కాస్త ఆలస్యంగా

చిన్నప్పుడు బడి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మా అత్తయ్య స్నేహితురాలి వాళ్ళ పాతకాలం ఇల్లుండేది. ఆ ఇంటి వాకిలి విడిగా, మిద్దె మీదకు మెట్ల దారి విడిగా ఉండేది. ఆ మెట్ల దారి తలుపు గడియ శబ్దం చేస్తే, ఆమె మేడ మీద గదిలో నుంచి పిట్టగోడ దగ్గరకు వచ్చి తొంగి చూసి పలకరించి నవ్వి లోపలికి వెళ్ళిపోయేది. ఆ నవ్వు, ఇంత బారు జడ, అంత ఎత్తున ఆమె, అదేదో బాలమిత్ర, చందమామ కథల్లో లాగా ఆ గది ఎలా ఉంటుందో అని ఊహించుకొనేదాన్ని. పెద్దయ్యాక ఎందుకనో…ఎలాగో మరి, ఇప్పటికీ, ఎవరైనా మా ఇంటికి వస్తున్నారంటే రెండు నిమిషాలు ముందే తెలుస్తుంది, మూడంతస్తుల మెట్లు దబదబా దిగి ఎదురెళ్ళి పలకరించడం అలవాటైపోయింది. ఈ రెండు నేపథ్యాలు కలిపి రాసుకున్న చిన్న ఊహ ఈ “అందని ప్రేమ కథ”.
చ్చేసినట్టున్నాను

ఉప్పెనయ్యి, ఎడారయ్యి నలిగి నలిగి చివరికి ఈ దూరాల్ని దారుల్ని దాటి ఆ ఊరికి వచ్చినట్టున్నాను.

నిన్న రాత్రి కూడా అదే కల, కలలో అదే సంభాషణ. మాటిచ్చి రాలేని నన్ను ప్రతీ రాత్రి ఈ ఊరికి తెచ్చి పడేసే కల.

కలలో – ఈ ఊరికి, ఆమె ఇల్లున్న వీధికి, ఆమె వాకిట్లోకి వస్తాను. మేడమీద గదిలో ఉన్న ఆమెకు ఎలాగో తెలుస్తుంది, పరిగెత్తుకుని వచ్చి పిట్టగోడమీదికి ఒంగి నాకోసం వెతుక్కున్నప్పుడే ఆమె కోసం నేనూ తలెత్తి మేడ వైపు చూస్తాను. ఒకరికొకరం పట్టుబడటం మాకేం కొత్త కాదు. ముడిపడి నవ్వుకోవడం మా కళ్ళకీ కొత్త కాదు.

మేడ మెట్లు సగం ఎక్కేశాక ఆమె ఎదురొస్తుంది. దూకుతోందో, జారుతోందో తెలియనంత వేగంగా నాకోసం ఎదురొస్తుంది. నాకు “గంగావతరణం” గుర్తొస్తుంది. “అదిగో అనంతాకాశాల నుంచి జారుతోంది గంగ…” అని పద్యం గొణుక్కుంటూ చేయి చాచి నిలుచుంటాను, శాంతించమని, నెమ్మది అని. ప్రేమగా జడలు జాపి గంగను సుకుమారంగా బంధించిన శివుడి గర్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది నాకప్పుడు. తన తొందరకు సిగ్గుపడి మునివేళ్ళతో పలకరించి మేడమీద గదికి దారి చూపిస్తుంది.

ఆ గది నా కోసం కాచుకొని కాచుకొని కాస్త ఒరిగినట్టుంటుంది. అన్ని కిటికీల నుంచి కెంజాయమవుతూన్న సూర్యకాంతి లోపలికి ప్రసరిస్తూ ఉంటుంది. పక్షులు పాటలు పాడుకుంటూ గూళ్ళకు చేరుకుంటుంటాయి. ఆ గది దూలం మీద గొంతు తగ్గించి జంట పిచ్చుకలు మాట్లాడుకుంటుంటాయి. చాలా తెరిచి పెట్టిన పుస్తకాల్లో పేజీలు రెపరెపలాడుతూ ఉంటాయి. పాపం ఏదీ చదవలేక ఎంత అవస్థ పడ్డదో తను. ఎప్పుడు పూశాయో, ఎప్పుడు గదిలోకి తెచ్చి పెట్టిందో మరి, కూజాలో నుంచి భూమి మీదికి వంగి సగం రెక్కలు రాల్చుకున్న గులాబీలు.

తనేం మాట్లాడదు గానీ మరీ దగ్గరగా నిలుచున్నప్పుడు ఆమె కళ్ళ చుట్టూ పులుముకున్న కాటుకని నా ఆలస్యానికి

క్షమాపణ అడుగుతాను. బిగించిన అల్లిక చెదిరి ముఖం మీద పడుతున్న ఆమె జుట్టును సరిచేసినప్పుడు రెండు కన్నీటి చుక్కలు కలిపి నవ్వుతుంది.

ఆమె చిన్న గడ్డం పట్టుకొని

“నీ కాటుకకే కాదు, ఇంకా చాలా వాటికి క్షమాపణలు చెప్పాలి నేను ఆలస్యంగా వచ్చినందుకు.

కలిసి వస్తామని మాటిచ్చిన సముద్రానికి, మళ్ళీ వెళ్ళి పరామర్శించలేని అడవి దారులకు, దోసిట్లో పట్టి దాచుకోలేని వెన్నెలకు, ఆశపడి పూసి నేలరాలిన జాజులకు”

“ఈ గదిలో గడియారం వద్దు, చెప్పుకోవాల్సిన కవిత్వం చాలా బాకీ పడ్డాను” అంటాను

ఆమె ఆపకుండా నవ్వుతూనే ఉంటుంది. నేనూ ఆమెతో కలిసి నవ్వుతూ ఉండగానే మెలకువ వచ్చేస్తుంది.

***

నిజమే, మాటిచ్చాను, ‘ఒక సాయంత్రం వస్తానని’. ఎప్పుడో మనసు పడ్డప్పుడు, వయసు మీదపడనప్పుడు.

“జీవితం కదా మరచిపోతూ విడిచిపెడుతూ సాగిపోవద్దూ? కలల దగ్గరే ఆగిపోతే ఎట్లా?” అనుకున్నాను, కానీ వెంటాడింది ఈ కలలోని మమకారం, ఆ కళ్ళలోని ప్రేమ. కనబడని చేతులేవో నా భుజాల చుట్టూ అల్లుకుంటే విడిపించుకోలేక ఇవాల్టికి ఈ ఊరికి వచ్చాను.

ఆమె ఇల్లున్న వీధికి వచ్చాను. నా మొహం మీదికి నవ్వు, ఎవరో దాటిపోతూ విసిరినట్టు. నాలుగడుగులు వేశాను. మేడ వైపు చూశాను. పిట్టగోడ దగ్గరకి ఎవరూ రాలేదు. మెట్లదారి వైపు నడిచాను. మెట్లెక్కుతున్నాను. ఆమె ఎదురు రాలేదు. బాగా తెలిసిన ఆ గదిలోకి వెళ్ళాను.

అన్ని కిటికీల నుంచి కెంజాయమవుతూన్న సూర్యకాంతి లోపలికి  ప్రసరిస్తూ ఉంది. పక్షులు పాటలు పాడుకుంటూ గూళ్ళకు చేరుకుంటున్నాయి. ఆ గది దూలం మీద గొంతు తగ్గించి జంట పిచ్చుకలు మాట్లాడుకుంటుంటాయి. చాలా తెరిచి పెట్టిన పుస్తకాల్లో పేజీలు రెపరెపలాడుతున్నాయి. ఎప్పుడు పూశాయో, ఎప్పుడు గదిలోకి తెచ్చి పెట్టిందో, కూజాలో నుంచి భూమి మీదికి వంగి పూర్తిగా రెక్కలు రాల్చుకున్న గులాబీలు.

ఆమేదీ?

ఇక్కడ లేదనిపించింది ఆ క్షణం, బరువుగా శిలైపోతున్నానేమో అనిపించింది.

మెట్లు దిగొచ్చాను. వాకిట్లో ఎవరో కొందరు నీళ్ళు కుమ్మరిస్తున్నారు. మరో ఇద్దరు నేలమీది పూలరెక్కల్ని బలంగా చిమ్ముతున్నారు.

అక్కడున్నామెను అడిగాను

ఆ మేడ మీద గదిలో ఆమె ఏదీ? అని

“రేయింబవళ్ళు పిట్టగోడ దగ్గరే ఉండేది, పాపం, నిన్నరాత్రి తూలిపడి ప్రాణం పోయింది”

*

కల కలలాగే మిగిలిపోయిన కథ: యామినీ నల్లా

నిజమే అతను ఒక జీవితకాలం ఆలస్యంగా వచ్చాడు. కానీ అతను రాకపోవడానికి కారణాలెన్నో… అతను నా మీద విశ్వాసంతో ప్రేమతో మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. అతను వచ్చినప్పుడు నేను ఎదురు చూడక పోతే ఆమెకు అతని మీద ప్రేమ తగ్గిందని అనుకుంటాడేమో… అని ఆమె ప్రతి రోజు పిట్టగోడ దగ్గర ఎదురుచూస్తూనే ఉండింది.

ఆమె అలా తన జీవిత కాలం ఎదురు చూసింది. ఆ క్రమంలోనే ఆమె తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. అతను ఆమెను చేరడానికి ఎన్ని కట్టుబాట్లో ఎన్ని సంక్షోభాలో అవన్నీ దాటుకొని చివరికి ఆమెను చేరడానికి వస్తే… ఆమె లేని శూన్యమైన గది మాత్రమే అతనికి ఎదురుపడింది. అతని కల కలలాగే మిగిలిపోయింది.

*

 

పెన్సిల్ డ్రాయింగ్ :ధనుర్దర్ కొట్రా

రేఖా జ్యోతి

రేఖా జ్యోతి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆ గది, పిట్టగొడ కళ్ళముందు కనిపించి…కళ్ళల్లో నీళ్లొచ్చాయి.

  • కధ చాలాబాగుంది
    కవితాత్మకశైలి అలా వెంటబడుతుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు