ప్రతి పదం ఒక చిత్రం!

సత్య ప్రతి పదంలోనూ కవిత్వముంది. వ్యర్థ పదాలు లేవు. సరళమయిన  మాటల్తోనే  లోతయిన భావాల్ని  వెలిబుచ్చుతుంది.  అక్షరాలవెనుక తడి హృదయముంది. కన్నీటి సంద్రముంది. నిప్పుల జడివాన వుంది. మరుగుతున్న లావా ప్రవహిస్తూ వుంటుంది. ప్రేమ, విరహం, వియోగం, విలాపం, విచక్షణ, స్వేచ్ఛామోహత్వం ఎక్కువగా కన్పించే కవితా వస్తువులు.

‘సత్య సూఫీ’ “ఇట్లు నీ నేను” ఇటీవల వచ్చిన కవిత్వాల్లో విలక్షణమయింది. ఈ తరం కవిత్వానికి ప్రతినిధి.  శ్రీరామ్ రాసిన ‘పరమగీతం’లా విభిన్నంగా వుంది. పుస్తకం పేరే  వినూత్నంగా వుంది. సత్య అసలు పేరు మాలతి. తన తండ్రిని అమితంగా ప్రేమించి కోల్పోయినందున ఆయన పేరును  తన పేరుగా సత్యగా మార్చుకుని, తనకు ఇష్టమైన సూఫీ పదం, సత్యకు జత చేసి  సత్యసూఫీగా కవిత్వాన్ని రాస్తోంది.

2017లో ఆర్నెలలుగా రాసిన కవిత్వం ముఖపుస్తకంలో వచ్చింది. ముఖ్యంగా ‘ కవిసంగమం’ ఇస్తున్న ప్రోత్సాహ ప్రోద్బలాల వల్లే తాను కవయిత్రిగా పరిణితి చెందానని ఆమె చెబుతోంది.

సత్య అద్భుతమయిన చిత్రకారిణి. డాక్టర్ సమతా రోష్ని  అన్నట్లుగా ఆమె చిత్రాన్ని చూస్తే  కవిత్వంలా ఉంటుంది. కవిత్వాన్ని చూస్తే బొమ్మలా రూపు కడుతుంది.ఈమె కవిత్వంలో ఉన్న ప్రత్యేకత  స్వేచ్ఛగా రాయడం. ఒక ఆర్టిస్ట్ లా జీవించాలని వుందనేది ఆమె ప్రగాఢ వాంఛ. ఏ సెన్సారింగ్ లేకుండా, స్వచ్ఛంగా , నిర్మలంగా, తాననుకున్న భావాల్ని ఉన్నవున్నట్లుగా  సహజాలంకారంలో ఊహా చిత్రాలుగా నిపుణత్వంతో  మలుస్తుంది.

రేఖలతో సౌందర్యాన్ని  చిత్రించడంతో పాటు, అక్షరాల్తో అద్భుతాల్ని పేర్చడంతో పాటు ,ఫొటోగ్రఫీలో కూడా తన నిపుణతను చూపించగలదు. ఒకే మనిషిలో ఇన్ని  వివిధతలు, నైపుణ్యాలుండడం అబ్బురం. ప్రకృతి ప్రియత్వం ఎక్కువ. సున్నితమనస్కురాలు. అమాయకత్వం నిండిన ప్రవర్తన. నిర్మొహమాటత్వం. కుండ బద్దలు కొట్టే స్వభావం కలగలిస్తే  అది సత్యసూఫీ తత్వం.

సత్య ప్రతి పదంలోనూ కవిత్వముంది. వ్యర్థ పదాలు లేవు. సరళమయిన  మాటల్తోనే  లోతయిన భావాల్ని  వెలిబుచ్చుతుంది.  అక్షరాలవెనుక తడి హృదయముంది. కన్నీటి సంద్రముంది. నిప్పుల జడివాన వుంది. మరుగుతున్న లావా ప్రవహిస్తూ వుంటుంది. ప్రేమ, విరహం, వియోగం, విలాపం, విచక్షణ, స్వేచ్ఛామోహత్వం ఎక్కువగా కన్పించే కవితా వస్తువులు.

దృశ్యాన్ని ఫ్రేముల్లో  బంధించడమే కాక, రేఖల్లో జీవాన్ని నింపి కవిత్వమయి  కలగంటుంది. ఒక వస్తువుకో , ఒకరూపానికో, ఒక పరిధికో, ఒక ఇజానికో కట్టుబడలేదామె. స్వేచ్ఛగా రాసింది. పొడి పొడి మాటల వెనుక, లోతయిన  భావాన్ని వ్యక్తీకరించడం ఆమె లక్షణం. తానేమనుకుంటుందో  అదే  రాసింది.

ఏ జ్ఞాపకమో వెంటాడినప్పుడల్లా కవిత్వమయి పసిపాపలా కలవరించింది. పలవరించింది. పలకరించింది. పరిమళించింది. పరవశించింది. సత్య కవిత్వంలో మరణాన్వేషణ ఎక్కువగా కన్పిస్తుంది. ఒక్క క్షణంలోనే జీవితమంటే ఏమీలేదనీ అదొక కాగితపు పడవేనని తేల్చేస్తుంది. మరోక్షణంలో తాత్విక చింతనతో జీవితపు పార్శ్వాలను విప్పిచూపుతుంది.

చలం అంటే అమితమయిన ప్రేమ. ఇష్టం. మానసిక స్వేచ్ఛ వ్యక్తికెంత అవసరమో పదే పదే చెబ్తుంది. బాధ్యతాయుతమయినదే నిజమయిన స్వేచ్ఛ అని భావించింది.

ప్రాణాన్నొకటని
రెండుగా  చీల్చి
నింగీ నేలగా మార్చిందెవరు?
అని సూటిగా స్త్రీ పురుషుల్ని  విడదీసిందెవరు?

అని ప్రశ్నిస్తుంది.

స్త్రీవాద భావాల్ని  అంతర్లీనంగా  చేసిన కవిత్వమామెది. కవితా శీర్షికలు లేని, ముందుమాటలు లేని కొత్త దారిలో ప్రయాణిస్తోంది. తన 45 పేజీలలోనూ  కవిత్వం ప్రవహించింది. ప్రస్తుతం  హైదరాబాద్ లో నివసిస్తున్న సత్య నుంచి ఇంకెంతో ఆశించవచ్చని ఇప్పటివరకు ఆమె ప్రయాణాన్ని గమనించి చెప్పవచ్చు.

 

సత్యా సూఫీ కవితలు

 

కూతవేటున కోయిల పడుతోంది..

అయినా తన రూపునెతకలేదు

 

చీకటి కొమ్మన గాలి ఆడుతోంది..

అయినా స్పర్శ నరకలేదు

 

చిక్కని కాటుక కలలనూగుతోంది..

అయినా కనుపాపను చిదమలేను

 

కానీ……

 

కాస్త మెరుపు  కొదవైన నా కలను

పొలిమేర దిబ్బల పూడ్చావెలా…….

 

నీవిచ్చినీ దేహం పుట్టుమచ్చనుకునుంటే

పేగుచాటు మాయగా  మాసిపోదును కదామ్మా ……..!?

 

ఊపిరి పేగున పొదిగిన  క్షణమే……

 

2

నాలుగ్గోడల నగరిలో నగ్నపాదాలు

చూసి చూడని  కనుల వెగటు

తాగలేని ఎడారులు….

 

యెదలోయ నడుమ

జిల్లేడు పూవసంతానికి

ఏ కోయిలై పాడగలవీ పెదాలు

 

దేహమెపుడూ చీకటి చిరునామానే

మోస్తుంది కదామరి……..

తూరుపు తీవెలనెలా

అల్లుకుపోగలవీ బాహువులు…?!

 

అయినా

స్పర్శ లోతుల్లోకి తరిమే

మనసుకే తీరమై నే-నిలవాలిపుడు ….!?

 

ఆనవాలు తెలిస్తే

కాసింత తరలిరా సఖా

గుట్టుగా వేచుంటాను

తడి సవ్వడికై!

*

శిలాలోలిత

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు