పోరాటానికి సరికొత్త నిర్వచనం ఈ కవితలు!

టీవల లక్నో  సిబిఐ , అమ్మాయిలను/ మహిళలను  హెచ్చరిస్తూ ఒక ప్రకటన వాట్స్ అప్ లలో షేర్ చేసారు.

స్త్రీ శరీరఅవయవాలను అమ్మి, సొమ్ము చేసుకొనే  వ్యాపారం చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ, ఒక సామాజిక స్పృహ ను కలిగిస్తూ చేసిన ప్రకటన.

2015 నుండి, 2018 వరకు దాదాపు 20 వేలకు పైగా అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఈ విషయాలను పోలీసులు ఆరా తీస్తే, చాల వరకు ఆ తప్పి పోయిన అమ్మాయిలూ, శరీర భాగాలు కోల్పోయి, శవాలై తేలారు.  అమ్మాయిల శరీర భాగాలకు సరైన ధర ఉంటె, కనీసం 5 కోట్లు రూపాయలు సులువుగా లభిస్తాయి. 20 వ శతాబ్దం లో  ఉన్న మనం ఇలాంటి  విషయాలను వినడం ఎంత జుగుప్సాకరమో అనిపించింది.  ఇంకా తేలిన విషయాలు ఏమంటే,  అమ్మాయిలకు సాధారణంగా  ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు కాబట్టి, వారి కిడ్నీలు, గుండె, కళ్ళు, ఇలా అన్ని అవయవాలు ఉపయోగ కరమే అని,  ఆ దందా చేసే వారి అభిప్రాయం అట.

ఒక రాజకీయ పరమైన,ఒక సాంఘీక పరమైన,  ఒక ఆర్ధిక పరమైన భద్రత లేని ఈ పురుషాధిక్య ప్రపంచం మహిళలు ఇంకెంత తీవ్రంగా తమ తిరుగుబాటు స్వరాన్ని  వినిపించాలో అనిపించింది.  సరిగ్గా ఆ సమయం లో గీతా వెల్లంకి రాసిన రెండు కవితలు, అనిల్ డాని రాసిన ఒక కవిత చదివితే,  సరైన సమయం లో సరైన తిరుగు బాటు స్వరం అనిపించింది.

***

ప్రపంచం లో ఏ ఉద్యమం అయినా, ఏ అస్తిత్వ వాదమైనా సాహిత్యంతో నే దాని అనుకురార్పణ  జరుగుతుంది.  ఏ ఉద్యమం అయినా,  కవుల చేతుల్లో మొదట కవిత్వంగానో,  పాట గానో రూపొందు తుంది.  ఆ తర్వాతే దాన్ని  ఉద్యమ కారులు  అంది పుచ్చు కుంటారు.  అంటే, కవులు, మేధావులే  మొదట ప్రజల్లో  ఆ విప్లవ లేక ఉద్యమ కల్చర్ ని ప్రజల్లో నింపుతారు.  ఇదే విషయాన్నీ అనేక విప్లవాల నేపధ్యాలు రుజువు చేసాయి.  19 వ శతాబ్దం లో అస్తిత్వ వాద గొంతుక  బలంగా  వినిపించడం మొదలు పెట్టి నప్పటి నుండి , దాన్ని భుజాన కెత్తు కున్నది కవియత్రులు, కవులే.

ఇక్కడ ఇంకో ఆశ్చర్య కరమైన విషయం ఏమంటే, ఎవరైతే అణిచి వేయబడి ఉన్నారో,  వాళ్ళు మాత్రమే వారి బాధను తమ తమ గొంతుకను వినిపించడం  లేదు.   అనేక మంది ఇతర మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అనేక రకాలుగా  ఇతర అస్తిత్వవాదాలను భుజాన కెత్తు కున్నారు. అద్బుతంగా వినిపిస్తున్నారు.

a philosophical theory or approach which emphasizes the existence of the individual person as a free and responsible agent determining their own development through acts of the will. మానవ సమాజం లో , ఉనికి  కోసం,  మానుగడ కోసం తపన పడే ప్రతి ఒక్కరు తమ గొంతుక ను వినిపించే సంస్కృతి కి ఇతర మానవతా వాదులు కూడా తమ గొంతును శ్రుతి చేసారు.

స్త్రీ వాద కవిత్వాన్ని స్త్రీలు  మాత్రమే చైతన్యంగా ,జీవ స్పృహ తో రాయగలరనీ,  ఎందుకంటే,   ఎన్మాస్ గా వాళ్ళ  struggle for existence అనే సమస్య వాళ్ళు  మాత్రమే చవి చూస్తారని,  అదే కారణము –  అని  చెప్పే ఒక ప్రీ ఆకుపైడ్ పర్సప్షన్ చాల మందికి ఉంది. ఇలాంటి వాతావరణం నుండి తెలుగు సమాజాన్ని బయటకు తెచ్చేందుకు కృషి చేస్తున్న కొందరు ప్రముఖ కవులలో కవి అనిల్ డాని పేరు చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన రాసిన “గర్భాలని తన్నిన కాళ్ళు” అనే కవిత చదివాక, అనిపించింది.

అలాగే,  ప్రేమ కవిత్వం తో మనల్ని తడిపి ముద్ద చేసే రచయితలు లేదా రచయిత్రులు స్త్రీ వాద కవిత్వాన్ని ఎక్కువగా  టచ్ చేయరు _  అని చెప్పే మరో రాంగ్ నోషన్ ను చెరిపేసేందుకు కవయత్రి  గీతా వెల్లంకి పూనుకొందని, ఆమె రాసిన 1) ఓ విఘాత‌కారీ! 2) పాంచభౌతిక  అనే  రెండు కవితలు లు చదివాక, గట్టిగా భావించాను.

ఈ వారం సందర్భోచితం  శీర్షిక గురించి ఆలోచించే సమయం లో , ఈ ఇద్దరు కవులు రాసిన ఈ మూడు కవితలు  నన్నో క్షణం నిలిపి వేసాయి.  వేర్వేరు సందర్భాలలో రాసినా,  వేర్వేరు కవులు రాసినా,  వేర్వేరు జెండర్ లు రాసినా, ఆ ఇద్దరు కవుల మనోగతం ,వారి తపన, వారి ఆకాంక్ష ఒకటే అనిపించింది. రాజ్యాంగం  కల్పించన  జెండర్ ఈక్వాలిటీ ని కూడా  పురుషాధిక్య ప్రపంచం లో మహిళలకు సాధ్య పడక పోవడాన్ని, అందుకు గల కారణాలను గురించి అర్ధ్రతగా,  అనేక మెటాఫర్ లతో  అనిల్ డాని వివరిస్తే,  ఒక మహిళ శక్తీ సామర్థ్యాలను, ఆమె మనో ధైర్యాన్ని, ఆమె సాహసాన్ని అంతే నైపుణ్యం తో రెండు కవితల్లో,  ఒక ఎనిగ్మాటిక్ ఇష్యూ ని  energetic వే లో ప్రెసెంట్ చేసారు.

అనిల్ డాని తో నేను మాట్లాడినప్పుడు,  మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఇంతవరకూ  సమర్థ వంతంగా/ పరిపూర్ణంగా  తేలేక పోతున్నారు?  అనే అంశం  ఆయన మనసును తొలిచేస్తున్న ఒక సమస్య గా అనిపించింది.

ధర్మం నాలుగు పాదాలమీద నడిచినా

ఒంటి కాలిమీద జపం చేసినా ఏనాడూ

పక్కనే ఉన్న సగ భాగాలకు విలువే లేదు

కనబడుతున్న పాత్రలేమి మరీ పురాతనమైనవేమి కాదు

గతాన్నీ భవితని నడిపించే లోలకాలు

ఒక క్రొత్త డిక్షన్ ను అలతి పదాల్లో ,  రోజు వారీ మన మధ్య కనిపించే వాటిని మెటాఫర్ లుగా తీసుకొని, అనిల్ రాసిన ఆ కవిత, ప్రతి స్టాoజా లో ఏదో తెలియని వేదన, ఆయన మనసులో పట్టి వేదిస్తున్న ఒక  ఈక్వాలిటీ డి స్క్రిమినేషన్, తర తరాల  మహిళల అణిచివేత అన్నీ కల పోసుకున్నాయి.

అస్తిత్వ వాదం (“existentialism”) మూల  అర్థం ఏమంటే, ఎవరైనా సరే, తన ఉనికిని కోల్పోకుండా తన ఉనికిని తాను నిలుపు కోవడమే. (to stand out)!  ఈ మూల అర్థాన్ని గీత వెల్లంకి రాసిన  ఈ  కవిత లోని కొన్ని అంశాలను పరిశీలిస్తే…

“ఓ విఘాత‌కారీ!

నువ్వు న‌న్ను అట్ట‌డుగుకి

తొక్కేయాల‌నుకుంటావు

కానీ ఏదో ఒక మూల‌నుండి

నేను నా ప్రాభ‌వాన్ని రెప‌రెప‌లాడిస్తూ లేచి

ఆత్మ‌గౌర‌వ ప‌తాకాన్ని

 కొంచెం కొంచెంగా చించి పంచుతుంటాను!

అందుకున్న అబ‌ల‌లెవ‌రైనా ఉంటే

 ర‌క‌ర‌కాల చూపుల ముళ్ళు

 గాయ‌ప‌ర‌చ‌కుండా

క‌ప్పుకోవ‌డం నేర్చుకుంటారు!”

దాదాపు యాభై  సంవత్సరాల క్రితం మాయ ఏంజెలో రాసిన  స్టిల్ ఐ రైజ్  కవిత కన్నా,  ఎంతో ధైర్యాన్ని కూడగట్టించే ఒక అద్బుత  కవిత అనిపించింది.   ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే,   దశాబ్దాలు మారుతున్నా, పురుషాధిక్య అణిచివేత పరిస్థితులు  మారని కారణంగానే,  ఏనాడు గీతా వెల్లంకి వంటి రచయతలు  ఇంకా అదే  సమస్య పై,  అదే మహిళా శక్తిని బహిర్గతం  చేస్తూ, కవితలు ,రాయాల్సి రావడం ఈ ప్రజాస్వామిక ప్రభుత్వాల లోపాయి కారి విధానాలే.

మహిళా ధీశక్తి ని ఎంత గొప్పగా ఈ కవితలో చెప్పారో చూడండి…

“నువ్వు న‌న్ను అథఃపాతాళంలోకి

 పంపాల‌నుకుంటున్నకొద్దీ

నేనింకా ఉజ్జ్వ‌లంగా పైకెదుగుతాను!

నీ ప‌నికిరాని ప్ర‌కంప‌న‌లేవీ న‌న్ను కుదిపేయ‌వు!

 

నీ కొన‌గోట మీటితే రాగాలు ప‌లికే మోహ

 దేహం కాదిది!

నా క‌న్నీరు చూడాల‌ని నీ వెకిలి మకిలి

 పూసిన చోట విస్ఫులింగాలు వ‌ర్షిస్తాయి!

హోషియార్‌! హోషియార్‌!”

ఇలా కవితను ముగిస్తూ,  పురుష ప్రపంచానికి ఒక హెచ్చరిక ను పంపడం ఆమెలోని అంతర్లీన భావోద్వేగం విస్పోటమై నిప్పు కణికలను ఈ దుర్మార్గ పురుష సమాజం పై రువ్వినట్లు అనిపించింది.హాట్స్ ఆఫ్  గీత…

ఈ పురుష ప్రపంచ సమాజంపై  ఎగరేసిన తిరుగు బాటు బావుటా గా అనిపించిన, ఆ కవిత లోని  ఈ స్టాన్జా ను ఒక్కసారి చదవండి..

“ఆటుపోట్లు త‌ట్టుకుంటూనే

 ర‌క‌ర‌కాల నిధుల‌ను దాచుకున్న మ‌హా

 సాగ‌రం లాగే

వెత‌లూ సంతోషాలూ నిర్ల‌ప్త‌త‌లూ

నిర్వేదాలూ

 అన్నీ నాలోనే దాచుకుంటాను! నీకేవీ

తెలియ‌న‌వ‌స‌రం లేదు!”

****

గీత రాసిన మరో భిన్నమైన మనోహర అస్తిత్వ వాద కవిత,  పాంచ భౌతిక  :  అనే కవిత లో,

వర్షపు సవ్వడి

మట్టి వాసన వీస్తోంది

ఏ స్త్రీ ఇటుగా నడిచొస్తోందో!

 

చిరుగాలి ప్రణయినిలా

హోరు గాలి విరహిణిలా

 

మబ్బులు లేని ఆకాశపు నిర్మలత్వం

ప్రశాంత వదనంలా

మబ్బులు పట్టిన ఆకాశం

దిగులు పడిన మాతృ హృదయంలా

 

ఆటుపోట్లని దాచి నిధులని పంచే

సముద్రగంభీరలా ఆమె –

 

ఆమె నిత్యనూతన జలపాతమే ఎపుడూ

ఎప్పటికప్పుడు

సరికొత్త సరాగాల తుంపరలు

చేజారిందో…

అగ్ని రేఖల నడుమ నిలబెట్టే చూపు!

 

నిరాదరించకు

అద్దం ముక్కలుగా పగిలిన సవ్వడి

వినవస్తుంది

ఎటునుండో

 

ఏ స్త్రీ హృదయం ఎన్ని ముక్కలైందో

లెక్కించగలవా నువ్వెపుడైనా?

 

ఆమె భూమి!

నిన్ను నిలబెట్టనూ గలదు

భూకంపాన్నిచ్చి కప్పెట్టేయనూ గలదు

స్త్రీని గొప్పగా ప్రెజెంట్ చేయడం అస్తిత్వ వాద కవిత్వం లో ఒక భాగం. అయితే, సహజంగా ప్రేమ కవిత్వానికి ఎనలేని సౌందర్యాని తెచ్చిన గీత,   అస్తిత్వ వాద కవిత్వం లో సౌందర్యం  వైపుకు మొగ్గు చూపింది తన కవితలో!  కానీ, చివరగా, ఎలాంటి గుండె తడి లేకుండా, ఎక్కడా,  ఈస్థటిక్ సెన్స్ లేని మగవాడి ఆలోచనను ఎండగట్టే ఒక వాక్యాన్ని చివరగా చెప్పి,  స్త్రీ మహోన్నత శక్తి స్వరూపిణి అని authentic గా చెప్పి ,  ఆ కవితను ముగించింది.

“పాంచ భౌతిక” అని, శీర్షిక పేరు పెట్టడమే, ఒక గొప్ప ప్రయోగం. ఈ విశ్వం ఆవిర్భ వించడానికి, ఏవైతే  అయిదు అంశాలు ,  ఆకాశ, వాయు, తేజ (నిప్పు), అప (నీరు), పృథ్వి( భూమి) ఉన్నాయో, వాటిని పాంచ భౌతిక అంటారు. శబ్ద, స్పర్స, రూప, రస,గంధాదులు కలిగిన ఈ అయిదు పంచ భూతాల తో సమానం స్త్రీ అని చెప్పడమే గీత ప్రధాన ఉదేశ్యం అనిపించింది. ఆ విషయాన్నీ అత్యంత సౌందర్య వంతంగా చెప్పడం  మరో అద్బుతం.

*******

Gustave Flaubert, అనే రచయత, తాను చెప్పదలచు కున్న దాన్ని,  పాఠకులకు చేరవేయడానికి, ఒక సరైన పదం కోసం వారం, నెల రోజులపాటు, వేచి ఉన్న సందర్భాలు ఎక్కువగా  ఉండేవట.  అనిల్ డాని రాసిన ఆ కవిత లో కూడా  అంతే జాగ్రత్తగా పదాలను ఏరి , ఎంపిక చేసాడని అనిపించింది.

ఈ వాక్యాలు చూడండి

“దేవుడికోసం ఊరు మంచమెక్కిన బసివి అయినా “

****

“నీ జన్యు అవశేషాల్లో తన పాత్ర ఎంత

ఒక కొత్త జనానానికి ఆమె నొప్పి కేక ఎంత?

“మనవి గర్భాలని తన్నిన కాళ్ళు

అమ్మలముందు పెట్టిన అన్నంగిన్నెని లాగుతున్న చేతులు”

ఒక్కో చోట ఒక్కో అద్బుతమని పించే ప్రయోగ పదాలు. తన లోని భావోద్వేగాన్ని మనకు చేర్చే ప్రయత్నం లో,  అనిల్ ఎంచుకుంటున్న పదాలు నిజంగా అద్బుతం.  అలతి పదాల్లో అనంత అర్థాన్ని అందించే  ప్రక్రియే కవిత్వం.  సరిగ్గా అనిల్ అదే ప్రయోగాన్ని చేసాడు.

నేటి మహిళలు, ఆ యా సమాజం లో ఆచరణ లో ఉండే కస్టమ్స్ కారణంగా బాదితులు. ( victims of the customs). పురుషులతో సమానంగా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా, దీశక్తి ఉన్నా, అనేక సామాజిక అంశాలు, కుటుంబ కారణాల మూలంగా  పోటీ చేయలేక పోతున్న మహిళ,  మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా అయినా, పురుషులతో సమానంగా చట్ట సభల్లో స్థానం  సంపాదించి నప్పుడు,  మహిళలను స్వయంశక్తీ గా నిలిపే  చట్టాలు తెచ్చే అవకాశాలు ఉంటాయని అనిల్ ఆలోచన.

అదే భావాన్ని అనిల్ తనదైన సటైర్ తో బాధను వ్యక్తం చేసాడు.

“ఆమె అడుగుతున్నవన్ని మనకు సాధ్యం కాని సంగతులే కదా

ప్రతీ కన్ను ఆమెని ఆసాంతం స్కాన్ చేసే యంత్రమయితే ఆమె ఎక్కడ నడుస్తుంది

ఇప్పటికి ఇదే నేల మీద మూడు రోజుల ముట్టుని గుట్టుగా ప్రత్యేక గుడిసెలో మగ్గబెడితే ఆమె సిగ్గుతో ఇంకా చితికిపోతుంది

నోరున్నా తన దేహమో ,

దానికైన దాహమో చెప్పుకోలేక సంప్రదాయపు ఆంక్షల పద్మవ్యూహం లో నిలబడివుంది

 

దేశం ఏదైనా ఆమె ఇంకా పూర్తిగా ఇంట్లోకి రాలేదు

మత గ్రంథాల అధ్యాయాల వచనాల మాటల్లో ఇరుక్కుపోయి దిక్కులు చూస్తోంది

ప్రాణం పోసే ఆమె ఇప్పటికి ప్రతీ క్షణం పగిలిపోతూనే ఉంది

 

నిండు సభలో పరాభవం ఆమెకు కొత్త కానే కాదు

ద్వాపర యుగమైనా, ఆధునిక అసెంబ్లీ అయినా

దేవుడికోసం ఊరు మంచమెక్కిన బసివి అయినా

చీర లాగబడిన ప్రతీచోటా ఆమె తనకేం కావాలో నిగ్గదీసే అడిగింది”

అనిల్ , ఆ  కవితలో చేసిన భావవ్యక్తీకరణలో, ఒక బాధ,  ఒక నిరసన, ఒక వ్యంగ్యం, ఒక నిలదీత, ఒక ఆక్రోశం, ఒక సత్ ఆలోచనను వ్యక్తం చేస్తూ వెళ్ళారు.

ఈ మూడు కవితలు చదివాక,

ఇంకా చాల ప్రాంతాల్లో  నెలకొని ఉన్న దేవదాసి సిస్టం పై ముతులక్ష్మి రెడ్డి గారు రాసిన ఒక  రైటప్ గుర్తుకు వచ్చింది.

Don’t you think that society , while condemning those poor women and treating them as outcasts, but at the same time receiving those male culprits who resort to those women intotheir fold, as honorable  members of the society, undermined the very fundamental  principles of morality and justice?..( these devadasis arenot the victims of their own inclinations as ordinary prostitutes are, but rather the victims of custom, which teaches them to practice vice as their caste dharma…_ – Doctor Muthulakshmi Reddi.@ sundara reddy ( 30 July 1886 Madras – 22 July 1968)

ఈవిడ ను రెడ్డి అని బ్రిటిష్ వాళ్ళు పిలిచే వారు.  ఈమె ,  పురుషుల కాలేజి లో అడ్మిట్  అయిన మొట్ట మొదటి విద్యార్థిని.  ప్రభుత్వ మెటర్నిటీ అండ్ అప్తాల్ మాలిక్ హాస్పిటల్ లో మొట్ట మొదటి సర్జన్.  బ్రిటిష్ ఇండియాలో  మొట్ట మొదటి మహిళా legislator. స్టేట్ సోషల్ వెల్ఫేర్ సలహా బోర్డు లో మొట్ట మొదటి చైర్ పర్సన్. లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మొట్ట మొదటి ఉపద్యక్షురాలు.  సోషల్ రిఫార్మర్.

ఎవరో ఒకరు గొంతు విప్పక పోతే సమాజం లో చలనం ఉండదు.  ఎవరో ఒకరు పిడికిలి బిగించక పోతే  పోరాటం పదం దొరకదు. రచయతలు రాయాల్సినప్పుడు రాయక పోతే, రచయత అన్న పదానికి అర్థమే లేదు.  సమాజాన్ని చేతనావస్థ లో ఉంచక పోతే రచయత అంతిమ లక్ష్యం ఏముంటుంది?  సరిగ్గా,  ఈ ఇద్దరు కవులు గీత వెల్లంకి, అనిల్ డాని లు  ఎప్పటికప్పడు సమాజాన్ని చలనావస్థ లో ఉంచి, అణగారిన, బాదిత వర్గాల పట్ల నిలబడి,  తమ స్వరాన్ని వినిపిస్తున్నారు.

వీరిద్దరి సామాజిక స్పృహకు అభినందనలు.

*

సి.వి. సురేష్

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఇంతవరకూ అనిల్ కవిత్వాన్ని, నా కవిత్వాన్ని కలిపి – అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు రాసిన ఒకే వాద కవిత్వాన్ని గురించి ఇలా ఎవరూ కలిపి ఒకే వ్యాసంలో రాయలేదనుకుంటాను. అందుకే ఇది సందర్భోచితం అయిందేమో మరి!
  ఒక గౌరవం దక్కినందుకు ఉంది. థాంక్యూ సురేష్ సర్ 🙏
  థాంక్యూ Afsar Mohammed Sir🙏

 • మాంచి కసితో రాసిన ఇరువురి పద్యాల ఎన్నిక సందర్భోచితం. ముత్తురెడ్డి లక్ష్మీ గారి చరిత్ర తెలుసుకోవడం సంతోషం కల్గించింది. అనిల్ డ్యానీ గారికి గీతా అమ్మయ్య గారికి, అందించిన మీకు శుభాభినందనలు💐💐

 • అధ్భుతం సీవి గారూ మీ గమనింపు చాలా బాగుంది 💐💐💐 అభినందనలు 💐💐💐

 • చాలా మంచి విశ్లేషణ, మంచి కవితలను పరిచయంచేశారు. ధన్యవాదాలు మీకు.

  • ధన్యవాదాలు మేడం..మీ ఆత్మీయ స్పందనకు..

 • నిజమే, రచయిత రాయాల్సినపుడు రాయకపోయినా, రాయాల్సింది రాయకపోయినా అది రచయితకే కాదు, మొత్తంగా సమాజానికే చేటు. నేడు అన్నివిధాలా సంక్షోభ పరిస్థితుల్లో మనమున్నాం. లోతుగా తరచి చుాస్తే నేటి ప్రపంచ సంక్షోభానికి ముాల కారణం తాత్విక వైఫల్యమే. 21వ శతాబ్దపు సామాజిక సిద్ధాంతాలేవీ నేటి మానవుని సమస్యలకు పరిష్కారాలు చుాపలేకపోతున్నవి. కనుక ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన సమయం ఇది. అంటే రచయితలు మరింతగా రాయాల్సిన సమయం. రాసి ప్రజలను జాగృతపరచాల్సిన సమయం.

  మన కలాలు రెండు వైపులా పదునుగలవి. ఒకవైపు పాళీతో కాలక్షేపంకోసం రాసుకున్నా రెండోవైపు పాళీతో అభ్యుదయంకోసం రాద్దాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు