డియర్ మంజు

“పపమ్ పునెం పపంచమాలం…”

వాడలా నా ఒళ్ళొ  కూర్చొని వచ్చిరాని మాటల్లో శ్రీశ్రీ శైశవగీతి పాడుతుంటే భలే ముద్దొచ్చాడు.

“పాపం, పుణ్యం, ప్రపంచమార్గం” అని వాడితోపాటు పాడాను.

“పపమ్ పునెం పపంచమాలం – కషం సౌసం శేషాశషశ”

“కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలు”

“కషం సౌసం శేషాశషశ…” అని గట్టిగా పాడి, తల పైకిలేపి, నావంక చూసి బుజాలెగిరేసాడు. నాకు నవ్వాగలేదు. వాడి పాలబుగ్గలు లాగి ముద్దు పెట్టాను.

ఇంకో రెండు నెలల్లో మూడేళ్ళు నిండుతాయి మా బుడ్డోడికి. ఇంకా మాటలే సరిగ్గా రాకపోయినా అ,ఆలు అప్పచెప్పేస్తాడు నాకు. అదేంటోగాని వాడు నన్ను అమ్మ అని పిలవడు. ‘మంజు’ అని ముద్దుగా పేరుపెట్టి పిలుస్తాడు. రాత్రైతే చాలు నా ఒళ్ళొ కూర్చొని వాడికి నచ్చిన కథలు, రైమ్స్, పాటలు చెప్పించుకొని, పాడించుకున్నాకే నిద్రపోతాడు. నిన్న రాత్రి ఏదైనా కొత్త పాట పాడమని మారాం చేశాడు. ఏం పాడాలో తోచక శ్రీశ్రీ – శైశవగీతి పాడి వినిపించా. బాగా నచ్చింది వాడికి. మొదటి రెండు వాక్యాలు వాడికర్ధమైన భాషలో బట్టి పట్టేసాడు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే గుమ్మం దగ్గర అత్తమ్మ తల పట్టుకుని కూర్చోవడం చూసాను. ఏమయిందని ఆరా తీస్తే, నా గానగంధర్వ సుపుత్రుడుగారు నేను ఆఫీసుకెల్లినప్పట్నుండి అదేపనిగా ఆ రెండు వాక్యాలు చెవులు తూట్లు పడేలా పాడుతూనే ఉన్నాడంట. ఈరోజు రాత్రి కూడా వాడు నిద్రపోయే దాకా నాకు శ్రీశ్రీగారి భజనే ఇంక. కాసేపయ్యాక ఎలాగోలా నిద్రపోయాడు వాడు.

శ్రీశ్రీ – శైశవగీతంటే నాకు మా నెల్లూరు బాబాయి గుర్తొస్తాడు. ఆయనకో అలవాటుంది. గత కొంత కాలంగా ప్రతీనెల ఒక ఉత్తరంతో పాటు తనకి నచ్చిన కొత్త పుస్తకం నా ఆఫీసుకి పోస్టుచేసి పంపిస్తాడు. ఇప్పటివరకు నా వ్యక్తిగత అల్మారాలో యాబయ్ పుస్తకాలున్నాయి. అవి అక్కడ ఉన్నట్టు ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. చివరికి నా భర్తకి కూడా. ఎందుకో తరువాత చెప్తాను.

ఇప్పటికీ బాగా గుర్తు నాకు పదముడేళ్ళున్నప్పుడు తన పక్కన కూర్చోబెట్టుకొని తెలుగు వాచకంలోని పద్యాలన్నీ పాడి వినిపించి, నేర్పించేవాడు మా బాబాయి. అందులో నాకు బాగా గుర్తుండిపోయింది మాత్రం శైశవగీతే. మా బాబాయికి శ్రీశ్రీ అంటే పిచ్చి. మహాప్రస్థానంలోని కవితలన్ని ఆకలిరాజ్యం సినిమాలో కమల్ హాసన్ లాగా టకటకా నోటికి పాడేస్తాడు. బాబాయికి ఇరవైఎనమిదేళ్లొచ్చినా ఇంకా ఉద్యోగం రాలేదని, పెళ్ళికి పిల్లనెవ్వరివ్వరని మా తాతయ్య రోజు తెగ తిట్టేవాడు. అమితాబులా ఉంటాడు నా కొడుక్కేం తక్కువని వాదిస్తుంది నాన్నమ్మ. మెల్లిగా మన రొయ్యల వ్యాపారంలో నాకు తోడుగా ఉంటాడులే, ప్రస్తుతం వాన్ని వదిలేయండని వెనకేసుకొస్తాడు మా నాన్న. ఇందంతా మౌనంగా వింటూ నవ్వుకుంటుంది మా అమ్మ.

కాని ఇవేవి మా బాబాయికి పట్టేవికావు. ఆయన లోకమే వేరు. ఇంట్లో అన్ని గదుల్లోకెల్లా మా బాబాయి గది చాలా వింతగా ఉంటుంది. మూడు పక్కలా గోడలనిండా సినిమా హీరోలు, రచయితల పోస్టర్లుంటాయి. ఇంకోపక్క నేల నుండి అటక వరకు ఉండే పెద్ద గూట్లో బోలెడు తెలుగు ఇంగ్షీషు పుస్తకాలుంటాయి. ఉంటే తన గదిలో ఓమూల కూర్చొని పుస్తకాలు చదువుతుంటాడు. లేకపోతే సినిమా థియేటర్లో కాలక్షేపం చేస్తాడు. మా బాబాయి అందరిలాగా టికెట్టు కొనుక్కుని, సీట్లలో కూర్చొని సినిమాలు చూడడు. దర్జాగా ప్రొజెక్టర్ రూమ్లో కూర్చుని ఉచితంగా చూస్తాడు. నర్తకి ధియేటర్ ప్రొజెక్షనిస్టు మా నాన్నకి బాల్య స్నేహితుడు. స్వదహాగా మాటకారయిన మా బాబాయి తన మాటల గారడీతో అతన్ని బుట్టలో వేసుకున్నాడు. పోనుపోను ఇద్దరి మధ్యన మంచి స్నేహం కుదిరింది. ఇంక అప్పటినుండి ఆ థియేటర్ మా బాబాయికి అత్తరిల్లు అయిపోయింది.

వేసవి సెలవులోచ్చాయి. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా రిలీజ్ అయ్యింది. నా స్నేహితులందరూ ఖుషి సినిమా చూసేశామని చెప్పేసరికి నాకూడా చూడాలని కోరిక పుట్టింది. మా ఇంట్లో బాబాయికి తప్ప ఎవ్వరికి సినిమా థియేటర్లకి వెళ్ళే అలవాట్లు లేవు. అమ్మకి థియేటర్లో చూడాలని ఉన్నా, ఎలాగు నాన్న వద్దంటాడని అడగడమే మానేసింది. నేను చిన్న పిల్లనని, బాబాయితో తిరిగితే ఆయనలా అయిపోతానని వెళ్ళనిచ్చేవాడు కాదు తాతయ్య. అన్నం తినకుండా అలిగి కూర్చున్నాను. నాన్నమ్మ, అమ్మ ఎంత బ్రతిమిలాడినా వినలేదు. తెల్లవారుజాముననగా వెళ్ళి, సినిమాని మూడు సార్లు చూసిమరి సాయంత్రం ఇంటికొచ్చాడు బాబాయి. గుమ్మంలో అడుగు పెట్టగానే అన్నం ప్లేటు తన చేతిలో పెట్టి నావైపు వేలు చూపించింది మా అమ్మ. విషయం అర్ధమయింది. వచ్చి నా పక్కన కూర్చున్నాడు. సచ్చినా మాట్లాడొద్దని అనుకున్నానుగాని బాబాయి దగ్గర నా ఆటలు సాగవు. నాకు దగ్గరిగా వచ్చి చెవిలో ఒక మాట చెప్పాడు. అంతే! నా మొహం ట్యూబ్ లైట్లా వెలిగిపోయింది. చేతిలో ఉన్న అన్నం ప్లేటు లాక్కుని వెంటనే తినడం మొదలుపెట్టాను. మా అమ్మ ఆశ్చర్యపోయి మా ఇద్దరినీ చూస్తు తల బాదుకుంది.

మా అమ్మకి మాత్రమే చెప్పి నన్ను సినిమాకి తీసుకొచ్చాడు. అదే నా జీవితంలో మొదటిసారి సినిమా థియేటర్లో అడుగుపెట్టడం. అదికూడా  నైట్ షో, పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా. అంతమంది జనం మధ్యలో కూర్చొని సినిమా చూడడం భలే అనిపించింది. ఇద్దరం కలిసి ఈలలు వేశాం. కాగితాలు గాల్లో విసిరేసాం. అమ్మాయే సన్నగా పాటకి కోతిలా ఎగిరి గంతులేశాను. ఆ రాత్రి ఎంత సంబరపడ్డానో అంతే మొతాదులో ఇంట్లో ఇంకో సంబరం మాకోసం ఎదురుచూస్తుందని వెళ్ళాకగాని తెలియలేదు. నన్ను రాత్రిపూట సినిమాకి తీసుకెళ్లాడని మా తాతయ్యకి తెలిసిపోయింది. అందరి ముందు మా బాబాయిని చెడామడా తిట్టేశాడు. ఈ దెబ్బతో నన్నింక సినిమాలకి తీసుకెళ్ళడేమోనని నాకు చాలా భయమేసింది. అంత తిడుతున్నా కూడా మా బాబాయి మౌనంగా తల దించుకుని నిలబడి నా వైపు చూసి కన్ను కొట్టాడు. ఇంక ఆరోజు నుండి నన్ను చాలా సార్లు ఇంట్లో తెలియకుండా సినిమాలకి తీసుకెళ్ళేవాడు. మెళ్ళిగా నాకూడా సినిమా పిచ్చి అంటుకుంది. కొంత కాలం ఇలానే సరదాగా గడిచిపోయింది.

నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నకి రొయ్యల వ్యాపారంలో భారీగా నష్టం వచ్చింది. తన పార్టనర్స్ మోసం చేయడంతో పీకల్లోతు అప్పులో కూరుకుపోయాడు. ఇంట్లోని బంగారమంతా అమ్మేశాడు. పెద్దిల్లిప్పుడు చిన్నదయ్యింది. బందువులందరు అయ్యోపాపం అన్నారే తప్ప, ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందేమోనని మా కుటుంబాన్ని దగ్గరికి కూడా రానివ్వలేదు. అప్పుల బాధైతే తీరింది కానీ కుటుంబంతో సహా రోడ్డున పడ్డాం. మానాన్న ఇల్లు గడవడానికి చిన్నాచితకా పనులు చేయడం మొదలుపెట్టాడు. అప్పటికి మా బాబాయికి ముప్పై సంవత్సరాలు. తనకిష్టమైన పుస్తకాలన్నీటీని బలవంతంగా మనసు చంపుకుని అమ్మేశాడు. ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందన్న నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో మా నాన్నని వదిలి పట్నంలో ప్రైవేటు ఉద్యోగాల వేటకోసం వెళ్లాలనిపించలేదు మా బాబాయికి. తాను రోజు కాలక్షేపం చేసే నర్తకి థియేటర్ ప్రొజెక్షన్ రూమ్లోనే అసిస్టంట్ పనికి చేరాడు. తాను చదివిన చదువుకి ఈ చిన్న ఉద్యోగం చాలా తక్కువని హేళన చేస్తే…

‘కుక్కపిల్ల, ఆగ్గిపుల్ల, సబ్బుబిల్ల…

హీనంగ చూడకుదేన్ని!

కవితామయమేనోయ్ అన్ని.

కళ్ళంటూ ఉంటే చూసెయ్,

వాక్కుంటె వ్రాసెయ్,

ప్రపంచమొక పద్మవ్యుహం!

కవిత్వమొక తీరని దాహం!’ అంటూ శ్రీశ్రీ కవిత పాడి నవ్వుతూ సమాధానం చెప్తాడు.

మా నాన్నకొక రైస్ మిల్లులో గుమాస్తా ఉద్యోగం దొరకడంతో పరిస్థితి మెళ్లిగా చక్కబడడం మొదలయింది. వయసు అయిపోతుందన్న భయంతో మా బాబాయికి ఇష్టం లేకున్నా పెళ్ళి  సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మా కుటుంబం పడే అవస్థలు చూసి ఒక్కరు కూడా పిల్లనివ్వడానికి ముందుకి రాలేదు. వెనక ఆస్తులు, చేతిలో సరైన ఉద్యోగం లేకపోతే అమితాబుకైనా పిల్లనివ్వరని అప్పుడు అర్ధమయింది మా నాన్నమ్మకి. ఒకరకంగా పెళ్లి మీద మోజులేని మా బాబాయి దాని సంగతి ఎత్తినప్పుడల్లా – వచ్చే సంవత్సరం చూద్దాంలే అని మాటదాటేస్తాడు. ఇలా మూడేళ్ళు గడిచిపోయాయి.

నేను అప్పుడు నెల్లూరులోనే ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాను. బాబాయికి పెళ్ళి కాలేదన్న బెంగతో నాన్నమ్మ మంచం పట్టింది. తాతయ్య కూడా అప్పట్లాగా ఉత్సాహంగా లేడు. ఇప్పుడు మా బాబాయి అదే నర్తకి థియేటర్లో ప్రొజెక్షనిస్టు అయ్యాడు. ఎట్టకేలకు ప్రభుత్వం టీచర్ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అక్కడ పనిచేసుకుంటూనే గవర్నమెంట్ టీచర్ పోస్టు కోసం చదువుకుంటున్నాడు. బాబాయి ఉన్నాడన్న సాకుతో నా స్నేహితులని తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాకి వెళ్ళేదాన్ని. మా కాలేజీలో నన్ను అందరూ దేవతలా చూస్తారు. ఎందుకంటే ఏ కొత్త సినిమా రిలీస్ అయినా అందరికీ ఫస్ట్ డే – ఫస్ట్ షో టిక్కెట్లు ప్రసాదించేది నేనే కాబట్టి.

ఇదిలా ఉండగా మా కాలేజీలో ఒకడు గత సంవత్సరం నుండి  ప్రేమ పేరుతో నా వెంటపడే వాడు. నెల్లూరు సబ్ ఇన్స్పెక్టర్ కొడుకని పొగరు వాడికి. రోజురోజుకి వాడి తిక్క చేష్టలు ఎక్కువయ్యేసరికి ఒకసారి లాగి చెంప మీద ఒక్కటిచ్చాను. వాడు నామీద పగ పెట్టుకున్నాడు. నన్ను చాలా రకాలుగా ఏడిపించడం మొదలుపెట్టాడు. కాలేజీలో కంప్లయింట్ చేస్తే మందలించి వదిలేశారే తప్ప ఇంకేం యాక్షన్ తీస్కొలేదు. ఒక వారం రోజులు భరించాను. ఇంక నావల్ల కాక బాబాయికి చెప్పాను. విని తలుపాడు. తరువాతి రోజు నేను కాలేజీ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు వాడొచ్చి నన్ను విసిగించడం మొదలుపెట్టాడు. ఎక్కడినుండొచ్చాడో తెలియదు. మా బాబాయి వాడి ముందు నిలబడి బస్ స్టాండ్ మొత్తం రీసౌండొచ్చేలా చెంప పగలగొట్టాడు. క్షణంలో వాడి మొహం ఎర్రగా మారిపోయింది. మా బాబాయి ఆరడుగుల భారికాయం ముందు వాడు మేక పిల్లలా కనిపించాడు.

వాడు భయపడి “మా నాన్న ఎవరో నీకు తెలియదు. ఈ ఊరికే సబ్-ఇన్స్పెక్టర్. నిన్ను మామూలుగా వదిలిపెట్టను నేను.” అని అరిచాడు.

“నీయబ్బ పేరు చెప్పుకుని పనికిమాలిన పనులు చేయడానికి సిగ్గులేదు? అమ్మాయిలని ఏడిపించడం మగతనం కాదు, నీకు చేతనయితే మీ నాన్నలా సబ్-ఇన్స్పెక్టర్ అయ్యాక కనపడు. అప్పుడు మాట్లాడుకుందాం.” అని వాన్ని వెల్లగొట్టాడు.

బాబాయిని అంత కోపంగా చూడడం అదే మొదటిసారి. ఆ క్షణం నా కళ్ళకి నిజంగానే యాంగ్రీ యంగ్-మ్యాన్ అమితాబులా కనిపించాడు. ఆ తరువాత రోజు నుండి వాడు నా కంటపడడం కూడా మానేశాడు.

ఇంటర్ రిసల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను. చెన్నై వెళ్ళి చదువుకుంటానని మారాం చేశాను. వద్దని అంతిమ తీర్పిచ్చాడు నాన్న. దీనంగా బాబాయి వంక చూశాను. ఏదో అర్ధమయినట్టు నవ్వాడు. అంతే ఒక నెలలో చెన్నైలో వచ్చిపడ్డాను. మంచి యూనివర్సిటీలో బీటెక్ సీట్ వచ్చింది. మా కుటుంబాన్ని వదిలి హాస్టల్లో ఉండడం అదే మొదటిసారి. బాబాయికి ఫోన్ చేసి ఏడ్చేదాన్ని. నేను ఏడిస్తే ఆయనకి అస్సలు నచ్చదు. నన్ను అలా పెంచలేదు కూడా. కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలని నాకు నచ్చచెప్పేవాడు. ముందు కొంచెం కష్టంగా అనిపించినా తరువాత అలవాటైపోయింది. బాబాయికి పక్క టౌన్ గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్ జాబ్ వచ్చింది. అక్కడే పిల్లలతో పాటు హాస్టల్లో ఉండేవాడు.  నేనున్నానని ధైర్యం చెప్పి మా నాన్నతో మళ్ళీ రొయ్యల వ్యాపారం పెట్టించాడు. మూడేళ్లలో వ్యాపారం బాగా పుంజుకుంది. జీవితంలో అన్నీ సమకూర్చుకోగలిగినా ఎందుకో పెళ్ళి మాత్రం వద్దనుకున్నాడు బాబాయి. ఆ బెంగతో తన పెళ్ళి చూడకుండానే నాన్నమ్మ చనిపోయింది. తనవెంటే నేనని కొన్ని నెలల్లో  తాతయ్య కూడా నాన్నమ్మ దగ్గరికే వెళ్ళిపోయాడు.

అవి బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న రోజులు. యూనివర్సిటీలో సీనియర్స్ అంటే అదొక హవా ఉండేది. మా బాబాయి పుణ్యమా అని నాకు రెండు రోగాలు అంటుకున్నాయి. ఒకటి పుస్తకాలు చదవడం. రెండు సినిమాలు చూడడం. రాత్రి పూట హాస్టల్ గోడలు దూకిమరి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. ఇంకో వారంలో సెమిస్టర్ ఎక్సామ్స్ ఉన్నాయి కానీ అప్పుడే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగే గోడ దూకి సినిమాకి వెళ్ళాం. కానీ తిరిగి వచ్చేటప్పుడు మా దరిద్రం కొద్ది నేను నా ఫ్రెండ్ దొరికిపోయాం. ప్రిన్సిపల్ని బ్రతిమిలాడుకున్నా ప్రయోజనం లేదు. సినిమాకి వెళ్లాలన్న ఐడియా నాదే కాబట్టి, ముందు మా నాన్నని పిలిపించి నన్ను సస్పెండ్ చేస్తానన్నాడు. పాపం ఆయనకి తెలియదు యూనివర్సిటీ రికార్డుల్లో మా బాబాయి నెంబర్ ఉంటుందని. తరవాతిరోజు మా బాబాయి చెన్నై వచ్చాడు. నన్ను బయటే ఉంచి లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడాడు. కాసేపటికి నన్ను లోపలికి రమ్మన్నారు. కొన్ని క్షణాల నిశబ్దం తరువాత ప్రిన్సిపల్ నన్ను చూసి నవ్వాడు. ఏం అర్ధంకాక నేను తిరిగి నవ్వాను.

“It’s alright. Be careful. This is your last warning.” అని మమ్మల్ని పంపించేశాడు.

బయటికొచ్చాక లోపల ప్రిన్సిపల్తో ఏం చెప్పావని అడిగితే బాషా సినిమాలో రజినికాంత్లా ఒక పెద్ద నవ్వు నవ్వాడు. ఇప్పటికీ నాకు తెలియదు లోపల ఏం జరిగిందో. ఎన్నిసార్లు అడిగినా గట్టిగా నవ్వి నీకు అనవసరం అంటాడు. ఏనాటికైనా తనే చెప్తాడులే అని అడగడం మానేశాను.

నాకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. నాకొచ్చే జీతంలో చాలా వరకు పుస్తకాలు కొని చదివేదాన్ని. చదివేసిన పుస్తకాలు నాకు నచ్చినవాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో ఇచ్చేసేదాన్ని. ఉన్నంతలో నచ్చినవి కొనుక్కోగలిగే ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నాకు బాగా నచ్చింది. నాకు కావాల్సినంత స్వేచ్చ దొరికింది. ఇంకో రెండు సంవత్సరాలు ఆనందంగా గడిచిపోయాయి.

ఒకరోజు నాన్న ఫోన్ చేసి నాకు మంచి పెళ్ళి సంబంధాలొస్తున్నాయని చెప్పాడు. పెళ్ళి చేస్కోవడం ఇష్టమేనా అని అడిగాడు. ప్రేమలో పడడం నాకు ఆచ్చిరాలేదు. నాన్న చూసిన సంబంధం వద్దని చెప్పడానికి నాదగ్గర పెద్దగా కారణాలేమి లేవు కానీ నాకొన్ని కోరికలున్నాయి. కాబోయే వాడు వాటికి ఒప్పుకుంటేనే పెళ్ళి. లేదంటే చేస్కోనని చెప్పాను. నాన్న, బాబాయి కలిసి నాకోసం మంచి సంబంధం తీస్కొచ్చారు. ఒక్కడే కొడుకు. ఫోటోలో చూడ్డానికి చాలా బాగున్నాడు. నాకూడా నచ్చాడు. కానీ నా కోరికల లిస్టుకి ఒప్పుకుంటాడా అని మెదడులో చాలా ఆలోచనలు మెదిలాయి. ఇద్దరం కలిసే రోజు రానే వచ్చింది. కాసేపు మాట్లాడుకున్నాక నా లిస్టు తీసి ముందు పెట్టాను. ఇంట్లో నాకు నచ్చినట్టు నన్ను ఉండనివ్వాలి. పద్దతులు, సాంప్రదాయాలని నామీద బలవంతంగా రుద్దకూడదు. నాకు నచ్చినప్పుడే పిల్లల్ని కంటాను. చివరిగా మా బాబాయి రిటైర్ అయ్యాక నేనే దగ్గరుండి చూస్కోవాలి. ఈ కోరికలన్నీటికి సంతోషంగా ఒప్పుకున్నాడు. పెళ్ళి జరిగిపోయింది.

అరేంజ్డ్ మేరేజ్లో పెళ్ళికి ముందు ఎంత టైమున్నా ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ అవకాశం దొరికినా కూడా చేసుకోబోయే వాళ్ళ మెప్పు పొందడం కోసం తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టి నటిస్తారు. నా విషయంలో కూడా అదే జరిగింది. పెళ్ళికి ముందు నేను చూసిన వ్యక్తి వేరు, నా భర్తగా మారాక నేను చూస్తున్న వ్యక్తి వేరు. నా కోరికల లిస్టు, లిస్టుగానే మిగిలిపోయింది.

ప్రతీదానికి కోపం, ఏం మాట్లాడినా కోపం. అంతా తను అనుకున్నట్టే జరగాలి, లేకపోతే పట్టరాని కోపం వచ్చేస్తుంది మా ఆయనకి. ఆ కోపంలో ముందు వెనక ఆలోచించడు. ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. తన అమ్మనాన్నల మాట కూడా వినడు. ఏ పని అప్పజెప్పినా చెడగొట్టేస్తాడు. రోజు పొద్దున్నే జిమ్ముకెళ్ళి కండలు మాత్రం పెంచుతాడు. ఇంట్లో అత్తా, మామలతో సహా మా ఆయన తరపు బంధువులందరికి చాదస్తమే. పూజలు చేయనని, పద్దతులు తెలియవని, నమ్మకాలు పాటించనని తెగ దెప్పిపొడిచే వాళ్ళు. అన్నీ విన్నట్టే విని మా ఆయన నోరు మూసుకుంటాడు. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగమే అయినా మా ఆయన వంటినిండా, బుర్రనిండా చాదస్తమే. మాటకి మాట ముక్కు సూటిగా ఎదురు చెప్పడం నా సహజ లక్షణం. చాదస్తాన్ని ప్రశ్నించడం నాకలవాటు. అది వీళ్ళేవరికి నచ్చేదికాదు. ప్రతిదానికి గొడవే. ఆయన కోప్పడితే, నేను తిరిగి కోప్పడడం సంప్రదాయంగా మారింది.

మావారి కుటుంబంలో ఏం చేసినా భౌతికంగా లాభం కనిపించాలి లేకపోతే ఆ పనిని లెక్కచేయరు. నేను ఎంతో ప్రేమగా తెచ్చుకున్న పుస్తకాలని గూట్లో ఉంచితే, చెదలు పడతాయి పాతసామాడ్లోడికి అమ్మేయమన్నాడు మా ఆయన. పుస్తకాలు చదవడం వల్ల ఏం లాభం? కాలేజీలో చదివింది చాలదా? ఏం వస్తుంది నీకు? పెద్ద టైమ్ వేస్ట్ తప్ప అంటాడు. ఇదంతా బాబాయికి చెప్పుకోవాలనిపించింది. కానీ ఎందుకో చెప్పలేక ఆగిపోయాను. నన్ను, నా పనులను లెక్క చేయని వాళ్ళ గురించి ఆలోచించడం వ్యర్ధమనిపించింది. ఈ చాదస్తపు మనుషులని మార్చడం అనవసరమనిపించింది. నేనేమడిగినా, సలహాలిచ్చినా మా ఆయన ఏమంటాడో నాకు ముందే తెలుసు. అందుకే ఆడగడమే మానేశాను. పేరుకి భార్యభర్తలమే కానీ ఏనాడూ సంతోషంగా మనసువిప్పి మాట్లాదుకుంది లేదు. ఈ గంధరగోళం మధ్యలో మా బుడ్డోడు నా కడుపులో పడ్డాడు. ఇది కూడా తన ఇష్టమే.

మా మొదటి పెళ్ళిరోజు సరదాగా లంచ్ చేయడానికి నన్ను బయటికి తీస్కెళ్ళాడు. తిరిగొచ్చే దారిలో ఒక బుక్ షాప్ దగ్గర ఆపమంటే తిట్టాడు. నేను బైక్ వెనకాలే కూర్చొని వాదించడం మొదలుపెట్టాను. పెద్ద గొడవే అయ్యింది. కోపంలో మా కాలనీ వీధి చివర నన్ను వదిలేసి నీకిష్టమొచ్చిన చోటికి పొమ్మని ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు ఏడుపు ఆగలేదు. గర్బవతినని కూడా చూడకుండా వీధిలో వదిలేశాడు. ఏడుస్తూనే బాబాయికి ఫోన్ చేశాను. జరుగుతున్నదంతా చెప్పాను. మొత్తం ఓపిగ్గా విని ఒక మాటన్నాడు.

“నీకు నచ్చకపోతే ఒక్క మాట చెప్పు. నేను సపోర్ట్ చేస్తాను. నీ మాటే నా మాట. నీ సంతోషమే నాకు ముఖ్యం.”

కడుపులో బిడ్డ గుర్తొచ్చింది. నాకు ఆయన వద్దని గట్టిగా చెప్పలేకపోయాను. బాబాయినే వచ్చి మాట్లాడమని అడిగాను.

“మీ ఆయనేం నీ కాలేజీలో నిన్ను ఏడిపించిన కుర్రాడు కాదు. నేనొచ్చి నచ్చచెప్పి మందలించగలను కానీ అతనికి నీ మీద ప్రేమ, గౌరవం కలిగేలా మాత్రం చేయలేనుగా? సమస్య ఎదురైతే కూర్చొని ఏడ్చేలా నేను నిన్ను పెంచలేదు. కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలు. ముందు మీ ఆయన సమస్యకి మూలం ఏమిటో కనుక్కో. అతని వైపునుండి ఆలోచించడం మొదలుపెట్టు. ప్రతీది ముందుగా నీకు నువ్వే ఊహించుకోకు.  మీ ఆయన కోప్పడతాడని నువ్వు కూడా తిరిగి కోపం ప్రదర్శిస్తే మిగిలేది కోపమే. సమస్యని కోపంతో వచ్చే తిట్లతో కాకుండా శాంతంగా పదునైన మాటలతో ఎదుర్కో. అతనిలో కోపానికి తావివ్వకు. ఏం మాట్లాడినా ప్రేమగా మాట్లాడు. మూడవ వ్యక్తి ప్రస్తావన రానివ్వకుండా మీ ఇద్దరి గురించే మాట్లాడు. నీకు నచ్చింది చేయడానికి అతని మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది?” అని హితబోధ చేశాడు.

తరువాతిరోజు పొద్దున్నే ఆయన  జిమ్ముకి వెళ్ళడానికి బూట్లు తొడుక్కుంటు , గూటిలో ఉన్న నా పుస్తకాల వంక చూశాడు.

“ఇవి తీసేయమన్నాను కదా?” అని అరిచాడు.

బాబాయి ఇచ్చిన సలహా పాటించి చూడాలనిపించింది.

“నాకు  పుస్తకాలు చదవడం ఇష్టం. అది నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఒక్కసారైనా విన్నావా? నన్ను పట్టించుకున్నావా? నువ్వు ఇలా కోపంగా మాట్లాడితే నేనెంత బాధపడతానో తెలుసా?” అని మెల్లిగా సమాధానం చెప్పాను.

ఆశ్చర్యం.  అతని మొహంలో కోపం మాయమవడం నేను చూశాను.

ఒక్క క్షణం ఆలోచించి, “ఇన్ని డబ్బులు పోసి వీటిని కొనడం అవసరమా? కావాలంటే ఫోన్లో చదువుకో. నిన్ను ఎవరొద్దన్నారు?”

“మరి నువ్వేందుకు జిమ్ కోసం అన్నీ డబ్బులు ఖర్చు చేయడం? ఫోన్లో వీడియొలు చూసి ఇంట్లో చేసుకోరాదు?”

“ఎక్సర్సైస్ అనేది  జిమ్లో చేస్తేనే దానికి విలువ.”

“పుస్తకాలు కూడా కొని చదివితేనే వాటికి విలువ.”

“అరె! నీకు తెలియదా నాకు జిమ్ చేయడం ప్యాషన్ అని?”

“మరి పుస్తకాలు చదవడాన్ని ఏమంటారో?”

అంతే. మొహం మాడిపోయింది. వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయాడు. అతనితో నేనంత ఓపికగా మాట్లాడ్డం అదే మొదటిసారి. నాకే కొత్తగా అనిపించింది. తిరిగొచ్చాక మళ్ళీ గూటి వంక చూశాడు. పుస్తకాలు లేవు. ఎక్కడికి వెళ్లాయని అడగలేదు. ఆరోజు నుండి నా హ్యాండ్ బ్యాగ్లో పుస్తకాలు కనిపించినా దాని గురించి అడిగేవాడు కాదు.  మెళ్లిగా ఒకరోజు అందరూ పడుకున్నాక తన విపరీతమైన కోపానికి కారణం అడిగాను. ఒక్కగానొక్క కొడుకైనా చిన్నప్పటి నుండి ఇంట్లో స్వతంత్రంగా వుండే అవకాశం ఇవ్వలేదు ఆయనకి. తల్లిదండ్రుల పెంపకం తన కోపానికొక కారణమైతే, తను ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోవడం ఇంకో కారణం. ఆ బాధ నుండి తప్పించుకోవడానికి జిమ్ చేయడం నేర్చుకున్నాడు. పోనుపోను ఆడవాళ్ళ మీద అసహ్యం కలిగింది. అది కాస్తా మనసులో నాటుకుపోయింది. ఆయన నాతో ఇంత మెళ్ళిగా, ఓపికగా మాట్లాడ్డం అదే మొదటిసారి. తన బాధంతా చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తన కోపం, మొండితనం వల్ల నేనెంత బాధ పడుతున్నానో వివరంగా మూడో వ్యక్తి ప్రస్తావన తీసుకురాకుండా చెప్పాను. ఆ రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాం. నిజానికి అదే మా మొదటి రాత్రనిపించింది నాకు. ఆరోజు నుండి ఆయన్ని వేరేలా చూడడం మొదలుపెట్టాను. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. తనతో ఎలా, ఏం మాట్లాడితే నా మాట వింటాడో నాకు అర్ధమయ్యింది. తనకి నచ్చని పని చేయకుండా నాకు నచ్చిన పనులు ఎలా చేసుకోవాలో, అందులో సంతోషం ఎలా వెత్తుకోవాలో నాకు బోధపడింది. మా ఆయన కూడా నన్ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా మా బాబాయి చలవే.

ఒక వారం రోజుల తరువాత నా ఆఫీసుకి ఒక పార్సెల్ వచ్చింది. విప్పి చూస్తే అందులో ఒక కొత్త పుస్తకం, ఒక ఉత్తరం ఉన్నాయి. అవి మా బాబాయి పంపినవి. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతీనెల ఒక పుస్తకం పార్సెల్లో పంపిస్తాడు. డెలివరి కోసం మా పుట్టింట్లో ఉన్నప్పుడు మా బాబాయి పంపినవి, నాతో తెచ్చుకున్నవి మొత్తం కలిపి ముప్పై పుస్తకాలు ఏకదాటిగా చదివాను. బాబు పుట్టాక తిరిగి ఈ ఇంటికొచ్చినప్పుడు ఆ పుస్తకాలన్నీ నాతో తెచ్చుకుని ఎవరికి తెలియకుండా నా పర్సనల్ అల్మారాలో దాచుకున్నాను. ఈ పుస్తకాలు నా వద్ద ఉన్నాయని ఆయనకి తెలియాల్సిన అవసరం లేదు. తెలిసినా తానేమీ అనలేడు. పెళ్ళి అయ్యాక సుఖంగా ఉండాలంటే ఇద్దరి  మధ్య ప్రేమొక్కటే సరిపోదు. పెళ్ళి అనే ప్రక్రియతో ప్రేమలో పడాలి. అప్పుడే సుఖసంసారం సాధ్యమంటాడు మా బాబాయి. నాకు అప్పుడు అర్ధమయింది బాబాయి పెళ్ళెందుకు వద్దనుకున్నాడో. ఇలాంటివెన్నో ఉత్తరాల్లో నాతో పంచుకునే వాడు. ఫోన్లు ఉన్నప్పుడు ఉత్తరాలతో ఏంపని అనుకోవచ్చు. మా బాబాయి సొంత చేతివ్రాతతో రాసి నాతో పంచుకున్న మాటలని తన జ్ఞాపకంగా నావద్ద భద్రపరచాలనే కోరికతో ఉత్తరాలు రాస్తున్నాడు. ఇవి ఉత్తరాలు కావు, జీవిత అనుభవాలు – పాఠాలు.

వచ్చేవారం క్రిస్టమస్ సెలవులకి మా ఇంటికొస్తానని ఈరోజు నాకందిన ఉత్తరంలో రాశాడు. ఖుషి సినిమా మళ్ళీ ఇన్నేళ్ళకి రీరిలీస్ చేస్తున్నారంట. బాబయికి నాతో కలిసి మళ్ళీ ఆ సినిమా చూడాలని, ఈలలు వేస్తూ అరవాలని చిన్న కోరిక. ఆ తరువాత సిటీలో జరుగుతున్న బుక్ ఫేర్కి తీస్కెళ్ళి బోలెడు పుస్తకాలు కొనిస్తానని కూడా రాశాడు.

ఇప్పటికే ఆలస్యమయ్యింది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. నేనుంటాను మరి, మళ్ళీ కలుద్దాం.

ఒక్క నిమిషం. అనట్టు మా బాబాయి పేరు చెప్పలేదు కదూ? సీతారామరాజు. మా తాతయ్య ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు. అల్లూరి మీద ప్రేమతో బాబాయికి ఆ పేరు పెట్టుకున్నాడంట. బాబాయి మీద ప్రేమతో నా కొడుక్కి అదే పేరు పెట్టుకున్నా. నా కొడుకులాగే మా బాబాయి కూడా నన్ను మంజు అని పిలుస్తాడు. కాదు కాదు, నా కొడుకే మా బాబాయిలా పిలుస్తాడు.

*

దినేష్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా బాగుంది 👏👏👏. మీ కథలు చదివేటప్పుడు పాత్రలకి అనుగుణంగా, మా భావం వివిధ రకాలుగా మారుతుంది, కానీ చివరి వాక్యాల్లో మీ చమత్కారం వలన చిరునవ్వు పంచుతారు😊.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు