కొత్త షూసు

మా నాన్న గురించి మీకు తెలిసిందే కదా, ఒక్కకాడ ఉంటడా?

చిన్నప్పుడు.. అంటే చానా చిన్నప్పుడు నాకు రింగుల జుట్టు ఉండేటిదని మా అమ్మ చెప్తది. రింగుల జుట్టంటే అట్లాంటి ఇట్లాంటిది కాదు. పల్లగ ఇంతింత కుచ్చులెక్క ముఖం నిండ ఉండేటిదంట. ఆబ్కారాయన ఇంటి ముందల ఒరండాల కూసొని ఎర్రటి అంగి మీద, ఇంతింత రింగుల జుట్టేసుకొని దిగిన ఫొటోల మాత్రమే నేను ఆ రింగుల జుట్టు చూసుకున్న గుర్తు. ఆ ఫొటో చూసి మురుస్తుంటి. చిన్నప్పుడు నాకు మా అమ్మోళ్లు తీసిన ఫొటోలు మూడుంటే అందుల ఇదొకటి. ఈ ఫొటో ఆ తర్వాత ఎక్కడ్నో పోయింది. చూసుకుందామన్నా ఆ రింగుల జుట్టు చూస్కుంటానికి లేదిప్పుడు.

అయితే ఆ ఫొటోల నాకు నా రింగుల జుట్టుకంటేగూడ, నేను తొడుక్కున్న ఎర్రటి బూట్లు ఎక్కువిష్టం.

అవి ఎట్లాంటి షూసంటే కింద పీక ఒకటి ఉంటది. నడుస్తుంటే సౌండ్ చేస్తది. ఉరికినమంటే ఇంగంతే. నేను వేసుకున్న ఫస్టు షూసు అదేనని నాకు గుర్తు. దాని తర్వాత స్కూల్లగూడ యూనిఫామ్ ఉండేటిదిగానీ, షూసు ఏస్కోవాలని ఏం లేదు. రబ్బరు చెప్పులే ఏస్కునేది.

స్కూల్‌కి అట్ల పోతుంటమా, వేరే స్కూలోళ్లని చూసి, వాళ్లకు షూసుంటే మనకు కూడా ఉంటే బాగుండె కదా అనుకునేటోడ్ని. ఎందుకో షూసంటే అంత పిచ్చి. ఇంటికెవలన్న షూసేస్కొని వస్తే అటు దిక్కే చూస్తుండె. అవి ఏస్కొని నడవాలని ఉంటుండె. షూసేస్కొని ఫొటో దిగినట్టు, స్టైలు పడ్డట్టు ఎన్నో కలలు కంటుండేటోడ్ని.

నేను పెద్దగయితున్నకొద్దీ షూస్ పిచ్చి అట్ల పెరుగుతనే వచ్చింది. కొనియ్యమని అడుగుదామంటే భయం. మా సదువులు, తిండికే అప్పులు చేసేటంత పేదరికమాయె. ఏమని అడుగుతం?

సినిమాలల్ల హీరోలను చూసి, “ఈళ్లు ఎన్నెన్ని షూసు మారుస్తున్నరో కదా!” అనుకునేటోడ్ని. ఒక్కో సినిమాల హీరో ఎన్ని షూసు ఏసుకున్నడో కూడా లెక్కబెట్టేది.

“అరెయ్, ఇన్ని షూస్ ఎట్ల కొంటున్నరో” అనుకునేది.

అట్ల విచిత్రంగ నా షూసు పిచ్చి పెరుగుతనే ఉన్నదా, ఒకరోజు నేను స్కూల్‌నించి ఇంటికొచ్చేసరికి మా నాన్న నాకోసం కొత్త షూసు తెచ్చిచ్చిండు. అయి మల్ల మామూలు షూసా? రన్నింగ్ షూసు.

“ఎక్కడియే!” అనడిగిన.

“ఎక్కడియి అయితేందిరా!” అన్నడు.

ఏస్కొని చూసిన. కరెక్టుగ సరిపోయినయి. ఆహా!

ఆ షూసు నేను ఎన్ని తీర్ల, ఎన్ని పండుగలకి ఏసుకున్ననో చెప్తేగూడ ఒక కథ అయితది. కానీ నేను ఆ షూసు మా నాన్నకి, మా నాన్ననించి నాకు ఎట్ల వచ్చినయో చెప్పాలి. దానికి మళ్లా మా నాన్న కథకాడికే పోవాలి.

మా నాన్న ఊర్నించి పారిపోయొచ్చి నల్లగొండల ఆబ్కారాయన దగ్గర చేరిండు కదా! ఆ తర్వాత పెండ్లయింది. అమ్మ అదే ఇంట్ల ఆ పని ఈ పని చూస్కుంటుంటే, నాన్న కొండచెల్మ బాయిల నీళ్లు తోడే ఇంకో పని పెట్టుకున్నడు.

కొండచెల్మ బాయంటే నల్లగొండల ఎవ్వల్ని అడిగినా చెప్తరు. తేటగ, తియ్యగ ఉంటయి నీళ్లు. ఎక్కడెక్కడినించో జీపుల క్యాన్లు తెచ్చుకొని మరీ తీస్కపోయేటిది.

ఆ బాయి నించి నీళ్లు తోడి క్యాన్లల్ల నింపి ఇండ్లల్ల పోసుడు మా నాన్న పని. పెద్ద క్యూ ఉండేటిదంట ఆ నీళ్లకోసం. తెల్లారుజామునే లేచిపోయి బాయికాడ నీళ్లు నింపుకొని సైకిల్‌కి కట్టుకొని ఇంటింటికి తిరిగి పోసేటోడు మా నాన్న. అట్ల చేస్తే నెలకు ఇంటికి ఇరవై రూపాయలు. రోజుకి రెండు క్యాన్ల నీళ్లు పొయ్యాలి.

నల్లగొండల్ల పెద్దపెద్దోళ్ల ఇండ్లల్ల మా నాన్నదే నీళ్లు పోసే పని.

ఒకసారి ఎర్రటి ఎండాకాలంల బాయిల నీళ్లు ఎండుకపోయినయి. అడుగు మడుగున ఏవో ఉన్నయంట. లోపలికి దిగితేగానీ నీళ్లు అందవు. కొండచెల్మ బాయికి కొన్ని మెట్లుంటయి. మా నాన్న చిన్నగ ఆ మెట్లమీంచి లోపలికి దిగి నీళ్లు తోడుతున్నడంట. పాకురుబట్టిన మెట్లాయె. దమ్మని జారి అందుల పడ్డడంట. ఏముంది? తుంటి బొక్క ఇరిగిందన్నరంట.

అప్పటికి పెద్దక్క చిన్నది. పెద్దక్కని ఎవలో పాలోలింట్ల ఇడిసిపెట్టి అమ్మ, నాన్న కలిసి ఓ ముప్పై కిలోమీటర్ల అవతల ఒకకాడ పసరు కట్టు కడ్తరంటే అక్కడికి పోయిన్రంట. ఆ ఊరు కనుక్కొని, ఆడ ఉండి కట్టు కట్టిచ్చుకొని మళ్లా నల్లగొండల పడ్తానికి ముప్పు తిప్పలు పడ్డరంట.

పసరు కట్టుతోటి ఊళ్ల దిగిండు. కొన్నిరోజులు ఇంట్లనే ఉన్నడుగానీ, పనిజెయ్యకుంట ఉండలేని మనిషాయె, ఇట్లనే నీళ్లు పోస్తప్పుడు పరిచయమైన వెలిమ దొర దగ్గరికి పోయిండంట.

ఆయనకి ఒక సినిమా టాకీస్ ఉంది. అందులనే అనౌన్స్‌మెంట్ ఇచ్చే రిక్షా తొక్కే పనిల పడ్డడు.

పసరుకట్టు కట్టినంక కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఈయన అదేం పట్టించుకోకపోయేసరికి కాళ్లు కొంచెం వంకరపోయినయి. ఒకసారి ఇట్లనే ఒక పెద్దాయన “మారయ్యా, నీకు హ్యాండీకేప్డ్ పాసిస్తరు, తీస్కో” అంటే డాక్టర్ సర్టిఫికెట్ దగ్గర ఒక రిపోర్ట్ వచ్చిందంట.

“వో మారయ్యా! నువ్వు బతుకుడు కష్టమే” అని ఆడుకున్నడంట దొరవారు. “ఏది, నీకు కాళ్లు ఎట్ల ఇరిగినయో చూపియ్యిరా,”, “కుంటోనివి ఎట్లయినవో చెప్పురా” అని ఆటపట్టించేటిదంట.

అప్పుడే ఎవరో తెలిసినాయన ఒకాయన హైదరాబాద్ ఉస్మానియాల పనిచేస్తడంట. “మారయ్యా, నువ్వేం ఫికరు చెయ్యకు. నేను తీస్కపోత” అని అన్ని ఆయననే చూసుకున్నడంట. ఆపరేషన్ అయ్యింది. కాళ్లకు ఇనుప పట్టీలు కూడా కట్టిన్రంట. నల్లగొండకి తిరిగొచ్చి కొన్ని నెలలు ఇంట్లనే ఉన్నడు.

మా నాన్న గురించి మీకు తెలిసిందే కదా, ఒక్కకాడ ఉంటడా?

“అయ్యో, ఏం చెయ్యకుంటే ఎట్ల ఎల్తది?” అని అందరినీ కాదని మళ్లా పనిల పడ్డడు. అక్కడ, ఇక్కడ పనిచేసి మళ్లా దొరవారి దగ్గరనే సినిమా టాకీస్‌ల గేట్‌ కీపర్‌గ, స్వీపర్‌గ పనికి కుదిరిండు.

ఆ కాలుని పట్టిచ్చుకోలేదు కదా, అది అట్లనే ఉంది. ఒక కాలు కొంచెం ఒంకరుంటది. పాదం నేల మీద ఆనది. సగం పాదం మీదనే నడ్వాలి.

హ్యాండీ కేప్డ్ సర్టిఫికెట్ తెప్పిచ్చుకున్నడు. బస్‌పాసు, రైలు పాసు వచ్చినయి. రైల్ల తిరుపతికి తప్ప ఇంకేడికీ పోలేదుగానీ, బస్సు పాసుని మాత్రం బాగా వాడిండు మా నాన్న.

వికలాంగుల దినోత్సవం మీటింగులు అయితే పోతుంటడు. ఒకసారి అట్లాంటిదే ఒక రోజేదో, మా నాన్న అసోంటోళ్లకు షూసు, మొత్తం కాళ్లు నడ్వనోళ్లకు బండ్లు ఇచ్చిన్రు.

మా నాన్నకి ఇచ్చిన షూసు పాదం మొత్తం నేల మీద పెట్టలేడు కాబట్టి షూసు లోపటనే ఒక ఎత్తు ఉంటది. అది బ్యాలెన్స్ చేస్తదన్నట్టు.

“నీకే ఇచ్చిన్రు కదనే! ఏస్కో ఏమైతది” అని నేనన్న.

“ఎహెయ్. గమ్మత్తు మాట్లాడుతవేంరా. గివి నేనేడ తొడుగుత” అన్నడు.

“నీకే ఇచ్చిన్రు కదనే..”

“నాకే ఇచ్చిన్రులేరా. గీ బూట్లు నేనేడ తొడుగుత? నవ్వుతరు ఎవలన్న చూస్తే!” అని నవ్వి నా చేతుల పెట్టిండు.

నేను ఆ షూసు తీసుకొని లోపట ఎత్తులు తీసి చూసిన్నా, నావే అయిపోయినయి ఆ షూసు.

అయి ఏస్కొనే నా పుట్టినరోజు చేస్కున్న. స్కూల్ల పిల్లలు టీచర్లయ్యే రోజు నేను హెడ్మాస్టరయి కూడ అదే షూసు ఏస్కున్న. ఏదో ఫేర్వెల్ పార్టీకి ఏసుకున్న. ఇంకేదో పెండ్లికి ఏసుకున్న. ఇంకెయ్యొ పండగలప్పుడు ఏసుకున్న. అట్ల ఆ రన్నింగ్ షూసు నేను ఇష్టంగా తొడుక్కున్న ఫస్టు షూసు అసొంటివే.

ఇయ్యాల్టికీ ఎప్పుడు కొత్త షూసు కొన్నా, అయ్యాల మా నాన్న ఆయన కాళ్లకు ఎన్నటికీ తొడగని ఆ రన్నింగ్ షూసే గుర్తొస్తయి. అటెమ్మటే ఎర్ర రంగున్న కీచుమని సౌండ్ చేసే నా ఫస్టు షూసు గుర్తుకొస్తయి. ఆ రింగుల జుట్టున్న ఫొటో ఎప్పటికన్న దొరికితే బాగుండనిపిస్తది.

*

వి. మల్లికార్జున్

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు కథ చెప్పే విధానం లో ఒక్కసారిగా నా బాల్యాన్ని తిరిగి చూసుకున్నాను…మీకు ఆ దేవదేవుడి దీవెనలు ఎప్పుడూ ఉండాలి…

    • నాన్నలందరూ కొడుకుల కోసం చేసే పనులు ప్రతి ఒక్కటీ ఒక కథగా రాయవచ్చు. అలా ప్రతి ఒక కొడుకు ఒక కథ రాయాలి వాళ్ళ నాన్న కోసం. నీ కథ చదువుతుంటే అందులో నేను మా నాన్న మాత్రమే ఉన్నాం మా నాన్న రూపమే కనపడుతుంది వాక్యం మాత్రమే నీది. పొద్దు పొద్దునే అది నూతన సంవత్సరం తొలి రోజు నేను చదివిన తొలి కథ నీదే. నాన్న ని గుర్తుచేసినందుకు నీకు నా ప్రేమ.

  • సరి కొత్త వాగ్దానం మల్లికార్జున, సర్👍!కథ బాగుంది👌..అభినందనలు💐..ఇలాంటి కథ లుఎన్నో రాయాలని ..ఆశిస్తూ..

  • Naku school lo unnappudu library pass undedi, chala books chadivevadini. Nowadays anipistundi enduku Telugu writers/authors popular avatledani. After reading this I get the answer. Ni thapatrayaniki ni work saripovatledu. Maybe you need to learn more about writing. No offense.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు