సాయంత్రం స్కూల్ అవ్వగానే నిక్కీని తీసుకుని ఇండియన్ గ్రాసెరీస్ షాప్ కి వెళ్ళాను. ఈ రోజెందుకో గానీ, చాలా మంది జనాలతో వాతావరణం కోలాహలంగా వుంది. నిక్కీ కడుపులో వున్నప్పుడు నా సీమంతానికి వచ్చిన అప్పటి కొలీగ్ ప్రమోద్ షాపులో కనపడ్డాడు. అతను వేరే జాబ్ మారాక, మధ్యలో కొన్నిసార్లు అక్కడక్కడా వేరు వేరు సంధర్భాలలో కలిసాము. జాబ్ కి సంభందించిన టెక్ ఈవెంట్స్ లో, లంచ్ కి ఆఫీస్ కొలీగ్స్ తో వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్ లో కలిసాంగాని, నిక్కీ ఎప్పుడూ పక్కన లేదు. కలసినప్పుడల్లా అనుకునే వాళ్ళం, పెద్దోళ్ళం కలుస్తున్నాం కానీ పాపను చూడడానికి మాత్రం కుదరట్లేదని. అందుకేనెమో మొదటిసారి పాప పక్కనుందన్న ఆనందంలో ప్రమోద్ కి నిక్కీని పరిచయం చేసాను. కోవిడ్ టైం కావడంతో మేం మాస్కులు పెట్టుకున్నాం, కానీ అతను పెట్టుకోలేదు. సో నేనే పలకరించడానికి దగ్గరికెళ్ళాను.
పలకరించగానే ప్రమోద్ నా గొంతుని గుర్తుపట్టాడు. నిక్కీని పరిచయం చేసాను. పాప ఫేస్ కి మాస్క్, బాయ్స్ హెయిర్ కట్, బాగీ పాంట్ వేసుకుని మగరాయుడి వాలకం వుండడంతో పాపవైపు ఒక టైపు నిర్లక్షపు చూపు తనలో తొంగిచూసింది. ప్రమోద్ గురించి నాకు తెలియందేమీకాదు. వాళ్ళావిడతో మాట్లాడే విధానంతోనే తెలిసిపోయేది ఆయన తీరేంటో. తన పేరులో వున్న ఆనందం చుట్టూ వుండనీయడు. ఎంతైనా పాత పరిచయస్తుడే కాబట్టి నిక్కీని పరిచయం చేద్దామని అనుకున్నాను. చూసినవెంటనే…
“పేరేంటి” అని విసురుగానే అడిగాడు నిక్కీని.
“నిఖిత” అని చెప్పింది.
“యేం చదువుతున్నావ్?”
“ఐదు”
“వయసెంత?”
“పది”
“పదేళ్ళా నీకు? మరేంటి ఆరేడేళ్ళ పిల్లలా వున్నావ్ చూస్తుంటే?” అని నా వైపు చూస్తూ నవ్వాడు.
“నాకు గ్రోత్ స్పర్ట్ హిట్ అవ్వలేదు, అయినప్పుడు పెరుగుతా, సో ఆ విషయమై ఇప్పుడు నేను పెద్దగా వర్రీ కాదలచుకోలేదు” అంటూ సమాధానమిచ్చింది స్థిరంగా.
నేనాశ్చర్యంగా చూసా తనని ఆ సమాధానంతో. ప్రమోద్ కు ఇది కొంచెం తల బిరుసు సమాధానంలా అనిపించినట్లుంది.
“గ్రోత్ స్పర్ట్ అని కూర్చోకుండా ఏదైనా బయటకు వెళ్ళి ఆడు, పద్దాక వీడియోగేమ్స్ ఆడుతూ సోఫాల్లో కూర్చోకుండా” అన్నాడు.
నిక్కీ వెంటనే “నేను చాలా గేమ్స్ ఆడతా, బాక్ యార్డ్ లో సాకర్, బయట డ్రైవ్ వే మీద బాస్కెట్ బాల్ హూప్ కూడా వుంది. నేనన్నీ ఆడతా, మా కంపెటిటీవ్ సాకర్ ప్రాక్టీస్ కూడా ఒపెన్ చేసారు, ఇక అవుట్ డోర్ సాకర్ కూడా మొదలవుద్ది” అంటూ పిల్లలకుండే సహజ పంధాలో చెప్పింది.
“సర్లే పద్దాక ఆటలేకాదు బాగా చదువుతున్నావా ఇంతకి” గద్దింపుతో కూడిన ధ్వని.
నాకు చురుక్కుమంది ఆ మాటతో. తనకీ పిల్లలున్నారు, సో ఇక్కడ చదువుల గురించి తెలీయనిదేమీ కాదు. చదువుతున్నావా అంటే చదువుతున్నా అని చెప్తే ఆ సమాధానం సరిపోద్దా ఈయనకి? మళ్ళీ నెక్ట్స్ ఏం అడుగుతాడో అనుకుంటూ షాప్ లో చుట్టూ కలియచూస్తున్నా బోర్ కొట్టి! ముందు పట్టించుకోలేదు గానీ ఇప్పుడాయన బాడీ లాంగ్వేజ్ చూసా, నడుం మీద చేయ్యేసి, కిందికి చూస్తూ పిల్ల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ఇంటారాగేషన్ లా వుంది వ్యవహారం. ఏంటో అనవసరంగా ఈయన్ని పలకరించినట్లున్నా అని నన్ను నేనే తిట్టుకున్నా! సర్లే లోపల కెళ్ళి షాపింగ్ చేద్దాం, మెల్లగా ఈయన్ని వదిలించుకుని అనుకున్నా.
నిక్కీ “బానే చదువుతున్నా గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ స్టుడెంట్స్ క్లాస్ మాది” అంది. నిక్కీ సమాధానంతో ఆయనకెందుకో మండినట్లుంది.
“ఓకే ఓకే. అదిసర్లే. కూచిపూడి డాన్స్ గానీ క్లాసికల్ సింగింగ్ గానీ ఏమన్నా నేర్చుకుంటువ్నావా లేదా ఇంతకీ?” అని ఇంకో ప్రశ్న వదిలాడు.
నాకిక కోపం వచ్చింది. ఏదో ఒకటి నాకు రాదు అనేదాక వదిలేలా లేడు అనిపించింది.
ఇంతలో, “నేర్చుకోవడానికి ట్రై చేసా, టీచర్ ఆటిట్యూడ్ నచ్చక మానేసా” అని నిక్కీ రిప్లై ఇచ్చింది.
“నీకు డాన్స్ చేయడం రాదని చెప్పక, టీచర్ ఆటిట్యూడ్ మీద తోస్తున్నావ్ ఎందుకు?” అని అన్నాడు ప్రమోద్.
అప్పుడింక నేను కల్పించుకోవాల్సి వచ్చింది. నేను వెంటనే అందుకుని “నేను మొదలెట్టానండి తనతోపాటు నేర్చుకోవడం, కోవిడ్ టైంలో ఆన్లైన్ల్ లో నేర్పడం కష్టమయ్యి, డాన్స్ టీచర్ చికాకుపడుతూ, చిన్న పిల్లల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయేలా తిడుతోంది. అది కోల్పోయి మరీ డాన్స్ నేర్చుకోవడం అనవసరం అనిపించి, ఇద్దరమూ మానేసాం” అన్నాను.
నిక్కీకి తెలుగులో చెప్పడం రాకపోయినా బానే అర్థం చేసుకోగలదు. నేనన్న మాటలు విని “నేను చెప్పిన టీచర్ ఆటిట్యూడ్ దీని గురించే” అన్నది.
ఆయన “మీ అమ్మాయి బానే మాటకి మాట చెప్తోంది తొణక్కుండా బెణక్కుండా, మీ ఆయన తెలివితేటలు, మాటలు వచ్చినట్లున్నాయ్” అన్నాడు.
నేనిక బై చెప్పి కదులుదాం అనుకునేలోపే తనే “సరే మరి బై, నెక్స్ట్ టైం కనపడ్డప్పుడు పొడుగవ్వాలి సరేనా” అని ఒక యెటకారపు నవ్వు నవ్వాడు.
నీకో దండం నాయనా, ఇంతకు ముందెప్పుడు పిల్లకి నువ్వు కలవక పోవడం మేం చేసుకున్న అదృష్టం అనుకుని, షాషింగ్ కి ఆయన వెళ్తున్న సైడ్ కి కాకుండా వేరే వైపుకెళ్ళా, ఎందుకులే గోల అని.
కావల్సినవన్నీ కొనుక్కుని, బిల్లింగ్ కూడా చేయించుకుని, ఇద్దరం గ్రోసరీ స్టోర్ లోనే వుండే కాఫెటేరియాలోకి వెళ్ళాం. అక్కడ సీజనల్ గా దొరికే వాటితో ఫ్రెష్ గా చేసిచ్చే షుగర్ కేన్ జ్యూస్, మాంగో జ్యూస్, సపోటా జ్యూస్ దొరుకుతాయి. ఎగ్ లెస్ కేకులు, పేస్టీలు, జిలేబీలు చాలా ఇష్టం నిక్కీకి. మా మూడ్ పట్టి, బయటి వాతావరణం బట్టి టీ నో, బజ్జీలో, పునుగులో, చికెన్ 65 లాంటివో తింటుంటాం. నిక్కీ తన స్కూల్ కబుర్లను చెప్తుంటే వినడం, నేనూ మా కాలేజీ కబుర్లు, తనకర్థమయ్యే లెవల్ ముచ్చట్లు మాట్లాడుకోవడం, ఓ సరదా! చాలా నచ్చుతుంది నాకు తనతో గడిపే ఈ టైం.
ఆడ పిల్లలు టీనేజ్ లో ఆమడ దూరంలో వుంటారు. చిన్నప్పుడే మనతో వాళ్ళు టైం స్పెండ్ చేసేది అంటుంటారు కొంచెం పెద్ద పిల్లల్లున్న ఫ్రెండ్స్. వాళ్ళనే మాటలు వినడానికి భయంగా, నిజం కాకపోతే బాగుండు మనసులో అనుకున్నా, సరే ఇవేనేమో మనకుండే మంచి జ్ఞాపకాలు అని నేనూ ఇష్టంగా కుదిరినప్పుడల్లా తనని నాతో తిప్పుకుంటూ వుంటాను. ఏదో మాట్లాడుకుంటూ లైన్లో నిలబడి అప్పడే వేడి వేడిగా వేసి అమ్మకానికుంచిన ట్రేలో నింపుతున్న ఆనియన్ సమోసా చూసి నోరూరింది ఇద్దరికి. వాటి ఆర్డర్ చేసి, టీ ని తీసుకుని మెల్లగా జనాలు లేని టేబుల్ దగ్గర కూర్చున్నాం ఇద్దరం. మాస్కులు తీసి పక్కన బెట్టి , అక్కడ పెట్టిన హాండ్ సానిటైజర్ తో చేతులు తుడుచుకున్నాం.
ఏవరో నా వైపు చూస్తున్నారనిపిస్తే తిరిగి చూసాను. ఏదో ఆర్డర్ చేసి తినేసి వెళ్తున్న ప్రమోద్ మావైపే చూస్తున్నాడు. ఏదో మొహమాటానికి నవ్వా, మళ్ళీ మాట్లాడే ఉద్ధేశమేమీ లేదు. కానీ ఆయన మా వైపే వస్తున్నాడు. అబ్బా అనవసరంగా నవ్వానేమో అనిపించింది. ఎందుకొస్తున్నాడు? అవసరమా మళ్ళీ సోది తనతో అని సమోసా చేతిలోకి తీసుకుని తలొంచుకుని తినడం మొదలెట్టా. కనీసం తింటున్నాం అని వదిలేస్తాస్తాడేమోలే అనుకున్నా. అయినా వచ్చాడు. అతడు మా వైపే రావడం చూసి, నిక్కీ సమోసా తింటున్నది కాస్తా లేచి, దూరంగా పెట్టిన పేపర్ నాప్కిన్ తేవడానికి వెళ్ళింది.
తను దగ్గరికి రాగానే పాప లేచెల్లిపోవడంతో ప్రమోద్ కి మళ్ళీ ఎలా మాటలు మొదలెట్టాలో తెలీక ‘ఓహ్ ఆనియన్ సమోసానా, ఇందాక నేను ఆర్డర్ చేసేటప్పటికి ఇవి లేవు’ అన్నాడు. మామూలుగా ఐతే బానే మాట్లాడేదాన్నే కాని ఇప్పుడు ఈయన్ని చూస్తే భయంగా వుంది. ఏం మాట్లాడతాడో, ఏం అడుగుతాడో అని. నిక్కీకి కూడా ఈయన నచ్చలేదనుకుంటా, అందుకే అవాయిడ్ చేస్తోంది.
‘వేస్తున్నారు వేడిగా, వెళ్ళి తెచ్చుకోండి’ అన్నా వదిలించుకోవడానికి. అతను నిజంగానే కౌంటర్ వైపు వెళ్ళి ఎదో అడుగుతున్నాదు. నిక్కీ ‘ఇక వెళ్దామా?’ అని అడిగింది, ఆయన అలా వెనక్కి తిరగ్గానే. సర్లే టీ కార్ లో తాగుదాం అని గ్రాసెరీలు పెట్టుకున్న కార్ట్ తీసుకుని బయటకొచ్చాం.
అన్నీ కార్ లో సర్దేసాక నిక్కీ చపాతీల గురించి గుర్తుచేసింది. ఫ్రెష్ గా చేసిస్తాం మీరు తినే లోపులో అన్నారు. సరేనని డబ్బులు కట్టేసాం. కాని ఆ విషయమే మర్చిపోయి బయటికి వచ్చేసాం. సో ఇక తప్పక మళ్ళీ లోపలికి వెళ్ళాల్సివచ్చింది. నిక్కీ నన్ను ఫాలో అయ్యింది. చపాతీలు తీసుకుని వెళ్తుంటే తనే మళ్ళీ ఎదురుపడ్డాడు.
నా పక్కన మాస్క్ లేని నిక్కీని చూసి ‘ఒహ్ నీకు మీసాలు కూడా వున్నాయా మొగోళ్ళలా’ అన్నాడు.
నేనద్దిరిపడ్డా ఆ మాటతో.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం మా ముగ్గురి మధ్యలో. నిక్కీ వెంటనే తేరుకుని ‘ఐ నో, బట్ ఐ డోంట్ కేర్’ అంటూ మామూలుగా కార్ వైపు నడవడం మొదలెట్టింది.
నేను అప్రయత్నంగా నిక్కీని ఫాలో అయ్యా! ఎందుకు నా మైండ్ బ్లాంక్ అయ్యిందో తెలీదు. ఆల్రెడీ ఆయనంటే చికాగ్గా వున్న నాకు ఆ ప్రశ్నతో, కోపంతో కూడిన నిరాశ ఆవహించింది. భాధ, విసుగు తోపాటు ఎన్ని దశాబ్దాలైనా ఈ దరిద్రం పోదా అన్న నిస్సహాయత. మంచి చదువు చదివి, అమెరికా వచ్చినా, జనాలు ఇంకా ఈ దిగజారుడు మాటలు ఆపరా ఇక? రకరకాల భావాలు తిరిగాయి ఒకేసారి బుర్రలో. కారులోకి ఎలా వచ్చిపడిడానో తెలీదుకానీ మెల్లగా కురుదుకున్నా.
వెంటనే ఎదిరించి ఏమీ అననందుకు, బుర్ర స్తబ్దుగా అయినందుకు నా మీద నాకే కోపంగా వుంది. ఆలస్యం చేయకుండా కారులో వెనక్కి తిరిగి నిక్కీ మొహం చూసా. తను సీట్ బెల్ట్ పెట్టుకుని రెడీగా వుంది, ఏంటీ ఆలస్యం ఇంకా కారెందుకు స్టార్ట్ చేయట్లేదు అన్నట్లుంది తన చూపు. ఎందుకో కళ్ళళ్ళో కళ్ళు పెట్టి చూడాలంటే ఇబ్బందిగా వుంది. తల్లిగా తనకోసం పోరాడలేదన్న అపరాధ భావన నాలో. తల్లి నిస్సహాయంగా చూస్తుంటే పదేళ్ళ పిల్ల తన ఆత్మాభిమానం కోసం తన యుద్ధం తనే చేసుకుని వచ్చిందనిపించింది.
చిన్నపిల్లతో అలాంటి మాటలేటండి అని కనీసం అనకుండా, ఎందుకలా చూస్తుండి పోయానో తెలీదు. లేచెళ్ళి తన పక్కన సీట్ కూర్చొని, నిక్కీ వైపు చూసా. తన మనసులో ఏముందో తెలీదుగాని బయటికి యే భావం కనిపించడం లేదు. ఏంటో నామీద నాకే కోపంగా వుంది.
నిక్కీ చేయి పట్టుకుని “సారీరా, తన మాటలకి నేనేమీ మాట్లాడకుండా కామ్ గా చూస్తూ వున్నాను. నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడావవు, గ్రేట్. నేను నిన్ను ప్రొటెక్ట్ చేయాల్సింది, కానీ ఏం మాట్లడాలో కూడా తెలీక షాక్ లో వున్నాను” అంటూ మళ్ళోసారి సారీ అని చెప్పాను. తను “పర్లేదు మామ్, నాకూ అలవాటయ్యింది ఇలాంటి మాటలు వినడం. కానీ ఇప్పటివరకు ఇలా అన్నవాళ్ళంతా చిన్న పిల్లలు. సో పర్లేదని పించింది. కాని పెద్దవాడై వుండి, ముందెప్పుడూ పరిచయం లేని మనిషి, ఇలా మాట్లాడితే డిసప్పాయింట్ అయ్యా. దట్స్ ఒకే ఇంటికెళ్దాం పద” అంది. ఎం మాట్లాడాలో అర్థం కాక హగ్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసాను.
డ్రైవ్ చేస్తూ వస్తుంటే దారిలో నా చిన్నతనం అంతా మెదిలింది. నాకు సేం ఇదే ప్రోబ్లెం. మీసాలెంటి, మీసాలేంటి అంటూ ఇదే ప్రశ్న ఎక్కడికెళ్ళినా పెద్దోళ్ళనుంచి చిన్నపిల్లల వరకు. చిన్నపిల్లల కంటే తెలీదు. కానీ పెద్దోళ్ళకెందుకు తెలీదు, కొవ్వు కాకపొతే. నేను ఆ చికాకులో ఎక్కడ షేవ్ చెసుకుంటానో అని, అలా చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయని హెచ్చరించేది తరచుగా అమ్మ. నాన్న గడ్డంలా అవుద్ది అని కూడా ఒకటిరెండు సార్లు భయపెట్టింది. ఆ మాటలతో ఎప్పుడు షేవింగ్ జోలికి పోలేదుగాని, ఏమి చెయ్యాలో పాలుపోయేది కాదు. ఇప్పుడేంటి మా అమ్మ నాకు చెప్పినట్లు, నేను కూడా భయపెట్టలా నిక్కీని? ఎన్ని దశాబ్దాలైనా ఇంక ఇలా తల్లులు కూతుర్లకు చెప్పుకొవాల్సిందే తప్ప పెద్దోళ్ళు ఏమీ మారరా? అని ఆడపిల్లల భవిష్యత్తుపై ఏదో అసంతృప్తి.
ఇంటి కెళ్ళిన వెంటనే జరిగిందంతా చెప్పా మా వారితో అవేశంగా. చెప్పిందంతా విని, “ముందు నుంచి తెలిసిందేగా ప్రమోద్ లూస్ టాక్. అతని గురించి కొత్తగా మాట్లాడుకోవల్సింది ఏముంది? కానీ నిక్కీ ఎలా రియాక్టయ్యింది తన మాటలకు?” అని అడిగాడు. మళ్ళోసారి చెప్పా తనేమనిందో.
ఒక్క క్షణం నిట్టూర్చి, ”అంతే, ఇలా మన పిల్లలని కాన్ఫిడెంట్ గా పెంచుకొవడమే మనం చేయగలిగింది. ఊర్లో వున్న చెత్తంతా మనమే బాగు చేయలేం కదా? మన ఎనెర్జీని ఖర్చు పెట్టాల్సింది ఇలాంటి వాళ్ళ మీద కాదు. మనం మన పిల్లలని ఇలాగే, ఇంకా కుదిరితే మరింత ధైర్యంగా పెంచుకొవడమే మన చేతులో వున్న ఎకైక మార్గం” అన్నాడు.
నిజమే ఇప్పుడు నాకూ తెలుస్తోంది నా ప్రాధాన్యాలేమిటో.
◆ ◆ ◆
చిత్రం: రాజశేఖర్ చంద్రం
చాలా బావుంది. మంచి విషయాన్ని లేవనెత్తారు.
పిల్లలు అంటే చాలామందికి వాళ్ళకేమీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటారు. ఎలాగైనా మాట్లాడవచ్చు అనుకుంటారు. పిల్లలు అత్మాభిమానంతో బదులిస్తే పొగరు అనుకుంటారు.
మీ కథలో నిక్కీ నాకు తెగ నచ్చేసింది!
Thanks ప్రసాద్ గారు. నిజమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళను మొగ్గగానే చిదిమేయడం కొంత మంది పొందే సాడిస్టిక్ ఆనందం. నిక్కి పాత్ర నచ్చినందుకు సంతోషం.
చాలా బాగా రాశారు. రాయడం మీకు కొత్త అంటే నమ్మలేనంత యీజ్ ఉంది కథనంలో. అవతలి మనిషి రూడ్ గా బిహేవ్ చేస్తున్న సందర్భాల్లో కూడా గట్టిగా అడ్డుకోడానికి మన సంస్కారం అడ్డురావడం, అలా సైలెంట్ గా ఉండిపోయినందుకు తర్వాత మనల్ని మనంమ తిట్టుకోవడం చాలాసార్లు జరిగేదే. అది ఒక బలహీనత. కానీ, వాళ్లని వాళ్లు ప్రొటెక్ట్ చేసుకోగలిగే ధైర్యం పిల్లలకి ఇవ్వడం కన్నా గొప్ప బలం ఏముంటుంది. మీనుండి మరిన్ని కథలు ఆశిస్తున్నా. 💐
Thanks Sridhar గారు. మీలాంటి రచయితల కథలు తెగ చదివి చదివి తెలీకుండానే నాకూ రాసేయడం వచ్చిందనుకుంటా.😀 మొహమాటం కంటే ఊహించని ప్రశ్నలు సంధించినప్పుడు మైండ్ మొద్దుబారడం మామూలే ఆ తల్లికి అలవాటు పోయిందిగాని నిక్కీకి అలవాటయ్యి వెంటనే గట్టి సమాధానమిచ్చింది. Of course నిజమే ఒప్పుకుంటా, పెద్దోళ్ళతో అలా మాట్లాడడం నిక్కీ గొప్పతనమేలేండి.
మీరు ఫేస్ బుక్ లో రాసే పోస్ట్ లు చదవటం అలవాటు కదా , కథ కూడా అదే శైలి లో సాగింది. ఇది కాంప్లిమెంట్. ఎందుకంటే ఆసక్తిగా చదివేలా చేయటం మీ శైలి లక్షణం . సో మీ పోస్ట్ లు కూడా కథ లాగే ఆసక్తిగా రాస్తున్నారన్నమాట
మంచి కథాంశమే. ప్రమోద్ లాటి వాళ్లు ఎదురైనపుడు. ఎక్కడా బ్రేక్ కాకుండా కాజువల్ గా మాట్లాడటం బాగా చూపారు.
చివరి లైన్ బాగుంది . కానీ దానికి ముందున్న పేరా అనవసరం. పిల్లలను కాన్ఫిడెన్స్ తో ఉండేటట్టు పెంచుతున్నారని కథలో చెప్పేశారు. అది రిపీట్ కానక్కర లేదు. పాఠకుడికి మీరు చెప్పాలనుకుంది కథ నడకలోనే అందింది . దాన్ని వివరంగా మళ్లీ చెపితే మీరు పాఠకుడిని తక్కువ అంచనా వేస్తున్నారని అర్థం 😀😀
మాట్లాడేటపుడు “ చూశాను” “ రాశాను” అంటాం కదా, రాసేటపుడు కూడా అలాగే రాయండి . “చూసాను” “ రాసాను” అని రాశారు. సా … కాదు , శా .. ని వాడండి
మొదటి కథ బాగుంది . మరిన్ని రాయండి
నిర్దాక్షిణ్యంగా అభిప్రాయం చెప్పమన్నారు కదా అని ఏదో అలా …… 😀😀
Thanks for the compliments Sujatha garu! రాసాను, చూసాను తప్పని నాకూ తెలీదు, వేరే వాళ్ళు కూడా కరెక్ట్ చేయకపోతే తెలీలేదు. ముందు రాసే కథల్లో సరిచేసుకుంటాను. కథాశైలి, పాత్రల గురించి కూడా రేర్కొన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు.
నాకు తెలిసినంతవరకూ సా నే రాయాలి. “చూసాను”
Good. It’s not looking like a story. It’s like sharing some experience.
Thank you Ramesh garu. I will take that as a compliment.
I liked this very much. Can relate to helpless guilt of the mother. But most importantly the self respecting and “no nonsense will be tolerated” attitude was impressive. That’s the way all kids should grow up.
Thank you, Paresh garu. We should be sensible enough to understand kid’s point of view. I’m sure you are a great parent too.
నిజానికి పిల్లల్ని పెంచాల్సిన పద్ధతి ఇదే. మర్యాద, మంచి అంటూ అవసరం లేని వాళ్ళ మాటలు కూడా పడడం, పిల్లలని పడమనటం చాలా తప్పు. వంకర వాళ్ళకి కూడా గౌరవం ఇచ్చి మాట్లాడడం వల్ల, వాళ్ళకి మరింత మందిని ఇలా మాటలతో హింసించే లైసెన్స్ ఇచ్చినట్టే. చాలా బాగుంది అండి మీ కథ. నిజానికి ఒక అనుభవాన్ని పంచుకున్నట్టుగా ఉంది. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో చాలామందికి తెలీదు(కొన్నిసార్లు నేను అలాగే నిశ్చేష్టురాలైపోతా).
Thank you Meena garu! చాలా బాగా చెప్పారు, చిన్నప్పుడు మన టైం లో ఇలాంటి వాళ్ళు మరీ ఎక్కువ వుండే వారు, అప్పటి తో పొల్చుకుంటే ఇప్పడు తక్కువే గాని,లేరని మాత్రం అనలేం. సో పిల్లలను సన్నద్ధం చేయమే మన ముందున్న మార్గం.
కథ చాలా బాగా రాసారు స్వప్నగారు. ఫిజికల్ ఎపియరన్స్ గురించి ఈ రకమైన కామెంట్స్ చేయడమనే ఈ చెత్త వదలదు. నల్లగా లావుగా పొట్టిగా అంటూ దాడి చేస్తారు. పిల్లలలో మీరన్నట్టు కాన్ఫిడెన్స్ నింపాలి.
Liked the way you ended the story
Thanks, Padmavathi gaaru. మా అమ్మ పేరు కూదా పద్మావతే. చాలా బాగా చెప్పారు, చిన్నప్పుడు మన టైం లో ఇలాంటి వాళ్ళు మరీ ఎక్కువ వుండే వారు, అప్పటి తో పొల్చుకుంటే ఇప్పడు తక్కువే గాని,లేరని మాత్రం అనలేం. సో పిల్లలను సన్నద్ధం చేయమే మన ముందున్న మార్గం.
నిక్కీ బలే రిప్లై ఇచ్చింది.పిల్లల్ని గౌరవించాలన్న సంస్కారం కొందరిలో ఉండదు.ఈయన అలాంటి వారే.
Thanks Sai garu! Thanks for the feedback and support!
ఇది ప్రాక్టికల్‌గా జరిగిన సంఘటన అనిపించేలా వుంది మీ చక్కని కథనం. అందుకు అభినందనలు. కానీ, కార్లో తల్లి ఎపాలజెటిక్ ధోరణి విన్న పాప అన్న మాటల్లో, తన వయసుకి మించిన పరిణతి, లోకంపట్ల ఉన్న దృక్పథం ధ్వనించాయి. మంచి కథా వస్తువుని, తగిన కథనశైలితో రాసినందుకు అభినందనలు!
కొన్నిచోట్ల ‘పోద్ది ‘ ‘యెటకారపు ‘ వంటి యాసకు చెందిన ప్రయోగాలూ, టైపోలూ (ఆన్లైన్ల్, అందుకేనెమో, సంభందించిన) కనపడినా, కథలోని విషయం బలమైంది కాబట్టి, వాటిని విస్మరించవలసిందే.
Thank you, Srinivas garu for taking time to write this comment and also pointing out out the typos.
నిక్కి పాత్ర చాలా బాగుంది. నిజంగా మీ పాప గురించి మాట్లాడుతున్నారేమో అనిపించేంత natural గా రాశారు
Thank you, Sir! I take it as a compliment!
Simply good…
Thank you!🙏