చిలిపి ప్రశ్నలూ-గంభీర జవాబులూ

చిలిపి ప్రశ్నలూ-గంభీర జవాబులూ

ఏం జాతిరా నీది తమ్ముడూ ?
ఓ దళితుణ్ణి  బాబూ !
కాదు కాదు అసలు దేనిలోకొస్తావని ?
మీ తిట్లలోకి వస్తాను
కాలవ తొట్లలోకి వస్తాను
మీరు వేరుగా పెడుతున్న ప్లేట్లలోకి వస్తాను
నువ్వు హిందువుల్లోకి వస్తావనుకుంటున్నాను
వస్తానుగా బాబూ !
మీ ఎన్నికల సమయంలో !
ఏం తింటున్నావు తమ్ముడూ ?
ఓ దళితుడేం తింటాడో అదే బాబూ !
కాదు కాదు అసలేమిటి తింటున్నావని ?
మీతో తన్నులు తింటాను
వడ్డీల భారాలు తింటాను
ఉప్పుతో రొట్టెను తింటాను
మహ అయితే ఊరగాయ నంజుకుంటాను.
నువ్వు కోడి తింటున్నావనుకున్నాను
తింటానుగా బాబూ !
మీ ఎన్నికల సమయంలో !
నీకేం పని దొరికింది తమ్ముడూ ?
ఓ దళితుడికేం దొరుకుతుందో అదే బాబూ !
కాదు కాదు అసలు నీకేం పని దొరికిందని ?
జీవితం నిండుగా దైన్యం
రోజూ మీరొదిలించుకుంటున్న మాలిన్యం
మీలాంటి దొరల కొలువుల్లో దైన్యం.
నీకెన్నో వాగ్దానాలు దొరికాయనుకున్నాను
దొరికాయిగా బాబూ !
మీ ఎన్నికల సమయంలో !
ఏం పని చేస్తున్నావు తమ్ముడూ ?
ఓ దళితుడేం చేయగలడో అదే బాబూ!
కాదు కాదు అసలేం పని చేస్తున్నావని ?
సాయంత్రం వరకూ కార్చుకుంటూ చెమటలు
మీకోసం చెరువుల పూడిక పని నూరు రోజులు
వచ్చే పోయే మీ ఠాకూర్లకు చేస్తూ సలాములు.
నీకేదో పెద్ద పనే దొరికిందనుకున్నాను
దొరికిందిగా బాబూ !
మీకోసం ప్రచారం ఎన్నికల సమయంలో !
హిందీ మూలం: బచ్చాలాల్ ఉన్మేషీ
అనువాదం: ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. 

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • మంచి అనువాదం. మరిన్ని అనువాదాలు ఇలాంటివి చేయమని మనవి…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు