పర్యావరణ స్పృహ +మేజిక్ రియలిజం

పర్యావరణ స్పృహ +మేజిక్ రియలిజం

పతంజలి శాస్త్రి గారి కథల చిన్ని పరిచయం – 7

( పతంజలి శాస్త్రి గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కథల్ని చిన్నగా పరిచయం చేస్తున్నాం. ఈ కథలు కొంతమంది చదివి ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇవేవీ చదువరులకు అందుబాటులో లేవు. చదవని వాళ్ళకి కథని రుచి చూపించడంకోసం, చదివేసిన వాళ్ళకి మరోమారు గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ చిన్ని పరిచయం. ఇది  విశ్లేషణ, వివరణ ఏమాత్రం కాదు).

క్రిందటి సంచిక దాకా “పతంజలి శాస్త్రిగారి కథలు”  పుస్తకం లో వున్న వివిధ కథల్ని పరిచయం చేసాం. ఈ సంచిక నుంచి పతంజలి శాస్త్రి గారి రెండవ కథల పుస్తకం “నలుపెరుపు” సంకలనంలోని కొన్ని కథల్ని పరిచయం చేస్తాం.

‘ఈ చెట్టు తప్ప’, ‘జోగి పంతులు తిరిగి రాలేదు’ కథలు  రెండూ మేజిక్ రియలిజం లాంటి ప్రక్రియతో పర్యావరణ స్పృహని చూపిస్తూ సాగే కథలు.

‘ఈ చెట్టు తప్ప’

వెళ్లడం తనకు సుతరామూ ఇష్టం లేకపోయినా కొడుకు బలవంతం మీద పుట్టి పెరిగిన వూళ్ళో తండ్రి వారసత్వంగా వచ్చిన ఇల్లు అమ్మేసి దూరంగా వెళ్లిపోక తప్పలేదు పట్టాభిగారికి. ఎంతో బాధతో  చిన్నారావు అనే ఆయనకి ఇల్లు అమ్మేసేడు.  రాతకోతలు అయిపోయాక చిన్నారావుతో పట్టాభి గారు ఒక మాట అన్నారు “….. మా స్థలంలో గేటు గోడ చివర పెద్ద చెట్టుంది చూసారా ….. మా నాన్నగారు వేశారు…… స్థలం తో పాటు చెట్టూ మీదైపోయింది. కానీ ఆ చెట్టుని ఎంత అవసరం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టనని మాటివ్వగలరా?”.

పట్టాభిగారి మాటలకి చిన్నారావు కరిగిపోయాడు.  నా కంఠంలో ప్రాణం ఉండగా చెట్టుమీద చేయి వేయనని ప్రమాణం కూడా చేసాడు. కాలం క్రమంగా దొర్లిపోయింది. ఆ తరువాత ఐదుగురు యజమానులు మారారు. ఐతే క్రయ పత్రంలో  ఎట్టిపరిస్థితుల్లోనూ ఆవరణలో ఉన్న  చెట్టు కొట్టడానికి వీల్లేదు అనేది అలానే వచ్చింది. ముప్పయి  సంవత్సరాల్లో పెంకుటిళ్ళే లేకుండా పోయాయి. పట్టాభిగారి పెద్ద స్థలం చుట్టూ పాత ఇళ్ళే లేవు. కారు హారన్లు అపశృతులు రకరకాల దుర్గంధాలు పెద్దచెట్టుని కమ్ముకుంటున్నాయి. చివరిగా పట్టాభిగారిల్లు చౌదరిగారి పరమైంది. చుట్టూ చాలామంది డాక్టర్ల క్లినిక్కులు వచ్చేసాయి. వాళ్ళకోసం రక్తం, మలం, మూత్రం, కళ్లెం పరీక్ష చేయబడును అనే ఆలోచన, స్థలం చూడగానే చౌదరిగారికి  తళుక్కున మెరిసింది. చెట్టున్నచోట మంచి షాప్ కట్టొచ్చు అనుకున్నాడు. ఐతే చెట్టు కొట్టద్దు అనే క్లాజు ఎందుకుందో అర్థం కాలేదు. మరునాడు సిద్ధాంతిగారిని పిలిచి చూపించాడు. అంతా నిక్షేపంగా ఉందని చెట్టు కొట్టేయడానికి ఏ అభ్యంతరం లేదని సిద్ధాంతిగారు సెలవిచ్చారు.

“మరి ఈ  చెట్టు అమ్మడానికి వీల్లేదని రాసుకున్నారు?”.

“చాదస్తం చతుర్మధ్యం” కొట్టి పారేసాడు సిద్ధాంతి.

మర్నాడు 9 .22 కి మొదటి వేటు పడాలి, ముహూర్తం పెట్టేసాడు సిద్ధాంతి.

రాత్రి చీకటి పడుతుండగా చౌదరి కొనుక్కున్న ఇల్లు చూసుకోడానికి వచ్చాడు. చెట్టువైపు చూసి పైకి  టార్చి లైట్ వేసాడు. చటుక్కున పక్షుల శబ్దాలు ఆగిపోయాయి. చెట్టుకొమ్మల్లోంచి టార్చి వెలుగులో మెల్లిగా సునాయాసంగా జారుతూ ఒక మనిషి దిగుతున్నాడు. వెండి జుట్టు తెల్ల ధోవతి నుదిటిమీద బొట్టు, తెల్లని చర్మం సంచిలో వున్నట్టున్నాడాయన. చౌదరి వైపు సూటిగా చూస్తూ అన్నాడాయన.

“నన్ను నిడదవోలు వెంకట పట్టాభిరామారావు అంటారు. దయచేసి మీరు ఈ చెట్టు కొట్టకండి. గూళ్ళు పోయి పక్షులన్నీ చెల్లా చెదురు అయిపోతాయి. చెట్టు కొట్టనని మాటివ్వగలరా?”.

*****

‘జోగి పంతులు తిరిగి రాలేదు’

ఎవరో ఏ కొండమీదో ఏకి వదిలేసిన పెద్ద దూది పింజలా మబ్బులు తడవకుండా చెరువులో పడ్డాయి. జోగి పంతులు పై అంతస్తునుంచి కిందకి కూరలు తీసుకోడానికి వదిలిన బుట్టని లాక్కుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎన్నెన్నో జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి. బెండకాయలు వంటింట్లో వేగుతుంటే ఇల్లంతా పరిమళం వ్యాపించేది. అన్నం ఉడుకుతున్న కమ్మదనం ఇల్లంతా  అలుముకునేది. పప్పు వేయించి మరీ ఉడకేసేది అమ్మ. ఇప్పటికీ ఆ పరిమళం నరాల్లో ఎక్కడో ఉండిపోయింది. తిండి మీద ఇష్టం, ఇష్టంగా తినడం, హాయిగా అరగడం, కడుపుకి మనసుకి ఇచ్చే ఆనందం ఎటో  ఎగిరిపోయింది. పెరట్లో కూరపాదులుండేవి.  వాటికి నీళ్లు పోయడం, పురుగు పట్టకుండా చూసుకోడం, కాయలు కోయడం, వీటిమధ్య పెరిగాడు జోగిపంతులు. జోగిపంతులి తండ్రి వూరికి చివరున్న పెద్ద పెరడున్న ఇల్లే అద్దెకు చూసేవాడు. ముసురుకున్న జ్ఞాపకాలు ఒక్కొక్కటి చెదిరిపోయాయి. బెండకాయలు చెక్క ముక్కల్లా తగులుతున్నాయి ఇప్పుడు. నాలుగో అంతస్తులో బాల్కనీ లో కూర్చుని చూస్తున్నాడు పంతులు. నాలుగేళ్లుగా చూస్తే గోల్కొండ కనిపించేది. మధ్యలో అక్కడక్క నీలపు చెరువులు, పచ్చ గడ్డి కప్పుకున్న నేల, కళ్ళకు చల్లగా ఉండి  వంటిమీద పచ్చిక మొలిచేది. ఈ నాలుగేళ్లలో ఇరవై పెద్ద చెరువుల్ని నీలం కాగితాలు చింపి అవతల  పారేసినట్లు పారేసి ఇళ్ళు కట్టేరు. సాయంకాలాలు కొండల మీదనుంచి నల్లటి మబ్బులు కడుపుతో వున్న పెద్ద తాబేళ్ళలా మెల్లిగా నగరం వైపు కదులుతున్న దృశ్యాలు ఇప్పుడు లేవు. అప్పుడు సూదుల్లాంటి చల్లటి జల్లు శరీరం మీద పడుతుంటే కళ్ళు మూసుకుని మొలకలు ఎత్తేవాడు పంతులు. ఇప్పుడు ఎదురుగా వేడి తారు రోడ్డు అవతల  నాలుగు అపార్టుమెంట్లు, సిమెంటు చెట్లలా మొలిచాయి. కాలాన్ని బట్టి వచ్చే పళ్ళు, ఏడాది పొడుగునా రావడం పంతులుకి ఎదో చేదు జ్ఞాపకంలా అనిపించింది. ఓరోజు ఉదయం పంతులు బాల్కనీలో కాఫీ కప్పుతో కూర్చుని చూస్తే, రోడ్డు అవతల రెండు అపార్టుమెంట్ల మధ్య తాటాకు పందిరి దాంట్లో ఒక స్త్రీ పెద్ద తాటాకు బుట్టలో కూరగాయలు అమ్ముతూ కనిపించింది. కొన్ని కూరలు పందిరి వేలాడుతున్నాయి. సరిగ్గా నిమిషంలో బనీను తగిలించుకుని లిఫ్ట్ కోసం ఆగకుండా కిందకు జారిపోయాడు పంతులు. ఒక్క ఉదుటున కూరల దుకాణం దగ్గరకు వెళ్ళాడు. ఆమెవైపు చూసాడు. ఆమె చల్లటి చూపులో కాసి పండినట్లున్నాయి కూరలు. తెల్ల కుందేలు పొట్టలా సొరకాయలు. పచ్చ నూగుతో బెండకాయల రాశి, నీలపు చిట్టి వంకాయలు, పరిమళాలు  మోసుకువస్తున్న  కరివేపాకు, కొత్తిమీర. కూరలన్నీ తడిమాడు పంతులు. ఇద్దరూ గోగుపూలల్లా  నవ్వుకున్నారు. రెండు పురాతనమైన చెట్ల కొమ్మలు గాలికి కలిసి విడిపోయినట్లు ఆకులు కలిసి మాట్లాడుకున్నట్లు. వాళ్ళ మధ్య పొలాలు  కూరగాయల మళ్ళు పరుచుకున్నాయి. అపార్టుమెంట్లు అదృశ్యం అయిపోయాయి. ఒక చల్లటి ఋతువేదో వాళ్ళని పొట్లం కట్టింది. చెట్టుకి చెట్టుకి ఏం  పరిచయం? నేలకి చెట్టుకి, పువ్వుకి కాయకి, కాయకి ఎండకి, ఏం పరిచయం ? పరిచయం కాదు గుర్తింపు. తరువాత ఇంట్లో బెండకాయలు వేగుతుంటే ఇల్లంతా సున్నితమైన వాసన. జోగి పంతులు ఎన్నో ఎత్తుపల్లాలు, చెరువుగట్ల కింద, దొరువుల చెంత, వ్యాకోచించి పాదులా వ్యాపించాడు. కూరగాయల తోటలమీద పక్షుల్లా వాలుతున్నారు  అందరూ. జోగిపంతులు ఉదయం సాయంత్రం కూరల పందిరి కిందే ఉంటున్నాడు. అతని చేతులెప్పుడూ కూరగాయల్ని, ఆకుల్ని తడుముతూనే ఉంటాయి. కూరగాయలు ఎప్పుడూ వాడిపోవు. చీకటి పడగానే వెళ్లిపోతుందామె. ఆమె రావడం పోవడం ఎవరూ చూడలేదు. ఎండ పరుచుకుంటుండగా ఆమె పందిరికింద  మొక్క జాతుల అధిష్టాన దేవతలా ప్రత్యక్షమవుతుంది. ఆమె అతనికి నల్లటి మాట్లాడే విత్తనంలా కనిపించింది. కాసేపు వర్షం లో నిలబడితే చెట్టయిపోతుంది. మబ్బులా ఎటో వెళ్లి ఎక్కడో వర్షిస్తుంది. స్పృహ మిగులుతుంది.

నీరెండ స్పృహ

వాన స్పృహ

పూల పరిమళాల స్పృహ

గాలి అలల స్పృహ

వీటి లయలో భాగమైన స్పృహ.

ఓ సంధ్య వేళ కూరల పందిరి దగ్గరకు వెళ్ళాడు జోగి పంతులు, రాత్రి ఎంత పొద్దుపోయినా పంతులు తిరిగి రాలేదు, ఉదయం కూడా రాలేదు. నిజానికి తరువాతెప్పుడూ జోగి పంతులు తిరిగి రాలేదు.

*

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు