గుండె తడి దృశ్యాలు పెద్దింటి కథలు

కొన్ని కథలు మనల్ని కలవరపెడుతాయి. కొన్ని కథలు ఉద్వేగాన్నిస్తాయి. కొన్ని కథలు ఆచరణ వైపుకు దారి చూపుతాయి. కొన్ని కథలు జీవన సంఘర్షణకు నకల్లుగా నిలుస్తాయి. పెద్దింటి అశోక్‌ కుమార్‌ కథలు మాత్రం భీడుబారిన భూముల్లోనే కాదు గుండెల్లో సైతం ఊటను పుట్టించగల సామర్థ్యం గలవి. మనుషుల్లోని గుండె తడి దృశ్యాలకు ‘గుండెలో వాన కతలు’ అద్దం పడుతున్నాయి. రచయిత సామాజికపరమైన పరిశీలనకు మచ్చతునకలు ఈ కథలు. ఉపాధ్యాయుడుగా, రచయితగా, నాటక కర్తగా, మాటల రచయితగా, నటుడిగా, ఒక సామాజిక కార్యకర్తగా విభిన్న కోణాల్లో చిత్రీకరించిన కథల ద్వారా మనకు వైవిద్యభరితమైన రచయితగా పెద్దింటి అశోక్‌ కుమార్‌ మనకు దృశ్యమానం అవుతున్నారు.

ఆయన 1999 నుండి కథారచనలోకి వచ్చారు. ఇప్పటి వరకు 250 కథలకుపైగా రాసారు. వాటిని 8 కథా సంపుటాలుగా వెలువరించారు. భిన్నమైన ఇతివృత్తాలతో కూడిన ఏడు నవలలను, వందకుపైగా సాహితీవ్యాసాలను, నాలుగు నాటకాలను రాసారు. తెలంగాణ గ్రామీణుల బతుకు పోరాటాలకు పెద్దింటి కథలు ఆనవాళ్ళుగా నిలిచాయి. ఆకట్టుకునే శైలి, చక్కటి కథా శిల్పంతో రాసిన కథలను చదవడం వలన పాఠకుల్లో మంచి అనుభూతికి, ఆలోచనలకు ఊపిరిపోస్తున్నాయి.

‘గుండెలో వాన’ కథా సంపుటిలో 20 కథలున్నాయి. ప్రతి కథ కూడా ఒక ప్రత్యేకమైన వస్తువుతో కూడుకుని ఉన్నది. ‘జలగండం’ కథ నీళ్ళ మీద రాపిన నవలా రచయితకు, మనుమడిని కాపాడుకోవాలనే ఒక నానమ్మ ప్రయత్నాన్ని కథనంలో చక్కగా చెప్పుకొస్తారు. జలగండమంటే నీళ్ళల్లో పడి చనిపోవడం కదా అనిపిస్తుంది మనకు. కాని రచయిత అసామాన్యమైన ప్రతిభ మనకిక్కడ అబ్బురపరుస్తుంది. తన భర్తకు జలగండం వుందంటే ఏమో అనుకున్నది కాని నీళ్ళ కోసం బోరుబావులు వేసి, వ్యవసాయం చేసి అప్పులపాలు కావడంతో తీర్చలేక, ఆ అప్పుల్లోనే మునిగి చావడమని తెలిసిందని, చదువుకున్న కొడుక్కు ఉద్యోగం రాకపోయినా, ఊళ్లోకి వచ్చిన కంపెనీలకు భూములను అమ్ముకుంటే వచ్చిన డబ్బులతో చేసిన అప్పులు తీర్చాను. ఈ భూముల్లో వెలిసిన కంపెనీలో కొడుక్కు ఉద్యోగం వచ్చిన కూడా జలగండం వెంటాడుతూనే ఉండేదని, ఫ్యాక్టరీల నుండి వెలువడిన రసాయనాలు తాగే నీళ్ళల్లో కలవడం వలన చనిపోయాడని, జలగండం ఈ రూపంలో వచ్చిందని, ఇప్పుడు తన మనువడికి కూడా జలగండముందని, మీరు రచయిత కాబట్టి ఎట్లా రక్షించుకోవాలో చెప్పండని ఆమె అడుగుతుంది. ఆమె పేరు సుశీల. ఇది సుశీల సమస్య మాత్రమే కాదు ఇది మనందరి సమస్య. తరిగిపోతున్న నీటి వనరులు, పెరుగుతున్న కాలుష్యం నుండి మనుషులను ఎట్ల కాపాడుకోవాలో తెలియని స్థితి వచ్చింది. సమాధానం కోసం వచ్చిన సుశీలకు చెప్పడానికి నీళ్ళ మీద నవల రాసిన రచయిత దగ్గర సమాధానం మాత్రం లేదని కథను ముగిస్తాడు రచయిత. ఇది మనందరం ఎదురుక్కుంటున్న అతి ముఖ్యమైన సమస్య.

ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు పెద్దింటి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడం వలన తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యను చూసి చలించిపోతాడు. మాతృభాషలో బోధన మీద ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నదని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియం ప్రారంభం కాకపోతే పాఠశాలలు మూతపడుతాయనే దిగులతో రాసిన కథ ‘చుక్కలు రాని ఆకాశం’. ఇప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియం తరగతులు మొదలైనవి. ఈ కథలో ఉపాధ్యాయుల మధ్య జరిగిన సంభాషణలు విలువైనవి. ప్రజలు కోరుకున్నది మనము ఇవ్వాలే కానీ పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదని అనుకుంటారు. ఏదిఏమైన కానీ గొప్ప సమాజాన్ని నిర్మించాల్సిన తరగది గది వెలవెలబోవడం పట్ల ఆవేదన చెందుతారు. ‘పురుగు’ కథను కూడా ఉపాధ్యాయుల గూర్చే రాసారు. ఒక కథలో ఉపాధ్యాయుడు పిల్లల కోసం తాపత్రయ పడుతుంటే ఈ కథలో పాఠం చెప్పాల్సిన సమయంలో వ్యక్తిగతమైన లావాదేవిలతో గడుపుతున్న సమయాన్ని వివరిస్తారు. వృత్తి ధర్మంలోని తేడాను గమనిస్తాము మనము. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రభుత్వమే అందించాలనే ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కథ ‘కొత్తసాలు’. ఈ కథ వర్తమాన పరిస్థితులకు అద్దంపట్టిన కథ.

‘కొన్ని చేపలు ఒక గాలం’ కథలో రోజు ఎండలో కంకులు కాల్చుకుంటు జీవితీస్తున్న వాళ్ళు ఆర్థికంగా ఎట్లా మోసపోతున్నారో, వీళ్ళ యొక్క అమాయకత్వంతో వ్యాపారం చేస్తున్న వాళ్ళ గుట్టును విప్పిచెప్పిన కథ ఇది. ఈ సంపుటిలోని మరో మంచి కథ ‘ఆకలి’. వజ్రమ్మ ఒక అనాధ వృద్దురాలు. ఆమె ఇంటి పక్కనే ఒక ఉపాధ్యాయుని కుటుంబం ఉంటుంది. ఆ వృద్ధురాలు వాళ్ళ ఇంటికి వచ్చి అతని భార్యతో మాట్లాడుతుంటే జాగ్రత్తగా ఉండాలని అంటాడు. ఆమె ఎప్పుడు నోరు తెరిచి ఇది కావాలి అని అడుగదు. వాళ్ళ ఇంట్లో నుండి వచ్చే వాసనలకు వజ్రమ్మ ఆకలి పెరుగుతుంది. వాళ్ళు కూడా ఎప్పుడు ఆమెకు పెట్టరు. ఒకసారి ఆ ఉపాధ్యాయుడు పటాన్‌కోట్‌కు వెళ్ళుతాడు. మధ్యలో తుఫాను వలన రైలు ఆగిపోతుంది. ఎక్కడ తినడానికి దొరకదు. విజ్ఞానయాత్రకు వెళ్ళిన విద్యార్థులకు, బాధ్యతగా తీసుకెళ్ళిన ఉపాధ్యాయలు ఎప్పటికప్పుడు భోజనాలు అందిస్తుంటారు. వాళ్ళతో మాటలు కలిపినా కూడా అతనికి భోజనం దొరకదు. ఆకలి బాధను అనుభవిస్తాడు.ఆ సయమంలో ముసలమ్మ బాధ గుర్తుకు వస్తుంది. తాను చేసిన తప్పేమిటో అతనికి అర్థం అవుతుంది. ఇంటికి రాగానే ఆమె కోసం చికెన్‌ తెచ్చి భార్యతో వండిస్తాడు. స్వయంగా తానే తీసికెళ్ళి ఆ ముసలమ్మకు ఇస్తాడు. ఆమె వద్దని అంటుంది. తెల్లారే సరికి  ముసలమ్మ చనిపోతుంది. తాను ఇచ్చిన క్వారియర్‌ మూత కూడా ఆమె తీయదు. ఆకలికి మించిన రోగం ఏముంటుంది. ఆకలి తీర్చుకోవడానికి మనిషి దేనికైన దిగజారుతాడని చెప్పిన కథ. కొందరు మాత్రం ఆత్మాభిమానంతో చావనైన చస్తారు కాని చేతులు మాత్రం చాచరని చెప్పకనే చెప్పిన కథిది.

ఈ సంపుటికి పేరు పెట్టిన కథ ‘గుండెలో వాన’. నిజంగానే ఈ కథను చదివితే గుండెలో దు:ఖపు వాన కురవాల్సిందే. సహజసిద్ధమైన సాదాసీదా పాత్రలతో నడిపించిన కథ. ఒకరు బట్టలు కుట్టేవారు. మరొకరు  కుట్టించుకునే ఆమె. అంతే వాళ్ళ రోజువారి జీవితంలోని సంఘటనలే ఈ కథ. తెలంగాణ పల్లెల్లోని వ్యవసాయ కుటుంబాలు వాణిజ్య పంటలు వేసి, వాటికి గిట్టుబాటు ధరలు రాక, కాలం కలిసిరాక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారు పెద్దింటి. బతుకమ్మ పండుగకు కుట్టించుకున్న చీర, జాకెట్టు అక్క శవం మీదికి పోతాయి. ‘ఎవుసలంల మన్ను వడ. ఆర్నెలు జేత్తె ముల్లు గట్టె మిగులక పాయె. బిడ్డ అరిగోస ఎల్లదీసె. వానల మన్నువాడ, నిన్న వాన గొట్టకపోతె ఇంత బెంగట్లిలక పోవు. పత్తి వెట్టి పత్తి వెట్టి పత్తి మందే తాగి సచ్చె. మన గతి ఎంతకుందో..’ అన్న మాటలు నేటి రైతుల దుస్థితిని తెలియజేస్తున్నాయి.

ఇంకా ఈ సంపుటిలో ‘నింద, చీమా చీమా ఎందుకు పుట్టావ్‌, ఈ పాప(ం) ఎవరిదీ?, దారి చూపినవాడు, బిందెడు నీళ్ళు, ప్లాసెంటా, మర మనిషి, దగడు, ఆనాటి వానచినుకులు, స్కావెంజర్‌, తీపి చావు, మూడోకన్ను, ఇప్పుడే అందిన వార్త, ఆట’ వంటి అలోచనీయమైన కథలున్నాయి. ప్రసిద్ధ కథకులు శిరంశెట్టి కాంతారావు గారు ‘వర్తమాన సమస్యల వాస్తవ దృశ్యాలను పట్టిచూపే కథలు’ అని అర్థవంతమైన ముందుమాటను రాసారు. పెద్దింటి కథాసాహిత్యంపై తన అభిప్రాయాన్ని ఈ వాక్యాల్లో వ్యక్తం చేశారు. ‘ఉపాధ్యాయుడంటే కేవలం తరగతి గదిలో నాలుగ్గోడల  మధ్య పిల్లలకు పాఠాలు బోధించడం మాత్రమే కాదు. సమాజ రుగ్మతలను గుర్తించాలి. వాటి నుండి ఏ విధంగా బయటపడాలో ప్రజలకు వివరించాలి. అందుకు సరైన వాహిక సాహిత్యం మాత్రమే. అందుకే పెద్దింటికి సాహిత్యం ప్రవృత్తిగా మారిపోయింది. అందుకే మనం పెద్దింటి వృత్తి ప్రవృత్తులను సమానంగా గౌరవించాల్సి వుంది’.

‘చెట్టంత మనసుతో నిలిచి..చెలిమి నీటి స్వచ్ఛతతో చెలిమి చేసి..ఎదిగినకొద్దీ ఒదిగి స్నేహ పరిమళాలను పంచే..ఆత్మీయ మిత్రులు జి.వి.శ్యాం ప్రసాద్‌ లాల్‌’ గార్కి పెద్దింటి తన ఎనిమిదవ కథా సంపుటి ‘గుండెలో వాన’కథలను అంకితమివ్వడం అభినందనీయమైనది. అందరు చదవాల్సిన ఉత్తమమైన కథా సంపుటిది.

*

గోపగాని రవీందర్‌

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సమీక్ష చాలా బాగుంది. రచయితకు, సమీక్షకుడికి అభినందనలు. తెలంగాణాలో పరిచయం అక్కరలేని పెద్దింటి…. 💐👏🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు