రావిచెట్టు నీడనున్నాడు
రాతి అరుగు జాడనున్నాడు
ఎవరో తానెవ్వరో…
ఎటు నుంచి ఇటకే తెంచెనో
పేరు అడిగితే చెప్పడు
పెదవి తాను విప్పడు
మన పక్కనే నిలబడుతడు,
తానెక్కడో కలలుంటడు
అల్లాజీ, అజ్మీరు కాజీయా…
అరుణాచలములో రమణుడా…
తన ఇల్లు తావు ఎక్కడో.
మన మడిగిన తను జెప్పడు.
హిందువ ముస్లింవా అంటే
సందియము తనకుండదు.
దరికి చేరే వారినెల్ల
తాను దగ్గిర తీస్తడు.
ఎండయిన నీడకు వెతకడు
ఉండే అరుగును వదలడు
కుండపోతకు వెరువడు
కుంపటంచుకు చేరడు
మూడు కాలాలన్నిట
ఏ తేడ చూపకనున్నడు
పేద లైన ముతక దట్టితో
చేరి చెంతన నిలిసిన
అత్తరూ గంధాల ధనికులు
పట్టుతో ఏతెంచిన
మురిపమేమీ చూపడు
మన దర్పమతనికి పట్టదు.
వెండి సెంబుల జలం
ఎవ్వరైన తెచ్చిన
సట్టి ముంతల వంపుకోని
ఇష్టముగ సేవిస్తడు.
పాత్రలకు తానిలువ కట్టడు
పానీయంబులో ఎరకచూస్తడు.
మూట ముడుపులు దెచ్చితే
పని వాటితో ఏమంటడు
కాసులు ముంగిట పోసితే
తిరిగి అవి మనకిస్తడు
కోరే మన కోర్కెలను గాంచి
కాలిదారిలో వెతకమంటడు
సుక్కలను లెక్కిస్తడు
మన చూపులకి ఎడముంటడు
అహంకారం నిడిసినోళ్ళకి
ఆత్మ దర్శనమిస్తడు
కాశీ కాబాలున్న రాయికి
భేదమే లేదంటడు.
పవ్వళించే దూది పరుపుల
పాన్పునూ తానడగడు
వీధి అరుగుమీదనే
గాఢంగ తను నిదురిస్తడు
వెండి వెన్నెల నింగి పండె
నేలపై ఈ గురుని దిండె.
అపరాతిరీలో వేటినో
అదిలించుత వుంటడు
మనము అలికిడి చేస్తే మళ్ళి
మౌనముల మునిగిపోతడు.
తనకు తానే వంటరీగ
తర్క భాషణ చేస్తడు.
ఏ దూప గంధము లేకనే
తన మేను అందగున్నది
నింగిలోని అద్దములే
అతని అంతరంగము
సీకటిలో దీపములే
సూపి సాధువు రూపము
చెంత చేరిన వారి చింత
ఎంతదైనా మాయం
అంతుబట్టని అంతరంగం
బ్రాంతులకు బహుదూరం
మునివేలితో ఆ గాలి పలకన
రాయునేదో మంత్రం
తోటలోని తుమ్మెద
పాటై చుట్టు తిరుగును
ఫలవనము లాడే పక్షులే
తన భుజముపై వాలునో
వేకువ ప్రతి పూట గాలి
పూల రాసుల జల్లును.
గుడిని చూసి వెరవడు.
మసీదు గాంచి మురవడు.
బోధ గురువుల తరువడు
తను బోధలేమి జెప్పడు
సబ్క మాలిక్ ఏక్ అంటూ
సంటిపాపల నవ్వుతాడు.
*








Excellent ..
Amazing
Superb
అచ్చిరం అచ్చిరంలో అంతరంగాన్ని మెరిపించిన పాట 🩵🩵🩵
ఎంత చక్కని భావన,
సర్వేజనా సుఖినోభవంతు🌿💐