నువ్వు నడిచిన నీలం రంగు దారి
కాలు కాలిన పిల్లిలా తిరుగాడుతుంది
విరామ చిహ్నాలు లేని కాలం
ఇప్పుడు నూరుతుంది కరవాలం
బొగ్గులవేడి చెంబుతో
‘ ఐరని’ అంగీలాగును ఐరన్ ఇస్త్రీ చేసినట్టు
ప్రవహించే సెలయేరు ఇరు తీరాలు
జీవకళతో ఉప్పొంగి పొర్లుతుంది
ఎల్లప్పుడూ జేబులో
కన్నీళ్లతో పులి పచ్చి అయిన దస్తీ
తడి ఆరని హృదయం చుట్టూ
గస్తీ నిషాన్ తిరుగుతూ
దున్ని గొర్రు కొట్టిన పొలంలా
నాటేయడానికి సిద్ధం చేస్తుంది
ఉదయాస్తమయాలు
దోస్తులతో చాయ్ తాగుతూ
మధ్య మధ్య మస్తు రాశికి రాని మాటలు
పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తుంటాయి
దారంతా రెపరెపలాడుతున్న జెండాలు
వెలవెల పోతున్న ఎజెండాలు
వేపకాయల్లాటి జ్ఞాపకాల
కాగడాల ఊరేగింపు
గాలినీ నిప్పును నీరును
నేలను మనుషులని ఒరుసుకొని
కడలిలా కదిలిపోతుంది
కొన్ని పరిశుద్ధ వాక్యాలు
టినో పాల్ లో ముంచి తీసినట్టు
బుగ్గ బుగ్గోలె శుభ్రపరుస్తుంది
ఒక రాత్రి పీడకలలోంచి లేచి
బిత్తర చూపులు చూస్తూ మెలకువలోకి వస్తాను
మా ఆవిడ చూసి ఏమైందని
భుజం మీద చేయి వేసి గోముగా
గ్లాస్ లో నీళ్లు ఇస్తూ ఆందోళనగా అడుగుతుంది
మూసిన కనురెప్పల మీద
సీతాకోక చిలుక సంతకం చేసిన
కలను విప్పి చెప్పుకోలేక
మేలుకొలుపును ఒప్పుకోలేక
పరధ్యాన్నంగా ఏమి లేదంటాను
కకావికలైన స్వప్నాన్ని నెమరువేసుకొంటే
కళ్ళు చెలిమెలు అవుతాయి
నువ్వు ప్రేమించిన బాట పొడుగునా
ఒకానొక శిశిర రుతువు
క్రతువులా వెంటాడుతుంది
పునరావాసం ఇంట్లో ఇమడలేక
ఒక ముంపు గ్రామం పచ్చని
యాదులను మోసుకు తిరుగుతూ ఉంటావు
కాలం కుబుసం విడిచిన పాము
నిరంతరం చేయాలి కత్తి సాము
ఏమరుపాటుంటే కాటేస్తుంది సుమా
వస్తువు కంఠంలో ప్రైస్ ట్యాగ్
సూపర్ బజార్ రాక్ లో సర్దిన
జీవితం ఒకానొక టెట్రా ప్యాక్
చివరి విందులో సంతాప
సంగీతాన్ని ప్రసారం అవుతుంది
అ అంటే అడవి
ఆ అంటే ఆయుధం నుంచి
అ అంటే అమ్మ
ఆ అంటే ఆవు
బొడ్డు పేగు తెగిపడిన
అక్షరాలను దిద్దుకుంటుంటావు
తడబడుతున్న అడవుల నడక
కాంతి కోల్పోపోతున్న ముక్కు పుడక
*








Add comment