అమ్మంటేనే సందల్‌ఖోడ్‌

‘మా అమ్మ పది సందేళలు ఒళ్లుకు నీళ్లు పోసుకోకనే వుంటే మాత్రం ఏమి, ఆమె కట్టుకున్న గుడ్డల్ని పదైదు నాళ్లు విప్పకుంటే మాత్రం ఏమి- ఆమి దగ్గర పొనుకుంటే చాలు మా అమ్మ వాసనను మూచూస్తా నేను ఒళ్లు తెలవని నిద్రను పొయ్యేవాడ్ని’  అని నామిని  ‘రాత్రి పూట మా అమ్మ గోష్ట’ అనే కథలో రాసిన మాటలు చదివినపుడు కలిగిన సంబరమే,  ‘నిలువెత్తు సందల్‌ఖోడ్‌ మా అమ్మ’ అని అక్కంపేట ఇబ్రహీం అన్నపుడు కూడా కలిగింది. కొన్ని కథలు చదువుతున్నపుడు లోపలి పొరలేవో కదులుతూ ఉంటాయి. ఒక్కో పొరా విప్పుకుంటూ చెలమలో జల ఊరినట్టుగా దుఃఖమో, సంతోషమో ఉబికివస్తుంటుంది.  ‘సందల్‌ఖోడ్‌’ కథలో ఇబ్రహీం వాళ్లమ్మలో నాకు మా అమ్మే కనిపించింది. అమ్మ రెక్కల కష్టంతోనే లోకానికి పొద్దు పొడుస్తుంది.  పొద్దు వాలిపోయి చీకటి తెరలు పరచుకున్నాకనే అమ్మ రెప్పవాలుతుంది. ఏ అమ్మ కథ అయినా ఇంతే. కొట్టంలో కసువూడ్చి, వాకిట్లో కళ్లాపి చల్లి, మంద గొడ్ల వెనుక చేట పట్టుకుని నడిచి పేడకడిలు ఏరుకొచ్చి, పిసికి ముద్దలుచేసి పిడకలు తట్టి, అన్నం పెట్టే మా అమ్మ దగ్గర ఎప్పుడూ సాదిన గంధపు చెక్క వాసన ఎందుకు వచ్చేదో ‘సందల్‌ఖోడ్‌’ కథ చదివినపుడు అర్ధం అయ్యింది. ఆ వాసన గంధపుు చెక్కది కాదు, అమ్మది.  ఆ వాసన తెలిసినందునే నామిని చెప్పిన అమ్మ కథలు తెలుగు పాఠకప్రపంచాన్ని అంత ఆత్మీయంగా హత్తుకున్నాయి. దాదాపు ముప్పయి ఏళ్ల తర్వాత ఇబ్రహీం మళ్లీ ఆమ్మవాసనను తెలుగు కథకు అంత బలంగా చూపించాడు.

సందల్‌ఖోడ్‌ కథ sandal khod!

     ఇబ్రహీం వాళ్లమ్మ పెద్దల పండుగ పనుల్లో తలమునకలై ఉంది.  ‘పొద్దు గూకీ గూకకముందే పైలోంకంలో ఉండే పెద్దోళ్లకి సదివింపులు చేసెయ్యాల’. ఎవరింట్లో చదివింపులు ముందుగా పూర్తయితే, ఆ ఇంటోళ్లకు ఇంకా పుణ్యం. ఆ పుణ్యం దక్కకపోతే నాయనకొచ్చే కోపాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే పండుగ పనులను అమ్మ  ఒక రోజు ముందే మొదలు పెట్టింది. ’తిరగబాత అన్నం కోసం తెల్లవాయలు వొలిచి పెట్టుకుంది. మంచం నులకకేసి రుద్ది అల్లం పొట్టు తీసింది. పొద్దున లేస్తానే బర్రెగొడ్లకాడ పేడ ఎత్తేసి ఇంట్లో కసుపు దోసి, బోకులు కడిగి పెట్టుకుని గడ్డికి పోయింది. వొచ్చినాకనే నోట్లో బొగ్గేసి పళ్లు తోమింది. సద్దినీళ్లు రొవన్ని కడుపులో పోసుకున్నదో లేదో మళ్లా పనిలో బడ్డది’ . ఎండపూట సంగటి తిన్నాక ’పంచలో మంచం వాల్చుకుని నాయన హాయిగా నిద్రపోతే అమ్మ వంటల తయారీలో మునిగిపోయింది. ‘తిరగబబాతన్నం, సియ్యలకూర, భాజీ, దాల్చా.. ఇయన్నీ ఉడికి దిగే యాలకు పొయ్యి సెగకు అమ్మ ఒంట్లోని సియ్యలు గూడా ఉడికి పోయినై’. సేమ్యాలు పొయ్యి మీద పెట్టాక అమ్మ గుండెల్లో రాయి పడినట్టయింది. సందల్‌ఖోడ్‌(గంధపు చెక్క) కనిపించలేదు. వెతకాల్సిన చోటంతా వెతికింది.

పండగ పండక్కీ అరిగిపోయి చిక్కిపోయిన ఆ చిన్న చెక్క ముక్క అమ్మని ఆందోళన పెడుతోంది. సందల్‌ఖోడ్‌ లేకుండా పెద్దవాళ్లకి  చదివింపులు కుదరదు. ఈ వెతుకులాటలో పొయ్యి మీది సేమ్యాలు మాడిపోయాయి. ఇల్లంతా కాటువాసన కమ్ముకుంది. బాధతో, భయంతో అమ్మ కడుపులో జ్వరం కాస్తోంది. పక్కింటివాళ్లు కూడా సందల్‌ఖోడ్‌ లేదన్నారు. నాయన ఇల్లు చేరేలోగా పడమటి గోడకు ఆనుకునేలా జానిమాజ్‌ పరిచి, వండిన వంటాలన్నీ పెట్టాలి. సాదిన గంథం అన్నింటిమీదా చిలకరించాలి. పెద్దల పటాలమీద చల్లాలి అరచేతులకు రాసుకుని వాకిలి రెక్కల మీద హస్తం ముద్రలు వేయాలి. మంచి గంధపుు పరిమళంతో పెద్దల్ని సంతృప్తి పరచాలి. గంధం లేకుండా ఇప్పుడెట్లా.. అనే దిగులు అమ్మను కుంగదీస్తుండగానే నాయన వచ్చాడు. వస్తూనే ముక్కులు ఎగబీల్చి నొసలు ముడేశాడు. ‘ఏదో మాడగొట్టినావే?’ అనడిగాడు అనుమానంగా. భయపడినంతా అయ్యింది. ‘సేమియాలు రొవంత మాడినై’ అని చెబితే సమాధానపడే మగాడు  కాదు అతను.

‘నువ్వేం గొడ్లు కాయను పోయి ఉన్నెవా?’ అని తెల్లారకముందే లేచి గొడ్డుచాకిరీ చేస్తున్న అమ్మను తిట్టాడు. సందల్‌ఖోడ్‌ కోసం వెతుకుతుండగానే సేమ్యాలు కాస్త మాడిపోయాయని అమ్మ ఇచ్చిన వివరణ అతనిని సంతృప్తి పరచలేదు. అంగట్లో గంధం డబ్బీ తెప్పిస్తే ఈసారికి పండగ దాటించెయ్యచ్చని అమ్మ ఆశపడింది. ‘మాడిన సేమ్యాలూ, మట్టిగబ్బు గొట్టే డబ్బా గంధంతో మా పెద్దోళ్లకు సదివింపులు చేయాల్నా గబ్బుదానా?’  అంటూ అతను అమ్మ చెంప పగులగొట్టాడు. ఆ దెబ్బ చాలు, ‘మసాలాలో పొర్లాడి, షేర్వాలో ఈదులాడి మెత్తమెత్తగా ఉడికిన ముక్కల ఘుమఘుమ’ల పండుగ పరిమళాన్ని చెదరగొట్టడానికి. ఇంతకీ అమ్మ చేసిన నేరమేమిటో పసిపిలగాడు ఇబ్రహీంకి అంతుపట్టలేదు. అమ్మ రోజూ చేసే కష్టం వాడి ఆలోచనల్లోకి జొరబడి కల్లోలపరిచింది. ‘ఎండకు ఎండి అమ్మ ఒంట్లో చెమట వుబకందే పొలం పండదు. పొయ్యి సెగకు మండి అమ్మ కంట్లో చెమ్మ ఊరందే కడుపు నిండదు.. చెంపలు కరిగిపోయి, చెక్కిళ్లు వాడిపోయి నిండు చందమామలాంటి అమ్మ ముఖం రోజురోజుకు సొట్టబోతాంది’.. ఇటువంటి అమ్మ గబ్బుది ఎలా అయ్యింది?

సందల్‌ఖోడ్‌ ను అరువు తెచ్చుకోవడానికి గౌసియా ఖాలా ఇంటికి వెళ్లినపుడు, వాకిట్లో నులకమంచం మీద వెల్లికిలా పడుకుని ఒంటెద్దు బండాయనకి అరమోడ్పు కన్నులతో ఆమె భర్త చేసిన తత్వబోధ  కూడా ఆ పిలగాడికి రుచించలేదు. ‘ కాయాకష్టంలో దినాం నలిగేటోల్లకేనోయ్‌ పండగలు.. ఆ ఒక్క పూటన్నా వాళ్లు సుఖంగా, సంతోషంగా ఉండాల’ని చెప్పిన మాటే నిజమైతే, ‘ అమ్మ ఇయాల సుఖంగా ఉండాలి గదా? నాయనో, ఇంగొకరో వండి పెడ్తే తిని హాయిగా గడపాల కదా? తత్వం అమ్మ కోసం కాదేమో. అది రాసి పెట్టిన కష్టజీవుల లిస్టులో అమ్మ పేరు లేదేమో’ అనే పిల్లవాడి అమాయకపు మాట, మతాచారాల లోతును ప్రశ్నిస్తుంది. విశ్వాసాల పవిత్రత, ఆడవాళ్లను మరింత కష్టపెడుతుంది. అయితే అది ముస్లిం కుటుంబాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అరిగిపోయిన గంధపు చెక్కల వంటి అమ్మలు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తారు. దాన్ని గ్రహించినవాడు కావడం వల్లే ఇబ్రహీం,  నాన్న రెండో దెబ్బ అమ్మ మీద పడకుండా ‘సందల్‌ఖోడ్‌ కనిపించింది’ అని అరిచాడు. పండుగపూట మాత్రమే కాకుండా, పూటపూటకూ అరిగిపోయి తమ గబ్బు బతుకుల్లో గంధాన్ని నింపే నిలువెత్తు ‘సందల్‌ఖోడ్‌’ను అమాంతంగా చుట్టేసుకున్నాడు.

గంధపు చెక్క కోసం వెతుకులాట నేపథ్యంగా పేద ముస్లిం కుటుంబజీవనాన్ని పటంగట్టి చూపించాడు అక్కంపేట ఇబ్రహీం ఈ కథలో. చక్కని వాక్యం, పిల్లవాడితో కథను చెప్పించిన ఎత్తుగడ ‘సందల్‌ఖోడ్‌’ను ఏకబిగిన చదివిస్తాయి. ‘ బండిగానుకు తొడగటానికి పిడకల్లో కాల్చిన కమ్మీలా ఎర్రగా పడమటి కొండ మీద ఆనబోతున్న పొద్దు అందం’, ‘ఏటి జాలులో ఉలిసెల్లా పాయసంలో అటూ ఇటూ కదలాడే సేమియాలు’, ‘కాలిన కమ్మీ ఆరిపోయినపుడు వచ్చే పొగలాంటి చీకటి’  ‘పండుగ పనిలో తలస్నానం చేసి ఆరబెట్టుకునే తీరిక లేక పాత లంగాలో జుట్టును మెలేసి కొప్పుగా చుట్టుకున్న అమ్మ తలలోంచి వెంట్రుకలంబడి చుక్కలు చుక్కలుగా కిందికి జారే నీళ్లు’.. వంటి వాక్యాలు ఇబ్రహీం సునిశిత సౌందర్యదృష్టిని చూపుతాయి. ఈ కథ చదువుతున్నంతసేపూ ఒక దుఃఖపు తెర నా కళ్లకు అడ్డుపడుతూనే ఉంది. ఏడాదిన్నర కిందట కరోనా ఇంటికి పరిమితం చేసిన రోజుల్లో ముస్లిం అమ్మలు ప్రధాన పాత్రలుగా ఉన్న కథలు సూచించమని అడిగినపుడు వేంపల్లి షరీఫ్‌ సంబరపడుతూ ఈ కథను నాకు పంపారు. నిజానికి షరీఫ్‌ కథల నిండా కూడా ఇటువంటి అమ్మలే కనిపిస్తారు. ఇబ్రహీం చాలా తక్కువ సంఖ్యలోనే కథలు రాశారని ‘కథామినార్‌’లో ఆయన పరిచయంలో ఉంది. ‘అక్కంపేట ఇబ్రహీం మంచి కథకుడు. ఎక్కువ రాయడు ఎందుకో’ అంటూ, ‘వీళ్లందరూ రాయకపోవడం వల్ల నేను కొంత ఎక్కువ పేరు తెచ్చుకున్నా’ అని ఖదీర్‌బాబు నాకు పెట్టిన మెసేజ్‌ ఇబ్రహీంకి పెద్ద కితాబు. ‘ఇబ్రహీం.. ఇంకొన్ని కథలు రాయవయ్యా..’ అని అడిగే హక్కు కథకుడిగా నాకు లేకపోయినా, పాఠకుడిగా మాత్రం ఉంది.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమ్మకు మతం లేదు.ఇలాంటి ప్రతి పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కనిపిస్తూనే ఉంటారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు