చైనీయ అజ్ఞాత కవిత్వం

       ప్రపంచంలో ప్రతి దేశానికి తమదంటూ ప్రాచీన సాహిత్యం వుంటుంది. ఆ సాహిత్యం జానపదుల రూపంలో,పాటల రూపంలో,గేయ రూపంలో లేదా మరో రూపంలోనో వుంటుంది.జనసామాన్యం తమ పనిపాటల్లోనూ..దైనందిక జీవితం లోనూ తమ మానసిక ఉల్లాసానికి పాడుకునే ఈ జానపద గేయాలు, పాటలు ఒకరి నుండి ఒకరికి ..అలా అలా పాకుతూ ప్రసిద్ధిని పొందినవే..
       చైనీయుల విషయమే తీసుకుంటే..చైనీయుల ప్రాచీన సాహిత్యమంతా సింహభాగం ప్రణయ విరహ కవిత్వమే అంటారు. చైనాను పరిపాలించిన ప్రతి రాజవంశం ప్రాచీన సాహిత్యాన్ని సేకరించినప్పుడు అందులో అధికభాగం జానపదాలలో ప్రణయగీతాలు వుండడం ఆ మాటను
         చారిత్రాత్మకంగా చూస్తే హన్ సామ్రాజ్య హయాంలో ఆరు రాజవంశాలు( six dynasties )గా పేరు పొందిన  కాలం ( 220 – 589 ) లో సేకరించిన ఈ సాహిత్య సంపదలో కొంత సాహిత్యం ఎవరు సృష్టించారన్న ప్రశ్నకు జవాబు లేదు.ఎవరెవరో అజ్ఞాతమూర్తులు రాసిన కవిత్వం గానే అది బహుదా చలామణిలో వుంది. బహుశా హన్ రాజప్రసాదాలలో వివిధ వృత్తులలో, ప్రవృత్తులలో వున్న స్త్రీ పురుషులు ఎవరైనా ఈ ప్రణయ సాహిత్యం వెలయించి వుండవచ్చు.
          అజ్ఞాతంగా వెలుగు చూసిన ఈ కవిత్వంలో ప్రేమ, విరహం,ఎడబాటు,నిరాశ,ప్రకృతి వివశత్వం,స్వేచ్ఛా భావ ప్రకటన కనిపిస్తాయి.
           చినీ మూలం నుండి ఈ కవిత్వాన్ని ఆంగ్లంలో అనువాదం చేసి ‘ One hundred More poems from the Chinese : Love and the turning year'(1970 ) అనే పుస్తకం సంకలనం చేసినవాడు.. అమెరికన్ కవి, అనువాదకుడు, విస్త్రుతంగా చైనా కవిత్వం అధ్యయనం చేసినవాడయిన కెన్నెత్ రెక్స్ రాత్ (1905 – 1982 ).
        ఈ ఆంగ్ల పుస్తకం నుండి కాస్త స్వేచ్ఛ తీసుకొని నేను చేసిన అజ్ఞాత కవుల/కవయిత్రుల కవిత్వ తెలుగు అనువాదం ఇది.
ఎడతెగని రాత్రి
———————
ఎడతెగని రాత్రి.
నిద్ర రావడం లేదు.
పైన ఉజ్వలంగా
నిండు చంద్రుడు.
సుదూరపు రాతిరిలో
వినపడుతూ
ఎవరిదో పిలుపు..
నిస్సహాయంగా
‘ఓ’యని బదులిచ్చా.
***
చలి.
———-
చచ్చే చలి.
బయట ఎవరూ లేరు.
ప్రతిచోట
నీ కోసం వెతుకుతున్నాను.
నమ్మకపోతే
మంచులో నా పాదముద్రలు
చూడు.
***
రాత్రయింది
—————-
రాత్రయింది.
అతను కంచె దాటుకొని వచ్చాడు.
తెల్లవారింది.
అతను గేటు తీసుకొని వెళ్లిపోయాడు.
అతని సుఖం అతను పొందాడు.
ఇక నా గురించి ఆలోచించడు.
***
ప్రియుడొస్తాడు
——————-
కాసేపటిలో
నా ప్రియుడొస్తాడు.
తోటగుమ్మం దగ్గరకు వస్తానన్నాడు.
అమ్మ మేలుకొనే వుంది.
డాలు మీద మోగే కత్తి శబ్దాల్లా
నా గుండె కొట్టుకోవడం వింటున్నాను.
***
చిన్నదాని ఆదుర్దా
————————-
మా చిన్నది
ఆదుర్దా పడుతోంది
‘పెళ్లి చేసుకోవడానికి
ఇంకెంతకాలం ఆగాలని..’
ఆమె తరచూ
గాలికి చెట్ల ఆకులు రాలిపోవడం
చూస్తూనే వుంది.
రాలిన ఆకులు మళ్లీ
కొమ్మలకు అంటుకోవడం మాత్రం
ఎప్పుడూ చూడలేదు.
***
నెలలు గడుస్తూ..
———————–
జలపాతంలో జారే నీటిజాలులా
నెలలు గడుస్తున్నాయి.
ఆకురాలు కాలం
వాడిపోతా వుంది.
స్తబ్దత లోంచి
కీచురాయి రోదిస్తోంది.
నేను ఒంటిగా
విచారంగా వున్నాను.
***
వెదురుపొద లోంచి
—————————
వెదురుపొద లోంచి
కోయిల పిలుస్తోంది.
విచ్చిన చెర్రీపూల వికాసం
దారిని
డోలలాడిస్తోంది.
పౌర్ణమి చంద్రుని నీడలో
గరికపోచల మీద పావడా జారవిడుస్తూ
యువతొకతి నడుస్తోంది.
***
ఏడాది పొడుగునా…
—————————–
1.
పూల కొమ్మనొకటి తుంచాము.
చెట్టు మీద
వందలాది పక్షులు పాడుతున్నాయి.
ఆ తోటలో పవళించి
ఒకరి నాలుకలొకరి నోటిలో వుంచి
మేము మాట్లాడుకున్నాము.
2.
పూలసుగంధాలతో నిండి
గాలి తేమగా ఉక్కగా వుంది.
ఉడుకుపోస్తున్న ఈ రాత్రి
ఏం చేస్తే బాగుంటుంది..
వలువలు విసిరికొట్టి
కలిసి నగ్నంగా పడుకుంటే..?
3.
శీతగాలి విసిరి
భళ్లున కిటికీ తెరిచింది.
నిండుగా మెండుగా చంద్రుడు
లోనికి చూస్తున్నాడు.
రాత్రి
చడీ చప్పుడు లేదు.
శయన పరదాల మాటున
ముసిముసి నవ్వులు..
4.
గడ్డకడుతున్న ఆకాశం.
యేడాది పూర్తయింది.
చలిగాలి మంచుతునకల్ని
గింగిరాలు తిప్పుతోంది.
నడివేసవి రేయి కన్నా
దుప్పటి కింద నా ప్రియుడు
వెచ్చగా వున్నాడు.
*
శ్రీనివాస్ గౌడ్

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు