అశోక్ నగర్లో అశోకా పిల్లర్ కు అతి దగ్గరలో ఉంది మా గెస్ట్ హౌస్. అప్పటికే మా పూర్వపు పూణె సహోద్యోగి మహేష్ నా కోసం ఎదురుచూస్తూ కనిపించాడు. అయిదింటికల్లా చేరతానని చెప్పాను అతనితో- ఠంచనుగా వచ్చాడన్నమాట!
పూణెలో ఉన్న రోజుల్లో అందరం ఒకే కాలనీలో ఉండేవాళ్లం. నాకన్నా మహేష్ పాతిక సంవత్సరాలు చిన్న వాడు… తమిళనాడు వాసి. రెండేళ్ల క్రితం కుటుంబ కారణాలవల్ల పూణె నుంచి చెన్నయ్ బదిలీ అడిగాడు. నేనప్పటికే రిటైర్ అయి వున్నా అతని సమస్యపట్ల సానుభూతి ఉండటంవల్లా, అతనో మంచి ఉద్యోగి అవడంవల్లా కాస్తంత ఆ విషయంలో సాయం చేశాను. చేయగలిగాను. చివరికి 2013 వేసవిలో బదిలీ జరిగింది. దానికి సంతోషాలు వ్యక్తపరచడానికి వచ్చాడతను.
సారంగ చానెల్ లో చూడండి/ వినండి
కాసేపు పరామర్శలు అయ్యాక అక్కడికి అరగంట దూరంలో వున్న తన ఇంటికెళ్లాం. ఆవిడతోనూ పరిచయం ఉంది. ఏదో మహా ముఖ్యమైన మనిషి ఇంటికి వచ్చినట్టు హడావుడి చెయ్యబోయారుగానీ నేను పడనివ్వలేదు. చిన్న చిన్న పిల్లలిద్దరు. పెద్దాడు గుర్తుపట్టాడు. పిల్లలతో, పెద్దాళ్లతో కబుర్లు- ఏడు దాటేసింది. తిరిగి గెస్ట్ హౌస్ దగ్గర దింపుతానన్న అతని ప్రతిపాదనను సున్నితంగా త్రోసిపుచ్చి ఆటోలో గెస్ట్ హౌస్ కు… దగ్గర్లోనే ఉన్న హేమంత్ కుమార్ పామర్తి అన్న స్నేహితుని ఇంట్లో ఆ రాత్రి డిన్నరు.
తొంభైల మధ్య దినాలలో నేను ఆంధ్రప్రభలో కథలూ వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని- వాకాటి పాండురంగారావుగారి ప్రోత్సాహం… అదే సమయంలో హేమంత్ ప్రయాణాల వ్యాసాలు రాస్తూ వుండేవాడు- అదే వాకాటిగారి ప్రోత్సాహంతో, కుతూహలం కలిగింది. వాకాటి నడిగి అడ్రసు సంపాయించాను. 1997లో అనుకొంటాను, బెంగళూరులో మొదటిసారి కలుసుకొన్నాం. వృత్తిరీత్యా అతనిది మార్కెటింగ్ రంగం. తర్వాత మైక్రో ఫైనాన్స్ కు మారాడు.
నాకున్నట్టే అతనికీ బైకు వేసుకొని అలా అలా వెళ్లిపోయే అలవాటుంది. బెంగళూరు పరిసర ప్రాంతాలన్నీ అలా విరివిగా తిరిగాడు. వాటి గురించి రాశాడు. అలాగే వైజాగ్ కొంతకాలం ఉన్నప్పుడు అక్కడా తిరిగి ఆ విశేషాలూ రాశాడు.
గత పదిహేనేళ్లలో ఆ పరిచయం స్నేహంగా మారింది. అడపాదడపా కలుసుకోవడం- ముఖ్యంగా చెన్నైలో ఆనవాయితీగా మారింది. నా స్కూటరు యాత్ర వివరాలు అతనితో ముందే పంచుకొన్నాను. తనకు తోచిన, తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. అవి నా ఆలోచనలలో అప్పటికే పొందుపరుచుకొని ఉన్నాను.
అంతగా మాట్లాడకపోయినా ఆవిడా స్నేహశీలి. అపుడపుడూ మా మాటల్లో మాట కలుపుతారావిడ. గంటన్నర తెలియకుండా గడిచిపోయింది. కొత్త కబుర్లు చాలా చెప్పాడు హేమంత్- ముఖ్యంగా తన కన్సల్టెన్సీ పనిమీదా, స్వల్పకాలిక ఉద్యోగరీత్యానూ వియత్నాంలో దాదాపు ఏడాదిపాటు గడిపిన అనుభవాలు చెప్పుకొచ్చాడు. గొప్ప ఆసక్తికరంగా వున్నాయా వివరాలు. పదిన్నర అయ్యేసరికి తొందరపడిపోయి గబగబా గెస్టుహౌస్ కు చేరిపోయాను.
‘ఇవాళ డిసెంబరు 31 గదా… మరో గంటన్నర కలసి వుండి కొత్త సంవత్సరాన్ని కలసి ఆహ్వానిద్దాం,’ అనుకొన్నాంగానీ- ఆ ఆలోచనను దాటి విడివడ్డాం.
ప్రయాణం మొదలెట్టి రెండు రోజులు గడచిపోయాయి. అంతా కలసి అప్పటిదాకా నాలుగు వందల డెభై కిలోమీటర్లు నడిచింది ఏక్టివా. ఎక్కడా ఏక్టివాగానీ నేనుగానీ తొట్రుపడటం అన్నది జరగనే లేదు, రెండు పంక్చర్లు తప్ప. అందులో ఒకటి స్వీయాపరాధం.
కాలూరు మెకానిక్ గురూజీ వుపదేశాన్ని తూ.చా. తప్పకుండా పాటించడం మొదలెట్టాను. ప్రతిగంటకీ ఒక సుందరమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం, కనీసం అయిదు నిమిషాలు ఆగడం, మంచినీళ్లవీ తాగడం, అవసరమనిపిస్తే ఒకటో రెండో బిస్కట్లు తినడం- పక్కనే ఉంటే ఏ పాక దుకాణంలోనో ఒక కాఫీ తాగడం. స్కూటరుకూ నా శరీరానికి అనుసంధానం అన్నది మొదటిరోజు మొదటి గంటలోనే జరిగిపోయింది గదా, అది కొనసాగుతోంది.
ఒకరోజు గడిచేసరికి మరో విషయం స్పష్టమయింది.
నా స్కూటరు పొట్ట చిన్నది. అంతా కలసి ఎనిమిది లీటర్లనుకొంటాను, పదేళ్ల వయసుగాబట్టి మైలేజీ తక్కువ ఇస్తోంది. లీటరుకు ముప్పయ్ కిలోమీటర్లు, అంటే ఒకసారి టాంకు పూర్తిగా నింపితే అది నడిచే దూరం- దాని రేంజ్- రెండువందల ఏభై కిలోమీటర్లు. దూరప్రయాణాల్లో ఇది చాలా తక్కువ రేంజ్ అనాలి. సమస్యే. దానికి నేను ఎన్నుకొన్న పరిష్కారమార్గం వీలయినంత విరివిగా పెట్రోలు పోయించుకోవడం. ఓ వంద కిలోమీటర్లు నడపగానే, ముల్లు సగంకన్నా కిందకు దిగగానే పెట్రోలు బంకు కనబడటం ఆలస్యం, ట్యాంకు నింపుకొనేవాడిని. నా ‘గంటకోసారి విరామం’ అన్న సూత్రం ఈ పెట్రోలుబంకుల్లో ఆగడానికి ఉపయోగించేవాడిని. ఉభయతారకం.
అలాగే ప్రతిరోజు ఒకసారి ఎవరైనా మెకానిక్ కనబడితే ఆగి గాలి చెక్ చేయించుకొని, అవసరమయితే నింపుకొని అతగాడిని బ్రతిమాలి ఓ కిలోమీటరు బండి నడిపించి ఇంజను, బ్రేకులూ, ఏక్సిలేటరూ అన్నీ సరియైన రీతిలో ఉన్నాయన్నమాట అనిపించుకొని, అవసరమైతే వాటిల్నోసారి సరిదిద్దుకొని… మొదట్లో నాకే ‘ఏవిటీ చాదస్తం’ అనిపించినా అలా చేయడం రాబోయే సంకటాలకు ముందుగానే వేస్తోన్న ‘జాగ్రతా కళ్లెం’ అన్న భావం క్రమక్రమంగా బలపడింది. అంచేత ఆ చాదస్తాన్ని మొదటిరోజునుంచే కొనసాగించాను. బండి గురించి ఏ క్షణానా అనుమానమూ, అభద్రతలకు గురికాకపోవడానికి ఈ జాగ్రత్త కూడా ఒక ముఖ్య కారణమనుకుంటాను. ఈ చర్య పుష్కలమైన మానసిక శాంతిని, విశ్వాసాన్ని కలిగించిందన్నది నిర్వివాదం. అలాగే నా అతి జాగ్రత్తను అలుసుగా తీసుకొని వున్నవీలేనివీ చెప్పి భయపెట్టి ఎక్కువ డబ్బులు సంపాదిద్దామని చూచిన మెకానిక్కులు ఎక్కడా తటస్థపడనే లేదు. చాలాచోట్ల వాళ్లు డబ్బులు నిరాకరించారు. నేనే బలవంతంగా ఇచ్చాను.
కొత్త సంవత్సరం. గురువారం.
మా గెస్ట్ హౌస్ ఉన్న ప్రాంతపు రోడ్లలో, అశోక స్తంభం దగ్గరా అక్కడ వున్న ఓ చిన్నపార్కులోనూ చిన్నపాటి వ్యాహ్యాళికి వెళ్లి ప్రక్కనే ఉన్న శరవణ భవన్లో ఉదయపు కాఫీ తాగటం నాకు ఇష్టమైన పని. ఆ జనవరి ఒకటి, 2015న నేనదే చేశాను.
ఎనిమిది లోపలే మన్నవ గంగాధరప్రసాద్ ఫోన్ చేశారు. ఆయనతోపాటు చెన్నయ్యగారు కూడా మాట్లాడారు. వీళ్ల ఆరు నెలల క్రితం ‘జనని’ సంస్థ తరపున శంకరంబాడి సుందరాచారి శతజయంతి సభ ఢిల్లీలో జరపాలన్న సంకల్పంతో ఢిల్లీ వచ్చారు. ఆ ఉత్సవానికి మా ఢిల్లీ మిత్రబృందం నడిపే సాహితీవేదికను వేదికగా చేశాం. ఆంధ్రప్రదేశ్ భవన్లో చక్కటి కార్యక్రమం జరపగలిగాం. అప్పటి పరిచయం వాళ్లు తిరిగి చెన్నై వెళ్లాక కూడా కొనసాగింది. బయలుదేరేముందు, ‘నేను ఇలా చెన్నై వస్తున్నాను మిమ్మల్ని కలుస్తాను’ అంటే, ‘ఒట్టి కలవడమే కాదు ఓ సమావేశం పెట్టుకుందాం. రెండుమూడు గంటలు మాకు ఇవ్వండి’ అన్నారు. ఆ సమావేశం ఈనాడు పది గంటలకు. నేను సమావేశస్థలానికి రాగలనూ అని ఎంత చెప్పినా, అలాకాదు మేమే వచ్చి తీసుకువెళతాం అన్నారు.
ఆ సమావేశం ముగిశాక ఆలిండియా రేడియోలో కార్యక్రమ ప్రయోక్త నాగసూరి వేణుగోపాల్ గారు ఓ ఇంటర్యూ ఏర్పాటుచేశారు. ఈ రెండూ ముగిశాకా చెన్నైలోనే ఉన్న పాలగుమ్మి సీతగారిని, ఎస్పీ శైలజగారిని కలవాలనీ, వాళ్లతో చెరి ఒక గంట గడిపి రావాలనీ నా ఆలోచన.
చెన్నై నగరంలో కూడా స్కూటర్ వేసుకొని అన్నిచోట్లకూ తిరిగి రావచ్చు కాని రెండు రోజుల విశాల రహదారి ప్రయాణాల తరువాత నగరంలో అసంఖ్యాక వాహనాల మధ్య ఇరుకిరుకుగా తిరగడం ఏమంత ఆసక్తికరం అనిపించలేదు. అందుచేత నా స్వభావానికి విరుద్ధమే అయినా ఏక్టివాను ఓ పక్కన నిలబెట్టేశాను.
తొమ్మిదింటికల్లా ప్రసాద్ గారి మనిషి వచ్చి నన్ను వెంట తీసుకొని మైలాపూర్ లోని లజ్ కార్నర్ దగ్గరలో ఉన్న పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ హాలు దగ్గరకి తీసుకువెళ్లారు. చిన్నప్పటినుంచీ ఆయన పేరు కొన్ని లక్షలసార్లు స్మరించుకొని ఉంటాను. ఆయన స్మారకభవనం దగ్గరకు చేరగానే ఓ అనిర్వచనీయమైన అనుభూతి…
లోపల హాలులో ఆయన శిలావిగ్రహం… నిరాహార దీక్ష అప్పటి ఫొటోలు. యాభై ఒక్క ఏళ్ల వయస్సులో ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడవడం… ఆయన్ని అక్కడ నిజంగా కలుసుకొని ఆత్మీయత పంచుకొన్న అనుభూతి కలిగింది.
ఆనాటి మా సమావేశం చెన్నై నగరపు తెలుగు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్రజ్యోతి చెన్నై బ్యూరో హెడ్ గౌస్ బాషా, ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్, సినిమా ప్రతినిధి అరుణ్, ‘వెబ్ దునియా’ నుంచి ఐ. వెంకటేశ్వరరావు, గోటేటి గ్రాఫిక్స్ కు చెందిన గోటేటి వెంకటేశ్వరరావు, వీరితోపాటు సీనియర్ రచయిత్రి మంగళా కందూర్, ఇలాంటి సమావేశాలకు క్రమం తప్పకుండా తిరుత్తణినుంచి వచ్చే ఓ పెద్దాయనా, జననినుంచి మన్నవ చెన్నయ్య, ఉప్పల ధడియం వెంకటేశ్వర- అంతా కలసి ఓ ఇరవైమందిమి అయ్యాం. నేను కొంచెం చొరవ తీసుకొని వేదిక, టేబులు, పోడియం, మైకులాంటి లాంఛనాలను విడిచిపెట్టి అందరం కింద కుర్చీలు గుండ్రంగా వేసుకొని మాట్లాడుకుందాం అన్నాను. చివరికి అదే జరిగింది.
‘జనని’ బృందం తప్పించి మిగిలిన వాళ్లందరూ కొత్తే నాకు. మంగళా కందూర్ గారితో మీరు నాకు తెలుసు అంటే, మాలతీచందూర్ అని పొరబడటం లేదు కదా అని అడిగారు. లేదు. గత నలభై, నలభై ఐదేళ్లుగా అటు ఆంధ్రప్రభ ద్వారానూ ఇటు చందూర్ గారి ‘జగతి’ ద్వారానూ ఆవిడ నాకు చిరపరిచితమే. అదే చెప్పాను. ఇద్దరం ఒకసారి చందూర్ దంపతులను గుర్తుచేసుకున్నాం. దాదాపు ఇరవై ఏళ్లపాటు నేను ఎప్పుడు మద్రాసు వెళ్లినా మైలాపూర్ కచేరీ రోడ్డులో ఉన్న చందూర్ల ఇంటికి వెళ్లి ఓ గంట గడిపి వస్తూ ఉండేవాడిని. నాలుగైదు సంవత్సరాల క్రితం వాళ్లు బెంగుళూరు వచ్చినప్పుడు- అప్పుడు నేను బెంగుళూరులో పని చేస్తున్నాను- మా ఇంటికి వచ్చి రెండు గంటలు గడిపి వెళ్లారు. ఆ జ్ఞాపకాలు మనసును భారం చేశాయి. పండిన వయసులోనే అయినా ఇద్దరూ ఒకరు వెంట ఒకరు వెళ్లిపోవడం తీరని లోటు.
నన్ను పరిచయం అదీ చేశాకా మాట్లాడమన్నారు.
పుస్తకాలతో నాకున్న యాభై ఏళ్ల అనుబంధం గురించీ, పుస్తకాలకు నా జీవితంలో ఉన్న స్థానం గురించి, నన్ను ప్రభావితం చేసి దిశానిర్దేశం చేసిన పుస్తకాల గురించీ, సాహితీకార్యకర్తగా నేను ఢిల్లీ, బెంగుళూరు, పూనా నగరాలలో చేసిన పనుల గురించి, రచయితగా నా గత పాతికేళ్ల ప్రయాణం గురించీ, మద్రాసు సాహితీ బంధువులతో నాకున్న ఆత్మీయత గురించి, ఏడాది క్రితం నేను ప్రచురించిన నా ‘ఆత్మీయమ్’, ‘సాహితీయాత్ర’ పుస్తకాల గురించీ- క్లుప్తంగానే ఇరవై అయిదు, ముప్పయ్ నిమిషాలు మాట్లాడాను. సభికుల ముఖకవళికలు గమనిస్తే వారికీ విసుగు కలిగించలేదనే అనిపించింది. ప్రసంగం తరువాత ఓ నలభై నిమిషాలు చర్చ సాగింది.
తరాల అంతరం, నేటి యువతరం విలువలు కోల్పోయి భౌతికసుఖాలూ, ధన సంపాదనవైపు పరుగులు తీయడం చర్చకు వచ్చింది. నా భావాలు పంచుకొన్నాను.
“బహుశ ఒక నవతరం మీద పెద్దతరం వాళ్లు ఫిర్యాదులు చేయడం అన్నది ఈనాటి మాట కాదనుకుంటాను. మా అమ్మావాళ్ల మీద అమ్మమ్మ తాతయ్య ఇలాంటి ఫిర్యాదులు చేయడం నేను చిన్నతనంలో విని వున్నాను. ఈ విషయం తరానికొకసారి తల యెత్తుతూనే ఉంటుంది. అయినా ప్రపంచం ముందుకు పోతూనే వుంది. మనం భయపడుతున్నట్టు భ్రష్టుపట్టి పోవటం లేదు. ఒక విషయం మనం ఆలోచించాలి. ఈ తరం వాళ్లను మన తరపు అలవాట్లూ ఆలోచనలూ విలువల త్రాసులలో తూచటం సరైన పనేనా?
“మన ఆలోచనలు 1970లకు చెందినవైనపుడు వాటి ఆధారంతో 2015 నాటి యువతను తూచడమన్నది సమంజసమేనా? వాళ్లు 2025 వైపు 2035 వైపు చూస్తున్నప్పుడు మన 70ల విలువలు వాళ్లకూ మనకూ గుదిబండలవవా? పోనీ ఈ తరం పాడైపోయిందనే అనుకుందాం; అందులో మన పాత్ర లేదా? తలిదండ్రులు తమ తమ పాత్రలను విస్మరించి మొత్తం నేరాన్ని సమాజం మీదకే నెట్టివేయడం ఎంతవరకు సమంజసం? ఈ ధోరణివల్ల మనం అనుకొనే సమస్యకు చీమ తలకాయంత పరిష్కారమైనా దొరుకుతుందా…?
“తెలుసు. నా మాటలు ఏటికి ఎదురీత అని తెలుసు. అయినా ఇవి నేను గట్టిగా నమ్మిన విషయాలు. పెరిగి పెద్దయిన ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అతి సన్నిహితంగా పరిశీలించి గ్రహించిన విషయాలు, విపులంగానే మాట్లాడాను.
“మరి ఈ యువతరం తెలుగుభాషను నిర్లక్ష్యం చెయ్యడం సంగతేమిటి? ఇప్పటి కుర్రాళ్లకు తెలుగు నామోషీ అయిపోయింది గదా- ఇలా అయితే మన మాతృభాష నామరూపాలు లేకుండా పోదా? ఇంగ్లీషు ఇంగ్లీషు అంటూ పిల్లలు గాల్లో ఎగరడం సంగతేమిటి?” చర్చ భాష మీదకు మళ్లింది. దాడి మళ్లా యువతరం మీదే!!
“ఒకటి రెండు భావాలు మీతో పంచుకుంటాను…
“కంప్యూటర్లూ, ఇంటర్నెట్టూ, సాఫ్ట్వేరూ, అమెరికా ఉద్యోగాలూ, దేశంలోనే ఉన్న బహుళజాతి కంపెనీల్లో బహులావు జీతాలూ వాటిలోంచి పుట్టుకొచ్చిన నవనాగరిక జీవనసరళీ… వీటన్నిటి మీదా మనకు తెలియని అసహనం ఉంది. కానీ వాటన్నిటికీ యువతరాన్నే తప్పుపట్టడం ఎంతవరకూ న్యాయం? అసలవి తప్పులేనా? యుగధర్మం సంగతేమిటి? అసలీ మార్పుల్లో- భాష ప్రాముఖ్యత తగ్గడంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటీ?
“మొన్నకు మొన్న డెబ్భైలవరకూ ఇంగ్లీషు పద్ధతి చదువులవల్ల అయినా మన సంస్కృతీ, సంప్రదాయం ఘోరమైన నష్టానికి గురి అవుతున్నాయని భావించి తమతమ పిల్లలకు తెలుగుకూడా వద్దని సంస్కృతం చదువులే చెప్పించిన రెండు మూడు కుటుంబాలను కాకినాడలాంటి పట్నంలో చూశాను. ఆ రకపు వాపోత
ఇరవయ్యో శతాబ్దపు తొలిదినాల్లో ఇంకెన్ని రెట్లు ఉండి ఉండేదో మనం ఊహించవచ్చు. ఈ 2015లో కూడా మనం అలా వాపోతే వింతగా ఉండదూ?
“ఈ నలభై ఏళ్లలో మంచికో చెడుకో మనం జీవించే పద్ధతి మారింది. విద్యలు మారాయి. వృత్తులు మారాయి. ఉద్యోగావకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఒకప్పుడు హైదరాబాదు వెళ్లి ఉద్యోగం చెయ్యడానికే సంకోచించిన తెలుగువాళ్లు ఇపుడు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వెళుతున్నారు. ప్రతిభ నిరూపించుకుంటున్నారు.
“మనం జీవించే ప్రాంతాల పరిధి పెరిగినపుడూ, జీవనవిధానం పెరిగినపుడూ, చేస్తోన్న ఉద్యోగాలు ప్రపంచీకరణకు గురి అయినపుడూ- దాని ప్రభావం భాష మీద ఉంటుంది. భాష రూపు మారుతుంది. వందల ఏళ్ల క్రితం మారింది. ఏభై ఏళ్ల క్రితం మారింది. ఇపుడూ మారుతోంది. ఆ మార్పును నిరసించి, అందుకు నెపమంతా యువతరం మీదకు నెట్టి, మనకు అందులో పాత్ర లేదనుకోవడం సరి కాదేమో… మన పిల్లలు ఆంగ్లమాధ్యమంలోనే చదువుకోవాలనీ, అంతర్జాతీయ ఉద్యోగాలే చెయ్యాలనీ ఒక పక్కన విపరీతమయిన తాపత్రయం పడుతూ- మరో పక్క ఆ పిల్లలు తెలుగును నిరాదరిస్తున్నారనుకోవడం… ఈ ఆలోచనలో న్యాయం ఉందా? అయినా ఈ సమస్య యువతరం మొత్తానికి చెందినదా- పెద్ద నగరాల పిల్లలకేనా? కాకినాడ, అనంతపురం, ఖమ్మంలాంటి ప్రదేశాలలో ఉండే పిల్లలకు ఇంకా మాతృభాషతో అనుబంధం ఉంది గదా…’
కొంచెం గట్టిగానే చెప్పానీ విషయం. నలభై ఏళ్లుగా ప్రవాస జీవితం గడుపుతూ, తెలుగు చదవడం, రాయడం రాని ఇద్దరు తెలుగు పిల్లలకు తండ్రినయిన నాకు ఈ విషయంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆలోచనలు వున్నాయి. బహుశా నా మాటలు వారికి వితండంగా అనిపించి ఉండవచ్చు. అయినా రిస్కు తీసుకొని మనసులోని మాట చెప్పేశాను.
వాదాలూ, వితండాల సంగతి ఎలా ఉన్నా మొత్తం సమావేశమంతా గొప్ప స్నేహభావంతో సాగింది. ఆ గంటాగంటన్నరలోనే అందరూ చిరపరిచితులనిపించేశారు. ఆంధ్రజ్యోతి సినీ ప్రతినిధి అరుణ్ ను పట్టుకొని నా చిరకాల కోరిక బయట పెట్టాను. ‘చాలామంది అలనాటి నటీనటులకు నేనెంతో రుణపడి ఉన్నాను. చిన్నపుడూ, టీనేజ్ లోనూ వాళ్ల సినిమాలు చూసి ఎంత ఆనందం పొందానో- వాళ్లందరినీ వాళ్ల ఈ పెద్ద వయసులో ఒకసారి వెళ్లి పలకరించి రావాలని ఉంది. మీ సహకారం కావాలి,’ అనడిగాను. అతను ఉత్సాహంగానే స్పందించినా ఆలోచించి చూస్తే మద్రాసులో మిగిలి ఉన్నవాళ్లు బహు తక్కువ అని తేలింది. చాలామంది వెళ్లిపోయారు. జానకి, కృష్ణకుమారి, జమునలాంటివాళ్లు మద్రాసులో లేరు. గీతాంజలి, రమాప్రభలాంటివాళ్లు ఉన్నా నాకు వారి విషయంలో అంత ఆసక్తి లేదు.
అంతా కలిసి భోంచేసి విడివడదాం అన్నారు గంగాధర ప్రసాద్. బయటకొచ్చి రెస్టారెంట్ వేపు నడుస్తోంటే వర్షం. భారీ వర్షం! అకాలవృష్టి. ఈనాటి మిగతా కార్యక్రమమంతా దెబ్బతింటుందా అని భయపడ్డాగానీ- మేం భోజనం ముగించేసరికి వాన కూడా వెలిసింది.
మన్నవ గంగాధరప్రసాద్ గారు ఆకాశవాణివరకూ నాకు తోడుగా వచ్చి నాగసూరి వేణుగోపాల్ గారికి నన్ను అప్పజెప్పి వెళ్లారు.
ఆకాశవాణి భవనంలోకి అడుగు పెట్టగానే ఒళ్లు పులకరించింది. 1940లలో బాలాంత్రపు రజనీకాంతరావుగారు, ఆచంట జానకీరామ్ ల ప్రోత్సాహంతో అమ్మ- నంబూరి పరిపూర్ణ విరివిగా పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్న ఆకాశవాణి ఇదేనా అన్న భావన…
నాగసూరి ఏదో పని వత్తిడిలో ఉన్నట్టున్నారు. ఆత్మీయంగానే మాట్లాడారుగానీ దృష్టి ఎక్కడో ఉంది అనిపించింది. ఆయన ఇంటర్వ్యూ అన్నారు గదా అని మానసికంగానూ, పేపరు మీద నోట్స్ రాసుకొనే విషయంతోనూ బాగా తయారయి వచ్చాను… ఆయన మరో ఉద్యోగిని పిలిచి ఓ నిమిషంలో ఆవిడకు బ్రీఫింగిచ్చి స్టూడియోకు పంపారు. ఆవిడ తన వృత్తి విధినిర్వహణలో భాగంగా ప్రయాణాల గురించి బహు స్టాండర్డు ప్రశ్నలడిగారు. నేనూ అంతకన్నా పడికట్టు సమాధానాలిచ్చాను. ఎక్కడో నా మనసు శ్రుతి తప్పింది. ఆ ఇంటర్వ్యూ లయ తప్పింది. నేను చేసిన, చెయ్యబోతోన్న పదిరోజులు స్కూటరు ప్రయాణం గురించి ఒక్క ప్రశ్న లేదు. ఇష్టమైన అధ్యాయాన్ని మనసు పెట్టి అధ్యయనం చేసి ఉత్సాహంగా పరీక్ష హాలుకు వెళితే అదులోంచి ఒక్క ప్రశ్నా రాకపోతే విద్యార్థి మనసు ఎలా వుంటుంది…?!
నా తదుపరి మజిలీ ఎస్పీ శైలజగారిల్లు.
“కోడంబాకం బ్రిడ్జి దిగువన మహాలింగపురం. అక్కడ అయ్యప్ప గుడి అడగండి… గుడి పక్కనే మా ఇల్లు… ఎవరినయినా అడిగితే చెపుతారు,” అన్నారు ఫోనులో శైలజ.
శైలజగారంటే నాకు సాగర సంగమం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి చెల్లెలు. ఆమె శుభలేఖ సుధాకర్ గారి సహచరి. చక్కని గాయని.
అనుకోకుండా 2013 నవంబరులో పరిచయం కలిగింది.
ఇస్మాయిల్ అవార్డు సభకోసం కాకినాడ వెళ్లి, సభ జరిగిన సాయంత్రం మిత్రబృందమంతా వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారి ‘శేఫాలిక’లో కబుర్లు చెప్పుకొంటున్నపుడు ఈవిడ సుధాకర్ గారితో కలిసి హఠాత్తుగా వచ్చేశారు. వీరలక్ష్మిగారు మాకు ఇచ్చిన సర్ప్రైజ్ కానుక అది.
ఏదో పెళ్లికోసం కాకినాడ వచ్చారట. వీరలక్ష్మిగారంటే స్నేహంగాబట్టి ఆవిడను కలవడానికి వచ్చారు.
అంతా కలిసి ఓ గంట కబుర్లు చెప్పుకొన్నాం. ‘ప్రసిద్ధ వ్యక్తులు’ అన్న భావన రానీయకుండా వాళ్లిద్దరూ మాతో క్షణాల్లో కలిసిపోయారు. అపరిచితులు అన్న సంకోచం లేకుండా ఆత్మీయంగా మాట్లాడారు. అరగంట గడిచేసరికి చనువు- చెణుకులు… పాటలు… ‘ఏదన్నా మీకు బాగా నచ్చిన పాట పాడండి,’ అని అడిగితే ‘మనసున మల్లెల మాలలూగెనే…’ పాడి అందర్నీ ఆవిడ సంతోషపెట్టారు. పనిలో పని అని నా పుస్తకాలు రెండు ఇచ్చాను. మద్రాసు వెళ్లాక చదివి, ఫోను చేసి చాలాసేపు మాట్లాడారు… మళ్లీ కలుసుకోవాలనుకొన్నాం.
అదీ నేపథ్యం.
చాలా సులభంగా ఆమె ఇల్లు పట్టుకోగలిగాను. మధ్యాహ్నం మూడు గంటల సమయం.
ఆవిడ ఆహ్వానంలో సంబరపు ఛాయలు కనిపించాయి.
ఏడాది క్రితం ఎక్కడయితే సంభాషణకు కాకినాడలో కామా పెట్టామో మళ్లా అక్కడినుంచే అతి సులభంగా కొనసాగించగలిగాము.
తన చిన్నతనం, పాటలు, అన్నయ్య మార్గదర్శకత్వం, కె. విశ్వనాథ్ లాంటి దర్శకుల ప్రోత్సాహం, సాగర సంగమంలో సందేహిస్తూ నటించడం, అభిరుచులు, అలవాట్లు, గాయనిగా తన పురోభివృద్ధి, కుటుంబ అవసరాలకూ గానవృత్తికీ చుక్క ఎదురయినపుడు తాను కుటుంబజీవితానికే మొగ్గు చూపడం, పదిమంది అనుకొనే విజయానికి తాను ఓటు వెయ్యకపోవడం, పువ్వులతోనూ పక్షులతోనూ తమ తమ వాహనాలతోనూ సంభాషించడం, జీవితాన్ని మలుపు తిప్పిన గోరంత దీపం సినిమా, అందులోని గుమ్మడి సలహా- సంభాషణ అలవోకగా సాగిపోయింది. వాళ్ల బాబు అపుడెపుడో ఆధునికీకరణ కోసం వాళ్ల పాత స్నానాలగదిని కూల్చుతున్నపుడు దానితో ముడిపడిన తన జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయే అని బావురుమన్న ఉదంతం వినిపించారావిడ. అలాంటి జ్ఞాపకాలే మా పిల్లలకు సంబంధించినవి పంచుకొన్నాను. నా జీవితానికి దిశానిర్దేశం చేసి, జీవితాన్ని మలుపుతిప్పిన సోమర్సెట్ మామ్ ‘మూన్ అండ్ సిక్స్ పెన్స్’ లాంటి కొన్ని పుస్తకాల గురించి మాట్లాడుకొన్నాం. తనకు అందుబాటులో ఉన్న నిచ్చెనలనెక్కి, శిఖరారోహణలు చేసి, కీర్తి పతాకాన్ని ఎగురవేయడం మీద దృష్టి నిలపకుండా తన వృత్తి విజయాలను కౌటుంబిక అవసరాలతో సరిచూసి, కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చి కించిత్ అనామకంగానే మిగిలిపోవడానికి మొగ్గు చూపిన ఆవిడ వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకుంది.
ఆలోచనలపరంగానూ, అభిరుచులపరంగానూ, జీవితాన్ని చూసే దృక్కోణంపరంగానూ మాలో అసాధారణమైన సారూప్యముందని తెలిసి ఆనందం కలిగింది. ఓ గంట అలా గడిచాక రెండు మూడు పాటలు పాడమని అడుగు- అని మనసు పదే పదే హెచ్చరించినా ఎందుకో అది సమంజసం కాదనిపించింది. సంభాషణ చక్కని స్థాయిలో ఉన్నపుడే ఆపి, శెలవు తీసుకొన్నాను. ఓ చక్కని పెన్నుల సెట్టు బహూకరించారావిడ.
అపురూపమైన జ్ఞాపకం. జీవితంలో చిన్నపాటి వెలుగులు నింపేవి- ఇదిగో ఇలాంటి అనుభవాలే!!
ఆరునెలల క్రితం హైదరాబాదునుంచి సాహితీమిత్రులు వేదగిరి రాంబాబు, కొంపెల్ల శర్మ ఢిల్లీ వచ్చారు- పాలగుమ్మి పద్మరాజు శత జయంతి ఉత్సవాలు ఢిల్లీలోనూ జరపాలని. అందుకు మా ‘సాహితీవేదిక’ సారథ్యం వహించింది. పద్మరాజుగారి అమ్మాయి సీత కూడా రావలసింది- చివరి నిముషంలో రాలేకపోయారు.
అయినా ఆ సభ పుణ్యమా అని ఆవిడతో నాలుగయిదుసార్లు ఫోనులో మాట్లాడటం, సభ కోసం ఆవిడ రాసి పంపిన ప్రసంగాన్ని సభలో చదవడం జరిగింది. ‘తెలుసుకోదగిన మనిషి’ అనిపించారు. ‘మద్రాసు వచ్చినపుడు కలవవచ్చా?’ అని అడిగాను. ‘మహదానందంగా’ అన్నారావిడ.
ఉండేది ‘నందనం’ అన్న ప్రదేశంలో అణ్ణాసాలైకి చేరువలో.
ఇంటికి చేరేసరికి నాలుగున్నర అయింది. అయిదింటికి తనకేదో పని ఉందని చెప్పారావిడ. అంటే మాకున్నది అరగంట అన్నమాట.
చూసీ చూడగానే ఇద్దరికీ అర్థమయిపోయింది- ఒకే బాపతు మనుషులం అని. ఇహ లాంఛనాలు, మొహమాటాలు అన్న ప్రసక్తి లేకుండా పెద్దయాక కలుసుకొన్న బాల్యమిత్రుల్లా గబగబా కబుర్లలో పడిపోయాం.
శతజయంతి సభ పుణ్యమా అని నేను పద్మరాజుగారిని రీ-డిస్కవర్ చేసి ఉన్నాను. ఒకవేపు ‘బతికిన కాలేజీ’, మరోవేపు ‘రామరాజ్యానికి రహదారి ‘నన్ను ఇప్పటికీ అవహించి ఉన్నాయి. సరే ‘గాలివాన’, ‘పడవ ప్రయాణం’ ఉండనే వున్నాయి. ఇహ కబుర్లకేం కొదవా?
వాళ్ల నాన్నగారితో ఆమె అనుబంధం, ఆయన సినిమాలు, చక్రపాణి, బి.ఎన్. రెడ్డి, దాసరి నారాయణరావు, బాపూరమణలు, సినీరంగంలో ఉంటూనే పద్మంలా ఆ మకిలి అంటకుండా ఆయన బతికిన వైనం, ఆ జీవితంలో ఆయన కుటుంబం అనుభవించిన సంతోషవిచారాలు, సీతగారి కుటుంబం, తన మీడియా జర్నలిస్టు జీవితం, స్వర్గీయ మలయాళీ భర్త, ఈశాన్య భారతానికి చెందిన ఆమె కోడలు, మా కుటుంబంలోని మలయాళీ ఉన్నిక్రిష్ణన్, తమిళ ఒరియా కోడలు సురభి, అభిరుచులు, ఆలోచనలు, దృక్పథాలు, జీవితం- ఇవన్నీ ఆ అరగంటలో మాట్లాడేశామా? ఔను – మాట్లాడుకున్నాం!!
అనుకొన్న పనులన్నీ అనుకొన్న దానికన్నా బహు చక్కగా జరిగాయన్న గొప్ప సంతోషంతో ఆరింటికి గెస్ట్హౌస్ కు చేరితే ఓ పక్కన నిలబెట్టి ఉన్న మా ఏక్టివా నిలదీసింది- ‘పదిరోజులన్నావు, నన్ను వదలనన్నావు. మూడోనాడే టాక్సీలూ, ఆటోలూ అంటూ తిరిగేశావు… నీకిది భావ్యమా? చెన్నై నగరంలో నీకు నేను తగనా?’
కొంచెం సిగ్గనిపించింది. ఎందుకలా చేశానా అనిపించింది. దాన్ని సముదాయిద్దామని స్టాండు తీసి ఓ పదినిమిషాలు ఆ అశోక్ నగర్లోనే చక్కర్లు కొట్టి వచ్చాను. మరో గంట లక్ష్మికీ, ఉన్నికీ, బాబు సన్నీకీ, పాండిచ్చేరి రామకృష్ణకూ, మద్రాసు హోస్టులకూ ఫోన్లు…
*








Add comment