“నీలి మేఘాల”కు 30 ఏళ్ళు!!

తొలి స్త్రీవాద కవిత్వ సంపుటి “నీలి మేఘాలు” ప్రచురణకి 30 ఏళ్ల వేడుక జరుగుతున్న సందర్భంగా–

హైదరాబాద్‌లో అక్టోబరు 3న నీలిమేఘాలు ఆవిష్కరణ సభ. తప్పకుండా రమ్మని ఓల్గా గారు పిలిచారు. ఆ మాట వినగానే మనసులో అనేక జ్ఞాపకాల పరిమళాలు. 30 ఏళ్ళ కిందట అదే తారీఖున హైదరాబాదులో జరిగిన ‘నీలిమేఘాలు’ ఆవిష్కరణ సభ గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత విజయవాడలో గూడా లంకా అన్నపూర్ణగారి అధ్యక్షతన ‘నీలిమేఘాలు’ ఆవిష్కరణ సంరంభం మనసులో ఒకసారి మెదిలింది.

నన్నయ నుంచి ఆధునిక యుగం వరకు కవులంతా పురుషులే. కవయిత్రుల పేర్లు లేవు. పురాణయుగం, ప్రబంధయుగం, భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం ఇన్నిట్లో కూడా ఒక స్త్రీ పేరు కనిపించదు. మొల్ల, ముద్దుపళని, రంగాజమ్మ వీరున్నారు. కానీ వీరి పేర్లెవరూ చెప్పరు.

నేను కాలేజీలో చదువుతున్నపుడు మా మాష్టారు ‘కవులందరు పురుషులే’ అన్నారు. నేను లేచి ‘మొల్ల, ముద్దుపళని, రంగాజమ్మ’ వీళ్ళు కవయిత్రులే గదా’ అని అన్నాను. ‘ఐతే ఆ తర్వాత పేరు చెప్పు’ అన్నారు. నేను మౌనం వహించాను.
80ల నుంచి స్త్రీవాద ఉద్యమం మొదలయింది. రేవతీదేవి ‘అనురాగ దగ్ధసమాధి’ 1981లో, సావిత్రి ‘బందిపోట్లు’ 84లో వచ్చాయి. తెలుగు కవిత్వాన్ని ఒక్క కుదుపు కుదిపింది స్త్రీవాద కవిత్వం.

పితృస్వామ్య సమాజంలో స్త్రీ ఇప్పటికీ రెండవ తరగతి పౌరురాలే. వివాహాలు, సంతానం, లింగవివక్ష ఇవన్నీ స్త్రీల జీవితాలను అతలాకుతలం చేసాయి. వీటన్నిటి మీద కవయిత్రులు ప్రశ్నలు సంధించారు. ఆధిపత్యాన్ని ధిక్కరించారు. అహంకారాన్ని ప్రశ్నించారు. ఆకాశంలో సగం అంటూనే స్త్రీలకు వ్యక్తిత్వం లేకపోవడాన్ని పాతివ్రత్యం సంకెళ్లలో బంధించడాన్ని, నియమాల నిషేధాల పంజరాల్లో ఊపిరాడకుండా చేస్తున్న వ్యవస్థపై నిప్పులు కురిపించారు. ఆగ్రహ జ్వాలల్ని ప్రకటించారు.

సంతానం ఉన్న స్త్రీలకే సమాజంలో గౌరవం. మాతృత్వంలో ఉన్న గొప్పదనాన్ని వేనోళ్ళ పొగడినపుడు పిల్లల్ని కనడం ఎంత బాధాకరమో ‘లేబరు రూం’లో చూపించారు. ఆ నరకాన్ని త్రిడిలో కళ్ళకు కట్టించారు. స్త్రీపురుషులు సమానమంటూనే వంటగది స్త్రీలకు, ముందుగది పురుషులకు కేటాయించడాన్ని ‘వంటిల్లు’ కవితలో తూర్పారబట్టారు. దాంపత్యంలోని లొసుగుల్ని ‘దాంపత్యం’ ‘తెల్లారకట్ల కివతల’ ‘సర్పపరిష్వంగం’ లాంటి  కవితలు నిర్దాక్షిణ్యంగా విప్పి చెప్పాయి. కవయిత్రులందరు తమ కలాలకు పదును పెట్టారు.

అంతకుముందు ప్రబంధ యుగంలో కవులందరు స్త్రీలకు శరీరాలు తప్ప మరేమీ లేవని అంగాంగ వర్ణన చేసారు. భావకవులు స్త్రీలను ఊర్వశులుగా, ప్రేయసులుగా భావించారు. మాతృదేవతలుగా భక్తితో కొలిచారు. కానీ ఎక్కడా స్త్రీలను తమతోపాటు మనుషులుగా చూడలేదు.

‘ఆమె కన్నులలో అనంతాంబరపు నీలినీడలున్నాయని’ అన్న కవి ఆమె మనసులోని ఆరాటాన్ని, బాధని, వేదనని గ్రహించలేక పోయారు. అందుకే కవయిత్రులు తమ బాధల్ని, వేదనలను, అణచివేతను, అవమానాన్ని అక్షరీకరించారు. కేవలం తమవైన అనుభవాలను, అనుభూతులను గొంతువిప్పి, మనసు విప్పి చెప్పారు. పితృస్వామ్య సమాజం ఆధిపత్యాన్ని తీవ్రంగా నిరసించారు. కొరడా దెబ్బల్లాటి కవితలను సృష్టించారు. ఆ సందర్భంలోనే స్త్రీలందరూ రాసిన కవితలను సంపుటిగా తేవాలని ఓల్గాగారు సంకల్పించారు. అందరినీ కవితలు పంపమని అడిగారు. ‘నీలిమేఘాలు’ పేరుతో కవితా సంపుటి తేవాలనుకొన్నారు. అంతకుముందే కొందరు రాసిన కవితలపై పెద్ద దుమారం చెలరేగింది. ‘లేబరు రూం’, ‘అబార్షన్‌ స్టేట్‌మెంట్‌’, ‘కాల్‌గర్ల్స్‌ మొనొలాగ్‌’ గురించి విమర్శలు వచ్చాయి. ‘ఒళ్ళు బలిసిన మధ్యతరగతి యువతుల కవితలు’ అని వార కవితలు, నీలి కవితలు అని ధ్వజమెత్తారు.

వీటన్నిటికి సమాధానంగా ‘క్ష్రుద్రానందం’, ‘నీలికవితలే రాస్తాం’, ‘ఔను మేం గయ్యాళులమే’, ‘సోమిదేవమ్మలు మరి సాహిత్యంలో కన్పించరని’, ‘పాతరోత’ మొదలైన కవితల ద్వారా సమాధానాలు చెప్పారు.

ఈ సంపుటి తేకముందే హైదరాబాదులో స్త్రీవాద కవితలు రాసిన కవయిత్రులతో పెద్ద సభ పెట్టారు. ఆ తరువాత బహిరంగ సభ నిర్వహించారు. దానిలో పురుషులకూ ప్రవేశం ఉంది. చేరా, కాళోజీగార్లు పాల్గొన్నారు. ఆ తర్వాత కవయిత్రులందరూ కవితా పఠనం చేసారు. ఆ సందర్భంగా ఒక స్త్రీవాద కవితా సంకలనాన్ని తీసుకురావాలని అస్మిత అనుకొంది. ఆ సమయంలో వచ్చిన స్త్త్రీవాద కవితా సంకలనమే ‘నీలిమేఘాలు’.

‘నీలిమేఘాలు’ రాకముందు త్రిపురనేని శ్రీనివాస్‌ ‘గురిచూసి పాడేపాట’గా మొదటి స్త్రీవాద సంకలనాన్ని ప్రచురించారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో రెండు సంకలనాలలోనూ నా కవితలు ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ‘నీలిమేఘాలు’ లో నా కవితలు ‘సర్పపరిష్వంగం’, ‘ద్విపాత్రాభినయం’, ‘సర్దుకుపో’, ‘నీలికవితలే రాస్తాము’ 4 కవితలు ఉన్నాయి.
మొదట ‘సర్పపరిష్వంగం’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ‘ఈ వారం కవిత’ శీర్షికలో ప్రకటించబడింది. ఆ తర్వాత ‘సర్పపరిష్వంగం’లో శిల్పస్పర్శ’ అని చేరాగారు చేరాతల్లో రాసారు. చేరాతల్లో వచ్చాక ‘సర్పపరిష్వంగం’ కవితకు విశేష ప్రాచుర్యం వచ్చింది. ఇంగ్లీషు, హిందీ, కన్నడం, మళయాళం భాషల్లో అనువదింపబడి విమర్శకుల ప్రశంసలు పొందింది.

స్త్రీవాద కవిత్వాన్ని మొదటి నుంచి ప్రోత్సహించింది చేరాగారే. స్త్రీవాద కవితల్లో చాలా కవితలు ఆంధ్రజ్యోతిలో వచ్చినవే. ఆ కవితల లోతుపాతులను చేరా తన చేరాతల్లో వివరించారు. ఈ వారం కవితలుగాని, చేరాతలు గానీ ఆ రోజుల్లో సంచలనం తీసుకువచ్చాయి. కవులకు తమ కవితలు ‘ఈ వారం కవిత’ శీర్షికలో గానీ, చేరాతల్లో గానీ వస్తే పండగే. ఆ కాలంలో నిజంగా స్రీవాద కవిత్వం ఉజ్వలంగా వెలగిన కాలం. ఆ కాలంలో నేనూ రాసినందుకు, నీలిమేఘాల్లో నా కవితలు ఉన్నందుకు ఈ పోరాట సందర్భంలో నా అడుగు ఉన్నందుకు నేనెంతో గర్విస్తున్నాను.

అప్పటి వరకు మగాళ్ళ ఆధిపత్యం కింద ఉన్న కవిత్వాన్ని తమ వంతు చేసికొని తమదైన ముద్రవేసిన సాటి, తోటి కవయిత్రులందరకు నా అభినందనలు. ఒక చారిత్రక సందర్భమైన, ఒక అస్తిత్వ కవితా సంపుటి ఒకప్పుడు సంచలనం కలిగించిన కవితా సంపుటిని మూడు దశాబ్దాల తర్వాత పునర్ముద్రించడం ఒక అవసరం. సముచితం. ఈ గొప్ప పనిని చేపట్టిన అస్మిత సంస్థకు దాని బాధ్యులు వోల్గా, వసంత కన్నభిరాన్‌ గారికి ఎన్నో ఎన్నో అభినందనలు.

‘నీలిమేఘాల్లో’ నా కవితల్ని ప్రచురించినందుకు ఈ ఉద్యమంలో నేనూ పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాను. 3వ తారీఖు జరగబోయే ‘నీలిమేఘాలు’ ఆవిష్కరణ సభలో హాజరయే చారిత్రక సందర్భానికి, ఆ సభాపర్వంలో పాలుపంచుకోవడానికి ఎదురు చూస్తున్నాను.

*

 

మందరపు హైమవతి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “పితృస్వామ్య సమాజంలో స్త్రీ ఇప్పటికీ రెండవ తరగతి పౌరురాలే. వివాహాలు, సంతానం, లింగవివక్ష ఇవన్నీ స్త్రీల జీవితాలను అతలాకుతలం చేసాయి. వీటన్నిటి మీద కవయిత్రులు ప్రశ్నలు సంధించారు. ఆధిపత్యాన్ని ధిక్కరించారు. అహంకారాన్ని ప్రశ్నించారు. ఆకాశంలో సగం అంటూనే స్త్రీలకు వ్యక్తిత్వం లేకపోవడాన్ని పాతివ్రత్యం సంకెళ్లలో బంధించడాన్ని, నియమాల నిషేధాల పంజరాల్లో ఊపిరాడకుండా చేస్తున్న వ్యవస్థపై నిప్పులు కురిపించారు. ఆగ్రహ జ్వాలల్ని ప్రకటించారు.”

    “‘నీలిమేఘాల్లో’ నా కవితల్ని ప్రచురించినందుకు ఈ ఉద్యమంలో నేనూ పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాను. 3వ తారీఖు జరగబోయే ‘నీలిమేఘాలు’ ఆవిష్కరణ సభలో హాజరయే చారిత్రక సందర్భానికి, ఆ సభాపర్వంలో పాలుపంచుకోవడానికి ఎదురు చూస్తున్నాను.

    ‘నీలిమేఘాలు’ స్త్రీవాద కవితాసంపుటి మళ్ళీ ప్రచురిస్తున్న ఓల్గా తదితరలున్న అస్మితా కు అభినందనలు.

    ఇంత బాగా నీలిమేఘాలు ను వివరించిన హైమవతి హరికి అభినందనలు

  • మహిళల గురించి మరుగునపడిన
    ఆనాటి మహిళలు రాసిన కవితల ప్రస్తావం చాలా బాగా వర్ణించారు అభినందనలు…..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు