ప్యారలల్ యూనివర్స్

నేను ఏ పని చేస్తున్నా ఆ ప్యారలల్ యూనివర్స్‌లో నీతోనే ఉంటా.

“యూ ఆర్ మై ఎవ్రీథింగ్” అనే మాట నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటానా అని ఆలోచిస్తుంటా.

టెర్రస్ మీదికొచ్చి నిలబడి చూస్తుంటే.. నిశ్శబ్దంగా గాలి ఒక్కటే తిరుగుతుంటుంది. గాలి చేసేదేదీ శబ్దం కాదనుకుంటాను నేను. ఇక్కడ్నుంచి చూస్తే కనిపిస్తున్న ఎయిర్‌పోర్ట్ రన్ వే మీద ఒక చిన్న స్కూల్ బస్సొచ్చి ఆగింది. అందులోంచి పిల్లలు బయటికొచ్చారు. ఈ పక్క బిల్డింగ్ మీద టెర్రస్‌పై అక్కకు జడేస్తోంది ఒక చెల్లి. ఇటు పక్కనున్న స్కూల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు.

వర్షానికి ముందుండే చల్లటి గాలి. ఒకే కాలంలో, ఒకే వాతావరణ పరిస్థితుల్లో, దాదాపు ఒకే వయసున్న పిల్లలు వేర్వేరు ప్రపంచాల్లో ఉన్నారని తెలుసుకోవడం నాకెందుకో నిన్ను గుర్తు చేస్తుంది.

ఈ ప్రపంచంలో జరిగే ప్రతీ చిన్న పని నాకు నిన్ను గుర్తు చేయగలదు. ఇంతకుముందు కొన్ని నెలల క్రితం నేనున్న కాలనీ పక్క సందులోని ఏటీఎమ్‌లో మనం అడిగిన ఎమౌంట్‌లోని చివరి నోటు కూడా బయటికొచ్చాక, ఆ మెషిన్ చేసే చిన్న శబ్దం కూడా నిన్ను గుర్తు చేస్తుందని నీకు చెబితే నీకు నవ్వు రావొచ్చు కూడా.

నేనిలా బతకడాన్ని ఎప్పట్నుంచి అలవాటు చేసుకున్నానని ఆలోచిస్తా.

“యూ ఆర్ మై ఎవ్రీథింగ్” అనే మాటను నీకు చెప్పిన ప్రతిసారీ, ఈ అనంత విశ్వాన్ని ఒకటేదో ఫొటోలో చూసినప్పుడు మనకు పుట్టే తెలియని దిగులేదో వెంటాడుతుంది.

నీకది చెప్పినప్పుడు నా నిజాయితీని నేనే టెస్ట్ చేసుకొని చూస్తా. నిజాయితీగానే ఈ మాట చెప్పానని అర్థమై భయమేస్తుంది. అమ్మ ఉంది కదా, ఈ ప్రపంచంలో నేను ప్రేమించేవాళ్లు ఇంతమంది ఉన్నారు కదా, అయినా నువ్వే నా ప్రపంచమని ఎలా చెప్పగలుగుతున్నాననే గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది.

అయినా ఈ మాట అంటూనే ఉంటాను.

నీకిది రాస్తున్న సమయంలోనే ఇక్కడ్నుంచి నాలుగు విమానాలు టేకాఫ్ తీసుకున్నాయి.

ఎక్కడెక్కడి నుంచో మబ్బుల్ని తెచ్చిపెట్టుకున్న ఆకాశం, నువ్వు లేనప్పుడు నా లోపలంతా నిండుకుపోయిన దిగులు రంగేదో పూసుకుంది.

ఇప్పుడు ఇక్కడ్నుంచి నేను నీ ఆలోచనను వదిలేసి బతకాలనుకుంటా. రాస్తున్నది పక్కన పడేసొచ్చి, ఇందాకటిలాగే టెర్రస్ గోడంచు పట్టుకొని అదే ఆకాశాన్ని, అదే ఎయిర్‌పోర్ట్‌ని చూస్తుంటా. ఇందాకటి స్కూల్ బస్ లేదు. పిల్లలు లేరు. ఇంతుకుముందటి ప్రకృతి శబ్దంలో కలిసిపోయిన మనిషి సృష్టించిన శబ్దాలెన్నో ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఐదో విమానం టేకాఫ్ తీసుకుంది. పక్కనున్న స్కూల్లో క్రికెట్ ఆడుతున్న పిల్లలు లేరు. చిన్నగా చినుకులు మొదలయ్యాయి.

నీకు రాస్తున్న పుస్తకం పట్టుకొని చూస్తే, ఫస్ట్ పేజీలో, “యూ ఆర్ మై ఎవ్రీథింగ్” అన్న మాట నిండా చినుకులున్నాయి.

ఆ కొన్ని అక్షరాలు మాత్రమే ఏదో జ్ఞాపకంలా మారినట్టు, ఫోన్లో మనం ఎడిటింగ్ ఫిల్టర్లు అప్లయ్ చేసి ఒక మామూలు ఫొటోను గతంలోని ఫొటోలా మార్చినట్టు అనిపిస్తుంది.

సరిగ్గా ఇక్కడ నాకొక ప్రపంచం గురించి చెప్పాలనిపిస్తుంది. నువ్వు మాత్రమే ఉండే ప్రపంచం. పదివేల కోట్ల గెలాక్సీలున్న అనంత విశ్వంలోని ఒక గెలాక్సీలోని ఒక సౌర కుటుంబంలో ఉన్న ఒక భూమ్మీద ఉన్న నేను బతుకుతున్న ఈ జీవితంతో సంబంధం లేని ఒక ప్రపంచం.

ప్యారలల్ యూనివర్స్.

నేను ఏ పని చేస్తున్నా ఆ ప్యారలల్ యూనివర్స్‌లో నీతోనే ఉంటా. ఒక్కోసారి ఎన్నో నెలలకు నువ్వు కలుస్తానంటావు. నేను నీ దగ్గరికి వస్తుంటా. ఆ దారంతా కూడా నేను ఆ ప్యారలల్ యూనివర్స్‌లోనే ఉంటా.

నిన్ను చూస్తాను కదా, ఆ కాసేపు ఈ రెండు ప్రపంచాలను కలిపి చూస్తా.

నిన్ను చూడటానికి ఎన్నో యుగాలు పట్టినట్టు ఉంటుంది. నీ కళ్లు, నీ మాట, నీ నవ్వు, నీ దేహం వాసన.. ఇవన్నీ నావనిపిస్తుంది.

నేను ఆ ప్యారలల్ యూనివర్స్‌లో ఎప్పటికీ తెచ్చిపెట్టుకోలేని ప్రేమలనిపిస్తుంది ఇవి. నీకోసం అంత దూరమొచ్చినప్పుడైనా ఈ నాలుగు మాటలు చెప్పాలనుకొని, చెప్పను.

ఆ తర్వాత నువ్వెళ్లిపోతావు. నా చూపుకి అందనంత దూరంలోకి వెళ్లగానే, ప్యారలల్ యూనివర్స్‌లోకి నిన్ను తెచ్చి పెట్టుకుంటాను.

ఇంకెప్పుడైనా పిలవకపోతావా అనుకుంటా. ప్యారలల్ యూనివర్స్‌లో నిన్ను చూసుకుంటున్నంత కాలం, ఈ రియాలిటీ ఉంది కదా, దీంట్లో, నా మనసంతా ఈ విశ్వమంత బరువు నిండుకుంటుంది.

ఇంకో మనిషి వచ్చి, “ఏం ఆలోచిస్తున్నవు?” అనడిగినప్పుడు,

“ఆ మబ్బులు అంత బరువెట్ల మోస్తున్నయో కదా!” అనేసి నవ్వుతాను.

నువ్వెప్పుడైనా నా నవ్వు చూసి, నేనిదంతా నీకు చెప్పకున్నా, తెలిసిందానిలాగే తిరిగి ఒక నవ్వు నవ్వు. చాలు.

*

 

 

 

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు