పాడి లేని ఇల్లు…

         “ఇంకా… మాయ పడదేమి?

మొత్తం మాయ బయట పడితే  ఈ ఈత కాలం అంతా ఆవు ఆరోగ్యంగా ఉంటుంది కదా..”

తలకు తుండుగుడ్డ చుట్టిన గోవిందయ్య గజిబిజిగా ఆవు చుట్టూ తిరుగుతూ ‘మాయ ఎప్పడు పడుతుందా’ అని ఎదురు చూస్తున్నాడు.

పక్కనే ఉన్న నారు మళ్ళలో నల్లటి మబ్బుల నీడలు అందంగా మెరుస్తున్నాయి.

రెండు గంటల ముందు ఈనిన ఆవు తన దూడని నాలికతో నాకుతోంది. కొంచెం జిగురు కూడా లేకుండా పది నిమిషాల్లో మొత్తం నాకేసింది. గబగబా బక్కెట్ నీళ్ళలో పసుపు కొంచెం కలిపి ఆవుకు తాగించినాడు. బిడ్డ లెక్కన దూడను చేతిలోకి ఎత్తుకున్నాడు. నిదానంగా దూడకు ఆవు నుర్రు పాలు  పట్టించినాడు.

మల్లెమ్మ తడిపొడి దాణా పట్టించింది. సత్తు  గిన్నె తెచ్చి జున్ను పాలు పిండుకుంది.

“సట్టిలో కల్లు ఉప్పు  ఉంది, గబగబా తీసుకు రావే” అని గట్టిగా అరిచింది.

ఆరేళ్ళ పాప, ఊరి తిరునాళ్ళకు నాన్న తీసిచ్చిన గజ్జెలను చూసుకుంటూ ఉంది. అమ్మ అరిచే సరికి వాటిని గూటిలో పెట్టి   గబగబా వెళ్లి వంట పాత్రలకాడ ఉండే  కల్లు ఉప్పు తెచ్చి ఇచ్చింది. జున్ను పాలలో ఉప్పు కలిపి ఆవుకు తాగించినారు.

మల్లెమ్మ గబగబా ఇంటిలోకి వెళ్లి బెల్లం, శొంటి, వాము, పెద్ద పిప్పళ్ళు, జాజికాయ, మిరియాలను రోటిలో దంచి పేరు నెయ్యి కలిపి ఆవుకు తినిపించింది.

గోవిందయ్య  ఆవు దగ్గర  పాత గోతాము సంచులు వేసినాడు. ఎండు  గడ్డి పరిచినాడు. పాలు తాగిన దూడ దానిపైన పడుకుంది.

ఊర్లో పిలకాయలంతా ఆవు చుట్టూ ఉడ్డ[గుంపు] చేరినారు. “పడతా ఉంది…పడతా ఉంది” అని గట్టిగా గట్టిగా అరిచినారు. చిన్నగా మాయ మొత్తం కింద పడింది.

పిలకాయులు ఎగురుడే ఎగురుడు.

చప్పట్లు కొడుతూ “మల్లెక్కా, మాకు కూడా జున్ను ఇయ్యాలక్కో” అని అడిగినారు.

“జున్ను పాలు వచ్చినన్ని రోజులు ఊర్లో వాళ్ళందరికీ పంచుతాను. ఐదో రోజు ఇంటికాడనే పోలేరమ్మకు పెరుగన్నం చేసి పూజ చేస్తాము. ఆ  రోజు మీరందరూ పెరుగన్నం తినేదానికి రావాలిరబ్బా. పూజ అయిపోయినాక రోజూ పాలు అమ్ముకుని పది  రూపాయలు సంపాదించు కుంటాము” అని చెప్పింది.  “పిలిచినాక రాకుండా పోతామా మల్లెక్కా” అంటూ ఎగురుకుంటూ ఊర్లోకి వెళ్ళినారు.

*

         ఈనిన అయిదవ రోజు-

ఇంటి ముందర పేడ నీళ్ళతో కళ్ళాపు చల్లి ముగ్గులేసినారు. ఇంట్లో అందరూ తలంటుకుని స్నానం చేసినారు. కొత్త కుండకు పసుపు కుంకుమలు రాసినారు. వేడి అన్నం, పెరుగులను ఉప్పు వేయకుండా కలిపినారు. ఇంటి లోనే గ్రామ దేవత పోలేరమ్మకు దండాలు పెట్టినారు. ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసినారు.

ఆవు ఈనిన చోట అర నిక్కరులేసిన పిలకాయలంతా మోకాళ్ళ మీద కూర్చున్నారు. గుంపుగా అక్కడికి వచ్చిన అమ్మలక్కలు నవ్వుతూ నిలబడినారు. రెండు చేతులూ జోడించిన  దోసిళ్ళలో మల్లెమ్మ  తలా ఒక పిడచ పెరుగన్నం పెట్టింది. “బాగా తినండిరా పిలకాయలూ…తినేది ఆవుల్లో ఆంబోతై తినాలి, అత్తారింట అల్లుడై తినాలి..” అని చెప్పింది.

అందరూ “మాకేమీ సిగ్గు లేదక్కో…నువ్వు పెట్టినంత తింటాం” అని బదులిచ్చినారు.

కుండ అన్నం ఖాళీ  అయినాక, కుండకు కట్టిన వేప మండలను తీసి వాళ్ళ చేతికిచ్చింది. “టంట..టై” అని వేప మండలతో వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటూ వీధుల్లోకి పోయినారు. అక్కడి వేడుక చూసిన అమ్మలక్కలు పోతూ పోతూ “పాడి లేని ఇల్లు, పేడ లేని చేను ఉండి లాభమేమి అని పెద్దోళ్ళు ఊరకే చెప్పలేదు…” అనుకుంటూ ఇండ్లకు వెళ్ళినారు.

“ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి,ఊర్లో వాళ్ళ దిష్టి… అంతా ఈరోజుతో కొట్టుకు పోయింది” అని తృప్తిగా మల్లెమ్మ  ఇంట్లోకి పోయింది.

అమ్మ వెనుకనే వెళ్ళిన పాప “అమ్మా, నాతో కలిసి ఆడుకునే పిల్ల మొన్న మన ఇంటికి వచ్చింది. ఆవు పేడ, పంచితం[గో మూత్రం] ల గబ్బు భరించలేక పోతున్నానని చెప్పి నిమిషం ఉండకుండా వెళ్ళి పోయింది. మనకెందుకు గబ్బు రాదమ్మా” అని అమాయకంగా అడిగింది.

చిన్నగా పాపని దగ్గరిగా తీసుకుని తల నిమురుతూ “మన బతుకులో ఇవన్నీ భాగాలు తల్లీ. కొత్త వాళ్ళకి అలా అనిపిస్తుంది. పాడి లేకుండా మనం లేము. నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా” అని అడిగింది.

“నాకెప్పుడూ గబ్బు కొట్టలేదమ్మా..ఆ పిల్ల అట్ట అంటే, నిన్ను అడగతా ఉండా” అంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది.

*

              సూర్యుడు ఎప్పుడో పడమటి దిక్కులోకి జారిపోయినాడు.

వాన రాబోతుందేమో, ఆకాశం నల్ల బడింది. చల్లటి గాలి తెరలుతెరలుగా వీస్తోంది. మేతకి వెళ్ళిన ఆవూ దూడలు ఇంటికి రాలేదు. పంచె ఎగ గట్టుకుని ఊరి బయటికి పరుగులు తీసినాడు గోవిందయ్య. భార్యా  కూతురు వెంటబడినారు.

దుముకురాళ్ళ గుట్ట కాడ ఉండే సన్నటి నీళ్ళు లేని లోతైన కాలువ కాడ, ఆవు చుట్టకలాడుతోంది. దబదబా వెళ్లి చూసినాడు. నల్లటి చీకటి. ఏమీ కనిపించలేదు. చొక్కా జేబులోని అగ్గిపెట్టె తీసి వెలిగించినాడు. కాలువలో దూడ పడి ఉంది. భయభయంగా అటూఇటూ తిరుగుతోంది. చేతిలోని అగ్గిపెట్టెని పాప  చేతికిచ్చి ఎగిరి కాలువలోకి దూకినాడు.

వెలుతురు కోసం నిమిష నిమిషానికీ అగ్గి పుల్లలు వెలిగిస్తోంది పాప. ‘ఏమి జరగతా ఉందా’ అని మల్లెమ్మ బిత్తర బిత్తరగా అక్కడే తిరుగులతా ఉంది.

దూడని భుజాల పైకి ఎత్తుకున్నాడు. కాలువ గట్టున ఉన్న దర్బ గడ్డి మొదళ్ళు గట్టిగా పట్టుకుని ఎక్కుతున్నాడు. అతడు అడుగు పెట్టిన చోట మట్టి మెత్తగా ఉండడంతో కాలు సర్రున జారింది. దూడ ఒక చోట, అతడు ఒక చోట పడినారు. లుంగీ సగానికి సగం చినిగిపోయింది. పట్టించుకోలేదు. భుజాల పైన వేసుకుని దూడను పైకి చేర్చడం కష్టమనుకున్నాడు.

ఆ పక్కా,ఈ పక్కా  చూసాడు. చిన్న ఆలోచన తట్టింది. మట్టినంతా ఊడ్చి చిన్న దిబ్బ మాదిరి చేసినాడు. దాని పైకి ఎక్కి దూడను చేతుల పైకి ఎత్తుకుని మల్లెమ్మకు అందించినాడు. కాలువ గట్టు పైన బోర్లా పడుకుని నడుము వరకు వంగి దూడను పైకి లాగింది.

దూడను తీసి ఒడ్డున వేసిందో లేదో ఆవు సరసరా వచ్చి దూడను నాలికతో నాకసాగింది.

ఎలాగోలా కష్టపడి పైకి వచ్చినాడు గోవిందయ్య. గట్టిగా దూడను కావలించుకున్నాడు. వణుకుతున్న దాని ఒళ్ళంతా నిమిరినాడు. అక్కడక్కడా దాని ఒళ్ళు గీసుకు పోయి ఉంది.

దెబ్బలున్న చోట ఆకు పసరు రాస్తూ  “మా కడుపులోకి ముద్ద దిగాలంటే మీరు చల్లగుండాలి” అని అనుకున్నాడు.

దూడ దొరికిందని పాప,  పక్కనే పారుతున్న పిల్ల కాలువలో ‘హై హై’ అని అరుస్తూ ఎగిరింది.

ఆవూ  దూడను తోలుకుని అందరూ గెనాల మీద నడుస్తున్నారు.

‘అసలు దూడ ఎట్ల పడిందో కాలువలోకి..’ అని ఆలోచనలలో పడినాడు గోవిందయ్య.  ‘తను ఎప్పుడూ వాటిని మేతకు తీసుకు పోయింది లేదు. తెల్లారి వాటిని వదిలితే అవి ఊరికి ఎగదాలనో, దిగాదాలనో ఉన్న కయ్యి కాలువల్లో మేసి  సాయంత్రనికంతా వాటంతట అవే ఇంటికి వచ్చేస్తాయి.

ఈరోజు జరగరానిది జరిగింది. ఆవు గట్టు పైనే ఉంది, దూడ మాత్రం పడింది. కాలు జారి పడిందా …ఏమో …దేముడికి తెలియాల…

*

              తెల్లారింది.

నిద్ర లేచాడు.

ఇంటి ముందరి కానుగ పుల్ల కోసినాడు. ఆవు ముందరి ఇటుక రాళ్ళ పైన కూర్చుని పండ్లు తోముతున్నాడు.

ఆవు దగ్గరికి వెళ్లి దాని గంగడోలు తడుముతూ  “మా ఇంట్లో మనిషి  మాదిరే కదా ఈ ఆవు, ఎప్పుడూ తిట్టింది లేదు, కర్రతో గట్టిగా కొట్టిందీ  లేదు” అని అనుకున్నాడు. అందంగా వంపులు తిరిగి ఉన్న కొమ్ములను తడిమినాడు. అక్కడక్కడ ఎత్తుపల్లాలుగా ఉన్న కొమ్ములను చిన్న కత్తితో చివిరి సరి చేసినాడు. కుడితి తొట్టెలో నుంచి మెతుకులు దేవి అరచేతిలో పెట్టుకుని, ఆవు తలను నిమురుతూ చిన్న బిడ్డకు తినిపించినట్లు తినిపించినాడు.

నాలుగు అడుగుల దూరంలో ఉన్న లేగ దూడ వైపుకి చూసినాడు. అది అటూఇటూ తిరుగుతోంది. అది  ఎందుకో తడబడి నడుస్తున్నట్లు కనిపించింది. నడవడం కూడా కాళ్ళు పైకెత్తి భయభయంగా నడుస్తోంది. కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ముందర వస్తువులున్నా సరిగా చూడలేక పోతోందని  అర్థమయ్యింది.

గోవిందయ్య  గుండెల్లో గుబులయ్యింది.

గబగబా కొన్ని నీళ్ళు నోట్లో పోసుకుని పుక్కిలించి, పండ్లు తోమినామనిపించినాడు. పై గుడ్డతో ముఖం తుడుచుకున్నాడు. భార్యకు విషయం చెప్పి పశువుల డాక్టరుకు చూపించి వస్తానని చెప్పి   ఆవూ దూడలను తోలుకుని పట్టణం వైపు నడిచినాడు.

నాలుగు మైళ్ళ దూరంలో పెద్ద రావి చెట్టు కాడ పశువుల ఆసుపత్రి  ఉంది. అప్పటికే కొందరు రైతులు బక్క చిక్కిన పాడి పశువులను తోలుకొచ్చి చూపిస్తున్నారు. అర గంట తరువాత గోవిందయ్య  వంతు వచ్చింది. డాక్టరుకు సమస్య చెప్పాడు. దూడను రెండు మూడు సార్లు నడిపించి చూశాడు డాక్టర్. దాని కళ్ళలోకి టార్చి  వేసి చూశాడు. “దీనికి రీచీకటి ఉందయ్యా. విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. హోమియో మందులు రాసిస్తాను. నెల రోజులు తినిపించు” అని చెప్పాడు.

‘అయ్యో, ఇదేం దబ్బా, ఈ నోరులేని జీవానికి దేముడు ఇంత పెద్ద కష్టం పెట్టినాడు. చూపు సరిగా కానరాకనే రాత్రి కాలువలో పడినట్లు ఉంది’ అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు.

అప్పుడే పోట్టే ళ్ళాయన  పెళ్ళాం తోడుగా ఎర్ర బస్సులో  వచ్చి దిగినాడు. దాయాదుల జీవాలకు కాలి గిట్టల జబ్బుకు మందు కోసం  వచ్చినాడు.

పెళ్ళాంతో పిచ్చాపాటీ మాట్లాడుతూ “ తిక్క పెళ్ళామా, గుడ్డి ఎద్దు చేనులో పడిందని ఎగతాళిగా అంటారు కానీ, గుడ్డి ఎద్దు చేనులో పడితే ఎద్దుకే కదా లాభం” అని నవ్వతా పడీపడీ చెప్పినాడు.

నోటిలో నుంచి రింగురింగులుగా బీడీ పొగ వదులుతూ, గోవిందయ్య వచ్చిన విషయం అడిగి తెలుసుకున్నాడు.

వెటకారంగా “సూపు సరిగా లేని మనుషులకే వైద్యానికి దిక్కు లేదు,  లేగ దూడలకు వైద్యం ఎక్కడనుంచి చేస్తాము” అన్నాడు. చురచుర చూసినాడు గోవిందయ్య.

పక్కనే ఉన్న పొట్టే ళ్ళాయన పెళ్ళాం “ఆవూ దూడా ఉండగా గుంజ అరిచినట్లు ఉండాది నీ యవ్వారం” అనింది.

బీడీ కాల్చేది ఆర్పేసి “ఏదోలే అన్నా, నోటికొచ్చింది వాగినాను. మనసులో పెట్టుకోమాక” అన్నాడు. ఆ మాటలకు  గోవిందయ్య చల్లబడినాడు.

*

         పెద్ద పండుగ రోజు-

ఇంటి ముందర బండ పైన కాళ్ళు చాపి  కూర్చుని ఉన్నాడు గోవిందయ్య. దెయ్యం పట్టినట్లు కానుగ చెట్టు పడీపడీ ఊగుతోంది. రెండు కుక్కలు వెల్లకిలా పడుకుని నీలుగుతూ ఉన్నాయి.

‘ఈ రోజు సాయంత్రం పది ఊళ్ళ జనం  వాళ్ళకున్న పాడిని తీసుకుని చెరువు కట్ట మీదికి చేరుతారు. పొంగళ్ళు పెడతారు. ఆటపాటలాడుతారు. అందంగా అలంకరించిన పశువులకు పూజలు చేస్తారు. అయితే మన ఊరి ఆచారం  ప్రకారం పశువులను అక్కడే విడిచి పెట్టాలి. వాటికంత అవి ఇండ్లకు చేరాలి.

కార్యక్రమం అంతా అయ్యేసరికి రాత్రి అవుతుంది. దూడకు రేచీకటి కదా. వచ్చేటప్పుడు అది దారి తప్పితే? గుంతల్లోనో, కాలువల్లోనో పడితే ఎట్ల చేసేదబ్బా? ఎందుకొచ్చిన గొడవ, ఇంట్లో వాళ్ళు అక్కడికి పోతే పోనీ, నేను ఇంటి పట్టునే ఉంటా..ఆవూ దూడను చూసుకుంటూ ఉంటా..” అనుకున్నాడు.

ఇంతలో …పాప   చెంగు చెంగు మని ఎగురుకుంటూ  నాన్న దగ్గరికి వచ్చింది.

“నాన్నా, నాతో ఆడుకునే వాళ్ళంతా చెరువు కట్ట మీదకు పోతున్నారంట. నేను కూడా వెళతాను” అని అడిగింది.

“భద్రం బిడ్డా” అంటూ పది రూపాయల నోటు చేతికిచ్చి వెళ్లి రమ్మని చెప్పినాడు.

“హై…మా నాయన ఎంత మంచోడో…”  అంటూ బయలుదేరబోయింది.

ఏదో గుర్తు వచ్చినదానిలా..

“నాన్నా…పోట్టేల్లాయన కూతురు పోయిన వారం, ముక్కు కుట్టించుకుంది. ఆ పిల్ల ముక్కు పుడక పెట్టుకుని ఊరంతా కులుకుడే కులుకుడు. నాకు కూడా మన ఊరి గుట్ట మీద ఉండే గుడికాడ ముక్కు కుట్టించవా నాన్నా”

“అదెంత భాగ్యం తల్లీ..బంగారంగా కుట్టిస్తాను”

“అయితే నొప్పి లేకుండా కుట్టించాలి నాన్నా”

“ముక్కు కుట్టే ఆయనకు చెప్పి, చీమ కుట్టినంత నొప్పి కూడా లేకుండా చూస్తానులే”

“ఖచ్చితంగా నొప్పి లేకుండా చూస్తావు కదా”

“మాటంటే మాటే”

“హై..మా నాయన మాదిరి నాయన ఈ భూలోకంలోనే ఉండడు” అంటూ మట్టి గాజుల చేతులు ఆడిస్తూ ఇంట్లోకి వెళ్ళింది. పౌడరు పూసుకుని, పట్టు పావడ వేసుకుంది. పడమటి వార ఇంటి గూటిలో దాచి పెట్టి ఉన్న గజ్జెలు తీసి కాళ్ళకు  కట్టుకుని, వీధిలోకి పరుగులు తీసింది.

కూతురినే కన్నార్పకుండా చూస్తున్నాడు గోవిందయ్య.

పరుగెత్తుతున్న పాప  టకీమని ఒక చోట ఆగింది.

సరసరా వెనక్కి వచ్చింది

“నాన్నా, గజ్జెలు గుచ్చుకుంటున్నాయి” అంది

“అయ్యో…బిర్రుగా ఉన్నాయేమో…” అంటూ ఒక కాలుని తీసి తన ఒడిలో పెట్టుకుని గజ్జె బిరడా విప్పాడు. “హమ్మయ్య” అని చిన్నగా ఊపిరి పీల్చుకుంది.

మళ్ళీ ఇంకో కాలు గజ్జె బిరడా విప్పుతున్నాడు.

వీధి మొదట్లో నిలబడి ఉన్న ఆడ పిల్లలు ‘ఎంతసేపు?’ అన్నట్లుగా చూసినారు.

“బిన్నా[శీఘ్రంగా] కానీ నాన్నా” అంది.

రెండో బిరడా కూడా విప్పేసరికి….

చెప్పా పెట్టకుండా పాప పరుగో పరుగు.

నవ్వుతూ గజ్జెలను చొక్కా జేబులో వేసుకున్నాడు. ‘ఘల్ ఘల్’ అని శబ్దం వచ్చింది. మనసులోకి  మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

చకచకా వెళ్లి మట్టి తొట్టిలోని నీళ్ళతో ఆవూదూడని కడిగినాడు. కొమ్ములకు రిబ్బన్లు చుట్టినాడు. ముద్దబంతుల మాలలు  వాటి మెడలో వేసి, పసుపుకుంకుమలు పెట్టినాడు.

దూడ కాలి గిట్టల కున్న మట్టి తీసేసి పాప గజ్జెలను కాళ్ళకు కట్టినాడు. ఎక్కడా జారకుండా జనప నార దారం చుడుతూ  ‘ఇంక భయం లేదు. రాత్రికి చెరువు కాడి నుంచి  వచ్చేటప్పుడు దూడ ఎక్కడ దారి తప్పి  పోయినా గజ్జెల శబ్దం పట్టి ఇస్తుంది” అనుకున్నాడు.

గోవిందయ్య చేతిని ఎవరో తడుముతున్నట్లు అనిపించింది. తల ఎత్తి చూశాడు. ఆవు తన నాలికతో నాకుతోంది. లేచి గట్టిగా ఆవును కావలించుకున్నాడు.

“అడవి కాలేటప్పుడు అందరూ చూడగలరు. గొడ్డు  గుండెల్లో రగిలే అగ్గిని ఎవరు చూడగలరు, అని మా అమ్మ అనేది. నువ్వు అయినా పస్తు ఉండు కానీ, నిన్ను  నమ్మిన పశువులను పస్తు పెట్ట వద్దురా అని కూడా చెప్పింది.

గొడ్డులేని వాడూ, బిడ్డలేని వాడూ ఒకటే అంటారు కదా. నాకు నీ దూడతో పాటు ఇద్దరు బిడ్డలు. మంచికీ చెడ్డకీ నా బిడ్డ అయినా నీ బిడ్డ అయినా ఒకటే.

మీ బాధ మా బాధ కాదా? బాధల్ని చెప్పుకోవడానికి మాటలే కావాల్నా? చూపులు చాలదా! మిమ్మల్ని మరిస్తే మమ్మల్ని మేము మరిచినట్లే కదా…

అందరి ఇండ్లల్లో ఎప్పుడో ఒకసారి పండుగ. పాడి ఉన్న ఇంట్లో ప్రతి రోజూ పండుగే. అది చెబితే అర్థమయ్యేది కాదు, అనుభవిస్తే తెలిసేది” అనుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.

గోవిందయ్య ఏడ్చేటప్పుడు దూడ కళ్ళలోకి చూడలేదు కానీ …. బావిలోని ఊట  మాదిరి కన్నీళ్లు ఉబికిఉబికి వస్తున్నాయి.

*

         గంట తర్వాత-

జిగేల్ జిగేల్ గుడ్డలేసి ఆవు మెడలోని పలుపు తాడు పట్టుకుని చెరువ కట్ట మీదికి బయలుదేరినాడు గోవిందయ్య.

నీలం పచ్చ రంగు చీర కట్టిన మల్లెమ్మ, తల నిండా మల్లెలు చుట్టి  మొగుడి పక్కనే ముసిముసినవ్వులు నవ్వుతూ నడుస్తోంది.

ఆవు వెనుకనే నడుస్తున్న దూడ కాలి గజ్జెలు ‘ఘల్ ఘల్’ శబ్దం చేస్తూ చెరువు వైపుకు నడిచాయి.

*

(అక్షరాల తోవ ఖమ్మం వారి  ఉత్తమ కథా పురస్కారం 2022 అందుకున్న కథ)

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

ఆర్. సి. కృష్ణ స్వామి రాజు

పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్య కేంద్రమైన రాసపల్లి. పొట్ట కూటి కోసం తిరుపతిలో నివాసం. ముప్ఫై ఏళ్ల ముందు మూడేళ్ళ పాటు ఈనాడులో విలేఖరి ఉద్యోగం. గత ముప్ఫై ఏళ్లుగా ఎల్ ఐ సి లో డెవలప్ మెంట్ ఆఫీసర్ కొలువు. మూడు వందల పై చిలుకు చిన్నా పెద్దా కథలు ప్రముఖ పత్రికలలో తొంగి చూశాయి.
ఇప్పటి దాకా వెలుగులోకి వచ్చిన పుస్తకాలు ముగ్గురాళ్ళ మిట్ట, సల్లో సల్ల కథా సంపుటిలు. చిత్తూరు జిల్లా మాండలికంలో రాసిన ముగ్గురాళ్ళ మిట్టకు మక్కెన రామసుబ్బయ్య పురస్కారం, సల్లో సల్లకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి.ఇవి కాక ప్రస్తుతానికి రాజు గారి కథలు[ముప్పై బాలల బొమ్మల కథలు], పకోడి పొట్లం[అరవై కార్డు కథలు] పుస్తకాలుగా వచ్చి ఉన్నాయి.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గొడ్డులేని వాడూ, బిడ్డలేని వాడూ ఒకటే అంటారు కదా…
    కథ ఆత్మను పట్టించే వాక్యాలు ఇవి. బాగుంది సార్.
    అభినందనలు

    • మీలాంటి పెద్ద రచయితల అభినందన పొందడం చాలా సంతోషంగా ఉంది సార్

  • చాలా బాగుంది కధ ముఖ్యంగా మాండలికం

  • అడవి కాల్చేటప్పుడు అందరూ చూడగలరు. గొడ్డు గుండెల్లో రగిలే అగ్గి ని ఎవరు చూడగలరు. పశువుల్ని బిడ్డల మాదిరిగా చూసేవాళ్ళకే వాటి బాధ అర్థం అవుతుంది. చాలా చక్కని కథ. అభినందనలు రాజూ సర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు