పురాతన వస్తువులు

 ఒడియా మూలం : ప్రతిభా రాయ్

తెలుగు అనువాదం : వంశీకృష్ణ

 

ముసలాయనకి తొంభయ్ పైనే ఉంటాయి . ఆమె కి దగ్గర దగ్గర ఎనభయ్ వస్తున్నాయి. వాళ్లిద్దరూ ఇప్పుడో, ఇంకాసేపటికో చెట్టునుండి రాలనున్న పండిన మామిడి పళ్ళలాగా వున్నారు. ఎప్పుడు రాలిపోతామో అనే బెంగ వాళ్ళిద్దరినీ వేధిస్తోంది. అతడు ఆమె కంటే పెద్ద కనుక ఆమె కంటే ముందే పోతే బావుంటుంది అని అతడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ ముసలామె పట్ల అంత నిర్దయగా వ్యవహరిస్తాడా? ఇప్పుడు వాళ్లిద్దరూ దేవుడిని కొత్తగా కోరేది ఏమీ లేదు. వాళ్లకు దేవుడు అనీ ఇచ్చాడు. కొడుకులు, కూతుళ్లు, మనవలు. మనవరాళ్లు, ధనం , ధాన్యం అన్నీ ఇచ్చాడు.

కానీ ఆ ముసలామె ఇంకా ఒక కోరిక తీర్చమని దేవుడిని ప్రార్ధిస్తున్నది. తన భర్త నూటా ఇరవై ఏళ్ళు బతుకుతాడు. అతడి అరచేతిలో ఆయుః రేఖ అంత పొడవైనది. కనుక అతడిని బతకనీ, కానీ నన్ను మాత్రం ఆయన బతికి ఉండగానే బయటకు వెళ్లేలా చేయి. ఎవరైనా తన బాగు కోరుకుంటారు కానీ ఆమె మాత్రం తన భర్త సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నది. ఈ మాత్రం కోరిక కూడా ఆదేవుడు తీర్చకపోతే ఆమె ఎవరికి  ఫిర్యాదు చేయాలి?  ఆ ముసలాయనకి మాత్రం ఇలాంటి కోరికలు ఏవీ లేవు. ఎందుకంటే అతడికి దేవుడిమీద  అంత భక్తీ  లేదు. భయమూ లేదు. తన భార్య ప్రార్ధనలు విని ఆ దేవుడు తనకు దీర్ఘఆయువు ప్రసాదిస్తే  బతికి మాత్రం ఏమి చేయాలి. సుదీర్ఘమైన జీవితం అంటే సుదీర్ఘ కాలం భరించలేని వేదన

ఆ పెద్ద ఇల్లు కొన్ని తరాలక్రితం నిర్మించింది. ఆ ముసలి జంట వయసు కంటే ఆ ఇంటి వయసే ఎక్కువ. ఆయనకు తెలిసినంతలో  ఆ నూటయాభయి ఏళ్ళ ఇంటిని పడగొట్టమని అనగా ఎప్పుడూ వినలేదు. అది ఇప్పటికీ చాలామంది కి నీడను ఇస్తున్నది . చాలా పెద్ద ఇల్లు కనుక ఎవరికైనా ఒక భాగం అద్దెకి ఇస్తే కొంత ఆర్ధిక వెసులుబాటు కూడా ఆ ఇల్లు అందిస్తుంది. కానీ ఈ వృద్ద దంపతులు బతికివుంటే  వాళ్ళ ఆరోగ్యం కోసం, బాగోగుల కోసం అదనంగా ఖర్చుపెట్టడం తప్పిస్తే ఎవరికీ మాత్రం ఏం  లాభం?వృద్ధులు భారం అనుకోవడం లో ఆశర్యం కూడా ఏమీ లేదు. ఈ రోజుల్లో ప్రపపంచమే అలా వుంది .

బహుశా ఆ గ్రామం లో అతి పెద్ద వయసున్న దంపతులు వాళ్లే  కావచ్చు. వాళ్ళ సమకాలీనులు అందరూ దాటుకుని వెళ్లిపోయారు. వాళ్ళుకూడా మానసికంగా అంతిమ యాత్ర కి సిద్దపడే వుంటారు. కానీ మృత్యువు ఎవరినైనా “మీ ఇంటికి రానా ? నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావా? అని అడుగుతుందా ఏమిటి? అందుకే జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి మృత్యువు అన్నదే లేదన్నట్టు. ఆ దంపతులు ఎప్పుడూ చావును గురించిన ఆలోచలను తమ దరికి  రానివ్వలేదు. ప్రతి క్షణం వాళ్ళు గడచిన జీవితాన్ని వదిలేస్తూ తాజా తాజా గా గడిపేస్తున్నారు. ఇప్పటికీ ఒకళ్ళ మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకోగలరు. సమీపం లోని దేవాలయం నుండి ప్రసాదం రోజూ వస్తుంది కనుక ఆహారానికి ఇబ్బంది లేదు. అయినా ఆ వయసులో వాళ్లకెంత కావాలి? ఎక్కడో దూరంగా వున్న పిల్లలు రావడం లేదని వాళ్లెప్పుడూ బాధపడలేదు. కనీసం ఆశించను కూడా ఆశించలేదు.అందుకే పిల్లలకి ” మీకెప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడు రండి. ఉండాలనుకున్న రోజులు ఉండండి “అని చెప్పేవారు

తమకు ఎప్పుడైనా జ్వరమో , అనారోగ్యమో  కలిగినా వాళ్లెప్పుడూ పిల్లలకు కబురు పెట్టరు. అలా పెట్టడం ఆమె కేమో కానీ అతడికి అస్సలు ఉండదు ఇష్టం ఉండదు

” పిల్లలని ఉండీ ఏం  లాభం? అవసరమయినప్పుడు వాళ్ళు దగ్గరలేకపోతే. నా పిల్లలు అయితే కనీసం ఒక్క వుత్తరం ముక్క అయినా రాయరీ ?” అని ముసలామె ఎప్పుడైనా నోరు చేసుకుంటే

” ఏ మనిషీ మరొక మనిషి కి  రక్షణ గా రాడు.కేవలం ఒక్క దేవుడు తప్పిస్తే. మన పిల్లల సమస్యలు వాళ్ళవి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడకి వస్తేనో , ఓ ఉత్తరముక్క రాస్తేనే నీ నొప్పులు ఇప్పటికిప్పుడు తగ్గిపోతాయా ఏమిటి?  ఆడవాళ్లు అర్ధం లేని ఫిర్యాదులను ఎందుకు పెంచి పోషిస్తారు? వాళ్ళు ఇక్కడకు వస్తే 10,15 వంటలు చేసి  వడ్డించే ఓపిక నీకుందా? వాళ్లకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడే రానీ” అని ఆమె ఫిర్యాదుల పరంపరని తుంచేస్తాడు.

ఆ మాటలు వినగానే ఒక పరమానందకరమైన నవ్వు రేఖ ఆమె బోసి నోటి మీద ఉదయిస్తుంది. అతడు చెప్పే మాటలు ఏవీ విమర్శలు కావని , పిల్లల మీద అతడికున్న ప్రేమ కి సాక్ష్యమని ఆమెకు తెలుసు

ఇప్పుడు వాళ్ళుంటున్న ఆ పెద్ద ఇంటిని ఒకప్పుడు జమీందారు భవంతి అనేవారు. కాలం మానవ మాత్రులపట్ల ఎంత నిర్దయగా ఉంటుందో , కొన్ని వస్తువుల పట్ల అంత ఉదారంగా వుంటుంది. గత యాభయి ఏళ్లుగా ఆ భవంతి ఒక్క మరమ్మత్తుకీ నోచుకోకపోయినప్పటికీ దాని దర్జా ఏమాత్రం తగ్గలేదు. కాక పోతే కాస్త చీకటిలాంటి నిరాశ ఆ భవంతిని అల్లుకుంది. ఆ భవంతిలో ఉంటున్న ఆ వృద్ధ దంపతుల  తో పోలిస్తే ఆ భవంతే ఆకర్షణీయంగా ఉంది. గతించిన కాలపు ఘన పరిమళం ఏదో  ఆ భవంతిని ఆవరించుకుని చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది

బ్రిటీష్ ప్రభుత్వం అమలు లోకి తీసుకుని వచ్చిన Sunset Law కారణంగా బెంగాలీ జమిందారు ఒకరు ఈ భవంతిని ఆ ముసలాయన పూర్వీకుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. ఒడిషా  కార్మికుల నెత్తురు చెమట తో అందంగా అద్భుతంగా కట్టిన ఆ భవంతి దానికదే అద్భుతం. ఇప్పటి ఆధునిక ఇంజనీర్లు , ఆర్కిటెక్ట్ ల సారధ్యం లో కూడా అంత గొప్ప భవంతిని , అంత కళాత్మకమైన భవంతిని కట్టలేరు అనేది నిర్వివాదాంశం.

ఒడిషా  ఒక ప్రత్యేకమైన ప్రావిన్స్ గా  మారి బెంగాల్ నుండి విడిపోయాక ఆ బెంగాలీ జమిందారు మళ్ళీ బెంగాల్ వెళ్ళిపోతూ ఆ భవంతిని  వేలం పెడితే ముసలాయన తాతముత్తాతలు మళ్ళీ  వేలం లో కొనుక్కున్నారు. ఆ భవంతి తో వాళ్లకున్న అనుబంధం మళ్ళీ వేలం లో హెచ్చు ధర చెల్లించి కొనాలన్న  నిర్ణయానికి కారణం కావచ్చు.  ఇప్పుడీ వృద్ధ దంపతులకు అది కేవలం వాళ్ళు నివసించిన భవంతి లానే  కాక దానితో ఒక పూర్వజన్మ బంధం కూడా పెనవేసుకునివుంది . అందువల్ల ఆ భవంతిని  అమ్మడానికో, అందులోని పనికిరాని వస్తువులను పారవేయడానికో ఆ దంపతులకు మనసు రాదు. లోపల ఉపయోగంలో లేని , అనవసరమైన వస్తువులు చాలా గుట్టలుగా పేరుకుని వున్నాయి. వాటిని ప్రేమగా  శుభ్రంగా తుడిచి, కళాత్మకంగా అమర్చి పెట్టడానికి ఎవరూ లేరు.ఒకప్పుడు ఆ భవంతి సౌందర్యాన్ని ఇనుమడింపచేసి , కుటంబ పరువు ప్రతిష్ఠలకు నిండైన సాక్ష్యాలుగా నిల్చిన అనేకమైన అద్భుత పురాతన వస్తువులతో ఆ భవంతి ఇప్పుడొక స్టోర్  రూమ్ గా మారిపోయింది

ఆధునిక గాడ్జెట్స్ తోనూ , ఎలక్ట్రానిక్ వస్తువులతోనూ ఇంటిని అలంకరించుకునే  కొత్త తరం వారసులకు ఆ భవంతి , అందులోని వస్తువులు అభిరుచి లేమికి , అసౌందర్య  దృష్టికి ఉదాహరణలుగా కనిపించవచ్చు. ఆ వృద్ధ దంపతులకు భవంతిని ఇప్పటి ఆధునిక అలంకరణ సామగ్రితో అలంకరించడానికి కావలసిన ఓపిక లేదు. అంత ధనమూ లేదు.  ఆ భవంతిలో ని ప్రతి వస్తువూ ఆ కుటంబ చరిత్రలోని ఒక్కో పేజీ లాంటిది. వాటిని అలా అనామకంగా పడేయడానికి ఆ వృద్ద దంపతులు ఎంతమాత్రమూ సంకోచించలేదు. ఇప్పుడు వాళ్ళ శరీరాలే  వాళ్లకు బరువు కదా  అలా అని వాళ్ళు వాళ్ళ శరీరాలని  వదిలివేయడం లేదు కదా. వాళ్లలాగే ఆ భవంతిలోని వస్తువులు కూడా! ఆ వృద్ద దంపతుల శరీరాలు పట్టు తప్పి , రోగగ్రస్తమై , నొప్పులతో బాధిస్తూ వున్నా  ఆ శరీరాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా . ఈ వస్తువులను కూడా అలాగే ! పైగా ఈ పురాతన వస్తువులు ఆ వృద్ధ దంపతుల శరీరాల్లాగా ఈ ఫిర్యాదులూ  చేయవు. ఏ డిమాండ్లూ చేయవు.  అమాయకంగా , నిశ్శబ్దంగా ఒక మూల పడి  ఉంటాయి. ఒకప్పుడు ఆ భవంతి పిల్లా పాపలతో కళకళ లాడుతూ ఉన్నప్పుడు  ఆ వస్తువుల వైభోగమే వైభోగం. కానీ ఇప్పుడు అవి దుమ్ము కొట్టుకుని , సాలీళ్లు గూళ్ళు కట్టుకుని నిర్లక్ష్యాన్ని అనుభవిస్తూ జీవిస్తూ ఉంటాయి. అయినా అవి ఎలాంటి ఫిర్యాదులూ  చేయవు. కావాలనుకుంటే వాటిని అమ్మేయవచ్చు , ఎవరికైనా  దానం చేయవచ్చు , ఏదైనా చేయవచ్చు . అవేమీ అనుకోవు.

వృద్ధ దంపతులు శరీరం లో శక్తి ఉడిగి , రోగాల బారిన పడి , ఓపిక నశించి ఏదో  జీవించి ఉన్నామంటే జీవించి వున్నారు కానీ  ఆ ఇంట్లోని మంచాలు , బీరువాలు, పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలు, గంటల మూతలు ఉన్న కుండలు, వక్కల డబ్బాలు. పసుపు ముద్దలు ను దాచే  మూత గిన్నెలు, తాటాకు విసనకర్రలు, ధ్వని చేసే శంఖాలు  ఇప్పుడు కూడా ఆ కుటంబానికి సేవ చేయడానికి సిద్ధంగా వున్నాయి. బయట  వరండాలో  ఒక పల్లకి అనాహూతంగా , అనుపయోగంగా నిలబడి వుంది. అయినా అదేమీ తన సత్తువను కానీ శక్తిని కానీ కోల్పోలేదు . ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంట వస్తే అత్తగారింటికి తీసుకెళేళ్లడానికి సిద్ధం అంటోంది. కానీ ఇప్పుడెవరూ పల్లకీలను వాడడం లేదు. మారు మూల గ్రామాలలో కూడా పెళ్లి కూతురును మోటారు కారులోనే తీసుకునివెళుతున్నారు. కారు ను భరించలేని వాళ్ళు ఆటోలను ఆశ్రయిస్తున్నారు కానీ పల్లకీ వైపు చూడటం లేదు. ఏ పెళ్ళికొడుకూ , పెళ్లి కూతురూ  పల్లకిలో కూర్చుని బోయీలు మోస్తూ వాళ్ళు అరుస్తూ చెప్పుకునే  “ఇదుగో ఇక్కడ గుంట  వుంది , అక్కడ నేల  ఎత్తుగా ఉంది  జాగ్రత్త !”  లాంటి మాటలు విని సిగ్గుపడటం లేదు

ఈ నిర్జీవమైన వస్తువులతో పోలిస్తే మానవ జీవితం ఎంత సున్నితమైనది. ఒక బుద్బుదం లా ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. ఆ పురాతన వస్తువులను చూస్తే వృద్ధదంపతులకు అవి నిండైన  జీవితాన్ని అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది.  తరతరాలుగా తమ పూర్వీకుల జ్ఞాపకాలని అవి తమలో నింపుకున్నట్టు కనిపిస్తాయి. వాటిని వినడం మొదలుపెడితే చాలు . ఆ పురాతన వస్తువులు పాడతాయి , నవ్వుతాయి , ఏడుస్తాయి అనేకానేక అనుభవాలని , జ్ఞాపకాలని రకరకాల గొంతులతో వినిపిస్తాయి. వాటిని స్పర్శిస్తే చాలు ఒక వణుకు ఏదో  వెన్ను లో జలజలా పాకుతుంది. బాల్య జ్ఞాపకాలతో, యవ్వనోద్రేకపు మోహావేశాలతో కళ్ళు మిలమిలా మెరుస్తాయి. పండుగ సంరంభాన్ని, నిరాశల ఖేదాన్ని, అసంతృప్తిని మళ్ళీ మళ్ళీ అనుభవంలోకి తీసుకుని వస్తాయి. కుటంబంలో ని ఒకరి జీవితాన్ని కాదు మొత్తం కొన్ని తరాల జీవితాలను అలా పుటలు తెరచి చూపిస్తాయి. జీవం లేని , శూన్యంగా కనిపించే గృహం ఒక్కసారిగా జీవం పోసుకుంటుంది. ఆ వృద్ద దంపతులు వాటితో తమదైన భాషలో మాట్లాడతారు. వాటి ఫిర్యాదులను సాకల్యంగా వింటారు

ఒక్కోసారి వాటికీ సలహా ఇస్తున్నట్టు ” మీకుగా మీరు ఎందుకు  అదృశ్యం కాకూడదు ఈ ఇంటినుండి?. ఎంతకాలం ఇలా కళ్ళు విప్పార్చుకుని చూస్తారు. మేమిద్దరం కూడా వెళ్లిపోయాక మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఏ దొంగల చేతుల్లోకో , దోపిడీ దారుల  చేతుల్లోకో వెళ్ళిపోతారు. చివరికి బూడిదగా మిగులుతారేమో. మీ ఉనికిని , మీ అస్తిత్వాన్ని ఎవరూ గుర్తించరు ?మా పిల్లలు మిమ్మల్ని చూడరు. అది ఖాయం . మరి మిమ్మల్ని ఎవరు చూస్తారు ?” అని మాట్లాడతారు.

ఎవరైనా కాలం మీద నింద  ఎందుకు వేయాలి? అందరికీ జవాబులు చెప్పడమే దాని పనా ? ఏమిటి ! తమకు నష్టం జరిగినప్పుడు  అందరూ కాలం  బాగోలేదని అంటారు. మనుషులకు వయసు  పెరగడం,, యవ్వనం లో వున్న ఆకర్షణను కోల్పోవడం సహజం . అది ప్రకృతి ధర్మం కూడా , కానీ మనిషి స్వయంగా తన మేథాశక్తి  తో గతాన్ని అనాకర్షణీయంగా చేస్తున్నాడు. మనిషి కొత్త ఫ్యాషన్స్ కనుగొనకపోతే, కొత్త చట్టాలు తయారుచేయక పోతే, సరి కొత్త సంగీత, సాహిత్య, నృత్య కళారీతులను కనుగొనకపోతే పాత  అనే పదం ఈ భూమి మీద వినిపించేది కాదేమో. మాటవరసకు, ఒకరి కంటే ముందు పుట్టిన మరొకరు పాత  అయితే  ఇంకొకరు  పుడితే  ఆ ఒక్కరూ పాత అవుతారు కదా ! పాతది  అంతా వదిలించుకొని  కొత్త మాత్రమే స్వాగతించాలంటే ఎలా ?

వృద్ధ దంపతుల పిల్లలు ఆ ఇంట్లోని వస్తువుల వంక ఒక్క చూపైనా  సారించరు. వాళ్ళ ఇళ్లనిండా ఆధునిక వస్తవులే ! స్టీల్ పాత్రలు, గాజు సామాన్లు, వార్డ్ రోబ్స్ , బుక్ షేల్ఫ్స్ , ఇంకా నోరు తిరగని పేర్లు గల వస్తు సంచయం అంతా ఇళ్లనిండా ఉంటుంది. అలా ఇళ్ళని నింపకపోతే వాళ్ళు మిగతా ప్రపంచం తో వెనుకబడి పోతారు. అందుకే పిల్లలకు ఏది ఇష్టమో అది కొనవలసిందే. నిజానికి చిరు గంటలు ఘన  ఘన  మని మోగేలా తయారు చేసే వెండి కంచాలలో ఇప్పుడెవరు తింటున్నారు? అవి పట్టుకోవడానికి బరువే కాక ఆ గంటల శబ్దం చాలా ఇరిటేటింగ్గా  కూడా  ఉంటుంది. వాళ్ళ పిల్లలు స్టీలు కంచాలు కొన్నారు. ఒకసారి భోజనం చేసాక సబ్బు తో ఇలా కడిగితే చాలు కంచం తళ  తళ  మని మెరుస్తుంది. ఆధునిక వస్తువులలో సౌకర్యం ఉన్నమాట నిజమే , కానీ ఆ దంపతుల బాధ అది కాదు. తాము వెళ్ళిపోయాక ఈ వస్తువులు అన్నీ ఏమవుతాయి?

పిల్లలు సెలవులకు ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్లిపోయేటప్పుడు ” ఈ అపురూప వస్తువులన్నీ మీ పూర్వీకుల సంపాదించినవి. మన ఘన  వారసత్వానికి ప్రతి రూపాలు. మీకు నచ్చినవి  తీసుకెళ్లండి. మేము ఎప్పుడు వెళ్ళిపోతామా అని  రాబందుల లాంటి బంధువులు ఈ సామాను కోసం ఎదురు చూస్తున్నారు ,. ఒక్కసారి మేము మృత్యు వాత పడితే చాలు , మా శవాలు కూడా లేవకముందే ఈ అపురూపం అంతా అన్యాక్రాంతమవుతుంది . మీకు కావలసినవి మీరు తీసుకుని వెళ్ళండి  ” అని ఆ వృద్ధ దంపతులు కోరడమూ , కోడళ్ళు, మనవలు మనవరాళ్లు ఒకరి వంక మరొకరు గేలి నవ్వుల చూపులు బదలాయించుకుని ” ఈ వ్యర్ధ వస్తువులను ఎవరు తీసుకుంటారు ? బరువైన కంచాలు, మంచాలు, అవుట్ డేటెడ్ , ఓల్డ్ ఫ్యాషన్డ్  సామగ్రి కావాలని ఎవరు అనుకుంటారు. ఈ ముసలాళ్ళకి చాదస్తం కనుక వాటిని ఇంకా భద్రంగా ఉంచారు కానీ లేకపోతే ఎప్పుడో వాటికీ కాళ్ళొచ్చేవి. వాటిని ఏం  చేయాలో తరువాత ఆలోచిద్దాం ” అన్న మాటలు చెప్పుకోవడమూ వాళ్ళు మాట్లాడుకోవడమూ ఎప్పుడూ ఉండేదే

వృద్ధ దంపతులకు అయితే ఆ ఇంటి తో ఆ ఇంట్లోని వస్తువులతో ఒక హృదయ బంధం వుంది. పిల్లల కుటంబాలలో వస్తువులతో అలాంటి బంధం ఏదీ లేదు. వాళ్ళు రెండేళ్లకు, మూడేళ్లకు ఇల్లు మారుతూ , మారినప్పుడల్లా అవసరం లేనివి చాలా చాలా వాటిని పడవేస్తూ వుంటారు. అవి ఎంత ఖరీదు అయినవైనా  సరే  నాలుగు లేక ఐదు సార్లు వాడితే వాటిని వదిలి వేయవలసిందే! ఇళ్ళు  మారడమే కాదు కార్లు,  , సోఫాలు, టేబుల్స్  కొంత మంది భార్యలను కూడా ! కానీ వృద్ద దంపతుల పిల్లలు మాత్రం సహచరులను మార్చేంతగా ఎదగలేదు. అందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి

వృద్ధ దంపతులకు మాత్రం తమ జీవితం లోకి వచ్చని ప్రతిదీ అపురూపమే ! వాటితో ఒక బంధం ఏర్పడవలసిందే. రోజ్ వుడ్ తో చేసిన నగిషీల  పందిరి మంచం, బీరువాలు, పెట్టెలు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా వున్నాయి. పల్లకి ఓల్డ్ ఫ్యాషన్డ్ అయిపోయినా చాలా జాగ్రత్తగా బట్ట కప్పి వరండాలో ఉంచారు. గోశాలలో విరిగిన బండి చక్రాలు , ఇరుసు , కాడి అలాగే వున్నాయి. వాటితో తల్లి తండ్రులకు వున్న అనుబంధం తెలుసు కనుక వాటిని తీసివేయమని పిల్లు ఎప్పుడూ చెప్పలేదు.

2

గత కొన్ని రోజులుగా ఆ పాత ఇల్లు, పాత  వస్తువులు పిల్లల దృష్టిలో కొత్త   గుర్తింపుకు నోచుకున్నాయి. హఠాత్తుగా ఒక రోజు ఒక మనవరాలు అమ్మమ్మ మేడలో వేసుకునే పాత  నెక్లస్ ని మెడ చుట్టూ అలంకరించుకుంది. ఆ పాత నగ ఒక్కసారిగా కొత్త ఫ్యాషన్ డిజైన్ అయిపొయింది. ముసలామె కూడా ” నీకు ఇది బావుంది. తీసుకోవే ! నాలాంటి ముసలిదాని  మెడ మీద కంటే నీకే బావుంది ” అన్నది పట్టలేనంత సంతోషంతో.మనవడి  భార్య  క్రొకోడైల్  ఫేస్  బ్యాంగిల్స్ తీసుకుంది. ఇలా ముసలామె కాళ్ళ కడియాలు, చెవి దుద్దులు, ఇంకా ఇతర ఆభరణాలు తలా ఒకటి తీసుకున్నారు. ” నేను పోక ముందే పిల్లలు తలా ఒకటి తీసుకున్నారు. లేకపోతే  ఏ  దొంగ వెధవల  బారినో  పడేవి. ఇదీ ఒకందుకు మంచిదే ” అనుకున్నది. కొన్నాళ్ల క్రితం ముసలామె వేసుకునే ఫ్రిల్ జాకెట్లు , మనవరాళ్ల మధ్య అపహాస్యానికి గురి అయ్యాయి. అవి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్యాషన్ ఐకాన్ గా మారినట్టుంది. నగలే  కాదు ముసలావిడ సిల్క్ జాకెట్లు, సిల్క్ , మగ్గం చీరలు మనవరాళ్లు సొంతం చేసేసుకున్నారు

ఒక రోజు ఒక మనవరాలు కొంత ఆసక్తి తో ఇంట్లో వున్న ఇత్తడి స్పిట్టూన్ చేతిలోకి తీసుకుని పరిశీలించసాగింది . ఆరోజే ముసలామె ఆ స్పిట్టూన్ ని ధగధగమని మెరిసేలా తోమింది. ఆ స్పిట్టూన్ లేకపోతే ముసలాయనకు క్షణం గడవదు. తాను   ఎక్కడ ఉంటే అక్కడ అది ఉండాల్సిందే. ముసలాయన  బోసి నోటితోనే నమిలే కిళ్లీ లో ముప్పాతిక భాగం ఆ స్పిట్టూన్ లోకే చేరుతుంది. ఆ ఇత్తడి స్పిట్టూన్ అంచులు ఎర్రబారి వున్నాయి

మనవరాలు ఆ స్పిట్టూన్ చేతిలోకి తీసుకోగానే ముసలామె అరచినట్టుగా ” అదెందుకు  నీకు?” అని ప్రశ్నించింది

” దీన్నినేను పూల జాడీ (ఫ్లవర్ వాజ్) లా ఉపయోగించుకుంటాను. ఇలాంటి ఆకృతిలో వుండే వాజ్ లు ఇప్పుడు చాలా ఫ్యాషనబుల్ ” అన్నది

“మరయితే తాతగారికి ఎలా ?” అన్నది ముసలామె

” ఇంట్లో ఇన్ని వస్తువులు వున్నాయి కదా ! ఏదో  ఒకటి ఉపయోగించుకుంటారు లే   మామ్మా ”

” నీ కంత  నచ్చితే తీసుకెళ్ళు. నేనేమీ అనుకోను ”

ఇలా పిల్లలు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకునిపోవడం మొదలు పెట్టారు. ఒకరోజు పెద్ద ఇత్తడి వంట పాత్రలను తీసుకెళ్లడానికి సిద్ధమవుతుండగా ముసలామె అడిగింది . ” మీరుండే చోట ఇంట పెద్ద వంట పాత్రలు ఉండవా ? పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలు చేయడానికి ?’

ఆమె మాటలకు మనవరాళ్లు నవ్వి ” ఇప్పుడు పెళ్లిళ్లలో ఇంత పెద్ద పాత్రలతో ఎవరూ వంటలు చేయడం లేదు. ఒక పెద్ద హెటల్ చూసుకుని ఆర్డర్ ఇస్తే చాలు ఎంతమందికి అయినా వాళ్లే  క్షణం ఆలస్యం కాకుండా భోజనాలు పంపిస్తారు. వీటిని మేము మా డ్రాయింగ్ రూమ్ ను డెకరేట్ చేసుకోవడానికి తీసుకుని వెళుతున్నాము. ఈ    పాత్రలు మీది మూతలను మధ్య టేబిల్ మీద ఉంచి పక్షులు, నెమళ్ళ ఆకారంలో ఉన్న  ఆయిల్ లాంప్స్  పెడతాము. ఇప్పుడు వీటికి అక్కడ ఎంత డిమాండ్ ఉందో  తెలుసా ? ఇవే కాదు లాంతర్లు, వక్కల డబ్బాలు, వక్కలను కట్ చేసే అడ కత్తెరలు ఇప్పుడు ఫ్యాషనబుల్ ఐటమ్స్” అన్నారు

ఇలా పిల్లలు తమ దృష్టిలో పడిన ప్రతి వస్తువునూ తీసుకుని వెళ్లారు. తాము ఏది ఆశించారో తమ పిల్లలు అదే చేసేసరికి వృద్ధ దంపతుల ఆనందానికి హద్దు లేకపోయింది. ఆ ఇంట్లో కొలువు తీరివున్న ఒడిషా  కళాత్మక సౌందర్యమంతా ఇల్లు దాటి, పల్లె దాటి వెళ్ళిపోయింది. కానీ అనూహ్యంగా ఇల్లంతా భయంకరమైన ఖాళీ తనం తో నిండి పోయింది.

నిజానికి ఒడిషా  కి సంబంధించిన ప్రతి అంశమూ, ఇంటి కప్పులను  డిజైన్ చేసే విధానమూ ,ఇంట్లో పొయ్యి  నిర్మించే పద్ధతీ, చీరను వంటికి కట్టుకునే రీతి, హెయిర్ పిన్స్ పెట్టుకునే క్రమం, గోడలకు వేలాడ వాల్ డిజైన్స్, లోప రహిత ఒడిషా సృజనాత్మకత కి ప్రతీకలు. కానీ ఆధునిక ఫ్యాషన్లు  సాంప్రదాయ కళల్ని  మెల్లమెల్లగా నిర్జీవం చేస్తున్న విషాద సందర్భం లో కొంతమంది ఈ సృజన శకలాలని తమ తమ డ్రాయింగ్ రూమ్ లలో , కార్యాలయాలలో ప్రదర్శిస్తూ తమ స్థాయినీ , సామాజిక హోదాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వాటికి పెద్ద డిమాండ్.

ఇంతకుముందు రెండేళ్లకో , మూడేళ్లకో వచ్చే పిల్లలు ఇప్పుడు సంవత్సరానికి రెండు సార్లు వస్తున్నారు.తమ ఊరినీ , రంగు వెలసి , మరమ్మత్తులకు నోచుకోకుండా పురాతన శిధిల సౌందర్యం లా నిలచిన తమ ఇంటిని చూపించడానికి తమ దేశీయ  స్నేహితులను , విదేశీ స్నేహితులను తీసుకుని వస్తున్నారు.వచ్చిన స్నేహితులు  ఆ ఇంటిని , ఇంట్లోని వస్తువులను , అన్నిటిని ఫోటోలు తీసుకుంటూ , సెల్ఫీలు తీసుకుంటూ దాన్నొక టూరిస్ట్ అట్రాక్షన్ గా చేసేసారు. ఈ వృద్ద దంపతులు వాళ్లకి ఒక లైవ్ ఇంట్రెస్ట్ అయిపోయారు

రకరకాల ప్రశ్నలతో ఆ వృద్ధ దంపతుల తో సంభాషిస్తారు

“ఎప్పుడు పెళ్లి అయింది?”

“వృద్ధాప్యం లో ఒంటరిగా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు?”

“ఇంత ఆరోగ్యంగా ఉండటానికి మీరు పాటించే ఆహార నియమాలు ఏమిటి?”

” వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ ఒకరికోసం మరొకరు పుడతారా?”

ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అడుగుతారు. ” పిచ్చి పిల్లలు. ఈ రోజుల్లో ఈ ముసలాళ్ళ గురించి ఎవరు అడుగుతారు? మేమిప్పుడు  చెలామణీ లో లేని నాణేలము . పిల్లలు దగ్గర వుంచుకోనూలేరు , విసరివేయనూలేరు. ఈ పల్లెటూళ్ళో ఇలా ఉండిపోయాము . మృత్యువు మమ్మల్ని తనలోకి తీసుకున్నాక ఇక్కడ ఎవరూ వుండరు ”

ఇల్లంతా వస్తువులతో కిక్కిరిసి పోయినప్పుడు ఆ ఇల్లెప్పుడూ ఒంటరిగా, ఏకాకిలా ఉన్నట్టు అనుకోలేదు. కానీ ఇప్పుడు   ఆ ఇల్లు ఆకులు రాలిపోయిన పామాయిల్ చెట్టులాగా కనిపిస్తున్నది.పిల్లలు అన్నీ తీసుకెళ్లారు కానీ ఆ వృద్ధ దంపతుల మంచం మాత్రం తీసుకునిపోలేదు. ఆ మంచం ముసలామె తండ్రి స్పెషల్ గా సుదూరం నుండి ఒక వడ్రంగిని తీసుకుని వచ్చి ప్రత్యేకంగా తయారు చేయించాడు . మామూలు మంచాలకన్నా ఆ మంచం కొంత ఎత్తుగా ఉంటుంది. మంచం కోళ్లు ఎంత సున్నితంగా, మృదువుగా ఉంటాయి అంటే అందమైన స్త్రీ తొడలు వున్నత  మృదువుగా ఉంటాయి. కోళ్ల  మీది అద్భుతమైన రేఖలు  ఆ మంచం అందాన్ని మరింత ఇనుమడింపచేశాయి.

దోమ తెరను కట్టడానికి వీలుగా నాలుగు వైపులా నిలబెట్టిన పలకల వలన అది  మామూలు మంచం కాదు అదొక నాలుగు చేతుల ఆయుధాలు ధరించిన వీరనారి తన వంక తానే  ఆరాధనగా చూసుకుంటూ ఒక రకమైన మత్తులో మునిగి నిద్రలోకి జారుకున్నట్టు ఉంటుంది. ఇది ఆధునిక ఇళ్లలో వుండే డబుల్ బెడ్  మంచం కాదు. అలాంటి   మంచాలను ఎంత దగ్గరగా వేసినా ఒక చిన్నని, సన్నని రేఖ ఆ రెండింటినీ విడదీస్తూనే ఉంటుంది. ఆ సన్నటి రేఖ స్త్రీ పురుషుల రెండు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలను గుర్తుచేస్తూ ఉంటుంది. కానీ ఈ మంచం అలా కాదు. ఆ మంచం పంచుకున్న ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోయారు. వాళ్ళు నిద్రించిన ఆ మంచం, పెద్దగా , బరువుగా , తేలికగా కదిలించలేని విధంగా ఉంది అవుట్ డేటెడ్ ఫ్యాషన్డ్ గా ఉండటం తో దాన్ని పిల్లలు తీసుకుని వెళ్ళలేదు. పిల్లలు అన్నీ తీసుకుని వెళ్లి ఈ మంచం ఒక్క దాన్నీ  తమతో  మాట్లాడటం కోసం విడిచి వెళ్లారు అని ఆ వృద్ధ దంపతులు అంటే  పిల్లలు నవ్వి

” ఒక మంచం  మానవులతో ఎలా మాటాడుతుంది? అదేమైనా ప్రాణం ఉన్న  వస్తువా ?’ అంటారు. ఆ ప్రశ్నకి వృద్ధ దంపతుల దగ్గర ఏ జవాబూ  లేదు చెప్పడానికి

ఒకరు ఎవరైనా ఒక దానిని ఫీలవడాన్ని లేదా అనుభూతించడాన్ని మరొకరు ఎలా నియంత్రించగలరు? ఆ పురాతన ఇంటితో , ఇంట్లోని ప్రతి వస్తువు తో ఆ వృద్ధ దంపతులు మాట్లాడేవారు. కబుర్లు చెప్పేవారు. కిటికీని అల్లుకున్న మాలతీ మాధవం తో గుసగుస లాడేవారు. మామిడి చెట్టును తట్టి లేపేవారు. వంట గదిలో గోడకు అయిన  నల్లటి మరకల్ని ప్రేమగా నిమిరేవారు.  ఆ వృద్ధ దంపతుల యవ్వన కాలపు జ్ఞాపకాల్ని ఆ ఇంట్లో గుర్తు చేయని వస్తువు ఏమున్నది?

ఆ మంచాన్నే తీసుకోండి . పిల్లలు ఎంతలా గంతులు వేసేవారు ? ఎంతలా ఎక్కి దూకే వారు ? అయినా ఆ మంచం ఎప్పుడైనా కోపగించుకుందా ? పిల్లల నిర్లక్ష్యం వలన కిందపడి ఎన్ని సార్లు దెబ్బలు తగిలించుకోలేదు? కిందపడగానే  పెదవి వాచిపోయేది . పడటం , లేవడం  అన్నీ పిల్లలు పెరగడం లో ఒక భాగం. ఆ మంచం అలాంటి  సంఘటనలు ఎన్నింటినో గుర్తుచేస్తుంది. ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు ఆ మంచం మీద పడుకుంటే ఆ మంచం చాలా పొడవు అయినట్టు అనిపిస్తుంది. వయసు పెరిగి ఆ దంపతులు కుంగి పోయారు తప్పిస్తే ఆ మంచం అలాగే వుంది . జీవితము అలా అలా గడిచిపోతూనే ఉంటుంది అలవాటైన దారిలో

ఇప్పుడు వాళ్ళు ఆమంచం దగ్గర రెండు చెక్క స్తూల్స్ పెట్టారు . ఒకప్పుడు లా  ఆ మంచం ఎక్కలేరు కనుక . ఆ మంచం మీద పడుకుంటే వాళ్ళు ఈ లోకాన్నే మరచిపోతారు. ఆ ముసలామె అయితే ఆ మంచాన్ని నిద్రలోనే అలా తడుముతుంది. మెల్లగా గా స్పర్శిస్తుంది . పోయిన సారి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఆ మంచం వాళ్లకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద సింగిల్ మంచాలు ఫ్యాషన్ అయ్యాయట. మనవరాలు చెప్పింది. ఇప్పుడు అంత పెద్ద అందమైన మంచాలు చేసే వడ్రంగులు లేనే లేరు. ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంగా అందవలసిన ఆ కళ  అంతరిస్తోంది . ఆ పెద్ద మంచం చేయడానికి ఆ రోజుల్లోనే ఆరు నెలలు పట్టిందట . ఇప్పుడు ఎవరైనా ఆరు నెలలు ఆగుతారా ? ఉదయం ఆర్డర్ యిచ్చి సాయంత్రానికి డెలివరీ కావాలి అంటారు.   ఒక మనవరాలు ఆ మంచాన్ని చూసి యాంటిక్యూ  అన్నది

వృద్ధ దంపతులకు తమ పిల్లలు ఎందుకు ఆ మంచాన్ని యాంటిక్యూ  అంటున్నారో తెలియదు. కానీ వాళ్ళ మనవరాలు ఆ రహస్యం విప్పింది . . ఆ మంచం ఇప్పుడు ఎక్కడా దొరకదు. చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకని ధర ఎక్కువ. దాన్ని తయారు చేసి పదుల సంవత్సరాల కాలం గడచిపోయింది కనుక అది పురాణం అయింది. యాంటిక్యూ అయింది. మనవరాలు చెప్పిన మాట వినగానే ఆ వృద్ధ దంపతుల హృదయం గర్వం తో ఉప్పొంగింది .

” మా నాన్న ఈ మంచం చేయించాలి అని నా పెళ్లి కంటే ఐదేళ్ల ముందే అనుకున్నాడు. సరి అయిన  కలపను వెతకడానికే  సంవత్సర కాలం పట్టింది. నాన్న ఇచ్చిన సూచనల ప్రకారం మంచం  తయారు అయినా, తరువాత, నాన్న రకరకాలుగా ఆ మంచాన్ని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశాడు. మా నాన్న కి ఏదీ అంత తొందరగా నచ్చదు” ఉత్సాహం తో చె చెప్పుకుపోసాగింది ముసలావిడ. తండ్రిని తలచుకోగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళలో నీళ్లు చూసి పిల్లలు అందరూ ఫక్కుమని నవ్వారు.

” అమ్మమ్మా ! నీకే ఇప్పుడు ఎనభయి యేళ్ళున్నాయి . మీ నాన్న ఇంకా బతికి ఉండాలనే ! ఆయన్ని గుర్తు చేసుకోగానే నీ కళ్ళలోకి నీళ్లేందుకు రావాలి ?”  పిల్లల ప్రశ్న

ఇప్పటి పిల్లలు కాలం కంటే ముందున్నారు . వాళ్లకు వెనక చూపు లేదు. కానీ పెద్ద వాళ్లకు భవిష్యత్తు లేదు కనుక వాళ్ళు గతాన్ని గుర్తుచేసుకుంటూనే వుంటారు. పిల్లలు ఆ మంచాన్ని యాంటిక్యూ అని చెప్పినప్పటి నుండీ ముసలావిడ కి ఆ మంచం పట్ల ప్రేమ మరింత పెరిగింది. ముసలాయన  కి కూడా తమ మామగారు తయారు చేయించిన మంచం పట్ల గౌరవం పెరిగింది. తన మామ గారు కనుక బతికి ఉన్నట్టయితే ” తను  చేయించిన మంచానికి యాంటిక్యూ  హోదా ” వచ్చిందని, తన ఇంగ్లిష్ చదువుకున్న మనవరాళ్ల ద్వారా ఆ విషయం తెలుసుకుంటే ఎంత ఆనందపడే వాడు. కానీ ఆయన ఇప్పుడు లేదు కదా . మరేం ఫర్వాలేదు . ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా సంతోషిస్తుంది

ఆ వృద్ధ దంపతులకు ఈ మధ్య మృత్యువు వెంబడిస్తున్నట్టు అనిపిస్తోంది. తాము చివరి శ్వాస  వదిలేటప్పుడు పిల్లలు అందరూ తమ చుట్టే బావుండును అనిపిస్తోంది. . గతం లో పిల్లలు వాళ్ళిద్దరినీ తమ దగ్గరకు వచ్చి ఉండమని అడిగేవారు. అప్పుడు ఆ ఇల్లు, అందులో వున్న  సామాను , ఎందుకో వెళ్ళాలి  అనిపించేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇల్లు దాదాపు ఖాళీ అయింది. వాళ్ళు పడుకునే ఆ మంచం తప్ప. పిల్లలు కనుక ఆ మంచాన్ని కూడా వాళ్ళుండే చోటికి తీసుకుని వెళితే దాని మీదే చివరి శ్వాస  ప్రశాంతంగా వాళ్ళు విడువగలరు. కానీ పిల్లు ఇప్పుడు వాళ్ళని తమ ఇంటికి రమ్మని అడగడం లేదు. ఒకవేళ ఆ దంపతులలో  ఎవరో ఒకరు ముందుగా చనిపోతే, ఎడారి లాంటి ఆ ఇంట్లో మిగిలినవారు  ఏమవుతారు ? ఒంటరిగా ఎలా ఉండగలరు?

ఒకరోజు అందరిలోకి చాలా చిన్నవాడైన మనవడు ఒకడు ఆ వృద్ధ దంపతులను ” మీ ఇద్దరూ పురాతన వస్తువులు (you two are antiques) అని ఆటపట్టించాడు. సిటీలలో ఈ రోజుల్లో ఎవరూ ముసలివాళ్ళు కావడం లేదు. ఎవరికీ పళ్ళు ఊడిపోవడం కానీ జుట్టు తెల్లబడటం కానీ , చేతికర్ర సాయం తో నడవడం కానీ చేయడం లేదు. ఈ రోజుల్లో ప్రతిదానిని రీప్లేస్ చేయవచ్చు. కొత్త దానిని అమర్చుకోవచ్చు. ఎనభయ్, తొంభయ్ ఏళ్లలో కూడా యవ్వనం లో వున్నట్టే కనిపించవచ్చు. నిటారుగా నడవవచ్చు. సరి అయిన ఆహరం తీసుకుని, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటే ముసలితనం దగ్గరికే రాదు.  వంటి మీద ముడత అన్నదే పడదు. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిన్చుకోవచ్చు. పల్లెల్లో వుండే ప్రతి వృద్ధుడూ ఒక పురాతన వస్తువే! కొన్నాళ్ల తరువాత సిటీలనుండి ఈ యాంటిక్స్ ను చూడటానికి యువతీ యువకులు పల్లెలకు వస్తారు.” ఇలా ఆ మనవడు చాలా చెప్పాడు.

ప్రపంచం పురాతన వస్తువుల మోజులో ఉన్నట్టుంది. కొంతమంది కొన్ని రాతి ప్రతిమలను తీసుకుని వాటిని ఆవుపేడతో కలిపి పాతిపెట్టి విదేశీయులకు వాటినే యాన్టిక్యూస్ గా చూపించి కావలసినంత డబ్బు సంపాదిస్తున్నారు. పల్లెల్లో వృద్ధులైన తల్లి తండ్రులకు మాత్రం కనీస అవసరాలు తీరేందుకు కూడా డబ్బు ఇవ్వడం లేదు. పోయిన సారి వాళ్ళ పిల్లలు తమ విదేశీ స్నేహితులతో కలసి వచ్చినప్పుడు ఆ విదేశీ స్నేహితుడు ఈ వృద్ధ దంపతులను మంచం మీద కూర్చోబెట్టి రకరకాల ఫోటోలు తీసుకున్నాడు. అతడొక పెద్ద ఫోటోగ్రాఫర్ అట. ఆ ఫోటోలను ఏదో  పోటీకి పంపిస్తే చాలా పెద్ద బహుమతి వచ్చిందట. ఆ వార్త వృద్ధ దంపతులకు నవ్వును తెప్పించింది. ఆ ఫోటోగ్రాఫర్ ఓకే పిచ్చివాడు అనుకున్నారు.

కొన్నాళ్లుగా పిల్లలు ఆ వృద్ధ దంపతులను మంచం మీద పడుకోనివ్వడం లేదు. ఒకవేళ మంచం చివర్లనుండి జారిపడితే, ఆ వయసులో ఏ కాలో చెయ్యో విరిగితే మళ్ళీ అతుక్కోవని వారి భయం. ఆ   భయాలుఅన్నిటినీ వాళ్ళు తోసి పుచ్చేవారు. కానీ పిల్లు భయపడ్డట్టుగానే జరిగింది. ముసలాయన మంచం మీదనుండి పడినాడు. కనీసం లేచి నడవనుకూడా నడవలేక పోతున్నాడు. వార్త విన్నవెంటనే పిల్లు పరుగున వచ్చారు. తమ మాట విననందుకు వృద్ధ దంపతులను చీవాట్లు పెట్టారు. అంతా ఈ మంచం వల్లనే అని దాన్ని  అక్కడ నుండి తాము వుండే చోటికి ప్యాక్ చేసి పంపించేశారు. ఆ దంపతుల కోసం నేలబారున వుండే మరొక చిన్న మంచాన్ని ఏర్పాటు చేసారు. వాళ్ళు అలా చేస్తుంటే వృద్ధ దంపతులకు మౌనంగా ఉండటం తప్ప మరొక మార్గం ఏదీ లేకపోయింది.

ప్రాణం లేని పురాతన వస్తులకే తమ పిల్లలు అంత ప్రాధాన్యత ఇచ్చి పువ్వుల లాగా చూసుకుంటున్నారు అంటే ప్రాణమున్న పురాతన వస్తువులు తమను ఎంత బాగా చూసుకుంటారో అని ఆ వృద్ధ దంపతులు అనుకున్నారు. ఆ పురాతన ఇంటిని వదిలివెళ్లడానికి వాళ్ళ మనసులు వొప్పడం లేదు కానీ వాళ్లకు వెళ్లక  తప్పదు. ఇలా ఆ వృద్ధ దంపతులు మనసును ఓదార్చుకున్న్నారు. ఇప్పుడు ఆ వృద్ధుడు సరిగ్గా నడవలేక పోతున్నాడు. ఆ వృద్ధురాలు తనను తానే  చూసుకోలేక పోతున్నది. పిల్లదగ్గరకు వెళ్లడం తప్ప మరొక మార్గం లేదు.

రెండు సంవత్సరాలు గడిచాయి మంచం మీద నుండి జారీ పడినప్పటినుండీ. ఈరెండేళ్లలో పిల్లలు ఒక్కసారికూడా వేసవి సెలవులకు కూడా ఇంటికి రాలేదు. కానీ వాళ్ళు తీసుకుని వెళ్లిన ఆ మంచం మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని, అది తమకు గర్వంగా ఉందని పలు సార్లు చెప్పారు. అలంటి గొప్ప పురాతన వస్తువులను కలిగివున్నందుకు తమను, అలాంటి గొప్ప వస్తువులను సేకరించినందుకు వృద్ధ దంపతులను  చాలామంది  ప్రశంశా పూర్వకంగా ఆశీర్వదించారు అని చెప్పారు.

” వాళ్లకు  నిజంగా పురాతన వస్తువులంటే అంత ప్రేమ ఉంటే వాళ్ళెందుకు  మనలని తమ దగ్గరకు తీసుకుని వెళ్ళరు?” అని ముసలామె అంటూవుండగా  ముసలాయన జోక్యం చేసుకుని

” ఎవరో ఒకరు మనలని ఖచ్చితంగా  తీసుకుని వెళతారు. పురాతన వస్తువుల మీద ఉన్న మోజుతో కాదు వాటి మీద ఉన్న  ప్రేమతో! అది జరిగేంతవరకూ నువ్వు కాస్త ఓపిక పట్టాలి” అన్నాడు

“అలా తీసుకుని వెళ్ళేది ఎవరు?”

“అతడొక్కడే కొత్తవాటికి వయసును ప్రసాదించి పాత  గా తయారు చేయగలవాడు. కానీ అతడు పాతవాటిని పురాతన వస్తువులు గా మార్చి షో కేసులో పెట్టడు . మరమ్మతు చేసి కొత్తవాటిగా  తయారుచేయడు. అతడొక్కడే మనలని ప్రేమతో తన దగ్గరకు తీసుకుని వెళతాడు”

అప్పుడా వృద్ధురాలు వణుకుతూన్న తన చేతులు జోడించి, తన నుదురు తాకుతూ “అతడికి ఇష్టమైనప్పుడే వచ్చి మనలని  తీసుకుని వెళ్లనివ్వండి. అతడికి మనలని  మనం అర్పించుకోవడం తప్ప మరేమి చేయగలం. అంతా  అతడి ఇష్టమే కదా!”

******************

1943 జనవరి 21 న ఒడిశా లోని బాలికుడ  లో జన్మించిన ప్రతిభారాయ్  ఒడియా లో పేరెన్నికగన్న రచయత. జ్ఞానపీఠ పురస్కారంతో పాటు పద్మశ్రీ , పద్మ భూషణ్, పురస్కారాలు పొందిన ఆమె మూర్తి దేవి పురస్కారం పొందిన తొలి మహిళ.తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె సాహితీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి “సమానత్వం ఆధారంగా సామాజిక క్రమం, ప్రేమ, శాంతి, సమైక్యత” వంటి అంశాలపై శోధిస్తూ రచనలు చేస్తున్నది. సమానత్వం ఆధారంగా కుల, మత, లేదా లింగ వివక్ష లేకుండా సామాజిక అంశాలపై రాస్తూంటే, ఆమె విమర్శకులలో కొందరు ఆమెను కమ్యూనిస్టుగా, మరికొందరు స్త్రీవాదిగా చిత్రీకరించారు. కానీ ఆమె తనను తాను మానవతా వాదిగా అభివర్ణించుకుంటుంది

యాజ్ఞ సేని ఆమె ప్రసిద్ధ రచన 

*

వంశీ కృష్ణ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హృదయానికి హత్తుకునేట్లు , బాగా ఆలోచింపచేసింది . రచయితకు ధన్యవాదాలు

  • అద్భుతమైన కథ. అనువాదం అన్నట్లు లేదు. కృత్రిమమైన వాక్య నిర్మాణం లేదు. తెలుగుదనం, నేటివిటీ ఉట్టిపడుతున్నట్లు రచయిత చాలా అందంగా రాసారు. వస్తువులు మనతో మాట్లాడడం, మనం వస్తువులతో ప్రేమగా మాట్లాడడం అన్నది ఫీలింగ్స్ కి సంబంధించినది. అర్ధమయ్యే మనసు కే తెలుస్తుంది. ముఖ్యంగా చివరి వాక్యాలు గుండె ను తాకేవి. రచయితకు,మూల రచయిత్రి కి కూడా హృదయపూర్వక అభినందనలు.

  • వంశీ గారు ,

    అనువాదం చాలా అందంగా చేసారు.

    ఒడియా మూలంలో ఈ కథ పేరేంటండి ?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు