పరిమితుల్లో ఒదిగి, సాగిన ప్రవాహం!

నిజానికి నేను సాహిత్య ప్రపంచంలోకి చాలా ఆలస్యంగా వచ్చేను. ఏమి రాయాలో తెలీదు. ఎందుకు రాయాలో తెలీదు, కేవలం రాయాలనే ఉత్సాహం తప్ప ఏ జ్ఞానమూ లేని నాకు మాష్టారొక ఎరుకనిచ్చేరు. 

ప్పుడెప్పుడో ఎనిమిదో తరగతి చదువుతున్న బాల్యపు రోజులు. పినిశెట్టి రచన ‘అన్నా చెల్లెలు’ అనే సాంఘిక నాటకం ప్రదర్శించాలనుకున్నారు మావూర్లో. అందులో తమ్ముడు రంగడు పాత్ర నువ్వేస్తే బాగుంటుందన్నారు.

నేను సంతోషంతో పొంగిపోయి పోర్షన్ రాసుకున్నాను. కంఠతా పెట్టడమూ అయింది. తరువాతెందుకో నన్ను కాదని ఆ పాత్ర మరొకరికి ఇచ్చారు. పాలపొంగు మీద నీళ్ళు చిలకరించినట్టైంది. దర్శకుడెవరో కాదు మాబావు (నాన్న) . అప్పుడే నేనొక నిర్ణయాని కొచ్చేను. ‘ఆ నాటకం ప్రదర్శించే ముందు నేనే ఒక నాటిక రాసి అదే వేదిక మీద ప్రదర్శించాలి’ అని. అంతే అనుకున్నట్టు నాటిక రాస్సేను..నాటిక పేరు ‘మద్రాస్ టోపి’ అప్పటి నా మిత్రులు గొట్టిపల్లి కేశవ, నామగిరి సోమలింగం నా సహనటులు.

ఒక గంట ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి ఆకట్టుకుంది. అందరూ బాగుందన్నారు. ప్రశంసల జల్లుల్లో ముంచెత్తేరు. ఆరోజు నా సంతోషానికి అవధులు లేవు. అలా బాల్యంలోనే మొదలైంది నా సాహిత్య ప్రయాణం.  నిజానికి ‘సాహిత్యం’ ‘రచన’ అనే పదాలు పరిచయం లేని రోజలవి. అప్పుడు తెలిసింది రాతలోని రుచి.

ఆ రోజుల్లోనే మా హైస్కూల్ కి ఒకాయన వచ్చేడు.

చూడ్డానికి పేదరికానికి ప్రతినిధిలా ఉన్నాడు. “ఈయన కళాకారుడు, సాయంత్రం ఇంట్రవెల్ సమయంలో ప్లేగ్రౌండ్ లో ఏకపాత్రాభినయం ఉంది.‌ పదిపైసలు, పావలా, అర్థరూపాయి ఎవరికెంత కలిగితే  అంత సహాయం చెయ్యండి” అని అన్ని క్లాసుల్లోనూ పరిచయం చేసేరు. ఆరోజాయన ‘పిరదౌసి’గా నటించిన నటన, రాగయుక్తంగా పాడిన పద్యాలు నన్ను వెన్నాడేయి చాలాకాలం.

నేను ‘జాషువా’ గారి పేరు తొలిసారిగా విన్నది అప్పుడే. బహుశా ఆ ‘పిరదౌసి’ ఏకపాత్రాభినయం
నాలో కవికావాలన్న కోరికకు బీజం వేసివుండాలి.

కవి కావాలంటే బాగా పుస్తకాలు చదవాలని మా పెత్తెలుగు మేషారు చెప్పేరు. జాషువా గొప్ప కవి అని కవిత్వం రాయాలంటే చందస్సు బాగా నేర్చుకోవాలని చెప్పేరు. పుస్తకాలు చదవాలన్నా రని హైస్కూల్ లైబ్రరీలో పుస్తకాల వెన్నిచదివీసేనో. అప్పుడేమర్థమయ్యాయో ? తొలిసారిగా చదివిన నవల మాత్రం ‘పారిపోయిన బఠాణీ’ అని గుర్తు. (రచయిత పేరు గుర్తులేదు). నవల చదువుతున్నంతసేపూ కన్నీరాగింది కాదు.

ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఏవో గేయాలు రాసేవాడ్ని. బెలగాం చర్చివీధిలో డొంకాడోళ మేడలో నా పక్క గదిలోనే ఉండే అట్టాడ అప్పలనాయుడు నా గేయాలకి తొలి పాఠకుడేకాదు విమర్శకుడు కూడా. ఇద్దరమూ ఆవీధి మొగలో ఉండే లైబ్రరీ లో పుస్తకాలు చదువుతూ పార్క్ లో చర్చలు చేస్తూ సమాజాన్ని సమూలంగా మార్చేయాలని ఊహలల్లుకుంటూ అమాయకంగా చర్చలు చేసే వాళ్ళం.

అప్పలనాయుడు నేను హైస్కూల్ రోజులనుండీ ఒకరికొకరం తెలిసిన వాళ్ళం..వాడు నాకంటే ఒకేడాది పెద్ద. వాడు ఎస్సెస్సెల్సీ చివరి బ్యాచ్, నేను ఎస్సెస్సీ మొదటి బ్యాచ్. ఇంటర్ రెండో సంవత్సరంలో మేం మళ్ళీ కలిసేం. నేను ఇంటర్ పరీక్ష తప్పి వ్యవసాయంలో పడ్డాను.  ఇంటర్ తప్పినందుకు అప్పుడు బాధపడినా వ్యవసాయ జీవితం నాకు చాలా నేర్పిందని ..ఇంటర్ పాసయ్యుంటే మా ఊరు, రైతులు, వారి స్థితిగతులు నా అనుభవం లోకి వచ్చివుండేవి కావు. పదేళ్ళ నా వ్యవసాయజీవితం నాకు చాలా నేర్పింది. అది నా సాహిత్యజీవితానికి ఎంతో మేలుచేసింది.

ఊర్లో నాటక సమాజం, భజన సమాజం  రచనలు చెయ్యడానికి బాగా దోహదపడ్డాయని చెప్పాలి. “భగ్నహృదయాలు”, “పిచ్చిమారాజు” “పోడు_మంట” వంటి నాటకాలు రాసి చాలా ప్రదర్శనలిచ్చేం. “మాట_ మనసు” అనే పెద్ద నవల కూడా రాసేనప్పుడు. అవేమయ్యాయో తెలీదు గానీ వాటికి మంచి ఆదరణ లభించింది మా మిత్రుల నుండి. భజన సమాజం కోసం సినీగీతాల బాణీల్లో మిత్రుల కోరిక మేరకు పాటలు చాలా రాసేను. మా పెద్ద మామయ్యకు ఒక బుర్రకథ దళం ఉండీది. ఆ బుర్రకథల కోసం ఏదో వొక పాట రాయించుకునే వాడాయన. ఆపాటలకు మంచి ఆదరణ ఉండీది కూడా. పాట రాయడానికి అప్పుడదొక  స్వీయ శిక్షణాశిబిరంలా ఉండీది.

మా గ్రామంలో జముకుల పాటపాడే పైడయ్య కోసం పాటలు రాసిచ్చేవాడిని, ఆ పాటల్నతడు జముకుమీద పాడుతుంటే బాగా డబ్బులు, బియ్యం దొరుకుతున్నాయనేవాడు. (నా’ఏటిపాట’ కథలో నాయకుడు ఆ పైడయ్యే) సంతోషంగా ఉండీది నాకు. అప్పుడలా రాసిన పాటొకటి ‘భారతమన్నా మహా భారతమన్నా’ . ఆ పాట విని శ్రీకాకుళ రైతాంగ ఉద్యమనాయకుడు  ‘మావిడి అప్పల సూరి’గారు చెప్పిన పాఠం ఎప్పటికీ మరిచిపోలేను.

వ్యవసాయం చేస్తూ, ఉద్యోగార్థము తెలుగుపరీక్షల కోసం ప్రైవేటుగా గురువుగారు సామవేదుల రామగోపాల శాస్త్రి గారి మార్గనిర్దేశంలో ఆయన ఇచ్చిన సంస్కృత కావ్యనాటకాల్ని చదవడమూ,  ఆ విశేషాల్ని గేయాలుగా రాయడమూ ఇదొక సాహిత్య అభ్యాసమే. ఇవన్నీ నాకు రాయడం పట్ల మరింత ఆసక్తిని కలిగించీవి. పాటో, పద్యమో భజనగీతమో రాయని రోజంటూ ఉండీదిగాదు.

తెలుగు మాష్టారుగా గిరిజన ప్రాంతంలో ఉద్యోగంలో చేరేక పిల్లల కోసం పాటల్రాయడం, వారిచేత పాడించడం ఒక బాధ్యతగా మారిపోయింది. ప్రతి జాతీయ పండగకీ పిల్లల బృందగానాలు, బృంద నాట్యాలు తప్పనిసరి.  మళ్ళీ ఎక్కడో సోదరుడు అట్టాడ అప్పల్నాయుడు కలిసేడు. తానప్పుడు నాగావళి వార పత్రికలో సంపాద కుడుగా ఉన్నాననీ, కవితలు పంపమనీ అడిగేడు. అలా నా తొలి కవిత “ఇదేనా..?” ‘నాగావళి’ పత్రిక(1979)లో ప్రచురించేడు అప్పలనాయుడు.

మా ఊరికి చినమేరంగి అనే గ్రామం చాలా దగ్గర.

అది ‘కొండగాలి’ భూషణం మాష్టారి సొంతూరు. ఆయన మా బావు (నాన్న)కి మిత్రుడు. ఆయన చాలా గొప్ప రచయిత అని చెప్పేవాడు మాబావు. నేనెప్పటికి ఆయన రచనలు చదవలేదు. చదివిన వన్నీ డిటెక్టివ్ నవలలు, యద్దనపూడి, ఆరికపూడి మల్లాది, వాసిరెడ్డి సీతాదేవి మొ: వారి నవలలే. తరువాత యండమూరి. ఏమాటకామాట చెప్పుకోవాల గదా..పుస్తకపఠనం పట్ల ఆసక్తి కలగడానికి ఈ రచయితలు కూడా ఒక కారణమే .

నేను పాటలు కాకుండా కథ రాయడానికి కారణం కరపవలస బలరాంప్రసాద్ అనే మిత్రుడు. ఎస్టీ జ్ఞానానంద కవిగారి స్వగ్రామం పెదపెంకి .ఆ ఊర్లో మా చుట్టాలున్నారు. అక్కడ పరిచయమైనాడు బలరాం ప్రసాద్. కథాంజలి అనే మాసపత్రికలో అతని కథ చదివేనప్పుడు. అతనా పత్రిక చిరునామా ఇచ్చి ఏదైనా రాసి పంపమన్నాడు. కథాంజలి పత్రిక మద్రాస్ నుండి వచ్చీది. దానికి కథ రాసి పంపించేను.

ఆ కథపేరు ‘శారదపెళ్ళి’. కథాంజలి లో (1984)ఆ కథ అచ్చయింది. అదే నా తొలి కథ. ఎంత సంబరపడిపోయేనో..వరుసగా నాలుగైదు కథలు , ఒక నాటకం ఆ పత్రికలో వచ్చేయి. నన్ను కథా రచయితగా పరిచయం చేసింది ‘కథాంజలి’.నిజానికి ‘కథ’ గురించి ఏమీ తెలీకుండానే ‘కొన్ని కథల్ని చదివి ఇలా రాస్తే కథ అవుతుంది’ అని రాయడమే తప్ప కథ ఎందుకు రాయాలో, ఎలా రాయాలో తెలీని దశ అది.

1988 లో అని గుర్తు. ‘పోడు_ పోరు’ అనే కథా సంపుటి నా చేతుల్లోకొచ్చింది. రచయిత అట్టాడ అప్పలనాయుడు. నాకాశ్చర్యమూ, ఒకలాటి స్పర్థ కలిగేయి. నాకు తెలిసిన అప్పల్నాయుడు రచయిత కాదు.. ఎప్పుడు రాసేడు ? ఎలా రాసేడీకథలు? అని ఆశ్చర్యానందాలతో ఏకబిగిని చదివేశానా కథల్ని. ‘ఇలా ఎందుకు రాయకూడదు? నా భాష, నా చుట్టూ ఉన్న మనుషులు, రైతులు వారి సమస్యలు..రాయాలి అని పట్టుదలగా ఆరాత్రి ఒక కథరాసేను..ఆ కథ ‘ఆశ’. సాపు ప్రతిరాసి ఆకాశవాణి విశాఖపట్నం కి పంపించేను. ఒక ఉదయం ఆ కథ ఆకాశవాణి లో ప్రసారమైంది. కానీ కథ చదివినామె మాండలిక పదాలను సరిగా పలకలేకపోవడం అసంతృప్తి కలిగించింది. ఆ కథనే ‘రేపటి ఉదయం కోసం’ పేరుతో ‘కథాలహరి’ కథాసంకలనం లో సాహితీ లహరి, పార్వతీపురం వారు ప్రచురించేరు.

ఈరోజుల్లోనే వాడ్రేవు చినవీరభద్రుడు గారు మా గిరిజన సంక్షేమాధికారిగా వచ్చేరు. ఆయన ప్రోత్సాహం మరిచిపోలేనిది.

పార్వతీపురంలో పి.వి.బి. శ్రీరామమూర్తి, పోతుబరి వెంకటరమణ అనే సాహితీ మిత్రులు ‘మిత్రసాహితి’ అనే పేరుతో నెలనెలా సమావేశాలు జరిపి కథల్ని ఆహ్వానించే వారు. అలా నిర్వహించి న సభలో చదివిన కథ’విముక్తి’ . ఆరోజు ఆ కథ విన్న మిత్రులందరూ కథ బాగుందనీ, ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికకు పంపించమనీ ప్రోత్సహించేరు. ఆంధ్రజ్యోతి లో పెద్ద బొమ్మతో ప్రచురణ అయ్యిందా కథ. ఆ కథే కథాదీపధారి కాళీపట్నం రామారావు మాష్టారి గార్ని పరిచయం చేసింది.

ఐ టి డి ఎ వారు నిర్మించిన వీడియోఫిల్మ్ ‘నానూ సదువుకుంతాను’లో నాతో ఒక పాట రాయించేరు దర్శకుడు బి.హెచ్. రామమూర్తి గారు. ఆ సినిమా వీడియో ఆవిష్కరణకు తనతో తీసుకెళ్ళిన చినవీరభద్రుడు గారు కా రా మాష్టారి పరిచయ భాగ్యం కలగజేసేరు.

“నీ కథ ‘విముక్తి’ జ్యోతిలో చదివేను, నీకోసమే వెతుకుతున్నా” అన్నారు మాష్టారు. నాకాశ్చర్యం. మాష్టారి పరిచయం నా సాహిత్య జీవితంలో గొప్ప మలుపు.

ఆరోజాయన వేసిన తొలి ప్రశ్న  “మీరు మీసాలు గీసేస్తారా? ” అని. నాకేమీ అర్థంకాలేదు.
తెల్లమొగమేసేను.

“తొలి ఆథునిక కథ ఎక్కడ పుట్టింది?” అన్నారు. అదీ నాకు తెలీదు. మరీ భయమేసింది. నా స్థితి తెలిసిపోయిందాయనకి.

భుజమ్మీద చెయ్యేసి నెమ్మదిగా చెప్పేరు. కథ గురించీ, ఇతర ప్రాంతాలనుంచి వస్తున్న కథాసాహిత్యము, దాని ప్రయోజనాల గురించీ చెప్పి వారితో పోటీపడినట్టు రాయాలగదా”అని “ఇంటికి రాగలవా ?” అన్నారు. మరుచటి రోజు విశాఖలో రామ్ నగర్ లోనున్నమాష్టారింటికెళ్ళేను.

చదవాల్సిన పుస్తకాల జాబితా చెప్పేరు. పుస్తకాలు ఇచ్చేరు. తరచు కలువు’ అన్నారు. అలా మాష్టారి తో మొదలైన ప్రయాణం, ఆయన చూపిన దారి నన్నొక కథకునిగా సాహిత్యప్రపంచం ముందు తలెత్తి నిలబడేలా చేసింది.

నిజానికి నేను సాహిత్య ప్రపంచంలోకి చాలా ఆలస్యంగా వచ్చేను. ఏమి రాయాలో తెలీదు. ఎందుకు రాయాలో తెలీదు, కేవలం రాయాలనే ఉత్సాహం తప్ప ఏ జ్ఞానమూ లేని నాకు మాష్టారొక ఎరుకనిచ్చేరు.  మాష్టారి పరిచయం అయిన తొలినాళ్ళలో రాసిన కథను మాష్టారికి చూపించడం, శ్రీ కాకుళ సాహితి మిత్రులతో చర్చించడం జరిగీది. ఒకసారి మాష్టారు “నీవు కథలపుస్తకం వేసుకో గలవా” అన్నారు.
నా కథల జిరాక్సు కాపీల్ని స్వయంగా కా రా మాష్టారే చరితా సుబ్బయ్య గారి చేతిలో పెట్టేరు,
కథానిలయం ప్రారంభోత్సవం నాటికి ఆవిష్కరణ అయ్యేలా. అలా నా తొలి కథా సంపుటి ‘ఏటిపాట’
కథానిలయం ప్రారంభోత్సవ సభలో గూటాల కృష్ణమూర్తి గారి చేతుల‌మీదుగా ఆవిష్కరింప జేసేరు. అదొక గొప్ప మరిచిపోలేని అనుభూతి.

మాష్టారికి చాలా దగ్గరగా మెలిగే భాగ్యం దక్కింది. ఆయనతో మరపురాని సాహిత్యప్రయాణాలెన్నో.

నా కథలకు, కవిత్వానికి బహుమతులొచ్చేయి, సాహిత్య పురస్కారాలు, అవార్డులు ఇచ్చి గౌరవించేయెన్నో సాహిత్య సంస్థలు. అవార్డులు నేను సరైన దారిలోనే ఉన్నాననే  ధైర్యాన్ని కలిగించేయి. మూడు కథా సంపుటాలు, మూడు కవిత్వసంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, గేయం , పద్యం, కాలమ్ ఇలా తోచినట్టు  రాస్తూ వచ్చేను. నా మొత్తం కథల్ని ‘గౌరునాయుడు సాహిత్యం మొదటి సంపుటి’  గాను, కవిత్వం, దీర్ఘకవిత, పద్యసంపుటాల్ని ‘గౌరునాయుడు కవిత్వం రెండో సంపుటి’ గానూ మిత్రులు ప్రచురించేరు. . నా సాహిత్యం మీద వివిథ విశ్వవిద్యాలయాలలో పి హెచ్ .డి , ఎమ్ ఫిల్ . పరిశోధనలు జరిగేయి.

తొమ్మిదోతరగతి తెలుగు వాచకంలోను, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం ఎ విద్యార్థులకు  పాఠ్యాంశాలుగా నా కవితలు రావడం, మహారాష్ట్ర కుమారభారతి( తెలుగువాచకం) పాడుదమా స్వేచ్ఛాగీతం గేయం  పాఠ్యాంశంగా బోధించ బడటం, కన్నడ భాషలోకి అనువదించబడి అక్కడి గాయకుల గొంతుల్లో ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ పాట వినడం సంతోషదాయకమే కదా.

నేను రాసి మరిచిపోయిన పాటల్ని ఏగాయకుడో ఎక్కడో పాడుతూ ఎదురౌతుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. నా ప్రమేయం లేకుండానే పాట పక్షిలా జనంలోకి ఎగిరెళ్ళడం ..ఆ పాటల్ని సామాజిక ప్రయోజన సాధనాలుగా గాయకులు పాడుతూ “మీ పాట మా ఆయుధం” అని  గౌరవంగా మాట్లాడుతుంటే ‘నా అక్షరాలకు సార్థకత లభించినట్లే’ అనిపిస్తుంది. నా పాటల్ని ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ పేరుతో మిత్రుడు చీకటి దివాకర్ ‘చీకటిప్రచురణలు వెలుగులకోసం’ అనే తన ప్రచురణ సంస్థ ద్వారా పుస్తకాన్ని అచ్చువేసి విజయనగరంలో గొప్ప ఉత్తేజకరమైన సభ జరపడాన్ని మరిచిపోలేను.

ముఖ్యంగా 1992 లో నేను కురుపాం లో ఉండగా మిత్రుల సహకారంతో స్థాపించిన ‘స్నేహకళాసాహితి’ ఇప్పటికీ సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూంది. పుస్తకాల్ని ప్రచురిస్తూంది. స్నేహకాళాసాహితి లోనే తమ సాహిత్య ప్రయాణం మొదలు పెట్టినవారు ఇప్పుడు కవులుగా, రచయితలుగా, చిత్రకారు లుగా చాలా మంచి గుర్తింపు పొందినవారే. వారిలో చింతా అప్పలనాయుడు, సిరికిస్వామి నాయుడు, మల్లి పురం జగదీశ్, చందనపల్లి గోపాలరావు, పక్కి రవీంద్రనాధ్ , పల్ల రోహిణీ కుమార్ మొదలైన వారు సాహిత్యప్రపంచానికి బాగా పరిచయమైనవారు.

నడిచొచ్చిన దారిని ఒకసారి  వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషంగానూ..సంతృప్తి గానూ ఉంది. కానైతే ఒకటే చింత..అది  మహాకవి శ్రీ శ్రీ గారినీ, మహారచయిత రా వి శాస్త్రి గారినీ చూడలేక పోవడం. కానీ  కథాదీపధారి కాళీపట్నం రామారావు మాష్టారి పరిచయం ఆ లోటును మరిపించింది.

ఎందరో సాహితీమిత్రులతో నడిచిన దారి, ఎంతో మంది సాహిత్యాభిమానుల్ని నాకందించిన దారి,
ఎక్కడెక్కడో ఉన్న వారిని ఒక్కదగ్గరికి చేర్చి ఎన్నో తియ్యని అనుభూతుల్ని ఇచ్చిన దారి యిది. మాష్టారు చెప్పినట్టు అక్షరాలతో సమాజరుణం తీర్చుకుంటున్నానన్న సంతృప్తినిచ్చిందీ దారిలో ప్రయాణం.

నాది పరిమితమైన ప్రపంచం. నా జ్ఞానమూ పరిమితమైనది. రాసింది తక్కువే. వ్యవసాయ జీవితాన్ని ఎంత అక్షరీకరించినా సమగ్రం కాదు. నవల రాయలేకపోయాననే లోటు ఒకటి మనసులో బాధిస్తూనే ఉంది. నవలొకటి వందపేజీలు రాసినా ఏదో అసంతృప్తితో మధ్యలోనే ఆగిపోయింది. పూర్తి చెయ్యాలనే ఉంది.  కొన్ని పరిమితు ల్లోనే నా సాహితీ ప్రయాణం సాగింది. పరిమితుల్లోనే అయినా నాదైన ప్రపంచాన్ని సృష్టించుకుని నా దారిలో సాగిన ప్రయాణాన్ని ఒక సారి వెనుదిరిగి చూసుకునే అవకాశం ఇచ్చిన “సారంగ” మిత్రులకు  ధన్యవాదాలు.

*

గంటేడ గౌరునాయుడు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సాహిత్య లోకం పరిచయం లేనివారికి కాలం, లోకం అన్నిటినీ పరిచయం చేస్తుంది. కథలుకథలుగా రచయితను సిద్ధం చేస్తుంది. మీరు అలా ఎదిగిన వారేనని తెలుస్తూ ఉంది.

  • మీ సాహిత్య పయనంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను

  • గంటేడ గౌరునాయుడు పేరు వినడం, ఆయన కథలు ఒకట్రెండు చదివి అబ్బురపోవడం తప్ప, వివరాలేవీ తెలియవు నాకు. ఇప్పుడు ఆ రచయిత మాటల్లోనే వినగలగడం చాలా సంతోషంగా ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు