భారతీయ సంస్కృతికి సజీవ  సంతకం

త్తయిన బంగళాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాని ఈ ప్రాంతంలో పేదలు నిద్రించిన వసతులుండేవి..అవేవీ…అనే స్వరం దేశంలో ఎక్కడ బహుభాషా  సాహిత్య సమ్మేళనాలు జరిగినా ఖంగుమంటుంది. స్వచ్చమైన ఉర్దూ యాసతో ఆయన  చదివే గజళ్లు, నగ్మాలు వినేవారిని ఉర్రూత లూగిస్తాయి. కవిసమ్మేళనాల్లో కరతాళ ధ్వనులు, ప్రశంసావర్షాలు కురుస్తున్నాయంటే అక్కడ షీన్ కాఫ్ నిజామ్ ఉన్నట్లు.

భాషలు సంస్కృతులకు చెందుతాయి కాని మతాలకు చెందవు.. హిందీ,ఉర్దూ, తెలుగు, తమిళం, మలయాళం, రాజస్థానీ ఇవి సంస్కృతుల భాషలు కాని మతాల భాషలు కావు.. అని స్పష్టంగా చెప్పే 78 ఏళ్ల షీన్ కాఫ్ నిజామ్ ను ఎవరైనా ముస్లిం అనుకుంటే పొరపాటే. జోధ్ పూర్ లో  1945లో జన్మించిన శివకిషన్ బిస్సా సంస్కృతంలో విద్యను అభ్యసించారు. అయితే ఉర్దూ భాషలోని సౌందర్యానికి ముగ్ధుడై ఉర్దూ నేర్చుకుని పట్టు సంపాదించుకున్నారు.  తన కలం పేరును షీన్ కాఫ్ నిజామ్ గా మార్చుకున్నారు.  దేశంలో  ఉర్దూ లో ఆధునిక కవిగా, పండితుడుగా గుర్తింపు పొందిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. గాలిబ్, మీర్ తో పాటు ఎందరో ఉర్దూ మహాకవుల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించిన షీన్ కాఫ్ నిజామ్ అనేక కవితాసంకలనాలను వెలువరించారు. ఇక్బాల్, బేగం అఖ్తర్ పేరిట అనేక జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి.

వందలాది అద్దాలుంటేనేం. ఇంతవరకూ మనను మనం  గుర్తించలేకపోతున్నామనే భయం.. అనే షీన్ కాఫ్ నిజామ్ కవితలు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మనిషి మనోభావాలను పసిగడతాయి. సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యవస్థల నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తాయి.

మన ఊపిరి ఆగిన చోట ఒక కొత్తప్రయాణం మొదలవుతుంది అని ఆయన ఒక చోట అంటారు. బాటసారియే కాని గమ్యం అనేది ఉండదు. పొద్దు పొడిచిన చోటే రాత్రి అవుతుంది..అని మనిషి నిరంతర యాత్రికుడని ఆయన బావిస్తారు. ఇంటి నుంచీ ఎన్నడూ కదలలేదు కాని నా జీవితమంతా ప్రయాణంలోనే గడిచింది. అని  చెప్పుకుంటారు.

మనుషులు ఎలాంటి వారు? అప్నే పహచాన్ భీడ్ మే ఖోకర్ ఖుద్ కో కమ్రే మే డూండ్ తే హై లోగ్.. సమూహంలో గుర్తింపును కొల్పోయి గదిలో వెతుక్కుంటారు..అని షీన్ కాఫ్ అంటారు. అంతటా పొగలు లేస్తున్నాయి. మనుషులు ఆరిపోయి కనిపిస్తున్నారా? అని ఆయన ప్రశ్నిస్తారు. చాలా మంది దేవతలు భూమి మీదకు వచ్చారు లెండి.. ఎవరైనా మనుషులను ఎక్కడి నుంచైనా పంపండి.అని ఆయన ఆడుగుతారు. ఇవాళ వెలుగు చుట్టూ చీకటి ఆవరించింది. రాత్రి పూట బాట దారి తప్పడం లేదు కదా.. అని సందేహం వ్యక్తం చేస్తారు.

ఎవరూ ఎక్కడి నుంచీ పలకడం లేదు. బస్తీల్లో ఎవరూ లేరా? అందరికీ ఊపిరాడదు కాని ఎవరు కిటికీలు తెరవడం లేదు అని ఆయన ఆవేదనతో అంటారు.  పొద్దున గురించి బాధ తర్వాత వ్యక్తం చేయి.. రాత్రి ఎంత గడిచిపోయిందో చూడు..అని ఆయన వర్తమానం గురించి ఆలోచించమని చెబుతారు. కూని రాగాలు తీసే రహదారుల స్వప్నాలు ఏమయ్యాయి? ఊళ్లు నిర్మానుష్యంగా ఎందుకున్నాయి? అక్కడ నివసించే వారు ఏమయ్యారు? అని ప్రశ్నించే షీన్ కాఫ్ నిజామ్ నిశ్శబ్దాన్ని సహించలేరు. మీ మౌనానికి కారణమేమిటి?అని అడగడమే కాదు మౌనపు భాషను కూడా అర్థం చేసుకోగలరు. నీవూ మౌనంగా ఉన్నావు. నా పెదవులూ కదలడంలేదు.మరి ఇంతసేపు మాట్లాడిందెవరు? అని ఆరా తీస్తారు.

షీన్ కాఫ్ నిజామ్ కవితల్లో ఎక్కడా పరుషత్వం ఉండదు.చమత్కరిస్తున్నట్లు, పరిహసిస్తున్నట్లు కవితలు చదువుతూనే ఆయన సున్నితంగా జీవితంలోని విషాదం పట్ల అవగాహన కల్పిస్తారు.

సత్యం దురదృష్టం ఏమంటే సత్యం వద్ద స్వప్నాలేమీ లేవు.స్వప్నాల అదృష్టం ఏమంటే  వాటివద్ద సత్యాలున్నాయి..అనే షీన్ కాఫ్ నిజామ్ స్వప్నాలు సత్యాలకంటే గొప్పవి అని భావిస్తారు. తరుచూ కళ్లలో హృదయాన్నిచూస్తానని చెప్పే ఆయన స్వప్నాల విలువ తెలియని మనిషి మనిషే కాదంటాడు. స్వప్నాలతో అంధుడు కూడా ప్రపంచాన్ని చూస్తాడంటాడు.

నిన్నునా కలలో చూసినప్పటి నుంచీ అక్షరాలు నీతో సహవాసం చేశాయి.. అనే షీన్ కాఫ్ నిజామ్ నా ఊపిరే నీ జ్ఞాపకం అని ప్రేమికురాలి గురించి చెబుతారు.

ఉర్దూ కవిత్వం అంతా సంకేతాల కవిత్వం అంటారు నిజామ్. అసలు ప్రపంచంలో కవిత్వమంతా నిగూఢ సంకేతాల కళ అని అయన అభిప్రాయపడతారు.  దాచడం రాని వారు ఏమి చెప్పగలరు (జిసే ఛిపానా నహీ ఆతా, వో బతాయేగా క్యా?) అని ప్రశ్నిస్తారు. చెప్పడానికి అలవాటు పడ్డవారికి దాచిపెట్టగల నేర్పు కూడా ఉండాలి అని ఆయన చెప్పారు. సాహిత్యం మౌలికంగా ఒక రహస్యం.ఒక్క శబ్దానికి అన్నిఅర్థాలు ఎందుకున్నాయనిపించే మార్మిక భాష అని నిజామ్ చెబుతారు.

నగరం పరిస్థితి ఏమిటో నన్నడుగు అదెప్పుడూ ప్రయాణంలో ఉంటుంది..అని మారుతున్న కాలం గురించి చెప్పే షీన్ కాఫ్ నిజామ్ భౌతిక, రసాయన శాస్త్రాలు,తత్వశాస్త్రం మొదలైనేవీ కవిత్వం చెప్పేవి వివరించవు అంటాడు.లోతైన గాయాలతో లిఖిస్తాననే నిజాం మంచి రోజులు ఎప్పుడు వస్తాయి..లేక ఇలాగే చనిపోతామా? అని ఆవేదన వ్యక్తం చేస్తాడు.ఆయనను భారతీయ సంస్కృతి సజీవ సంతకం అని అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు