మంటో మెరుపు కథలు

మంటో మెరుపు కథలు

చేతులలో కర్రలు పట్టుకుని నలభై యాభై మంది వున్న ఓ గుంపు పట్టుదలగా ఆ పెద్ద యింటి వైపు వస్తూ వున్నారు, వారి వుద్దేశ్యం ఆ యింటిని లూటీ చెయ్యడమే నని తెలుస్తూనే వుంది.

హఠాత్తుగా వారందరినీ తోసుకుంటూ ఓ సన్నటి మధ్యవయస్కుడు రాజకీయ నాయకుడిలా చేతులూపుతూ బిగ్గరగా “అన్నదమ్ములారా !” అంటూ మొదలు పెట్టి,  పేరొందిన వ్యక్తిలా అభినయిస్తూ “ఈ యింటిలో ఎన్నో విలువైన వస్తువులున్నాయి, అవన్నీ తీసుకుని అందరం సరిసమానంగా పంచుకుందాం రండి” అన్నాడు.

అంగీకారంగా కర్రలు పైకిలేచి గాలిలో ఊగిసలాడాయి, బిగించిన పిడికిళ్లు పైకి లేచాయి, పెద్ద గొంతుకతో ఆ సలహాను ఆమోదించాయి.

ఆ సన్నపాటి వ్యక్తి నాయకత్వంలో అందరూ కలిసి ఆ యింటి తలుపులను అన్ని వైపుల నుంచి మూసివేయడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ ఆ యింటి ముఖద్వారం వద్దకు చేరుకోగానే ఆ సన్నపాటి వ్యక్తి మళ్లీ

“అన్నదమ్ములారా ! ఇక్కడ వున్నదంతా మీకే చెందుతుంది అందువల్ల అసహన పడనక్కర్లేదు, ఎవరేమి  తీసుకుందాం అని మనలో మనం కొట్టుకోనక్కర్లేదు,పదండి” అన్నాడు.

“కానీ తలుపుకి తాళం వేసి వుంది” అని ఒకడు గుంపులోంచి అరిచాడు.

కర్రలు పైకిలేచి గాలిలో ఊగిసలాడాయి. బిగించిన పిడికిళ్లు పైకి లేచాయి. . పెద్ద గొంతుకతో ఆ సలహాను ఆమోదించాయి.

ఆ సన్నపాటి వ్యక్తి పెదవులపై నీరసమైన నవ్వుని ప్రదర్శిస్తూ, సైగలతోనే లూటీ చేసే గుంపును నిశ్శబ్దంగా వుండమని చెబుతూ “అన్నదమ్ములారా ఈ తాళం చెవి సహాయంతో తాళం తీసి తలుపు తెరుస్తాను” అన్నాడు. ఆ తర్వాత జేబులోంచి తాళం చెవుల గుత్తిని తీసి జాగ్రత్తగా ఓ తాళం చెవి తీసి, తాళం తెరవగానే తలుపులు జారుతూ వెనుకకు వెళ్ళాయి, వెంటనేవెంటనే ఆ గుంపు పిచ్చి ఉత్సాహంతో ముందుకురికింది.

ఆ సన్నపాటి వ్యక్తి తన ముంజేతి చొక్కాతో నుదురు తుడుచుకుంటూ “అన్నదమ్ములారా! మెల్లగా వెళ్ళండి. అన్ని వస్తువులూ మీకు దొరుకుతున్నప్పుడు ఇలా తొందర పడ్ఢంలో ఏమైనా అర్దముందా?” అన్నాడు.

ఈ మాటలు విన్న వెంటనే అవి ఓ మంత్రంలా క్షణం పాటు ప్రభావం చూపి ఒకరి వెనుక ఒకరు వరుసగా వెళ్లినా,గది లోపలకు  చేరుకున్నాక కట్టుబాట్లు తెంచుకుని నిరంకుశంగా, అత్యాశకలవారిలా ప్రవర్తించసాగారు‌.

బాధ మిళితమైన స్వరంతో ఆ సన్నపాటి వ్యక్తి”అన్నదమ్ములారా! మనం సున్నితంగా మెలగాలి. ఒకరి చేతిలో వస్తువు యింకొకరు లాక్కోవడం గానీ దాని కోసం కొట్లాడుకోవటం గానీ చెయ్యాల్సిన అవసరం లేదు. మనందరం పరస్పర సహకారంతో పనిచేద్దాం. ఒకరి చేతికి ఏదైనా విలువైన వస్తువు దొరికితే దాని గురించి యింకొకరు అసూయ పడవద్దు. ఇది చాలా పెద్ద యిల్లు. మీ అందరికీ ఏదో ఒక విలువైన వస్తువు దొరక్కుండా పోదు. ఆటవికులలా ప్రవర్తించడకుండా వుంటే మీ అందరికీ ఏదో ఒక వస్తువు చేజిక్కుతుంది లేదంటే మీకు చేతికి దొరికిన వస్తువు విరిగి ముక్కలవుతుంది, అది మీకే నష్టం” అన్నాడు.

గుంపులో ఈ సారి క్రమశిక్షణ పరిఢవిల్లింది. ఒక పద్దతిలో మెల్లగా ఆ యింటిలో విలువైన వస్తువులన్నీ ఖాళీ అవ్వసాగాయి. మధ్య మధ్యలో ఆ సన్నపాటి వ్యక్తి ఏదో ఒక సలహా యిస్తూనే వున్నాడు.

“చూడూ ఓ స్నేహితుడా ! ఆ రేడియోను మెల్లగా పైకి లేవనెత్తు లేదంటే నాశనమవుతుంది, పక్కనే వున్న దాని ఏంటీనాను వదిలేయకు”

“ఇది ఏనుగు దంతాలు కలపలో  అమర్చి దానిపై నగిషీలు చెక్కిన మంచి టేబులు. దీన్ని చక్కగా మడిచేయనూ వచ్చు. ఇదిగో ఇలా!”

“చూసుకోండి! ముందు నన్ను ఈ యింటి మెయిన్ స్విచ్చు  ఆపేయనివ్వండి లేకుంటే మీకు కరెంటు షాకు తగిలే ప్రమాదం వుంది”

ఒక గదిలో లూటీ చెయ్యటానికి నలుగురు మనుషులు  తానులుగా చుట్టపెట్టి వున్న సిల్కు గుడ్డ కోసం తగువులాట జరుగుతోంది. ఆ సన్నపాటి వ్యక్తి వారిని మందలిస్తూ “మీరు దీన్ని చింపి పోగులు పెట్టేలా వున్నారు. ఈ యింటిలో వెతికితే ఏదో మూల కత్తెర, బట్టలను కొలిచే టేపు దొరక్కపోదు. వాటిని వెతికి గుడ్డను కొలిచి నలుగురూ సమంగా పంచుకోండి” అన్నాడు.

హఠాత్తుగా మొరుగుతున్న ఓ కుక్క గొంతు వినపడింది, వెను వెంటనే మెరుపులా ఆల్సేషియన్ కుక్క  గదిలోకి ప్రవేశించి ఆ నలుగురు ఆగంతకులపై దాడి చేసి వారిని నేలకరిపించింది.

ఆ సన్నపాటి వ్యక్తి “టైగర్  టైగర్” అని అరిచాడు. ఆ నలుగురిలో బాగా బెదిరి పోయిన ఆగంతుకుడి మెడను కొరికేద్దామని ఉరకబోతున్న టైగర్ అతడిని వదిలేసి, అతడి కాళ్ళ మధ్య నుంచి తోకాడిస్తూ నేలకేసి చూస్తూ ఆ సన్నపాటి వ్యక్తిని చేరుకుంది. టైగర్ దాడిచేసిన ఆగంతుకుడు తప్ప మిగిలిన ముగ్గురూ అప్పటికే పారిపోయారు.

ఆ ఒంటరి ఆగంతుకుడు, సన్నపాటి వ్యక్తిని పరిశీలనగా చూస్తూ “నీవెవరు?” అని అడిగాడు.

“నేను ఈ యింటి యజమానిని” అని నవ్వుతూ “సరే కానీ చూసుకో! లేకుంటే నీ చేతిలో వున్న ఆ ఖరీదైన గాజు పూల కుండీ జారిపోగలదు జాగ్రత్త” అన్నాడు. ‌

 

అద్బుతాల మనిషి

———————-

లూటీ చేసిన వస్తువులను జప్తు చేసుకోవటానికి పోలీసులు యిళ్ళన్నిటినీ ఒక్కొక్కటిగా సోదా చేస్తున్నారు. భయం కొద్ది ప్రజలు తాజాగా దొంగిలించిన వస్తువులను చీకటి పడగానే కిటికీలగుండా బయటకు జారవిడుస్తున్నారు. కొందరైతే చట్టం సంకెళ్ళు నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో న్యాయంగా సంపాదించుకున్న వస్తువులను సైతం వదిలేస్తున్నారు.

ఓ వ్యక్తికి మాత్రం సమస్య వచ్చిపడింది. తను పొరుగునే వున్న ఒక కిరాణా దుకాణం లూటీలో  చిందరవందర అవుతూండగా

ఎలాగో రెండు పంచదార మూటలను  యింటిలోకి చేర్చుకోగలిగాడు. ఒక రోజు రాత్రి వేళ ఎలాగో కష్టపడి ఆ రెండు మూటలనూ వీధిలో దగ్గరగా వున్న బావి వరకూ లాక్కువెళ్ళాడు. ఒక మూటను ఎత్తి నూతిలోనికి సులువుగానే జారవిడచగలిగాడు కానీ రెండో మూటను బావిలోకి జారవిడుస్తూండగా పట్టుతప్పి తనూ బావిలో పడిపోయాడు.

అతడు లోపలినుంచి అరచిన అరుపులకు కొందరు మేల్కొని వచ్చి బావిలోకి తాళ్ళు జారవిడిచినా లాభం లేకపోయింది. చివరికి ఎలాగైతేనేం యిద్దరు యువకులు కష్టపడి బావిలోంచి

అతన్ని పైకి లాగినా, బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఆ వ్యక్తి మరణించాడు.

మరుసటి రోజు ఉదయం ప్రజలు ఆ బావిలోంచి నీరు తోడిన తరువాత వారికి ఆ నీళ్ళు తియ్యగా వున్నాయని తెలిసింది.

ఆ రోజు రాత్రి ఆ అద్బుతాల వ్యక్తి సమాధి దగ్గర ప్రార్థనలతో  పాటు దీపాలు కూడా వెలిగించబడ్డాయి.

 

దయవుంచి

————–

మతపరమైన అల్లర్లు చేసే  దుండగుల గుంపు ముందు ఓ వ్యక్తి దీనంగా:

“దయవుంచి మా అమ్మాయిని నా ముందే చంపకండి”

“సరే! సరే! ఆ అమ్మాయి బట్టలన్నీ వూడదీసి మిగతా అమ్మాయిలతో పాటు తోసేయండిరా !”

 

********** ‌

 

Avatar

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు