నేను బళ్ళో చదువుకునేప్పుడు ఇంట్లో బడి పుస్తకాలెప్పుడూ చదవలేదు. నవలలు తప్ప. అలా చాలా సంవత్సరాలు సాగింది. తర్వాత వో పదేళ్ళు సాఫ్ట్వేర్ పుస్తకాలు చదివా, మిగతావన్నీ మానేసి. ఆ తర్వాత కొన్నేళ్ళు ఆధ్యాత్మిక పుస్తకాలు, మళ్ళీ మిగతావన్నీ మానేసి. నా టీనేజిలో నేనూ మా చిన్నన్నా నాస్తికులమే. గుడికి కూడా వెళ్ళే వాళ్ళం కాదు. తర్వాత ఇద్దరమూ వేరువేరు సమయాల్లో అటునుంచి ఇటు వచ్చాం.
ఈ ఇంట్రో తర్వాత ఇది చెప్పొచ్చు. నేను అన్నీ చదువుతాను, వింటాను. అది నచ్చితే కొనసాగడం, లేదంటే పక్కకు తప్పుకోవడం. తప్ప విపరీతమైన భక్తి, లేదా భయంకరమైన వ్యతిరేకత రెండూ లేవు. ముఖ్యంగా నన్ను నేను అర్థం చేసుకోవడం కోసమే ఈ ప్రయాణమంతా. ఎన్ని జీవితాల కాలం పడుతుందో తెలీదు. అవును, నేను పునర్జన్మలుంటాయని నమ్ముతాను. యెలాగ, యెప్పుడు అన్నది కచ్చితంగా గుర్తు రావడం లేదు గాని నా దృష్టిలో దాదా భగవాన్ గారి తాత్త్వికత వచ్చింది.
1908 లో అంబాలాల్ మూళజీభాయ్ పటేల్ గా పుట్టిన ఈయన తర్వాత దాదా భగవాన్ గా పేరు పొందారు. పేరులో భగవాన్ వున్నా, తను దేవుడు కాదని అందరిలో వున్నట్టే తనలోనూ దైవం వుందనీ, తను కూడా దేవుడిని మొక్కుతాడనీ ఆయన పలు మార్లు చెప్పుకున్నారు. వైష్ణవుల కుటుంబంలో పుట్టిన ఇతని మీద తల్లి ప్రభావం చాలా వుంది. ఆమె కారణంగానే చాలా చిన్న వయసులోనే అతనిలో కరుణ, సహిష్ణుత, అహింస లాంటి భావనలు వేళ్ళూనాయి. హీరాబా తో వివాహం అయ్యింది, ఇద్దరు పిల్లలు పుట్టి పోయారు. అదే సమయంలో గాంధి గారికి మల్లేనే ఈయన కూడా జైన ముని శ్రీమద్ రాజచంద్ర ప్రభావంలో పడ్డారు. బొంబాయిలోని వొక కంపెనీలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఈయనకు అలౌకిక జ్ఞానం 1958 లో సూరత్ రైలు స్టేషన్లో వచ్చిందంటారు. ఒక సాయంత్రం యేడు గంటలకు కాస్త ముందు, ఆయన మూడో నెంబరు ప్లాట్ఫార్మ్ లో బెంచీ మీద కూర్చుని రైలు గురించి నిరీక్షిస్తున్నప్పుడు ఏదో దైవిక మార్పు జరిగినట్టనిపించి అతనికి అప్పటిదాకా అందని జ్ఞానమేదో అందిందిట. అలా ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టిన అతన్ని చుట్టాలు, స్నేహితులూ దాదా (అంటే తాత) భగవాన్ అని పిలవడం మొదలు పెట్టారు. అయితే ఆయనకి యెప్పుడూ వొక విషయం గమనంలో వుండేది, తన శరీరాన్ని పటేల్ పేరుతో, ఆత్మను దాదా బగవాన్ పేరుతో వ్యవహరిచడం. రెంటినీ వేరువేరుగా చూడటం.
ఆయన చెప్పేది ఏమిటంటే ఈ దేశాన్ని వివిధ మతాల్గా విడగొట్టడమే కాకుండా ఇక్కడి మంత్రాలను కూడా విరిచేశారు అని. ఆయన మూడింటినీ కలిపి వొకే మంత్రంగా చేశాడు. ఓం నమశ్శివాయ, ఓం భగవతే వాసుదేవాయ లను జైనుల నవకార మంత్రంతో కలపడం ద్వారా. గుజరాత్ లోని అడాలజాలో ఆయన త్రిమందిర్ కట్టించాడు. అందులో శివ, విష్ణువులతో పాటు తీర్థంకరుల విగ్రహాలు కూడా వుంటాయి.
మామూలుగా మనం మన కర్మలను కర్మ ఫలం అనుభవిస్తూ క్షయం చేసుకుంటూ, మరో పక్క కొత్త కర్మలు ప్రోది చేసుకోకుండా వుండడం వలన సమకిత జ్ఞానం పొందగలము. కాని అది చాలా కష్టమైన ప్రక్రియ. ఎన్నో జన్మలు పడుతుంది. దాదా చేసినదేమిటంటే తాను ప్రారంభించిన జ్ఞాన విధి లో వచ్చిన వాళ్ళకు మొదటి నుంచే తాము శరీరంతో కాకుండా ఆత్మతో అభేదమును గుర్తించడం నేర్పుతారు. అంటే తన గురించి తను మనసులో అనుకున్నా, ఇతరులతో చెప్పినా శరీరానికి వున్న పేరుతో వ్యవహరించడం. అంటే ప్రతి క్షణమూ తాను ఆ శరీరం కాదు, ఎప్పటికీ నాశనమవని ఆత్మ అన్న్ ఎరుక తో వుండడం. ఆయన చెప్పిన అయిదు ఆజ్ఞలలో ఇది ముఖ్యం. ఎల్లప్పుడూ ఆ అయిదు ఆజ్ఞలలో వున్నట్లైతే ముందు దారి సులభం అవుతుంది. మిగతా ఆజ్ఞలు ముందు ముందు చెబుతాను.
ఆయనకు జైనంలో ముఖ్యంగా ఆకర్షించింది అహింస, ప్రతికమణ్ లు. అహింస గురించి అందరికీ తెలిసిందే. గాందీ గారు శ్రీమద్ రాజచంద్రజి నుంచి ప్రేరణ పొంది అహింసను తన చేతికర్రగా మార్చుకున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్, రాజస్థాన్ లలో జైనం యెక్కువ వ్యాపించింది. గుజరాత్ లో హిందువులు ఎక్కువ అయినప్పటికీ వారు కూడా జైనం ప్రభావం లో వుండడం చేత మీకు అక్కడ మాంసాహారం ఎక్కువ కనబడదు. జైనంలో అహింస పేరుతో చాలా కఠినమైన ఆచరణే వున్నది. అదంతా పాటించడం సామాన్యుడికి కష్టమే. అందులోంచి దాదా గారు తీసుకున్న ఒక అంశం మనుషులు మనుషులతో ఎలా వ్యవహరిస్తారూ అన్నది. చిన్న చిన్న సూక్ష్మ క్రిములను మనం తెలియక కష్ట పెట్టో, చంపి వేస్తో వుంటాము. కాని ఇంతెత్తు మనిషిని మనం శారీరికంగానో, మానసికంగానో బాధ పెడుతుంటాము కదా. అది తెలియక జరిగినది అని చెప్పడానికి లేదు. కనీసం దాని మీద దృష్టి పెట్టినా చాలా కర్మలు నివారించవచ్చు. జైనం అనేది ఏమిటంటే మనం ఏ చర్య చేసినా కొంత అతిక్రమణ (overstepping,tresspass) జరుగుతుంది. ఫలితంగా ఎదుటి మనిషిని (జీవిని) కష్టపెడుతున్నాము. కాబట్టి దాన్ని గుర్తించి ప్రతికమణ్ (retract) చేసుకోవడం. అంటే మరేం లేదు, ఆ మనిషిని కలిసి తన వల్ల జరిగిన దానికి క్షమాపణలు కోరడం, కనీసం మనసులోనైనా అలా కోరుకోవడం. దీనితో పాటే తను ఇతరుల చర్యల వల్ల బాధ పడిన సందర్భాలలో మనసులోనే వారిని క్షమించడం. క్షమించడం వీరత్వం కదా. ఇక మూడవది ప్రత్యాఖ్యాన్. మనం మనిషి జన్మ ఎత్తాము, ఏవేవో కారణాల చేత మనవల్ల ఇతరులను బాధపెట్టే సంఘటనలు ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నంగానో జరుగుతూనే వుంటాయి. కాబట్టి దేవుడిని తను అలాంటి మార్గం లో సంచరించకుండా, అతిక్రమణలు తప్పించుకుంటూ నడిచే శక్తినివ్వమని కోరడం. ఈ మూడు మిగతా ఆజ్ఞలు.
ఆయన అనంతరం నిరూమా సత్ సంగ్ లు నిర్వహించడం, జ్ఞాన విధి నిర్వహించడం చేశారు. ఆమె చదువుకున్నది మెడిసిన్. కాని ఆధ్యాత్మికం లో పడిపోయి 2006 లో చనిపోయే దాకా ఈ పని చేశారు. జైనులు ఏడాదికి వొకసారి సాంవత్సరిక్ (వార్షిక) ప్రతికమణ్ చేస్తారు. అది చాలా విస్తారంగా వుంటుంది. సృష్టిలోని ఏకకణ జీవి నుంచి పంచేంద్రియాలు వున్న జీవులూ మనుషులూ దేవతల వరకూ అందరినీ క్షమాపణలు కోరడం. పర్యూషణ్ అనే ఎనిమిది రోజుల పర్వాంతాన వస్తుంది ఇది. అదే రోజు వినాయక చవితి కూడా. నిరూమా ఆటపట్టిస్తూ అంటారు, ఈ జైనులు ఏడాదికి వొకసారి ప్రతికమణ్ చేసి చేతులు దులుపుకుంటారు. అది కాదు కదా పధ్ధతి. జైనం లో కూడా దైనిక ప్రతికమణ్ చేయమని వుంది. మనం లేచిన సమయాన వొకసారి; పడుకునే ముందు వొకసారి చెయ్యాల్సిన ప్రార్థన కదా ఇది. పడుకునే ముందు ఈ రోజు నా వల్ల ఎవరైనా గాయపడ్డారా, భంగపడ్డారా, కష్టపెట్టుకున్నారా అని వొకసారి ఆలోచించుకుని ఆయా వ్యక్తులకు మనసులోనే క్షమాపణలు కోరుకుంటూ, ఇలాంటి పొరపాటు తనవల్ల ఇక జరగకుండా వుండేట్లు తగిన శక్తినివ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థించి తర్వాతే నిద్రపోవాలి. నిజమైన ప్రతికమణ్ అంటే ఇదే కదా.
ఆమె మరణానంతరం దీపక్ భాయ్ దేశాయ్ గారు ఆ పనిని కొనసాగించారు. వీళ్ళిద్దరి సత్సంగాలు నేను వీడియోలలో, టీవీలో చూశాను. నన్ను బాగా ఆకర్షించి గుర్తుండిపోయే ఒక నిరూమా సత్సంగ్ వుంది. అందులో ఆమె అందరినీ ఉద్దేశించి అంటారు, మన ఇళ్ళల్లో అత్తా కోడళ్ళ మధ్య ఎక్కువ సంఘర్షణ వుంటుంది. ఇద్దరూ వొకరినొకరు బాధలు పెడతారు, అవమానం పాలు చేస్తారు వగైరా. ఈ కర్మలు వాళ్ళను వీడవు. అవి తర్వాతి జన్మలలో కూడా వెంటాడతాయి. దానికి బదులు తామిద్దరమూ శరీరం కారణంగా వచహ్చిన ఈ అనుబంధాన్ని పక్కకు పెట్టి ఇద్దరి ఆత్మిక బంధాన్ని గమనంలో పెట్టుకుని వొకరినొకరు క్షమించి, కాళ్ళకుమొక్కి క్షమాపణలు కోరి ఆ కర్మలేవో ఇక్కడితోనే స్వస్తి చెబితే, ముందు దారి సుగమం కాదా. అలాగే దీపక్ భాయ్ సంతంగాలు కూడా నచ్చుతాయి. వొకసారి వొకరు అడుగుతారు స్వధర్మాన్ని ఆచరించడం, పరధర్మాన్ని గౌరవించడం అంటే ఏమిటి అని. దానికి ఆయన చెప్పినది నాకు బాగా నచ్చింది. నిన్ను నువ్వు నీ ఆత్మతో గనుక గుర్తిస్తే ఆ ఆత్మపరమైన ధర్మం నీ స్వధర్మం. అలాగే నువ్వు నీ శరీరంతో, శరీర కారణంగా తలెత్తిన అనేక కర్మలతో నిన్ను నువ్వు గుర్తిస్తూ ఆ ధర్మాన్ని పాటిస్తే అదే పరధర్మం. శరీరం తో పుట్టినందుకు ఆ శరీరానికి అవసరమైన ధర్మాలు పాటించాల్సిందే. కాని ఆ వ్యామోహంలో పడరాదు. అవి చేస్తూనే నిరంతరం తాను ఈ శరీరానికి భిన్నమైన వొక అమర ఆత్మ అని గుర్తు పెట్టుకోవాలి. అంతే తప్ప ఈ మతమూ, ఆ మతమూ అని వేరువేరుగా చూడడం కాదు. అలాగే వొక సారి వో రైతు కంట నీరుతో అడుగుతాడు : నేను ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నా. అందులో భాగంగా క్రిమిసమ్హారక మందులు వాడి అసంఖ్యాక క్రిములను చంపుతున్నాను. ఎంత పాపం మూట గట్టుకుంటున్నానో కదా. దానికి దీపక్ భాయ్ చెప్పినది : మనం ఏ పని చేసినా దానివల్ల కొంత మంచి, కొంత చెడు జమిలిగా జరుగుతాయి. మీ చర్యవల్ల ఆ క్రిములు చనిపోవడం వల్ల పాపము, ఎంతో మంది కడుపు నింపుతున్నందుకు పుణ్యమూ మీ ఖాతాలో వస్తుంది. ఇక ఆ పాపాన్ని మీరు గుర్తించారు కాబట్టి, దాన్నుంచి తప్పించుకోవడానికి సేంద్రీయ పధ్ధతులలో వ్యవసాయం వీలవుతుందేమో చూడండి. మనిషి జన్మ అంతిమంగా మొక్షమార్గాన చరించడమే అర్థం. మరి దేవీ దేవతల గుళ్ళకెళ్ళి పూజించడం స్వార్థం కాదా అని వొకరడిగితే, ఆయన సమాధానం : తప్పకుండా గుళ్ళకెళ్ళండి, మొక్కండి, కాని వీలైనంతవరకూ లౌకిక కోరికల చిట్టా తో కాదు. మరీ తప్పనప్పుడు సహాయం అర్థించవచ్చు. కాని ప్రతిసారీ కాదు. కర్మ సిధ్ధాంతం గురించి చెబుతూ ఈ లోకం నడిచేది ఆ సూత్రం ఆధారంగానే. ఈ సృష్టిని ఎవరూ సృష్టించలేదు, ఎవరూ నడపట్లేదు. జీవులు తమ తమ కర్మల అనుగుణంగా తమ గమన్నన్ని నిర్దేశిస్తున్నారు. మరో సారి ఆయన అనేది ఏమిటంటే వొక క్రియ జరగడానికి అవసరమైన పరిస్థితులు అన్నీ అనుకూలించినపుడు మాత్రమే అవుతుంది. ఉదాహరణకి పెరుగు చారు పెట్టాలంటే పెరుగు, నీళ్ళు, ఉప్పు, పొయ్యి, వగైరా ఆన్ని వున్నప్పుడే అది వీలవుతుంది. అదే ఇంద్రజాలం. మరేం కాదు.
ఇలా చెబుతూ పోతే చాలా వుంది. మిగతా జ్ఞాపకాలు మరోసారి.
*
పరేష్ గారూ, జైన తాత్త్వికత దేవుడిని, ఆత్మని విశ్వసిస్తుందా? బౌద్ధం లాగా అనాత్మ వాదం కాదా?
దేవుడు అంటే ముందు నిర్వచనం చెప్పుకోవాలి. సృష్టికర్త, వరాలు శాపాలు, సృష్టిని నడపడం ఇలాంటి నిర్వచనం లేదు. God లేడు godhood ఉంది. ఆత్మ ఉంది. ప్రతి జీవికీ godhood పొందగల potential ఉంది. ఆత్మ refine అవుతూ చివరి జన్మలో తీర్థంకర అనిపించుకుంటుంది. ఆ తర్వాత సిద్ధత్వమే. ఆ తర్వాత రాగద్వేషాలు ఉండవు. తిట్టినా స్తుతించినా స్పందన ఉండదు.
ఈ సృష్టి తనవైన principles మీద నడుస్తుంది. మనిషి జీవితం పూర్తిగా కర్మ సిద్ధాంతం అనుసరించి నడుస్తుంది.