చెరగని సంతకం ‘మంచిపుస్తకం’

నాటి నా యాక్టివిస్ట్ డైరీ లో పేజీలుగా మారినవాళ్లు ఈ ఇద్దరూ –  ‘మంచిపుస్తకం’ భాగ్యలక్ష్మి, సురేష్ లు.  వారిద్దరితో నా స్నేహానికి ఇంకో రెండేళ్లలో నాలుగు దశాబ్దాలు నిండుతాయి. నేనూ, భాగ్యలక్ష్మి హైదరాబాద్ మలక్ పేటలో ప్రత్యామ్నాయ ఆలోచనా ధారతో నడిచిన ‘వికాసభారతి’ అనే స్కూల్ లో 1986 లో సహోద్యోగులుగా పరిచయం అయ్యాం. అక్కడ వున్న అనేకమంది టీచర్స్ లో సుధీర్ఘంగా ఇంతకాలం అనుబంధం దాదాపు తన వొక్కదానితోనే సాధ్యం అయింది. దీనికి కారణం పిల్లలతో పనిచేయాలనుకోవటం, బాలసాహిత్యంలో మా అభిప్రాయాలు కలవటం కావొచ్చు.  అలా మొదలైన ప్రయాణం ఇప్పటివరకూ అంతే తాజాగా తోబుట్టువుల కంటే ఎక్కువ స్నేహబంధంతో నడుస్తోంది. నేనూ, రమేష్ కలిసి జీవించాలనుకున్న నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిగా చెప్పిన స్నేహితుల్లో వీరిద్దరూ వున్నారు. ఇది ‘మంచిపుస్తకం’ ప్రారంభం కాకముందు సంగతి. ‘మంచిపుస్తకం’ అనే పేరు కూడా మా ఆఫీసు లోనే నిర్ణయమైనట్టు నాకు గుర్తుంది. తెలుగు బాల సాహిత్య ప్రచురణ లో ‘మంచిపుస్తకం’ ఒక చెరగని సంతకం గా మారిన నా స్నేహితుల ఇరవై సంవత్సరాలు ప్రయాణాన్ని, అందులోని వొడిదుడుకులను కొన్ని సారంగ పాఠకుల కోసం తెలియజేసే ప్రయత్నం ఇది.

‘బాలసాహితి’ నుంచీ ‘మంచిపుస్తకం’ దాకా

‘మంచిపుస్తకం’ కంటే ముందు 1990 లో బాలసాహితి అనే సంస్థను నలుగురు ట్రస్టీలుగా వుండి ఔత్సాహికంగానే  మొదలు పెట్టారు. అందులో సురేష్, బాల్రెడ్డి (మలుపు) వున్నారు. మిగిలిన ఇద్దరూ ఎవరనేది నాకు గుర్తులేరు.

ఈ ప్రయత్నం వో పదేళ్ల పాటు నడిచినట్టుంది. దాదాపు 35 పుస్తకాలు ప్రచురించినట్టున్నారు. ఒక రకంగా చూస్తే ‘బాల సాహితి’ తన కాలం కంటే ముందు ఉన్నట్టే లెక్క. అయితే దాని కోసం పూర్తి కాలం కేటాయించి ఎవరూ పని చెయ్యక పోవటంతో ‘బాలసాహితి’ ని కొనసాగించటం సాధ్యం కాలేదని చెప్పారు.

‘మంచి పుస్తకం’ ట్రస్ట్‌గా రిజిస్టర్ కాక ముందు ‘పుస్తకాలతో స్నేహం’ పేరున హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో రెండు సంవత్సరాలు స్టాల్ పెట్టారు. అప్పుడు చాలా మంది స్నేహితులు స్టాల్ ఖర్చులను కూడా పంచుకున్నారు. పుస్తకాల అమ్మకంలో వాలంటీర్లుగా సహాయ సహకారాలు అందించారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న బాల సాహిత్యాన్ని వివిధ  ప్రచురణ సంస్థలు, వ్యక్తుల నుండి జమచేసి ప్రదర్శనలో ఉంచటం అనేది అప్పటికి ఒక కొత్త ప్రయత్నం. పుస్తకాల ఎక్సిబిషన్ అంటే పెద్ద వాళ్ళకే అనే ఒకరకమైన మూస ధోరణిని మార్చింది మాత్రం ‘మంచిపుస్తకం’ ప్రయత్నాల వల్లనే అని కచ్చితంగా చెప్పుకోవాలి. ఆ తర్వాతే అనేక పుస్తక ప్రచురణ సంస్థలు పిల్లల  పుస్తకాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం పెరిగింది. ఆ సమయంలో పిల్లలకు కథల పుస్తకాలను పరిచయం చేయాలన్న ఆసక్తి తల్లిదండ్రులకు అంతగా లేదని, అప్పుడు దృష్టి ఎక్కువగా ‘చదువుల’ మీదే ఉండేదని,

చందమామ లాంటి పత్రికలు, రష్యన్ అనువాద సాహిత్యం, బాలల అకాడమి ప్రచురణలు వంటివి గత స్మృతులుగా మారి ఒక లాంటి కొరత ఏర్పడింది అని గుర్తు చేసుకున్నారు ఇద్దరూ.

‘మంచిపుస్తకం’ ఆరంభం, ఇతర సంస్థల సహకారం

ఆ తరవాత కొందరు స్నేహితులతో కలిసి చేసిన ఆలోచన లోంచి వచ్చినదే ‘మంచి పుస్తకం’. అప్పుడు సురేష్ ‘వాసన్’ సంస్థలో పనిచేసేవారు. వాసన్‌లో పని చేసే వాళ్లు తమకు అభిరుచి వున్న పనిని చేపట్టటానికి అవకాశం ఉండాలని ఆ సంస్థ కార్యదర్శి రవీంద్ర భావించారు. అక్కడే ఒక అలమరలో పుస్తకాలు పెట్టుకుని ఒక వ్యక్తి కూర్చోటానికి స్థలాన్ని ‘వాసన్’ ఇవ్వటంతో ‘మంచి పుస్తకం’కి పునాది ఏర్పడింది. మొదట్లో ఆ బాధ్యతను  పచ్చనూరు విమల(ఆనందభారతి స్కూల్ టీచర్ అనూరాధ చెల్లెలు) చూశారు. రవీంద్ర, సురేష్ ట్రస్టీలుగా 2004 ఏప్రిల్‌లో ‘మంచి పుస్తకం’ ట్రస్ట్‌గా రిజిస్టర్ అయ్యింది. తర్వాత కాలంలో ఎస్. ఎస్. లక్ష్మి మూడవ ట్రస్టీగా చేరినప్పటి నుంచి సంస్థ నిర్వహణలో క్రియాశీలకంగా ఉన్నారు.

బాల సాహితి, ఆజాద్ రీడింగ్ రూం నుంచి వచ్చిన పుస్తకాలు అమ్మటంతో వచ్చిన డబ్బులు ‘మంచి పుస్తకం’ కి మూల ధనంగా మారింది. బుక్ ఫెయిర్‌లో క్రమం తప్పకుండా పాల్గొంటూ, క్రమంగా పుస్తక ప్రచురణ మొదలు అయ్యింది. 2007 వరకూ భాగ్యలక్ష్మి వాలంటీర్ గానే వుండేవారు. ఆ తర్వాత తను పూర్తి సమయం ‘మంచి పుస్తకం’ కి ఇవ్వటం మొదలయ్యిన తర్వాత సంస్థ పురోగతి నిలకడగా మారిందనటంలో అతిశయోక్తి లేదు. వాసన్ ఆఫీసు లో టేబుల్ స్థలం నుంచీ మారి, స్వంతంగా అద్దెకు కార్యాలయం తీసుకునే వైపుగా పురోగతి మొదలైంది. విమల, భాగ్యలక్ష్మి పూర్తికాలం పని చెయ్యసాగారు. ఆ సమయంలోనే యం.వి. ఫౌండేషన్ ‘క్వాలిటి ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం’ చేపట్టి, దానిలో భాగంగా గ్రంథాలయ బాధ్యతలు ‘మంచి పుస్తకం’ కి ఇచ్చారు. పాఠశాలలకి పుస్తకాల ఎంపిక, కొనుగోలు బాధ్యతలు ‘మంచి పుస్తకం’ చేపట్టింది. గ్రంథాలయాన్ని ఎలా నడపాలి, పుస్తకాలను పిల్లలకు ఎలా పరిచయం చేయాలి వంటి విషయాల గురించి వాలంటీర్లకు భాగ్యలక్ష్మి జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇచ్చేది. ఆ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎలా ఉన్నారు, ఎలాంటి పుస్తకాలు చదవగలుగుతున్నారు వంటివి అవగాహన అయ్యాయని భాగ్యలక్ష్మి చెప్పారు. ఆ సమయంలోనే ‘మంచి పుస్తకం’ ప్రచురణలను డా. రెడ్డీస్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో కొనేది. ఈ రెండు సంస్థల సహాయ సహకారాలతో మంచి పుస్తకం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది.

తెలుగు, ఇంగ్షీషు బై-లింగ్వల్ పుస్తకాల ప్రచురణ

‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ఒక ప్రణాళికా బద్ధంగా జరిగిందా లేక పనిలో భాగంగా మార్చుకుంటూ వెళ్లారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “పుస్తకాల ప్రచురణ చేస్తున్నప్పుడు అవి పెద్ద ఫాంటుతో, బొమ్మలతో చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చామని; తెలుగు, ఇంగ్షీషు బై-లింగ్వల్ పుస్తకాల ప్రచురణతో పాటు, సోవియట్ బాల సాహిత్యాన్ని మొదట్లో ఎక్కువగా తిరిగి ప్రచురించించామని; ఆ కథలు చాలా ఆకట్టుకునేవిగానూ, రంగుల బొమ్మలతో  చాలా ఆకర్షణీయంగా ఉండటం అనేదానికి ప్రాధాన్య మిచ్చినట్లు” చెప్పారు. “అప్పటికే ఉన్న తెలుగు అనువాదాలలో భాషను సరళీకరించి, ఫాంట్ సైజ్ పెంచి ప్రచురించటం, కొత్తగా కొన్ని అనువాదాలను మళ్లీ చేయించటం, ప్రచురణ మొదలుపెట్టిన కొత్తలో సోవియట్ పుస్తకాలను ఎంచుకోవటం వల్ల రాయల్టీ వంటి చెల్లింపులు లేవు కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోటానికి వీలయ్యిందని” వివరించారు. అంతేకాక ఆ సమయంలో ఎందరో అనువాదకులు, చిత్రకారులు ‘మంచి పుస్తకం’ నుండి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సహాయ సహకారాలు అందించటం కూడా ఈ ప్రయాణంలో చాలా విలువైన అంశంగా గుర్తు చేసుకున్నారు.

పాపులర్ సైన్స్ పుస్తకాల ప్రచురణ

కథల పుస్తకాలు మాత్రమే కాకుండా పాపులర్ సైన్స్ పుస్తకాల ప్రచురణ ‘మంచి పుస్తకం’ చేపట్టటం చాలా ముఖ్యమైన విషయం. ఇందులో చెప్పుకోవలసింది ఐజాక్ అసిమోవ్ ‘ఎలా తెలుసుకున్నాం?’ సిరీస్. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాల అనువాదం, రాయటంలో చెన్నై ఐఐటి ప్రొఫెసర్ శ్రీనివాస చక్రవర్తి కృషి (అప్పట్లో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండానే) చేశారు.

‘మంచి పుస్తకం’ ప్రయాణంలో విజ్ఞాన ప్రచురణలతో (ఒకప్పుడు జనవిజ్ఞాన వేదిక) భాగస్వామ్యం చాలా కీలకమైనది. సైన్స్‌కి సంబంధించిన పుస్తకాలు ఈ రెండు సంస్థల ఉమ్మడి ప్రచురణలుగా వెలువడుతున్నాయి. దీనివల్ల ఆర్థిక భారాన్ని పంచుకోవటమే కాకుండా వాటిని ఇంకా ఎక్కువ మందికి చేరువ చెయ్యటం సాధ్యం అయ్యిందని వివరించారు.

కథాకదంబం’ కార్డులు – ‘పుస్తకాలతో స్నేహం’ సిరీస్

పిల్లలు చదవటానికి దోహదం చేసేలా చేసిన ప్రయోగాలలో ‘కథాకదంబం’ పేరుతో 50 కార్డులను ప్రచురించింది. ఒక్కొక్క కార్డు 4 పేజీలు. చిన్న కథల నుండి మొదలై క్రమేపి కథలు పెద్దవి అవుతాయి. వీటికి రంగుల బొమ్మలను పావని వేసింది. వీటి ఆధారంగా పిల్లలు తెలుగు చదవటం నేర్చుకున్నారని చాలా మంది టీచర్లు, తల్లిదండ్రులు, వాలంటీర్ల ద్వారా రావటం పనిలో వీరికి మరింత ప్రోత్సాహకంగా పనిచేసింది.

పిల్లల పుస్తకాలు అంటే క్రౌన్ సైజు అన్న అభిప్రాయంతో 1/8 డెమ్మీ సైజులో పుస్తకాలు (చిన్న చిన్న కథల సంకలనాలైనా సరే) చదవటానికి పెద్ద తరగతి పిల్లలు కూడా సిద్ధంగా లేరని గమనికలోకి వచ్చింది. ఈ మానసిక అవరోధాన్ని అధిగమించటానికి 1/8 డెమ్మీ సైజులో 16 పేజీల పుస్తకాలను ‘పుస్తకాలతో స్నేహం’ అన్న సిరీస్‌గా ‘మంచి పుస్తకం’ ప్రచురించింది. పది పుస్తకాలు ఒక సెట్ (అంటే 160 పేజీల రీడింగ్ మెటీరియల్). ఒక పుస్తకం చదవగానే పిల్లల్లో ఉత్సాహం, ఆత్మ విశ్వాసం కలుగుతాయి. ‘0’ లెవల్ నుంచి 5వ లెవల్ వరకు ఇప్పటివరకు 10 సెట్లలో 85 పుస్తకాలను ‘మంచి పుస్తకం’ ప్రచురించింది. చదవటంలో పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో వీటి ద్వారా తెలుసుకుని అక్కడి నుంచి ముందుకి వెళ్లటానికి ఉపయోగపడుతున్నాయి. ఈ పుస్తకాలు అన్నింటికీ బొమ్మలను (కొన్నింటికి ఉన్న బొమ్మలను తిరిగి) శ్రీకాంత్ వేశారు.

అనువాద రచనలు + మూల రచనలను ప్రోత్సహించడం

ఒక సమయంలో అనువాదాల పైన ఎక్కువగా ఆధారపడిన ‘మంచి పుస్తకం’ మూల రచనలను తీసుకు రావటంపైన కూడా దృష్టి పెట్టింది. దీంట్లో తానా సంస్థతో భాగస్వామ్యం ఎంతగానో దోహదపడింది. పది ఏళ్లు పైబడిన పిల్లల కోసం సమకాలీన సాహస, సైన్స్ ఫిక్షన్, హాస్య నవలలను, పదైళ్ల లోపు పిల్లల కోసం బొమ్మల కథలను ఆహ్వానించారు. వచ్చిన రచనల నుంచి ఎంపిక చేసి ప్రచురించటం మొదలు పెట్టారు. రచయితలు, చిత్రకారులకు రెమ్యునరేషన్ బాధ్యత తానా సంస్థ తీసుకోగా,  ప్రచురణ, పంపిణి బాధ్యతను ‘మంచి పుస్తకం’ చేపట్టింది. 2017లో మొదలై, ఇప్పటివరకు 4 దఫాలలో 21 నవలలు, 28 బొమ్మల కథలు ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో వెలువడ్డాయి.

పిల్లల కోసమే కాకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన పుస్తకాలను కూడా ‘మంచి పుస్తకం’ ప్రచురించింది. మొదట వేసిన రెండు పుస్తకాలు (బాల సాహితి పుస్తకాల పునఃముద్రణ) గిజు భాయి మాస్టారూ, మీ ఒడిలో, అలాగే ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలకు సంబంధించి, పెద్ద వాళ్లకు కొన్ని నవలలు కూడా మంచి పుస్తకం ప్రచురణ గా వచ్చాయి.

పిల్లల సాహిత్యంలో, ప్రచురణ లో ‘మంచి పుస్తకం’ విభిన్నత

పిల్లల సాహిత్యంలో, ప్రచురణ లో అప్పటివరకూ వున్న ధోరణులు ఏమిటి ? మిమ్మల్ని ఏ అంశాలు విభిన్నంగా నిలిపాయి అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ “ఇదివరకు అనే కాదు, ఇప్పటికి కూడా నీతి కథలు, జీవిత చరిత్రలు, స్ఫూర్తిదాయక పుస్తకాలకు డిమాండ్ ఉంది. కధ చివరన నీతిని డిరైవ్ చేసి చెప్పే విధానం సరైంది కాదని ‘మంచి పుస్తకం’ గట్టిగా నమ్ముతోంది. ఒక కథ చదివిన తరవాత దాని నుండి ఏం గ్రహిస్తారు, అసలు ఆ వయస్సులో గ్రహించాల్సింది ఏమైనా ఉందా అన్నది పిల్లలకే వదిలెయ్యాలి. ఒక కథలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్శ్వం కనిపిస్తుంది. ఒక కథకి ఒక నీతిని మనం అంటగడితే పిల్లలు చూడగల అనేక కోణాలను కట్టడి చేసిన వాళ్లం అవుతాం. వాళ్ల ఊహల రెక్కలను విరిచేసినట్లు అవుతుంది. బాగా చదవటం నేర్చుకోవాలి, పుస్తకాలను పిల్లలు ఇష్టపడాలి అన్న ఉద్దేశాలతో ప్రచురించిన పుస్తకాలుగా ‘మంచి పుస్తకం’ కి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. పిల్లలను తీర్చిదిద్దాలి అని కాకుండా వాళ్లకి కథలు ఆసక్తికరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో పుస్తకాల ఎంపిక జరుగుతుంది. నాణ్యత, ధరలలో కూడా ఈ గుర్తింపు ఉంది” అని వివరించారు.

పుస్తక ప్రచురణ –రోజువారీ బాధ్యతలు

పుస్తక ప్రచురణలో అనేక బాధ్యతలు వుంటాయి. పుస్తకాల ఎంపిక, రచయితలతో సమన్వయం వంటి సంపాదక బాధ్యతలు ఒక ఎత్తు అయితే, ప్రింటింగ్, ప్రూఫ్ రీడింగ్, డిజైనింగ్ వంటివాటితో పాటు ఇంకా ఇతరత్రా అనేక పనులు వుంటాయి. మొదటి నుంచీ కూడా ‘మంచి పుస్తకం’ చాలా చిన్న టీం గానే వుండటానికి ప్రాధాన్యత ఇచ్చింది. డిటిపి పనికి కొంత కాలం పద్మ అనే ఫ్రెండ్ పని చేశారు. ఇప్పుడు ఆ పని బయటే జరుగుతోంది. అనువాదాలు, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్, ప్రెస్‌తో సమన్వయం, కరెస్పాండెన్స్, రాయల్టీలు, ఆడిట్ వంటివి సురేష్ చూసుకుంటే, టీచర్లు, తల్లిదండ్రులతో పుస్తకాల గురించి మాట్లాడటం, పుస్తకాల ఎంపికలో సహకరించటం, పుస్తకాలను ప్రోత్సహించే వివిధ సంస్థలతో సమన్వయం, పుస్తకాల డిస్పాచ్, రోజువారీ జమాఖర్చుల బాధ్యత భాగ్యలక్ష్మి ది. పుస్తకాల ప్యాకింగ్, బుకింగ్, పోస్ట్ చెయ్యడం, బ్యాంక్‌ పనులు కనకమ్మ చేస్తుంది. డిస్‌ప్లే, స్టాకు నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. చిన్న టీం కావటం వల్ల బాధ్యతలు గిరిగీసినట్టు ఉండవు. వచ్చిన వాళ్ల అవసరాలకు తగ్గట్టు పుస్తకాలను చక చకా చూపించి, మాటల్లో వివరించే సామర్ధ్యాన్ని కనకమ్మ కూడా అలవర్చుకుంది. పుస్తక ప్రదర్శనలో స్టాల్‌కి వచ్చిన వాళ్లతో మాట్లాడటానికి, పుస్తకాలు చూపించటానికి వాలంటీర్లు ఎప్పుడూ ఉంటారు.

‘మంచి పుస్తకం’ ముందు, ఆ తర్వాత వచ్చిన బాల సాహిత్య ప్రచురణ సంస్థలు

ఒక సమయంలో బాలల అకాడమి పెద్ద ఎత్తున పుస్తకాలు ప్రచురించింది. ఇందులో చిన్న కథల నుండి, పాటలు, నాటికలు, నవలలు ఉన్నాయి. చిలుక పలుకులు అన్న పేరుతో పుస్తకం తోపాటు ఆడియో క్యాసెట్లు కూడా అందించింది. ఇప్పుడు ఆ ప్రచురణలు ఆగిపోయాయి. విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఇప్పుడు నవ తెలంగాణ, నవ చేతన వంటి సంస్థలే కాకుండా కొందరు వ్యక్తులు, సంస్థలు కూడా పిల్లల పుస్తకాలు ప్రచురించారు. ప్రభుత్వ రంగంలో పబ్లికేషన్ డివిజన్, నేషనల్ బుక్ ట్రస్ట్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ పలు భాషలలో పుస్తకాలను ప్రచురిస్తోంది. ఇటీవల కాలంలో ఈ పనిని ప్రథమ్ బుక్స్, తులిక వంటి సంస్థలు చేస్తున్నాయి.

అనేక కారణాల వల్ల చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ తెలుగు అనువాదాలను ప్రచురించటం తగ్గించారు. అప్పుడు ‘మంచి పుస్తకం’ చొరవ తీసుకుని తడవకి రెండు పుస్తకాల చొప్పున 12 పుస్తకాలను సోల్ డిస్ట్రిబ్యుషన్‌కి తీసుకుని ప్రచురణ  చేయించింది. ఇటీవల కాలంలో అమర చిత్ర కథతో 8 పుస్తకాలను ఇదే పద్ధతిలో ప్రచురణ  చేయించారు.

 బాల సాహిత్య రచయితల ప్రాపంచిక దృక్పథం

చందమామ, దాని స్ఫూర్తితో ఒకప్పుడు వచ్చిన పత్రికలు బాల సాహిత్యానికి వేసిన మూసపోతలో చాలామంది రచయితలు ఉండిపోయారనేది వాస్తవం. మారిన సామాజిక నేపధ్యంలో ఈ కాలం పిల్లలకు కావలసినదానికి అనుగుణంగా బాల సాహిత్యంలో రావలసినంత మార్పు లేదని ‘మంచి పుస్తకం’ భావిస్తోంది. అంతేకాక, ఇప్పుడు చెప్పుకోదగిన పిల్లల పత్రికలు లేవు. దీనివల్ల పిల్లల కోసం రాసినది ప్రచురించటానికి ఎక్కువ అవకాశాలు లేవు.

పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉండేలా, మంచి-చెడులు (నీతి కథలు), క్రమ శిక్షణ, సామాజిక బాధ్యత, పర్యావరణ స్పృహ వంటివి నేర్పేలా రచనలు ఉండాలని చాలామంది రచయితలు ఇప్పటికీ భావిస్తున్నారు. చిన్నప్పుడే ఇవన్నీ చెప్పటం మంచిదనీ, అలా చెప్పకపోతే నష్టం జరుగుతుందని కూడా కొందరు భావిస్తున్నారు.

ప్రభుత్వ వ్యవస్థాగత మద్ధతులు ఎలా వుండాలి?

తెలుగు రాష్ట్రాలలో పుస్తక పంపిణి వ్యవస్థ సరిగా లేకపోవటంతో ప్రచురణకర్తలకు కష్టంగా ఉంది. అనేక కారణాల వల్ల మొదటి నుంచి పంపిణీదారుల ద్వారా కాకుండా నేరుగా పుస్తకాలు అమ్మటంపై ‘మంచి పుస్తకం’ నిర్వాహకులు దృష్టి పెట్టారు. సికింద్రాబాద్ లోని తార్నాక కార్యాలయం నుంచి, హైదరాబాదు, విజయవాడ పుస్తక ప్రదర్శనలలో, వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ కార్ట్ ద్వారా పుస్తకాల అమ్మకం చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆర్ఆర్ఆర్ఎల్ఎఫ్ ద్వారా గ్రంథాలయాలకు కొనుగోళ్లు బాగానే జరిగేవి. విభజన తరవాత ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ కొనుగోళ్లు లేవు, తెలంగాణలో అంతంత మాత్రంగా జరిగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థల ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ క్లిష్టమైనది కావటంతో ‘మంచి పుస్తకం’ ఎప్పుడూ ఆ ప్రయత్నం చెయ్యలేదు.

ప్రభుత్వ కొనుగోళ్ల పైనే అందరి దృష్టి ఉంటుంది కాబట్టి ఇది కూడా కొంచెం సమస్యలతో కూడుకున్నదే. అయితే అడపాదడపా వచ్చిన ఆర్డర్లు ఆయా సంవత్సరాలలో పెద్ద మొత్తంగా ఉంటాయి. ఇక పోతే ఫౌండేషన్లు, దాతల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సమకూర్చే గ్రంథాలయాలకు పుస్తకాలు అమ్మటం మాత్రమే ‘మంచి పుస్తకం’ కి ప్రధాన ఆదాయం. పిల్లలతో పని చేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలు, కొందరు ప్రభుత్వ టీచర్లు ‘మంచి పుస్తకం’ ప్రచురణలు చాలా బాగున్నాయని పుస్తకాలను కొంటూ ఉంటారు. ఒకరి నుంచి ఒకరికి ప్రచారం జరగటంతో ‘మంచి పుస్తకం’ అమ్మకాలు సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పారు.

ఆశిస్తున్న ప్రోత్సాహం

ట్రస్ట్‌గా రిజిస్టరు అయినప్పటికీ మొదటి నుంచి ఎటువంటి గ్రాంట్‌లు లేకుండా ‘మంచి పుస్తకం’ పని చేస్తూ, కేవలం  అమ్మకాల మీదనే ఆధారపడి ఇంత వరకూ ప్రయాణించింది. ఇన్ని సంవత్సరాలలో ‘మంచి పుస్తకం’ తీవ్ర నష్టాలకు మాత్రం లోను కాలేదు. ఆర్థిక సంవత్సరం మొదట్లో ‘క్యాష్ ఫ్లో’కి సంబంధించిన సమస్యలను అధిగమించటానికి శ్రేయోభిలాషులు వడ్డీ లేకుండా, లేదా తక్కువ వడ్డీకి డబ్బు ఏర్పాటు చేశారు.

పుస్తకాల ధరలు సాధ్యమైనంత తక్కువ ఉండేలా చూసి, తక్కువ డిస్కౌంట్‌తో పుస్తకాలు అమ్మే ప్రయత్నం జరుగుతోంది. డిస్కౌంట్ ఆధారంగా కాకుండా పుస్తకం నాణ్యత ఆధారంగా పుస్తకాలు కొంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది.

ఇప్పటి వరకూ ప్రచురించిన పుస్తకాలు – అమ్మకాలు  

అన్ని రకాల పుస్తకాలు కలిపి 500 పుస్తకాలు ‘మంచి పుస్తకం’ ద్వారా ప్రచురణ అయ్యాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దవాళ్ల కోసం (94), హిందీలో (25) ప్రచురించినవి కాకుండా 381 పుస్తకాలు వివిధ అంశాలలో (బొమ్మల కథలు, కథలు, నవల, విజ్ఞాన శాస్త్రం, వగైరా), వివిధ వయస్సుల వారికి (5-8, 8-12, 12-14, 14+) ప్రచురితం అయ్యాయి.

బైలింగ్వల్ పుస్తకాలు, టాల్ స్టాయ్ బాలల కథలు, విజ్ఞాన శాస్త్రంలో ఎలా తెలుసుకున్నాం సీరీస్ ఎక్కువ గా 5 నుంచీ 7వరకూ పునఃముద్రణలకు వెళ్లాయి. 2010 నుంచి సగటున సంవత్సరానికి 8-10 లక్షల రూపాయలుగా ఉన్న అమ్మకాలు క్రమేపీ పెరిగి గత కొద్ది సంవత్సరాలుగా సగటున 45 లక్షల రూపాయలకు చేరుకుంది.

 కథల పుస్తకాలలో ఎక్కువ అడిగేవి

బాగా చిన్న పిల్లల కోసం, ప్రత్యేకించి బొమ్మల కథలు ‘మంచి పుస్తకం’ ప్రత్యేకత. పిల్లల కోసం పెద్దవాళ్లు కొంటారు కాబట్టి వాళ్లు, ప్రత్యేకించి ఉపాధ్యాయులు నీతి కథలు, జీవిత కథలు, మోటివేషనల్, లైఫ్ స్కిల్స్ పుస్తకాలు, డిక్షనరీలు, ఎన్‌సైక్లోపీడియాలు వంటివి అడుగుతుంటారు. పైతరగతి పిల్లలు, ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ధారాళంగా చదవలేక పోవటం ప్రధాన సమస్యగా ఉంది. 64 పేజీల పుస్తకం కూడా వీళ్లకి భారంగా అనిపిస్తోంది. అయితే తెలుగు చదవటాన్ని ప్రోత్సహిస్తున్న బడుల్లోని పిల్లలు హారర్, దెయ్యాల కథలు అడగటం ఇటీవల కాలంలో కనపడుతోంది.

 సలహా బృందం

‘మంచి పుస్తకం’ కి మిత్రులు, శ్రేయోభిలాషులతో కూడిన చిన్న సలహా బృందం ఉంది. పూనాలో ఉంటున్న అరవింద గుప్తా ‘బాలసాహితి’ నాటి నుంచి పుస్తకాలను సూచిస్తూ ఉన్నారు. అలాగే హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రచురితం అవుతున్న పుస్తకాలను తెలుసుకునే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇద్దరు, ముగ్గురు వీటిని చదివి, ఎంపిక చేస్తే ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది.

బాలసాహిత్యంలో కృషి చేస్తున్న కొత్త రచయితలు, ఆర్టిస్టులు  

రచయితలు చాలా మందే ఉన్నారు కానీ ఇంతకు ముందు చెప్పినట్టు ప్రచురణ అవకాశాలు తగినంత లేకపోవటం సమస్యగా ఉంది. చందమామ తరహా కథలు, జంతువుల పాత్రలతో కథల మూస నుంచి రచయితలు బయటపడాలి. సాహసం, హాస్యం ప్రధానంగా ఉండే సరదా కథలు రావాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలు అనేక రకాల సవాళ్లని ఎదుర్కుంటున్నారు. వీటిని కథా వస్తువుగా తీసుకుని రాయటంలో తెలుగు రచయితలు దృష్టి పెడితే బాగుంటుందని ‘మంచి పుస్తకం’ టీం ఆశిస్తున్నారు. చిత్రకారులకు తగినంత పారితోషకం చెల్లించ(లే)క పోవటం పెద్ద సమస్య. ఈ కారణఁగా బొమ్మల శైలిలో ఎక్కువ ప్రయోగాలు జరగటం లేదు. అనుకున్న సమయానికి బొమ్మలు పూర్తి చెయ్యటం చాలా ముఖ్యం.

‘మంచి పుస్తకం’ భవిష్యత్ ప్రణాళిక

ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, నిదానంగానే అయినా తన ఉద్దేశాల దిశలో ‘మంచి పుస్తకం’ ప్రయాణం చేస్తూ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పుస్తకాల ఎంపికను ఇంకా విస్తృతం చెయ్యాలని, ప్రణాళిక దశలో ఉండి పూర్తి చెయ్యాల్సిన పుస్తకాలు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయనీ చెబుతూ, ఇదే పనిని ఇంకా బాగా, ఇంకా బాధ్యతతో కొనసాగిస్తామని చెబుతున్నారు.

చివరగా.. కాదు.. మొదట్లోనే చెప్పాలనుకున్నది

మన పిల్లల కోసం, మన తెలుగు భాషలో సరళంగా, ఆలోచనాత్మకమైన పుస్తకాలు అందిస్తూ ఏప్రిల్ 27, 2024 శనివారం నాడు సికందరాబాద్ తార్నాక లోని సెంట్ ఆన్స్ జెనెరలేట్ లో రెండు దశాబ్దాల వేడుకను జరుపుకుంటున్న ‘మంచిపుస్తకం’ టీం కు సారంగ పత్రిక తరఫున ‘యాక్టివిస్ట్ డైరీ’ మనసారా అభినందనలు, జయహోలు, జిందాబాద్ లు అందజేస్తోంది.

*

సజయ. కె

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మంచి పుస్తకం ప్రయాణం – చక్కగా విశ్లేషించారు .,
  అభినందనలు …

 • Wonderfully compiled journey of Manchi Pustakam. Congratulations to Bhagya Lakshmi & Suresh Kosaraju for keeping the spirit high….thanks to Sajaya for taking effort to profile the activities and ups & downs during the Manchipustakam’s metamorphosis.

 • ఆచార్య ఆవుటి జగదీష్ : బసవకృప సంపాదకులు. says:

  మన ఉభయ తెలుగురాష్టాలలో మంచిపుస్తకం లాగ
  మంచి రాజనీతి నాయకులు రావాలని:
  ఎన్నిమంచి పుస్తకాలు ఎనిమిది వేలు చదివినా పనికిమాలిన వాళ్ళే వస్తున్నారు:ఇది నాబాధ.

 • జంతువుల పాత్రలతో కథల మూస నుంచి రచయితలు బయటపడాలి. సాహసం, హాస్యం ప్రధానంగా ఉండే సరదా కథలు రావాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలు అనేక రకాల సవాళ్లని ఎదుర్కుంటున్నారు. వీటిని కథా వస్తువుగా తీసుకుని రాయటంలో తెలుగు రచయితలు దృష్టి పెడితే బాగుంటుందని ‘మంచి పుస్తకం’ టీం ఆశిస్తున్నారు.

  బాగుందండి.

 • నమస్కారం సజయ గారు

  మంచిపుస్తకం గురించి చాలా విపులంగా స్పష్టంగా అందరికి తెలిసేలా చెప్పారు. ముఖ్యంగా సురేష్ గారి సారధ్యములో ‘మంచి పుస్తకం’ రూపుదిద్దుకొన్న తీరు మనస్సును ఆకట్టుకుంది.

  మంచిపుస్తకం ప్రారంభం నుండి అంటే ‘ఒక టేబల్ -ఒక అల్మారా’ తో ప్రారంభమైనప్పటి నుండి నాకు మంచి పరిచయం ఉంది. అప్పుడు కమిట్మెంట్స్(COMMITMENTS Trust) సంస్థ మరియు క్రెడాక్ (CREDOC) సంస్థల ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ఉమ్మడి పాలమూరు) లో చాలా పాఠశాలల్లో, వికలాంగుల పిల్లల కొరకు ఏర్పాటు చేసిన నైబర్-హుడ్- వికలాంగుల మనో విజ్ఞాన వికాస కేంద్రాలు (neighbourhood centre) సెంటర్ లలో విద్యార్దులకు చిన్నారులకు అందుబాటులో ఉంచడమైనది.

  అన్ని వర్గాల/వయసుల పిల్లలకు అవసరమైన పుస్తకాలు ఒకే చోట లభ్యం కాని సమయంలో ‘మంచిపుస్తకం’ ద్వారా అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. పాఠశాలలో చదువుతో పాటు మంచిపుస్తకం ద్వారా తీసుకెళ్ళి పాఠశాలలోనే ఒక రీడింగ్ రూమ్ లో పెట్టి విద్యార్ధులకు అందుబాటులోకి తేవడం వాళ్ళలో పఠనాసక్తి పెరిగింది. అందులో ఇప్పుడు కొంత మంది ఉన్నత విద్యలు కూడా అభ్యసిస్తున్నారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.

  హృదయ పూర్వక ధన్యవాదములతో

  కృష్ణమూర్తి లెంకలపల్లి

 • జయహో..
  మంచి పుస్తకం టీమ్ కు పుస్తక ప్రియులందరి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు