తస్లీమా నస్రీన్ కవితలు కొన్ని

నిజానికి, నేను అన్నం ముట్టుకున్నపుడు

నా చేతికి వచ్చేది అన్నం కాదు..

పిడికిటి నిండా బంగ్లాదేశ్ వస్తుంది.

అంతర్జాతీయ సాహిత్య ప్రపంచంలో తస్లీమా నస్రీన్ పేరు తెలియని వారుండరు. ఆమె బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ నగరంలో 1962 లో జన్మించారు.1984 లో మెడిసిన్ పట్టా పుచ్చుకొని, బంగ్లా రాజధాని ఢాకాలోని ఆసుపత్రులలో ప్రసూతి నిపుణురాలుగా, మత్తు వైద్యురాలుగా పని చేసారు. తన మెడిసిన్ చదువుల కాలంలోనే ఆమె బలమైన స్త్రీవాద రచయిత గా రూపొందారు. కవిత్వమూ, నవలలు,వ్యాసాలు ప్రచురించారు.ఆమె ప్రచురించిన ‘లజ్జ'(Shame,1993 ) నవల హిందూ ముస్లింల మధ్య ఉద్విగ్నతలను ప్రమాదకరంగా రెచ్చగొట్టే విధంగా వుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం 1994 లో నిషేధించింది. ఆమె లౌకిక, స్వేచ్చాయుత దృష్టికోణం ముస్లిం పక్షపాత మతతత్వ ధోరణులను బహువిధాలుగా ఎండగట్టింది.ఎన్నో చర్చలు, వాదోపవాదాలు రగిల్చింది. దాంతో కోపోద్రిక్తులైన బంగ్లాదేశ్ లోని సంప్రదాయవాదులు దైవదూషణ చేసినందుకు గాను ఆమెను ఉరి తీయాలని ఆందోళనలు చేసారు. దాంతో తస్లీమా నస్రీన్ రహస్యంగా బంగ్లాదేశ్ ను వదిలి స్వీడన్‌లో తలదాచుకున్నారు.

ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె ఆత్మకథలు ‘అమర్ మేయెబెల'( My Childhood, 2002 )ను ; ‘ఉతల్ హవా'( wild wind )ను 2002లో, ‘ క'( Speak up )ను 2003 లో  నిషేధించింది.పశ్చిమ బెంగాల్ లో ముద్రితమైన  ‘ద్విఖండిత ‘ను కూడా బెంగాల్ ప్రభుత్వం నిషేధించి,2005 లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.మొత్తం గా ఏడు భాగాలుగా తస్లీమా ఆత్మకథనాలు ముద్రితమైనాయి. వివాదాస్పదమయ్యాయి.

తస్లీమా ఇప్పటివరకు 30 పుస్తకాలు ముద్రించారు. 20 కు పైగా భాషలలోకి ఆమె పుస్తకాలు అనువాదం అయ్యాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి 1992,2000 సంవత్సరాలకు గాను ఆనంద పురస్కారం;1994 లో యూరోపియన్ పార్లమెంట్ నుండి సాక్రోవ్ పురస్కారం, 1994 లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి మానవ హక్కుల పురస్కారం,1994 లో స్వీడన్ ప్రభుత్వం నుండి కుర్ట్ టుకులోస్కీ పురస్కారం వంటి అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. బెల్జియం( 1995 ),పారిస్( 2005 ),ఫ్రాన్స్( 2011 ) వంటి దేశాల యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ లు పొందారు.

ఈ కవితలు ఆమె రాసిన కవితా సంపుటుల నుంచి తీసుకున్నవి. స్త్రీల హక్కులు,మతతత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించి,నిలదీసే రచయిత్రిగా పేరు పొందిన తస్లీమా నస్రీన్ ఒక ప్రత్యేక స్వరంతో  స్త్రీల ఆంతరంగిక ప్రేమ,నిరీక్షణ,ఆశ, నిరాశ,స్వేచ్ఛాయుత భావ ప్రకటన వంటి విషయాలను ఈ కవితలలో నిర్భయంగా వ్యక్తపరిచారు. తస్లీమా నస్రీన్ లోఆలోచనలు పరుచుకున్న ఈ కవితలు మన మనసులను కదిలిస్తాయి. కల్లోల పరుస్తాయి. ఆషిమ్ చౌదరి ఇంగ్లీషు చేసిన కవితలకు తెలుగు అనుసృజనలివి:

 

1.ప్రవాస పద్యం

చేయంతా నిండిన

చేప,అన్నమూ,మరింత పప్పుతో

భోజనం బల్ల దగ్గర కూచున్న ఈ రోజులలో

తరచుగా నా ఎడమచేయి ఈగల్ని

ఎప్పుడూ తోలుతూనే వుంటుంది.

స్కాండినేవియాలో ఏ.సి.గదిలో

ఏ ఈగలు,పురుగులు లేకపోయినా

దేనినో దూరంగా తోలుతూనే వుంటాను.

నా దుఃఖాన్నా…?

 

పళ్లెం అంచున

పాపం ఒక చేపముక్క,

కూరగాయలు,చిడికెడు ఉప్పు,

చిక్కని పులుసులో కలిపిన అన్నం –

పళ్లెంలోంచి చేయి తీయబుద్ధి కాదు;

రోజంతా ఇలా అన్నం కలుపుతూ

చాటుగా తినాలని వుంటుంది.

విలాస విలంబర జీవితం కన్నా

అన్నం రుచి,వాసన

ఎందుకు కావాలనిపిస్తుందో నాకు తెలీదు.

 

నిజానికి, నేను అన్నం ముట్టుకున్నపుడు

నా చేతికి వచ్చేది అన్నం కాదు..

పిడికిటి నిండా బంగ్లాదేశ్ వస్తుంది.

 

2.మొర

 

నీ ముంగిలికి రావడానికి

నేను వేలవేల మైళ్ళు పయనించి వస్తాను.

ఒక్కసారి నా పేరు చెప్పు-

కొండ మీద జెంటియానా పూలన్నీ

ఏరి నీకిస్తాను.

ఒక్కసారి నా పేరు పలుకు-

మాపల్,జునిపెర్ తరువుల రంగులతో..

తొలివానల జల్లులలో

నిన్ను తడిపేస్తాను.

దాహం వేస్తోందా ? ఏం పర్వాలేదు.

దనుబె,టైబెర్,రినె నదుల నీళ్లన్నీ

నీకు ధారపోస్తాను.

 

నీ లోగిలికి రావడానికి

నిను తాకడానికి

మహాసముద్రం దాటి వస్తాను.

ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నానని అను-

ఈ విశ్వాన్నుంచి విడివడి

నీకు నన్ను సమర్పించుకోకపోతే చూడు.

 

3.సాగర దృశ్యం

 

పదహారు ప్రాయంలో వున్నపుడు,

నిద్రలో రాత్రంతా

సముద్రం పిలిచేది.

పద్దెనిమిది వయసపుడు,

లోనా బయటా ప్రతి ఒక్కరికి

కడలిహోరు వినిపిస్తుంది.

 

ఇప్పుడీ కెరటం కరచిన శరీరం,

ఇప్పుడీ సముద్రపు లవణం..

చేపపొలుసుల రుచిలా వుంటుంది.

ఇప్పుడీ ఆటుపోట్లను వెనక్కి నెట్టడానికి

నా బతుకుఆనకట్టను అడ్డుగా వుంచాను.

 

పద్దెనిమిది వయసు ముగియడానికి

ఎక్కువ సమయం పట్టదు.

ఆటుపోట్లు వస్తాయి.

ఆటుపోట్లలో కొట్టుకుపోయిన వాళ్లు..

ఆ చకోరాలు..ఆ దారి..మొరపెడతాయి.

ఆత్రుత గలిగిన ఆ సంచారి బాహువులు-

మనం ‘దాహంతో’ వున్నపుడు

ఎప్పుడు దాటి వెళ్లామో తెలీదు.

 

జీవ జలాలు చాలా విస్తారంగా

అంతులేనివిగా మారాయి.

మీరు ఆ రెంటినీ పోల్చి చూస్తే

సముద్రం మధ్యాహ్నం సరస్సులా కనిపిస్తుంది.

 

4. చీమలా కొంతవరకు ..

 

మనం ఒకరినొకరు తాకకుండా

ముఖతా సంవత్సరానికి రెండుసార్లు కలిసి..

”ఎలా వుంది జీవితం?” లాంటి కొన్నిమాటలు అనుకుంటే..

రక్తంలో జ్ఞాపకాలకొమ్మలు వెర్రిగా వణుకుతాయి.

కన్నీళ్లతుఫానులో ఆనందరాశి పోగవుతుంది.

 

బల్ల మీద వెజిటబుల్ సూప్ చల్లారుతున్నపుడు

నువ్వు యథేచ్ఛగా ప్రేమ గురించి మాట్లాడుతుంటే..

నీ కళ్లని చూస్తూ..

కదలాడే నాలుకను చూస్తూ..

నేను చాలాకాలం బ్రతకాలనుకుంటాను.

 

కనీసం యేడాదికి ఒక్కదారి

మనం కలుసుకుని..

అనుకోకుండా నువ్వు ప్రేమ గురించి మాట్లాడితే..

కరువు నిండిన నా జీవితంలోకి

నీటి జలపాతం ఉరుకుతుంది.

 

కనీసం మనం యేడాదికి ఒకసారయినా కలవకపోతే..

నిజం కాకపోయినా..

ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే అనుకుంటాను-

 

ప్రేమ లేకపోయినా చీమ బతకగలదు.

కానీ..మనిషి బతకగలడా..?

 

  1. తెలుసుకోవడం

 

నేను అనుకున్నంత

మగాడేం కాదతడు.

అతడు సగం నపుంసకుడు.

సగం మగాడు.

 

జీవితమంతా ఒక వ్యక్తితో గడుపు..

కానీ నిజంగా ఆ మనిషేమిటో నీకేం తెలుసు ?

ఇన్ని రోజులూ అతన్ని

సరిగ్గా ప్రోషించానుకున్నా గానీ

అతడలా లేనే లేడు.

నాకు తెలుసనుకునే వ్యక్తి

నాకు అంతగా తెలీదు.

 

నేను అనుకున్నంత

మనిషేం కాదతడు.

అతడు సగం మృగం.

సగం మనిషి.

 

  1. అతను వెళ్తాడు

బూడిద రంగు చొక్కా వేసుకొని

నైరుతి ప్రాంతం నుంచి

ఒక కల, ప్రతిరోజూ వచ్చి

కొన్ని మధ్యరకపు మాటలు చెప్పి వెళ్లిపోతుంది.

ఎక్కడా అతను ఎక్కువసేపు కూర్చోడు.

నేను అతన్ని ఎలా వున్నావని అడిగితే

చూపుడువేలు కదిలించి

గులాబీ రేకుల నుండి

ఒకటో రెండో మంచుబిందువులు రాలుస్తాడు.

 

అతడు మంచులో చేతులు తడిపి

గోడ చాటుగా పారిపోతాడు.

గత పద్దెనిమిది యేళ్లుగా

అతని మీద పోలీసుల గస్తీ ప్రకటన

జారీ చేయబడి వుంది.

 

ఆ కల ఈరోజు పట్టణాన్ని వదిలి

అర్థరాత్రి పశ్చిమానికి మాయమవుతుంది.

కల లాంటి అతడు అడవిలోకి వెళ్తాడని

నేను విన్నాను.

*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముమ్మారు కరగించి పోతపోసినా బంగారం వన్నె తరగదు. చూసేందుకు మామూలుగా ఉన్నా నేపథ్యం తెలిస్తే గుండె చప్పుళ్ళు ఇంకా గొప్పగా వినిపిస్తాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు