థాయిలాండ్ యాత్రాగాథ

ఈమధ్య మీరు చదువుతున్న పుస్తకాల గురించి “బుక్స్ కార్నర్” శీర్షికకి రాయండి.

 “అలసటనూ, శ్రమనూ జయించటానికి
అతి ఉత్తమ మార్గం కుతూహలం, ఉత్సాహం!” – అంటాడు అమరేంద్ర దాసరి.

** “నేనే యాత్రికుడిని!. నేనేం సరంగుని!.
ప్రతినిత్యం నా ఆత్మలో కొత్త ప్రాంతాలను కనుగొంటారు”- అన్నది ఖలీల్ జిబ్రాన్ మాట.

అందుకే… అమరేంద్ర  ఇవాళ్టి సూర్యోదయం, సూర్యాస్తమయం అబ్బురంగా చూసి, ప్రేమలో పడి, మళ్ళీ పన్నెండు గంటల వ్యవధిలో మరో సూర్యోదయంతో ప్రేమలో పడటానికి నిద్ర పోతాడు, సమాయత్తం అవుతాడు.

ఈరోజు ఏ ప్రదేశాన్ని శోధించాలి, ఏ మనుషులతో కలిసి శోభించాలి అనే ప్రణాళికా రచనతో నిత్యం సిద్ధంగా ఉంటాడు. కోడిని కూయమని సతాయిస్తాడు. మెట్రో రైలుని మరి కాస్త పరిగెత్తమని అభ్యర్థిస్తాడు.

ఏంటి ఈయన ఇంటెన్షన్ ?? ఎందుకిలా కాలంతో కరచాలనం విడివడకుండా పరుగు పెడతాడు అంటే… ప్రతిక్షణం జీవించటం కోసం.. “జీవితాన్ని ప్రేమిస్తున్నామనటానికి నిదర్శనం కాలాన్ని సద్వినియోగం చేయటమే” అన్న మాటను జీవన సూత్రం గా మలుచుకున్నవాడు అమరేంద్ర.

ప్రశ్నించేవాడు ఖచ్చితంగా తెలివైనవాడైతే కావచ్చుగాక…కానీ సమాధానాన్ని అన్వేషించే వాడు మాత్రం తప్పకుండా అన్వేషకుడౌతాడు!. పరిపూర్ణత నొందుతాడు.అచ్చం దాసరి అమరేంద్ర కి మల్లే!

తను మొదటగా మూడునగరాలు, తరువాత స్కూటర్ పై రోహతాంగ్ యాత్ర, అండమాన్ డైరీ, కొన్ని కలలు ఒక స్వప్నం, మణిమహేష్ మరితొమ్మిది అంటూ చివరి రెండూ విలక్షణమైన టైటిళ్లతో అయిదు ట్రావెలాగ్స్ వ్రాసాడు. తాను చూసిన విశేషాలన్నీ చదువరులూ చూసేట్టుగా రచించాడు.

ఇపుడు ఆరొవదిగా “తను మే నెల ఎండల్లో, ఎండను భరిస్తూ తిరుగాడిన ‘థాయ్’ యాత్రను చల్లగా, హాయిగా ఫీలయేట్టుగా అక్కడి అథ్భుతాలతో సింపుల్ , సూటి, భావ వాక్యాలతో గ్రంధస్తం చేసాడు.

బుద్ధిజం నేర్పిన శాంతం, ఒక మంచి రాజు నేర్పిన క్రమశిక్షణ అక్కడి ప్రజల్లో చూసానని చెబుతాడు. ప్రజల్లో రాజు పట్ల గల గౌరవం గురించి చదివి అబ్బురపడతాం. రైల్వే మార్కెట్, జల విపణి , గ్రాండ్ పాలెస్ విశేషాలు పాఠకుడిని ‘నువ్వూ పోయి రారాదూ’! అని తొందర చేస్తాయి.ఊరిస్తాయి.
ఇంకా గ్రాండ్ పాలెస్కు వెళుతూ, విక్టరీ మాన్యుమెంట్ ప్రాంతపు నగర ఛాయలు క్షణాల్లో మాయమై, బస్సు రాచరికపు రాజధానిలో ప్రవేంచడాన్ని, తాను బస్సులో ఉన్నానా, లేక టైం మిషన్లోనా అని అబ్బురపడిపోయి, మనల్నీ అబ్బురపరుస్తాడు.

కామాలూ, ఫుల్ స్టాప్లూ పట్టింపులేని రికీ అంటూ చెణుకులూ విసురుతాడు.
“ఎంత గొప్ప దృశ్యమన్నది గాదు! దాన్ని ఎంత మనసుతో ఆస్వాదించామన్నది అతి ముఖ్యం అనే ఈ నిరంతర పధికుడు… గొప్ప కార్యక్రమమే పెట్టుకున్నాడు. ఎందుకంటే- ” కాలం అడుగులు చప్పుడు ఎవరం వినలేం.
దాని ఆగమనా, నిష్క్రమణలూ గమనింపు చేయలేం!. కానీ అమరేంద్ర వంటి నిత్యాన్వేషులు, తాము అందరూ సాధారణ క్షణాలు గా భావించే కాలాన్ని ‘అనుమోల్ రతన్’ అన్నట్టూ గడపటమేగాక, భావితరాలకోసం రిజిస్టర్ చేయగలుతారు. కాలం నడకను మనకోసం సంగీతం చేసి వినిపిస్తుంటారు.
ఓ ప్రదేశంలో మూడు రోజులున్నానంటే ఇక ఆ ప్రదేశంతో ప్రేమలో పడిపోతానంటాడు అమరేంద్ర.
నిజంగా అలాగే ఎండనూ, అలసటను లెక్కచేయక ఆయా ప్రాంతాలను శోధించి, స్పృశించి, మనుషులను పలకరించి, పరవశించి ఇదిగో ఇలా ఓ యాత్రా విశేషాల పుస్తకం గుఛ్ఛం తెచ్చి మన చేతికిచ్చి, మనమూ వెళ్ళాలని ఊగేలా కవ్విస్తాడు.

** “నేనెపుడూ ఒంటరినిగాను .
నాకు నేనే నిరంతరం తోడు!” అన్నది అమరేంద్ర ఎపుడూ చెప్పే కొటేషన్.

ఒక మనిషి ఇంత సక్సెస్ఫుల్ గా  “ఎరౌండ్ ది  వర్ల్డ్ విత్ ఎయిట్ డాలర్స్” అనేట్టూ తిరుగుతున్నాడంటే, అతడు సామాన్యుడు గాదు‌‌…అతని ఆర్థిక, సమయ- క్రమశిక్షణ, ఓపిక సాధనా, ప్రకృతి పిపాస,తోటి జీవులపై ఎనలేని సొంతభావన గల అసామాన్యుడనీ  నా పరిశోధన.

టాగోర్ చెప్పిన విశ్వప్రేమ సాధనలో నిత్యం బిజీగా ఉంటూ, ప్రేమని పంచుతూ, తిరిగి అంతకంతా  పొందుతాడు ఈ ధన్యజీవి.
అతడికి, ట్రావెలర్గా తిరుగుతూ కొత్త ప్రాంతాల జీవన శ్వాసనూ, అక్కడి వాసుల జీవనచైతన్యాన్ని పట్టుకోవటం ఇష్టం…ఆ అనుభవాలను గ్రంథస్తం చేయటం, ఊరూరా సంపాదించిన ఆప్తులైన స్నేహితులకు ఆయా విశేషాలను వినిపించటం ఇష్టం. మనుషులను కలవటం ఇష్టం. ప్రకృతిని కళ్ళతో త్రాగడం ఇష్టం. దూరాలను కాళ్ళతో కొలవడం ఇష్టం.
రాహూల్ సాంకృత్యాయన్ తరువాత ఒకరో అరో తప్పితే పెద్దగా ట్రావెలాగ్స్ వెలువరించిన వారు లేరు. ఇపుడిక ఇతడిపై కొంత ఆశని బరువు పెట్టొచ్చు.
రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు గనుక ఈ పూట విశ్రాంతి తీసుకోండి అని హోస్ట్ అడిగినపుడు అమరేంద్ర సమాధానం” విశ్రాంతి ఎపుడైనా తీసుకోవచ్చును. ఓ పూటంతా రైల్లో తిరిగే అవకాశం వస్తేఎలా ఒదులుకుంటాను!”అని.

దీనినిబట్టే నమ్మొచ్చు. ఈ నిరంతర పధికుడు నిలవని గడియారపు ముల్లై, భ్రమిస్తూ మనకోసం మరిన్ని యాత్రా విశేషాలు చక్కని గ్రంధాలుగా అందిస్తాడనీ. కాళ్ళకి దూరంగనుక  మన కళ్ళను మాత్రం తన వెంటే తిప్పుతాడనీనూ.

*

మనోజ నంబూరి

మనోజ నంబూరి

ఇటీవల సాక్షిలోనూ, ప్రజాశక్తిలోనూ కథలు ప్రచురించారు. రేడియో గుల్దస్తా కార్యక్రమంలో ఆరు కథలు ప్రసారం. కొన్ని బాలల కథలూ,నాటికలూ,బుర్రకథలూ...

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు