రపోతాను. ప్రతిదీ మళ్ళీమళ్ళీ అనుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? నేను దేని గురించి ఎందుకు చింతించాలి? వెళ్ళు.. సౌగంధి, ఇంటికి వెళ్ళు. ఒక గరిటె చల్లటి నీరు తాగి, కొద్దిగా బామ్ రాసుకుని, పడుకో. నువ్వు బాగా నిద్రపోతావు, రేపు అంతా బాగానే ఉంటుంది. అతన్ని, అతని కారును దొబ్బెయ్ మను!’

ఈ ఆలోచనలు సౌగంధి బాధను కొంతవరకు తగ్గించాయి. చల్లని చెరువులో స్నానం చేసి బయటకు వచ్చినట్లు ఆమెకు అనిపించింది. ప్రార్థన చేసిన తర్వాత వున్నట్టు ఆమె శరీరం తేలికగా అనిపించింది. ఆమె ఇంటికి నడవడం ప్రారంభించింది. ఆమె అడుగులు ఉత్సాహంతో దాదాపుగా తేలికైనట్లు అనిపించాయి.

ఆమె దాదాపు తన అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సమయానికి ఆ వ్యక్తి జ్ఞాపకాలు ఆమెను మళ్ళీ వెంటాడాయి. ఆమె శరీరాన్ని వ్యథతో నింపాయి. ఆమె అడుగులు బరువుగా మారాయి. ఆమె ఆ అనుభవాన్ని మళ్ళీ అనుభవిస్తున్నట్లు అనిపించింది – ఆ డబ్బున్నవాడిని దెం …!  సౌగంధి అతన్ని శపించాలనుకుంది ! ఇంకా దాన్నుండి ఏం వస్తుంది? ఆమె ఇలా అనుకుంది, ‘నిజమైన ఆనందం అతనిలో ప్రతి అంగుళాన్ని అవమానించడం ద్వారా వస్తుంది. ఏదైనా అని అతన్ని జీవితాంతం బాధపెట్టడం ద్వారా నిజమైన ఆనందం వస్తుంది. అతని ముందు నా బట్టలు చింపివేసినప్పుడు, నేను, “నువ్వు దీనికోసం వచ్చావు, కాదా? ఇదిగో, ఊరకే తీసుకో – తీసుకోండి. కానీ నీ అబ్బ కూడా నాలో ఉన్నదాన్ని కొనలేడు’. సౌగంధి ప్రతీకారం తీర్చుకోవడానికి రకరకాల మార్గాల గురించి ఆలోచిస్తోంది. ఆమె మళ్ళీ ఒకసారి అతన్ని ఎదుర్కొంటే, ఆమె అలా కాదు, ఇది ఇలా కాదు, కానీ ఇది .. ఇలా ప్రతీకారం తీర్చుకుంటుంది.. కాదు, అలా కాదు. ఇలా…. కానీ సౌగంధి అతన్ని మళ్ళీ చూడలేనని గ్రహించినప్పుడు, ఆమె ఊపిరి పీల్చుకుని, అతన్ని తిట్టడం మానుకుంది. అతని ముక్కుకు ఈగలా అంటుకుని శాశ్వతంగా అక్కడే కూర్చోవాలనుకుంది.

ఈ గందరగోళ స్థితిలో, ఆమె రెండవ అంతస్తులోని తన గదికి చేరుకుంది. ఆమె బ్రా నుండి తన తాళాన్ని తీసి తలుపు తెరవడానికి చేయి చాపింది, కానీ తాళం కనిపించలేదు! సౌగంధి తలుపు ప్యానెల్‌లలో ఒకదాన్ని లోపలికి నెట్టింది, అది తేలికపాటి కిర్రుమనే శబ్దం చేసింది. ఎవరో లోపలి నుండి గొలుసును విప్పారు. తలుపు ఆవలగా తెరుచుకుంది. సౌగంధి లోపలికి ప్రవేశించింది.

మాధో నవ్వుతున్నాడు. అతను తలుపు మూసి సౌగంధితో, “ఈ రోజు నేను చెప్పినది నువ్వు మనస్ఫూర్తిగా తీసుకున్నావు – ఉదయం నడక నీ ఆరోగ్యానికి చాలా మంచిది! నువ్వు ప్రతి ఉదయం లేచి ఇలాగే నడక ప్రారంభిస్తే, నీ బద్ధకం అంతా పోతుంది, నువ్వు చాలాసార్లు ఫిర్యాదు చేస్తున్న నడుము నొప్పి కూడా పోతుంది. నువ్వు విక్టోరియా గార్డెన్స్ వరకు నడిచి తిరిగి వచ్చావు.. కదా?” అన్నాడు.

సౌగంధి సమాధానం చెప్పలేదు, మాధో కూడా ఆమెను ఒత్తిడి చేయలేదు. నిజానికి, ఆమె తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అతను ఎప్పుడూ అనుకోలేదు. అతను మాట్లాడాల్సి వచ్చింది కాబట్టే మాట్లాడాడు.

మధో పేముకర్రల కుర్చీ మీద తడిసిన వీపుతో కూర్చుని, కాళ్ళు అడ్డంగా పెట్టుకుని, మీసాలు తిప్పుతూ ఉన్నాడు.

సౌగంధి మంచం మీద కూర్చుని “నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను.” అంది

మాధో ఆశ్చర్యపోయాడు. “నువ్వు నేను వస్తాననుకున్నావా? నేను వస్తున్నానని నీకు ఎలా తెలుసు?” సౌగంధి తన పెదవులను సడలించి సన్నని చిరునవ్వుతో చెప్పింది. “నేను నీ గురించి కల కన్నాను. కలలోంచి లేచాను, కానీ అక్కడ ఎవరూ లేరు. కాబట్టి నేను నడకకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను” ఇది మాధోకి నచ్చింది. “హా..అలా నేను వచ్చాను! సరే, నీకేం తెలుసు చెప్పు ! జనాలు మనసులు కలిస్తేనే కలిసి ఉంటారని ఎవరు చెప్పినా అది నిజమే. నీకు ​​కల ఎప్పుడు వచ్చింది?”

“సుమారు నాలుగు గంటలకు.”

మాధో కుర్చీలోంచి లేచి, సౌగంధి పక్కన కూర్చున్నాడు. “సరిగ్గా రెండు గంటలకు నేను నీ గురించి కల కన్నాను. నువ్వు ఈ చీరలో నా పక్కన నిలబడి ఉన్నావు. నువ్వు ఏం పట్టుకున్నావు – ఏంటది? ఓహ్, అవును, నువ్వు డబ్బుతో నిండిన చిన్న సంచిని పట్టుకున్నావు. నువ్వు ఈ సంచిని నాకు ఇచ్చి, ‘మాధో, నువ్వు దేని గురించి ఆందోళన పడుతున్నావు? ఈ సంచి తీసుకో. నా డబ్బు నీదే కదా?’ అని అన్నావు. సౌగంధి, నేను ప్రమాణం చేస్తున్నాను, నేను వెంటనే లేచి, టికెట్ కొనుక్కుని ఇక్కడికి వచ్చాను. నేను ఏం చెప్పాలి? నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను! ఎవరో నాపై పోలీసు రిపోర్ట్ దాఖలు చేశారు. నేను ఇన్‌స్పెక్టర్‌కి ఇరవై రూపాయలు ఇస్తే, అతను నన్ను విడిచిపెడతాడు. నువ్వు అలసిపోలేదా? పడుకో.. నేను నీ పాదాలకు మసాజ్ చేస్తాను. నువ్వు నడవడం అలవాటు చేసుకోకపోతే ఖచ్చితంగా అలసిపోతావు. ఇదిగో, నీ పాదాలను నా పక్కన ఉంచి పడుకో..”

సౌగంధి పడుకుంది. ఆమె తల వెనుక దిండులా చేతులు ముడుచుకుని, ‘మాధో, ఏ వెధవ నాకొడుకు నీ మీద ఫిర్యాదు చేశాడో? నువ్వు జైలుకు వెళ్లే అవకాశం ఉందని నువ్వు అనుకుంటే, చెప్పు. నువ్వు అతనికి ఇరవై లేదా ముప్పై రూపాయలు ఇస్తే – కాదు, యాభై లేదా వంద అయినా – ఏం ఫర్వాలేదు. నువ్వు తప్పించుకోగలిగితే, అది నీ అదృష్టమే..ఏమైనా, ఆ మసాజ్ ఆపు, నేను అంత అలసిపోలేదు. నాకు అంతా చెప్పు. ‘పోలీస్ రిపోర్ట్’ అనే మాటలు వినగానే నా గుండె దడదడలాడింది. నువ్వు ఎప్పుడు తిరిగి వెళ్తావు?”

సౌగంధి ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మాధోకు మద్యం వాసన వచ్చింది. ఇదే సరైన సమయం అని భావించి, “నేను మధ్యాహ్నం రైలులో తిరిగి వెళ్ళాలి. సాయంత్రానికి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కి యాభై లేదా వంద ఇయ్యకపోతే..సరే, అతనికి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. యాభై సరిపోతుందని నేను అనుకుంటున్నాను.” అని అతను తొందర తొందరగా అన్నాడు.

“యాభైయా..!” సౌగంధి ఆశ్చర్యంగా అంది.

ఆమె నెమ్మదిగా లేచి గోడపై ఉన్న నాలుగు ఫోటోల దగ్గరకు వెళ్ళింది. ఎడమ వైపు నుండి మూడవ వ్యక్తి మాధో. అందులో అతను కుర్చీపై కూర్చుని ఉన్నాడు. అతని వెనుక పూలతో ముద్రించిన కర్టెన్ ఉంది. అతను తన తొడలపై చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. ఒక చేతిలో గులాబీని పట్టుకున్నాడు. అతని పక్కన ఉన్న స్టూల్‌పై రెండు మందపాటి పుస్తకాలు ఉన్నాయి. ఫోటోలోని ప్రతిదీ చాలా స్పష్టంగా ఉంది. అవన్నీ ‘మన ఫోటో తీస్తున్నారు! మన ఫోటో తీస్తున్నారు!’ అని చెబుతున్నట్లు అనిపించింది. ఫోటోలో, మాధో కళ్ళు విశాలంగా ఉన్నాయి. మొత్తం ఆ పరిస్థితి అతనికి అసౌకర్యాన్ని కలిగించినట్లు అనిపించింది.

సౌగంధి నవ్వడం మొదలుపెట్టింది, మాధోని సూదుల్లా గుచ్చుకునేలాంటి పదునైన నవ్వు. అతను లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. “ఎవరి ఫోటో చూసి నవ్వుతున్నావు?” అని అడిగాడు.

సౌగంధి ఎడమ వైపున ఉన్న మొదటి ఫోటోను, నగర పారిశుధ్య విభాగానికి చెందిన అధికారి ఫోటోను చూపించింది. ‘ఈ వ్యక్తిని’ అని చెప్పింది. “అతని ముక్కు చూడు. అతను గొప్పగా చెప్పుకునేవాడు, ‘ఒకప్పుడు ఒక రాణి నన్ను ప్రేమించిందని’. యాక్ ! ఒక రాణి ఈ ముక్కును ప్రేమిస్తుందని నువ్వు ఊహించగలరా?”

సౌగంధి గోడ నుండి ఆ ఫ్రేమ్‌ను ఎంత బలంగా లాగిందంటే, మేకు కొంత సిమెంటు పెచ్చుతో పాటు ఊడి వచ్చింది. ఇది మాధోను షాక్‌కు గురిచేసింది.  అతను కోలుకోకముందే, సౌగంధి ఫ్రేమ్‌ను కిటికీలోంచి బయటకు విసిరింది. అది రెండు అంతస్తులు కింద గాజు పగిలిన శబ్దంతో నేలను ఢీకొట్టింది.

“అతని చెత్త ఏరుకునే రాణి చెత్త ఏరుకునేందుకు వచ్చినప్పుడు, ఆమె అతన్ని తనతో తీసుకెళ్లవచ్చు” అని ఆమె ఎగతాళి చేసింది. మళ్ళీ సౌగంధి వగరు నవ్వుతో విరుచుకుపడింది. ఆమె పెదవుల నుండి రుబ్బురాయి నుండి ఎగిసే నిప్పుల్లాంటి వర్షం కురిసింది.

మాధో బలవంతాన నవ్వాడు.

సౌగంధి గోడ మీద నుండి రెండవ చిత్రాన్ని ఊడబీకి బయట విసిరేసింది. “ఈ దుర్మార్గుడికి ఇచ్చిన ఈ స్థానం ఏమిటో వాడికి తెలుసా?” అని ఆమె అంది.

“ఇక నుండి ఈ వికారమైన మగాళ్ళని తీసిపారేస్తాను –  నిజమే కదా, మాధో?”

మాధో మళ్ళీ బలవంతాన నవ్వాడు.

సౌగంధి ఒక చేత్తో తలపాగా ధరించిన వ్యక్తి ఫోటోను తీసి, మరో చేత్తో మాధో ఫోటోను అందుకుంది. మాధో తన కోసం ఆమె చేయి చాపుతున్నట్లుగా భావించి వెనక్కి తగ్గాడు. తర్వాత సౌగంధి వాటిని గోడ నుండి, వాటి ఫ్రేములు, మేకులతో సహా చింపి పారవేసింది.

సౌగంధి బిగ్గరగా నవ్వి, ‘ఛీ.యాక్!’ అని అరిచింది. ఆమె రెండు ఫ్రేములను కిటికీలోంచి బయటకు విసిరేసింది, కొంతసేపటి తర్వాత, గాజు పగిలిపోతున్న శబ్దం వినిపించింది. మాధోకి తనలో ఏదో పగిలిపోయినట్లు అనిపించింది. అతను బలవంతంగా నవ్వుకున్నాడు.

“అవును, బాగా చేశావు. నాకూ ఆ ఫోటో నచ్చలేదు.” అన్నాడు

సౌగంధి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. “నీకు ఆ ఫోటో నచ్చలేదా?” అని ఆమె రెట్టించింది.

“నీలో ఏదైనా నచ్చేదుందా? నువ్వు, నీ సర్కస్ ముక్కు, నువ్వు, నీ వెంట్రుకల నుదురు, నువ్వు, నీ గాడిద ముక్కు రంధ్రాలు, నువ్వు, నీ వంకర చెవులు, నువ్వు, నీ దుర్వాసన, నువ్వు, నీ మురికి శరీరం? నీ ఫోటో నీకు నచ్చలేదా? ‘ఛీ.యాక్!’..అది నీ మచ్చలన్నింటినీ దాచిపెట్టింది. ఈ రోజుల్లో నువ్వు నీ లోపాల గురించి గర్వపడాలి కదా!”

మధో మరింత వెనక్కి తగ్గాడు. అతను గోడ దగ్గరకు చేరుకున్నప్పుడు, “చూడు సౌగంధీ, నువ్వు మళ్ళీ ఆ పని మొదలుపెట్టావులా వుంది. ఇప్పుడు చివరిసారిగా చెప్తున్నాను..” అని అరిచాడు.

సౌగంధి అతనిని అడ్డుకుంది. “నువ్వు మళ్ళీ ఆ పని మొదలుపెడితే “…ఆమె అతన్ని అనుకరిస్తూ, “సరే, మన వ్యవహారం ముగిసింది. నువ్వు ఇక్కడ ఏ వ్యక్తినైనా పడుకోనిస్తే, నేను నీ జుట్టు పట్టుకుని బయటకు తోసేస్తాను. నేను పూణే వెళ్ళిన వెంటనే ఈ నెల ఖర్చులకు మనీ ఆర్డర్ పంపుతాను. ఈ గది అద్దె ఎంత?” అంది వెటకారంగా.

మాధో ఆ మాటలకి అవాక్కయ్యాడు.

“నేను నీకు చెప్తాను” అని ఆమె తనకు తానుగా సమాధానమిచ్చింది. “పదిహేను రూపాయలు. పదిహేను, నేను పది వసూలు చేస్తాను. నీకు తెలుసుగా, రెండున్నర తార్పుడుగాడు రామ్ లాల్ కి వెళ్తుంది. మిగిలిన ఏడున్నర-ఏడున్నర, సరిగ్గా చెప్పానా..? ఆ ఏడున్నర రూపాయలకు, నేను చేయలేనివి నీకు ఇస్తానని వాగ్దానం చేసాను. నువ్వు తీసుకోలేని వాటి కోసం వచ్చావు. మన సంబంధం ఏమిటి? ఏమీ లేదు – ఈ పది రూపాయలు మాత్రమే. మనం నటించాము, ‘నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి’అని అనుకున్నాము. మొదట అది పది రూపాయలు, ఇప్పుడు అది యాభై. నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. నువ్వు నీ జుట్టును ఏం చేసావు?’ సౌగంధి ఒక వేలితో మాధో టోపీని ఎగరగొట్టింది. అతనికి అది అస్సలు నచ్చలేదు.

“సౌగంధీ..!”

సౌగంధి మాధో జేబులోంచి ఒక రుమాలు తీసి, దాని వాసన చూసి, నేలపై విసిరేసింది. “ఇదొక గుడ్డా..గుడ్డా..హ! ఆహ్, దీని వాసన ఘోరంగా ఉంది! దాన్ని తీసుకొని బయట పడేయండి.”

“సౌగంధీ..!”

“ఇది సౌగంధి, అది సౌగంధి”..దెం…య్ ! నీ యమ్మ ఏవన్నా ఇక్కడే వుండి, నీకు యాభై రూపాయలు ఇస్తుందా? లేక నువ్వు, నేను ప్రేమలో పడిన అందమైన యువకుడివా? ముండ నాకొడకా..! నన్ను బుట్టలో వేయడానికి చూస్తున్నావా? నేను నీ దగ్గర ఉన్నానా? దొబ్బించుకునేవోడా..నువ్వు ఎవరినని అనుకుంటున్నావు? నేను నిన్ను అడుగుతున్నాను..అర్ధరాత్రి ఇక్కడికెందుకు వచ్చావు? నేను పోలీసులకు ఫోన్ చేయాలా? పూణేలో నీ మీద నిజంగా పోలీస్ రిపోర్ట్ ఉంటే ఎవర్రా నిన్ను పట్టించుకొనేది?..నేనే నీ మీద ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.”

మాధో బాగా భయపడ్డాడు. “సౌగంధీ..ఏమైంది నీకు..?”

“నీ అమ్మని దెం..! నన్ను అడగడానికి నువ్వెవరు? ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే..”

సౌగంధి కుక్క ఆమె అరుపులు విని, మంచం కింద నుండి ఆందోళనగా లేచి, మాధో వైపు తిరిగి, గట్టిగా మొరగడం ప్రారంభించింది. సౌగంధి బిగ్గరగా నవ్వింది. మాధో భయపడ్డాడు. అతను తన టోపీని తీసుకోవడానికి వంగబోయాడు. కానీ సౌగంధి, ‘ఏయ్, దాన్ని ముట్టుకోకు! నువ్వు ఇక్కడ్నుండి దొబ్బెయ్..” అని అరిచింది.

తర్వాత ఆమె మరింత బిగ్గరగా నవ్వింది. ఆమె పేముకర్రల కుర్చీలో కూర్చుంది.  ఆమె కుక్క మాధోను గది నుండి తరిమివేసి, మెట్లపై నుండి అరిచింది.

కుక్క తిరిగి వచ్చి, తన తోకను ఊపుతూ ఉంది. సౌగంధి పాదాల పక్కన కూర్చుని తల అడ్డంగా ఊపుతూ, చెవులను బుగ్గలపై ఊపింది. సౌగంధి అకస్మాత్తుగా తనను చుట్టుముట్టిన భయంకరమైన నిశ్శబ్దాన్ని అనుభవించింది. అది ఆమె ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించనిది. ప్రయాణీకులతో నిండిన రైలు, స్టేషన్ల వారీగా ఖాళీయై, చివరి గుడారం కింద నిర్జనంగా నిలబడినట్టు.. తను బాధాకరమైన శూన్యంలో ఉన్నట్లు అనిపించింది. సౌగంధి ఈ బాధ‌ని తీసేయడానికి ప్రయత్నించింది, కానీ అలా చేయలేకపోయింది. ఒకేసారి ఆలోచనలు చుట్టుముట్టి, ఆమె మనసులో గుబులు పుట్టించాయి. ఆమె మనసు ఒక వడపోతలాగా మారింది. ఆమె ఆలోచనలన్నీ దానిలోనే చిక్కుకున్నట్లు అనిపించింది.

చాలా సేపు ఆమె పేముకర్రల కుర్చీలోనే ఉండిపోయింది. కానీ ఎంత ఆలోచించినా కూడా, ఆమె తనను తాను శాంతపరచుకోవడానికి ఏ మార్గం కనిపెట్టలేక పోయింది. కాబట్టి ఆమె తన మాంగీ కుక్కను ఎత్తుకుని, తన విశాలమైన టేకు మంచం మీద ఒక వైపు పడుకోబెట్టి, దాని పక్కనే పడుకుని వెంటనే నిద్రపోయింది.

          ఉర్దూ : సాదత్ హసన్ మంటో

                      ఇంగ్లిషు : మ్యాట్ రీక్, అఫ్తాబ్ అహ్మద్

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.