చెమట చుక్క కోసం ఒక కన్నీటి చుక్క

వాళ్ల గురించి ఎన్నడైనా ఆలోచించామా మనం?

ఇంత మహా విషాదకరమైన, హృదయ విదారకమైన అత్యంత అసాధారణ స్థితి కూడ అతి సాధారణంగా గడిచిపోతున్నదంటే మన మానవీయ స్పందనలేమైపోతున్నాయని దుఃఖం కలుగుతున్నది. మనం మనుషులమనీ, జాలి, కరుణ, స్నేహం, సానుభూతి, సహకారం మానవ సహజ లక్షణాలనీ చెప్పుకోగలమా అని సందేహం కలుగుతున్నది.

లక్షల మందో కోట్ల మందో మన వంటి మనుషులే మండుటెండలో రహదారుల మీద నడుస్తున్నారు. వందల మైళ్ల పొడవునా వాళ్ల తిరుగువలస సాగుతున్నది.

నడవడానికి శక్తి కోసమైనా తిండి లేక, పెదాలు తడుపుకోవడానికైనా నీటి చుక్క లేక, కాళ్లకు ఉండీ లేని చెప్పులతో, దూరాభారాల అంకెల లెక్కలు తెలియక వాళ్ల మహాయాత్ర సాగుతున్నది.

ఉన్న కాసింత సామానూ నెత్తిన పెట్టుకుని, కడుపున పుట్టిన ఇద్దరో ముగ్గురో పిల్లలను తమతో పాటు ఈడుస్తూ, వాళ్లను పాదాలు నడుపుతున్నాయో, వాళ్లే పాదాలను తోస్తున్నారో తెలియకుండా తరలిపోతున్న గుంపులు గుంపుల విషాదకర దృశ్యం ఎక్కడ చూస్తే అక్కడ కనబడుతున్నది.

ఎక్కడికక్కడ చీలిపోయే రోడ్లు ఎటు పోతాయో తెలియక, రైలు మార్గం పట్టుకుంటే ఒకే దారిన సాగిపోవచ్చునని అమాయకంగా నడుస్తూ, అలసి సొలసి సొమ్మసిల్లి, అది మరణశయ్యనో, విశ్రాంత క్షేత్రమో తెలియక గిలటిన్ అయిపోయిన దేహాలు, నడిచి నడిచి సోలిపోయి రాలిపోయిన దేహాలు, రహదారులు ఖాళీ అయిపోయినా ఆగని రహదారి ప్రమాదాల్లో ఛిద్రమైన దేహాలు మన మానవతను ప్రశ్నిస్తున్నాయి.

ఎప్పుడో దేశ విభజన నాడు తూర్పునా పడమరనా మాత్రమే కనబడిన దృశ్యం, యుద్ధ సమయాల్లో, ప్రకృతి విలయ సందర్భాల్లో మాత్రమే కనబడే దృశ్యం ఇవాళ పత్రికల్లో ఛానళ్లలో సోషల్ మీడియాలో హోరెత్తి మన కళ్ల మీద ఆడుతున్నది.

అయినా దేశం దేశమంతా నిమ్మకు నీరెత్తినట్టు కూచోవడం ఎంత అసాధారణం.

ఆ అత్యంత అసాధారణ దారుణ భయానక దృశ్యాన్ని అన్ని వార్తల్లో ఒకానొక వార్తగా సాధారణమైనదిగా పరిగణించడం ఎంత అసాధారణం.

అటువంటి కష్టాలే పడుతున్న కోట్లాది మందికి దాని గురించి ఆలోచించే తీరిక లేదు.

మామూలుగానే బోలెడంత తీరికా, ఇప్పుడు లాక్ డౌన్ వల్ల మరింత తీరికా, ఆలోచించడానికీ, చర్చించడానికీ, వ్యక్తీకరించడానికీ సకల అవకాశాలూ ఉన్న పట్టణ మధ్యతరగతిలో అత్యధికులకు ఇది ఒకానొక వార్త కన్న ఎక్కువ కావడం లేదు.

ఈ దుస్థితికి తక్షణమే స్పందించవలసిన, పరిష్కరించవలసిన పాలకులలో కనీస స్పందన లేదు. పాలకుల బాధ్యతారాహిత్యం మిగిలిన సమాజానికి వికృతంగా, అసాధారణంగా కనిపించడం లేదు.

ఇంత కన్న అసాధారణ స్థితి ఉంటుందా?

వాళ్లు మనకు అపరిచితులే కావచ్చు. వాళ్లను మనమెన్నడూ చూసి ఉండకపోవచ్చు. వాళ్లు ఎక్కడెక్కడి దూరతీరాల నుంచి, అడవుల నుంచి, గ్రామాల నుంచి, కొండల నుంచి ఇక్కడిదాకా ఎవరి చేత తోలుకురాబడ్డారో, ఏ ఆకలి చేత తోసుకురాబడ్డారో మనకు తెలియకపోవచ్చు. వాళ్ల భాష మనకు తెలియకపోవచ్చు. వాళ్ల వాసనే మనకు పడకపోవచ్చు. ఎదురు పడితే ముక్కు మూసుకుని మొఖం చిట్లించి పక్కకు తప్పుకుని వెళతాం కావచ్చు.

కాని ఒక్కసారి నిశితంగా ఆలోచిస్తే వాళ్లతో మనకెక్కడో సంబంధం ఉండే ఉంటుంది. మనుషులైనందువల్ల మాత్రమే కాదు. అనేక ఇతర కారణాల వల్ల కూడ.

మనం జీవిత సాఫల్యంగా భావిస్తున్న, సకలాలంకారాలతో సర్దుకున్న మన స్వగృహం మీద, మన అపార్ట్ మెంట్ల మీద తొట్టతొలి అడుగులు వాళ్లవి. మన గోడలకంటిన నెత్తురు వాళ్లది. మన నేల మీద చిందిన చెమట వాళ్లది.

ఈ దేశంలో నిర్మాణమైన భవనాలలో నూటికి అరవై, ఆ మాటకొస్తే అపార్ట్ మెంట్లలో నూటికి తొంబై ఆ వలసకార్మికుల నెత్తురుతోనే చెమటతోనే అంతస్తులపై అంతస్తులు లేచి నిలిచాయి. లేదా వాళ్లు పనిచేసిన ఇటుకబట్టీల్లోంచి సరఫరా అయిన ఇటుకలతోనే మన ఇళ్లు నిర్మాణమయ్యాయి.

ఆ ఇనుప స్తంభాలు మోసినవాళ్లూ, ఆ సిమెంటు తట్టలు మిక్సర్లలో వేసినవాళ్లూ, ఆ ఇసుకబస్తాలు లారీలకు ఎత్తినవాళ్లూ లారీల నుంచి దించినవాళ్లూ, పరంజాలు కట్టుకుని తాటి నిచ్చెనల మీద ఆకాశహర్మ్యాలకు రంగులూ సొబగులూ దిద్దినవాళ్లూ, గోడలు కట్టినవాళ్లూ, నేల మీద మనం ఎంచుకున్న పాలరాయి పరిచినవాళ్లూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అలంకారాలు చేసినవాళ్లూ, రసాయనాలు కలిసిన రంగుల్లో తాము విషం తాగి విషం పీల్చి మన ఇళ్లను రంగులతో ముంచెత్తినవాళ్లూ ఆ వలస శ్రామికులే. మన అపార్ట్ మెంట్లలో మన కన్న ముందు అడుగులు వేసినవాళ్లు వాళ్లే. ఇళ్లు మాత్రమే కాదు, అన్ని భవనాలు, కార్యాలయాలు, విద్యాలయాలు, వంతెనలు, విమానాశ్రయాలు, సకల నిర్మాణాలు కట్టినదీ కడుతున్నదీ వాళ్లే.

వాళ్ల గురించి ఎన్నడైనా ఆలోచించామా మనం?

మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లి ఏదో కొనుక్కోవడానికి నిలబడినప్పుడు ఎగసిపడుతున్న మంటల ముందు దిగబారుతున్న చెమటలతో ఉన్నవాళ్లు ఏ రాష్ట్రం నుంచి ఇక్కడికొచ్చారో, అతి తక్కువ కూలీకి ఏ మేస్త్రీ వాళ్లనిక్కడ కుదిర్చారో ఎన్నడైనా మనకు తెలిసిందా?

మనం వెళ్లే దుకాణంలో, మన సరుకులు తయారయ్యే చిన్న చిన్న కార్ఖానాల్లో అత్యంత దుర్భరమైన పని పరిస్థితుల్లో, కారు చౌక వేతనాలకు పని చేస్తున్నవాళ్లు ఏ తల్లి కన్నబిడ్డలో, ఆ తల్లిని వదిలి ఎన్ని వందల మైళ్లు సాగి వచ్చారో ఎన్నడైనా ఆలోచించామా మనం?

మనం తినే తిండి గింజల కోతల కాలంలో, ముమ్మరపు పనుల కాలాల్లో ఏయే రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని వేల మంది వలస శ్రామికులు వచ్చి ఆ వ్యవసాయ క్షేత్రాల్లో రెక్కలు ముక్కలు చేసుకున్నారో ఎన్నడైనా తలపోశామా మనం?

మహాడంబరంగా వేడుకలు జరుపుకుంటున్నప్పుడు మోజుపడి కుట్టించుకుంటున్న చీని చీనాంబరాల మీద అద్దకం చేసేవాళ్లు, రకరకాల కుట్లు కుట్టేవాళ్లు, మన వాహనాన్ని మరమ్మత్తు చేసి, పువ్వులా మార్చి మన చేతుల్లో పెట్టేవాళ్లు, అనేకులు, అభాగ్యులు, అన్నార్తులు.

మన జీవనానికి ఆధారభూతమైన సహస్ర వృత్తుల సమస్త శ్రమలలో కనీసం పావు వంతు ఆక్రమించి ఉన్నది ఆ వలస శ్రామికులు. వాళ్లు లేకపోతే మనం లేం. మన ఆడంబరాలు లేవు. మన తీరికలు లేవు. మన విలాసాలు లేవు.

ఇవాళ వాళ్లకు కష్టం వస్తే ఆదుకోవడానికి మనం లేము.

ఇంతకన్న దుర్మార్గం, ఇంతకన్న అసాధారణం మరొకటి ఉంటుందా?

అన్యాయం, వివక్ష, దయారాహిత్యం అతి సాధారణమైపోయినంత అసాధారణం మరొకటి ఉంటుందా?

(డయబెటిస్ వల్ల బైటికి కదలగూడదనే నిర్బంధంలో నిస్సహాయ దుఖాగ్రహంతో. మేడ్చల్ దగ్గర జాతీయ రహదారి మీద సహాయ చర్యాలో తలమునకలుగా ఉన్న వనజ చెపుతున్న గాథలకు ఏడుస్తూ…)

*

ఎన్. వేణుగోపాల్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • most heartless people. The PM and FM is only talking about Atmanitbhrata. I do not where this helpless peope will get that. Our middle class will clap , light the lamp when the ruthless PM wants while the millions suffer.

  • ఆ చెమట పువ్వుల చల్లదనమే ఈ ఎత్తైన జీవితాలని మరిచిన మనిషిలేమితన వ్యవస్థ నడుస్తున్నది.చాలా హృద్యంగా చెప్పిండ్రు సార్…

  • మనసెట్లో అయినాది. స్వార్థంగా ఉండే మనం ఇతరులు గురించి ఆలోచించటం గురించి మరిచాం. ఆలోచనాత్మక ప్రశ్నలు !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు