డియర్…లెక్సా!

డియర్…లెక్సా!

మె జ్ఞాపకాలతో మదిలో నిండిన చీకట్లు…గది నిండా కూడా వ్యాపించాయి.

ఒక్కసారైనా కాల్ లిఫ్ట్  చెయ్యకపోదా అన్న ఆశతో మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడతను,ఆమె మధుర స్వరంలోంచి ‘హలో..’ అనే పదం వినడానికి ఒంట్లోని ఏకాగ్రతంతా చెవి దగ్గరే పెట్టి, కాల్ చేసాడు…”మీరు డయల్ చేస్తున్న నంబర్…,” అంటూ విసిగిస్తుంది.

అతను…హాస్పిటల్ బెడ్ పైనా! ఆమె కోసం సతమతమౌతున్నాడు, తనువు అణువణువులో దాగున్న తను, ఈ అవనిలో ఎక్కడుందో తెలియక.!!

అదే కాలర్ టోన్, ఆశ్చర్యంగా! ఈ సారీ లిఫ్ట్ చేసారు.! టైమర్ కూడా స్టార్ట్ అయ్యింది. వెంటనే “హ..హలో..,” అన్నాడతను ఎదురుచూపులు తెలిసేలా…కానీ అవతల నుండి ఎలాంటి స్పందన రాలేదు.

“హలో స్వప్న,నేను రవి ని.. రవి ని స్వప్న…హలో…మాట్లాడు…ప్లీజ్,” కొంచెం ఆవేదనతో.

అయినా అవతల నుండి అదే నిశ్శబ్దం.

పెదాలు చిన్నగా వణుకుతున్న, దుఃఖాన్ని దిగమింగుతూ…మళ్ళీ అడిగాడు.

కుయ్ కుయ్ మంటూ కాల్ కటయ్యింది. “స్..వ..ప్..నా..,” అంటూ గట్టిగా అరిచాడు.

అబ్సర్వ్షన్ రూమంతా కంపించిపోయింది. ఆ అరుపుకి రూమ్ లోని సెన్సార్లు యాక్టీవ్ అయ్యి, లైట్స్ ఆన్ అయ్యాయి.

ఆ వెలుగులో…కిటికీ అద్దాలలోంచి బెడ్ పైనున్న అతన్ని గమనిస్తున్న సైకియాట్రిస్ట్ మోహన్ కి, బాధేసింది…అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యం! ఎందుకంటే రవి నిద్రలో ఉన్నాడు!

మోహన్ ఆ రూమ్ దగ్గరి నుండి తన క్యాబిన్ లోకి ఆలోచిస్తూ వచ్చాడు…”నిద్రలో ఇంత దారుణంగా కలవరింతా ?! లేదా పలవరింతా ?!.. అంత గట్టిగా అరిచిన, నిద్రలోంచి మాత్రం బయటకు రాలేదతను,”అని మనసులో అనుకుంటూ,ఏవో రెండు ‘సైకో’ బుక్స్ తిరగేసాడు. చీకట్లో తీసిన రవి స్కానింగ్ రిపోర్ట్స్ గమనించి ఒక కొలిక్కి వచ్చాడు మోహన్. అతనికి…రాపిడ్ ఐ మూవ్మెంట్ కావచ్చేమో లేక వేరే స్లీపింగ్ డిసార్డరై ఉంటుంది. స్వప్న ప్రేమలో ఉన్న అతను, రోజు రాత్రంతా ఆమెతో ఫోన్లో మాట్లాడి మాట్లాడి ఒక్కసారిగా ఆమె దూరమవ్వడంతో…అతనిలా నిద్రలో ఆమె కోసం…ఆమె మాటల కోసం…తపనతో కలవరపడ్తూ , పలవరిస్తున్నాడు. ఒక తెలియని ఉషస్సు కోసం అతను అంపశయ్య మీద తపస్సు చేస్తున్నాడు..అది నిద్ర లో!

హైడోస్డ్ డ్రగ్స్ తో ట్రీట్మెంట్ ఇచ్చిన, నిద్రలో కలవరింతని ఆపలేకపోతున్న ‘ క్రిటికల్ స్టేజి ‘ అతనిది. ఈలాంటి కేసులు మోహన్ కి మాత్రమే కాకుండా అతని కొలీగ్స్ కూడా ఈ మధ్య వచ్చాయి, అన్నిటికి మూల కారణం మొబైల్ అతిగా వాడడమే అని స్పష్టమవుతుంది. ట్రీట్మెంట్ ఇంకెలా చెయ్యాలి అని ఆలోచిస్తున్న మోహన్ కి వెనక నుండి ధిక్కారిస్తునట్టు…ఒక ఆడ గొంతు.

“మిస్టర్ మోహన్, మీరు మీ బీపీ టాబ్లెట్ వేసుకున్నారా ?” అని .

ఒక్కసారిగా ఆలోచనల్లోంచి తేరుకొని, ఆశ్చర్యంగా వెనక్కి గిర్రున కుర్చితో పాటు తిరిగాడు, ఒక సంబరమాశ్చర్యం తో.!!

మళ్ళీ, “మీరు మీ బీపీ టాబ్లెట్..”, అని అడగడం పూర్తికాక ముందే,

“యస్..!యస్..ఐ డిడ్,” అన్నాడు మోహన్…అటు వైపు చూస్తూ, ఒక వెయ్యి కాంతుల వెలుగు మొఖం తో…!!!

****

మార్గశిర మాసం…చిక్కటి చీకటిని గడ్డకట్టిస్తున్న చలిలో…

ఎంతసేపు మాట్లాడుతున్నా , తనివితీరని ఇంకా ‘ఏదో’ దానికోసం మాట్లాడుతూనే ఉన్నారిద్దరు… వీడియో కాల్ లో…

“గూగుల్ మ్యాప్స్ లో నా గుండె ఎక్కడుందని అడిగితే , నువ్వున్న లొకేషన్ చూపిస్తది తెలుసా “, నవ్వుతూ అన్నాడతను .

“ఆహా! అయితే లొకేషన్ మీ నాన్న కి షేర్ చెయ్యు, క్యాబ్ బుక్ చేసుకొని వస్తాడు…”, సురుకులా సమాధానమిస్తూ…,”ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రవి, పొద్దున్నే ఆఫీసుకెళ్ళాలి..బై..గుడ్ నైట్,” అంటూ స్వప్న వీడియో కాల్ కట్ చేయబోతుంటే,

“హే..ఆగాగు, ఇంకో గంటైతే గుడ్ మార్నింగ్ చెప్పచు.. ఇంకేం పడుకుంటావ్ “,అన్నాడతను, తనకి  ‘ఇవ్వాల్సింది’ ఈ రోజు ఇంకా ఇవ్వలేదని సైగలతో బ్రతిమిలాడాడు…అతని చేత అలా బ్రతిమాలించుకోవడం ఆమెకిష్టం.

“ఇస్తాను,” అన్నట్టు తలూపింది. అటుఇటు చూసింది…మెల్లిగా ఆమె తన లేలేత పెదాలను ఫోన్ కి దగ్గరగా పెట్టుకోబోతుంటే…అతనికి తెలియకుండానే గుండె దడ పెరిగుతూపోయింది. ఆమె ఇంకాస్త దగ్గరికి పెట్టుకోగానే, ‘క్లక్’ మని అప్పుడే అతని ఫోన్లో ఛార్జింగ్ లేక  స్క్రీన్ బ్లాంక్ అయ్యింది.

…దక్ దక్ దక్ మని తలుపు చప్పుడికి ఆమె ఆ ‘జ్ఞాపకం’ లోంచి బయటకు వచ్చింది. చీకటి…బయట, లోపల…లోలోపల! అంతా చీకటీ. ఆమె ఆ గదిలో ఓ మూలకు… మోకాళ్ళని కడుపులో దాచుకొని కూర్చొని ఉంది… ఓ.. న్..ట…రి…గా..!!

కన్నీటి ధారలను తూడ్చుకుంటూ , తలని గోడకు ఒరిగిస్తూ…దగ్గింది. చేతులు అడ్డం పెట్టుకొని ఇంకాస్త గట్టిగా దగ్గింది, ఎదో వెచ్చగ తగిలింది…చీకట్లో నల్లగున్నా, చేతిలో అది రక్తమే! ఆ రక్తాన్ని చూస్తూ, ఆమె మరో జ్ఞాపకంలోకి జారిపోయింది…

అదే కాలర్ ట్యూన్ “,చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను,” అంది స్వప్న.

ఆమె ఆఫీసులో ఉందని అతనికి అర్థమై”,రాత్రి నిద్రపట్టట్లేదు…సహాయపడతావా?”,అన్నాడతను ముసిముసిగా నవ్వుతూ.

కానీ అవతల నుండి ఏ స్పందన లేకపోయేసరికి, ఆ నిశ్శబ్దంలోనే ఆమె కోపాన్ని పసిగట్టిన ఆతను వెంటనే “, హే…సారీ..నేనేదో సరదాకి,” అని అన్నా ఆమేమీ మాట్లాడలేదు. ఎన్నో శబ్దాల ప్రవాహం చూట్టున్న ఈ ప్రపంచంలో, ఆమె నిశ్శబ్దమే ఆతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది .

“అయినా నీ ఆఫీస్ ఫోన్ కి వచ్చే కస్టమర్ కాల్స్ కి చెప్పాల్సిన ‘సహాయ’ మాటలు,నేను చేస్తే ఎందుకు చెప్తావ్ చెప్పు,” అని అతను సున్నితంగా మాట్లాడిన, ఆమె మౌనంగానే ఉంది .

“సరే,నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న…బై,” అంటూ కాల్ కట్ చేయబోతుండగా,

“పోలీస్ స్టేషన్ కా ?!!,” ప్రశ్నార్థకంగా స్వప్న.

హమ్మయ్య మాట్లాడింది అని మనసులో అనుకోని,” అంటే నీ ముఖం మీద నవ్వు మిస్ అయ్యింది కదా,అందుకు ‘మిస్సింగ్ కేసు’ పెడదామని,” అన్నాడతను.

ముడ్చుకున్న ఆమె పెదాలపై ఒక్కసారిగా నవ్వు విరబూసింది…మళ్ళీ కోపంగా” అయ్యినా ‘కేర్’ తీసుకునే వాళ్ళంటే చులకన కదా ఈ మనుషులకి, కస్టమర్ కేర్ వాళ్ళతో పద్ధతిగా మాట్లాడరా?,”అడిగింది ఆమె.

“అబ్బా..సారీ చెప్పాను కదా. నేనేదో నీకు సర్ప్రైస్ ఇద్దామని నీ ఆఫీస్ కిందుంటే నువ్..,” అతనింకేదో చెప్పేలోపే ,

“కిందున్నావా!! వస్తున్నా..,”అంటూ కాల్ కట్ చేసింది. అతన్ని చూడాలని తపనతో, ఆఫీస్ లిఫ్ట్స్ కన్న వేగంగా మెట్లు గబగబా దిగుతూ వచ్చింది. ఆమె చూపులకి అతను చిక్కిన మరుక్షణమే వెళ్లి గాలికూడా చొరబడనంత గట్టిగా కౌగిలించుకుంది.మెల్లిగా ,ఆమె వేళ్ళు అతని వేళ్ళ మధ్యలోకి వెళ్లాయి…తమలపాకంత లేతగా,దూదికంటే మెత్తటి ఆమె చేతి స్పర్శకి ఒళ్ళు పులికించింది.

క్యాంటీన్ లో…

“ఈ సపోర్ట్ బేస్డ్ జాబ్ తో ఇంకెన్నాళ్లు…పొద్దంతా కస్టమర్ కాల్స్ తో, రాత్రైతే నాతో కాల్ మాట్లాడుతూనే ఉంటావ్. నీ లొడలొడ వాగుడికి ఆ గొంతుకి నొప్పి రాదా?” అడిగాడతను .

ఆమె ఏమికూడా పట్టించుకోనట్టు చేసి,ఆర్డర్ ఇచ్చిన కాఫీ తాగుతూ కూర్చుంది. కప్ సందుల్లోంచి ఆమె చూపు…అతనికిష్టం.

“నిన్ను చూసిన ప్రతీ సారీ,ఓ వేడి కాఫీ సిప్ తీసుకున్నంత రీఫ్రెష్నెస్ కల్గుతుంది.. తెల్సా” అతను .

“ప్రతి కాఫీ కీ ఇదే మాట ,” వెటకారంగా అంటూ ఆమె చెవిలో హెడ్సెట్ పెట్టుకోబోతుంటే,అది చూసి అతను “దాని పిన్ ఫోన్ కి కాదు, నా గుండెలోకి గుచ్చి విను…

నా మనోరథంపై నిన్ను ఊరేగిస్తూ మంత్రాలు…

రక్తనాలల్లోపొంగే విరహ జ్వాలలు…

నిన్ను తాకినప్పుడు నాలోలోపలి పిల్ల కేరింతల…

దూరమవుతావేమో అని ఢమరుకమై మ్రోగే గుండె కావటాలు…

ఎగరలేక కొట్టుమిట్టాడుతున్న ఆశల రెక్కల చప్పుళ్ళు…

గొంతులోనే ఉరేసిన మాటలు…అరిచిన మౌనాలు…,”అంటూ చెప్తూ ఉండగా

” హే ఆగాగు..ప్లీజ్, నాకప్పుడప్పుడూ ఒక డౌట్ వస్తది, నేను కాకుండా వేరే అమ్మాయి అయితే నీ మాటలకీ ఇంప్రెస్స్ ఐయ్యేదా లేదా బ్రేకప్ చెప్పి వెళ్లేదా? అని”,అందామె.

కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం, తర్వాత వాళ్ళ సీరియస్ నెస్ వాళ్ళకే నవొచ్చిందేమో, ఒక్కసారిగా పక్కున నవ్వారు…

సిటీ అంతా బైక్ మీద రైడ్స్ అయిపొయ్యాక, సరిగ్గా గేట్ క్లోజ్ చేసే సమయానికి ఆమెని హాస్టల్ ముందు దించాడు.

“నాకు దిగాలని లేదు,” అంటూనే దిగేసింది. హాస్టల్ లోపలికి వెళ్ళబోతూ…ఏదో వెలతి,ఆగింది. వెనక్కి వచ్చి వాటేసుకుంది..ఇద్దరి చూపులు దగ్గరయ్యాయి. ఆమె కళ్ళలో ఏదో తడి గ్రహించి అతను ఇంకాస్త దగ్గరగా ఉండి ధైర్యం ఇచ్చాడు. ఆలా పెదాలు కలిసాయి,చుటున్న చల్లగాలి కి వేడి స్పర్శ తెలిసేలా.

…దక్ దక్ దక్ మని తలుపు చప్పుడికి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది స్వప్న. నోటికి ఓరల్ కాన్సర్ వచ్చినప్పటి నుండి బయటకి వెళ్లడం మానేసింది . ఆ కాన్సర్ ఇంకొన్ని భాగాలకు కూడా పాకింది. రవిని కలుద్దామంటే, పొరపాటున అతినికి కూడా సోకుతుందేమోనని భయపడి, అసలు బయటకు వెళ్లడం కూడా మానేసింది. అమ్మానాన్నలు ఎంత చెప్పిన వినకుండా, గదిలో ఒక్కతే, చీకటితో సహజీవనం చేస్తూ , జ్ఞాపకాల ఉచ్చులో పడి, నిశ్శబ్దంగా కాలంతో యుద్ధం చేస్తూ కూర్చుంది .

****

అబ్సర్వ్షన్ రూమ్ లో…

సైకియాట్రిస్టు మోహన్, రవి నిద్రలోకి జారుతున్నప్పుడు గమనిస్తూన్నాడు..

ఆతను,” హలో స్వప్న ” అని అనగానే,

వెంటనే ఒక స్పందన ” హలో రవి…” అని!!!

అవును ఒక స్పందన! దారితప్పిన పడవకి లైట్హౌస్ వెలుగు దొరికినట్టు. అంతరిక్షంలో సిగ్నల్ కటైన చంద్రయాన్-2 స్పందించిందేమో అన్నటుగా…

“స్వప్న! ఎలా ఉన్నావ్ ? ఎక్కడికెళ్ళిపోయావ్? ఎన్ని రోజులవుతుంది తెల్సా ?” ఆశగా ఆడుగుతున్నాడతను.

“నేను బాగానే ఉన్నాను రవి. కంగారుపడకు, నీ దగ్గరికి త్వరలోనే వస్తాను. నీ  ఆరోగ్యం మాత్రం జాగ్రత్త…” మళ్ళీ స్పందించింది.

“సరే! ఇంతకీ ఎక్కడున్నావ్?” అతను.

“నేను సేఫ్ ప్లేస్ లోనే ఉన్నాను. త్వరలోనే నీ దగరికి వస్తాను. నీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త…”అంటూ కాల్ కట్టయింది.

ఒక స్పందన అతని ఆరోగ్యానికి మళ్ళీ ఊపిరినిస్తుంది, ప్లాన్ సక్సెస్, స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా త్వరలోనే రవి ఆరోగ్యం కుదుటపడుతుందని అర్థమైనది మోహన్ కి.

నిజానికి రవికి స్పందించింది స్వప్న కాదు… ఒక మాట్లాడే పరికరం, అదే “లెక్సా.!”

కృత్రిమ మేధస్సుతో పని చేసే ఈ పరికరం ‘,లెక్సా ‘ అనగానే ఆన్ అయ్యి, మనమడిగే ప్రశ్నలకి అంతర్జాలంలో వెతికి మరీ సమాధానం చెప్పే ఒక “యంత్ర చిలుక ,” కొద్దిగ కోడింగ్ నాలెడ్జి ఉంటే అలెక్సా ని మనకు నచ్చిన విధంగా అన్వయించుకోవచ్చు. వృద్దులకు ఏ సమయానికి ఏ మందులు వేసుకోవాలో గుర్తుచేసేలా , ఒంటరివాళ్లకు మాట్లాడే తోడులా , కొన్ని దేశాల్లో సెక్యూరిటీ అలర్ట్స్ కీ , సమాచారం పంపించి, వినిపించే క్రమంలో అలెక్సా చాలా బాగా ఉపయోగపడుతుంది.

సైకియాట్రిస్టు మోహన్, రవి నిద్రలో కలవరిస్తూ , పలవరిస్తూ మాట్లాడే వాటిని గమనించి వాటికీ స్పందించే విధంగా అలెక్సా కి కోడింగ్ రాసాడు . రవి ‘స్వప్న’ అని అంటే, అది డీకోడ్ అయ్యి ‘అలెక్సా’ గా వినబడి ఆ పరికరం యాక్టీవ్ అయ్యి స్పందిస్తుంటుంది.

 

ఆలా…మరో రాత్రి…

అతను ‘స్వప్న లోకం'(నిద్ర)లోకి జారాకా…

“అన్నీ విడిచిపెట్టి ఏమి సాధిద్దామని వెళ్ళావ్ ? ఎటెళ్ళావ్ ? ఒంటరిగా పరిగేతే వాడే వేగంగా పరిగెత్తగలడని నీ మాటలు నాకింకా గుర్తు, కానీ నువ్వు లేని ఒంటరితనం కనీసం పాకలేకపోతున్నానని గ్రహించలేవా? లవర్ లేదని తాగి లివర్ చెడగొట్టుకునే వాణ్ణి కాను నేను. అయినా ఎందుకు పరీక్షిస్తున్నావ్ ?” సన్నటి గొంతుతో అతనడిగాడు.

లెక్సా మూగబోయేవుంది .

“చెప్పు ‘స్వప్న’… మాట్లాడవేం ?” అతని మాటకి లెక్సా ఆక్టివ్ అయ్యింది.

“నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వింతలా తపన పడాల్సిన అవసరం లేదు రవి. ముందు నువ్వు నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టు చాలు. నేనే నీ దగరికి కచ్చితంగా వస్తాను అని చెప్పా కదా…,” స్వప్న గొంతుతో లెక్సా.

అయోమయంలో అతను “, ఏంటి స్వప్న, అసలేమైంది నీకు?!! ఇలా మాట్లాడుతున్నావ్ ?”

“మరీ, ఒక నిండు ప్రాణం ఒక అమ్మాయి దగ్గరినుండి స్పందన రాలేదని ఆగిపోవడమేంటి ?!!” లెక్సా.

“నువ్వు తిడుతున్నావా? అసలు నీ గొంతులో ఎక్స్ప్రెషన్ లేకుండాపోయిందేంటి స్వప్న ?!!” కొంచెం ఆందోళనతో రవి అడిగాడు. అతనడిగిందానికి లెక్సా దగ్గర సమాధానాం లేదు,అందుకు “,నేను సేఫ్ ప్లేస్ లోనే ఉన్నాను. త్వరలోనే నీ దగరికి వస్తాను. నీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త…” లాంటి సమాధానాలు రిపీట్ చేస్తుంది లెక్సా.

“స్టాప్ ది నాన్ సెన్స్ స్వప్న . చెప్పిందే చెప్తున్నావ్…పిచ్చి పట్టిందా. ఇంతకి ఎక్కడున్నావో నిజం చెప్పు ?” కోపంలో అతను.

‘స్టాప్ ,’ మరియు ‘ స్వప్న ‘ అనే కమాండ్స్ గట్టిగా వినబడే సరికి లెక్సా ఆఫ్ అయ్యింది. అది గమనించిన మోహన్ బయట కంగారు పడ్డాడు. ఏమి తెలియక రవి లోపల కొపంతో అరుస్తున్నాడు…

సరిగ్గా అప్పుడే, మోహన్ కి రోజు లెక్సా గుర్తుచేసే అలారం వచ్చింది.

“మిస్టర్ మోహన్! మీరు మీ బీపీ టాబ్లెట్ వేసుకున్నారా..?”అని.

“ఏంటి …?!” ప్రశ్నార్థకంగా రవి.

“మీరు మీ బీ పీ ట్యా..బ్..లె..ట్..” లెక్సా అడుగుతూనే ఉంది.

లెక్సా కి సమాధానం చెప్పక పోతే అది లూప్ అయ్యి అడుగుతూనే ఉంటుందని, కంగారులో మోహన్ అబ్సర్వ్షన్ రూమ్ లోపలికి వెళ్లి ” యస్.. ఐ డిడ్ ” అని అన్నాడు.

“ఓకే.. థాంక్యూ” అంటూ లెక్సా ఆగిపోయింది. పక్కనుండి నర్స్ వచ్చి మోహన్ కి  బీపీ టాబ్లెట్ ఇచ్చింది. అప్పటికే రూంలో లైట్స్ అన్ని ఆన్ అయ్యాయి. మోహన్ వెనక్కి తిరిగి చూసేసరికి రవి నిద్రలోంచి లేచి కూర్చున్నాడు.!

స్వప్న గొంతులా మాట్లాడుతున్నా లెక్సా వైపు చూడసాగాడు…ఆశ్చర్యంగా! అతనికి అంతా అర్థమైంది…కోపమొ, బాధో, ఇంకేదో కానీ కళ్ళలోంచి మాత్రం నీళ్లు జలజలా రాలాయి.

ఒక అద్భుతమైన గొంతు, అబద్ధమని తట్టుకోలేక పక్కనున్న సీసపు బాటిల్ ఆ గోడకేసి విసిరాడు.

కానీ ఆ పరికరం స్పందనే అతన్ని మామూలు స్థితికి తీసుకొచ్చిందని తర్వాత మెల్లి మెల్లిగా గ్రహించాడు.

****

సరిగ్గా సంవత్సరం తర్వాత…

ఒక ఐవోటీ(ఇంటర్నెట్ అఫ్ థింగ్స్) సంబంధించి ఒక అంకుర సంస్థకి సీఈవో గా రవి ఎదిగాడు. యంత్రం దేహమైతే, దానికి ప్రాణంపోసేది సాఫ్ట్వేర్. శరీరంలోని ఎన్నో ‘ఇంద్రియన్ ‘లకు స్పందించే పరికరాలు ఐవోటీ ద్వారా చేయడం ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఎన్నో రకాల జబ్బులనుండి బయటపడడానికి ఈ స్పందించే పరికరాలు ఉపయోగపడుతున్నాయి. అంకుర ఆవిష్కరణల వేదికైన హైదరాబాద్ లో ఉన్న కంపెనీ అంచెలంచెలుగా విశ్వవ్యాప్తం అయ్యింది.

కంపెనీ రూల్స్ ప్రకారం  సీఈవో సైతం నెలకొక రోజు కస్టమర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయాలి. అలాగైతే కస్టమర్ కి కావాల్సింది చాలా దగ్గరినుండి తెల్సుకోవచ్చు అని కంపెనీ వాళ్ళ నమ్మకం. ఆలా రవి కస్టమర్ కాల్స్ మాట్లాడడానికి ,”నేను మీకు ఏ విధంగా సహాయపడగలను”, అన్నపుడల్లా అతని ఆమె గుర్తొచ్చి… గుండె బరువెక్కేది.

ఒక రోజు అలాగే రవి కాల్స్ మాడ్లాతున్నాడు “,చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను” రవి.

అవతలనుండి ఎలాంటి సమాధానం రాలేదు. రవి మళ్ళీ అడిగాడు.

మెల్లిగా ఒక గొంతు”, సంవత్సరం నుండి కాల్ చేస్తున్న…ఈ రోజు కోసం…రాత్రి నిద్రపట్టట్లేదు ‘సహాయ’ పడతావా?” అని.

ఆ గొంతు వినగానే, అతని గుండె కవాటాలు ఢమరుకమై మ్రోగాయి.అది స్వప్నే .లొకేషన్ తెల్సుకొని,ఆమె దగ్గరికి వెళ్ళాడు. నిజానికి ఆమె కాన్సర్ ని జయించింది, దానికి కారణం అతని కంపెనీ పరికరాల ప్రభావమే.!!

ఆమెని కలిసిన ఆ రోజునుండి, అతను పూర్తిగా కోలుకున్నాడు. ఆమె గుర్తుగా ఉంచుకున్న లెక్సా ఇక అతనికి గుర్తుకు రాక,మూలకి పడిపోయింది.

****

మన్ ప్రీతం

మన్ ప్రీతం

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Responding is a great thing can be done by Human beings. But we don’t do that and we expect from others. But when a machine responds we appreciate the things. A very depth concept where human response cure few things… well done Manpreetam.

 • Nice Story.

  Very excited to read it.
  Dialogues variation is super.
  Thank you for sharing it with all of us.

 • సైన్స్ అండ్ టెక్నాలజీ, మానవ జీవితం నేపథ్యంలో…. కొత్త తరహాలో రాశాను తమ్ముడూ. రోజు రోజుకు ఎదుగుతున్నావు. నీ మొదటి కథకూ ఈ కథకూ చాలా మార్పు కనిపించింది. గుడ్ కీపిటప్

 • నీ ప్రతి కథలో ‘కొత్తదనం’ కనబడుతుంది….తల్చుకుంటే ఇంకా గొప్పగా రాయగల్గుతావు. Anyways…All the best Manpreetam , Keep going.

 • Dear Lexa… a very good output form you Preetam. A deep research on machine & human nature can be seen in the story. This really puts you a step ahead.

 • Combining technology and love is a great idea. It’s a fantastic Story. All the best for your future stories.

 • I read thrice, still feeling to read. It touches heart about the emotions carried throughout the story. Well-done preetam. Rhyming with words you are just amazing. Looking forward for your more playing with words.

 • suuuuuuperrrrrrrrrrrrrr story . very good idea linking technology with human emotions. its really heart touching story, thank you very much for giving us a wonderful story.
  i must congratulate you.
  hoping more and more stories would come from your magic pen

 • very interesting story. well woven and heart touching dialogues. each line and word showing the care of writer.
  completely a different story. congrats Mann..

 • ప్రేమ కథల్లో ఇదో వినూత్నం అని చెప్పొచ్చు … ఏది కథగా రాయాలి ,ఏది కవితగా రాయాలి అనే కాదు … కథలో కవిత్వం ఎలా రాయాలో కూడా ఒక కళ . ఇది అందరి కథకులకి సాధ్యం కాదు . మంచి ప్రయత్నం మన్ ప్రీతమ్ గారు.  

 • Congratulations ra Preetam .
  Everytime you come up with new stories which consists of new theme not related to old version of any others or even your’s. Writing stories related current generation and even giving knowledge about trending technology to readers .
  I’m very very very happy for you ra . Having u as a friend is one the best thing ever happened in my life . Relating to story I can u r my Swapna.
  Hope you will write many stories like this and get success.

 • Nice story Preetam.,
  It is connected to me ,hoping for the more stories from you like this different innovative story.All the very best for your future assignments.

 • ManpreetamKV garu….Nice story sir. I got this story link in a WhatsApp group and gone through first three lines…and next lines automatically made me to read the story continuously. After reading complete story, my mood completely changed by the climax, only a young pen can go in that way.

 • బాగుంది మన్ ప్రీతమ్ గారు … ‘స్పందించటం’  అనే కాన్సెప్ట్ మీద చాలానే వచ్చాయి కానీ మీ కథ కొత్తగా అన్పించింది . ఇంకా బాగా కూడా రాయగలరు . కొత్త కథకుడి రుచి చూపించారు . 

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు