నిరక్షరాస్యుల దాకా పుస్తకాల్ని తీసుకెళ్ళాం: పి .సి.జోషి

ఒక వేలు మరొక వేలుని అణచివేయదు. సమయం వచ్చినప్పుడు అన్నీ కలిసి పనిచేస్తాయి. పిడికిలి బిగిస్తాయి!  అది నా విశ్వాసం!

ఇంట్రో.. 

చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యలు దక్కేవారు కాదు. అతడు నోరు విప్పితే. వారు అజ్ఞాతంలో ఉన్న స్థావరం అతడికి తెలుసు. మాకు చిక్కాడు. కాల్చేందుకు కానిస్టేబుళ్ళు నిరాకరించారు. నేను కాల్చవలసి వచ్చింది. చనిపోతూ పార్టీ నినాదాలిచ్చాడు.   

పేరేప మృత్యుంజయుడుని 1950 మే 16వ తేదీల రాజమండ్రి సమీపంలో సారంగధర మెట్ల దగ్గర ఎస్.ఐ.తనికెళ్ళ సుబ్బారావు కాల్చారు. రిటైరైన తర్వాత ప్రముఖ ఫొటోగ్రాఫర్ జి.ఎస్.భూషణ్ తో తనికెళ్ళ సుబ్బారావు స్వయంగా పైవిధంగా అన్నారు. ‘చావుకు వెరవకురా’ అనే స్వీయరచనను స్ఫూర్తిదాయకంగా వేలాది వేదికలపై పాడారు మృత్యుంజయుడు. ఈ పాటలా జీవించారు. ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులెందరో తమ బిడ్డలకు ఆయన  పేరుపెట్టుకుంటున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ సమీపంలోని రిక్షా కార్మికులు తమ కాలనీని మృత్యుంజయనగఋ పేరుతో  అలంకరించుకున్నారు. ఆ పేరుతో నర్సాపురంలో ఒక వీథి, గ్రంధాలయం ఉన్నాయి. మృత్యుంజయుడి కథ ప్రదర్శించినప్పుడల్లా పాలకొల్లు బాలికల బుర్రకథ దళం కన్నీటి కాల్వలు పారించేది.      

మృత్యుంజయుడు తన కుమారులలో ఒకరికి తన మిత్రుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధమ ప్రధాన కార్యదర్శి పూరన్ చంద్ జోషి (పి.సి.జోషి) పేరు పెట్టారు. పిపిసి జోషిగా అందరికీ తెలిసిన పేరేప పూర్ణచంద్ర జోషిని కలిసేందుకు ఆయన ఇంటికి బయలుదేరారు మిత్రులు శివాజీ, అనిల్ బత్తుల, పున్నా కృష్ణమూర్తి. ఎందుకు? సోవియటే లేదు. ఇంకెక్కడి సాహిత్యం అని కొందరైనా అనుకునే వాతావరణంలొ  రాదుగ ప్రచురణాలయం తెచ్చిన ఆనాటి రష్యన్ సాహిత్యాన్ని అనిల్ బత్తుల డిజిటలైజ్ చేసి సోవియట్ తెలుగు పుస్తకాలు అనే బ్లాగ్ ద్వారా అందరికీ అందుబాటులోకి తెస్తున్నాడు. 

పుప్పాలగూడ పేరుకుతగ్గ ప్రాంతం. అలకాపూర్ టౌన్ షిప్ లో శివాలయం పక్క వీథి.  రావి, వేప చెట్ల నీడలో, పున్నాగపూల పరిమళంలో నడక.  దారి చూపేందుకు జోషీ గారి శ్రీమతి ఎదురు వచ్చారు.  గుమ్మంపై వెదురు అద్దిన చైనా దేశపు వాటర్ కలర్ పెయింటింగ్ రంగుల రాగాలను వీస్తొండగా సోవియట్ సాహిత్యం పూర్వాపరాలను జోషీగారు వివరించారు. 

~

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి పి.సి.జోషి చొరవతో 1936లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (పి.డ్బ్యు ఎ) ఏర్పడింది. మంటో, మున్షి ప్రేంచంద్, కిషన్ చందర్, ఇస్మత్ చుగ్తాయ్ తదితరులు సభ్యులు. అంతకు రెండేండ్ల   క్రితమే లండన్ లో ముల్కరాజ్ ఆనంద్, సజ్జాద్ జాహిర్, జ్యోతిర్మయి ఘోష్ లు పి.డబ్యు.ఎ ని స్థాపించారు.   వ్యక్తి అనుభవించే కష్టాలకు వ్యక్తి కారణం కాదని, నిగూఢమైన వ్యవస్థ అని రచయితలు రాజకీయ చైతన్యాన్ని పొందారు. నవయుగాన్ని స్వప్నించారు. వాస్తవిక ఇతివృత్తాలతో పాత్రలతో సామాజికమార్పుకు దోహదపడే రచనలకు శ్రీకారం చుట్టారు. వీరందరికీ ప్రేరణ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, (యు.ఎస్.ఎస్.ఆర్) ఆవిర్భావం. సుబ్రమణ్యభారతి, అల్లమా ఇక్బాల్, ఖాజి నజ్రుల్ ఇస్లాం లు సోవియట్ అవిర్భావాన్ని స్వాగతించారు. శ్రీశ్రీ గర్జించు రష్యా అన్నారు. ఈ వాతావరణంలొ 1942లొ తెనాలిలో అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.

వలస పాలనల నుండి, పెట్టుబడిదారుల, భూస్వాముల పాలనలనుండి ఇతర శ్రామిక ప్రపంచం విముక్తం కావాలని సోవియట్ భావించింది. ఇందుకు అవసరమైన సైద్ధాంతిక, సామాజిక, వైజ్ఞానిక సాహిత్యాన్ని అందించేందుకు సొవియట్ రాజధాని మాస్కోలో 1930 లో ప్రోగ్రెస్ పబ్లిషర్స్ (ప్రగతి ప్రచురణాలయం) స్థాపించారు. మొదట్లో ఇంగ్లీష్ లో, ఇతర యూరోపియన్ భాషల్లో మాత్రమే కమ్యూనిస్ట్ పార్టి సాహిత్యం ప్రచురించారు. 1953లో హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషలలో పుస్తకాల ప్రచురణ ప్రారంభమైంది. అమెరికాలో పి.హెచ్.డీ చేసిన రసాయనిక శాస్త్రవేత్త కొలచల సీతారామయ్య సమసమాజ నిర్మాణంలో పాల్గొనేందుకు 1920 దశకంలో సోవియట్ వచ్చారు. ఆయన ద్వారా ప్రగతి ఇంగ్లీష్ విభాగంలొ పనిచేస్తొన్న స్వెత్లానా యానోవ్నాద్జేనిత్ కొంత తెలుగు నేర్చుకున్నారు. గిడుతూరి సూర్యం, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి 1957 డిసెంబర్ లో మాస్కో వెళ్ళారు. సుతయేవ్ రచన ‘ఎవరు మ్యావ్ అన్నారు?’ పుస్తకాన్ని వీళ్ళు  ప్రగతి ప్రచురణాలయం తరపున తొలిసారిగా తెలుగులో సోవియట్ లో ప్రచురించారు.

అంతకుముందు తెలుగులో కమ్యూనిస్ట్ పార్టీ సాహిత్యం లేదా? రష్యన్ సాహిత్యం లేదా? ఉన్నాయి. అభ్యుదయ రచయితల సంఘం (పి.డబ్యు.ఎ) లండన్ లో కూడా ఏర్పడకముందే 1933 లోనే పుచ్చలపల్లి సుందరయ్య తెలుగులో కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను అనువాదం చేసారు.

ఆ ప్రతిని సైక్లోస్టైల్ చేసి కార్యకర్తలకు పంచారు. ప్రగతి కంటే ముందే సోవియట్ సాహిత్యాన్ని తెలుగులోకి తెచ్చిన మొదటితరం వ్యక్తి గద్దె లింగయ్య. ఆయన ఆదర్శ గ్రంధ మండలి ద్వారా తెలుగులో మగ్జీం గోర్కీ అమ్మను 1934లోనే ప్రచురించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న క్రొవ్విడి లింగరాజు 1932-33లో జైలులో ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసారు. ఈ పుస్తకం చదివినవారు కమ్యూనిస్టులు అవుతారనే భయంతో బ్రిటీష్ ప్రభుత్వం అమ్మను నిషేధించింది. జనాభిప్రాయానికి తలవొగ్గి రాజాజీ నిషేధం తొలగించారు.

సరే. సోవియట్ లో ప్రచురితమైన తెలుగు పుస్తకాల గురించి వద్దాం. స్వెత్లానా భారతీయభాషలలో తెలుగును స్పెషలైజ్ చేసారు. గిడుతూరి సూర్యం, జొన్నలగడ్డలకు రాజకీయ, సాహిత్యరంగాల్లో అనుభవంలేని కారణంగా తిరిగి వచ్చేసారు. 1958 లొ జర్మనీ నుంచి ఉప్పల లక్ష్మణరావు సీతారామయ్యగారి చొరవ కారణంగా అనువాదకునిగా మాస్కో వెళ్ళారు. 12 సంవత్సరాల మాస్కో మకాంలో మార్క్స్, ఎంగెల్స్ రచనలను, నవలలు, కథలను ఉప్పల అనువదించారు. సోవియట్ తెలుగు పుస్తకాల ప్రచురణల్లో ఇదొక ప్రధాన ఘట్టం. రష్యన్ విద్యార్థినీ విధ్యార్థులకు తెలుగు నేర్పడం, వారి ద్వారా రష్యన్ పదాలకు సరైన వ్యావహారిక అర్థాలను రాబట్టడం, ఉభయభాషల నిఘంటువులను ప్రచురించడంతో తెలుగు పుస్తకాల ప్రచురణ బాలారిష్టాలను దాటే సాధన చేస్తొంది. అనువాదాలు ముతకగా ఉంటున్నాయి, తెలుగుదనానికి దూరంగా ఉంటున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వెత్లానా 1969 లో తొలిసారి, 1976లో రెండవసారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. మాస్కోలో కొందరు తెలుగువారితో పరిచయాలుండటం వేరు. తెలుగు ప్రాంతం వచ్చి ఇక్కడి ప్రజలతో కలసి కొన్నాళ్ళయినా గడిపి, ఆచార వ్యవహారాలు, మాండలికం తెలుసుకోవడం వేరు కదా. స్వెత్లానా ప్రొద్దుటూరు వెళ్ళి రాచమల్లు రామచంద్రారెడ్డిని (రారా) కలిసి రష్యాకు ఆహ్వానించారు. రారా నాలుగేళ్ళ మాస్కో ఉద్యోగంలో తేటతెలుగు పుస్తకాలు ఎన్నో వచ్చాయి. తెలుగు నుంచి రష్యను లోకి కూడా అనువాదాలు మొదలయ్యాయి. ఆర్వీయార్ మాస్కో వెళ్ళాక పిల్లల పుస్తకాలు, సృజనాత్మక సాహిత్యం తెలుగులోకి విరివిగా తెచ్చారు. రష్యన్ చరిత్ర కథలు గాథలు పుస్తకాన్ని పాఠకులు రికార్డు స్థాయిలో కొన్నారు. (1980 నుంచి ప్రగతి ప్రచురణాలయం రెండుగా అంటే ప్రగతి ప్రచురణాలయం – రాదుగ అనే సంస్థలుగా ఏర్పడింది. ఆర్వీయార్ రాదుగకు వెళ్ళారు. 1991 లో ప్రగతి, ఆ తర్వాత రెండు మూడేండ్లకు రాదుగ మూతపడ్డాయి)

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఏర్పడడానికి నేపథ్యాన్ని ఈ సందర్భంగా ముచ్చటించుకోవాలి. తెలంగాణ రైతాంగ సాయుధ విముక్తి పోరాటం అప్పటికి ప్రముఖమైనది. భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటీష్ వలస పాలనను వ్యతిరేకించింది. బ్రిటీష్ వారికి విశ్వసనీయుడైన హైద్రాబాద్ స్టేట్, ఏదవ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ గొప్ప పోరాటం చేసింది. ఈ క్రమంలో 1947 ఆగస్ట్ 15  వచ్చింది. భారత ప్రభుత్వం 1948 లో పోలీస్ ఏక్షన్ ద్వారా హైద్రాబాద్ స్టేట్ విలీనం చేసుకుంది. కమ్యూనిస్టుల్ని వెతికి వెతికి కాల్చి చంపింది.

1953 అక్టోబర్ 1 న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకతను గుర్తించి 1953లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ను పార్టీ స్థాపించింది.  విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పార్టీ సాహిత్యాన్ని ప్రచురించెందుకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది కానీ వైజ్ఞానిక, కాల్పనిక, బాల సాహిత్యాన్ని ప్రచురించడంలో శ్రద్ధ చూపలేదు అంటారు కొందరు విమర్శకులు. విశాలాంధ్ర యుద్ధభూమిలో ఉంది. భారతంలో ధర్మరాజు ద్రౌపదిని పందెం పెట్టిన రీతిలో 1955 ఎన్నికల సందర్భంలో తన పార్టీ సమస్త శక్తియుక్తులను పణంగా పెట్టింది. విశాలాంధ్రకు ముఖ్యమంత్రి సుందరయ్య అనుకున్నారు ప్రత్యర్థులు సైతం.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, శక్తులూ ఏకమైనాయి.   వీరందరికీ పెద్దన్న అమెరికన్ ప్రభుత్వం. ఇక్కడి అమెరికన్ ఎంబసీల్లో సీఐఏ మకాం వేసి ఉంది. వి.ఎస్.కృష్ణన్ వారి సంచాలకుడు. మేధావులలో చాలామంది కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టారు. 1948 వరకూ విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి రచయితలు అరసంతో కలిసి పనిచేసినవారే. తెలుగు భాషా సంస్కృతులను సరళ వ్యాహారిక భాషలో పాఠకులకు అందుబాటులోకి తేవాలనే అరసం సంకల్పంలొ పాలుపంచుకున్నవారే. ఆ తర్వాత మానసికంగా విభజనకు గురయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం  చేసిన శ్రీశ్రీని అందరూ ఆడిపోసుకున్నారు. ఒక్క నార్ల చిరంజీవి మాత్రమే ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. కర్ణుడి చావుకి ఆరు కారణాలు అన్నట్లు కమ్యూనిస్ట్ పార్టి ఓడిపోయింది.

మేము చేసింది చేయకుండా ఉంటే? వీరేశలింగం సమాజంలో తెచ్చిన మార్పు కాదనగలమా? గురజాడ – గిడుగు రచనలు పాఠకులకు విస్తృతంగా లభించేవా? కమ్యూనిస్ట్ పార్టీ, సాహిత్యం లేకపోతే? చెప్పులు వేసుకుని వీథిలొ తిరిగే పరిస్థితులు లేని నికృష్తపరిస్థితుల నుంచి శ్రామికులు భూస్వామి ఎదుట తల ఎత్తుకుని తిరిగే పరిస్థితులు వచ్చేవా? సరే.. కమ్యూనిస్టులు చీలిపోలేదా అంటారు. కొత్త అస్తిత్వ సిద్ధాంతాలు రాలేదా అంటారు. అయిదు వేళ్ళు ఒక్కలాగ ఉండవు. ఉండాలనీ కోరుకోనవసరంలేదు. ఒక వేలు మరొక వేలుని అణచివేయదు. సమయం వచ్చినప్పుడు అన్నీ కలిసి పనిచేస్తాయి. పిడికిలి బిగిస్తాయి!  అది నా విశ్వాసం!

ఇతర భాషలలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందని గొప్ప రచయితలతో సోవియట్ అనువాదాలు చేయించుకున్న ఉదాహరణలున్నాయి. తెలుగులో అలా ఎందుకు జరగలేదు అని కొందరు మిత్రులు అంటారు. నేను విజయవాడలో ఉన్నరోజుల్లో విశనాథ సత్యనారాయణ వారానికొకసారైనా విశాలాంధ్రకి వచ్చేవారు. ఫలానా రచన పుస్తకంగా వస్తే బావుంటుంది అని ఫలానావాడు అంటున్నాడు అనేవారు. నా పుస్తకాన్ని మీరు వేయండి అని ఏనాడూ కోరలేదు. ఇస్తే కదా అనేవాడిని. వ్యక్తిగత స్నేహాలు మచ్చలేనివి. రెండువైపుల నుంచి చొరవ ఉండేది కాదేమో!  ఈ సందర్భంలో ఒక దృష్టాంతం గుర్తొస్తుంది. మహాప్రస్థానం పుస్తకంగా రావడానికి చాలా ముందే శ్రీశ్రీ కవితలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీశ్రీ కవిత్వాన్ని విశ్వనాథ ఎంతగానో మెచ్చుకున్నారు. పుస్తకంగా తానే ప్రచురిస్తానన్నారు. చలం తాను ముందుమాట రాస్తానన్నారు. చలం తన మాట నిలుపుకున్నారు. మహాప్రస్థానాన్ని నళినీకుమార్ తొలిసారిగా ప్రచురించారు. ఆ తర్వాత విశాలాంధ్ర అనేక ప్రచురణలు తెచ్చింది. పార్టీ సాహిత్యంతో సంబంధంలేని పల్నాటి వీరచరిత్ర వంటి పుస్తకాలూ ప్రచురించాం. అయినా, విశాలాంధ్ర పుస్తకాల షాపులోకి సాధారణ పాఠకులు అంతగా అడుగుపెట్టేవారు కాదు. అది కమ్యూనిస్టుల షాపు అనేవారు.

యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) యు.ఎస్.ఏ (అమెరికా).. ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయింది. అది ప్రచ్చన్న యుద్ధకాలం. కేరళ ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్ ఎన్నికైన నేపథ్యంలో ఇండియాలో కమ్యూనిజం గాలులను అడ్డుకోవాలని అమెరికా ఫోర్డ్ ఫౌండేషన్ ను ప్రోత్సహించింది. దక్షిణాది భాషల్లో సాహిత్యాన్ని ప్రచురించడం మొదలుపెట్టింది. Gaither Study Committee Report ప్రకారం హెన్రీఫోర్డ్ ఏటా 4 లక్షల అమెరికన్ డాలర్ల వార్షిక బడ్జెట్ తో కమ్యూనిస్ట్ అలను వెనకకు నెట్టేందుకు బలమైన ప్రచారసాధనంగా  SLBT (Southern Languages book Trust)  ఏర్పాటైంది. ఉన్న ప్రచురణ సంస్థలు ఉచ్చులో పడటమేగాక ఎన్నో పుట్టిగిట్టాయి.

బహుశా ఈ పోటీని తట్టుకోగల దక్షత కమ్యూనిస్ట్ సంస్థాగత నిర్మాణంలో లేదు. రచయితలకు, ఆర్టిస్టులకు పోటీదారులతో పోలిస్తే గొప్పగా పారితోషికాలు ఇవ్వలేదు. పైగా కమ్యూనిస్ట్ వ్యతిరేకత అనే ఐక్యత వారికి అండగా ఉంది. వారికి వనరులు పుష్కలం. మాకు కేవలం విలువలు. స్వెత్లాన తండ్రి ఫాసిస్టులతో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. అన్నదమ్ములు, అయినవాళ్ళు లేరు. తెలుగువారినే తన కుటుంబ సభ్యులుగా భావించింది. మాస్కో వెళ్ళిన రా.రాకు, కొండేపూడికి నాకూ ఆరోగ్య సమస్యలు వస్తే ఎంతగా సేవలు చేసిందో! మాస్కోకు వెళ్ళిన తెలుగువారు అక్కడి సంపాదకులతో భాష – భావంలా కలసిపోయారు. తెలుగువారి ఇళ్ళలో జాడీలోంచి ఆవకాయముక్కను తీసుకుని అమాంతం నోట్లో వేసుకునేంతగా రష్యన్ సహచరుల స్నేహాలు పూచాయి.

ఇటువంటి ఆత్మీయతా అనురాగాల వాతావరణంలో 1969లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కు సోవియట్ లోని ప్రగతి ప్రచురణాలయం సంస్థకు సమన్వయం పెంచుకున్నాం. డీ.వి.సుబ్బారావు, మణ్యం ల అనంతరం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లో మూడవ మేనేజర్ గా నేను బాధ్యతల్లోకి వచ్చాను. సోవియట్ సాహిత్యాన్ని తెటతెలుగులోకి ఇవ్వడం, తెలుగు సాహిత్యాన్ని ప్రచురించడం అనే ప్రాధాన్యతలతో 15 ఏండ్లు పనిచేసాను. ఫోర్డ్ మిత్రులు ఒకటిన్నర దశాబ్దాలు వృధాచేసావు అంటారు. సార్థకం చేసుకుంటేనే కదా అంత గొప్ప కాంప్లిమెంట్ లభించేది..!

ఇంగ్లీష్ లో ప్రచురించిన సోవియట్ సాహిత్యం క్యాటలాగ్ ను మెజోదు నరోద్న యాక్నోగా మాస్కో నుంచి విశాలాంధ్రకు పంపేవారు. అందులో కొన్ని పుస్తకాలను అనువాదానికి ఎంచుకునేవారం. ఏ పుస్తకాన్ని ఎవరు అనువదిస్తే బాగుంటుందో యోచించి అడిగేవారం. మయకోవిస్కి వి.ఐ.లెనిన్ పై రాసిన కవితను శ్రీశ్రీతో అనువాదం చేయించాను. గోర్కీ అమ్మను క్రొవ్విడి లింగరాజుతో మరలా రాయించాను. రా.రా కమ్యూనిస్ట్ మానిఫెస్టో తెలుగులోకి అనువాదం చేసారు. ఆ క్రమంలో నీలం రాజశేఖరరెడ్డి, తమ్మారెడ్డిల అభిప్రాయాలను అక్కడి అనువాదకులకు సూచించేవాడిని. కొడవటిగంటి కుటుంబరావు నిత్యజీవితంలొ భౌతికశాస్త్రం చేసారు. రష్యా ఒరిజినల్ ను ఇంగ్లీష్ తెలిసిన రష్యన్లు అనువదించారు. కొ.కు ఇంగ్లీష్ చదువుకున్నాడు కాబట్టి మాస్కో ఇంగ్లీష్ లో అవసరమైన మార్పులు చేసాడు. ఒక పప్రయోగాన్ని మార్చాలన్నా మూల రచయితల అనుమతిని లేదా సంబంధించిన భాషా సంపాదకుల ఆమోదాన్ని తీసుకునే సాంప్రదాయాన్ని పాటించాం. ఈ చొరవ మణ్యం తీసుకున్నారు. ఇక్కడ కూడా అనువాదం చేయించడానికి ఇది ప్రారంభం. First step  తెలుగులో ఎవరితో అనువాదం చేయిస్తే బావుంటుంది? ఏడాది వెతికాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చెస్ చాంపియన్ ఉన్నారని తెలిసింది. వారిని సంప్రదించి అనువాదం చేయించాం. గుంటూరులొ ప్రాక్టీస్ చేస్తున్న డా.పరుచూరి రాజారాం గారితో మెడికల్ బుక్స్ ని అనువదింపచేసాం. అనువాదం కొసం జోషి సుందరకాండను హనుమంతుడికి పంపుతాడు అని జోక్ చేసేవారు. అనువాదాలు చేయించడంలో నేను తీసుకున్న శ్రద్ధకు అంతకంటె గొప్ప కాంప్లిమెంట్ ఆశించగలమా !

రా.రా. మాస్కో నుంచి వచ్చాక కొండేపూడి లక్ష్మీనారాయణను మాస్కో పంపాం. అనువాదాల్లో పిల్లల పుస్తకాలు తప్పనిసరిగా ఉండాలని అనుకున్నాం. రాజకీయ సాహిత్యంతో పాటు పాపులర్ సైన్స్, సైన్స్ ఫిక్షన్ ఉండాలని భావించాం. ప్రచురితమైన పుస్తకాలను షాపులద్వారానే   అమ్మే పద్దతి ఉండేది. అమ్మితే షాపులవాళ్ళు అమ్మాలి. లేకపోతే లేదు. ఫలితంగా పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పేరుకున్నాయి. 1970 నాటికి అమ్మకాలకు స్వంత వ్యవస్థ ఏర్పడలేదు. పుస్తకాలను పాఠకుల చేతుల్లోకి చేర్చడం ఎలా?

విశాలాంధ్రలో తెలుగు పిల్లల పుస్తకాలనంటినీ ఒకో కాపి చొప్పున నవోదయ రామమోహనరావు గారి ద్వారా బాపుకి పంపాము. బాపు ప్రకటనలను రూపొందించారు. చందమామలో ప్రకటనలు ఇచ్చాం. ఆరు నెలల్లో పుస్తకాలు ఖాళీ ! 1973లో విజయవాడలో పిల్లల పుస్తకాల ప్రదర్శన పెట్టాం. చల్లపల్లి బంగళా ఎదురుగా. సీబీటీ, ఎన్.బి.టి తదితర పబ్లిషర్స్ పుస్తకాలనూ తెప్పించాం. సీయింగ్ ఈస్ బిలీవింగ్ అంటారు కదా. ఎగ్జిబిషన్ లో పుస్తకాలు చదువుకునే వెసులుబాటూ ఇచ్చాం. 20 పైసలకూ పుస్తకం కొనేవీలు. ఇసుకేస్తే రాలని జనం. మొదట 15 రోజులనుకున్న ఎగ్జిబిషన్ ను పొడిగించాల్సి వచ్చింది.

పుస్తకాలు అమ్మడానికి దారులు వెతకడం వేరు. అందుకోసం దిగజారడం వేరు. మేము దారులు మాత్రమే వెదికాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కాన్వొకేషన్ సందర్భంగా కొందరు న్యూటెస్టమెంట్ బైబిల్ ను పంచిపెట్టారు. గోరఖ్ పూర్ వాళ్ళు ఆ పద్ధతిలో భగవద్గీతను పంచారు. ఒక పార్టీ ప్రచురణ సంస్థ అలా చేయలేదుకదా. కొన్ని హద్దులుంటాయి. అతిక్రమిస్తే వ్యభిచారం అవుతుంది. విశాలాంధ్రకు ఒకదశలో కష్టకాలం వచ్చింది. స్టేషనరీ పెట్టండి అన్నారు పార్టీలో ఒక పెద్దాయన. విశాలాంధ్ర కాఫీ హోటల్ పెడదాం అన్నాను ఎత్తిపొడుపుగా. ఆయన మారు మాట్లాడలేదు.

1973-75ల్లొ లిటరసీ ప్రోగ్రాంలలో భాగంగా సంచార పుస్తక ప్రదర్శనలు ప్రారంభించాం. న్యూసెంచెరీ, ప్రభాత్ బుక్ హౌస్ వంటి ఇతర భాషల సోదర సంస్థల అనుభవాలను అడిగి తెలుసుకున్నాం. శాస్త్రీయ దృక్పథంతో ప్రచురించిన పుస్తకాలను, తగిన ప్రణాళికతో గ్రామాలకు తీసుకెళ్ళాం. ఐదువేల జనాభా కలిగి, వాహనం వెళ్ళేందుకు రోడ్డున్న ప్రతి గ్రామాన్నీ సంచార గ్రంధాలయాలు సందర్శించాయి. ఆయా గ్రామాల బాలబాలికలతో పెద్దలతో సమావేశమయ్యాం. పుస్తకాలను పరిచయం చేసాం. నిరక్షరాస్యులకు చదువు నేర్పాం. నిరక్షరాస్యులు పుస్తకాలు కొని చదివారు. ఇప్పుడు తలుచుకుంటే దుఃఖం వస్తుంది. సంతోషమూ వేస్తుంది !

*

పున్నా కృష్ణ మూర్తి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ వ్యాసమనే బగ్గీ ఎక్కించి కాలపు రహదారులలోనికి తోడ్కొనిపోయారు. 1977 నా వయసు 10 వత్సరాలనుండి విశాలాంధ్ర షాపుకు వెళ్ళడం, membership card ఉండడం అంటే ఈ రోజులలో BMW ఉండడం లాగ iconic. అందుకే ఈ కార్లు, బట్టలు culture మాకు రాలేదు… ఎంత చరిత్ర… ఎంత గాఢత! ఆహా… ధన్యురాలను…

  • Thanks for wonderful compilation .. just took us back in time and showed what it takes to get a great book in the hands of reader .. #respect

  • రాదుగ పబ్లికేషన్స్, పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ల ద్వారా అజరామరమైన సోవియట్ గ్రంథావళిని, బాలసాహిత్యాన్ని తెలుగువారికి అందించి సామ్యవాద ఉద్యమవ్యాప్తికి దోహదం చేసిన కుశల కార్యనిర్వాహకులు, ప్రాచీ పబ్లికేషన్స్ ద్వారా అందుబాటులో లేని ఎన్నో అరుదైన మంచి పుస్తకాలను ప్రచురించిన మేలి అభిరుచి గల ఉత్తమ ప్రకాశకులు శ్రీ పిపిసి జోషి గారితో ముచ్చటైన ముఖాముఖీ ముదావహంగా ఉన్నది.

    • నమస్సులు. ధన్యవాదాలు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు గుర్తు వచ్చారు.  మీ తో మాట్లాడొచ్చా. నా సెల్ నెంబరు 7680950863.

  • గొప్ప ఇంటర్వ్యూ…చదవడం, తెలుసుకోవడం చాలా సంతోషంగా వుంది

  • రాళ్ళెత్తిన కూలీల గురించిన ముఖాముఖి అద్భుతం. ఇంతకుముందు ఆయన పేరే వినని నా తెలియనితనాన్ని క్షమించాలి.ఈసారి హైదరాబాద్ వచ్చినపుడు జోశి గారిని కలుస్తాను.

  • జోషీగారి సాహిత్య ప్రచురణ కృషి ని కళ్ళముందుంచారు.చాలాబావుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు