‘దర్ద్’-అస్తిత్వవేదనతో వొక జాతి ఆర్తనాదం

కొత్త కవిత్వ సంపుటాల గురించి చిరుపరిచయాలు

మీ రాజకీయాల కోసం మీతో కలిసి జీవించే మమ్మల్ని శంకించకండి అవమానించకండి అనుమానించకండి ద్వేషించకండి బలి పెట్టకండి అని గుండె పగిలేలా పెడుతున్న గోస మూలవాసి ముస్లిం కవిత్వం ‘దర్ద్’. ఇది మూడు తరాల సామూహిక ఆవేదన. సాముదాయక ఆందోళన. మేం చొరబాటురారులం కాదు; మా రక్తంలో దేశం వుంది చూడండి అని చేస్తున్న నెత్తుటి ప్రకటన. జాతి నిర్మూలన ప్రోగ్రామ్ లో ప్రాణాలు నిలుపుకోడానికి మనిషి చేస్తున్న పెనుగులాట. బతుకు తండ్లాట.

ఊపిరి మీద ఊహల మీద కలల మీద కలాల మీద గళాల మీద నిఘా పెట్టిన పాడుకాలంలో 27 మంది మూలవాసి ముస్లిం కవుల మూలుగుల్లో ప్రతిధ్వనించిన దుఃఖపు మూల్గు  దర్ద్ –  రాజకీయ విద్వేష విషానికి బలౌతోన్న  దేశ మూలవాసులు ఆత్మ ఘోష.  అస్తిత్వవేదనతో నలిగిపోతోన్న వొక జాతి ఆర్తనాదం.  అవమానాలతో కుంగిపోతోన్న బాధా శప్త జీవుల  ఆత్మ గౌరవపు అత్తరు పరిమళం.  అసమానతల మధ్య అసహనాల మధ్య  నలిగిపోతున్న మనుషుల వెతల కత,  కుట్రల మధ్య కడుపులోపల సుళ్ళు తిరుగుతోన్న సొదను నమోదుచేసిన ఆవర్జా. అనేక అణిచివేతల మధ్య గుండె పొరల నుంచి తవ్వి తీసిన పరాజితుల గాథ.  తమను దేశ పౌరులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న ఆత్మ నివేదన . ‘నేను  యీ  దేశపు బిడ్డను. నన్ను నన్నుగా బతకనివ్వండి’ అని యెలుగెత్తి కేకలు పెడుతోన్న పీడితుల మూకుమ్మడి గొంతు. సౌభ్రాతృత్వపు రక్తబంధాన్ని మోసే మాయి ముంత.  విద్వేషాల అంచులపై నిల్చి ప్రేమతో చేస్తున్న దువా. ఉవ్వెత్తున జ్వలిస్తున్న అలావా. మత్తడి దుంకుతున్న లావా.

ఆధిపత్య మతవాదం మట్టి బిడ్డల్ని మట్టి బెడ్డలుగా తిరస్కరిస్తోన్నప్పుడు ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు  ప్రశ్నించడమే నేరమై ప్రాణాలకు విలువలేక ప్రమాదంలో పడిన సందర్భంలో పౌరసత్వం రద్దై బతకలేక బతుకుతున్న ముస్లిం సమాజం అంతరంగ వేదన ఇది.  రోజుకి అయిదు సార్లు నుదుటితో నేల తల్లిని ముద్దాడే మూల వాసులు పుట్టుకతోనే దేశద్రోహి వుగ్రవాది మచ్చలు  మోసుకుంటూ తమ సొంత నేలమీద పరాయీలుగా తిరుగుతున్నారు. సొంత యింట్లో కిరాయి కడుతూ శవాల్లా గడ్డకట్టుకు పోతున్నారు.  అనుక్షణం అభద్రత. అడుగడుగునా అవమానాలు. అనునిత్యం అవహేళనలు. అంతులేని  అసహనం. విడువని వేట.  వేషం భాష రంగు రూపు తిండీ బట్టా .. అన్నీ విభజనకే కారణమయ్యాయి. 1947  1992  2002 తేదీలు యేవైనా చరిత్ర మానని పుండై సమాధులపై పేర్లుగా మాత్రమే మిగిలి యిప్పటికీ కవితల చద్దిమూటగా అందివచ్చింది. ఈ నేలపై వూదు పొగై వ్యాపించింది.

ఈ కవితల్లో అఖ్లాక్ ల కొన వూపిరిని మన శ్వాసలోకి తర్జుమా చేసుకోగలం. తబ్రీజ్ అన్సారీల వెచ్చటి కన్నీటి స్పర్శ అనుభూతమౌతుంది. రెక్కలు నిమిరే ఆరీఫ్ ల  ప్రేమ యెదను తాకుతుంది.  బుల్డోజర్ కు  ఎదురుగా నిలబడిన షాహీన్ బాగ్ స్త్రీల సిరల్లో  జ్వలించే నెత్తుటి నినాదం వినగలం. ముస్లిం సాహిత్య సామాజిక ఉద్యమకారుడు స్కై బాబా సంపాదకుడిగా మొన్న జల్ జలా నిన్న  అలావా ముఖామీ ఇవ్వాళ  దర్ద్ .. యీ కవిత్వమంతా రక్తాశ్రు సిక్తమై కలవరపెడుతోంది. సాటి మనుషుల అలాయి బలాయి కోరుకుంటుంది. అణచివేతకు గురైన మనిషి దుఃఖసాంద్రతను ఆగ్రహ తీవ్రతను ధిక్కార తీక్ష్ణతను వుద్వేగ గాఢతను కొలిచే పరికరం యేదైనా వుంటే అది కవిత్వమేనని ‘దర్ద్’ మరోసారి నిరూపిస్తోంది.  వేదన శాపంగా మారక ముందే  మేలుకొని తప్పు దిద్దుకోమని హెచ్చరిస్తోంది. హోరు గాలిలో మలగని దీపశిఖలా వెలుగుతోంది.

*

ఏ.కె. ప్రభాకర్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ధన్యవాదాలు ప్రభాకర్ సార్ 🙏🙏🙏

  • నేటి సమాజం ముందు నిలువెత్తు అద్దంలాంటిది దర్ధ్. చెమట, నెత్తురు కలిసి స్రవిస్తున్న పీడిత ప్రజల ప్రతిబింబాలు ఆవిష్కరణ.

  • మూలవాసీ ముస్లింల వేదనకు ప్రతిధ్వనే ‘దర్ద్ ‘ సంకలనం. ” అస్తిత్వవేదనతో నలిగిపోతోన్న వొక జాతి ఆర్తనాదం. అవమానాలతో కుంగిపోతోన్న బాధా శప్త జీవుల ఆత్మ గౌరవపు అత్తరు పరిమళం. “అంటూ ఏ.కే ప్రభాకర్ గారు చేసిన ఈ పుస్తక పరిచయం చాలా ఆర్ద్రంగా ఉంది.వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • దర్ద్ మూలవాసి ముస్లిం కవిత్వం పై అద్భుతమైనటువంటి విశ్లేషణ రాసిన శ్రీరామ్ పుప్పాలకు
    హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🙏🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు