దేవతావస్త్రాల్ని తగలబెడదాం!

“ఇంద్రుడు-చంద్రుడు” అనే కమల్ హాసన్ సినిమా చూసారా?  సినిమా క్లైమాక్స్ లో మేయర్ వేషంలో వున్న కమల్ హాసన్ నోటికొచ్చిన కొటేషన్స్ చెబుతూ మహోద్రేకంగా ఉపన్యాసం ఇస్తుంటే జనాలు ఊగిపోతూ చప్పట్లు కొడుతుంటారు.  అప్పుడు అతను అడుగుతాడు”మీరెందుకు చప్పట్లు కొడుతున్నారో తెలుసా అసలు మీకు?  చెవులున్నాయి కదాని వినేయటం, చేతులున్నాయి కదాని చప్పట్లు కొట్టేయడం!” అంటూ దెప్పి పొడుస్తాడు.  నిజమే! మనం ఉపన్యాసాలకి, నీతి ప్రవచనాలకి అలవాటు పడిపోయాం.  మన జీవితాలు ఉన్నతంగా, సౌకర్యవంతంగా, మానవీయమైన వాతావరణంలో అభివృద్ధి చెందటానికి మనకి ఏమి కావాలో బొత్తిగా తెలియదు.  కానీ మనకి ఉద్రేకాలు కావాలి.  ఆ ఉద్రేకాలు కూడా ‘నేను ‘, ‘నాకు ‘, ‘మేము ‘,  ‘మాకు ‘, ‘మాది ‘  అనే  భావనలకి సంబంధించినవే తప్ప ‘మనకు ‘, ‘మనము ‘  అనే భావనలకి సంబంధించినవి కావు.  ఒక్క మాటలో చెప్పాలంటే మనకంటూ పౌరులుగా నిజంగా సామాజికాదర్శాలంటూ ఏమీ వుండవు.  ఎప్పుడూ ఎవరో ఒకరు నాలుగు మంచి మాటల్లాంటివి చెప్పకపోతారా, వాటికి తలలూపుకుంటూ తృప్తిగా కాలక్షేపం చేయకపోతామా అని ఎదురుచూస్తుంటాం.

****

“ద గ్రేట్ ఇండియన్ సైకాలజీ” గురించి రాద్దామనుకుంటే ఎటు నుండి మొదలుపెట్టాలో అర్ధం కావటం లేదు.  ఎందుకంటే  భారతీయులది భలే చిత్రమైన మనస్తత్వం!  “చిత్రమైన మనస్తత్వం” అని ముచ్చటగా అనుకోవటమే కానీ నిజానికి దాని వెనుక ద్వంద్వ ప్రమాణాలుంటాయి.  సామాజిక హెచ్చుతగ్గులకి ఆమోదముద్ర వుంటుంది.  భయంకర స్వార్ధముంటుంది.  స్వీయ సౌకర్యముంటుంది.  హిపోక్రసీ వుంటుంది.  హెచ్చులుంటాయి.  నచ్చని విషయాల పట్ల, భిన్నాభిప్రాయాల పట్ల అసహనముంటుంది.  తీర్పరితనముంటుంది.  ఎదుటి వారిని చిత్తుచిత్తు చేయాలనే గయ్యాళితనముంటుంది. సమాజం పట్ల బాధ్యతారాహిత్యముంటుంది.  ఇంకా ఎన్నెన్నో ఉండకూడని లక్షణాలెన్నో వుంటాయి.

మనకూ ఆదర్శాలుంటాయి.  అయితే ఆదర్శాల విషయంలో మనం చాలా లౌక్యులం.  ఎందుకంటే మనం చెప్పుకునే ఆదర్శాలేవీ కూడా ఆచరణకి సంబంధించినవి కావు.  చేతులకి మట్టి అంటించని ఆదర్శాలే మనవి.  మన జీవన విధానంలో సామాజిక ఆదర్శాల కంటే భక్తి తత్పరత, నమ్మకాలతో బతికేయటం, గుడ్డిగా అనుసరించటం వంటి అశాస్త్రీయ విలువలు ప్రధానం అవుతాయి.  మనం మాటలు వింటూ, మాటలు చెబుతూ బతికేస్తుంటాం.  ఏదైనా వినటమే మన ఆదర్శం.  గుడ్డిగా తల ఊపటమే ఆదర్శం.

వివేకానందుడు, గాంధీ వంటి వారు మనకోసం చాలా సౌకర్యవంతమైన ఆదర్శాలు ఏర్పాటు చేసి పోయారు.  వివకానందుడు “యువతకి ఉక్కు నరాలు కావాలి” అన్నాడు అంటే చప్పట్లు కొట్టేస్తాం.  ఆ ఉక్కు నరాలేందో, వాటినెలా సంపాదించాలో, వాటితో ఏమి చేయాలో మనకి తెలియదు.  వివేకానందుడు మనకి ఓ తాత్వికాభిరుచి.  కాషాయ దుస్తుల్లో, తలపాగాతో, స్ఫురద్రూపంతో చేతులు కట్టుకొని సైడ్ పోజులో కనిపించే వివేకానందుడి ఫోటో చూడగానే సమ్మోహనంగా అనిపిస్తుంది.  “వివేకానందుడంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఆదర్శం!” అని ప్రకటించటం ఒక ఉత్తమాభిరుచితో కూడిన ఆదర్శం.  ఎందుకంటే “వివేకానందుడు నీ ఆదర్శమా?  అయితే మరి నీ ఆచరన ఏమిటి?” అని ఎవరూ ప్రశ్నించరు.  రాజుగారి దేవతా వస్త్రాలే మన ఆదర్శాలు. ఎవడైనా కాదనటానికేమీ వుండదు.

గాంధీగారి అహింసా సిద్ధాంతం కూడా మనకి భలే నచ్చేస్తుంది.  చప్పట్లు కొట్టేస్తాం.  అత్యంత నేరపూరితమైన రాజకీయాలకి కూడా గాంధీ అహింసా సిద్ధాంతమే ఆదర్శం అవుతుంది.  అహింస గురించి చెప్పమంటే “ఒక చెంపని కొడితే మరో చెంప చూపించటం” అని చెప్పటం మినహా ఇంకేమీ లేదు గాంధీగారి సిద్ధాంతం.  అది వ్యక్తి విలువో, వ్యవస్థ విలువో బోధపడదు.  కుల నిర్మూలన జరగాల్సిన సందర్భంలో అస్పృశ్యులైన పీడిత వర్గానికి “హరిజనులు” అనే ఔదార్యపూరిత నామకరణం చేసి కులాన్ని శాశ్వతీకరణ చేయాలన్న ఆలోచన ఆయనది.  ఆయన హవా నడుస్తున్నది ఇంకా.  ఎందుకంటే నిజమైన రాజకీయ తాత్వికతకి స్థానం లేని ప్రజాస్వామ్యం కదా మనది.  మనకి రాజకీయమంటే పార్టీల రాజకీయాలే.  అందులో ఆచరణకి అసలు స్థానమే వుండదు.  రాజకీయాలలో జవాబుదారీతనమంటే ఏమిటో మనకి ఊహకి కూడా రాదు.  గాంధీగారు అంతగా మన రాజకీయాల్ని కమ్మేసారు.  ఆచరణతో సంబంధం లేని రాజకీయాలకి ప్రజల నిష్క్రియాపరత్వమే మూల సిద్ధాంతం.  ఆ రాజకీయాల్నే మనం ఆమోదిస్తాం.  (ఒక్క ఎమర్జెన్సీ తరువాత వచ్చిన ఎన్నికల్లో ప్రజా తీర్పు ఒక్కటే ఇందుకు మినహాయింపు. ఇందిరాగాంధి విధించిన ఏ ఎమర్జెన్సీ వంటి పరిస్తితులొచ్చి ఏ జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రజాస్వామిక వాదులు నియంతృత్వానికి వ్యతిరేకంగా పిలుపునిస్తే తప్ప అసలు మన దేశ రాజకీయాలలో సామాన్యుడికి స్థానం లేదు.)  మనం అందుకొని, స్పందించే రాజకీయ పిలుపులన్నీ అధికారంలోకి వాడిని పడగొట్టి వీడొచ్చే ఎడమ చేయి తీసి పుర్ర చేయి పెట్టే రాజకీయ నాయకులు ఇచ్చేవే.  వాటివల్ల వ్యవస్థలో మార్పులు రావు.  పాలకుల్లో ప్రజలంటే భయం కానీ, వారి పట్ల జవాబుదారీతనం కానీ వుండదు.  కానీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం ఆలోచనాశీలురితో సహా సామాన్య ప్రజలందరూ ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతారు.  ఎంతటి అవినీతి చరిత్ర వున్నా, ఎన్ని మోసపూరిత వాగ్దానాలు చేసినా, అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించినా, ఎన్ని మారణహోమాలు చేసిన చరిత్ర వున్నా, ఎన్ని ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డా సాక్ష్యాలున్నా మనం మాత్రం ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అభిమానులుగా మిగిలిపోతుంటాం.  దీనికి ప్రధాన కారణం మనకి అసలు ఆచరణాత్మక ఆదర్శాలంటూ ఏమీ లేకపోవటమే.

మనం మెచ్చుకొని ఆదర్శనీయంగా భావించే మరికొంతమంది ప్రముఖులుంటారు. అందులో కలాం, సుధామూర్తి వంటి వారు ముఖ్యులు.  వ్యక్తులుగా వారు మంచివారే.  కానీ వారు పైకి రావటమనేది ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థలో, కుత్తుకలు కత్తిరించే పోటీ వాతావరణంలో ఒక లాటరీ వంటిది అనే విషయాన్ని గమనించకుండా మన పిల్లలకి వారిని చూపిస్తాం.  వారిని చూపించి సంపాదనలు, కెరీర్లే ఆదర్శాలుగా ప్రచారం చేస్తాం.  కలాంగారేం బోధించారండీ కెరీరిజం తప్ప? అది ఆయన తప్పు కాకపోవచ్చు.  ఆయనకి వ్యక్తిగతంగా అంతకు మించి ఏమీ తెలియదు.  తాను కనీసం పిన్నీసు వంటి చిన్న వస్తువునైనా కనిపెట్టకపోయినా తనలా అణుబాంబుల్ని తయారుచేసే వాళ్లు ఈ దేశానికి అవసరం అనుకున్నారాయన.  హక్కుగా కొట్లాడి సంపాదించుకోవలసిన అవకాశాల్ని వ్యక్తిత్వ లోపాలతో జారవిడుచుకుంటున్నామనే తప్పుడు అవగాహనల్లోకి కలలు కనమనే కలాంగారి పిలుపు నెడుతుంది.  వ్యవస్థ సంపదలో సింహభాగం మింగి కూర్చునే సంపన్నుల ఔదార్యం పట్ల మనకి మనకి మైమరుపు, ఆరాధన కలిగించటానికి సుధామూర్తి వంటి వారు ఆ వర్గపు ప్రతినిధులుగా వుంటారనే విషయాన్ని గమనించకుండా ఆమెని ఆదర్శానికి ఒక ఐకాన్ గా భావించే అమాయకత్వం మనది.  సంపన్నులు, ఉన్నత స్థానాలో వున్న వారి నిరాడంబరత్వం వల్ల సమాజానికి ఒరిగేదేమీ లేదన్న ఎరుక మనకుండదు.  ఉన్నవారి దాతృత్వం వెనుక చట్టబద్ధంగా కట్టాల్సిన ఆదాయపు పన్ను మీద తిరుగులేని పెత్తనం నిలబెట్టుకోవటం ఉంటుందని ఆలోచించకుండా ఆ “అల్ట్రా రిచ్” సంపన్నుల్లో గొప్పతనాన్ని చూస్తాం.  నాకైతే ఇది అడగంగానే మంచినీళ్లిచ్చిన హైజాకర్ పట్ల కలిగే సదభిప్రాయం, ఆరాధనా భావంలానే కనిపిస్తుంది.

మనం సంస్కృతికి సంబంధించి విపరీతంగా గప్పాలు కొట్టుకుంటుంటాం.  ప్రాచీనత, సనాతనత్వం గొప్పవిగా భావిస్తుంటాం.  నిజానికి మనం ఏ కోశానా ఆ సనాతన విలువల్ని పాటించలేం.  ఎందుకు పాటించలేమంటే పాటిస్తే ఈ ఆధునిక కాలంలో బతకలేం అన్న విషయం మనకి బాగా తెలుసు.  ఈ సనాతనత్వ పారవశ్యం మన దేశాన్ని, మతాన్ని మరో దేశంతోనో, మతంతోనో పోల్చుకొని తృప్తి పడటానికి తప్పితే మరెందుకూ పనికిరాదు.  ఈ రోజున సనాతనత్వపు భారం మొత్తం ఒక్క స్త్రీ సౌశీల్యం మీద, స్త్రీల వస్త్రధారణ మీద మోపి తృప్తి పడుతుంటాం.  మన సనాతనత్వ క్లెయింసే మన హిపోక్రసీకి సజీవ సాక్ష్యాలు. ఈ సనాతనత్వ ప్రీతిలో భాగంగా రకరకాల గురువుల్ని, సన్యాసుల్ని, బాబాల్ని పెంచి పోషిస్తుంటాం.  ఆయా గురువులు, బాబాలు పవర్ సెంటర్స్ గా ఎదిగి పాలకుల తరపున సేల్స్ మెన్ గా, వారి నల్లధనాలకి కావలిదారులుగా,  (ఏ ఆశ్రమం మీదనైనా ఐటి దాడులు చేయటం మీరెరుగుదురా?} ఈ రోజున ఆధ్యాత్మికత ఒక పరిశ్రమగా మారిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.  ఈ ఆధ్యాత్మికవేత్తలు వేళ్లు దూర్చని పార్టీ ఏదీ లేదు.  వీళ్లిప్పుడు ఏదో ఒక పార్టీకి పరోక్ష మద్దతు నుండి ప్రత్యక్ష మద్ద్దతు ఇచ్చే స్థాయి వరకు వచ్చారు.  అయినా వాళ్లని నిలదీయలేని వ్యక్తి ఆరాధన ఆదర్శాలు మనవి.

అత్యాచారాలు, దోపిడీలు, చట్ట విరుద్ధ పనులు, అవినీతిమయ రాజకీయాల్లో అగ్ర స్థానంలో వున్న మనం మనల్ని మనం మాత్రం ప్రపంచానికి

నాగరీకత నేర్పిన వాళ్లంగా చెప్పుకుంటాం.  ఇంట వున్నా, బైట వున్నా చుట్టూ పరికించి చూసినప్పుడు మనం నిరంతరం ఉపయోగించే, ఆధునిక జీవితానికి పనికొస్తున్న ఏ ఒక్క వస్తువుని మనం కనిపెట్టినది లేదు.  ఎప్పుడో అతి ప్రాచీన కాలంలో “శూన్యం” గురించి చెప్పామట, అది లెక్కల్లో ఉపయోగించిందట – ఇంకేం ఆ కీర్తిని పించన్లా భోంచేస్తూ బతికేస్తుంటాం. మహా అయితే మనకంటే ఏమాత్రం అభివృద్ధి చెందని పాకిస్తాన్, బర్మ, కొన్ని ఆఫ్రికా దేశాలతో పోల్చుకొని మురిసి ముక్కలవ్వాలే కానీ ఒక యాభై, డెబ్భై ఏళ్ల క్రితం మనకంటే వెనకబడి వున్న దేశాల సౌకర్యాలు, అభివృద్ధికి మనం చుట్టుపక్కల లేమని కూడా బాధపడలేం.  దేశ విదేశాల్లో మన ఉనికి కేవలం జీతగాళ్లనే విషయం మరిచిపోతుంటాం.

ఇంక స్త్రీ పురుష సంబంధాలకి, స్త్రీలకి సంబంధించి మనం   రూపొందించుకున్న ఆదర్శాల గురించైతే చెప్పే పనే లేదు.  ఇంతటి ద్వంద్వ ప్రమాణాలు ప్రపంచంలో బహుశా మరే దేశంలోనూ కనబడవు.   సెక్స్ గురించి మాట్లాడటమే తప్పని భావించే మనం అనియంత్రితంగా జనాభా సంఖ్యని పెంచేసుకుంటున్నాం. ఇందుకు స్త్రీల శరీరాలే బలి పశువులు.  పోర్న్ వ్యూయర్స్ గా ప్రపంచంలోనే బహుశా మనం అగ్ర స్థానంలో వున్నాం.  మగపిల్లలు, పురుషులకు మితిమీరిన పొర్న్ లభ్యత పసిపిల్లల నుండి పండు ముదుసలుల వరకు అత్యాచారాలకి గురయ్యే ప్రమాదముంది. మన దేశంలో విలువలన్నీ ప్రధానంగా స్త్రీల చుట్టూ తిరగటం, స్త్రీల మీదనే సంస్కృతి పరిరక్షణా భారం మోపటం మన హిపోక్రసీకి పరాకష్ట. స్త్రీని గౌరవించటమంటే అమ్మతనాన్ని పొగడటం.  ఆయా దేవతారూపాలకి మొక్కటం మనకి తెలిసిన ఆదర్శాలు. స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించి ఎక్కడో చదివిన కొన్ని వైరుధ్యాల్ని ఇక్కడ మీకోసం పెడుతున్నా.  చూడండి.  గ్లామరస్ గా కనిపించే ఆడవాళ్లని, వారి ఫోటోల్ని చొంగ కార్చుకుంటూ చూస్తారు.  మళ్లీ అదే స్త్రీలని తిరుగుబోతులని ముద్రలేస్తారు.  రోడ్ల మీద బహిరంగంగా మూత్ర విసర్జనలు చేస్తారు.  మళ్లీ స్త్రీ పురుషులిరువురూ ఏ మాత్రం సన్నిహితంగా కనబడ్డా సిగ్గులేని తనం అంటారు.  బహిరంగంగా బైటపడే భార్యా భర్తల కీచులాటలు వ్యక్తిగత వ్యవహారాలు కాగా బహిరంగంగా సరదాగా మాట్లాడుకునే స్త్రీ పురుషులు మసాల కబుర్లకి ఆహారమవుతారు.  అసలన్నింటికంటే పెద్ద విడ్డూరమేంటంటే అపరిచిత పురుషులతో పెండ్లికి ముందు మాట్లాడకూడదు కానీ అప్పుడే పెళ్లి చేసుకున్న అపరిచితుడితో పక్క ఎక్కవచ్చు.  స్త్రీలని గౌరవించాలంటాం, దుర్గామాత అంటాం, మాతృమూర్తి అంటాం, మట్టిగడ్డలంటాం కానీ ఆమెని ఎప్పుడూ చులకనగానే చూస్తాం.  మారిటల్ రేప్స్ చట్టబద్ధం అంటాం.

****

మనం నిరంతరం ప్రతీకాత్మక ఆదర్శాల్లో బతుకుతుంటాం.  దేశానికి సంబంధించినంత వరకు మనకి దేశభక్తి అతి పెద్ద ప్రతీకాత్మక ఆదర్శం. మన దేశభక్తి పాకిస్తాన్ పై పళ్లు నూరటం, చైనా వస్తువుల్ని బహిష్కరించమనే పోస్టుల్ని, సందేశాల్ని వాట్సాప్, ఇతర సామాజిక మాద్యమాల ద్వారా వ్యాప్తి చేయటానికి మాత్రమే పరిమితం!  మన దేశంలో అవినీతిని పెంచి పోషించే, దేశాన్ని చిన్నభిన్నం చేయాలని చూసే రాజకీయ పార్టీలపై మన ఆగ్రహాలు సున్న!  ఆగస్ట్ 15, జనవరి 26న జెండాకి సెల్యూట్ కొట్టడం, సినిమా హాళ్లల్లో జాతీయ గీతానికి లేచి నిలబడటం, సైన్యాన్ని విపరీతంగా పొగడటం…మన దేశభక్తికి తార్కాణాలు.  ఇవేవీ ఆచరణాత్మక ఆదర్శాలు కావనే విషయాన్ని మనం గమనించం!  అసలు అవినీతిని విపరీతంగా తిట్టుకునే మనం దాని వ్యవస్థీకృత రూపమైన వర్తమాన రాజకీయ పార్టీల పట్ల ఆరాధనా భావం కలిగి వుండటం దేశభక్తియేనా అని ఏనాడూ ప్రశ్నించుకోం.  దేశ సమగ్రత గురించి విపరీతంగా జబ్బలు చరుచుకునే మనం ఆ సమగ్రతని ఎగతాళి చేసే కులం, మతాల ఉనికిని అసలు ఏనాడూ పరిశీలించం.  ప్రజల్లో తీవ్ర ఆర్ధిక సాంస్కృతిక అంతరాలున్న సమాజంలో, సరిహద్దులలో జాతి వైషమ్యాలున్న దేశంలో సమగ్రతా భావం, ఐక్యత అంత తేలికగా ఎలా సాధ్యమని, అసలు పరిష్కారాలేమిటి,  ఆ దిశగా ఏమిటి జరగాలి అని ఏ మాత్రమూ ఆలోచించలేం.

***

ఆచరణాత్మక ఆదర్శాలు, భవిష్యత్తు గురించి వాస్తవిక ఆశలు, స్వప్నాలు, ప్రణాళికలు లేని సమాజం ఎంతమాత్రమూ ఎదగలేదు.  అట్టి దేశం ఎన్నేళ్లైనా మరో దేశానికి మార్కెట్ కాగలదే తప్ప తన ప్రజలకు, రాబోయే తరాల భవిష్యత్తుకు అవసరమైన మానవీయ అభివృద్ధిని సాధించలేదు.    ఏ ఆదర్శమైనా ఆచరణాత్మకంగా వుండాలి.  అయితే అలాంటి ఆదర్శాలేమిటి?

అతి మౌలిక విషయం ఏమిటంటే ఆదర్శాలు భ్రమల నుండి, వ్యక్తి పూజల నుండి, అహేతుక విశ్వాసాల నుండి, ద్వంద్వ ప్రమాణాల నుండి పుట్టవ్.  ఆదర్శాలు ఎప్పుడూ ప్రశ్నల నుండి పుడతాయి.  పొల్లుకు పొల్లు గింజకు గింజ తీయగల నిష్కర్ష విమర్శ నుండి పుడతాయి.  దాని కోసం తిరస్కరించాల్సిందంతా తిరస్కరించగల గొప్ప రాజకీయ చైతన్యం ఏర్పరుచుకోవాలి.    హక్కుల కోణం నుండి సామాన్యుల జీవితాన్ని మదింపు చేయగలిగినప్పుడు పాలకుల్ని నిలదీయాల్సిన అవసరం, నిలదీసే విధానం కనబడతాయి.  నా దృష్టిలో అదే ఆదర్శం.  అట్టి ఆదర్శాలే ఒక మానవీయమైన నవ సమాజాన్ని నిర్మించగలవు.

*

అరణ్య కృష్ణ

అరణ్య కృష్ణ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మార్క్స్ చెప్పినట్టు ప్రపంచాన్ని వ్యాఖ్యానించడం చేస్తున్నాం గానీ మార్పు తేవడం ఎలా అన్నది ఆలోచించడం లేదు. ఎక్కడైనా మనుష్యుల మనస్తత్వాలు ఒకేలా ఉంటాయనకుంటాను, సమాజం, ప్రభుత్వం కళ్ళెం వేయకపోతే విపరీత ధోరణులు ప్రబలడంలో ఆశ్చర్యం లేదు. ఇది మన దేశంలోని మానసికత అనుకోవడం లో అర్ధం లేదు. నేడు అగ్ర రాజ్యాలుగా వర్ధిల్లుతున్న దేశాలు కొన్ని దశబ్ధాల క్రిందట ఎటువంటి దారుణాతి దారుణమైన పరిస్థితులలో ఉండేవో తెలిసినదే. మన మనసికతను తప్పు పట్టి, అందరినీ విమర్శిస్తూ, పరిష్కార మార్గాలు చూపక వ్యవస్థను చక్క దిద్దే ప్రయత్నాలు గాలిలో సాము చేయ పూనడం వంటిదే అవుతుంది. కాలం చెల్లిన సిద్ధాంతలనే వల్లిస్తూ ఆస్తికుడు భగవత్ సాక్షాత్కారం కోసం ఎదురు చూసినట్టు ఆ లేనివి రానివి వచ్చి ఉద్ధరిస్తాయనుకోవడం భ్రమ తప్ప మరొకటి కాదు. ఇప్పుడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలని ఆకళింపు చేసుకుని వాటికి పరిష్కారంతో బాటు ఒక ఆదర్శవంతమైన ఆర్ధిక సామాజిక వ్యవస్థ నిర్మాణం కోసం చేపట్ట వలసిన కార్యాచరణ వాస్తవిక దృక్కోణం నుండి విచారణ చేయ వలసిన బాధ్యత విజ్ఞులందరి పైనా ఉంది.
  చక్కని విశ్లేషణ రాసిన అరణ్య కృష్ణ గారికి నమస్సులు.

  • ధన్యవాదాలు సార్! నాకు తెలిసిన పరిష్కారం చివరి పేరాలో చెప్పాననే అనుకుంటున్నా.

 • చాలా బాగా చెప్పారు.
  ఆచరణలేని ఆదర్శాల డొల్లతనాన్ని బాగా విశదీకరించారు.

 • ” ఇప్పుడు ఈ దేశంలో రాజు అయితే– తన పరువును పిల్లవాడే (దేవతా వస్త్రాలతో ఊరేగుతున్న రాజు వంటి మీద నూలుపోగు లేదనీ, మొండిమొలతో ఉన్నాడనీ ఉన్నది ఉన్నట్టు చెప్పిన పిల్లవాడు) తన పరువును హత్య చేశాడని ఆగ్రహోదగ్రుడవుతాడు. వాడికి సంకెళ్లు వేయించి, ‘ఉపా’ చట్టం కింద ఖైదు చేయిస్తాడు. మూర్ఖులూ, మాయావులూ, కపటులూ, కబోదిగాళ్ల జేజే ధ్వానాల నడుమ మరింత నగ్నాతినగ్నంగా ఊరేగింపును కొనసాగిస్తాడు. ఇదే వర్తమానంలో రాజు చేస్తున్న నిత్య అకృత్యం! మేరా భారత్ ‘యమ’హాన్!”
  (ఫేస్ బుక్ లో నేను నిన్న పెట్టిన పోస్టులో చివరి పేరా ఇది.)

  ఓ సన్నివేశంగా కళ్ళకూ, ఓ సందడిగా చెవులకూ, ఓ వాస్తవికతగా బుద్ధికీ జుగుప్సను కలిగించే ఇలాంటి దేవతావస్త్రాల ఊరేగింపు ఈ దేశంలో తర తరాలుగా ఉన్నదే. అనేకులకు మానం దాచుకోవడానికి బెత్తెడు గుడ్డ కరువైన నిజం కళ్లెదుట ఉన్నా వేల ఏళ్లుగా దేవతావస్త్రాల నేత నైపుణ్యమూ, వన్నెలూ, లతల గురించి మురిసిపోయే బుద్ధిహీనులకి లోటు లేదు. ప్రస్తుత పాలకులు తమ అవసరాల రీత్యా ఆ బుద్ధిహీనతను దేశభక్తిగా ప్లాన్డ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఓ సినిమాలో ఆవు పాఠం మాత్రమే వచ్చిన పిలగాడికిలా.. ఎక్కడ ఎవరు ఏ ఘనత సాధించినా ‘ఇక్కడి చీకటి గనుల’ నుంచి దొంగతనంగా తవ్వుకుపోయిన వెలుతురు వల్లేనని సిగ్గూలజ్జా లేకుండా, సత్యంతో, చరిత్రతో నిమిత్తం లేని మౌఢ్యంతో వదురుతుంటారు. ‘మానవులు సాధించిన ఘనతల్లో హెచ్చుతగ్గులుగా భూమ్మీద అన్ని దేశాలకూ వాటా ఉంది. ఈ దేశానికీ కొంత ఉంది’ అన్న సత్యాన్ని వినయంగా అంగీరించలేని ఇలాంటి వదరుబోతులకు చరిత్రకూ, పురాణానికీ వ్యత్యాసం చూడని కొందరు విదేశీ చత్వారులు తాళం వేస్తుంటారు.
  మీ వ్యాసం చాలా డొల్లతనాల్ని విప్పిచూపింది. చవిటిపర్రల్నితవ్వి పోసింది. నిజానికి ఈ అంశం మీద ఉద్గ్రంథమే అవసరం. ప్రయత్నించండి.

  • మీ ఫేస్బుక్ పోస్ట్ ముగింపు గొప్పగా వున్నది. మీ అభిప్రాయానికి, ఏకీభావానికి ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు