పెంపకాలు – సవాళ్ళు!

పాతకాలంలో పిల్లలు భగవద్దత్తం అనుకునే వారు.  నారు పోసేవాడు నీరు పోయడా అంటూ అర్ధ నిమీలిత నేత్రాలతో వేదాంతంగా నిట్టూర్చుకుంటూ ఎంతమంది పిల్లలు పుడితే అంతమందిని “పెంచేసే”వారు.  చిన్న వయసులో పెళ్ళై, శరీరం వికసించక ముందే తల్లులై, ప్రతీ కానుపు ఒక చావు బతుకుల పోరాటమైన స్త్రీల సంగతి ఎవరూ పట్టించుకునే వారు కాదు కానీ ఎంతమంది పిల్లల్నైనా కనేసే వారు.  ఐదారుగురు పిల్లల్ని పెంచటంలో తిండికి సంబంధించిన ఆర్ధిక ఇబ్బందులు వుంటే వుండొచ్చేమో కానీ పెంపకం పెద్ద కష్టం అనిపించేది కాదు ఆ తరానికి.  నిజమే, జనాభా పరంగానే కాదు భావాల పరంగా, భావజాల పరంగా అప్పటి సమాజం పరిధి చాలా చిన్నది.   శ్రీశ్రీ చెప్పినట్లు మంచికీ చెడుకీ మధ్యన కంచు గోడలుండే కాలమది.  నిశ్చల నిశ్చితమైన జీవన విధానమే వుండేది. ప్రతి విషయంలోనూ ఒక “హార్డ్ అండ్ ఫాస్ట్” రూల్ వుండేది.  మంచి చెడుల విచికిత్స తక్కువ.  స్వేఛ్ఛ తక్కువ.  నిబంధనలెక్కువ.  ఆలోచనలు తక్కువ. నిర్బంధమెక్కువ.  న్యాయాన్యాయాల నిర్వచనాలు చాలా సంకుచితంగా వుండేవి.  కర్మ సిద్ధాంతం చాలా బలంగా పని చేసి ఒక ఓదార్పుగా, ప్రజలు సర్దుకుపోవటంలో శిక్షణ ఇచ్చేదిగా పనిచేసేది.  ప్రతి దానికి ఒక ఫార్మాట్ వుండేది.  ఆ ఫార్మాట్ ప్రకారం వెళ్ళిపోయేవారు.  బతుకు తెరువు కోసం వలసల్లేని కారణంగా చిన్న కుటుంబాలు ఏర్పడనందున సుభిక్సంగా వర్ధిల్లిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఎంతమంది పిల్లల్నైనా పెంచటానికి దోహదం చేసేది.  చిన్న చిన్న ఇళ్ళు లేదా చిన్న పోర్షన్లలో ఐదారుగురు పిల్లలతో ఒక కుటుంబం వుండేది.   “గోడలకు కూడా చెవులుంటాయి” అనే సామెత ఊరకనే పుట్టలేదు.  దాపరికానికి అవకాశం తక్కువ.  ప్రైవసీ  శూన్యం.  ఒక తడికెతో రెండు గదులుగా విభజించబడిన ఒకే గది ఇంట్లో మేం ఆరుగురం నివసించేవారం.  విలాసాల సంగతి పక్కన పెట్టండి సౌకర్యాల గురించిన ఆలోచన కూడా లేదు. పిల్లల చదువులు అతి చవక.  ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువు దాదాపుగా ఉచితమే.  కానీ ఇప్పుడో?  జీవితంలో లగ్జరీకి చాలా ప్రాముఖ్యత వుంది.  సౌకర్యాల విషయంలో బేరాల్లేవ్. పరిచయాలు ఎక్కువ.  మానవ సంబంధాలు తక్కువ.  ప్రస్తుత వినిమయ సంస్కృతిలో సుఖాలెక్కువ.  సాంత్వన తక్కువ. ఈ నేపధ్యంలోనే వర్తమాన పేరెంటింగ్ ని బేరీజు వేసే ప్రయత్నం చేస్తాను.

బహుశా భారతదేశ చరిత్రలో పేరెంటింగ్ కి సంబంధించి ఇప్పుడున్నంత సంక్లిష్టత ఇంతకు మునుపు ఎప్పుడూ లేదేమో.  పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పుడున్నన్ని సవాళ్ళు ఇంతకుమునుపు ఎప్పుడూ లేవు.  పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ అనేక కుదుపులకి లోనవుతున్న కాలం ఇది.  ఎందుకంటే సమాజం, అందులో భాగమైన మనిషి జీవితం అతి వేగంగా కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లల పెంపకం చాలా ఫోకస్డ్ గా వుంది.  పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యం దగ్గర నుండి సౌకర్యాల వరకు చాలా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  కుటుంబ సంబంధాలు మారినట్లే కుటుంబ పరిమాణం కూడా మారిపోయింది.  ప్రస్తుతం బంధాల విలువ సౌకర్యాల మీద ఆధారపడి వుంది.  పిల్లల నుండి విపరీతమైన డిమాండ్లు వస్తున్న కాలం ఇది.  వస్తు వినిమయం మీద పిల్లల సామర్ధ్యాలే కాదు పెంపకం నాణ్యత కూడా ఆధారపడే రోజులివి.

కడుపులో బిడ్డ పడిన మరుక్షణమే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పరిస్తితులు వచ్చేసాయి.  ఇప్పుడు సౌకర్యాలెక్కువ. వస్తు వినిమయం ఎక్కువ.    “మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంద”నే సామెత ప్రకారం ఒకరు లేక ఇద్దరికి మాత్రమే తమకున్న మానవ, ఆర్ధిక వనరుల్ని వినియోగించగలుగుతున్నారు.  ఈ రోజున పిల్లల మీద పెట్టే ఖర్చు ఒక పెట్టుబడిలా కనబడుతుంది తల్లిదండ్రులకి.  ఆరోగ్యం, ఆహారం, దుస్తులు, విద్య, రవాణ మీద పెట్టే ఖర్చు జాంబవంతుడి అంగల్లా వేగంగా పెరిగిపోతున్నది.  ఇప్పుడు ఇల్లు గడవడంలో తిండి ఖర్చు శాతం చాలా తక్కువ.  “స్టేటస్” కోసం పెట్టే ఖర్చే అతి పెద్ద ఖర్చు.  ఆ స్టేటస్ ఖర్చులో బ్రాండెద్ దుస్తులు, వాహనం, ఫుడ్ కోర్ట్స్, విహారాలు, మల్టీప్లెక్స్ సినిమాలు వంటివి అనేకం వుంటాయి.  స్టేటస్ సంగతి పక్కన పెడితే చదువు ఖర్చు ఇప్పుడు లక్షల్లోకి చేరింది.   పేరెంట్స్ అందరూ తమ పిల్లలు మంచి మనుషులు కావాలనుకోవటం కన్నా మంచి పొజిషన్లో వుండాలనుకుంటున్నారు కాబట్టి ఖర్చుకి వెరవడం లేదసలు.  పిల్లల మీద పెట్టుకున్న ఆశలు, వారికి పెడుతున్న లక్ష్యాలు భారీగా వుంటున్నాయి.  ఇంత పెట్టుబడి పెడుతున్న పేరెంట్స్ సహజంగానే పిల్లల్ని ఒక “ప్రోడక్ట్”లాగానే చూస్తారు కదా.   అంత ఖర్చు పెట్టి చదివిస్తున్న పిల్లలు అనుకున్న విధంగా ఎక్కడ సక్సెస్ కారో అన్న ఆత్రుతలో వుంటారు.  ఇక్కడే కుటుంబంలోని మానవ సంబంధాల్లో మానవీయ విలువలు దెబ్బ తినటం మొదలవుతుంది.  సమాజ వేగంతో పరిగెట్టడానికి నానా యాతనలు పడే తల్లిదండ్రుల తాపత్రయం పిల్లలకి అర్ధం కాదు.  చుట్టూ వున్న ఆకర్షణీయమైన వినిమయ సంస్కృతి పట్ల పిల్లలకి వున్న వ్యామోహం పేరెంట్స్ కి ఆమోదయోగ్యంగా వుండటం లేదు.  ఐదేళ్ళ క్రితం వాడిన వస్తువులే కాదు ఆలోచనలు, పరిస్తితులు కూడా  పురాతనమైనవిగా కనబడుతున్నాయి.  ఆలోచనల ప్రమాణాల్లో విలువల స్థానాన్ని బ్రాండ్స్ గుంజుకుంటున్నాయి.   జీవితాన్ని విలువల కంటే వస్తు వినిమయం ఎక్కువగా కమ్ముకుంటున్నది.   ప్రతి రంగం సమాచార ఉధృతితో మునిగిపోతున్నది.  టూ మెనీ ఆప్షన్స్!  ఒక ఆప్షన్ని పరిశీలించే లోపలే మరొకటి దూసుకొస్తున్నది.  నిన్నటి విషయం ఇవాళ ఔట్ డేటెడ్.

పేరెంటింగ్ లో ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నది భయం.  పరస్పర అమోదంతో జరిగే సాధారణ లైంగిక కృత్యాలే కాదు లైంగిక పరమైన అకృత్యాలు కూడా ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి.  ఈ నేపధ్యంలో పిల్లల భద్రత తల్లిదండ్రులకు అతి పెద్ద కన్సర్న్ అవుతున్నది.  బైటికెళ్ళిన ఆడపిల్లలు ఇంటికి తిరిగి వచ్చేవరకు వాళ్ళని మొబైల్ ఫోన్లలో మానిటర్ చేస్తున్నారు.  ఇంక చిన్న పిల్లల విషయంలో అయితే చెప్పే పని లేదు.  ఆడపిల్లల సంగతి సరే సరి.  మగ పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకునే పరిస్తితి ఎదురవుతున్నది.  శృంగారం ఇప్పుడెంత మాత్రం మర్మగర్భమైన విషయం కాదు.  గతంలో దాన్ని మరీ సిగ్గుపడాల్సిన విషయంగా భావిస్తే ఇప్పుడు గేట్లు తీసిన వరదనీటిలా తయారైంది.  అరచేతిలో మొబైల్ విజ్ఞానం, వినోదం, శృంగారాలకు ఉత్ప్రేరకం అయింది.  రహస్యాల్లేవ్.  కేవలం ఉత్సుకతలే వున్నాయి.  ఏదైనా తెలుసుకోవటం అంటే ప్రత్యక్షంగా చూడటమో లేక అనుభవించటమో అయిపొయింది.  భ్రమాన్విత (వర్చువల్) ప్రపంచానికి, వాస్తవిక ప్రపంచానికి మధ్య గీతలు చెరిగిపోతున్నాయి.  సరిహద్దులు కొట్టుకుపోతున్నాయి.  ఆడపిల్లలు, మగపిల్లలు లింగ బేధాలకతీతంగా మంచి స్నేహితులుగా మసలుకోవటం సమాజానికి ఆరోగ్యకర పరిణామం.  అయితే స్వేఛ్ఛకి, భద్రతాయుతమైన బాధ్యతకీ మధ్య వున్న వ్యత్యాసాన్ని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పి కన్విన్స్ చేయగ్లగాలి.

ఇది మంచి, ఇది చెడు అన్న విచక్షణకి అవకాశం లేకుండా పోయి ప్రతిదీ అత్యవసరం అయిన పరిస్తితి వుంది.  కాబ్ బుక్ చేయటానికి, ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేయటానికి, సినిమా టిక్కెట్లు, రైల్ టిక్కెట్లు…ఒకటనేమిటి?  పిల్లల మీదనే పెద్దలు ఆధారపడుతున్న కాలమిది.  ఇంక పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయగలరు?  ఎలా నడవాలో తల్లిదండ్రులు చెప్పే కాలం పోయి ఎలా బతకాలో పిల్లలు ఆచరించి చూపే కాలం వచ్చేసింది.   తల్లిదండ్రులు అంతరాత్మ ప్రబోధకులుగా కాక అయోమయంగా చూసేవారుగా తయరయ్యారు.

ఏ కాలంలో అయినా తరాల మధ్య ఘర్షణ అనివార్యమైనా ఇప్పుడున్న వ్యత్యాసం, ఘర్షణ మరీ పెద్దది.  ఈ వ్యత్యాసం, ఘర్షణ ప్రధానంగా సాంస్కృతికమైనవి.  ఇదివరకటిలా పెద్ద దేశాలు చిన్న దేశాల్ని ఆక్రమించి వనరుల్ని కొల్లగొట్టే పద్దథైకి చెల్లుచీటీ ఇచ్చి వ్యాపారం కోసం వినిమయ సంస్కృతిని ప్రవేశపెట్టి వస్తువుల్నే కాక విహారం నుండి వివాహం వరకు సేవల్ని కూడా మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చేసాయి.  ఇప్పుడు సామ్రాజ్యవాదమంటే ఆక్రమణ కాదు ఆయుధాల దగ్గర నుండి ఆహారం (ఉదా కీఫ్సి) వరకు అమ్ముకొని లాభాలు చేసుకోవటమే. సామ్రాజ్యవాదానికి వ్యాపార రూపమైన వినిమయ సంస్కృతి అన్ని తరగతుల ప్రజల మీద చూపించేది కేవలం ప్రభావం కాదు.  అదో వెల్లువ.  ఇందులో తల్లిదండ్రులు కూడా కొట్టుకుపోవలసిందే.

ఈ రోజున పిల్లల మీద సినిమా చూపించే ప్రభావం అసాధారణంగా వుంది.  సినిమాలు మగపిల్లల్ని మొరటుగానూ, ఆడపిల్లల్ని సెక్స్ ఆబ్జెక్టీవ్స్ గానూ చూపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా ఇందుకు సరైన ఉదాహరణ.  మహేష్ బాబుని చూసి ఆడపిల్లల్ని ఒసే అని పిలిచే వాళ్ళు చాలామందే వున్నారు.  అల్లు అర్జున్ వేసిన పరమ స్వార్ధపరమైన ప్రేమికుడి పాత్ర చాలామందిని ప్రభావితం చేసింది.  వీటికేం లెక్కలుండవు.  పరిశీలనలో తేలేవే.  సిగరెట్ తాగటం, మందు కొట్టడం హీరోయిజంలో ఎప్పుడూ లేనంతగా కనిపిస్తున్నది.  డ్రగ్స్ ని గ్లోరిఫై చేస్తున్నాయి.  ఇదంతా తల్లిదండ్రుల పరిధిని దాటి పిల్లల్ని కమ్మేసే విషయాలే.  అధునాతన మల్టీప్లెక్స్ సినిమాల్లో చూపించేదంతా వొట్టి లుంపెన్ సంస్కృతే.  చిత్రం ఏమిటంటే ఈ సినిమాలే టీవీల్లో వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా చొంగలు కార్చుకుంటూ చూసేవాళ్లే.

పిల్లలతో స్నేహపూర్వకంగా వుండాలనేది కాదనలేని వాస్తవం.  కానీ వేగంగా మారుతున్న సంస్కృతి పిల్లల దారుల్ని అనుమానంగా, పిల్లలేమో తల్లిదండ్రుల పర్యవేక్షణ పట్ల అసహనంగా చూసేలా చేస్తున్నాయి.  ఇది ఎవరి తప్పూ కాదు.  ఒక రకంగా చెప్పాలంటే అందరూ సంఘం చెక్కిన శిల్పాలే.  పిల్లలు ఇరవై నాలుగ్గంటలూ మొబైళ్ళు పట్టుకుంటే పేరెంట్స్, టీవీ సీరియళ్ళలోనో, నెట్ ఫ్లిక్సుల్లో కాలక్షేపం చేస్తుంటారు.  తమ ఇంట్లో తమ పిల్లల్ని సాంస్కృతికంగా భ్రష్టు పట్టించే వాతావరణానికి ముందుగా తామే బానిసలమై పోయామని ఎంతమంది గ్రహిస్తున్నారు?  పేరెంట్స్ ముందు బాధ్యతాయితంగా, మంచి మనుషులుగా వ్యవహరిస్తే పిల్లలకు తాము “ఫసిలిటేటర్స్” గా కాక “కాన్షస్ కీపర్స్” గా వ్యవహరించి పిల్లలు మంచి పిల్లలు అయ్యే అవకాశం వుంది.

ముందుగా చెప్పుకున్నట్లు ఇవాళ పేరెంటింగ్ చాలా సవాళ్ళతో కూడుకొని వుంది.  తల్లిదండ్రులు స్మార్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.  తమ పిల్లలు ఎక్స్పోజ్ అయ్యే ప్రతి విషయం మీద వారు తమ అవగాహన పెంచుకొని సాధ్యమైనంత ఎక్కువగా తమ కుటుంబాన్ని వినిమయ, లుంపెన్ సంస్కృతికి దూరంగా వుంచాలి.  పిల్లల్ని సెన్సిటైజ్ చేయాలి. పిల్లల్ని బైట సమాజం బలంగా ప్రభావితం చేస్తున్నది కాబట్టి ప్రతి సామాజిక పరిణామాన్నినిశితంగా గమనించాలి. ఈ వాతావరణంలో పిల్లల్ని కట్టడి చేయటం కష్టం కాబట్టి “ఫ్రెండ్లీ పేరెంటింగ్” ఒక కీలక మంత్రంగా అలవాటు చేసుకోవాలి.  ప్రతి విషయంలో మంచి చెడుని వారితో చర్చిస్తూ ఉండాల్సిందే.  నిర్బంధం పెట్టకుండానే వారి మిత్రుల్ని, కదలికల్ని గమస్తూ వారిని స్నేహపూర్వకంగా అలర్ట్ చేయాలి.  తల్లిదండ్రులు తమ గురించి ఆలోచిస్తుంటారని, కన్సర్న్ ఫీలవుతారని, బాధ పడతారని పిల్లలు అర్ధం చేసుకుంటే చాలావరకు తమని తాము నియంత్రించుకోగలరు.  పిల్లల కోసం ఖర్చు పెట్టింది పెట్టుబడిలాంటిది కాదని, వారిని మంచి మనుషులుగా తీర్చి దిద్దటమే తమ కర్తవ్యమని, కెరీర్ కన్నా మానవ్ సంబంధాలు ముఖ్యమని తల్లిదండ్రులు భావించాలి.

సాత్వికమైన వాతావరణ కల్పన, బాధ్యతాయితమైన పర్యవేక్షణ, తిరుగులేని ప్రేమ, స్నేహపూరిత వైఖరి పిల్లల బౌద్ధిక అభివృద్ధికి, మానవీయ ప్రవర్తనకి దారి తీస్తాయి.
****

సమాజానికి ఉపయోగించే డాక్టర్లు, టీచర్లు, లాయర్లు….ఇలా అందరికీ శిక్షణ వుంటుంది.  కానీ తల్లిదండ్రులకి ఏ శిక్షణ వుండదు.  ఒక సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా వారు తమను తామే సరిగ్గా మలచుకోవాలి. మరో మార్గమే లేదు.

అరణ్య కృష్ణ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజమే ఇప్పుడు పిల్లల పెంపకం కత్తి మీద సాములా తయారయ్యింది.పిల్లల్ని సన్మార్గంలో పెట్టడానికి పేరెంట్స్ ఎంతగా తపిస్తున్నారో.ఒక వైపు ఆర్ధిక పరిస్థితుల్ని చేసుకుంటూనే మరో వైపు పిల్లల జీవితాల గురించి మధన పడాల్సిన దుస్థితిలో పేరెంట్స్ వున్నారు.పెరిగిన విజ్ఞానం కూడా సౌకర్యాల కంటే కూడా కష్టాలనే తెచ్చి పెట్టింది.ఇప్పుడు సెల్ ఫోన్ పేరెంట్స్ కు మరో పెద్ద తలనొప్పయి నట్టింట్లో కూర్చుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు