నవ్య  కవిత్వానికి ‘ప్రవర’ చెప్పిన నారాయణ బాబు !

“ ఈ కాలం లో వాత్స్యాయనుడు , మనువు కాదు మా ఋషులు. మార్క్స్, ఫ్రాయిడ్” అని మరో సారి “ ప్రవర” ద్వారా స్పష్టం చేశాడు నారాయణ బాబు. ఈ “ ప్రవర” ను ఆ కాలం కవులందరూ ఎంతో ఆసక్తిగా చదివి చర్చించారు. ఇప్పటికీ, ఎప్పటికీ కవులందరూ ఒక్క సారైనా నవ్య కవిత్వపు తొలి నాళ్ళ గురించి, నారాయణ బాబు  లాంటి ముందు తరం కవుల కవిత్వ మార్గాన్ని గురించి తెలుసుకోవాలంటే “ ప్రవర” తప్పనిసరిగా చదవాల్సిందే. ఆ రకంగా నారాయణ బాబు, ప్రవర, సంఘర్షణ, రెంటాల –సాహిత్య చరిత్ర లో చిరస్మరణీయులయ్యారు అనటం అతిశయోక్తి కాదు.

రెంటాల గోపాలకృష్ణ తొలి కావ్యం “ సంఘర్షణ” తొలి ముద్రణ 1950 లో జరిగింది. అంటే “ రాజ్యశ్రీ” చారిత్రక నవల తర్వాత నవ్య కవిత్వం వైపు దారి మళ్ళిన రెంటాల దాదాపు పదిహేనేళ్ళ పాటు రాసిన కవిత్వం “ సంఘర్షణ”. పదిహేనేళ్ళు సుదీర్ఘ కాలం. అప్పటికి రెంటాల వయస్సు 30 ఏళ్ళు.

అనేక రకాలుగా వ్యక్తిగత జీవితం లో ముఖ్యమైన సందర్భం కూడా . చిన్న వయసు లోనే పెళ్ళి చేసుకొని రెంటాల ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు. అనారోగ్యం తో మొదటి భార్య ఆనంతలక్ష్మి  చనిపోయింది. నర్సరావు పేట నుంచి గుంటూరు, అక్కడ నుంచి బెజవాడ కు మకాం మారింది. ఇల్లు గడవటం కోసం రెంటాల ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు ఉదరపోషణార్థం చేశారు. మార్వాడీ  కొట్లో కూడా పని చేశారు. ఇవన్నీ వృత్తి పరమైన ఉద్యోగాలు. ఇవేవీ ఆయన ప్రవృత్తి ని ఆపలేదు. అణచివేయలేదు. రెంటాల కు ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ రెండు ఆసక్తికరమైన అంశాలు మొదటి నుంచి. అవొక రకమైన చాపాల్యాలు అనేవారు తర్వాత జీవితం లో వాటి గురించి మాట్లాడేటప్పుడు.ఈ రెండు శాస్త్రాలను శాస్త్రీయంగా నవ్య సిద్ధాంతాలతో నేర్చుకున్నారు. మొదటి భార్య అనంతలక్ష్మి ని రెంటాల ఎంతగానో ప్రేమించారు. ఆమె అనారోగ్యం,ఆమె అకాల మరణం ఆయనను మానసికంగా ఎంతగానో కుంగదీసింది. కొన్నేళ్ళ పాటు ఒంటరి గా బతికారు. కుటుంబాన్ని చూసుకుంటూ సాహిత్యమే ప్రధాన జీవితం గా గడిపారు.

ఇద్దరు పసిపిల్లలు, వృద్ధరాలైన తల్లి . చిన్న చిన్న ఉద్యోగాలు, మరో పక్క సాహిత్య జీవితం.  తప్పనిసరై రెండో వివాహం చేసుకున్నారు. రెండో వివాహం లో రెంటాల అనేక ఆచారాలను అతిక్రమించారు. వివాహాలకు ప్రాంతాలు అడ్డు రాకూడదనేవారు. అలాగే భిన్న ప్రాంతాల వారి మధ్య వివాహం అనేక రకాలుగా సామాజిక కుటుంబ వ్యవస్థ ను బలోపేతం చేస్తుందని విశ్వసించారు. చలనచిత్ర రంగం రెంటాల కున్న ముఖ్య ఆసక్తుల్లో ఒకటి. ఆ పనుల మీద అనేకసార్లు చెన్నపట్నం వెళ్ళి వస్తుండేవారు. ఇంట్లో వారి మాటలు , అభ్యంతరాలు పట్టించుకోకుండా తమిళ దేశానికి చెందిన పర్వత వర్ధని ని వివాహం చేసుకున్నారు. పర్వత వర్ధని ఆ రోజులోనే స్కూలు ఫైనల్ దాకా చదువుకొని వచ్చినఉద్యోగాన్ని వదులుకొని రెంటాల వెంట ఆంధ్ర దేశం వచ్చారు. తెలుగు నేర్చుకొని అదే తన మాతృ భాషగా చివరి వరకూ బతికారు. రెంటాల  తొలి కావ్యం సంఘర్షణ 50 లో వెలుగు చూసింది. రెండో వివాహం  1958 లో జరిగింది.

సాహిత్య లోకం లో “ సంఘర్షణ” అనేక రకాలుగా ప్రసిద్ధి చెందింది. అందులో ఒకటి శ్రీరంగం నారాయణ బాబు రాసిన “ ప్రవర”- ముందు మాట లాంటి వెనుక మాట. రెంటాల సహజంగా కవి. ప్రతి భావం కవిత్వీకరించే వారు. డైరీ లో రాసుకునేవారు. తిరగ రాసేవారు. ఒక్కో కవిత కు ఎన్నో వెర్షన్లు. కానీ అన్నింటి ని ప్రచురణ కు పంపేవారు కాదు. అలాగే అన్నీ పుస్తకం లోనూ ప్రచురించలేదు. నిజానికి సంఘర్షణ కావ్యం లో ఏ కవిత ఎప్పుడు రాసినది, ఎప్పుడు ప్రచురితమైంది లాంటి ముఖ్య వివరాలు కూడా ఇవ్వలేదు. వాటి చారిత్రక అవసరం తెలిసి కూడా రెంటాల అలా చేయటానికి కారణం సమయాభావమో, లేక తన స్వంత రచనల మీద అనాశక్తతో తెలియదు. సంఘర్షణ లో కొన్ని కవితలను  మాత్రం ప్రత్యేకంగా 1942 లో రాసినట్లు పేర్కొన్నారు. ఎందుకంటే అవి స్వాతంత్ర్యం  రావటానికి ముందు అని స్పష్టం చేయటం కోసం కావచ్చు.

ఇక “ ప్రవర” లోకి వెళితే .. రెంటాల “ సంఘర్షణ” కావ్యాన్ని నారాయణ బాబు కు పంపించాక, అవి చదివి ఆయన ఆనందంతో ఉప్పొంగి పోయారట. ఒక్క సారిగా ఆయన ఇరవై ఏళ్ళు వెనక్కు వెళ్ళి తాను, శ్రీశ్రీ నవ్య కవిత్వానికి నాంది పలికిన సువర్ణ దినాలని గుర్తు చేసుకున్నారు. నవ్య కవిత్వం మొగ్గలేసిన తొలినాళ్ళు భావ కవిత్వపు స్వర్ణ యుగం అంటూ ఒక వర్గం,యథార్థ యుగం అని మరొక వర్గం. నవ్య కవిత్వం ఆకాశం నుంచి ఊడి పడలేదు. నవ్య కవులందరూ మొదట భావ కవిత్వం దిశ లో ప్రయాణించిన వాళ్ళే.  నవ్య కవుల కవిత్వం లో “ ఉండకూడని వస్తువు, వాడ కూడాని భాష లేనే లేదు. చాకలాడు, సంత బయలు, కుక్క, గాడిద, కుళ్ళు  కాలువ, మందు గుండు, బీద వాడు, భిక్షువరషీయసి –అవేమిటి -ఇవేమిటి – లోకం లో ఉన్నవన్నీ!” అని ప్రవర లో ప్రకటించుకున్నాడు నారాయణ బాబు. “ ఈ కాలం లో వాత్స్యాయనుడు , మనువు కాదు మా ఋషులు. మార్క్స్, ఫ్రాయిడ్” అని మరో సారి “ ప్రవర” ద్వారా స్పష్టం చేశాడు నారాయణ బాబు. ఈ “ ప్రవర” ను ఆ కాలం కవులందరూ ఎంతో ఆసక్తిగా చదివి చర్చించారు. ఇప్పటికీ, ఎప్పటికీ కవులందరూ ఒక్క సారైనా నవ్య కవిత్వపు తొలి నాళ్ళ గురించి, నారాయణ బాబు  లాంటి ముందు తరం కవుల కవిత్వ మార్గాన్ని గురించి తెలుసుకోవాలంటే “ ప్రవర” తప్పనిసరిగా చదవాల్సిందే. ఆ రకంగా నారాయణ బాబు, ప్రవర, సంఘర్షణ, రెంటాల –సాహిత్య చరిత్ర లో చిరస్మరణీయులయ్యారు అనటం అతిశయోక్తి కాదు.

రెంటాల సంఘర్షణ కావ్యాత్మ ని కవే ఇలా చెప్పుకున్నాడు “ రెండు వ్యతిరేక శక్తుల పరస్పర విరుద్ధ విన్యాసాలే. మంచి చెడుల మధ్య, సత్యాసత్యాల మధ్య జరుగుతున్నదే ఈ సంఘర్షణ”. మరి నారాయణబాబు ఏం చూశారు రెంటాల కవిత్వం లో అంటే “ భాషా ప్రయోగం లో, చందస్సుల పోకడ లో వింత వింత పోకడలు, వివిధ  గమకాలు, రాగం, బాణీ, తానం.” ఇది శిల్పానికి సంబంధించినది. భావానికి సంబంధించి ఆయన “ కవి లో మానవ సమైక్యత” గుర్తించారు. “ ఈ రోజుల్లో కవిత్వం గురించి వాగాలాపన జరుగుతున్నది కానీ ఉత్తమ కవిత్వ రచన సాగలేదు. అటువంటి రోజుల్లో గోపాల కృష్ణ గారు రసభరితమైన కావ్యాన్ని రాసి లోకానికి అర్పించారు” అన్నాడు నారాయణ బాబు. అంత మాత్రాన రెంటాల కవిత్వం లో నారాయణ బాబు కు నచ్చనివి ఏవీ లేదని కాదు. లేదా రెంటాల కేవలం అద్భుతమైన కవిత్వమే రాశారని కాదు. “ స్థాలీపులాక న్యాయం గా రస చర్చ చేశాను. నెరుసులు ఉండకపోవు. కానీ గుణాలనే స్మరించాలి” అని నారాయణ బాబు ఒప్పుకున్నాడు.

సంఘర్షణ లో మొత్తం 20 కవితలని రెండు శీర్షికలు  విద్యుద్వాహిని , దశదిశలు  కింద ప్రచురించారు. దాసరి వీరయ్య వేసిన ముఖ్య చిత్రం కవితాత్మ ను పట్టి చూపింది. కవర్ పేజీ విజయవాడ లోని స్వతంత్ర ఆర్ట్స్ ప్రింటర్స్ లో ప్రింట్ అయితే, లోపలి పుస్తకం నర్సరావు పేట లోని సర్వోదయ ప్రెస్ లో ప్రచురితమైంది. సాహితీ స్రవంతి సొంత ప్రచురణ సంస్థ ఆధ్యర్యం లో తొలి ప్రచురణ గా “ సంఘర్షణ” ప్రచురితమైంది. వెల పన్నెండు అణాలు.

Why have I sought my path

With fervent care

If not in hope to bring my

Brothers there?” -Goethe

ఈ మాటల్ని  పుస్తకం మొదట్లో ఎంపిక చేసుకోవటం లోనే రెంటాల తన స్టాండ్ ఏమిటో ప్రకటించుకున్నారు. అందుకు తగ్గట్లు తన తొలి కావ్యాన్ని

“ అసమసంఘ వ్యవస్థా బంధనం లో నలిగి నీరసించే పీడిత ప్రజాహృదయాలను తన కవితా జ్యోతి తో ప్రజ్వలింప చేసిన అఖండ సాహితీ పరుడు , అభ్యుదయ కవి, నా సహపాఠి, మిత్రుడు  శ్రీ అనిసెట్టి సుబ్బారావు“ కి అంకిత మిచ్చాడు రెంటాల .

ఆధునిక కవిత్వం లో అధివాస్తవిక కవి గా అగ్ర భాగాన నిలిచాడు నారాయణ బాబు. ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో మే 17, 1906 లో పుట్టిన నారాయణ బాబు కేవలం కవే కాదు. సంగీతం, చిత్రలేఖనాల్లో ఆసక్తి, అభినివేశం ఉన్నవాడు. విజయనగరం లో ప్రాధమిక విద్యాభ్యాసం చేసిన  నారాయణ బాబు పూడిపెద్ది వెంకట రమణయ్య, కాళూరి నరసింగరావు, తదితరులతో సాహిత్య చర్చలు చేసేవారు. పశు వైద్యం చదువుకోవటానికి మద్రాస్ వెళ్ళినా ఆ చదువు పూర్తి చేయలేదు. “ విప్లవ ఋషిని , విద్రోహ కవిని” అని చాటుకున్న నారాయణ బాబు 1926 లో పురిపండా అప్పలస్వామి, పూడిపెద్ది, కాళూరి, వడ్డాది సీతారామంజనేయులు కలిసి విజయనగరం లో స్థాపించిన కవితా సమితి లో చురుకుగా పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయ పరిణామాల్ని, స్థితి గతుల్ని, సాహిత్యాన్ని నారాయణబాబు, శ్రీశ్రీ, రోణంకి తో పాటు ఆనాటి సాహిత్యవేత్తలందరూ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేవారు. చాగంటి సోమయాజులు ఇంట్లో జరిగే సాహిత్య సమావేశాల్లో వీళ్లందరూ నిత్యం పాల్గొనేవారు. నారాయణ బాబు సంపన్నుల ఇంట్లో పుట్టినా, ఆయన లేమి లోనె జీవితం గడిపారు.

ఎక్కడా నిలకడ గా ఉండకుండా తిరగటం వల్ల అనారోగ్యం పాలై చివరకు 1961 లో మద్రాస్ రాయపేట ఆస్పత్రి లో మరణించాడు. శ్రీశ్రీ, నారాయణబాబుల మధ్య సన్నిహిత బంధుత్వం తో పాటు స్నేహం కూడా ఉంది. అయితే ఇద్దరి మధ్యా అనేక పొరపొచ్చాలు కూడా వచ్చాయి. శ్రీశ్రీ ఒక దశ లో నారాయణబాబు ని ‘ ఇమిటేటర్ ‘అని వ్యాఖ్యానించటం వల్ల ఇద్దరి అభిమానుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా “ సంపంగి తోట” అనువాదం విషయం లో ఇవి మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. నిజానిజాలు ఈ వివాదం లో ఎవరికి ఎంత తెలుసో, ఎవరి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో కానీ వివాదం మాత్రం నిజం. ఆ తర్వాత శ్రీశ్రీ మరో ఇంటర్వ్యూలో నారాయణబాబు ని మెచ్చుకున్నా కూడా ఆ వివాదం, శ్రీశ్రీ కామెంట్ రెండూ కూడా ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.

నారాయణ బాబు చివరి వరకూ అధివాస్తవిక కవి. అభ్యుదయ కవి. చరిత్ర లో నిలిచేది అదే. రెంటాల మీద శ్రీశ్రీ, నారాయబాబు,శిష్ ట్లా , తదితరుల ప్రభావం ఉన్నా, వీరందరూ ఆయనకు సన్నిహితులు, హితులే అయినా రెంటాల తన తొలి కావ్యానికి ముందు మాట రాయమని నారాయణ బాబు ని అడగటం వల్ల రెంటాల, నారాయణ బాబుల స్నేహ సన్నిహితత్వానికే కాకుండా నవ్యకవిత్వానికే  “ ప్రవర” ఒక దిక్సూచి గా నిలబడిపోయింది.

*

 

కల్పనా రెంటాల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • నారాయణ బాబు చాలా మంచి అధివాస్తవిక కవి చెప్పాలంటే శ్రీశ్రీ కన్నా మంచి అధివాస్తవిక కవి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు