నాకంటూ నేను…

లేత వెలుగు కిరణం కూన ఒకటి తారట్లాడుతూ వచ్చి

కనురెప్పల తలుపులు నాజూకు ముని వేళ్ళతో తట్టి

కలల పుష్పకం నుండి సుతారంగా ఎప్పటి త్రిశ౦కులో

దింపుతుంది.

 

ఉందో లేదో తెలియని అస్తిత్వానికి కాస్త కాస్త వశమవుతూ

రాత్రి నిశ్శబ్దపు గాలివాన చీకటి హోరులో  రాలి పడిపోయిన కలలు

ఒక్కొక్కటిగా ఏరుకుంటూ , ఎంచుకుంటూ, విశ్లేషించుకుంటూ

నలిగిన దారే అయినా కొత్త నడక ఆరంభమవుతు౦ది

 

గతకాలపు ఆనవాళ్ళు ఎదురు దెబ్బల మచ్చలూ

ముళ్ళ పొదల పలకరింపులూ వీపున వేసుకు

అడుగడుగునా ఒంగిలేస్తూ అనుభూతుల ఆయాసంలో

ఊపిరందక ఉక్కిరి బిక్కిరవుతూ

స్వంతం కాని ఉనికిని నాదని భ్రమపడుతూ

ఎవరో కళ్ళాలు అదలించే ప్రయాణానికి

నన్ను నేను శతవిధాల సమాయత్తం చేసుకుంటూ …………

 

ఎవరో నాటి పోయిన చెట్లన్నీ నిటారుగా నిలువెత్తు సాక్షాలుగా

రెప్పవాల్చకుండా చూస్తున్నా కాసిన కాయలన్నీ నావే అనుకుంటాను

పిల్ల కాలువల్లా సాగి సాగి నదీమతల్లులై పరవళ్ళు తోక్కే నదులన్నీ

నా  స్వంతమేనంటాను .

అంగుళం అంగుళం కోలుచుకుంటూ అక్క్రమించుకుంటూ

అధునిక వామనావతారంలోకి దూరతాను

 

అంతా ముగిసిన అసుర సంధ్య చూపు మసకేసాక

నాది కాని ప్రతి దానికోసం నాది కాని జీవితం వెచ్చించి భాగించి

వెయ్యి న్నొక్క సమస్యల్లో తబ్బిబ్బయాక

కరిగి కరిగి ఎక్కడో ఏ బీటలు వారిన హృదయాల్లోనో

అక్షరాలై ఇ౦కిపోయక తెలిసింది

నాకంటూ నేను ఏమీ లేనని.

*

2

శబ్దమూ నిశ్శబ్దమూ

 

మౌనం కరిగి ప్రవాహమవుతూ

చెవులు కొరుక్కుంటున్న గులక రాళ్ళ మధ్యన జారి

ఇరుకు దారుల్లో ఒదిగిన రహస్యానుభూతుల్లోకి

తొంగి చూసి వాటిని తోడు చేసుకుంటూ

కాస్సేపు అలల చేతులు చాపి తీరాలను ఒడిసి పట్టుకుని

మాటలతో తడిపేస్తూ మరంతలోనే వెనక్కు మళ్ళి

అలవోకగా వాలిన నీరెండ వెచ్చదనంలో కాగికాగి

అస్పష్టంగా ఒలికిన వసంతం రంగుల్లో మరిమరిగి ఆవిరౌతూ

ఒకదాని వెనక ఒకటి శబ్దమూ నిశ్శబ్ద మూ

అచ్చం గాలి సోకని వెదురుపొదలో దాచుకున్న లాలిత్యమూ

పియానో మెట్లమీద కాలుజారిన గమకం లాగానే.

 

జీవితం మారుమూలల్లో దట్టంగా అల్లుకున్న రాధామనోహరం

తీగలపై పూగుత్తులలాగే ఈ శబ్ద నిశ్శబ్దాల రంగులు

రహస్యాలు పంచుకున్న పూరెక్కల ఎరుపు తెలుపుల నడిగా

కలబోసుకు వడబోస్తూ కాస్తకాస్త మచ్చుకు గుప్పిళ్ళతో వెదజల్లుతూ

పుప్పొడి పులకల్లో పురివిప్పిన మరిమళాలు

వాటి చుట్టూ తచ్చాడుతున్న సీతాకోక చిలుకలై

కంటి కొసల్లోకి ఎగిరివస్తున్న  కనకాంబరాల చిక్కని మెరుపు

కొబ్బరాకుల మౌనం మధ్య రాను రానంటూ ఒదిగిన మాటరానితనాన్ని

వెలుగు వెన్నెలలతో రాయబారాలడి చెయ్యట్టుకు లాగుతున్న

తుంటరి గాలి

చీకటి రాత్రులను కుతిదీరా సేవించి మత్తెక్కిన ఏకాంతాన

అమావాస్యలమనుకునే సందిగ్ధంలో ఆ చివరన శబ్దరాహిత్యపు

సమాధి అవస్థలో సగం బక్క చిక్కిన సాయంత్రాలకు

కొంచం ఉపశమనం లా  మావికొమ్మలు జలజలా కదిపి కుదిపి

చిటారు ఆశల పచ్చని కొమ్మ చివర

గోరంత చంద్రవంక నేపధ్యం చేసుకు గళం సవరించుకునే అలికిడి.

 

ఉహు …

యుగళ గీతంలా సరిగమలు సరితూచుకునే

ఈ జంట కవులకు దేహాలు వేరేమో కాని ఆత్మ ఒక్కటే

సమయాలు వేరైనా సందర్భాలు ఒకటే

గుర్తించలేదు కాని రెండింటి సాన్నిహిత్యమూ ఒకటే కదా.

*

చిత్రం: బీబీజీ తిలక్ 

స్వాతీ శ్రీపాద

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు