నాటక శిల్పంపై… అసామాన్య అధికారం రెంటాలది!

రెంటాల గోపాల కృష్ణ శతజయంతి సందర్భంగా వారి గురించి జ్ఞాపకాలూ, విమర్శ వ్యాసాలకు ఇదే మా ఆహ్వానం!

(రెంటాల గోపాలకృష్ణ రచించిన నాలుగు రంగాల సాంఘిక నాటకం ‘రజని’కి ప్రముఖ జర్నలిస్టు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు రాసిన ముందుమాట ‘ఆముఖం’ యథాతథంగా…)                                    

  • -నార్ల వెంకటేశ్వరరావు

“నా దృష్టిలో నాటకాలు నాలుగు రకాలు.

మొదటి రకానికి చెందినవి చదువుకోడానికి ఇంపుగా, సొంపుగా ఉన్నా, రంగస్థలంపై రక్తి కట్టవు.

రెండవ రకం రంగస్థలంపై ఎంతగానో రాణించినా, చదువుకోబోయే సరికి చప్ప చప్పగా, చౌకబారుగా ఉంటాయి.

మూడవ రకం చూడబోయినా, చదవబోయినా, పుట్టెడు తలనొప్పిని పుట్టిస్తాయి.

కాగా, నాల్గవరకం పఠించినా, ప్రదర్శించినా సమానంగా రంజింపజేస్తాయి.

ఈ చివరి రకానికి చెందినవే నిజమైన నాటకాలు. ‘‘దృశ్యకావ్యాలు’’ అనే పేరు వీటికే చెల్లు.

కావ్య రచనకు ప్రతిభ సరిపోవచ్చు; దృశ్యకావ్యాన్ని రచించడానికి అసాధారణ ప్రతిభ కావాలి. ఒక భాసుడు, ఒక కాళిదాసు, ఒక షేక్ స్పియర్, ఒక మోలియర్, ఒక ఇబ్సన్, ఒక స్ట్రిండ్‌బర్గ్, ఒక షెకోవ్, ఒక షాన్ ఓ కేసీ – ఇట్టి అసాధారణ ప్రతిభావంతులే దృశ్య కావ్యాలను వ్రాయగలుగుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మన అలంకారికులు కవి కంటే నాటక కవికి అగ్రస్థాన మిచ్చారు.

*****         *****         *****

మన తెలుగులో నాటకాలు కోకొల్లలుగానే వస్తున్నాయి. కథలు, నవలల తర్వాత నాటకాలు, నాటికలే హెచ్చుగా వెలువడుతున్నాయి. అయితే, వీటిలో నూటికి 90 వంతులను ఆదిలో నేను చెప్పిన నాల్గు రకాలలో మూడవదాని కింద జమ కట్టి, ఉత్త చెత్త కింద ఒక పక్కకు పెట్టవలసి ఉంటుంది. ఇందుకోసం నిజానికి మనం శ్రమపడనక్కర లేదు. కాలమే ఆ పని చేస్తుంది.

కాగా, మిగిలిన పది వంతుల నాటకాలలో, నాటికలలో ఏవో కొన్ని మాత్రం కేవలం పఠనయోగ్యమైనవి కావడం, తక్కినవి కేవలం ప్రదర్శన యోగ్యమైనవి కావడం ప్రస్తుతం మన నాటక సాహిత్య దౌర్భాగ్యం.

ఒకప్పుడు ఆంధ్ర నాటక కళాపరిషత్తు మాత్రమే నాటకాల, నాటికల పోటీలను ఏడాదికి ఒకసారి చొప్పున ఏర్పాటు చేస్తూ ఉండేది. ఇప్పుడు పట్టణ పట్టణానికి ఒక సంస్థ చొప్పున ఈ పోటీలను నడుపుతున్నది. పోటీలో ఉత్తమ రచనకు, ఉత్తమ నటనకు, ఉత్తమ దర్శకత్వానికి – ఈ విధంగా వందలాదిగా బహుమతులను పంచిపెడుతున్నారు. అయితే, ఈ సంవత్సరం ఉత్తమ నాటకంగా, లేదా నాటికగా మెప్పు పొందినట్టిది మరి రెండు, మూడు సంవత్సరాలకే అయిపూ, ఆనవాలూ లేకుండా పోతున్నది.

పోటీలు నడిపేవారు ‘‘గుడ్డిలో మెల్ల’’పద్ధతిలో వ్యవహరించి, ఏదో ఒక రచనకు మొదటి బహుమాన మివ్వకపోతే, ఎంతోకాలం పాటు వారు పోటీలను నడపలేరు. పైగా, సాహిత్యపు విలువలు శూన్యమైన నాటకమైనా, దాన్ని ప్రదర్శించేవారు ఘటికులైతే, ఉత్తమ రచన అనే భ్రమను కలిగించవచ్చు.

***                       ***             ***

పఠన యోగ్యతతో పాటు ప్రదర్శన యోగ్యతను సమానంగా చూపగలదే ఉత్తమ నాటకమైనా, ఈ రెండు గుణాలలో ఒకదాన్ని మాత్రమే ఎన్నుకోవలసి వస్తే నా ఓటు పఠన యోగ్యతకే! ఈ విషయంలో తానైనా మరో విధంగా ఓటు చేయనని డ్రయిడన్ ఎన్నడో చెప్పాడు. ఆయన మాటలు వినండి:

As it is my interest to please my audience, so it is my ambition to be read: that I am sure is the more lasting and the nobler design; for the propriety of thoughts and words which are the hidden beauties of a play, are but confusedly judged in the vehemence of action: all things are there beheld as in a hasty motion, where the objects only glide before the eye and disappear.

  • John Dryden

సాహిత్యపు విలువలు శూన్యమైనా ప్రదర్శన యోగ్యత బహుళంగా ఉన్న నాటకం, రంగస్థలంపై అది సాధించే విజయం వల్ల, ప్రేక్షకుల అభిరుచులను చాలా హీనస్థితికి తెస్తుంది. అట్టి నాటకాలు సాహిత్యానికే కాక, సంస్కృతికి కూడా మహాపచారాన్ని చేస్తాయని – చేస్తున్నాయని – నా నమ్మకం. ఈ విషయాలలో ఒక ఐరిష్ నాటకకర్త, ఒక అమెరికన్ విమర్శకుడు చెప్పిన మాటలను ఒకసారి చిత్తగించండి:

A good acting play that is not also good enough to be enjoyed in the study is not worth a dying tinker’s damn.

  • Sean O’ Casey.

They talk of fine plays ruined by bad acting. Yet what is more odious than a despicable play improved by good acting?

  • George Jean Nathan.

బళ్ళారి రాఘవాచార్య, యడవల్లి సూర్యనారాయణ, డి.వి. సుబ్బారావు, స్థానం నరసింహారావు మొదలైన మహానటులు మనకు లేకపోతే కనీసం కొన్ని ఉత్తమ నాటకాలైనా మన భాషలో వెలువడి ఉండేవేమో! ఎంత తుక్కు నాటకమైనా సరే, వారు నటిస్తే రక్తి కట్టేది. మన నాటక రచన స్థాయి పెరగకపోవడానికి ఇదొక కారణమని నా విశ్వాసం.

నా మిత్రులు శ్రీ రెంటాల గోపాలకృష్ణ వ్రాసిన ఈ నాటకం ‘రజని’ పూర్తిగా మౌలిక రచన కాదు; ఇదే సమయంలో కేవలం అనువాదమైనా కాదు, టాల్‌స్టాయ్ వ్రాసిన ‘’ది పవర్ ఆఫ్ డార్క్‌నెస్’’ అనే నాటకాన్ని స్థూలంగా దృష్టిలో పెట్టుకొని, మన సంఘానికి, మన ప్రవృత్తికి అనుగుణమైన పద్ధతిలో దీన్ని ఆయన రచించారు.

ఈ రచన సందర్భంలో టాల్ స్టాయ్‌కి తాను ఏమంత హెచ్చుగా ఋణపడి ఉండకపోయినా, ఆయనకు శ్రీ రెంటాల గోపాలకృష్ణ తన కృతజ్ఞతను తెలపడం ఒక గొప్ప విశేషమే!

మన నాటక రచయితలలో సుప్రసిద్ధులుగా చెల్లుతున్నవారిలోనే కొందరు ఏదో ఒక పాశ్చాత్య నాటకాన్ని ‘‘కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత’’ ధోరణిలో అసందర్భపు మార్పులను కొన్నింటిని చేస్తూ, మొత్తంపై మక్కికి మక్కిగా అనువాదం చేసినా, అసలు రచయిత పేరును పొరపాటుగానైనా తలవలేరు. యూజీన్ ఓనీల్ నాటిక ‘బిఫోర్ బ్రేక్ ఫాస్ట్’, సెయింట్ జాన్ ఎర్వివైన్ నాటిక ‘ప్రోగ్రెస్’, ఎ.ఎ. మిల్నీ నాటకం ‘మిస్టర్ పిం ప్యాసెస్ బై’, సిడ్నీ హౌవర్డ్ నాటకం ‘దే న్యూ వాట్ దే వాంటెడ్’, జె.బి. ప్రీస్ట్ లీ నాటకం ‘ది ఇన్‌స్పెక్టర్ కాల్స్’ మొదలైనవి ఎన్నో ఈ విధంగా మన తెలుగులోకి నామాంతరాలతో అవతరించాయి!

*****                   *****                   *****         *****

స్థూలంగా టాల్ స్టాయ్ నాటకాన్ని ఆధారం చేసుకున్నా, దానికి ‘‘తెలుగుతన’’ మివ్వడంలో శ్రీ రెంటాల గోపాలకృష్ణ కృతకృత్యులైనారు. ఆయన తన నాటకాన్ని నాకు చదివి వినిపిస్తుండగా, ‘‘కాస్త ఆగండి! ఈ నుడికారం మనకున్నదా? ఇదివరలో దీన్ని వినలేదు సుమండీ’’ అని నేనన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతగా మన నుడికారంపై ఆయన అధికారాన్ని సంపాదించడం సామాన్య విషయమా?

తెలుగు నుడికారంపైనే కాక, నాటక శిల్పంపై కూడా తనకు ఎన్నదగు అధికారం ఉన్నట్టు శ్రీ రెంటాల గోపాలకృష్ణ ఈ నాటక రచన ద్వారా నిరూపించుకున్నారు. అంక విభజనలో, రంగ విభజనలో ఆయన ప్రజ్ఞను చూపించారు. పట్టు సడలకుండా ఘట్టం నుంచి ఘట్టానికి కథ నడిపించారు.

ఈ నాటకం ఇతివృత్తం వలె, దీనిలోని కొన్ని ఘట్టాలు సున్నితమైన మనస్సు గలవారికి కొంత ‘‘కటువు’’గా తోచవచ్చు. కానీ, జార్జి జీన్ నాథన్ చెప్పినట్టు –

To expect a dramatist to take an unpleasant subject and by some esoteric magic make it pleasant is to demand of him that he be a charlatan. The job is not for artists, but for quacks.

రెంటాల గోపాలకృష్ణ గారు తక్కిన సాహిత్య విభాగాలలో కూడా కృషి చేయగలవారే. అయినా, తక్కినవాటిని కట్టిపెట్టి, నాటక రచనపై ఆయన దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటున్నాను.

(దేశి కవితా మండలి, విజయవాడ వారిచే 1967 ఏప్రిల్‌లో ప్రచురితమైన… రెంటాల రచన ‘రజని’ నాటకం ప్రథమ ముద్రణ నుంచి…)

 

ఎడిటర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రదర్శన రచన ల ప్రాముఖ్యతను చక్కగా సరైన సందర్భాలతో వివరించిన రచనను యథాతథంగా మాలాంటి వారికోసం పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు

  • మంచి వ్యాసం . రెంటాల గోపాలకృష్ణ గారి నాటకం కొన్ని ఏళ్లగా నాటక కార్యకర్తని అయిన నేను చదవలేదు అందుకని ఆ నాటక ఒయారిచయం గురించి వ్యాఖ్యానం చేయను.’

    ఆంధ్ర నాటక పరిషత్ మోయలయిన కొత్తలో తెలుగు నాటకం అంతగా పాడు నాటకాలు రాలేదు .ఆత్రేయ కొన్ని , ముఖ్యంగా భయం నాటకం బగరాశారు , అంతకన్నా బాగా డా రాజరావు ఎన్నో ప్రదర్శనాలు ఇచ్చి ఎంతో పేరు సంపడినచారు. అలాగే యూజిన్ ఒనీల్ “beyond horigins’ నాటకాన్ని గొల్లపూడి మారుతి రావు గారు కె,వెంకటేశ్వర రావు గారు రాసిన రాగరాగిణి ని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు .

    ఇప్పటి నాటక/నాటిక రంగం, ముఖ్యంగా నాటికరంగం , పరిషత్ వలయంలో చిక్కుకు పోయింది . ఈ పరిషత్ లలో నిర్ణయింప బహుమతులు ఉంటాయి వాటికనుగుణంగా రచనలు , దర్శకులు ఉంటారు, నేను 2015 సెప్టంబర్ 15 ఆంధ్రజ్యోతి లో ఒక వ్యాసం రాశాను అది మళ్ళీ ప్రచురించాలంటే నేను ఇక్కడకి పంపుతాను.

    అన్నట్టు కొంత మంది నాటకరంగం లో అరుదు గా కొత్త పయోగాలు చేసున్నారు , బారిష్టర్ పార్వతీశం నవలని మా నాటక సంస్థ ‘ప్రోయాగం’ మొత్తం నవలను 90 నిముషాలకు కుదించి ఒక ట్రావాలాగ్ లాగా చేశాము . దీనిని మొదట హింది లో చేశాడు మా దర్శకుడు తూము శివప్రసాద్. తుని వాస్తవ్యుడైన ఇతను ఎన్‌ఎస్‌డి లో చదివి ఇప్పుడు రాజస్తాన్ విశ్వవిద్యాలయం లో నాటకం లో పాఠాలు చెపుతున్న ఆచార్యులు . ఈ నాటకం ఇండియా లో ప్రఖ్యాతమయిన ఎన్‌ఎస్‌డి జరిపే “భారత రాంగ్ మహోత్సవ్ ల ప్రదర్శింపబడ్డ 80 నాటకాలలో మా బార్రిష్టర్ పార్వతీశం 2003 లో ప్రదర్శింపబడింది . ఈ నాటకం లో ఎలెక్త్రోనిక్ ప్రొజెక్షన్ తో ఆ రోజుల్లో ని రైల్ , షిప్ , సముద్రం వగయిరా చూపిచడం జరిగింది, ఆ నాటకానికి ముఖ్య అతిదీ గా వొచిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చూసి (హౌస్ ఫుల్ ఆడియన్స్ తో) ఇది తెలుగు లో చేసే బాధ్యత నాకు అప్పగించారు . వారిచ్చన ఆర్ధిక సహాయంతో మేము తెలుగు లో నా స్వగ్రామయిన విశాఖపట్నం లో కల రైటర్శ్ అకాడమీ అద్యక్షులు శ్రీ రమణమూర్తి గారి ఆధ్వర్యం లో ఆగస్టు 23 నా ఒకే రోజు 2 ప్రదర్శనలలో 1600 మందికి చూపించి కొత్త రకంగా నాటకాన్ని చూపించాం.2016 నుచి 2019న దాకా ఈ నాటకాన్ని కడప్, కాకినాడ, మళ్ళీ విశాఖప్ట్నం ఒను, అనకాపల్లి లోనూ, విజయవాడ ల 2 సార్లు , ఒంగోల్ లోను పూర్తిగా సుమారు 7000 ప్రేక్షకులకు చూపించాం .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు