కూర్మనాథ్ చెప్పిన కోరల కుందేలు కథ!

ఇదే కథ… ఇవాళ వీధి వీధినా!

        19వ శతాబ్దపు బ్రిటిష్ చరిత్రకారుడు లార్డ్ ఆక్టన్ ఒక మంచి మాట చెప్పాడు . అందరికీ తెలిసిందే . “Power tends to corrupt absolute power corrupts absolutely” . ఈ మాట గురించి విశ్లేషించుకోవడానికి చరిత్ర లోకి వెళ్ళవలసిన పని లేదు . మన నిత్యజీవితం లోనే కావలసినన్ని ఉదాహరణలు దొరుకుతాయి . అధికారం ఎక్కడెక్కడ అయితే కేంద్రీకృతం అవుతూ ఉంటుందో అక్కడక్కడ అవినీతి చోటు వెతుక్కుంటూ ఉంటుంది. అధికారం అనగానే అది తప్పనిసరిగా రాజకీయ అధికారం మాత్రమే అవ్వాలని ఏమీ లేదు. ప్రతి మానవ సంబంధం లోనూ ఆ అధికారం సృష్టించే విధ్వంసం ఉంటుంది. ఎంత అధికారం ఉంటే అంత విధ్వంసం సమస్త జీవరాశినీ బానిసలుగా చేస్తుంది. అధికారం కుందేలు పిల్లను కోరలు ఉన్న సింహంగా మార్చగలదు. అధికారం ఒక రజ్జు ను సర్పంగా కూడా మార్చగలదు. నిజానికి అధికారం స్వభావం తెలియక , తెలిసినా మన మన అవసరాల రీత్యా విస్మృతిలోకి నెడుతూ, గుర్తించనట్లు నటిస్తూ, మనం కాలం గడిపేస్తూ ఉంటాము.

కానీ చాలా కొద్దిమంది తమ జీవితాన్ని పణంగా పెట్టి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వుంటారు. అలా చేసే వాళ్ళకి దేశ ద్రోహులు అనే బిరుదులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి వరించడానికి. ఉరితాడును వర మాలగా భావించగలిగిన వాడు కాలం నుదుట పొడిచే పొద్దులా మిగిలిపోతాడు. సమస్త లోభాలకీ లొంగిపోయి, తలవంచి నమస్కరించమంటే, సాష్టాంగ నమస్కారం చేసే వాడు, రాణింపు కొచ్చినా కాలగర్భంలో అనామకంగా కలసిపోతాడు. ఈ ఉపోద్ఘాతమంతా పక్కన ఉంచండి. అసలు అధికారం ముఖ్య లక్షణం ఏమిటంటే, ప్రశ్నను సహించలేకపోవడం. ప్రజాస్వామ్యానికి ప్రశ్న మూలం. కానీ ఆధునిక ప్రజాస్వామ్యాలన్నీ , ఆధునిక నియంతృత్వాలే కనుక అవికూడా ప్రశ్నను సహించవు. కానీ ప్రశ్న చీకటి కడుపును చీల్చుకుని మరీ పుడుతుంది కదా . ప్రశ్నించే స్వేచ్ఛ , వాతావరణం లేనప్పుడు అది ఒక ప్రతీక గా మారుతుంది. అదొక వాదం అవుతుంది.

అప్పుడు ప్రతీకలు మాట్లాడతాయి. ప్రతీకలు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని తాము నిర్వహించవలసిన పని ఏదో తాము నిర్వహిస్తాయి. ఆధునిక ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా వున్నట్టే కనిపిస్తాయి. వాటి మాటలన్నీ ప్రజాస్వామికంగానే వినిపిస్తాయి. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా పనిచేస్తాయి. ప్రశ్నకు స్వాగతం పలుకుతూనే ప్రశ్నించేవాడికి వురి వేస్తాయి. అలా ఉరివేయడం కూడా న్యాయమే అని మనతోనే ఒప్పిస్తాయి. నిజానికి ఇవి ప్రభుత్వాలు కావు బిగ్ బాస్ లు. అనుక్షణం మన మీద నిఘా వేస్తాయి. మన మానసిక అభ్యంతర మూలాలలోకి కూడా చొచ్చుకుని వచ్చి మనలను చెక్ చేస్తూ ఉంటాయి. మన లోపలి, లోలోపలి స్వభావాలను వస్త్ర కాయితం పడుతూ ఉంటాయి. ఆ నిఘా నుండి తప్పించుకోవడానికి సృజన కారుడు ఒక ప్రతీకను ఎంచుకుంటాడు.

ప్రతీకలతో కథలు   మనకు కొత్తేమీ కాదు. అగ్ని మీళే పురోహితం అన్న వేద వాక్యం నుండి పంచతంత్రం దాకా అనేకానేక కథలు ప్రతీక మీద ఆధారపడినవే. కొంత మంత్ర వాస్తవికతను , కొంత అధివాస్తవికతను కలగలిపిన కాక్ టైల్ నిషా ఈ ప్రతీక. అడవిలో సమస్త జంతుజాలానికి కంటకుడిగా మారిన ప్రభువు సింహాన్ని బోల్తా కొట్టించి, నూతిలో తన ప్రతిబింబాన్ని చూపించి మట్టుపెట్టిన కుందేలు కథ మనందరకు తెలిసిందే. మరి సింహం చనిపోయిన తరువాత ఆ అడవి ఎలా వుంది ? ఆ కుందేలు అడవికి రాజు అయిందా ?

సింహం మృగ రాజు కనుక, సింహం తాత్విక దృక్పథాలు వేరు కనుక అది జంతు కంటకుడిగా మారిందేమో. అదే అడవికి కుందేలు రాజు అయితే ఎలా ఉంటుంది. కుందేలు సాత్త్వికంగా ఉంటుంది కదా. అడవంతా సాధువుగా మారిపోయిందా? ఇలాంటి సందేహాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? ఎప్పుడైనా ఒక ఆలోచన చేశారా? చేయకపోతే ఈ కథ చదవండి. చాలా చిన్న కథ. కానీ మీకు ఒక గొప్ప ప్రపంచాన్ని చూపిస్తుంది .. కథ చిన్నదే కనుక నేను మొత్తం తిరగరాస్తున్నాను.

********

కథ పేరు “కోరల సింహంగా మారిన కుందేలు కథ

కథల పంట, విరసం కథల ప్రత్యేక సంచిక, 2015

రచయిత కే.వి కూర్మనాధ్

ఆరోజు సాయంత్రం అడవిలో పండు వెన్నెల కాసింది. కుందేలు పిల్ల నాయకత్వంలో క్రూరమైన సింహం చిత్తైన ఆ రోజు అడవిలో నెమళ్ళు కొత్త నృత్యం చేసాయి. ఇంటికో పిల్లని లేదా తల్లిని లేదా తండ్రిని, మట్టుబెడుతున్న సింహం ఇక లేనందుకు జంతువులకు వేయి పండుగలు ఒకేసారి వచ్చినట్టు అనిపించింది . ఏ రాత్రి ఏ పాలుగారే పాపని పోగొట్టుకోవాలో అని బెంగటిల్లిన తల్లులకు, తండ్రులకు, ఆ రాత్రి వాళ్ళు మళ్ళీ పుట్టినట్టు అనిపించి పిల్లలల్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని తనివి తీరా ముద్దు పెట్టుకున్నాయి. పొదివి పట్టుకున్నాయి.

ఏ రోజు కన్నతండ్రిని , లేదా తల్లిని పోగొట్టుకోవాలి తెలియని భయం తో నిద్ర లేని రాత్రులు గడిపిన పిల్లలు కొందరు వాళ్ళ తల్లితండ్రుల గుండెల్లోకి ఇమిడిపోయారు.

ఆ రాత్రి మృగరాజు నేల కొరిగిన రాత్రి అక్కడ గొప్ప వేడుక జరిగింది.

తమ బతుకులను చిదిమేసిన, తమ పిల్లల రక్తం తాగిన సింహం రాజు నీట మునిగేక ఆ అడవిలో ఆశల హరివిల్లు విరిసింది. వాళ్ళకది యుగాదిలా తోచింది.

ఆ రాత్రి అడవి పోలా వర్షం కురిపించింది. మిగతా కుందేళ్లు వింత గెంతులు గెంతేయి. కోతులు ఏనుగుల వీపుల మీద ఎక్కి జారుడుబండ జారేయి. నక్కలు ఊళలు మానేసి కూని రాగాలు తీశాయి. ఆ రాత్రి కోకిలలు కొత్త పాటలు పాడేయి.

సింహాన్ని ఓడించిన కుందేలును జింక పిల్లలు ముద్దు చేసాయి.

చిరకాల శత్రువును మత్తు పెట్టినందుకు చీకట్లని తరిమి వేసి వేల ఉషస్సులతో మనసులని వెలిగించినందుకు ఎనుబోతు ఒకటి ఆ కుందేలు చెవులని వాటంగా పట్టుకుని ఎత్తుకుని తనివి తీరా నిమిరింది.

మృగరాజు చచ్చిన ఆ రాత్రి ఆ అడవిలో గొప్ప కేరింతలు వినబడ్డాయి.

వేలాది జంతువుల రక్త సిక్త ఆక్రం దనలని మౌనంగా చూసిన మద్దిచెట్లు రెల్లుగడ్డిలా హాయిగా , విలాసంగా ఊగాయి . వింత ఆకుల చెట్లు తీగలు గొప్ప సువాసనాలని వెదజల్లాయి.

అక్కడి పూలు కొన్ని ఆ నాడు కొత్త రంగులతో వెన్నెల్లో చిత్రంగా మెరిచాయి.

నిద్రపట్టక ఎగురుతూన్న ఓ పిల్ల మ్బబొకటి ఆ ముచ్చట చూసి అక్కడే నిలబడిపోయి చూస్తోంది. ఆ గొప్ప సందడిని చూసి దాన్ని మరికొన్ని మబ్బుతునకలు వచ్చి చేరాయి. పచ్చటి వెన్నెల వాటి మీద పది అవి భారీ విద్యుద్దీపాల వాలే ఆకాశాన్ని చల్లగా వెలిగిస్తున్నాయి. చంద్రుడి పిల్లల వలె మెరుస్తున్నాయి.

ఆ రాత్రి దిక్కులేని జంతువులని అడవితల్లి పొదివి పట్టుకుని ముద్దు పెట్టుకుంది.

ఆ రాత్రి పిల్లలని కోల్పోయిన తల్లులు, తల్లులని చూడని పిల్లలు ఇక చావుల్లేని బెంగల్లేని, భయాల్లేని రోజులొస్తాయని ఆశపడ్డాయి. తమ పిల్లలు హద్దుల్లేని ఉత్సాహంతో గెంత వచ్చని , ఎగరవచ్చని, హాయిగా నదుల్లో మునిగి తేలవచ్చని, అలవి కాని హద్దుల్లేని స్వేచ్ఛతో ముచ్చట్లు పెట్టుకోవచ్చని సంతోషించాయి

అమావాస్య తొలిగిన ఆ రాత్రి నిద్రలోకి పోబోతూ ఓ లేడి పిల్ల వాళ్ళమ్మని అడిగింది. “అమ్మా ! మరి నేను రేపు ఈ చివరినుంచి ఆ చివరి వరకు ఉరుకుతా రేపు మా ఫ్రెండ్స్ తో నువ్వు అడ్డు చెప్పకు ” అని “సరే ! కన్నమ్మా ! “అని ముద్దులు పెట్టుకు పడుకోబెట్టింది

************

సింహాన్ని ఓడించిన కుందేలుకు ధైర్యం రాత్రికి రాత్రి రాలేదు. సింహం దెబ్బకు నలిగిన ,సింహం చేతిలో చిత్తైన, ఎన్నో జంతువులూ ఆ కుందేలుకు అండగా నిలబడ్డాయి. పాడుబడ్డ నుయ్యి జాడని కుందేలుకు చూపెట్టాయి . ధైర్యం చాలని కుందేలుకు ఏవ్ ధైర్యం చెప్పి నడిపించాయి దుర్గమమమైన మూళ్ళ మార్గంలో పోరాటానికి అదే మొదలు కాదు. ఆ మహారాణా యామా భీకర పోరాటాలు చూసింది. ఆ మొక్కలు కొన్ని, ఆ తీగలు కొన్ని, ఆ జంతువులూ కొన్ని, ఆ మానులు కొన్ని, ఆ సూదంటురాళ్ళు కొన్ని, అక్కడి పోరాటాలకు సాక్షులు. ఆ అడవికి శత్రువులు కొత్త కాదు.

కుందేలు బంధువులు కొందరు, అడవిగుర్రం తమ్ముళ్లు కొన్ని, సింహాలు కొన్ని, పులులు కొన్ని, నెమళ్ళ అక్కలు కొన్ని , దుప్పి తాతలూ, లెల్ల పిల్లలూ , తమను పీడించే సింహాలతో , పులులతో ఎప్పటినుండో రాడుతున్నాయి.

ఒక్క మృగరాజే కాదు. తమ రక్తం తాగే, తమ ఉసురు తీసే, జంతువుల జాతి మొత్తంగా ప్రమాదమని, కాటు వేసే, విషప్పురుగులు ఎప్పటికైనా ప్రమాదమని చెప్తున్నాయి. అవి ఆ అడవిలోనే కాదు, ఆ చుట్టుపక్కల అడవుల్లో కూడా అదే చెప్తున్నాయి. అవి శత్రువుల వాడి కోరలకి బాలయ్యేలోగా, దొంగ దెబ్బలకి పడిపొయ్యేలోగా, కొంచెం ధైర్య , కొంచెం నమ్మకం పిల్లల్లకి వదిలిపోయేవి. పిల్లలూ ధైర్యాన్ని వారసత్వాన్ని , అందుకుని పోరాడుతూనే వున్నాయి. సింహలకవి ఎప్పుడూ భయపడలేదు. పంజా దెబ్బలకు, పిల్లల్లని చంపివేసే పులులకవి ఎన్నడూ వెన్ను చూపలేదు. అడవి దున్నలు వాలే అవి కొమ్ములని అడ్డుపెట్టి పోరాడాయి పోరాడుతున్నాయి. ద్రోహాలకి అవి ఎన్నడూ వెరవలేదు.

ఆ ధైర్యపు తోడుతోనే, ఆ ఉపాయపు మద్దతు తోనే కుందేలు గెలిచింది. మృగరాజును మట్టు పెట్టింది.

ఆటలన్నీ అయ్యాక , పాటలన్నీ సద్దుమణిగాక , కేరింతలు పూర్తిగా ఆగిపోయాక, “ఇక నువ్వే మాకు రాజు “, వని అక్కడి జంతువులు కుందేలును అన్నాయి. ఆ కుందేలుకూ తెలుసు తానే ఇక రాజునని . ఆ కుందేలుకు తెలుసు ఇక తానే అన్నీ అని . తన మాటకి ఇక తిరుగు లేదని.

***********

విషపు పురుగులతో ,మాటువేసి దెబ్బ తీసి కాల్చుకుతింటున్న, పిల్లల్ని మాయం చేస్తున్న బతుకుల్ని దుర్భరం చేస్తున్న, సింహాలతో , వాటి తొత్తులతో ఎక్కడెక్కడి అడవుల్లో పోరాటం చేస్తున్న లేళ్ళు, నెమళ్ళు, కుందేళ్లు, కొన్ని సింహాలు, ఇంకొన్ని పులులు ఏమరుపాటుగా లేవు.

రాజుల బూజు దులపక పోతే , జీవితం లో ఏం మార్పు వస్తుందని అన్నారు

సింహం చచ్చింది కానీ మన రక్తం రుచి మరిగిన మిగతా క్రూర మృగాలు హాయిగా తిరుగుతున్నాయని గుర్తు చేసాయి . మనలని వేపుకు తినే పోయ్యీ పెనమూ ఇంకా అలానే వున్నాయి అని చెప్పాయి. ఏం మార్పు ఉందని ప్రశ్నించేయి.

సింహం చచ్చింది కానీ దాని అనుయాయులు అలానే వున్నారు కదా అని అడిగాయి

కుందేలు రాజుకు ఇది నచ్చలేదు. కొత్త మృగరాజుకు ఇది ఇంపుగా అనిపించలేదు .

“వీళ్ళు ఎవరు ? ద్రోహులు “, అన్నది.

“వీళ్ళు చచ్చిన సింహానికి దోస్తులు “అని కూడా ప్రకటించింది.

సింహం చచ్చిన సంతోషము లో ప్రపంచం మారిపోయిందనుకున్న జంతువులూ కొన్ని ఇపుడు రాజ్యం మనదే కదా , బాధేమిటి అని అడిగాయి.

“కాదు రాజు ఎప్పుడూ రాజే. రాజు మనకు ఎప్పుడూ శత్రువే . ఆ అడవి అయినా , ఏ అడవి అయినా . పెనం పట్టుకున్న చెయ్యి మారింది కానీ , పెనం ఇంకా పొయ్యి మీదే ఉందని , మనం ఇంకా పెనం లోనే ఉన్నామని , అన్ని అడవుల్లోని జంతువులన్నీ చేతులు కలపాలి “అని చెప్పాయి. ఈ విషయాన్ని మళ్ళీ , మళ్ళీ చెప్పాలి నలుగురికీ , నాలుగు చోట్లా , “మేం చెబుతాం అందరికీ, ఈ అడవిలో ఆ అడవిలో, ఏ

అడ విలోనైనా ప్రజలే రాజ్యం చేయాలనీ మేము చెబుతాము , పోరాడుతాం “అని అన్నాయవి.

కుందేలు రాజుకు తెలుసు. చెయ్యి మారిన పెనం గురించి ఎక్కువ మందికి తెలిస్తే తన ఆరోగ్యానికి మంచిది కాదని. ఆ ఆలోచనలు నలుగురికి తెలిస్తే కష్టమని దానికి తెలుసు. నలుగురు వింటే కష్టమని తెలుసు.

అందుకే కుందేలు చెప్పింది. “మనం స్వర్గం లో వున్నాం . నరకపు మాటలు వెనకటివి . ఎవరు చెప్పినా వినకండి. ఎవరైనా విందామనుకున్నా , మేము చెప్పనివ్వం , మాట్లాడనివ్వం , మాది స్వర్గం కాదన్న వాడల్లాగా ఈ అడవికి శత్రువు శత్రువుకి మిత్రుడు ” అని కుందేలు ప్రకటించింది.

రాత్రికి, రాత్రి నోరు విప్పిన కుందేళ్ళని, మాట్లాడిన పులులని, వాటికి గొంతు కలిపినా లేళ్ళని, మాట కలిపినా నెమళ్లను ఎక్కడికక్కడ బంధించింది. కలుగులో, గుహల్లో ఉంచింది. వీళ్ళు రాజ్య వ్యతిరేకులు అని ప్రకటించింది. స్వర్గాన్ని కూలదోయడానికి వచ్చిన నరకలోకపు ప్రతినిధులు అని దండోరా వేయించింది.

ఆ రాత్రి అడవి కొద్దిగా వణికింది.

ఆ రాత్రి అడవిలో పాతరాత్రుల నీడలు నాగు పాము పడగల్లాగా ఊగాయి.

ఆ రాత్రి అడవిలో పీడకలలు తీతువు పిట్టల్లా అరచి బయట పెట్టాయి.

అటువైపు వెళుతున్న మబ్బులను వింత భయాలు చుట్టుకున్నాయి.

ఆ రాత్రి అడవిని పాత స్మృతులు చుట్టుముట్టాయి.

ఆయా ప్రొద్దున్న జంతువులూ కలలోంచి బయటికొచ్చాయి.

అడవిలో ఆ పూట కొందరికి ఆ కుందేలు తోలున్న కోరల సింహమని అర్ధం అయింది.

**********

ఇదీ కథ. ఇదే కథ   ఇవాళ వీధి వీధినా.

అధికారం కుందేలును కోరలు వున్న సింహంలా మార్చింది. కుందేలుకు సింహం లక్షణాలు వచ్చేశాయి. మెత్తగా మాట్లాడటం కుందేలు స్వభావం. జూలు విదిల్చి కోరలు సాచడం సింహం లక్షణం. సింహమంటే అధికారం. అధికారం లో వున్నది కనుక కుందేలు కూడా లేని జూలు లేని కోరలు సాచి సింహం అయిపోతుంది.

నక్సలైట్లే దేశభక్తులు అన్న ఉత్తేజిత పూరిత నినాదం, అధికారంలోకి నక్సలైట్లు దేశ ద్రోహులు అని మారిపోయినట్లుగా సాదు జంతువు కూడా సింహం అవుతుంది. సింహం కోరలు సాచుతుంది. అడవిని అల్లకల్లోలం చేస్తుంది. చివరకు అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి చేయవలసిన వన్నీ చేస్తుంది.

నిజానికి అధికారం ఒక కృష్ణ బిలం. అది అన్నిటినీ ఆకర్షిస్తుంది. తనలో కలిపి వేసుకుంటుంది. మీకు గుర్తుందా ? 1970 , 1980 దశకాలలో మన ఈశాన్య రాష్ట్రమైన అసోం లో ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపిన ప్రఫుల్ల కుమార్ మహంతా, భృగుకుమార్ ఫుకాన్ అనే విద్యార్థి ద్వయం. యూనివర్సిటీ నుండి ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో అస్సాంలో విదేశీ చొరబాటు దారులకు వ్యతిరేకంగా గొప్ప ఉద్యమాన్ని నడిపి, యూనివర్సిటీ నుండి బయటకు వచ్చాక అస్సాం గణ పరిషత్ స్థాపించి అధికారం కైవసం చేసుకున్న సామాన్య నేతలు వాళ్లిద్దరూ. వాళ్ళు రాత్రికి రాత్రి నాయకులై పోలేదు. దశాబ్దాల తరబడి అస్సామీయులలో పేరుకుని పోయిన అసహనం, ఆశావహ దృక్పథం వాళ్ళను నాయకులను చేసింది. వాళ్ళ ఉద్యమం వెనుక అస్సాం అంతా నిలచింది. వాళ్ళు విజేతలు అయ్యారు. చివరకు వాళ్లిద్దరూ ఎలా విడిపోయారు ఇప్పుడేమి చేస్తున్నారు అన్నది చరిత్ర. ప్రఫుల్ల కుమార్ మహంతా ఒక టీచర్ కొడుకు. వున్నత ఆశయాలు కలిగి, అస్సామీయులకు మంచి చేయాలనీ తలచిన వాడు. కుందేలు లాంటి వాడే ! అధికారం లోకి వచ్చాక సింహం అయిపోయాడు . అన్ని అవలక్షణాలు వచ్చి చేరాయి. బోడో ఉద్యమాన్ని అణచి వేయడానికి చేయని ప్రయత్నం లేదు. అవును, అధికారం కోరలు తీసుకుని వచ్చింది.

తరచి చూస్తే ఉదహారణలు ఎన్నో . ఏ కథ చదివితే జీవితం లో ఒక భాగం అర్ధం అయినట్టు ఉంటుందో , ఏ కథ చదివితే కొత్త కొత్త ఆలోచనలకు దారి తీస్తుందో అది నిస్సందేహంగా మంచి కథ . అతి తక్కువ రాసినా అన్నీ మంచి కథలే రాసే కూర్మనాధ్ కి అభినందనలు.

*

వంశీ కృష్ణ

వంశీ కృష్ణ

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అధికారం, కోరలు, తీసుకువస్తుంది, అనే, విషయాన్ని, కథ రూపంలోరాసిన కూర్మనాధ్, సర్ కి,మాకు పరిచయం మీకు ధన్యవాదాలు, సర్!.

 • మంచి కథ అందించిన కథకులు కూర్మనాథ్ కు , అఫ్సర్ మహాశయులకు అభినందనలు

 • కుందేలు తోలున్న కోరల సింహాల గురించి బాగా అర్ధం అయింది కూర్మనాధ్! మంచి కథను సందర్భానికి అతికేటట్లు పరిచయం చేసిన వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు!

 • మా సత్యం
  9494052775
  సారంగ సంచిక 15 మే 2020
  కూర్మనాథ్ గారు రాసిన మినీ కథ” కోరల సింహము గా మారిన కుందేలు ” కథ ఇప్పుడే చదివాను. చాలాకాలము కిందట వారు రాసిన
  “ఈ కుక్క ” కథలు చదివినప్పుడు తెలుగు సారస్వతం లోకి ఒక కొత్త కథకుడు తన సొంత గొంతుతో తనకంటూ ఒక నూతన శైలితో, కథ ఇతివృత్తంలో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు చాలా నేర్పుతో చెబుతూ ఆలోచింప చేస్తూ అబ్బురపరుస్తాడు. కథల యొక్క శీర్షిక పేర్లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి.
  ” ఇ- కుక్క” ,” వెన్నెల పడవ” , ఇప్పుడు’
  ‘ కోరల కుందేలు కథ”! వారి భావావేశం కథా సంవిధానంలో అక్కడ అక్కడ prose poetic style లోవ్యక్తమవుతుంది. ఒక ప్రత్యేకమైన అంతర్గత దృష్టి యొక్క స్వీయ -వ్యక్తీకరణలో రచయిత లక్ష్యాలను సూచిస్తాయి.
  ” కోరల సింహము గా మారిన కుందేలు” కథ అధివాస్తవిక కోణములో (సర్రియలిజం)
  పాలకుల బ్యూరోక్రసీ యొక్క అధివాస్తవిక సంక్లిష్టతలను ( complexities) తెలియజేస్తుంది.
  కూర్మనాథ్ గారు సర్రియలిజం ద్వారా కథను సృజనాత్మకంగా ఆవిష్కరించారు.
  అభినందిస్తూ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు