డిపార్చర్స్

తడు ఆమె వెనకాలే తిరిగాడు. రోజులతరబడి వెంటపడ్డాడు. గాఢంగా ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె లేకుంటే బతకలేనన్నాడు. ఒక్క నిమిషం ఎడబాటు సహించలేనన్నాడు.

నేటి అన్ లిమిటెడ్ కాల్ ప్యాకేజీలు, వీడియోఛాటింగ్స్ కాలంలో అతడామె మీద  తన ప్రేమగాఢతను వ్యక్తంచేసేందుకు పాతపద్ధతుల్ని అనుసరిస్తూ వచ్చాడు. నైన్టీన్ యైటీస్ రొమాంటిక్ మూవీల్లో మాదిరి రక్తంతో ఉత్తరం రాశాడు. వేలుచివర కోసుకొని, ఒక్కో చుక్క పిండుతూ నెత్తుటి సిరాతో ప్రేమలేఖలు రాసి పంపించాడు. ఆమెకోసం వానల్లో తడిశాడు, ఎండల్లో తిరిగాడు, నిద్రలేని రాత్రులు గడిపాడు.

ఈ సంగతి తెలిసిన అతని గురువులాంటి సన్నిహిత మిత్రుడు మందలించాడు.

“ఇది మూర్ఖత్వం మధూ! ఒకవిధంగా పిచ్చితనం కూడా”

“లేదు గురూజీ! నాది నిజమైన ప్రేమ, ఇదే అసలైన ప్రేమవ్యక్తీకరణ” చెప్పాడు.

“ఆమెని అంత గాఢంగా ప్రేమిస్తున్నావా?”

“అవును, ఆమె లేకుంటే చచ్చిపోతా”

చివరికతని ప్రయత్నాలు ఫలించినయి. టాస్క్ నెరవేర్చుకున్నాడు. అంజలి తన ప్రేమను యాక్సెప్ట్ చెయ్యగానే ఆనందంతో క్లౌడ్ నైన్లో విహరించాడు. ప్రపంచం కొత్తగా ఆకర్షణీయంగా కనిపించింది.

“ఈ సంతోషంలో ఈ క్షణం చచ్చిపోయినా ఫరవాలేదు డియర్” అన్నాడు ఉద్వేగంతో.

“యూ క్రేజీ! అంత మైమరపు పనికిరాదు. ఇది జీవితం, బీ ప్రాక్టికల్” ఆమె నవ్వుతూ చెప్పింది.

“కనిపించే ఆ ఇంద్రధనుస్సు నీకంటే అందంగా వుండదు తెలుసా” అంజలి బుగ్గలు పట్టుకొని సాగదీశాడు.

“పొగడ్తలతో ఇంకా పడెయ్యాలని చూడకు, ఆల్రెడీ పడిపోయాను”

అక్కణ్ణుంచి ఆమె ధ్యాసలో సర్వం మర్చిపోయాడు. స్నేహితులు, బంధువులు, ప్రపంచం,యావత్ సోలార్ సిస్టం ఏదీ అతనికి కనిపించలేదు. తన ఒకేఒక్క జీవితాశయం నెరవేరినట్టు ఫీలయ్యాడు. అంజలి ప్రేమే శ్వాసగా, ఆమె సన్నిధి పరమావధిగా మసులుకున్నాడు.

తమ అన్యోన్యతని పొలంగట్లూ, మార్నింగ్ షోలూ, పార్కుల చుట్టూ కాకుండా కొత్తగా పంచుకున్నాడు. కొంచెం ఎడబాటు వొచ్చినా స్కైప్ రిలేషన్షిప్ వారధి కట్టుకున్నాడు. వాలైంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్ బాక్స్ ప్రెజెంటేషన్లు, ఇంస్టాగ్రాంలో ఫిల్టర్డ్ సినిమాటోగ్రఫీలు, రొమాంటిక్ మూవీల్లోని క్లోజింగ్ సీన్లు, వీడియో క్లిప్పింగులు, మెసేజులు.. ఇట్లా ఎన్నెన్నో.

భూగురుత్వాకర్షణకు కూడా అందకుండా కలల్లో తేలుతూనే పెళ్లికి ప్రపోజ్ చేశాడు.

అంజలికి అప్పుడే ఇంజనీరింగ్ పూర్తయి క్యాంపస్ ప్లేస్మెంటులో జాబ్ దొరికింది.

అతడింకా నిరుద్యోగిగానే వున్నాడు.

పెళ్ళికి ఇరువైపులా పెద్దలొప్పుకోలేదు. ఆస్తులు అంతస్తులు కాకుండా కులం కొట్టొచ్చినట్టు అడ్డొచ్చింది.

“మనం లేచిపోయి ఎక్కడన్నా హాయిగా బతికేద్దాం” ప్రేమ మోజులో ఆవేశపడిపోయాడు.

ఆమె కూడా ప్రేమలోనే వుంది. కానీ అతనిలా మైకంలో లేదు. అందుకే తొందరపడకుండా చెప్పింది “పెళ్లిదేముంది మధూ! ఎప్పుడైనా చేసుకోవొచ్చు ముందు ఉద్యోగం వెతుక్కో”

కానీ అతడు హడావిడి చేశాడు. తనకు జాబ్ లేకపోవడం, పెద్దలు ఒప్పకపోవడం పెద్ద సమస్య కాదన్నాడు. ఇంకా వెయిట్ చెయ్యడం కుదరదన్నాడు. ఇద్దరం కలిసివుండటం ముఖ్యమని పట్టుబట్టాడు.

ఈ విషయంలో తన గాడ్ఫాదర్ మిత్రగురువును ప్రాధేయపడ్డాడు

“గురువుగారూ, మీరే ఎలాగైనా మమ్మల్ని ఒక్కటి చెయ్యాలి”

మిత్రగురువు ముందుకొచ్చాడు. నిజమైన ప్రేమికుల్ని వాళ్ళ గమ్యం చేర్చాలన్న సెంటిమెంటుతో కదిలాడు.

“అంజలిని ఒప్పించి మీపెళ్లి జరిపిస్తాను” హామీ ఇచ్చాడు.

అన్నట్టుగానే ఆమెతో మాట్లాడి, సమాధానపరిచి ఇద్దరికీ దగ్గరుండి క్లుప్తంగా దండల పెళ్లి జరిపించాడు.అంతేకాదు, కొంతకాలం ఇద్దర్నీ తనింట్లోనే పెట్టుకున్నాడు. దరిమిలా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన నిరసనల్ని కూడా అడ్డుకున్నాడు.

కొన్నిరోజుల తర్వాత మిత్రగురువుకి కృతజ్ఞతలు తెలిపి భార్యాభర్తలు వేరే ఇల్లు చూసుకొని అందులోకి మారిపోయారు.

***

మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాటి దృశ్యం…

“ఐ థింక్ నౌ ఉయ్ షుడ్ బ్రేకప్ అంజలీ!” చేతిలో పట్టుకున్న ఫోన్లోకి చూస్తూ పచార్లు చేస్తున్న మధు హఠాత్తుగా ఆగి అన్నాడు. గత వారంరోజులుగా ఆమెతో ముభావంగా వుంటూ దాదాపు మాట్లాడ్డం మానుకున్న అతడి నుంచి వచ్చిన మొదటి మాట ఇది.

సీరియస్ గా వర్క్ ఫ్రమ్ హోంలో మునిగిపోయిన ఆమెకు ఈమాట విన్పించలేదు.  ఆమె రియాక్షన్ కోసం అన్నట్టు కొద్దిక్షణాలు ఆగి మళ్ళీ తనే అన్నాడు “వింటున్నావా? మనమిక కలిసి వుండటం సాధ్యం కాదు, విడిపోదాం..”

అంజలి విన్నది. తలెత్తి చూసింది. జోక్ చేస్తున్నాడనుకుంది. కానీ అతని ముఖంలో కాఠిన్యం, కళ్లలో తీక్షణత చూశాక కాదనిపించింది.

“ఏమంటున్నావు.. విడిపోదామా? ఆర్ యు కిడింగ్..?” ల్యాప్టాప్ పక్కకుపెట్టి పూర్తి అటెన్షన్ గా కూర్చున్నది.

“అవును, నేనన్నది నిజమే. ఉయ్ షుడ్ బ్రేకప్. ఇంక నీతో కలిసి ఉండలేను. నువ్వయినా వెళ్లిపో. లేదంటే నేను పోతాను”

“ఏం మాట్లాడుతున్నావు? మతిపోయిందా? బ్రేకప్ చెప్పడానికి మనం ప్రేమికులం కాదు. మనకు పెళ్ళయింది, భార్యాభర్తలం”

అతడు మెత్తగా నవ్వాడు. ఆ నవ్వులో ఆమె ఎప్పుడూ చూడని శతృత్వం.

“పెళ్లయితే బ్రేకప్ చెప్పకూడదా? అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుందాపెళ్ళికి? అయినా మనదీ ఒక పెళ్ళేనా? సంప్రదాయం పాటించామా.. ముహూర్తం పెట్టారా.. పండితులు మంత్రాలు చదివారా.. ఏడడుగులు నడిచామా.. అంతెందుకు, నేను నీ మెడలో తాళి కట్టానా? ఒక బ్రహ్మచారి మిత్రుని ఇంట్లో రెండు దండలు మార్చుకోగానే పెళ్ళయిపోయి మనం జీవితాంతం మొగుడూపెళ్లాలమా? వయసు వేడిలో ఇష్టపడ్డాం. కలిసుందామని మోజుపడ్డాం. మన సహజీవనానికి అదో దండల తంతు. అంతేకాని మన పెళ్లిజరిగినట్టు ఎక్కడా ఎలాంటి ఆధారం లేదు”

ఆమె ఆశ్చర్యపోయింది. నమ్మలేనట్టు చూసింది. మనసులో ఎగిసిపడే నిశ్శబ్ద అలజడిలో కొన్ని క్షణాలు మౌనం వహించింది. అతనిలో ఇంత సమూలమైన మార్పుకి, కఠిన నిర్ణయానికి దారితీసిన కారణాలేవో బోధపడలేదు.

ఈ మనిషే మూడేళ్ళక్రితం ఏమన్నాడు..?

‘నీకు ఎలాంటి పెళ్లి కావాలి అంజలీ..’ అనడిగాడు.

సంప్రదాయ వివాహాన్ని ఇష్టపడే తను అటువైపు మొగ్గింది. అమాటే చెప్పింది. “ట్రెడిషనల్ మేరేజా..!” ఎగతాళి చేశాడు. ఆచారాలు, ముహూర్తం,

బ్యాండుమేళాలు, చుట్టపక్కాలు.. ఈ తతంగమంతా ఉంటేనే పెళ్ళయినట్టా అన్నాడు. తనకు అలాంటివి ఇష్టం లేదన్నాడు. పెళ్లికి ఆర్భాటాలు ఉండకూడదు, ఒక ఒప్పందం మాదిరి క్లుప్తంగా జరిగితే సరిపోతుందన్నాడు. చిరకాలం ఒకరిమీద ఒకరికి ఉండాల్సింది నమ్మకమూ, ప్రేమానురాగాలేనని చెప్పాడు. అట్టహాసంగా, ఒక న్యూసెన్స్ లాగా జరిపే సంప్రదాయ పెళ్లి తంతు మీద విశ్వాసం లేదన్నాడు. అంతేకాదు, పెళ్లి తర్వాత సుఖసంసారం గురించీ, భవిష్యత్తు గురించీ ఎన్నో ప్రణాళికలు రచించాడు. చివరికి పుట్టబోయే బిల్లలకు ఏ పేర్లు పెడదామో కూడా ముందే ఆలోచిస్తున్నట్టు వెల్లడించాడు.

“నిన్ను బెటర్ హాఫ్ గా పొందిన నేను చాలా అదృష్టవంతుణ్ణి” అంటూ అడుగడుగునా పల్లవి పాడేవాడు.

అట్లా కాపురం నీళ్ళలో కొత్తగా వదిలిన కాగితం పడవలా సాఫీగా సాగిపోయింది. ఏడాది తర్వాత బాబు పుట్టాడు. అతనికి ఉద్యోగంలో పదోన్నతి లభించింది. ఇరు కుటుంబాల పెద్దలు కూడా రాజీ పడ్డారు. రెండు ఫ్యామిలీల నడుమ సంబంధాలు నెలకొన్నాయి. ఇన్ని సానుకూల అంశాల నడుమ దాదాపు కోరుకున్న లగ్జరీలు అనుభవిస్తూ సంసారం అన్యోన్యంగానే సాగుతూ వస్తున్నది.

కానీ, ఊహించని విధంగా ఇప్పుడీ అపశృతి..!

ఆమెతో ఏమాత్రం సంతోషంగా సుఖంగా లేనని చెప్పేశాడు. ఇకపై ఇద్దరం కలిసి వుండడంలో అర్థం లేదన్నాడు. ఆమె ప్రేమను పొందడానికి, ఆమెను జీవిత భాగస్వామిని చేసుకోవడానికి ఎన్నో పాట్లుపడ్డ అతడు చాలా తేలిగ్గా బ్రేకప్ చెప్పేశాడు.

“ఇప్పుడు విడిపోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది. నిన్నంతగా హర్ట్ చేసిన కారణమేంటి?” అడిగింది.

“నీకు తీరిగ్గా వివరించి ఆర్గ్యుమెంటు చేసే ఓపిక నాకు లేదు. కారణాలు చూపుతూ శాస్త్రీయంగా ప్రూవ్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు”

“అసలేంటి ప్రాబ్లెమ్?” ఆమెకి తెలియకుండానే కంఠం పూడుకుంది. “నేనేమైనా తప్పుగా ఉన్నానా? అదేదో చెపితే సరిదిద్దుకోవచ్చు”

“అంత శ్రమ అక్కర్లేదు. అన్నిటికీ బలమైన కారణాలు ఉండక్కర్లేదు. మనమధ్య కెమిస్ట్రీ పోయింది. ఇమోషన్స్ పోయాయి. నువ్వో మరమనిషి అయ్యావు. ఇంత రొటీన్ బతుకుతో కలిసి ఆనందంగా ఉండలేం”

“కలిసి ఉండలేమని అంత తేలిగ్గా ఎలా చెప్పగల్గుతున్నావు? మనమధ్య గొడవలేం లేవు. అంతా బాగానే ఉంది. ఇదేం చిన్న విషయం కాదు, మన ముగ్గురి జీవితాలతో ముడిపడి ఉన్నది. ఆవేశపూరిత నిర్ణయం మంచిదికాదు. విభేదాలుంటే మనసులు విప్పి మాట్లాడుకుందాం, సర్దుబాటు చేసుకుందాం”

“ఇంకేం మాటల్లేవు. నీ దారి నువు చూసుకో. నేను పోతున్నాను” తెగ్గొట్టినట్టు అనేశాడు. సంభాషణ పది నిముషాల్లో ముగిసింది.

అతడు వెళ్ళిపోయాడు. ఆమె ప్రపంచం కూలినట్టయింది. ఇంట్లో ఒంటరిగా సంధ్యవేళ క్రీనీడలా ఉండిపోయింది.

అతడు మళ్ళీ ఇంటి ముఖం చూడలేదు. భార్యనూ, బాబునూ వొదిలివెళ్లి నెలరోజులు గడిచాయి. విషయం ఇరువైపుల పెద్దవాళ్లకు తెలిసింది.

“అసలేం జరిగింది? విడిపోయేంత బలమైన కారణం ఏమిటి?”

అంజలి అమ్మా నాన్నా అడిగారు.

ఏం చెప్పగలదు? ఏదన్నా సీరియస్ రీజన్ ఉంటేకదా చెప్పేందుకు?

అయితే ఆమె చెప్పిన మాటలు అత్తామామలు నమ్మినట్టు లేరు. గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేశారు. వొదిలి వెళ్ళింది కొడుకైతే, తప్పుచేసినట్టు ఆమెని దోషిని చేశారు. అంతటితో ఆగకుండా కొడుకును సంప్రదించారు.

తనతో ఆ విషయం ప్రస్తావించినందుకు అతడు తల్లిదండ్రుల మీద విసుక్కున్నాడు. తన వ్యక్తిగత జీవితంలోకి తలదూర్చొద్దని ఖచ్చితంగా చెప్పాడు. వాళ్ళతో మాటలు బంద్ చేశాడు.

అంజలి ఎన్నిసార్లో ప్రయత్నిస్తే మధు ఒక్కసారి ఫోనెత్తాడు. కానీ కఠినంగా, మాటలు తూటాల్లా ప్రయోగించాడు. అతని కోపాన్ని పట్టించుకోకుండా ఆమె సర్దుబాటు ధోరణిలో మాట్లాడింది.

“ప్లీజ్.. కమ్ బ్యాక్ మధూ! ఏమిటి నీ మొండితనం? ఉయ్ విల్ సెటిల్ ఎవ్రీ థింగ్” అర్థించింది.

“బ్రేకప్ అయిపోయాక సర్దుబాట్లు ఎందుకు? నువు అర్థించడంలో అర్థం లేదు. నీ బతుకు నువ్వు బతుకలేవా?”

“సరే.. జరిగింది వొదిలెయ్యి. ఇకనుంచి నువు చెప్పినట్టే నడుచుకుంటాను. నీకు నచ్చేవిధంగా నా కెమిస్ట్రీ మార్చుకుంటాను”

“నీకా శ్రమ వొద్దు. అంత కష్టపడి నటించనక్కర్లేదు. నీ పద్దతిలో నువు బతుకు, నా జీవితం నాది”

“బాబును కూడా చూడాలనిపించడం లేదా?”

అతడు నవ్వాడు.“వాణ్ని నువ్వే ఉంచుకో. మన మధ్య ఏ జ్ఞాపకమూ, బంధమూ లేదు”

కరడుగట్టిన అతని ధోరణి ఆమె నిబ్బరాన్ని చెదరగొట్టింది. దుఃఖమొచ్చింది. చివరికి బాబుతో ఒంటరిగా ఉండలేక

తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది.

“మనం లీగల్ గా ప్రొసీడైతే మంచిదేమో బేబీ” తండ్రి సూచించాడు.

ఆమె వారించింది. జరిగింది పెళ్ళేకాదని అతడు చెపుతుంటే ఇంకేం చేస్తుంది. లాయర్లు, కోర్టులు, సాక్ష్యాలు.. ఇదంతాచేసి అతనిమీద కేసు గెలిస్తే పొందేదేమిటి? ఆర్థికంగా ఏదైనా బెనిఫిట్ జరగొచ్చు. కానీ దానివల్ల తను పోగొట్టుకున్నది దొరుకుతుందా? అందుకే భవిష్యత్తు వేపు దృష్టి సారించాలి. తానుగా ముందుకు సాగాలి. జరిగింది మరిచిపోయే ప్రయత్నం చేయాలి.

ఆమెకు కళ్ల ముందు గతం కదిలింది. జీవితం ఎంత బాగుండేది..! ఇద్దరూ ఏ ఒడుదొడుకులు లేకుండా అన్యోన్యంగా.

దాదాపు మూడేళ్లుగా ఎంత సంతోషంగా ఉన్నారు!

ఆమె దృష్టిలో తన తప్పేమీ లేదనిపించింది. అతని కోసం భార్యగా చేయాల్సింది చేశాననుకుంది. అతన్ని మనస్పూర్తిగానే ఇష్టపడింది. అతడూ అంతే అనుకుంది. కానీ నమ్మకం అనేది ఏకపక్షం కాకూడదు. ఫీలింగ్స్ ఆర్ ఫ్రాజెల్. ఇద్దరూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏవైపు నుంచి జారిపడినా గాజులా ముక్కలవక తప్పదు.

వారం క్రితం మధుకు గాడ్ ఫాదర్ మిత్రుని ఇంటికి వెళ్ళింది అంజలి…

“రామ్మా.. బావున్నావా?” ఆయన సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా మాట్లాడాడు.

చిన్నగా తలూపి నవ్వింది. ఆమె నవ్వులో ఇదివరకటి మెరుపు లేదని ఒక్కచూపులో గ్రహించాడు.

“మీ ఆయన ఎట్లా వున్నాడమ్మా? బాబును తీసుకురాలేదేం?”

“బాబు బాగున్నాడు సార్. మా అమ్మావాళ్ళ దగ్గరున్నాడు”

తను మధు గురించి చెప్పకపోవడం, అలాగే బాబు అమ్మావాళ్ళ దగ్గర ఎందుకున్నాడన్న సందేహం ఆయనలో కలుగనందుకు ఆమె రిలీఫ్ ఫీలైంది. చాలాసేపు ఏవో విషయాలు మాట్లాడిందే తప్ప అసలు సంగతి చెప్పలేకపోయింది.

ఆయనకు అనుమానమొచ్చింది. అంజలి మనసులో మింగుడుపడని విషాదం ఏదో వుందని అర్థమైంది. చెప్పాలనుకున్నది చెప్పలేక సతమత మవుతుంది. కళ్ళల్లో బరువేదో మోస్తున్న స్థితి కనిపించింది. సమస్య ఏమిటో తెలియలేదు.

“మధు కనిపించక చాలా రోజులైంది. ఫోన్ కూడా చేయట్లేదు. ఎప్పుడన్నా నేను చేస్తే లిఫ్ట్ చేయడం లేదు”

జవాబు చెప్పకుండా చిన్నగా తలూపి ఊరుకుందామె.

ఆయన కాస్సేపు ఎదురుచూసినట్టు ఆగి అడిగాడు:“నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అమ్మా..!”

ఉలికిపడి కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. అయినా అసలు విషయం చెప్పలేక

“నో నో.. అదేం లేదు అంకుల్” అంది.

కొద్దిసేపటికి ఆమె వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత రెండురోజులకు అంజలి తల్లిదండ్రులు ఆయన దగ్గరికొచ్చారు. మొన్న అంజలి చెప్పలేక మథనపడిన విషయాన్ని వాళ్ళు విచారిస్తూ వెల్లడించారు.

మొత్తం వివరంగా చెప్పి “ఏ కారణమూ లేకుండా అమ్మాయిని వొదిలేసి పోయాడు” అన్నాడు అంజలి తండ్రి.

“ఇది జరిగి ఎన్ని రోజులైంది? నాకు తెలియదే. మొన్న అమ్మాయి కూడా వొచ్చి వెళ్ళింది. కానీ చెప్పలేదు” ఆయన ఆశ్చర్యంగా అన్నాడు.

“అవును, మీతో చెప్పలేక పోయిందట. ప్రస్తుతం అమ్మాయి మాతోనే ఉంటుంది. మధుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే దొరకట్లేదు.అతడు పనిచేసే ఆఫీసుకు కూడా వెళ్ళింది. అసలు మా బేబీని కలిసేందుకే అతడు ఇష్టపడలేదట. చాలా దురుసుగా మాట్లాడి మనం విడిపోయామని, బాబు బాధ్యత నాది కాదనీ చెప్పాడట. మరెప్పుడూ తనను కలిసే ప్రయత్నం చెయ్యొద్దని కూడా హెచ్చరించాడట” పెద్దాయన చెపుతూ చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు.

“ఎందుకీ మార్పు? అసలు కారణమేంటి?”

“ఏమీ లేదంటుంది మా బేబీ. అతడే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు” అంజలి తల్లి దిగులుగా అంది.

“విషయం తెలిసి అతడి తల్లిదండ్రులు అడిగితే వాళ్ళకూ అదే చెప్పాడట. వాళ్ళేమో మా అమ్మాయి మీద నిందలు వేస్తున్నారు. నువ్వే ఏదో చేసుంటావని అనుమానిస్తున్నారు. మాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. మీరు అతనికి  దగ్గరివాళ్ళు. వాళ్ళకు పెళ్లి చేశారు. దగ్గరుండి అన్నీ చూశారు. ఇప్పుడు కూడా మీరే బాధ్యత తీసుకోవాలి. లేదంటే కాపురం కూలిపోతుంది” అంజలి నాన్న ప్రాధేయపడ్డాడు.

“మీరేం వర్రీ అవకండి. విడిపోవడం అంత ఈజీ కాదు. డైవోర్స్ అంటే పరస్పర అంగీకారంతో జరగాలి. అందుకు ఇరువురూ ఒప్పుకోవాలి. ఒక్కడే  బ్రేకప్ చెపితే లీగల్ గా కుదరదు”

“కానీ అతడి వెర్షన్ వేరుగా వుంది. అసలు పెళ్ళే జరగలేదంటున్నాడు. ఇన్నిరోజులూ కేవలం సహజీవనం చేశామని చెపుతున్నాడు”

ఆయన దిగ్భ్రాంతి చెందాడు. “అదేంటీ.. నేనేకదా దగ్గరుండి మాయింట్లో పెళ్లి చేశాను”

“దాన్నే అతడు కాదంటున్నాడు. ఎవరింట్లోనో రహస్యంగా రెండు దండలు మార్చుకుంటే పెళ్లి కాదు. సహజీవనానికి ముందు అదో చిన్న సెలబ్రేషన్. దానికి లీగాలిటీ లేదు అని చెపుతున్నాడు”

అయన మాట్లాడలేక మౌనం వహించాడు. మధు మొదటిసారి అంజలిని తీసుకొచ్చి తనకు పరిచయం చేసిన ఘటన కళ్ల ముందు మెదిలింది. తను ప్రేమించిన అమ్మాయి ఈమేనని చెప్పాడు. పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదని, మీరే జరిపించాలని ప్రాధేయపడ్డాడు. అతని ప్రేమపిచ్చిని అంతకు ముందు నుంచీ చూసివున్నాడు గనుక దగ్గరుండి పెండ్లి జరిపించడమే కాదు, కొంతకాలం ఇద్దరినీ తనింట్లోనే పెట్టుకున్నాడు. వాళ్ళు సెటిలై వెళ్ళిపోయి వేరుగా ఉన్నారు. తర్వాత ఎప్పుడైనా ఇంటికొచ్చేవారు. ఆనందంగా, అన్యోన్యంగా కనిపించారు. బయట అప్పుడప్పుడు కొన్ని ఫంక్షన్లలో వాళ్ళని చూశాడు. ఒకరికొకరు అంటిపెట్టుకుని తిరిగేవారు. వాళ్ళ అనురాగాన్ని ప్రదర్శించుకునేవారు. ఎదుటివాళ్లకు ఇబ్బంది అని కూడా చూడకుండా ఒకరికొకరు ప్రేమతో ముద్దలు తినిపించున్న సందర్భాలున్నాయి.

కొంచెం ఓవర్ అనిపించినా వాళ్ళది నిజమైన ప్రేమబంధం అనే భావన కలిగింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మంచి పనిచేశానని ఫీలయ్యాడు. ఆ మధ్య వాళ్ళ బాబు మొదటి పుట్టినరోజు ఫంక్షన్ గ్రాండ్ గా చేశారు. చుట్టాలు, స్నేహితులు చాలామందే వచ్చారు. తనూ వెళ్ళాడు. ఎప్పట్లా ఇద్దరిలో అదే అనుబంధం, అదే అన్యోన్యత. ఒకరి ప్లేటు లోంచి ఒకరు తీసుకొనితింటూ ఒకరికొకరు తినిపించుకుంటూ. చూసేవాళ్లకు ఇదే నిజమైన ప్రేమ అనేవిధంగా నిర్వచనం చెప్పారు.

బయట అందర్లో తిరిగినప్పుడే ఇంత క్లోజుగా వుంటే.. వాళ్ళ కాపురం వాస్తవంగానే ఎంతో హ్యాపీగా సాగుతున్నదని నలుగురితో పాటు తనూ భావించాడు.

కానీ ఇప్పుడేమో ఊహించని మలుపు.

వాళ్ళిద్దరి ఎడబాటుకు అసలు కారణం కనుక్కుందామని అంజలిని సంప్రదించాడు.

అసలు తమ మధ్య ఎలాంటి కాంట్రవర్సీ లేదని ఆమె చెప్పింది.

“ఐ హానెస్ట్లీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అంకుల్.. ఒకరోజు హఠాత్తుగా మనమిక కలిసి వుండలేమని స్పష్టంచేసి వెళ్ళిపోయాడు”

ఆమె వెర్షన్ విన్నతర్వాత ఆయన తన ప్రియశిష్యునితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. పలుమార్లు ట్రైచేస్తే ఓసారి ఫోనెత్తాడు.

“విషయం ఏమిటి మధూ, ఎందుకీ హఠాత్ మార్పు?”

“సారీ గురూజీ! మై లవ్ ఎవాపొరేటెడ్. ఆమెతో ఉండలేను. నన్నేమీ అడగొద్దు” రెండు ముక్కల్లో ముగించి ఫోన్ కట్ చేశాడు.

***

అంజలి బాగా మారిపోయింది. కళ్ళలో ఒకప్పుడుండే వెలుతురు మాయమైంది. మనసుకు తగిలిన గాయాన్ని, జీవితంలో

తనకు జరిగిన నష్టాన్ని దాచుకోవడం అంత సులభం కాదు. మూడేళ్ళ అనుబంధం. ఎంత బాగుండేవారు. తమ అన్యోన్యతకు తామే మురిసిపోయారు.

“నా జీవితానికి నువ్వో వరం అంజలీ” తరుచుగా అతడు రిపీట్ చేసేవాడు.

అతనికి ఉద్యోగం లేకపోయినా తన ఒక్క సంపాదనతో సంసారం హ్యాపీగా గడిచింది. చివరికతనికి జాబ్ దొరికింది. అంతేకాదు, త్వరగానే కెరీర్ గ్రాఫ్ కూడా పెరిగింది. కానీ, అనుబంధం అతని ఒక్క నిర్ణయంతో తెగిపోయింది.

తెలియని వెలితి ఫీలైందామె. ఎ బ్రోకెన్ మ్యారేజ్.. బట్ నో రీజన్..!

దీర్ఘంగా నిట్టూర్చింది. ఎంత ప్రేమగా ఉండేవాడు? తాను ఆశించిన లక్షణాలన్నీ  అతనిలో సంపూర్ణంగా ఉన్నాయనుకుంది. అతని వ్యక్తిత్వానికి సంబరపడింది.

కానీ రంగు వెలిసిన అసలు చిత్రం వేరుగా వుంది.

సర్దుబాటు కోసం అంజలి చేయగల్గిన ప్రయత్నాలన్నీ చేసింది. అతన్ని నేరుగా కలుసుకొని మాట్లాడేందుకు ఆ తర్వాతెప్పుడూ దొరకలేదు. అసలు అతడా అవకాశమే ఇవ్వలేదు. ఎన్నో విధాలుగా అభ్యర్థిస్తూ మెసేజులు పంపింది.

అతడు కోరుకున్న కెమిస్ట్రీకి మేచ్ అవ్వాలనుకుంది. అవుతాననీ చెప్పింది.

కానీ అతని నుంచి సమాధానం లేదు.

భార్యాభర్తల మధ్య ఈ కెమిస్ట్రీ ఏమిటో, అది ఏ కోణంలోనో ఆమెకు బోధపడలేదు. అందులోనూ మూడేళ్ల కాపురం, ఒక బాబు పుట్టాక.

అసలు తనకే తెలియని ఆ కెమిస్ట్రీ ఇంతకాలం తనలో ఉందా? ఉన్నట్టు అతనికెలా అనిపించింది? మరైతే ఆ కెమిస్ట్రీ ఇంత హఠాత్తుగా ఎందుకు మిస్సయింది..?

తల్లి అదేపనిగా బలవంతపెడితే అంజలి ఓసారి వెళ్లి హస్తసాముద్రికున్ని, చివరికి చిలకజోశ్యున్ని కూడా కలిసింది.

భార్యాభర్తలు విడిపోవడానికి దారితీసిన అసలు కారణాల గురించి చేతిగీతల ఆధారంగా ఒకరూ, మాటలురాని చిలక మీద ఆధారపడి మరొకరూ తమతమ పద్ధతుల్లో చెప్పుకొచ్చారు. ఆమె భవిష్యత్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పబోయారు. అంజలి అదేమీ వినకుండా వొచ్చేసింది.

నిజమైన కారణమేదో బ్రేకప్ చెప్పిన కర్తకు తెలియదు, ఫలితం అనుభవిస్తున్న  కర్మకూ తెలియదు. మరెందుకిలా జరిగింది? లోపం ఎక్కడుంది, ఎవరిలో వుంది? నిజంగా తనలో లోపించిందీ అతనికి కావలసిందీ ఏమిటో తెలియని ఊగిసలాట.

ఈ అన్వేషణలో ఆమె దారి తప్పినట్టయింది. తన తప్పిదమేమిటో మాత్రం అర్థం కాలేదు. చివరికి సైకియాట్రిస్టును కలిసింది.

అవసరంలేని, సందర్భంకాని ఎన్నో ప్రశ్నలు వేసి అతడు తన టాలెంటును ప్రదర్శించాడు.

“సో… మీరు విడిపోవడానికి బలమైన కారణమేదీ లేదంటారు?”

థెరపిస్ట్ సూటిగా అడిగితే వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. మరోమారు తనలోకి తొంగి చూసుకున్నది. తనను తాను ప్రశ్నించుకున్నది.

అర్థం కాలేదు– ప్రశాంత కొలనులో నీళ్ళు హఠాత్తుగా ఎందుకు అలజడి పొందాయో, గతుకుల్లేని బాటలో సాఫీగా సాగే బతుకు బండి ఉన్నట్టుండి ఎలా అదుపుతప్పిందో..! కారణం ఏమని చెపుతుంది?

“నాకు తెలిసి ఏమీ లేదు” అన్నది.

“మీ మధ్య మనస్పర్థలు.. కనీసం వాగ్వాదాలు?”

“మామూలువే. అంత సీరియసేం కాదు. కాపురాల్లో అలాంటివి కామన్. వస్తూ పోయేవే”

“మీ ఇద్దరి ఉద్యోగాలు, హోదా, వేతనాల్లో  తేడాలు. వీటిల్లో దేంట్లోనైనా మీది  పైచేయిగా వుంటే ఈ కారణంగా అతను ఇగోసెంట్రిక్ కావొచ్చు. ఫలితంగా సంఘర్షణ మొదలవుతుంది”

“ఆ విషయాల్లో నేనతనికి ఎంతమాత్రం పోటీ కాదు. అతను అన్నిట్లోనూ నాకంటే ఎక్కువే”

“ఈ మధ్యకాలంలో అతడు మీకు దూరంగా జరుగుతున్నట్టు అనిపించిందా?”

“అటువంటిదేం లేదు”

“కట్నకానుకలు, ఇతర పెండింగ్ డిమాండ్స్..?”

“మాది లవ్ మేరేజ్ సర్. పెద్దలను ఎదిరించి చేసుకున్నాం. పైగా ముందు అతడే నన్ను ప్రేమించాడు. ఇద్దరం కలిసి జీవిస్తే బాగుంటుందనే ఇష్టపడి చేసుకున్నాం”

“అన్ని ప్రేమకథల ఫార్ములా ఇదే మేడమ్! అయితే ఇందులో ట్విస్ట్ ఎక్కడంటే ప్రతిఒక్కరూ తాను ప్రేమించడం కంటే  ప్రేమించబడేందుకే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఏమాత్రం తక్కువ ఫీలైనా వెలితి మొదలవుతుంది. ఇద్దరూ ప్రేమను పంచుమనే కోరుకుంటూ వుంటారు. అందుకే లవ్ స్టోరీలు ఎక్కువగా కాలం గడిచేకొద్దీ రంగులు వెలిసి హేట్ స్టోరీలవుతయి. ఇద్దరు బిచ్చగాళ్లు పరస్పరం అడుక్కున్నట్టు. ఒకరు ఇంకొకరికి ఇచ్చేంతగా వాళ్ళవద్ద ఏమీ వుండదు. ఇన్ ఫ్యాక్ట్, ప్రాబ్లెమ్ ఈజ్ నాట్ ఇన్ లవ్, ప్రాబ్లెమ్ ఈజ్ ఇన్ ఆస్కింగ్.. ఎక్స్ పెక్టింగ్”

ఆయన చెప్పాల్సింది చెప్పాడు. కానీ ఇది అకారణంగా వొచ్చిన జబ్బు. దీనికి ట్రీట్మెంట్ లేకపోవచ్చు. థెరపిస్టుగా ఆయనేం చేయగలడు?

“ఒకే.. వన్ లాస్ట్ క్వొచ్చన్ మేడమ్..” చైర్లో వెనక్కి వాలుతూ అన్నాడు

“హౌ ఇజ్ యువర్ సెక్స్ డ్రైవ్? మీలోగానీ, అతనిలోగానీ అనాసక్తి లేదా లోపం ఏర్పడినట్టు అనిపించిందా? బికాజ్ ఇట్ ప్లే పివోటల్ రోల్ ఇన్ రిలేషన్షిప్”

“నోనో.. అదేం లేదు” ఇబ్బందిపడుతూ అన్నది.

“పోనీ అతనిలోని ఇతర బలమైన దాంపత్య లోపాలు లేదా బలహీనతలు ఏమైనా ఉంటే చెప్పండి”

అంజలి వద్ద దీనికీ సమాధానం లేదు. తమ దాంపత్యంలో జరిగింది లోపం కాదు, ద్రోహం.

“ప్చ్.. అలాంటివేమీ లేవు” అన్నది. అంతకన్నా చెప్పలేదు. ఎందుకంటే ద్రోహం అతనిదే అయినా బలహీనత తనది. అతన్ని నమ్మి మనస్పూర్తిగా ప్రేమించడం. అతనిచుట్టూ సెంటిమెంట్స్ అల్లుకోవడం. అతడు తన జీవితాన్ని తొక్కుకుంటూ వెళ్లిపోయినా చిత్రంగా అతనిపై ఎలాంటి విముఖాతా ద్వేషమూ ఇప్పటికీ లేవు. నువ్వు లేకుండా బతకలేనన్నవాడు, ఒక్క నిముషమైనా ఎడబాటు సహించలేనన్నవాడు, వేలు కోసుకొని రక్తాన్ని పిండుతూ ఉత్తరాలు రాసినవాడు.. ఇప్పడేం చేస్తాడు..?

కొత్తగా మరో అమ్మాయికి అదే రిపీట్ చేస్తాడా? అతనికి ఇదంతా మామూలేనా? ఇంత దూరం నడిచాక, ఇంత జీవితం గడిచాక, మనసు మీద ఎలాంటి గాయంగానీ..  కనీసం మరకగానీ పడకుండా వుండటం ఎవరికైనా ఎంత అడ్వాంటేజీ..?

చేతుల్ని శానిటైజ్ చేసుకున్నంత సులువు. ఎవ్రీవన్ ఈజ్ డిస్పోజబుల్ టు హిమ్. అతనికి అన్ని మెలోడ్రామాలు తెలుసు. కానీ ఎప్పటికైనా తెలియాల్సిందీ, తెలుసుకోవాల్సిందీ ఒకటుంది.

ప్రేమ అనేది మనసులో నీవుగా తీసుకునే నిర్ణయం. దెన్ ఇట్ షుడ్ బి సస్టేన్డ్.

                                 *

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

అయోధ్యా రెడ్డి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అద్భుతమైన కథ అండి ఆధునిక కాలంలో ప్రేమ పోరుతో పేరుతో వంచనకు గురి అవుతున్న ఎంతోమంది యువతులకు ఇది కనువిప్పు అనవచ్చు చెంపపెట్టు అని కూడా అనవచ్చు. ఒక అమ్మాయిని పొందడం కోసం నేటి యువకులు ఎంతకైనా తెగిస్తారు ఏమైనా చేస్తారు కానీ అది తాత్కాలిక అవసరం కోసమే ఆ తదుపరి నడిసంద్రంలో నావలాగా వదిలేసి వెళ్తారు. అని నిరూపించిన మంచి కథను అందించిన పెద్దలు అయోధ్య రెడ్డి గారికి నా నమస్సులు ధన్యవాదములు.

 • మీ కథ చాలా బాగుంది.
  చాలా పాత పద్దతి కథను కొత్త పదాలతో లైట్ గా తీసుకుపోయి లైట్ గా పెళ్లికి ఏక పక్ష బ్రేకప్ ఇచ్చారు. ొఇలా రాయడం మీ బలహీనతా? సైకియాట్రిస్ట్ పాత్ర బలహీనతా?
  మిత్రగురువు అని రాసారు. ఆ తరువాత ఆమెకు అంకుల్ గా చేశారు.
  వాడెవడో మధు ప్రేమ పైత్యం తో ప్రారంభించారు. చివర్లో వాడి వైరాగ్య పైత్యం చెప్పడం వదిలేసారు. మొదటి నుంచి అంజలి తరఫున కథ నడపలేదు. కాని అకస్మాత్తుగా అంజలి నుంచి మొదలు పెట్టి తల్లిదండ్రులను అత్తమామలను తెచ్చి ఇరికించారు. మదు అనే వాడిని మీరెందుకు వదిలేసారు? కథ మధుతో మధు తరఫునుంచి కదా మొదలు పెట్టింది? వాడి గురించి ఏమీ చెప్పకుండా సాప్టుగా వది లేసారు. వాడు వదిలేసిన కారణం కథ రాసిన మీకు తెలియాలి. అది పాఠకులకు తెలపాలి.
  మీరు కూడా మదులాంటి వారేమో! అందుకే మీరు కూడా అకస్మాత్తుగా బ్రేకప్ ఇచ్చి అతనిని కథ నించి తప్పించారు. పైగా అది పెల్లే కాదు ఇవి అతని తరఫున మాట పడేసి కథనుండి తప్పించారు.
  మధుతో పాటు కథకుడు కూడా పలాయన వాది. అవసరం తీరాక వదిలేసే పలాయన వాది. BSRAMULU

  • బి.యెస్.రాములుగారు, ముందుగా కథ చదివినందుకు మీకు ధన్యవాదాలు. అయితే కథ చదవడానికి ముందే కత్తి పట్టుకొని ఏదైనా సరే, ముక్కలుగా నరకాలని సిద్ధపడినట్టు ఉన్నారు.
   ఒక పెళ్లి బ్రేకప్ కావడానికి ఎక్కువసార్లు ఏక పక్ష సందర్భాలే ఎక్కువ. ఇద్దరూ శాంతియుతంగా మాట్లాడుకుని పెద్దమనుషుల ఒప్పందం చేసుకొని హాయిగా కాఫీలు తాగేసి వెళ్లిపోరు.
   కథలో మిత్రగురువు అనేది మధుకి. ఆమెకి కాదు. అతడు వయసులో పెద్దవాడు కనుక అంకుల్ అని పిలిచింది. ఇందులో తప్పేమిటో నాకైతే అర్థం కాలేదు. కథలో ఏం రాశాడనేది రచయిత బలహీనత కాదు. పాఠకుని అపార్థపు బలహీనత కూడా కావచ్చు.
   అతడు ఆమెను వదిలేసింది వైరాగ్యంతో కాదు. కొంచెం జాగ్రత్తగా అర్ధం చేసుకుంటే తెలుస్తుంది.
   నిజానికి కథ ఎవరివైపు నుంచీ నడవలేదు. రచయిత నడిపించాడు. కథకు అనువైన విధంగా నడిచింది. కతంటే ఇలాగే సాగాలి అనే మూల సూత్రాలు మీకేవైనా ఉంటే, వాటికి ఇది సెట్ కాకుంటే అందుకు బాధ్యున్ని నేను కాదు.
   కథ మధు తరఫున మొదలుపెట్టలేదు. మధు పాత్రతో మొదలైంది. రెంటిలో తేడా మీకు అర్థమై ఉంటుందని భావిస్తాను.
   ఇక కథలో ఆమెని మధు వదిలేసిన కారణం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కారణం ఈరోజుల్లో జరుగుతున్నదే. చాలా సింపుల్. ఇద్దరి నడుమ కెమిస్ట్రీ పోయిందని అతడు సాకు చెప్పాడు. దీన్నీ మీరు గమనించినట్టు లేదు.
   “మీరు కూడా మధులాంటి వారేమో” అన్నారు. ఇది కథమీద విమర్శ అవుతుందా? విమర్శ అటుంచి మీ స్థాయికి, మీ సాహితీ వయసుకు తగని మాట. ఈ కామెంట్ ఏ ఆధారంతో చేశారు?
   బహుశా చాలాకాలంగా మీరు కథలు సరిగా చదవడం మరిచి పోయినట్టు ఉన్నారు. మీవే కాకుండా ఇతరుల కథలు కూడా పెద్దమనసుతో అప్పుడప్పుడు చదవమని మనవి. పలాయనవాది అని అన్నారు. అది పాఠకునిగా మీకు వర్తిస్తుందేమో దయుంచి ఆత్మవిమర్శ చేసుకోండి.
   చివరిగా, రచయిత అనేవాడు కథలో అర్థాంతరంగా దూరిపోయి సందేశాలూ, తీర్పులూ ఇవ్వకూడదనే విషయం మీకు తెలియదనుకోను.
   కథను వాస్తవ దారిలో ముందుకు పోనివ్వాలి. తీర్పులకూ, మలుపులు తిప్పేందుకు రచయితలు ప్రవక్తలు కాకూడదు సార్. రచయిత అనేవాడు సమస్యను ప్రొజెక్ట్ చేయగల్గితే కథ ప్రయోజనం నెరవేరినట్టేనని నేను భావిస్తాను. థ్యాంక్యూ

  • అయోధ్య రెడ్డి గారు రాసిన డిపార్చర్ కథ నేనూ చదివాను.మీది సద్విమర్శ. అయితే, ‌కొంత కఠినంగానూ , మరికొంత వ్యంగం గానూ అనిపించింది.

 • మధూ!
  నువ్వు చాలా తెలివిగల వాడివి.
  ప్రేమా దోమా అంటూ వెంట పడతావు, వేధిస్తావు. జీవితంలో సెటిల్ కాకపోయినా పెళ్లి చేసుకుందాం అని అంజలిని తొందర పెడతావు.
  ఒక ఆడపిల్లని పడేయడానికి ఎన్ని రకాల డ్రామాలు ఆడాలో అన్నీ ఆడావు. నటనలో చక్రవర్తివయ్యా నువ్వు! నీకు కూడా ఉద్యోగం వచ్చాక, ( ఉద్యోగం రాకపోతే అదో ఇన్ఫీరియారిటీ కదా), సెటిల్ అయ్యాక చేసుకుందామని అంజలి చెప్పినా నీ మిత్ర గురువు సన్నిధిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నావు. ఆమెను వదిలి ఉండలేనంత తమకంతో మూడేళ్ళు ఎంజాయ్ ( నీకు ఇదే సరియైన పదం) చేసి, కొడుకు పుట్టాక – “మనిద్దరికీ కెమిస్ట్రీ కుదరలేదు, బ్రేకప్ ” అని బంధాన్ని తేలిగ్గా, తెగగొట్టేయడం… భేష్.

  “లవ్ ఎవాపరేట్” అవుతుందా! ఈ మాట చాలు నీ వక్రబుద్ధి కి, మేధో సంపత్తి కి నిదర్శనం గా! సంప్రదాయాల పెళ్లి వద్దు అన్నవాడివి మూడు ఏళ్ల తర్వాత నీకు కన్వీనియెంట్ గా “దండాలు పెళ్లి అసలు పెళ్లి కాదు” అని తేలిక తీసిపారేయగలవు.
  ఆమె… నీ భార్య, నీ బిడ్డకు తల్లి… అన్నది పక్కన పెడితే – ఆమె ఒక స్త్రీ. స్త్రీ హృదయాన్ని ఛిద్రం చేయటానికి ఎన్ని మాటలనాలో, ఎంత కఠినంగా ప్రవర్తించాలో, ఎంత నిర్దాక్షిణ్యంగా దూరంగా వెళ్లిపోవాలో నీకు బాగా తెలుసు. నీ మాయలో పడి, అదే నీ ప్రేమ అనురాగం ఆత్మీయత అనుకున్న ,’పిచ్చి అంజలి’ తన తప్పు ఉందేమో నని ఆత్మ విమర్శ చేసుకొంది, చెప్పమని నిన్ను ప్రాధేయపడింది, చివరికి సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది.
  చాలామంది మగవాళ్ళకి ప్రతీక నువ్వు. చాలామందిలో నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
  మరో చోట మరో అంజలి తో మంచి “మెలో డ్రామా” మొదలెడతావు.
  నీ కథంతా చెప్పిన రచయిత చివరికో మాటన్నారు – “ఎప్పటికైనా తెలియాల్సిందీ, తెలుసుకోవాల్సిందీ ఒకటుంది” అని.
  కానీ ఎప్పటికీ నీ లాంటి “మధు లు” తెలుసుకోలేరదేమిటో!

 • సర్.. కథ చాలా బావుంది. ఎన్నో జీవితాల యదార్థ గాథ. కానీ మధు ని అలా ఎందుకు వదిలేశారు..?? అంజలి కష్టానికి ప్రేమకి అందరినీ ఎదిరించి తానే సర్వస్వం అని వచ్చిన ఆమె ఆత్మస్తైర్యనికి విలువ లేదా! బాబు ని మాత్రమే చూసుకుంటూ బతికేయాలా!

 • చట్టప్రకారం సహజీవనం కూడా వివాహంతో సమానం . కథలో ఈ అంశం స్పృశించాల్సి ఉంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు