డేటా సెంటర్లో దెయ్యం

“ఈ సంఘటన జరిగి దాదాపు ఆరేళ్లవుతోంది.” ఉపోద్ఘాతంలా చెప్పాడు కులకర్ణి.

“ఈ పరిస్థితులలో, ఎందుకో ఈ సంఘటన మీతో పంచుకోవడం సందర్భోచితంగా ఉంటుందనిపించింది. ఈ సంఘటనతో ప్రత్యక్ష సంబంధమున్న మూర్తి గారు కూడా ఎలాగూ ఇక్కడే ఉన్నారు. వారు కూడా మనకి కొన్ని విషయాలు తెలియచేస్తారు”

అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక కేంద్ర  ప్రభుత్వ పరిశోధనాసంస్థ నిర్వహించిన  స్వల్పకాలిక శిక్షణ ముగింపు సభకి కులకర్ణి గారిని  ముఖ్య అతిధిగా పిలిచారు నిర్వాహకులు. కులకర్ణి గారు ఇంటలిజెన్స్ కార్యాలయంలో ఐటీ విభాగానికి డైరెక్టర్ గా పనిచేసి ఈ మధ్యనే రిటైరయ్యారు. తన సర్వీసులో పరిష్కరించిన కొన్ని ముఖ్యమైన కేసులను, ఛేదించిన ఆసక్తికరమైన కొన్ని సవాళ్ళని ఒక పుస్తకంగా తేబోతున్నారు. ఏ విషయాన్నైనా చక్కగా కథలా, జనరంజకంగా చెబుతారని ఆయనను చాలా సమావేశాలకు పిలుస్తుంటారు. ఆయన వృత్తిరీత్యా బెంగుళూరులో ఉంటున్నా హైద్రాబాద్ తో కూడా ఆయన అనుబంధం మర్చిపోలేనిదని ఆయనే చెప్పుకుంటుంటారు .

“ఈ వారం రోజుల శిక్షణ మీకు కొత్తవిషయాలను పరిచయం చేసిందని, మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలను మీ వృత్తిలో అనుసరించి ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అని ఒక నిముషమాగి, ఆ హాల్లోని ఆహ్వానితులందరినీ పరికించి చూసాడు. యాభై మంది ఇంటలిజెన్స్ ఇనస్పెక్టర్లు రెఫ్రెషర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి తమతమ విధులకు వెళ్లిపోయేముందు ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశమది. చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్లను, కుటుంబాలను వదిలి వచ్చి వారం రోజులైనందువల్ల ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు రైలెక్కేద్దామా అన్నట్టున్నారు. కులకర్ణి గారు చిన్నగా నవ్వుకుని –

మీ శిక్షణా కార్యక్రమానికి మూర్తిగారు కోఆర్డినేటర్ గా ఉన్నారంటే, ఆయన ఈ వారం రోజుల్లో మీకు మీ అత్తవారింటిని గుర్తు తెప్పించేవుంటారు. ఆయన ఆతిధ్యాన్ని చవిచూసినవాణ్ణి కాబట్టి ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను. మూర్తిగారు చాలా సరదా మనిషి. మీరు బహుశా ఈ వారం రోజుల్లో అది గమనించేవుంటారు. అది ఇల్లయినా, ఆఫీసయినా చుట్టూ ఉండే వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చగల చతురత, నేర్పు చాలాకొద్ది మందికే ఉంటుంది. అందులో మూర్తి గారు మొదటి వరుసలో వుంటారు.” ఆగి, అందరూ అవునన్నట్లు తమ తలలను  ఊపుతుంటే, తానూ దాన్ని అంగీకరిస్తున్నట్టు తలపంకించి,

“అలాంటి మూర్తిగారికి ఒక రాత్రి నిద్రని దూరం చేసిన కథ ఇది” అన్నారు. అందరి మొహాల్లో చిరునవ్వులు మొలిచాయి. మూర్తిగారు  ఏదో జ్ఞాపకమొచ్చినవాడిలా ముసిముసి నవ్వులు చిందించారు. కులకర్ణి తన లాప్టాప్ లో ఒక బటన్ నొక్కి ఎదురుగా స్క్రీన్ మీద బొమ్మ కనబడుతోందని నిర్ధారించుకుని,

“ఇదే మన కథా స్థలి” అని, ఎదురుగా ప్రొజెక్టర్ స్క్రీన్ మీద బొమ్మని చూపిస్తూ చెప్పారు. దాని తరువాత స్లయిడ్ లో ఆ బొమ్మకి సంబంధించిన వివరాలిలా వున్నాయి.

” 2010 వ సంవత్సరంలో ప్రారంభించి 2012 లో పూర్తి చేసిన కేంద్ర డేటా సెంటర్ ప్రాంగణం. విస్తీర్ణం 50 ఎకరాలు. నగరానికి 30 కిలోమీటర్ల దూరం. హైవే నుండి 3 కిలోమీటర్ల లోపలకి,రంగనపల్లి గ్రామపంచాయతీ దగ్గర. డేటా సెంటర్ సామర్ధ్యం 500 ర్యాక్ స్పేస్. పదివేల సర్వర్లు, 10 జీటాబైట్ల స్టోరేజి. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అన్ని శాఖలు, సంస్థలు తమ తమ విభాగాల సమాచారాన్నంతా ఇక్కడే భద్రపరుస్తారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే 24 గంటల పాటు ప్రత్యామ్నాయ విద్యుత్తును అందించే జెనెరేటర్లు, సీసీ టీవీలు, రాత్రంబవళ్ళు సుశిక్షితులైన కాపలాదార్లు…దేశానికి మెదడులాంటిది ఈ సెంటర్.”

ప్రొజెక్టర్ ఆఫ్ చేసి  మైకు చేతిలోకి తీసుకుని-

“అలాంటి సెంటర్ కి మూర్తిగారు పరిపాలన, నిర్వహణాధికారిగా ఉండేవారు. మంచి కళాభిరుచిగల మూర్తిగారు ఆ ప్రాంగణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దారు. యాభైమంది టెక్నీకల్ స్టాఫ్, మరో యాభైమంది సపోర్ట్ స్టాఫ్ ఉండేవారనుకుంటా. అందరికీ అక్కడే క్వార్టర్స్ ఉండేవి. అయినా కొందరు సిటీ నుండి షటిల్  చేసేవారు. సెక్యూరిటీ స్టాఫ్ కి కూడా మంచి వసతి సదుపాయం ఉండేది. సిటీకి దూరం అన్న భావన తప్ప అన్నీ వుండేవి. అవునా మూర్తి గారూ ? అంటూ మూర్తిగారి అంగీకారం కోసం ఒక్క క్షణమాగి, మళ్ళీ

“అంతా సవ్యంగా ఉందనుకున్నరోజుల్లో, డేటా మాత్రమే ఉండాల్సిన ఆ సెంటర్లోకి ఒక దెయ్యమొచ్చింది”

అందరూ ముసిముసిగా నవ్వడం చూసి,

“  అరె, మీరు సరిగానే విన్నారు. అయితే ఆ దెయ్యమెలా వచ్చిందో, దాన్ని పుట్టు పూర్వోత్తరాలేమిటో అప్పటి ఆ సెంటర్ నిర్వహణాధికారిగా ఉన్నమూర్తి గారి నుండి విందాం. ఆ తరువాత నేను కొనసాగిస్తాను” అంటూ మైకుని మూర్తి చేతికిచ్చాడు .

మూర్తి , ఊహించని ఈ అభ్యర్ధనను తోసిపుచ్చలేక నవ్వుకుంటూ

“తప్పకుండా” అని, “ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు” అని ఓ పది సెకన్ల తరువాత

” డేటా సెంటర్ కార్యక్రమాలు ప్రారంభమైన రెండేళ్ల వరకూ మాకు విపరీతమైన పని ఉండేది. కొత్త వాళ్లకు వసతి ఏర్పాట్లు, అమ్మకం దారుల హడావిడి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డేటాను మా దగ్గర భద్రపరచడానికి కావలసిన ఏర్పాట్లు, అందుకు తగిన శిక్షణాతరగతులు, ఇలా రెండేళ్లు తీరిక లేకుండా గడిచిపోయాయి. ఆ తరువాత అన్నీ కుదుటపడ్డాక, ఒక వేసవి మధ్యాహ్నం సాహు అనే ఇంజనీరు నా రూంలోకి వచ్చాడు.

సాధారణంగా ఇంజినీర్స్ కి నాతో పెద్ద పనులేమీ వుండవు. వాళ్ళ నివాసాల్లో ఏదైనా మరమ్మత్తులుంటేనో ,  లేదా, సిటీకెళ్లి రావడానికి వాహనం ఏర్పాట్లో, ఇలాంటి చిన్న చిన్న అవసరాలేవో ఉంటాయి. అయితే, నేనే వాళ్ళతో కల్పించుకుని మాట్లాడుతూ, సాయంత్రాలు ఉల్లాసంగా గడపడానికి టెన్నిస్ కోర్ట్ వేయించి, ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేసి, దేశం నలుమూలల నుండి వచ్చినవాళ్ళకు విసుగు రాకుండా చూసుకునేవాడిని. అలా అందరూ గుర్తుపెట్టుకునే చనువుండేది

వచ్చినవాడు మాటా మంతీ లేకుండా అలాగే నిల్చునే వున్నాడు. ఏదైనా పెద్ద విషయమేమోనని కూర్చోండని కుర్చీ చూపించాను.

ఆ అబ్బాయి కొంచెం ఇబ్బందిగా, బెరుకుగా… ఏదో విషయాన్ని చెప్పాలా, వద్దా అనే సంశయంతో ఉన్నట్టు నేల చూపులు చూస్తూ, నీళ్లు నములుతుంటే నేనే చొరవగా, “చెప్పండి, డోన్’ట్ వర్రీ , నాతో మీరు ఏ విషయమైనా నిరభ్యంతరంగా, నిస్సందేహంగా మాట్లాడొచ్చు” అని భరోసా ఇచ్చాక,

” సార్, మీరు మరోలా అనుకోనంటే, మీకొక విషయం చెబుతాను” అని రహస్యం చెబుతున్నట్టు, టేబిల్ మీదకు వంగి, నా మొహంలో మొహం పెడుతూ

” సార్, మన డేటా సెంటర్ చుట్టూ రాత్రిళ్ళు ఒక దెయ్యం తిరుగుతోంది సార్” అన్నాడు.

నేను తేలికగా నవ్వేసాను.

వెంటనే మొహమంతా  సీరియస్ గా పెట్టి

“అదిగో చూసారా, నేనింకా పూర్తి చేసే లోపలే, మీరు ఖండించడానికి సిద్దపడుతున్నారు. దయచేసి నా మాట వినండి. ప్రతిసారి అమావాస్య, పౌర్ణిమలకు ఒక ఐదు రోజులు అటూ ఇటుగా, ఒక దెయ్యం మన సర్వర్ రూమ్ దగ్గర తిరుగుతుంటుంది. మన నెట్వర్క్ ఇంజనీర్ కూడా రాత్రుళ్ళు ఒక్కడే డ్యూటీ లో ఉన్నప్పుడు ఆ చప్పుళ్ళు విన్నాడు. ఒక నీడ కదులుతూ పోవడం, మధ్య మధ్యలో వింత వింత చప్పుళ్ళు చేయడం. ఇవన్నీ చూస్తే మన పాత సెక్యూరిటీ నర్సింగ్ చెప్పిన విషయం నిజమేననిపిస్తోంది” అంటూ విరామం లేకుండా మాట్లాడేశాడు.

అతనికి అనేక రకాలుగా సర్ది చెప్పాలని ప్రయత్నించాను. అయినా అతని అభిప్రాయం మారలేదు.”

మూర్తి మాటలకు అంతరాయం కలిగిస్తూ శ్రోతలలో ఒకతను,

“అంతకు ముందు సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పారో చెప్పలేదు మీరు” అని గుర్తు చేసాడు.

మూర్తి నవ్వుతూ, ” సి.ఐ.ఎస్.ఎఫ్ వాళ్ళు రాకముందు నర్సింగ్ అని లోకల్ ఏజెన్సీ వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ ఉండేవాడు. వాడో పెద్ద వాగుడు కాయ. అక్కడున్న కూలీలకు, ఈ స్థలం ఒకప్పుడు స్మశానమని, అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని కథలు కథలు చెప్పేవాడు. సెంటర్ కార్యకలాపాలు మొదలై సి ఐ. ఎస్.ఎఫ్. వాళ్ళు మొత్తం సైట్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నాక, అక్కడే తోటమాలిగా కొనసాగాడు. ఆ సమయంలో తన భయాన్ని పోగొట్టుకునేందుకు ఒక హనుమంతుడి పటం పెట్టి చుట్టూ నాలుగు రాళ్లు పాతి, ఈ ఆంజనేయుడు ఉన్నంత వరకూ దెయ్యాలు ఆ ఛాయలకు గూడా రావని అందరికీ చెప్పేవాడు. కొన్నాళ్ళకి, డ్యూటీలో తాగినందుకు పనిలోకి రావద్దని చెబితే సిటీలో వాళ్ళబ్బాయి దగ్గరకు వెళ్లి పోయాడు. కానీ ఉన్నన్ని రోజులు దయ్యం గురించి ఊరికే హడావుడి చేసేవాడు. ఆ విషయాన్నే సాహూ గుర్తు చేసాడు.

మళ్ళీ మన సాహూ దగ్గరకు వస్తే, ఆ అబ్బాయి నా మాటల వల్ల  కన్విన్స్ కాలేదని ఆ తరువాత జరిగిన చాలా సంఘటనలవల్ల నాకు అర్థమైంది. ప్రతిచిన్న విషయాన్ని భూతద్దంలో నుండి చూడడం, ప్రతి వైఫల్యాన్ని దయ్యంతో ముడిపెట్టడం, వాళ్ళ మాటల మధ్యలో కూడా, దేవుడున్నాడు అని నమ్మితే దెయ్యాలున్నాయని  కూడా నమ్మాలి కదా అని, వాళ్ళ ఊరిలో వాళ్ళ బంధువులకు జరిగిన కొన్ని అనుభవాలు, హారర్ సినిమాల చర్చ, ఇలాంటివే మరికొన్ని. అయితే అతని స్నేహితులు కూడా ఈ విషయం మీద అతనిని ఆటపట్టించేవాళ్ళు. ఏదైనా వస్తువు తీసి దాచేయడం, దానిని దెయ్యానికి ముడిపెట్టి ఏడిపించడం, కుర్రాళ్ళు, ఒంటరిగాళ్లు, ఆ వయసులో ఏమేమి చేయాలో అన్నీ చేసి తమాషా చూస్తుండేవాళ్లు. ఒకసారి ఒక అప్లికేషన్ సర్వర్ పనిచేయలేదు. సాహూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్. అన్ని సర్వర్స్ బాగున్నాయి కానీ , ఇది మాత్రమే రెస్పాండ్ కావడం లేదు. అప్పుడు ఎంత హడావుడి చేసాడంటే, ఎవరో తనను టార్గెట్ చేస్తున్నారని, తనపై చేతబడిలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయని, దాని ఫలితంగానే ఆ సర్వర్ పనిచేయడం లేదని వాపోతుంటే, అతనిని బయటకు పంపేసి, కులకర్ణి గారికి ఫోన్ చేసాము.ఒక రెండు గంటల దర్యాప్తు తరువాత తెలిసిందేమిటంటే, అదేదో డిడాస్ అటాక్ అంటారట, దానివల్ల ఈ అనర్ధం జరిగిందని కులకర్ణి టీం వాళ్ళు తేల్చారు. ఎట్టి పరిస్థితులలో ఇంటర్నెట్ ని డేటాసెంటర్ కి కనెక్ట్ చేయవద్దని సూచించారు. అక్కడితో ఆ వివాదం సద్దు మణిగింది.

మూర్తి గారు నిర్వాహకులను మంచి నీళ్ల కోసం అడిగి, రెండు గుటకలు తాగి,

” మీ టైం ఎక్కువ తీసుకోకుండా అసలు విషయంలోకి వచ్చేస్తా! ఈ డిడాస్ సంఘటన తరువాత ఒక  నెలరోజులకు కాబోలు, సరదాగా అందరితో ఒక పిక్నిక్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఏర్పాట్లలో భాగంగా సిటీ కెళ్ళాను. తిరిగి ఆఫీస్ కి బయలుదేరుతుంటే ఫోన్ రింగయింది.

ఇంటి నుండి మా ఆవిడ కాల్ చేస్తోంది.

“ఏమండీ, ఎక్కడున్నారు? మీకీ విషయం తెలుసా? టీవీ లో మీ డేటా సెంటర్ గురించిన బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. మీ దగ్గర నుండి ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ అవుతోందని రక్షణ శాఖ వాళ్ళు చెబుతున్నారు. టీవీ వాళ్ళు కొద్ది మందిని ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరెక్కడున్నారు? ఎప్పుడొస్తున్నారు?” హడావుడిగా మాట్లాడింది.

ఒక్క క్షణం నిలువెల్లా కంపించి పోయాను. ముఖమంతా రక్తంతో గడ్డకట్టి పోయింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇదేమన్నా చిన్నవిషయమా? కారాపమని డ్రైవరు కి చెప్పి మరిన్ని వివరాలు కనుక్కుని ఆఫీస్ కి ఫోన్ చేశాను. డైరెక్టర్ గారు అగ్గిమీద గుగ్గిలమైపోయారు. అవరా మరి? సీనియర్ కదా అని నీ మీద వదిలేస్తే, ఏం చేస్తున్నావని నిలదీశారు. ఇక్కడ కొంపలంటుకుపోతుంటే, పిక్నిక్ పని మీద తిరుగుతున్నావా? అని చాలా తీవ్రంగా మాట్లాడారు. పదినిముషాల్లో ఆఫీస్ లో ఉండాలని హుకుం జారీ చేశారు.

ఎక్కడైనా ఎవరైనా అంతే కదా,  సవ్యంగా జరుగుతున్నంత వరకూ ఎవరూ ఏమీ పట్టించుకోరు. కొంచెం అటూ ఇటూ అయిందంటే మాత్రం ఎవరూ, ఎటువంటి వాడూ,అనే విచక్షణ లేకుండా అరిచేస్తారు. సరే, ఏం చేస్తాం అనుకుంటూ, డ్రైవరు తో కాస్త త్వరగా చేరుకోవాలని చెప్పి కళ్ళు మూసుకున్నాను.

అర్థ గంటలో ఆఫీస్ చేరుకున్నాము.

ఆఫీస్ లో అందరూ- ఇంట్లో ఎవరో చనిపోయినంత దిగులుగా, అటూ ఇటూ, గుంపులు గుంపులు గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, సంతాప సూచకంగా ముఖాలు వేలాడేసుకుని… మొత్తం ఆ వాతావరణమే నిస్తేజంగా తోచింది.

గబ గబా కారు దిగి డైరెక్టర్ గారి రూములో కెళ్ళాను. అప్పటికి ఆయన కోపం దిగిపోయినట్లుంది.

“రండి మూర్తి గారూ, రండి. మీరు లేకపోవడంతో కాళ్ళూ చేతులు ఆడలేదు. ఒక వైపు హెడ్డాఫీస్ నుండి ఫోన్లు, ఇంకో వైపు స్నేహితులు, మరో వైపు ప్రెస్ వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేసేశారు. ప్రస్తుతానికి మన డేటా సెంటర్ ఆపరేషన్స్ స్టాల్ చేస్తున్నాము. అన్నట్టు, సాయంత్రం ఫ్లయిట్ కి కులకర్ణి గారు వస్తున్నారు. ఆయన వచ్చాక ప్రెస్ వాళ్ళను పిలిచి అందరికీ ఒకేసారి బ్రీఫింగ్ ఇమ్మని హెడ్ క్వార్టర్స్ నుండి మెసేజ్ వచ్చింది. కొంచెం ఆ ఏర్పాట్లు చూడండి” నెమ్మదిగా చెప్పాడు.

నేను బయటకు వచ్చాక అందర్నీ పలకరిస్తూ తెలుసుకున్న విషయాల సారాంశమేంటంటే –

ముందు రోజు రాత్రి , రక్షణ శాఖ కోర్ కమిటీ సభ్యులు వాళ్ళ బడ్జెట్ వివరాలు ఖరారు చేసుకుని ఆ రహస్య పత్రాలని రక్షణ మంత్రిత్వ శాఖ నుండి నిబంధనల ప్రకారం నేరుగా డేటా సెంటర్ కి అప్ లోడ్ చేశారు. ఆ సమావేశానికి హాజరైన హై-పవర్ కమిటీకి తప్ప ఎవరికీ ఆ బడ్జెట్ వివరాలు తెలిసే అవకాశం లేదట. అయితే ఆ రోజు ఉదయం పదకొండు గంటలప్పుడు యుధ్ధ పరికరాలు అమ్మే ఒక కంపెనీ నుండి రక్షణ శాఖ ముఖ్య కార్యదర్శికి ఒక ఫోన్ వచ్చిందట. ఆ కంపెనీ , తమ వద్ద అత్యాధునిక టెక్నాలజీ ఉందని, మన దేశం ఏ ఏ ఆయుధాలు కొనాలనుకుంటున్నారో అవి తాము అత్యంత తక్కువ ధరకే అమ్మగలమని చెప్పారట. వచ్చే వారంలో వచ్చి కలవాలనుకుంటున్నామని అపాయింట్ మెంట్ అడిగారట. ఈ వివరాలు మీకెలా తెలుసని అడిగినప్పుడు అవన్నీ రహస్యాలని, అవి చెప్పబడవని చెప్పారట.

వెంటనే రక్షణ శాఖ విచారణ చేపట్టి ఈ విషయాలు బయటకు ఎలా పొక్కాయా అని ఆరా తీస్తుంటే ఒక మీడియా ప్రతినిధి ఫోన్ చేసి , మీ శాఖ కు సంబంధించి కొన్ని విషయాలు బయటకు లీకయ్యాయని మా వద్ద ఆధారాలున్నాయి అంటూ ఊదర గొట్టాడట. పోనీ , మీకెవరు చెప్పార్రా ? అని మీడియా వాళ్ళను అడిగితే ‘ముందు సమాధానం చెప్పండి’ అని దబాయించారట. అప్పటినుండీ ఆ ఛానెల్ ప్రసారాలలో ఈ విషయం  బ్రేకింగ్ న్యూస్ లా వేయడం, ఇది చూసి మిగతా ఛానెల్స్ అన్నీ క్యూ కట్టడం జరిగిందట.

తమ దగ్గర విషయం బయటపడటానికి అవకాశం లేదని, డేటా సెంటర్ నుండే బయటకు వెళుతున్నాయని తమకు అనుమానంగా వుందని, ఇంతకు ముందు కూడా ఒక సారి సర్వర్ మొండికేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, రక్షణ శాఖ విచారణాధికారిగా కులకర్ణిని నియమిస్తూ ఉత్తర్వులు చేసిందట.

” మిత్రులారా, ఇది నా వైపు నుండి జరిగిన కథ. ఇక ఇక్కడ నుండీ కులకర్ణి గారిని మీతో ఆ పరిశోధనా వివరాలు పంచుకోవాలని కోరుతున్నాను” అంటూ కులకర్ణి చేతికి మైకు బదలాయించాడు.

“వెల్డన్ మూర్తి గారూ, జరిగి ఆరేళ్లవుతున్నా, కళ్ళకు కట్టినట్టు అన్ని వివరాలూ చెప్పినందుకు కృతఙ్ఞతలు” అంటూ చేతులు కలిపి చప్పట్లు కొట్టబోతే ప్రేక్షకులు గ్రహించి మూర్తికి చప్పట్ల హర్షాన్ని బహుకరించారు.

కులకర్ణి అందరి మొహాల్లోకి ఒకసారి చూసి అంతా ఆసక్తిగానే ఉన్నారని గ్రహించి ప్రారంభంచాడు.

” ఆ రోజు, నేను యధాప్రకారమే ఆఫీస్ కి వెళ్ళాను. అంతా ప్రశాంతంగానే  ఉందనుకుంటుంటే పన్నెండు గంటలకు మా డైరెక్టర్ గారు అర్జెంటు గా రమ్మని కబురుపెట్టారు. వెళ్లి కలిస్తే సాయంత్రం ఐదుగంటలకెల్లా హైదరాబాద్ లో డేటా సెంటర్ చేరుకోవాలని అభ్యర్ధించారు. వెరీ గుడ్ అండ్ కమిటెడ్ ఆఫీసర్. నౌ, హి ఈజ్ రిటైర్డ్ . ఆయన చెప్పిన కొన్ని విషయాలు విన్న తరువాత నాకు మతి పోయినంత పనయ్యింది. డేటా సెంటర్లో దెయ్యముందని, అదే ఈ అనర్ధాలకంతా కారణమని ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు నమ్ముతున్నారని ఒక విలేఖరి మంత్రిగారిని ప్రశ్నించాడట. మీకు గుర్తున్నారా ? అప్పటి మన ఐటి మంత్రిగారు – ఆధ్యాత్మిక భావాలు ఉండటమే కాదు, భక్తులతో తానే ఒక స్వామిజీ గా పూజింపబడుతుంటాడు. ఆయన ఐటి కార్యదర్శికి ఫోన్ చేసి, వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెబుతూనే,  వీలైతే హోమ్ శాఖ, ఇంటలిజెన్స్ విభాగాలను కూడా సమన్వయం చేయమని చెప్పారట. అంత వరకూ బాగానే ఉంది – కానీ ఆయన అక్కడితో ఆగకుండా, హరిద్వార్ నుండి, వారణాసి నుండి కొందరు సాధువులను పిలిపించి “డేటా సెంటర్లో గ్రహశాంతి” చేయించాలని కూడా పురమాయించాడట. ఈ విషయం ఐటి సెక్రటరీ గారు, మా డైరెక్టర్ కి చెబుతూ, “దయచేసి మంచి ఎంక్వయిరీ ఆఫీసర్ ని అప్పాయింట్ చేసి త్వరగా కేసు మూయించండి, లేకపోతే వచ్చేవారంలో సాధువులు వచ్చి అక్కడ హోమాలు గట్రా చేసి  దెయ్యాన్ని తరిమికొడతారట, ఇంత బతుకూ బతికి… “ అంటూ ఆయన వాపోయారట. మా డైరెక్టర్ గారు నాక్కూడా చెప్పారు – “ కులకర్ణి గారూ, మీరు కనక ఈ వ్యవహారం వీలైనంత త్వరగా తేల్చి, ఆ భూతవైద్యులను ఆపేయలేక పోతే నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాను” అన్నారు.

” యామై మేకింగ్ సెన్స్ మై డియర్ పార్టిసిపంట్స్-నేనేమైనా బోర్ కొడుతున్నానా” అంటూ ఆగాడు.

‘అబ్సల్యూట్లీ నో’, ‘ఇట్స్ ఇంటరెస్టింగ్’, ‘చెప్పండి, ఆపొద్దు’, ‘ తరువాత ఏమైంది’ అని జనాల్లోంచి సమాధానాలు విని –

ఇంటికి వెహికల్ పంపించి సూట్ కేస్ నేరుగా ఎయిర్ పోర్ట్ కి పంపమని చెప్పి, మా కోటాలో టికెట్ బుక్ చేయించుకుని, రెక్కలు కట్టుకుని సాయంత్రం ఐదుకెల్లా మూర్తిగారి ముందు వాలాను.డేటాసెంటర్ డైరెక్టర్ గారిని కలిశాము. తమాషా ఏంటంటే, ఆయనకీ మినిస్టర్ గారి ప్రతిపాదన నచ్చింది. ఎందుకైనా మంచిది, దేవుడున్నాడు అని మనం డేటా సెంటర్ ప్రారంభోత్సవమప్పుడు టెంకాయ కొట్టి, మంత్రోచ్చారణల మధ్య లోపలి అడుగు పెట్టినప్పుడు, ఇప్పుడు దెయ్యముందని అనుమానమొస్తే గ్రహశాంతి చేయిస్తే తప్పేమిటని ప్రశ్నించాడు. వీలైతే సాధువులతో పాటు, ఈ కార్యక్రమానికి మంత్రి గారిని కూడా పిలుద్దామన్నాడు. మంచి కవరేజి ఇచ్చి పెద్ద ఈవెంట్ లాగా చేద్దామని కుతూహల పడ్డాడు. నేను షాక్ తిన్నాను. వెంటనే సర్దుకున్నాను. అవును, అన్ని చోట్లా అన్ని రకాల మనుషులుంటారని ముప్ఫయేళ్ళ అనుభవం నేర్పింది.

ఆరుగంటలకు ప్రెస్సుని పిలిచాము. చాలా సంయమనం తో సమాధానాలు చెప్పాల్సిన సందర్భమది.

‘ ఇప్పుడు జరిగిన సంఘటన చాలా చిన్న విషయమని, సెక్యూరిటి అన్నది ఎప్పుడూ స్థిరంగా ఉండదని, మనం ఎంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నా వాటిని తూట్లు పొడవడానికి చాలా శక్తులు పొంచివుంటాయని, మనం ఎప్పటికప్పుడు వాటిని సమర్ధవంతంగా తిప్పికొడుతూనే ఉన్నామని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని, మరో ఇరవై నాలుగు గంటలలో ఈ విషయం గురించి మరిన్ని వివరాలు అందచేస్తామని చెప్పాము.

ప్రెస్ మీట్ ముగిసింది.

విలేకరులందరూ వెళ్ళి పోయాక అందరం డైరెక్టర్ గారి రూముకెళ్లాము. ఆఫీస్ స్టాఫందరినీ రెండు రోజులు పూర్తిగా అందుబాటులో ఉండమని చెప్పాము.నేను అందరిని ఉద్దేశించి –

“కొలీగ్స్, ఇప్పుడు మనం దీనినొక ఎమెర్జెన్సీ ప్రాజెక్టులా చూడాలి. నాకు ఒక నెల నుండీ ఈ సెంటర్ లో ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన కంప్యూటర్లలో జరిగిన ట్రాన్సాక్షన్స్, డేటా సెంటర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళ వివరాలు, ప్రస్తుతం ప్రతి డివైస్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్, ఎలా వాడుతున్నారు అనే వివరాలన్నీ కావాలి. గంటంటే గంటే. మనం ఆ వివరాలను విశ్లేషిస్తే మనకు మరికొన్ని వివరాలకు క్లూ దొరుకుతుంది. ఈ విచారణలో ఎవరిని ఏ ప్రశ్నలేసినా అన్యధా భావించకండి. ఇదంతా మన కర్తవ్య నిర్వహణలో భాగమే!” అని చెప్పాను.

ఆ తరువాత మూర్తిగారితో కలిసి డేటా సెంటర్ లోపలికి వెళ్ళాము.

మొదట్లో మీకు చూపించినట్లు అది చాలా పెద్ద డేటా సెంటర్. అందులో వేల సర్వర్లు పట్టే వెసులుబాటు ఉంది. అన్నిటిని కలుపుతూ నెట్వర్క్ ఉంది. ఒక్కొక్క రాక్ లో ఇరవై నుండి వంద వరకూ సర్వర్లు ఉంటాయి. వాటిని ఒక స్విచ్ కి కనెక్ట్ చేస్తారు. అలాంటి అన్ని స్విచ్ లను కలుపుతూ మరొక పెద్ద స్విచ్ ఉంటుంది. దాన్ని సెంట్రల్ స్విచ్ అంటారు. అది చాలా కీలకమైన వస్తువు. అది పనిచేయక పోతే మొత్తం సెంటరంతా పనిచేయదు. కాబట్టి అటువంటివి రెండుంటాయి. ఒకటి ఫెయిలనప్పుడు రెండోది ఆటోమేటిగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది.

ఒక గంట అలా మొత్తం సెంటరంతా తిరిగి భౌతిక ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని చూసాము. తిరిగి రూమ్ చేరేపాటికి అడిగిన రిపోర్ట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు గంటలలో అందరి దగ్గరి నుండీ వచ్చిన రిపోర్ట్స్ చూశాను. నాకేమీ ఏమీ పాలుపోలేదు. ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ లీకవుతోందనే విషయం తెలుస్తోంది కానీ, ఎలా బయటకు వెళుతోందో అర్థం కావటం లేదు.

ఇంటర్నెట్ కు అసలు కనెక్షనే లేదు. యూ‌ఎస్‌బి పోర్ట్స్ ఎనేబులే చేయలేదు. పెన్ డ్రైవ్ లు వాడలేదు. మోడెమ్, రౌటర్ లలో, ఫైర్ వాల్ లలో ఎలాంటి సంబంధిత ఎంట్రీలు లేవు. పోనీ వీళ్లలోనే ఎవరైనా బ్లాక్ షీప్ ఉన్నారా? ఉహూ, ఎవరినీ అనుమానించేటట్టుగాలేదు. పైపెచ్చు వాళ్ళ తెలివితేటలు చూస్తుంటే ఎవరికీ అంత పరిజ్ఞానం ఉన్నట్టు కనిపించలేదు.

ఎన్నాళ్లు డేటా సెంటర్ మూసి వుంచుతాం? పైగా దీన్ని ఛేదించలేక పోతే, ఇదే పరిస్థితి మరి కొన్ని సెంటర్లలో వస్తుంది. అన్నిటికీ మించి భూతవైద్యులు, మన్ను మశానమని మంత్రిగారు, సెంటర్ హెడ్డు తొందర పెట్టేస్తారు. మా డైరెక్టర్ చేసిన శపథం గుర్తొచ్చింది. కొంచెం సేపు బయటకెళ్లి, నా టెక్నాలజీ మిత్రులతో మాట్లాడాను. వాళ్ళు తమ ఆలోచనలను పంచుకున్నారు. ఆ దిశగా కొంచెం ప్రయత్నించి చూశాము. ప్రయోజనం లేదు.

మూర్తి గారింట్లోనే మంచి భోజనం ఏర్పాటు చేశారు పాపం. కానీ తిండి గురించి ఆలోచించే సందర్భమా అది?  ఏదో నాలుగు మెతుకులు తిని తిరిగి డేటా సెంటర్ కి వచ్చాము. నాతో పాటు నలుగురైదుగురు ఇంజనీర్లు కూడా వున్నారు – సాహూ తో సహా !

నా ఆలోచనలకు అంతు లేకుండా ఉంది. మూడు నెలల క్రితం డిడాస్ ఎటాక్ జరిగినప్పుడే ఈ సెంటర్ రక్షణ గురించి ఎక్కువ దృష్టి పెట్టాల్సింది. ఆ సమస్య పరిష్కారమవడంతో అదేదో ఆకతాయిపని అని వదిలేశాము గానీ, ఎటాక్ చేసిన వాళ్లెవరో, వాళ్ళకి ఆ సెంటర్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటో ఆలోచించలేదు. ఇంతకీ అర్థం కాని విషయం–ఆ నెట్వర్క్ బయటి ప్రపంచంతో కనెక్ట్ చేయనప్పుడు , దానిలోని విషయం బయటకు ఎలా పొక్కింది ?

ఎందుకో నాకు వై-ఫై ద్వారా ఈ విషయం సరఫరా జరుగుతుందని అనిపించింది. ఐతే, దానికి రిసీవర్ ఎక్కడ? ట్రాన్స్మిటర్ ఎక్కడ?  రాత్రి పదకొండు నుండి నా పరిశీలనలు మొదలై భవనం చుట్టుముట్టి, లోపల వస్తువులనన్నిటినీ పరిశీలనగా చూస్తూనే మధ్య రాత్రి గడచిపాయింది. సాహూ మీద మిగతా పిల్లల జోక్స్, నడుస్తున్నాయి. ఒకబ్బాయి  సర్వర్ రూమ్ ఉండే దిక్కు చూపిస్తూ , ఇదిగో ఇక్కడే సార్, దెయ్యం శబ్దాలు వినిపించేది అని చెప్పాడు. ఆ స్థలాలను పరిశీలించి చూసినా ఏమీ ఆధారాలు దొరకడం లేదు. అలా తిరిగీ, తిరిగీ, మళ్ళీ డేటా సెంటర్లోపలికి వచ్చాము. మొత్తం వెయ్యికి పైగా సర్వర్లతో వాటి ఫ్యాన్లు, ఏసీ ల చప్పుళ్లతో హోరెత్తే ఆ ప్రదేశం ఇప్పుడు, రెండవ ఆట ముగిసిన సినిమా హాల్ లాగా , వదిలిన తరువాత స్కూల్ రూముల లాగా నిశ్శబ్దంగా ఉంది. అన్ని ర్యాకుల మధ్యలోనుండి వస్తుంటే ఒక చోట అత్యంత విలువైన క్లూ కనబడ్డది” ఆగాడు కులకర్ణి.

అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. టేబిల్ మీది గ్లాస్ తీసుకుని కొద్దిగా నీళ్లు తాగి మళ్ళీ ప్రారంభించాడు.

” అన్ని సర్వర్లు షట్ డౌన్ చేసినప్పుడు, పవర్ సప్లై కూడా నిలిపేసినప్పుడు ఒక షోరూమ్ ని తలపిస్తున్న ఆ హాల్లో ఒక ర్యాకులోనుండి మినుకు మినుకు మంటూ రెండు లైట్స్ వెలుగుతుండటం నా కంట బడింది. ఇంజనీర్స్ ని అడిగాను-అది ఏ ర్యాక్ అని? దానికి వాళ్ళు మూకుమ్మడిగా, “అది నెట్వర్క్ ర్యాక్ సార్, ఆ వెలుగుతున్న లైట్స్ ఉన్నాయే, అది సెంట్రల్ స్విచ్” అని చెప్పారు. దగ్గరగా వెళ్లి చూశాను. పవర్ లేకున్నా ఈ స్విచ్చులు ఎందుకు వెలుగు తున్నాయి? అసలు ఎట్లా వెలుగుతున్నాయి? అంటే వీటిని ఉద్దేశపూర్వకంగానే బాటరీ బ్యాకప్ తో తయారుచేశారన్నమాట. ర్యాక్ తెరచి, ఆ స్విచ్ దగ్గరగా వెళ్లి చెవి ఒగ్గి వింటే అందులోనుండి  ఏదో సన్నని ధ్వని వినిపిస్తోంది. అంటే… ఇంత పెద్ద డేటా సెంటర్ పవర్ ఆఫ్ అయినా, ఈ వస్తువు మాత్రం పని చేసేలా దీనిని డిజైన్ చేశారన్న మాట. అంటే… అంటే… ఏదో హింట్ దొరుకుతున్నట్టే అనిపించింది. యూనివర్సల్ వై-ఫై రిసీవర్ తెప్పించి ర్యాక్ దగ్గరుంచి, ఫ్రీక్వెన్సీలను మారుస్తూ పోతుంటే సరిగ్గా ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర బీప్, బీప్ మని అరిచింది రిసీవర్. అర్ధమైంది-ఈ సెంట్రల్ స్విచ్ లోనే దీని ట్రాన్స్మిటర్ ఉందన్నమాట. మరి, ఈ డేటానంతా ఎక్కడకు చేరవేస్తుంది? అంటే దీని దగ్గరలోనే రిసీవర్ కూడా ఉండాలి. అన్ని సర్వర్లలోనుండి డేటాని సంగ్రహించి , సెంట్రల్ స్విచ్ ఏదో డివైస్ కు  పంపుతుండాలి. ఆ డివైస్ ఏది? ఎక్కడుంది? అదేకదా మేము కనిపెట్టాలి. ఇప్పుడైతే వీళ్ళ దగ్గర యూనివర్సల్ ట్రాన్స్మిటర్ లేదంటున్నారు గానీ, ఉదయాన్నే సిటీకి పంపి తెప్పిస్తే పనయిపోతుంది.

ఎవరికీ ఇళ్లకు వెళ్లి నిద్ర పోవాలనిపింఛ లేదు. అక్కడే ఒక చిన్న కాన్ఫరెన్స్ రూమ్ లో దీర్ఘాలోచనలో పడి సమయాన్ని వెళ్లదీస్తున్నాము. అయితే ఇది ఖచ్చితంగా విదేశాల కుట్రలో భాగమే అని అనుమానం గట్టిపడింది. ఈ ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులతో వున్న సమస్య ఏంటంటే, వాటిలో ఏమేమి ఉన్నాయో మనకు తెలుసుకునే, చూసుకునే అవకాశం ఉండదు. అలా కవర్ తీసిన మరుక్షణమే వాటి గ్యారంటీ పోతుంది అంటాడు. మనం ఎందుకొచ్చిన తంటా అని, ఎలాగొచ్చిన దాన్ని అలాగే వాడేస్తాం. అది, మన వ్యక్తిగత మొబైల్ ఫోన్ అయినా, దేశభద్రతకు సంబంధించిన సెంట్రల్ స్విచైనా మనకు ఒకటే…!  ఈ వస్తువు ఓనరు ఒక దేశంవాడు, తయారయింది ఇంకో దేశంలో, సరఫరా చేసేది మరోదేశం, చివరికి అమ్మేది మనదేశం వాడే! ఇప్పుడిక్కడ ఎవరిని అనుమానించాలి? ఈ కుట్రలో ఎవరి భాగస్వామ్యాన్ని ఎంతని అంచనా వేయాలి?

ఆ రోజు రాత్రి ఏవేవో ఆలోచనలు. వాటిని దాటుకుని సాహూని, రాజేష్ అనే ఇంకో ఇంజనీర్ని తీసుకుని దాదాపు తెల్లవారు ఝామున నాలుగవుతోందప్పుడు – బయటచల్లని గాలిలో డేటా సెంటర్ చుట్టూ మాట్లాడుకుంటూ నడుస్తుంటే… ఉన్నట్టుండి అందరికీ స్పష్టంగా వినిపించేంత శబ్దం చేస్తూ టెర్రస్ పైన ఏదో వస్తువు పేలినట్టు శబ్దం వచ్చింది. వెంటనే, దగ్గరలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని తీసుకుని టెర్రస్ మీదకు వెళ్ళాము. అప్పుడు చూసాము. నాలుగు వైపులా యాంటెన్నాలను పెట్టుకుని, పక్షిలాగా ఎగురుకుంటూ తిరిగే “ద్రోన్” అక్కడ ముక్కలై పడిఉంది . అది డ్రోన్ అని గుర్తుపట్టడానికి మాకు కొంత సమయం పట్టింది. వెంటనే అర్థమైందేమిటంటే, మా కదలికలను ఎవరో గమనిస్తున్నారు, మేము గుర్తించే లోపే దీన్ని ధ్వంసం చేసేసి, ఏ ఆధారాలూ లేకుండా చేయాలని ముందే రిమోట్ తో పేల్చేశారు. మమ్మల్ని ఎవరో గమనిస్తున్నారని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. అంటే, మేము చర్చించుకున్నదంతా వినో, చూసో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక్కడి విషయం అక్కడికి చేరవేస్తున్నది సెంట్రల్ స్విచ్ మాత్రమే కాకుండా ఇంకో డివైస్ కూడా ఉందన్నమాట. అది కెమెరా గానీ, చిన్న ఆడియో రికార్డర్ గానీ అయుండాలి. దాని ఆధారంగానే, మా ప్రయత్నాలన్నీ తెలుసుకుని దీన్ని పేల్చివేశారు.

వెంటనే సెక్యూరిటీని అక్కడే ఉండమని చెప్పి మేము కిందకు వచ్చాము. నా అంచనా నిజమైంది. ఎక్కువ సేపు వెదకకుండానే, సర్వర్ రూముకు ఎదురుగా వున్న ఒక షోకేసు బొమ్మలో పిన్ హోల్ కెమెరా దొరికింది. అందులోనే ఒక చిన్నచిప్ ఆధారంగా వీడియో డేటాని టెర్రస్ పైనున్న డ్రోన్ కి పంపే ఏర్పాటు చేశారని సులభంగానే అర్థమైంది. ఉదయం తెలతెలవారుతుండగా మా ఆపరేషన్ పూర్తయింది. వైర్లెస్ జామర్లు డేటా సెంటర్లో ఏర్పాటుచేయాలని, ఎవరో ఇచ్చిన గిఫ్టులు లోపలి తేకూడదని, ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఆ కెమెరా షో పీస్ ఒక ఉత్పత్తిదారుడు డైరెక్టర్ గారిని కలిసినప్పుడు జ్ఞాపికగా అందచేశారట. మా పరిశీలనలతో, కొన్ని సూచనలతో నివేదిక సమర్పించడంతో మా పని పూర్తయింది.

ఇదీ మిత్రులారా, డేటా సెంటర్ లో దెయ్యం కథ. మేమా దెయ్యాన్ని సీసాలో బంధించి మంత్రిగారికి అందించి ఉంటే బాగుండేది కానీ, శత్రువు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు.”

కులకర్ణి ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి పక్కనే ఉన్న గ్లాస్ లో నుండి కొన్ని నీళ్లు తాగి, ” మీకిందులో ఏవైనా సందేహాలుంటే అడగొచ్చు” అన్నాడు.

ఎవరో ఒకరు చిన్నగా చప్పట్లు కొడితే అందరూ దాన్ని అందిపుచ్చుకుని ఆ హాలంతా మార్మోగిపోయేలా అభినందలనతో చప్పట్ల వర్షం కురిపించారు.

ఒక ఆఫీసర్ లేచి, “ముందుగా మీకు, మీ టీం కు అభినందనలు, కులకర్ణి గారూ , వాటే వండర్ ఫుల్ అసైన్ మెంట్! సంస్కృతి పేరుతో మనం అనుసరించి పాటించే నమ్మకాలను శత్రువు ఎంత తెలివిగా వాడుకుంటాడో తెలియచెప్పిన అనుభవం. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భంలో దెయ్యం పేరుతో కాలయాపన చేసుంటే మనం అభాసు పాలయ్యేవాళ్ళం. మంచి అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు” అని కూర్చున్నాడు.

ఇంకో ఆఫీసర్ లేచి, నా పేరు అవినాష్. కులకర్ణి గారికి ధన్యవాదాలు. ఇవన్నీ గ్లోబలైజెషన్ చీకటి కోణాలు అని నేననుకుంటాను. ఈ రోజు గ్లోబలైజేషన్ వల్ల చాలా లాభపడ్డామని, ప్రపంచీకరణ వల్ల కొత్త ఉద్యోగాలొచ్చాయని చాలామంది భావిస్తున్నాము. స్థానికీయతను ప్రోత్సహించకపోతే ఇప్పుడు ఇండియాలో పెట్టుబడులు పెట్టిన బహుళ జాతి సంస్థలు, ఇప్పుడిప్పుడే అభివృధ్ధి చెందుతున్న మరింత పేద దేశాలకు వెళ్ళి ఇదే చరిత్రను ఆ దేశాలలో పునరావృతం చేస్తాయి. అప్పుడు మన దేశంలో చేయడానికి ఏ ఉద్యోగాలుంటాయో మనం ఆలోచించుకోవాలి. మీరు చెప్పిన సెంట్రల్ స్విచ్ లాంటివి మనం తయారు చేసే పరిస్థితులలో లేకపోవడం సిగ్గుచేటుకదా! మనం బహుశా విదేశీ వస్తువుల మీద ఎక్కువగా ఆధారపడుతూ స్థానిక పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తున్నాము” అని చెప్పగానే అందరూ అభినందన పూర్వకంగా చూసారు.

ముందు వరుసలో కూర్చున్న ఒక ఆఫీసరు చేయి పైకెత్తి, నవ్వు ముఖంతో

” సార్, మీరు చెప్పిన కథలో ఒక చిన్న అనుమానం. మన మిత్రులకు అమావాస్యకు, పౌర్ణమికి వినబడే చప్పుళ్ల మాటేమిటి, కదిలినట్టు కనిపించే నీడలు ఎక్కడివి?” అనడిగాడు.

కులకర్ణి నవ్వుకుంటూ, “మీ సూక్ష్మ పరిశీలనకు అభినందనలు మిత్రమా! మీరెంత శ్రద్దాసక్తులతో మొత్తం కథను ఫాలో అయ్యారో అర్థమౌతుంది. ఓకే, లెట్ మీ ఆన్సర్! ఆ తరువాత ఎప్పుడూ అలాంటి చప్పుళ్ళు వినబడలేదని సాహూనే అంగీకరించాడు. అంతకు ముందు అవి ఎలా వచ్చాయో ఇదమిద్దంగా చెప్పలేము. అయితే, మా అభిప్రాయం ప్రకారం, ప్రతి పక్షానికొకసారి డేటాని తెప్పించుకునే ఏర్పాటు చేసుకుని వుంటారు. ఆ డ్రోన్ టెర్రేస్ మీద ఉంటే, సెంట్రల్ స్విచ్ తో కనెక్టివిటీ సమస్య ఉంటుంది, అందుకే ప్రతి పదహైదు రోజులకొకసారి, వాళ్ళ ప్రణాళిక ప్రకారం ఆ డ్రోన్ ను రిమోట్ సహాయంతో కిందకు తీసుకొచ్చి వెనుక వైపున్న సన్ షేడ్ మీద కూర్చోబెడతారు. పని పూర్తవగానే మళ్ళీ తీసుకెళ్లి టెర్రస్ మీద పనికిరాని వస్తువుల మధ్య పార్క్ చేస్తారు. ఆ డ్రోన్ కిందకూ, పైకి ఆపరేట్ అవుతున్నప్పుడు ఆ ఫ్యాన్ల చప్పుళ్ళు, సన్ షేడ్ కి సీలింగ్ కి మధ్య గ్యాప్ తక్కువ ఉండటం వల్ల అది వింత వింత శబ్దాలుగా వినబడటం జరిగేది – ఇది నేను నా తర్కం తో చేసిన అన్వయం.”

ఆ తరువాత ఎవరూ మాట్లాడకపోవడంతో సభాధ్యక్షుడు

“వావ్, బాగా చెప్పారు కులకర్ణి గారు, మూర్తి గారు. మీకు మా కృతజ్ఞతలు. మిత్రులందరికీ ధన్యవాదాలు.ఇలాంటి ప్రేరణనిచ్చే మరిన్ని అనుభవాలు మీ వృత్తి లో మీకు కూడా కలగాలని ఆశిస్తూ , ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. భోజనం సిద్ధంగా వుంది. లెట్స్ గో ఫర్ డిన్నర్ ” అని సభని ముగించాడు.

*****

జి.ఉమామహేశ్వర్

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • సీరియస్గా రాసిన సరదా కథ. భలేగా వుంది, వ్యంగ్యంపు చెణుకులతో.

 • కథ చాలా బావుంది. ముందుకు వెడుతూనే వెనుకకు ఎంతలా ప్రయాణిస్తున్నామో వ్యంగ్యంగా చెప్పిన కథ. ఒక పుకారును అందరూ ఎలా నిజమని నమ్ముతారో, కొందరు ఎలా నమ్మిస్తారో వివరంగా సరదాగా చెప్పారు. కథ చివర వరకూ సస్పెన్స్ బాగా సాగింది. Enjoyed reading this nice story.

 • ఎవడికి కావాలబ్బా… యీ ఎలెట్రానిక్ వార్ఫేర్ లు, సైబర్ సెక్యూరిటీలు, డెటాసెంటర్లు…

  సంకుచితంతో గీసుకున్న సరిహద్దులకావల నున్న దాయాదుల నుండి, వశుధైక కుటుంబం లోని అన్ని దేశాలాలోని అట్టడుగు వర్గం ప్రజల అభివృధి, ప్రజలందరికీ న్యాయపరమైన దేశసంపద విభజన, ఇంక్లూజివ్ గ్రోత్, రోటీ, కపడా, మకాన్, తాగు నీరు, సాగునీరు, విద్యా వైద్యం, ముందు ఇవన్నీ ఇవ్వండి.

  జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, నుండి భారత దేశం ( స్వయం స్వయం సమ్రుద్ధితో కోవిడ్ వాక్సిన్స్ తయారుచేసిన ) నుండి ప్రపంచ దేశాలన్నీ మానవజాతి పురోగమనానికి కావాల్సిన వస్తు, సాంకేతిక సముదాయాన్ని సమకూర్తూనే ఉంది. ప్రపంచ వాణిజ్యం, లాభాలు, చిన్నవిషయాలు. టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవం తీసుకొచ్చిన దేశాల్లో నోకియా కంపెనీ ఫిన్లాండ్ ఉందని మరవగలమా. ఈ-కామర్స్, ఈ-గవర్నెస్, మరెన్నో విప్లవాలు రాబట్టే ప్రజల జీవితాలలో వెలుగులు వస్తున్నాయి. ఆర్ధిక నేరగాళ్లు పారిపోయేలా చేస్తున్నాయి.

  కరోనా లాక్డౌన్ లో వలస కార్మికులు భార్యా బిడ్డలతో పట్టణాలు వదిలి వందల మైళ్లు నడిచి తమ స్వగ్రామాలు చేరుకున్న భీభచ్చం పునరావృత్తం కాకుండా చూడాలి. రెండు ప్రపంచ యుధ్ధాల మారణ హోమం చూసినా మళ్లీ యీ 21వ శతాబ్ధం లో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలి.

  ఇంటర్నెట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిగెన్సె, రోబొటిక్ టెక్నాలజీలు ఉన్నాయిప్పుడు. యీ డేటా సెంటర్లో దెయ్యానికి భయపడేవాళెవ్వరూ లేరిక్కడ సామే.

  మన అనంటపూర్ అప్ప, హక్కుల సూరీడు కె. బాలగోపాల్ గారి వీరాభిమాని జి. ఉమామహేశ్వర్ గోరండీ! మీ మనసునొప్పించే మాటంటే మన్నించండి !!

  ~ త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు

 • చాలా బాగా వ్రాసారు sir.చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ చదివేట్టు చేశారు.మీ రచన చివరిదాకా మంచి ఉత్కంఠ భరితంగా గా సాగింది .మీకు ధన్యవాదములు.

 • పెట్టుబడీ తను అభివృద్ది చెందించిన సాంకేతికతను అడ్డదారిలో ఉపయోగించి మరింత వృద్ది చెందడానికి ఎలా ఉపయోగిస్తుందో చక్కగా చెప్పారు సార్!
  ఏది ఏమైనా జీ ఉమా సార్ కథల్లో ఓ పదేళ్ళు ముందుంటారు .

 • చాలా లేయర్స్ ఉన్న కథ ఇది. కార్పోరేట్ దోపిడీ, రాజకీయ నాయకుల దిగజారుడు, విదేశీ కంపెనీల లంచాలు తప్ప…. స్థానికంగా అభివృద్ధి చెంది… స్వయం సమృద్ధి సాధించాలన్న స్పృహ లేకపోవడం..
  ఇవన్నీ ఈ కథలో చర్చించారు కథకుడు.

  తెలుగు కథకుడికి ఇంత సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన ఉండడం….అరుదు.

  ఉమాగారికి అభినందనలు

  • నీ లేయర్స్ పరిశీలన సంతోషం కలిగించింది. థాంక్యూ చందూ…

   చేసే ఉద్యోగం అదే కదా..😄 అదనపు పరిఙానం ఏమీ లేదు.

 • ఉమామహేశ్వర్ గారికి అభినందనలు. సాఫ్ట్వేర్ లో అనుభవం మంచి అవగాహన వున్నవాళ్ళు తప్ప ఈ కథను రాయలేరు. అటువంటి కథకులు తెలుగులో అరుదు. ఆధునిక సాంకేతిక, సమావేశాల నేపథ్యంలో కథలు రాసే రచయితలు కన్నడలో వున్నట్లు తెలుగులో లేరు. గత కొంతకాలంగా టెక్నాలజీ నేపథ్యంలో కథలు లేని లోటును ఉమామహేశ్వర్ పూరిస్తున్నారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు