పరిహార-పరిహార

సారి మళ్ళీ ఫోన్ మోగింది. నాన్నా..ఫుయ్…అనేలోపే లేశిన. శానసేపయితాంది. ఎన్నిమాట్ల రింగైందో! మావోడు ‘నాన్నా..ఫుయ్. ఫుయ్ అచ్చింది’ అనుకుంట లేపుతనే వున్నడు. వాడికిప్పుడు మూడేండ్లు. వాని పిలుపులు ఇనబడుతానయిగని కండ్లు తెర్వొత్తలేదు. గదుమబట్టుకుని ఫుయ్ ఫుయ్ అని ఒకటే అరుపు. ఈలోపు మా ఆవిడ యిప్పటికే నాలుగైదుసార్లు కిచెన్ కీ, బెడ్ రూమ్ కీ తిరిగి తిరిగి యాష్టకొచ్చిందేమో “మొద్దునిద్ర..పంటె ఒగమానంగ లేవడు. ఏం మనిషో..ఏంపాడో” అని గులుగడం లీలగా ఇనబడుతాంది.

రాత్రంతా ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్ ల్లో మునిగి పైకి లేచేసరికి తెల్లారగట్ల ఏ రెండో మూడో అయినట్టుంది. ఇగ గప్పుడు  పండుకుంటె మేల్కొత్తదా! మా నిషాంత్ గాడు మరీనూ..బొర్లబొక్కల, ఎల్లెల్కల ఎట్ల పండుకున్నా మీదగూసోని ఎగురుతనే వుంటడు. వాడికదో సరదా ఆట. టీ.వీలో ‘మాషా అండ్ ది బేర్’ చూసీ చూసీ ‘మాషా’ అలవాట్లన్నీ నేర్సుకున్నడు. వాటిని అనుకరిస్తూ చేసే రకరకాల విన్యాసాలు చూస్తే అప్పుడప్పుడు వీడికెక్కడ దెబ్బలు తాకుతయోనని భయమైతాంటది. వీడి ఎగురుడు దునుకుడుకు వాడకట్టంతా దద్ధరిల్లిపోతాంది. అల్లరి భరించలేకపోతానం. ఒక్కోసారి వాడి చర్యలకు మనం ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వకపోతే ఏడుత్తాంటడు. అలిగి అటుపక్కకు తిరిగి మొఖం న్యాలకేత్తడు.

పాపమని ఎత్తుకుని ముద్దుజేశినమనుకో..ఇగ మనం బెల్లప్పయితం. అల్లరి మల్ల షురూ జేత్తడు. వాడ్ని పట్టించుకోకుండా మన పని మనం జేసుకుంట సూడనట్టే వున్నమనుకో..ఏమనుకుంటడో ఏందో..కొద్దిసేపటికి బొమ్మలన్ని ముందేసుకుని ఏకాంతక్రీడల్లో మునిగిపోతడు. ఇయ్యాల లేసుడు జర పొద్దుపోయింది గదా..అందుకే బొమ్మలన్నీ బెడ్ మీద పర్సుకుని నాలుగైదు కారు బొమ్మల్ని వుయ్ వుయ్ అనుకుంట గాల్లో పల్టీలు కొట్టించి, తలమీంచి పాదాల దాక బుయ్ బుయ్ మని వాడి నాన్నరోడ్డుపై వాహనాల్ని వేగంగా వురికిత్తాంటడు.  ‘పా అండ్ ది పాట్రల్’ లోని కుక్కపిల్లల సాహసకృత్యాలు చూస్తూ ఆటల్లో మునిగి వాడో బుజ్జికుక్కపిల్లలా మారిపోతాంటడు.

*

ఫోన్ ఎత్తి మాట్లాడిన కదా..అవుతలి నుంచి శ్యామ్ అన్న పలకరింపుతో పాటు చెవిలో చేదువార్తను వేసి గుండె బరువెక్కించిన్రు. మోయటం కష్టమైతాంది. ఇసోంటియి వినీ వినీ ఎప్పుడు నా గుండె ఆగిపోతదోనని బుగులైతాంది.

గతంలో చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం లాంటి పనులన్నీ ప్రభుత్వం జెప్పినట్టే ప్రజలు పాటించిన్రు. ఇగ లాభం లేదనుకుని లాక్ డౌన్ ప్రకటించిన్రు. రాత్రికి రాత్రే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల సామాన్యప్రజలు పడే ఇక్కట్లు ఎసుంటియో గతంలో నోట్లరద్దు జేశినపుడు అనుభవంలోకి వొచ్చింది. గిప్పుడు కరోనా వల్ల మానవసంబంధాలు పురాగ దెబ్బతినే పరిస్థితి దాపురిచ్చింది.

ఎదురింటి అమ్జద్ భాయ్ ని సూత్తనే వున్న. ఇంటి ఓనర్ పాపయ్య ఇల్లు ఖాళీచేయమని నానా రచ్చ జేత్తాండు. పాపం అమ్జద్ మాత్రం యిప్పుడు ఏడికనిబోతడు. ఓనరేమో పిల్లలు ఆడుకుంటున్నా కసురుకుంటాండు. రోజుకొక్కసారన్న గోడవపెట్టుకునుడు సూత్తనే వున్న.

మొదటిసారి నేను ముస్లిం కాదని పదేపదే గుర్తుచేసుకుంటున్న. గుర్తుచేసుకున్న ప్రతిసారీ మనసులో ఏదో అపరాధభావం వెంటాడుతాంది. వాళ్ళతో పోల్చుకుంటే మా ఇంటి ఓనర్ వందపాళ్ళు నయం. కానీ ఏదో పనిబడి రెండుసార్లు బైటికి వెళ్ళాల్సివచ్చినందుకు, ఇకపై వెళ్తే మళ్ళీ రావొద్దని ఖరాఖండిగా తేల్చిచెప్పిందని నా భార్య వనిత మెల్లిగా నా చెవిలో వేసింది.

**

కిరాయికి వున్న ఇంట్లో ఓనర్స్ ప్రవర్తన ఏ కొంచెం అటూఇటూగా వున్నా ఆరోజు వనితతో పోట్లాటే. రెండు గదులైనా ఫర్వాలేదు.. ఇల్లుకట్టుకుందామని ఒకటే పోరు. ఈరోజుల్లో ఇల్లు కట్టుకోవడం అంటే మాటలా..అంతా గజాల లెక్కనే. ఇప్పటికిది ఐదేండ్ల కల. ఎప్పటికి నెరవేరుతదో తెల్వదు. తను ఎప్పుడు ఇల్లు ఖాళీ చేద్దామంటదోనని నా భయం నాకుంది. ఇప్పుడసలే అడుగు బయటపెట్టలేని స్థితి.

మిత్రులు కొందరితో కలిసి చుట్టుపక్కలున్న వలసకార్మికులకు మాస్క్ లు, సానిటైజర్స్, నిత్యావసర వస్తువులు పంచే పనిలో రెండురోజులు గడిచిపోయింది. రోడ్లెంబడి వలసకార్మికుల దు:స్థితికి విలపించని రోజు లేదు. ఎవరైనా శక్తికి మించి ఏం చేయగలరని సరిపెట్టుకున్న. కానీ శక్తికిమించి శ్రమిస్తున్న మిత్రుల్ని రోజూ సూత్తనే వున్న. ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు రాలేదని ముసలోళ్ళు సుత మదనపడుతున్నరు. చిన్నపిల్లలు  మరింత జాగ్రత్తగా వుండాలని ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ అయితనే వుంది. ఒకపక్క ప్రపంచం మొత్తం మీద కరోనా స్కోర్ బోర్డు అమాంతం పెరుగుతుండుడు జూశి మరింత భయంసొచ్చింది.

*

నిషాంత్ అసలే చిచ్చరపిడుగు. ఓనర్ వాళ్ళింటికీ మా ఇంటికీ షెటిల్ సర్వీస్ చేత్తనే వుంటడు. వాన్ని ఆపుడు మరీ కష్టం. ఐనా మన జాగ్రత్తల్లో మనం వుండాలని వనిత పట్టుబట్టడం వల్ల వాన్ని కట్టుదిట్టం చేసే పనులు చేసీచేసీ లాభం లేక చేతులెత్తేయాల్సి వచ్చింది. రోజుకొక్కసారన్నా గదిని శుభ్రం చేసుడు, పదేపదే సబ్బుతో చేతులు కడుగుడు అలవాటైంది. మాతోపాటూ మావాడికీ హాండ్ వాష్ పట్ల అవగాహన వొచ్చింది.

కరోనా కారణంగా ఇంటికే పరిమితమవడం వల్ల బద్ధకం ఇంకింత పెరిగింది. అర్ధరాత్రి దాటేదాక ఫోనులోంచి చూపు పక్కకు తిప్పలేని బానిసత్వంలోకి కూరుకుపోయిన. టీ.వీ ల్లో సీరియళ్ళు లేక చూసిన సినిమాలే పదేపదే సూడలేక కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ లాంటి వాటిమీద వనిత దృష్టిమళ్ళింది. నేనేమో పొద్దుపోయేదాక పడుకునుడు, తనకు ఇంటిపని భారం ఎక్కువవుడు, పనుల్లో ఆసరా కావట్లేదని విసుక్కునుడు, పైగా మా చిచ్చరపిడుగును మెయింటేన్ చేయడం చాలా తలనొప్పిగా మారిందామెకు.

ఇవ్వాళ నన్ను విసుక్కోవడానికి కారణం అదే. నాలుగుసార్లు ఫోన్ మోగిందనే విషయమే తెలీకుండా, సోయి లేకుండా పన్న. లేచి ఫోన్ ఎత్తి మాట్లాడేసరికి జీర్ణించుకోలేని  చేదువార్త వినాల్సి వచ్చింది. అదే విషయం వనితకు చెప్పిన. తనూ బాధపడింది.

**

మనిషి పోయింతర్వాత నలుగురు  మోయాల్సిన వాళ్ళు లేకపోతే అంతకంటే దారుణం మరోటి వుండదు. సంతోషంలో తోడులేకున్నా బాధలోనన్నా తోడుండాలి. అందుకే ఒకసారి పోయివద్దామని అన్న. చనిపోయింది మాసొంత బావ వాళ్ళ నాయిన. పరాయిలసుంటిది సూశి పోతరు. చెల్లెనిచ్చినింటికి పోకపోవుడు పద్ధతికాదు. పోతే కరోనాతో పోవాల్సివస్తుందని వనిత సూచన.

ఏం చేద్దాం చెప్పు? వెళ్ధామా..

నీకేమైనా బుద్ధుందా? ఇంట్లో చిన్నపిలగాడున్నడు. మాగురించి ఆలోచించవా..మాకేమైనా ఫర్లేదా?

అది కాదు ‘బుజ్జి’

ఏదికాదు.. టీవీల్లో చూడట్లేదా? ఎంతమంది అలా…

నాకైతే ఇష్టం లేదు బావా అన్ని జాగ్రత్తలు తీసుకునే వెళ్ధాం. పోనీ.. నేనొక్కన్నైనా వెళ్ళి వస్తా.. ఏమంటావ్ ?

నీ మాట నీదేనా? కొంచెమైనా సెన్స్ వుందా? ఇక్కడుందా.. అక్కడుందా.. 300కి.మీ.దూరం బోవాలె. నువ్వేమో బండి మీద పోతనంటవ్ . మధ్యలో నీకేమన్న అయితే..

అట్లగాదే..?

ఎట్లగాదు.. అంతకు గాకపోతే కరోనా తగ్గింతర్వాత అందరం వెళ్ళి కలిసొద్దం. ఇప్పుడైతే వద్దు బావా.. నా మాటిను.

ఇగో కరోనా తగ్గుముఖం పట్టిందని గవర్నమెంట్ సడలింపులు ఇచ్చింది. రోడ్లమీద టూవీలర్స్ తిరుగుతున్నై. ఏం భయం లేదు. కాకపోతే కారు మాట్లాడుకుని పోయివద్దం. దూరంగా నిలబడి సూద్దం. దానంజేసుడు అయిపోవంగనే వచ్చేద్దం. పోదమానే..?

ఆ..పోదం అందరం కట్టగట్టుకుని ఏట్లెకు పోదాంపా…

గట్లంటవేందే?

ఇంకెట్లనాలె.. వద్దని ఎంత మొత్తుకున్నా ఇనకపోతే ఏంజెయ్యాలె. అయినా నేనెప్పుడు జెప్తే ఇన్నవుగన్క..యిప్పుడుయింటానికి?

అదిగాదు బుజ్జీ..నీవోళ్లైతే సూడాలని అనిపించదా నీకు! కరోనా అని పోకుంట అట్లనే వుంటవా.. నీపానం గుంజదా.. నీవోళ్ళమీద మనాదిబెట్టుకుని ఏడ్వవా?

ఏమో..బావా..నీకొచ్చినన్ని తిర్కాసులు నాకు రావు. నీకెట్ల మంచిగనిపిత్తె అట్నేజేసుకో..నా జోలికిరాకు..వార్తకు రాకు. నువ్వు పోయేటప్పుడు మా ఇంటికాడ తోలిపో..

అగో..గట్ల లేశిపోతవేందే.. జర ఆగు.. ఆగు.

***

వనితతో మాట్లాడినంక ఇగో గిట్ల తల్కాయబట్టుకుని కూసున్న.

ఏంజేయాలె? పోదునా..వద్దా!

“నాన్నా.. ఫుయ్ ”

వామ్మో.. ఫోన్ ఎత్తాలంటెనే ఏం వినాల్సివత్తదోనని భయంభయం అయితాంది.

నిషాంత్ మెడసుట్టూ చేతులేశి, వీపుమీదెక్కి “నాన్నా షాప్ ..చాకీ..తింట” అన్నడు.

*

ఎప్పుడులేంది వనిత మాట ఇనాలనే వుంది. లోపలి మనిషికి ఏం చెప్పను? పోకపోతినని తర్వాత జీవితాంతం యాజ్జేసుకుని ఏడ్వాలె. ఎహే..ఎట్లయితె అట్లయింది. ఒక్కషిత్తం జేసుకున్న.

బ్యాగు సదురుతాంటె ఆమె గుర్రుమని సూత్తాంది. సూడనట్టే నా పని నేను జేసుకుంటాన. దుమ్ముపట్టిన బండిని తుడిచి, సెంటర్ స్టాండ్ వేసి బండి స్టార్ట్ చేయడానికి తంటాలు పడుతున్న. వనిత పరుగెత్తుకుంట గల్మల్లకొచ్చి నిలవడ్డది. చిన్నోడు డార్క్ ఫాంటసీని ఎంజాయ్ చేస్తూ మోటూ పత్లూ తో లీనమైండు. అమ్జద్ భాయ్ తో పాపయ్య గొడవ అంతకంతకూ పెరిగి వాకిట్లో సామాన్ల సప్పుడైతాంది. మా ఇంటి ఓనర్ వాళ్లు సుత  బైటికొచ్చి జరిగే తంతును చూస్తూ నిలబడిపోయిన్రు. మాస్క్, సానిటైజర్ వున్నాయో లేవోనని ఒకటికి రెండుమాట్ల తడిమిచూసుకున్న. హెల్మెట్ పెట్టుకుని యుద్ధరంగంలోకి వెళ్తున్న సైనికుడిలా..ఆమె ఎరుపెక్కిన కంటిచూపును దాటుకుని నాకు నేనే పైలం బిడ్డా అనే  నాయినమ్మ మాటల్ని యాజ్జేసుకుంట బైలెల్లిన.

*

 

Avatar

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు