అతడొక పరిపూర్ణ మహాకావ్యం

తడు ధ్యానం

అతడు మౌనం

అతడు జ్ఞానం

అతడొక అస్తవ్యస్త అసంపూర్ణ వాక్యసముదాయం

అక్షరాలా కథ కాని కథ … అకవిత్వ కన్ఫెషన్

 

అతడు సత్యం

అతడు నిత్యం

అతడు మర్మం

అతడొక తెలియనితనం

నీటిలో కలిసిన వుప్పు నిశ్శబ్ద సంగీతం వెన్నెల గోళం రూపం లేని అధివాస్తవిక చిత్రం:

అభావం

 

అతడు దయ

అతడు నీడల మాయ

అతడొక క్రియగాని క్రియ

అతడు

స్వదేశంలోనే కాందిశీకుని తీరని దాహం – మోహం.

అనేక బాధా సందర్భాల్లో కన్నీళ్లు ‘తాపిన’ వోల్డ్ స్మగ్లర్

వృద్ధబాలకుడు

తడిసిన వలస పక్షి

 

 

అతడు

వికలం శకలం సకలం

సంకల్పం. వికల్పం. సంక్లిష్టం.

నిహిలం నిఖిలం

ట్రాన్స్పరెంట్ చీకటి ద్వారం

మనుషుల్ని కలిపే కనపడని దారం

రక్తనదులపై కూలిన వొంతెన

కాల యంత్ర రహస్య ప్రయాణికుడు.

 

 

అతడు

@అసంబద్ధ సంబద్ధత

నిగూఢ అహేతుకత

పాదరసపు విద్యుదనిశ్చితి

క్లీషేని మించిన ఖేయాస్

ముగియని సప్తవర్ణ స్వప్నం;

కళాయి లేని అద్దంలో కనిపించే ప్రతిబింబం.

 

యశోధరని వీడని తథాగతుడు

వున్నప్పుడు  లేడు

యిప్పుడైతే వున్నాడు,

తరాలుగా ప్రవహించే సూక్ష్మేతిహాసం

ఏడుసముద్రాలకావల వొంటిగా నిలబడ్డ దీపస్తంభం

జుడాస్  కాలేని  మైటీ క్రైస్ట్ అతడు

అతడొక్ఖడే;

(కాదు యిద్దరు)

ఇది అతని మరో రాకడ!?

 

(త్రిపుర కథావిష్కరణకోసం  చదువుతూ, సెప్టెంబర్ 2 న త్రిపుర పుట్టినరోజుకు …)

*

 

ఏ.కె. ప్రభాకర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • త్రిపురగారిని ఎంత విశ్వరూపంతో ఆవిష్కరించారు. మళ్ళీ చదువుతుంటే కొత్తగా అర్థమవుతున్నకథలు. జుర్రుకున్నంత వారికి జుర్రుకున్నంత ఆత్మానందం. అమృత సేవనం. కవిత చాలా సమయోచితంగావుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు