పెద్ద కురాకు

పొద్దు బారుడెక్కి యండ కొడతావుంది. ఊరు కేరి అంతా గలాట గద్దులు. ఈయప్ప గార్లు సూస్తే ఇయ్యలయినా ఇంకా ఎల్లులేదు. ఒగాయప్ప గూడా యాడా కానరారు.

ఎవురికేమయ్యిందప్పా? అనుకుంటున్నారా

ఏం కాలేదు. పొండుగ కల.

పీర్ల పొండుగ అంటే దాని కలే అలాదిల్యాప్ప!

ఈ పొండుగ అంటే కూలీనాలి సేసుకొనేవాళ్లకే కాదు, ఈ నడమ సదివినోళ్లుకి గూడా మోజు ఎక్కవయ్యింది. తాగేది, నంజిరి కురాకు తినేది, కునిసేది, సుట్టాలు పక్కాలు అందరిని కలిసేది, కుసాలు సేసేది అన్నీ ఉంటాయి.

ఈ పొద్దు కడా పొండుగ జల్దీ. పీర్లు దేవుడు నీడ్లు లాకి పొడుతాడు. పొద్దుగాళ్లే కురాకు ఇంటికి సేరిసిడిస్తే మిగతాదంతా ఇంట్ల ఆడోళ్లు సూసుకంటారు అని నా ఆత్రుము.

కానీ ఈ కోసేయప్పగారు రేతిరి పానకాలు అయిపాయినంక తాగి కునిసి సోలిపొయ్యి యాడాడ పొడినారో ఇయ్యాలయినా రాలేదు.

“ఇయ్యలతలికే కెత్తి తీస్కలే.

పగ్గం తీస్కలే. ఎద్దుని కెడిపేకి మోకయితే ఇంకా బాగుంటాదలే. ఎద్దు బాగా నదురుగా ఉందలే, కురాకు స్యానా పొడుతాది. తోలు మిందే కుప్పులేసేకి జాగా సాలుకొస్తాది. పాత సాప తీస్కలే

పరకలే పరక తీస్క.

అగ్గ.. మొద్దలే మొద్దు తీస్క.

ఇగ ఇంగొగిటి ఎముకులు నొరికేకి గొడ్లి మరిసిపోకుండా తీస్కలే”

అనే మాట్లు జోరుగా ఉండాల్సిండే. కానీ ఈ పొద్దు రొవ్వంత లేట్ ఆయా.

బిరీనక్కడ ఇదొగిటి అయిపోతే గుడితాకి పొవ్వొచ్చు. స్యానా దినాలుకి ఊరికి ఒచ్చినాను. గుడితాకి పోతే అందురుని కల్సొచ్చు. అట్లే అలాయ్ కునిసేది గూడా సూడొచ్చు అని పాతువన్నీ నాలా నేనే నెనుసుకుంటా ఆర్డీటీ ఇస్కోల్ కట్ట తానా కుసొన్నాను.

అంతల్యాకే మారెన్న తాత జోరుగా నడుసుకుంట ఒగుడే మాట్లాడుకుంటా వస్తున్నాడు. నేను పొయ్యేవాన్ని నిలుమని సొప్పి అంచుకు పోతి.

“యాల తాత అట్లా ఒగుడే నీలా నువ్వే మాట్లాడుతున్నావు” అని అడిగితి.

“అయ్యో ఏం చెప్తావ్? తియ్యపయ పండక్కి కోసేకని ఎద్దు తెచ్చింటిమా! దాన్ని గెడ్డాములాన మొద్దుకు కట్టేసింటిమి. అది తాడుని ఎట్ల జారుసుకోనిందో ఏమో? జారుసుకుని తప్పుసుకుని యాటికో పోయింది” అని చెప్పిడిస.

‘ఎవరిది ఎద్దు’ అని అడిగితి. ‘మనొందే మరిగాంది’ అనా.

అది వింటూనే “తూ! వీనిది యవుడు మొత్తుగోడ్లేనప్పో! అవుడట్లే ఒకసారి అయ్యిండా. ఇవుడు తిరగా అట్లే సేసుకున్నాడు. ఎద్దును కట్టేసేసారి సరిగ్గా సూసుకుని బిర్రుగా కట్టేయల్లా, లేదా” అని నేను నెత్తి మింద సేతులు పెట్టుకొని బాద పొడుకంటా అంటి.

“ఏప్పా! నువ్వు గూడ పట్టీ దింట్లనే రాపిసింటివా?” అంటే ‘ఊను’ అని సెప్తి.

“సరేలే! అయ్యేదేదో అయ్యింది. ఎద్దు సిక్కేది యవుడు? దాన్ని పొట్టుకొని కోసేది యవుడు? ఇదంతా అయ్యే కత కాదు గానీ, స్యాన దినాలకు ఊరికి వచ్చినావు. మనది కురాకు ఎవుడు తినింటివో ఏమో? ఆ నడిమింటి ఆయప్ప ఇంగొగుటి కోస్తుండాడు. మీ గిత్త పెద్దయ్య, మీ మామ యర్రోడు, మీ ఓబన్న సన్నయ్య ఆటికే కోసేకి పొయినారు. ఆడిగిన తీసుకోపోప్పా. బిరీన పోప్పో! అదిగూడా అయిపోయిని” అని సెప్పి ఎద్దుని ఎదికేకి ఎల్లిపాయే.

ఎట్లా పని ఆయినప్పా! నీ నొగుటి అనకంటే ఈడొగుటి అయ్యింది అనకంటా నేను చెరువు మకాన జోరుగా పోతి.

నేను ఆతావుకి పొయ్యేతలికి అవుడే కురాకు సన్నగ సేస్తున్నారు.

నన్ని ఆడ సూస్తూనే “నువ్యాల ఒస్తివప్పా? ఎవురంటన్నా సొప్పి పొంపిచ్చింటే ఇచ్చి పొంపిస్తుంటిమి కదప్పా” అని మా గిత్త పెద్దయ్య అనె.

‘ఏం కాదులే పెద్దయ్యా’ అని నేను అంటి.

“సరేలే! ఒచ్చేది ఎట్లో ఒచ్చినావు. యండ్ల ఈడ్యాల కుసొంటావు? ఆడ సప్పురుము కింద నీడ ఉంటాది. ఆడ కుసోపోప్పా. కుప్పులు ఎత్తే సారి పిలుస్తాము పోప్పా” అని మా పెద్దయ్య అనె.

“లేదు లే పెద్దయ్యా! అందిరిని మాట్లాడిసి స్యాన దినాలయ్యింది. ఈడే మాట్లాడకంటా కుసొంటాలే” అంటి.

“సరే లేప్పా! ఆ దిన్న మిందికి రా. ఎడువుకొనేవు నిదానంగా రాప్పా. అలే! ఆడ రొవ్వంత అసుంసెయ్యండి. అప్పయ్య కుసొంటాడు. పుట్టం పుర్లు ఉండాయప్ప. కుచ్చుకంటావి దానికే అసుంసెయ్యిమని సెప్తి” అని మా పెద్దయ్య అనె.

“పాపం! కొడుకు మింద ఎంత మముకారుమో సూడప్పో వాళ్ల పెద్దయ్యకి. కొడుకు నల్లుగా అయితాడు అని నీడ్ల కుసోపోప్పా అంటాడు. కొడుకు రొవ్వంత తెల్లగ్గిన ఉన్నింటే ఇంకెంత ముతివర్జిగా సూసుకుంటున్నో” అని మా యర్ర మామ అనె.

“ఉండేది నల్లుగా లేప్పా మామ. నల్లగయ్యేది ఇంకేడిదుంది” అని నేను అంటి.

అందురూ గెట్టిగ నగిడిసిరి.

“నలుపు నారాయనుని ఒన్ని లేప్పా! నా కొడుకు కిష్ణుణి కట్లాఓడు. చక్రుము తిప్పేదే మావోడు” అని మా పెద్దయ్య అనె.

‘ఇంకేం ల్యాప్ప! కొడుకుని పొంది గిత్తెయప్ప సందకాడికి కెల్లుకి రెడీ సేసుకనా’ అనిడిసిరి ఆడ ఉండే అందురు.

తిరగా అంతా పొడి పొడి నగిడిసిరి.

మేమంతా ఇట్లా కుసాలుగా మాట్లాడకంటా ఉండాము కానీ, ఓబన్న సన్నయ్యకు నేను ఇట్లా నంజిరి కోసేతాకి పొయ్యిండేది రామంటే సెరిపోలేదు. కడాకి నోరు తెరిసి మాట్లాడే

“అపయా! మీయ్యా కట్లా సెదువుకన్నోళ్లు ఇట్లా తాకి రాగూడుదు అప్పా” అనె.

“అయ్యో! దాందేముంది ల్యా సన్నయ్య. మనుమ్ తినేది నిజుం అయినవుడు దాబెట్టుకొనేది ఏముంది సెప్పూ” అని నేను అంటి.

“కాదప్ప. తింటామని యముకులు మెడ్లాకి యేసుకొని తిరుగుతామేమి సొప్పు? మంది పెద్ద కురాకు కాబెట్టి దాన్ని గుమ్మంగా తీసుకని ఇంటికి పోవల్ల. సేసుకొని తినల్లప్ప. అంతే!” అని అనె.

“అది కాదు సన్నయ్యా! ఎవురికి నచ్చింది వాళ్ళు తింటారు. మనకి నచ్చింది మనము తింటాము. దీంట్లో గుమ్మంగా తినేది, సిగ్గుపడేది ఏముందప్పా? ఇవుడు మన ఊరు పక్కలానే నర్సంపల్లి ఉందప్పా. ఆడ గొంచుకార్లు అంతా నలజీవుము తెచ్చుకొని నెడీ ఊర్లనే వాళ్ళ ఇండ్లు దగ్గరే బండమిందికి ఏసుకుని బాగా కాల్సి, తోలు అంతా గీరి, బాగ కెడిగి పొసుము నూని బాగా తిక్కి, మెయ్యి బాగా తనతన బంగారకట్లా మెరిసేతట్ల చేసి, కోసి కుప్పులేసి పొంచుకుని ఇంటికి తీస్కని పోయి వొండుకొని తింటారు కదప్పా! వాళ్ళెవురు సిగ్గు పొడురే!

అది కాక మనమంతా పీర్లు సోమికి మొక్కంటాము. ఒగుపొద్దు ఉండి లాడీలు యేసుకంటాము. ఆయప్పకి ఈ జీవుము అంటేనే పొడుదు. దానికే మనుము దాన్ని మన అత్తరికి గూడా రానిచ్చుకోము. అయినా గూడా తినే వాళ్ళను సూసి యా పొద్దన్నా రోసుకున్నామా చెప్పండప్పా? రోసుకోము కదా!

అంత యాలప్పా? చానామంది బెలగువ్వులు తింటారు. ఎర్రెలుకులు తింటారు. కమ్మర కాకులు తింటారు. అడివి సీబిల్లులు తింటారు. కుందేండ్లు తింటారు. సూసెల్దా మీరు?” అని అడిగితి.

దానికి వాళ్లంతా ‘ఊను కదప్పా! పిల్లోడు సొప్పేది నిజుమే కదా! వాళ్ళందరుకి ల్యాకున్న సిగ్గి మనకి యాలా’ అని అనిడిసిరి.

‘మనమేం దొంగుతనం సెయ్యిలేదు. కూనీ సెయ్యిలేదు. మనికి సెరిపోయింది మనుం తింటున్నాము. అంతు మాత్రుము దానికి గుమ్ముమ్యాలప్పా’ అని అంతా అనిరి.

ఇంతమంది సొప్పేతలికి ఓబన్న సన్నయ్యకి రొవ్వంత నింబులుమాయా.

మా సన్నయ్య అవుటికే ఏడు ఒరుకు సెదువుకున్నాడు. ఇంట్లా జరుక్కా సెదువు ఇడ్పిసినారు. సదివేకి, రాసేకీ బాగొస్తాది. రోజు పేపురు సెదువుతాడు. టీవీలా వార్తులు ఇంటాడు. అన్నీ బాగా తెలుసుకొంటుంటాడు.

“అది కాదు అపయా! స్యానా దినాలు నుండి ఇంగొగుటి అడగళ్ల నిన్ని అనకంటా ఉండాను. ఈపొద్దు కుదిర్యా.

ఇవుడు ఇంట్ల మనం సేసుకని తింటాము. మంచిది. నేను కాదనను. కానీ ఈ పెద్ద పెద్దు సొదువులు సొప్పించే కాలేజుల్లా గూడా పెద్ద కురాకు పొండుగ  అని పేరుపెట్టి మన నంజిరి స్యార సేసుకొని తింటారంట కదా! అట్లయాల సేయల్లా. అది తినుకుండే వాళ్ళు గూడా ఆడ ఉంటారు కదా! మడి వాళ్ళకి ఇబ్బంది సేసినట్లే కదా మనుము?

అదీకాక, ఆటికి ఈ పిల్లోలంతా సదువుకొనేకి పోయినారా, బువ్వ స్యార సేసుకొని తినేకి పోయినారా? ఇది సొప్పు అపయా నాకి” అని అడిగ్యా.

“మంచి ప్రశ్న అడిగినారు. దానికి గూడా నేను జబాబు సెప్తాను ఇనండి” అని నేను అంటి.

“మన ముత్తాతలు వాళ్ళు తాతులు కాలుము నుండి ఈ పెద్ద కురాకు తింటున్నారు. ఇదేం ఈ పొద్దుడిది కాదు. మనుము ఇదే యాల తింటున్నాము అంటే రేటు పిరుము కాదు. దాంట్లానా వేరే అవుట్లు కంటే దీనిని తింటేనే బలము సెగితి ఎక్కువ. మనమే కాదు, దూరాబారం ఉండే దేశాల్లో గూడా దీన్నే బాగ మోజుగా తింటారు.

మొదుట్లో పెద్దగా ఇబ్బంది ఏం రాలేదు.

పూరా యాడా లేవు అనును గానీ యాడన్నా ఆడా ఈడా ఒగిటి రెండు సన్నగా జరిగుండొచ్చు.

కానీ, ఇవుడు యట్ల అయ్యింది అంటే కొందురు జనుము ‘ఏయ్! మీరది తినేకే లేదు. దాన్ని తినేది మీరు ఐడిసిపెట్టల్లా. మేము తినేదాన్ని మాత్రుమే మీరు తినల్లా’ అనే మాట ముందిరికి తెచ్చిరి. మనుం తినే తిండి మింద సన్న సూపు సూసేది మొదులుపెట్టిరి. ఇట్లా శరత్తులు పెట్టేదాన్ని మనదాంట్లో ఉండే సదువుకున్నోళ్లు, ఉద్యోగస్తులు వ్యతిరేకించేది మొదులుపెట్టిరి.

ఒగురు తినే తిండిని ఇంగొగురు గవురుము ఇయ్యల్ల. అట్ల కాదంటే అది తినేవోడు యాపొద్దో ఒగునాడు ఎదురు తిరుగుతాడు నేను పొబ్లిక్‌గా తింటాను ఏమన్నా సేసుకోండి అంటాడు. ఇవుడు జరుగుతుండేది ఇదేనప్పా” అని వాళ్ళకి అర్ధమయ్యే మాటుల్లో సెప్తి.

అందురు స్యానా సంతోసుము పొడిరి. అంతా ఒగేసారి ఒగేమాట అనిరి.

“అప్పయ్య సెదువుకున్నాడు కాబెట్టి ఇన్ని మాటులు సొప్పా. దానికే మనుమంతా గూడా మన పిల్లోల్ని బాగ సెదువుసల్లా” అని సెప్పిరి.

*

        నా కథల్ని మా ఊరి మాటల్లో చెప్తే బాగుంటుందని అనిపించింది!

* నమస్తే అన్నా! మీ గురించి చెప్పండి.

నమస్తే! మాది అనంతపురం జిల్లా శెట్టూరు. పుట్టింది, పెరిగింది ఇక్కడే. ప్రస్తుతం ఇక్కడే ఉంటూ ప్రైవేటు టీచర్‌గా పని చేస్తున్నాను.

* కథా రచన ఎలా మొదలైంది?

చిన్నప్పటి నుంచి ఆర్డీటీ పాఠశాలలో పుస్తకాలు చదవడం అలవాటు. మా ఊళ్లో శాఖా గ్రంథాలయం ఉండేది. అక్కడి నుంచి మా మావయ్య టీచర్ లింగప్ప పుస్తకాలు తెచ్చేవారు. అవి చదువుతూ ఉండేవాణ్ని. రాయడమనేది ఫేస్‌బుక్ నుంచే మొదలైంది. ఇండస్ మార్టిన్, సొలొమోన్ విజయ్‌కుమార్, సడ్లపల్లి చిదంబరరెడ్డి, వివేక్ లంకమల లాంటి వారు రాసేవి చదివాక నాకూ రాయాలని అనిపించి రాశాను. మా ఊళ్లో ఆది ఆంధ్ర తిప్పేస్వామి అనే ఉపాధ్యాయుడు, కవి నాకు సలహాలిచ్చి మెరుగులు దిద్దారు. ఆయన వల్లే నాగప్పగారి సుందర్రాజు గారి ‘మాదిగోడు’ కథలు పరిచయమయ్యాయి.

* తొలి కథ ఎప్పుడు రాశారు?

ఫేస్‌బుక్‌లో నేను రాసినవి చూసి రచయిత్రి ఎండ్లూరి మానస గారు తను సంపాదకురాలిగా ఉన్న ‘విహంగ’ వెబ్ పత్రికలో కథలు రాయమన్నారు. నా అనుభవాలే కథగా చేసి తొలిసారి ‘మీరేంటోళ్లు’ అని రాశాను. అది 2020 అక్టోబర్‌లో ప్రచురితమైంది. ఆ తర్వాత ఆ పత్రికలోనే మరో రెండు కథలు రాశాను. ఇప్పటికి ఆరు కథలు రాస్తే అందులో మూడు ప్రచురితమయ్యాయి.

* అనంతపురం మాండలికంలో కథలు రాసే ఆలోచన ఎలా పుట్టింది?

మామూలు భాషలో రాసేటప్పుడు కొన్ని భావాలకు పదాలను సమకూర్చుకోవడంలో కొంత ఆలోచించాల్సి వచ్చేది. మా ఊరి యాసలో కథ రాస్తున్నప్పుడు ఆ ఇబ్బంది వచ్చేది కాదు. చెప్పాలనుకున్నది స్పష్టంగా రాయగలిగేవాణ్ని. నా కథల్ని మా ఊరి మాటల్లో చెప్తే బాగుంటుందని అనిపించింది.

* మాండలికంలో కథలు రాసినప్పుడు కొందరికి అర్థం కాకుండా మిగిలిపోయే అవకాశముంది కదా?

నిజమే! అయితే మాండలికం కూడా మన భాషే. నా కథలు చదివి ఇండస్ మార్టిన్ ఒక మాటన్నారు – “ఇంగ్లీషులో ఏదైనా వాక్యం అర్థం కాకపోతే పక్కన డిక్షనరీ పెట్టుకుంటాం కదా! అలాగే ఈ యాసలో పదాలు అర్థం కాకపోతే కొంత ప్రయత్నంతో వాటి అర్థం తెలుసుకుంటారు. అందుకే వాటికి ఫుట్ నోట్స్ ఇవ్వొద్దు”.

కథలు రాశాక సిద్దార్థ్ సుభాష్ చంద్రబోస్, నూకతోటి రవికుమార్, మారుతి పౌరోహితం,సత్యరంజన్ కోడూరు లాంటి కొందరికి పంపుతాను. వారు చదివి సూచనలు చేస్తారు.నా చిన్నప్పటి గురువు అబ్దుల్ వహాబ్ ఖాన్ కథలు రాయడంలో చాలా ప్రోత్సాహం అందిస్తున్నారు.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

రకరకాల అంశాల మీద మరిన్ని కథలు రాయాలని ఉంది. నా చుట్టూ ఉన్నవారి జీవిత అనుభవాలను కథలుగా రాసే ఆలోచన ఉంది. భవిష్యత్తులో తప్పకుండా రాస్తాను.

*

యం.యస్.హనుమంత రాయుడు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు